న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఎన్డీటీవీ అంతర్జాతీయ సదస్సు 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సభకు హాజరైన విశిష్ట అతిథులకు స్వాగతం పలికారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండగ వాతావరణంలో ఎన్డీటీవీ అంతర్జాతీయ సదస్సు జరుగుతోందని శ్రీ మోదీ అన్నారు. ఈ కార్యక్రమ ఇతివృత్తం ‘‘అన్‌స్టాపబుల్ ఇండియా’’ను ప్రశంసిస్తూ.. ప్రస్తుత భారత్‌కు తన వేగాన్ని ఆపే ఉద్దేశం లేనందున ఈ అంశం సందర్భోచితంగా ఉందన్నారు. ‘‘భారత్ ఆగదు.. లేదా విరామం తీసుకోదు. 140 కోట్ల మంది భారతీయులంతా కలసికట్టుగా, వేగంగా ముందుకు సాగుతున్నారు’’ అని తెలియజేశారు.
విభిన్నమైన అడ్డంకులను, అవరోధాలను ఎదుర్కొంటున్న ప్రపంచంలో ‘‘అన్‌స్టాపబుల్ ఇండియా’’పై చర్చ జరగడం సహజమని, సందర్భోచితమని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. పదకొండేళ్ల క్రితం నాటి పరిస్థితులనీ, ప్రస్తుతమున్న పరిస్థితులనీ పోల్చేందుకు ప్రధాని ప్రయత్నించారు. 2014కు ముందున్న కాలాన్ని గుర్తు చేసుకుంటూ.. అప్పుడు జరిగిన ఈ తరహా సదస్సుల్లో చేపట్టిన ప్రధాన చర్చల స్వభావాన్ని వివరించారు. అంతర్జాతీయంగా ఎదురైన ఇబ్బందులను భారత్ ఎలా ఎదుర్కొంటుంది? ‘‘బలహీనమైన ఐదు’’ దేశాల జాబితా నుంచి ఎలా బయటకు వస్తుంది? విధానపరమైన సందిగ్ధంలో ఎంత కాలం చిక్కుకుపోతుంది? భారీ కుంభకోణాల యుగం ఎప్పుడు ముగిసిపోతుంది? తదితర అంశాలపై చర్చించేవారని ప్రధాని అన్నారు.

2014కు ముందు, మహిళా భద్రతపై ఆందోళనలు, ఉగ్రవాద స్లీపర్ సెల్స్ నియంత్రణ లేకుండా విస్తరించడం గురించి ఎక్కువగా చర్చించేవారని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. ద్రవ్యోల్బణం గురించి ‘‘మెహంగై ఖాయే జాతే హై’’ లాంటి పాటలు వినిపించేవన్నారు. ఆ సమయంలో.. భారత్ సంక్షోభ వలయంలో చిక్కుకుపోయిందని, దాని నుంచి బయటపడలేదని ప్రజలు, అంతర్జాతీయ సమాజం భావించారు. గత పదకొండేళ్లలో ప్రతి సందేహాన్ని భారత్ బద్దలుకొట్టిందని, ప్రతి సవాలును అధిగమించిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ‘‘బలహీనమైన అయిదు’’ దేశాల స్థాయి నుంచి అయిదు అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారిందన్నారు. ఇప్పుడు ద్రవ్యోల్బణం రెండు శాతం కంటే తక్కువగా ఉంది. అదే సమయంలో వృద్ధి రేటు ఏడు శాతాన్ని అధిగమించింది. ‘‘చిప్‌ల నుంచి నౌకల వరకు.. అన్ని రంగాల్లోనూ ఆత్మనిర్భర భారత్ విశ్వాసం స్పష్టంగా కనిపిస్తోంది’’ అని ప్రధానమనంత్రి చెప్పారు. ఇకపై ఉగ్రవాద దాడులు జరిగితే భారత్ మౌనంగా ఉండబోదని.. మెరుపు దాడులు, వైమానిక దాడులు, సిందూర్ తరహా ఆపరేషన్లతో నిర్ణయాత్మకంగా స్పందిస్తుందని స్పష్టం చేశారు.
ప్రపంచమంతా జీవన్మరణాల మధ్య ఊగిసలాడుతూ జీవించిన కొవిడ్-19 సమయాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిందిగా సభలో ఉన్నవారిని శ్రీ మోదీ కోరారు. ఈ భారీ సంక్షోభం నుంచి ఇంత పెద్ద జనాభా కలిగిన దేశం ఎలా గట్టెక్కుతుందో అని ప్రపంచమంతా భావించిందని, ఆ ఊహాగానాలన్నీ తప్పే అని భారత్ నిరూపించిందని ప్రధానమంత్రి వెల్లడించారు. ఈ ఉపద్రవాన్ని భారత్ నేరుగా ఎదుర్కొందని, సొంత వ్యాక్సీన్లను త్వరితగతితన అభివృద్ధి చేసుకుందని, అతి తక్కువ సమయంలో వాటిని ప్రజలకు అందించిందని, ఈ సంక్షోభం నుంచి బయటపడి వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని వివరించారు.
కొవిడ్ -19 ప్రభావం పూర్తిగా తగ్గక ముందే.. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో సంఘర్షణలు మొదలయ్యాయని, యుద్ధ వార్తలే ముఖ్యాంశాలుగా మారిపోయాయని ప్రధానమంత్రి చెప్పారు. ఇలాంటి సందర్భంలో మరోసారి భారత్ వృద్ధి అవకాశాల గురించి ప్రశ్నలు తలెత్తాయన్నారు. మరోసారి.. ఆ ఊహాగానాలన్నిటినీ పటాపంచలు చేసి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు సాగుతోందని శ్రీ మోదీ వివరించారు. గడచిన మూడేళ్లలో భారత సగటు వృద్ధి రేటు మునుపెన్నడూ లేని రీతిలో, ఊహించని విధంగా 7.8 శాతానికి చేరుకుంది. రెండు రోజుల క్రితం విడుదలైన వస్తు ఎగుమతుల డేటా గతేడాదితో పోలిస్తే ఏడు శాతం పెరుగుదలను సూచిస్తోందని వివరించారు. గతేడాది సుమారుగా రూ.4.5 లక్షల కోట్ల వ్యవసాయ ఎగుమతులను భారత్ సాధించిందని వెల్లడించారు. ఎస్ అండ్ పీ సంస్థ 17 ఏళ్ల తర్వాత భారత్ క్రెడిట్ రేటింగ్ పెంచిందని, అదే సమయంలో అనేక దేశాల రేటింగ్ అస్థిరంగా ఉందని తెలియజేశారు. ఐఎంఎఫ్ కూడా భారత్ వృద్ధి అంచనాను పెంచింది. ఏఐ రంగంలో భారత్‌లో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెడుతున్నట్లు గూగుల్ సంస్థ కొన్ని రోజుల క్రితమే ప్రకటించిందన్నారు. హరిత ఇంధనం, సెమీకండక్టర్ రంగాల్లో గణనీయంగా పెట్టుబడులు వస్తున్నాయని తెలియజేశారు.

‘‘ప్రస్తుతం భారత్ సాధిస్తున్నవృద్ధే అంతర్జాతీయంగా అవకాశాలను సృష్టిస్తోంది’’ అన్న శ్రీ మోదీ దానికి ఉదాహరణగా ఇటీవలే కుదిరిన ఈఎఫ్‌టీఏ వాణిజ్య ఒప్పందాన్ని ఉటంకించారు. దీని ద్వారా, భారత్‌లో 100 బిలయన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు యూరోపియన్ దేశాలు అంగీకరించాయన్నారు. ఇది పెద్ద ఎత్తున ఉద్యోగాలను సృష్టిస్తుందని వివరించారు. అతిపెద్ద వ్యాపార ప్రతినిధి బృందంతో కలసి యూకే ప్రధాని, తన ఆప్త మిత్రుడు కీర్ స్టార్మర్ చేపట్టిన తాజా భారత పర్యటనను ప్రస్తావిస్తూ.. ఇది భారత్‌లో ఉన్న అవకాశాల స్థాయిని ప్రపంచం చూస్తుందనడానికి నిదర్శనమని వివరించారు. జీ-7 దేశాలతో భారత్ వాణిజ్యం అరవై శాతాన్ని అధిగమించిందని తెలియజేశారు. ‘‘ఇప్పుడు భారత్‌ను విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన, స్థిరమైన భాగస్వామిగా ప్రపంచం పరిగణిస్తోంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్స్ నుంచి ఫార్మాస్యూటికల్స్ వరకు, ఆటోమొబైల్స్ నుంచి మొబైల్ తయారీ వరకు భారత్‌కు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఈ పెట్టుబడులే అంతర్జాతీయ సరఫరా వ్యవస్థకు ప్రధాన కేంద్రంగా మారేందుకు భారత్‌కు సహకరిస్తున్నాయని వివరించారు.
ఈ సదస్సులో చర్చించే అంశాల్లో ఒకటైన ‘‘ఎడ్జ్ ఆఫ్ ది అన్నోన్’’ ప్రపంచ అనిశ్చితిని సూచించవచ్చని, అయితే ఇదే భారత్‌కు గొప్ప అవకాశంగా మారిందని శ్రీ మోదీ అన్నారు. శతాబ్దాలుగా తెలియని దారుల్లో నడిచేందుకు భారతదేశం ధైర్యాన్ని ప్రదర్శించిందని స్పష్టం చేశారు. మార్పునకు ఆరంభం ‘‘మొదటి అడుగే’’ అని సాధువులు, శాస్త్రవేత్తలు, మార్గదర్శులు నిరూపించారని చెప్పారు. సాంకేతికత, మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ అభివృద్ధి, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, ఫిన్‌టెక్, హరిత ఇంధనం ఇలా ఏ రంగమైనా.. ప్రతి సమస్యను సంస్కరణగా, ప్రతి సంస్కరణను స్థిరమైన చర్యగా, ప్రతి స్థిరమైన చర్యను విప్లవంగా భారత్ మారుస్తోంది. సంస్కరణలు చేపట్టడంలో భారత్ ధైర్యాన్ని ప్రశంసిస్తూ ఐఎంఎఫ్ అధిపతి తాజాగా చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. భారీ స్థాయిలో డిజిటల్ గుర్తింపును అందించే విషయంలో సాధ్యాసాధ్యాల పట్ల ప్రపంచం వ్యక్తం చేసిన సందేహాలను భారత్ నివృత్తి చేసిన ఉదాహరణను సభ ముందుంచారు. ప్రసుత్తం.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ లావాదేవీల్లో యాభై శాతం భారత్‌లోనే జరుగుతున్నాయి. అలాగే అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో భారత యూపీఐ అగ్రగామిగా ఉందనీ, ప్రతి అంచనాను, మదింపును అధిగమించడమే భారత్‌ను నిర్వచించే ప్రధాన లక్షణంగా మారిందని.. అందుకే భారత్‌కు ఎదురు లేదని శ్రీ మోదీ అన్నారు.
‘‘భారత్ సాధించిన విజయాల వెనక ఉన్న అసలైన బలం దేశ ప్రజలే’’ అని చెబుతూ.. ప్రజలపై జీవితాల్లో ప్రభుత్వ ఒత్తిడి లేదా జోక్యం లేనప్పుడు మాత్రమే వారు తమ సామర్థ్యాన్ని గ్రహించగలుగుతారని శ్రీ మోదీ స్పష్టం చేశారు. అభివృద్ధికి ప్రభుత్వ నియంత్రణ అడ్డంకిగా మారుతుందని, అదే సమయంలో ప్రజాస్వామ్యీకరణ వృద్ధిని పెంచుతుందన్నారు. అరవై ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన ప్రతిపక్ష పార్టీ విధాన ప్రక్రియల్లో అధికారవాదాన్ని ప్రోత్సహించిందని దుయ్యబట్టారు. దీనికి భిన్నంగా.. గత పదకొండేళ్లలో తమ ప్రభుత్వం విధానాలు, ప్రక్రియలను ప్రజాస్వామ్యీకరించడంపై దృష్టి సారించిందని, ఇదే అజేయ భారత్ ఆవిర్భావం వెనకున్న కీలకమైన అంశమని తెలియజేశారు.

బ్యాంకింగ్ రంగం గురించి వివరిస్తూ... 1960ల్లో బ్యాంకుల జాతీయీకరణను అప్పటి ప్రధానమంత్రి సమర్థించారని, పేదలు, రైతులు, కార్మికులకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. అయితే వాస్తవానికి బ్యాంకు గుమ్మం దగ్గరికి వెళ్లాలన్నా పేదలు భయపడేంతగా వాటిని అప్పటి అధికార పార్టీ ప్రజలకు దూరం చేసిందని విమర్శించారు. దీని కారణంగానే 2014 నాటికి దేశ జనాభాలో సగానికంటే ఎక్కువ మందికి బ్యాంకు ఖాతాలకు దూరంగా ఉండిపోయారన్నారు. బ్యాంకు ఖాతాలు లేకపోవడం వల్లనే.. అవి అందించే ప్రయోజనాలను వారు కోల్పోయారని, అధిక వడ్డీకి ఇతరుల దగ్గర రుణాలు తీసుకోవాల్సి వచ్చేదని, తరచూ వారి ఇళ్లను, భూములను తనఖా పెట్టాల్సి వచ్చేదని ప్రధానమంత్రి అన్నారు.
అధికార దుర్వినియోగం నుంచి దేశానికి విముక్తి కల్పించడం అత్యవసరమని గుర్తించి.. ప్రభుత్వం దాన్ని విజయవంతంగా సాధించిందన్నారు. 50 కోట్ల మందికి పైగా యుద్ధ ప్రాతిపదికన జన్ ధన్ ఖాతాలు అందించడంతో సహా బ్యాంకింగ్ రంగంలో చేపట్టిన ప్రజాస్వామీకరణ, సంస్కరణలను వివరించారు. ప్రస్తుతం దేశంలోని ప్రతి గ్రామంలోనూ కనీసం ఒక్కటైనా బ్యాంకింగ్ సేవల కేంద్రం ఉంది. అత్యంత ఆర్థిక సమ్మిళిత్వం ఉన్న దేశాల్లో ఒకటిగా భారత్‌ను డిజిటల్ లావాదేవీలు మార్చాయని శ్రీ మోదీ తెలియజేశారు. ప్రతిపక్షం చేపట్టిన జాతీయీకరణ వల్ల బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు పేరుకుపోయాయని, తమ ప్రభుత్వం చేసిన ప్రజాస్వామ్యీకరణ ప్రయత్నాల కారణంగానే బ్యాంకులు లాభాలను నమోదు చేస్తున్నాయన్నారు. గత పదకొండేళ్లుగా స్వయం సహాయక బృందాలు, చిన్నకారు రైతులు, పాడి రైతులు, మత్స్యకారులు, చిరు వ్యాపారులు, విశ్వకర్మ సోదరులకు లక్షల కోట్ల విలువైన హామీరహిత రుణాలను బ్యాంకులు అందించాయి.
అభివృద్ధికి మరో ఉదాహరణగా పెట్రోలియం, సహజవాయు రంగాన్ని వృద్ధికి ప్రధానమంత్రి చూపించారు. 2014కు ముందు ఇంధన సబ్సిడీలు పెరగకుండా ఆపేందుకు పెట్రోలు పంపులను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మూసేయడానికి అధికారవాద ధోరణితో ఉన్న అప్పటి ప్రభుత్వం సిద్ధమైందని గుర్తు చేసుకున్నారు. దీనికి భిన్నంగా.. ప్రస్తుతం ఎలాంటి నియంత్రణలు లేకుండా పెట్రోలు పంపులు 24 గంటలూ తెరిచే ఉంటున్నాయన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, విద్యుత్ వాహన రవాణా వ్యవస్థలో అపూర్వమైన పెట్టుబడులను భారత్ సాధిస్తోందని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో గ్యాస్ సదుపాయం పొందాలంటే.. పార్లమెంట్ సభ్యుల సిఫార్సు లేఖలు అవసరమయ్యేవని, వ్యవస్థల్లో అధికార ధోరణి ఎలా ఉండేదో ఇది తెలియజేస్తుందని శ్రీ మోదీ విమర్శించారు. దీనికి భిన్నంగా.. తమ ప్రభుత్వం 10 కోట్ల పేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందించిందని, వారిలో చాలామంది ఈ సౌకర్యం తమకు దక్కుతుందని ఎన్నడూ ఊహించలేదని తెలిపారు. అసలైన ప్రజాస్వామ్యయుత పాలన ఇలాగే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
అధికార ధోరణి ఆధిపత్యం చెలాయించిన ఆ యుగంలో ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లను అప్పటి ప్రభుత్వం నిరర్థకంగా మార్చిందని, వాటికి తాళాలు వేసిందని వ్యాఖ్యానించారు. కష్టపడటానికి ఇష్టపడని, అలా ఉండటం వల్ల తమను ఎలాంటి నష్టం రాదనుకొనే మనస్తత్వాన్ని విమర్శించారు. తమ ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎల్ఐసీ, ఎస్‌బీఐ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఆదాయంలో నూతన రికార్డులను నెలకొల్పుతున్నాయన్నారు.

అధికారవాదానికి బదులుగా ప్రజాస్వామ్యంపై ప్రభుత్వ విధానాలు ఆధారపడినప్పుడు... ప్రజల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. ప్రతిపక్షం ఎలాంటి ఫలితమివ్వని ‘‘గరీభీ హఠావో’’ అంటే పదే పదే నినదిస్తోందని, వారి పాలనతో పేదరికం ఏమాత్రం తగ్గలేదని విమర్శించారు. గత పదకొండేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి తమ ప్రభుత్వం బయటకు తీసుకువచ్చిందని తెలియజేశారు. దీనివల్లే ప్రస్తుతం తమ ప్రభుత్వంపై దేశం నమ్మకం ఉంచిందని, అందుకే భారత్ అజేయంగా మారిందన్నారు.
పేదలు, అణగారిన వర్గాల వారికి నిబద్ధతతో సేవ చేసేందుకు, వెనకబడిన వర్గాలకు ప్రాధాన్యమివ్వడానికి, వారి జీవితాలను మెరుగుపరిచేందుకు అత్యంత బాధ్యతాయుతమైన విధానాలతో పని చేసేందుకు అంకితమైన ప్రభుత్వం ఇప్పుడు భారత్‌లో ఉంది అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ప్రధానంగా జరిగే చర్చల్లో ఈ తరహా ప్రయత్నాలకు తగినంత ప్రాధాన్యం లభించందన్నారు. దీనికి బీఎస్ఎన్ఎల్ ఇటీవలే ప్రారంభించిన మేడ్ ఇన్ ఇండియా 4జీ స్టాక్‌ను ఉదహరిస్తూ.. దానిని దేశం సాధించిన విజయంగా వర్ణించారు. దేశీయంగా 4జీ సదుపాయాలను అభివృద్ధి చేసుకున్న అయిదు అగ్రదేశాల్లో ఒకటిగా భారత్ నిలిచిందని గర్వం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం విస్మరించిన, ప్రభుత్వ రంగంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ ఇప్పడు సరికొత్త విజయాలను సాధిస్తోందన్నారు. 4జీ సదుపాయాలతో పాటుగా ఒక లక్ష 4జీ మొబైల్ టవర్లను బీఎస్ఎన్ఎల్ ఒకే రోజు ప్రారంభించిందని తెలియజేశారు. ఫలితంగా.. మారుమూల అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఒకప్పుడు హై స్పీడు ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాల్లో ఇప్పుడు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు లభిస్తున్నాయి.
దేశ విజయానికి సంబంధించిన మూడో అంశం గురించి వివరిస్తూ.. ఇది తరచూ విస్మరణకు గురవుతోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాలకు అధునాతన సౌకర్యాలు చేరుకున్నప్పడు అవి ప్రజల జీవితాలను మార్చివేస్తాయన్నారు. దీనికి ఈ-సంజీవని ఉదాహరణ అని తెలిపారు. వాతావరణం అనుకూలించని సమయంలో మారుమూల కొండ ప్రాంతంలో జీవించే కుటుంబంలో అనారోగ్యానికి గురైన వ్యక్తిని వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లడం అసాధ్యం. ఈ పరిస్థితుల్లో హై స్పీడు ఆధారిత ఈ-సంజీవని సేవల ద్వారా వారికి అవసరమైన వైద్య సహాయం లభిస్తుందని ప్రధానమంత్రి వివరించారు. మారుమూల ప్రాంతాల్లోని రోగులు ఈ-సంజీవని యాప్ ద్వారా నిపుణులైన వైద్యులను నేరుగా తమ ఫోన్ల నుంచే సంప్రదించవచ్చు. ఇప్పటి వరకు ఈ-సంజీవని ద్వారా 42 కోట్ల ఓపీడీ సంప్రదింపులు జరిగాయని ఆయన వెల్లడించారు. తాను ప్రసంగిస్తున్నఈ ఒక్క రోజులోనే దేశ వ్యాప్తంగా ఒక లక్ష మందికి పైగా ప్రజలు ఈ వేదిక ద్వారా సేవలు పొందారని తెలియజేశారు. ఈ-సంజీవని కేవలం ఒక సేవ మాత్రమే కాదని, అత్యవసర సమయాల్లో లభించే నమ్మకమైన సాయానికి చిహ్నమన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను ప్రజాస్వామ్యీకరణ చేయడం ద్వారా సాధించే గుణాత్మక మార్పునకు శక్తిమంతమైన ఉదాహరణగా దీనిని వర్ణించారు.
ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న బాధ్యతాయుత విధానాలను అనుసరించే ప్రభుత్వం ప్రజల జీవనసౌలభ్యానికి, ఆర్థిక పొదుపులకు ప్రాధాన్యమిచ్చే నిర్ణయాలను తీసుకుంటుందని, విధానాలను సూత్రీకరిస్తుందని శ్రీ మోదీ తెలిపారు. 2014కు మందు 1 జీబీ డేటా ఖరీదు రూ.300 ఉంటే.. ఇప్పుడు అది రూ.10కే లభిస్తోందని, ఫలితంగా ప్రతి భారతీయునికి ఏడాదికి వేల రూపాయలు ఆదా అవుతున్నాయన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేద రోగులు రూ.1.25 కోట్లు ఆదా చేశారని వెల్లడించారు. పీఎం జన ఔషధీ కేంద్రాల్లో 80 శాతం డిస్కౌంట్‌తో ఔషధాలు లభిస్తున్నాయని.. తద్వారా రూ.40,000 కోట్లు ఆదా అయిందని తెలియజేవారు. వీటితో పాటుగా.. గుండెకు వేసే స్టెంట్ల ధరలు తగ్గడం వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలకు రూ.12,000 కోట్లు ఆదా అయ్యాయి.

తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ద్వారా నిజాయతీపరులైన పన్ను చెల్లింపుదారులు ప్రత్యక్ష ప్రయోజనాన్ని పొందుతున్నారంటూ.. ఆదాయ పన్ను, జీఎస్టీ రెండింటిలో ఇచ్చిన మినహాయింపుల గురించి వివరించారు. ఏడాదికి రూ. 12 లక్షల వరకు ఆదాయం ఆర్జించేవారికి పన్ను మినహాయింపు ఇచ్చామని తెలియజేశారు. జీఎస్టీ పొదుపు ఉత్సవం ప్రస్తుతం జోరుగా కొనసాగుతోందని, ప్రస్తుత అమ్మకాలు గత రికార్డులన్నింటినీ బద్దలుకొడుతున్నాయన్నారు. ఆదాయ పన్ను, జీఎస్టీపై తీసుకున్న ఈ చర్యల వల్ల భారతీయ పౌరులకు రూ.2.5 లక్షల కోట్లు ఆదా అవుతాయని ప్రధానమంత్రి తెలియజేశారు.
ఆపరేషన్ సిందూర్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వస్తున్నాయని శ్రీ మోదీ అంగీకరించారు. దేశంలో ప్రధాన భద్రతా సమస్యగా పరిణమించిన, భారతీయ యువత భవిష్యత్తుతో ముడిపడిన మరో కీలక సమస్య నక్సలిజం, మావోయిస్టు తీవ్రవాదం గురించి చర్చించారు. ప్రస్తుత ప్రతిపక్షం అధికారంలో ఉన్న సమయంలో అర్బన్ నక్సలైట్ వ్యవస్థ అత్యంత ప్రభావశీలంగా ఉండేదని, దేశంలో మావోయిస్టు తీవ్రవాదం ఎంత ప్రబలంగా విస్తరించిందో ఇతర ప్రాంతాలకు తెలియదన్నారు. ఉగ్రవాదం, 370వ అధికరణ గురించి విస్తృతంగా చర్చలు జరుగుతున్న సమయంలో.. అర్బన్ నక్సల్స్ కీలకమైన సంస్థల్లోకి ప్రవేశించారని, మావోయిస్టు హింసపై జరిగే చర్చలను అణచివేయడానికి చురుగ్గా పనిచేశారని వ్యాఖ్యానించారు. ఈ మధ్యే మావోయిస్టు తీవ్రవాద బాధితులు ఢిల్లీకి వచ్చారని, వారు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యం లభించకుండా విపక్ష వ్యవస్థ అడ్డుకుందని విమర్శించారు.
ఒకప్పుడు దేశంలోని ప్రతి ప్రధాన రాష్ట్రంలోనూ ఇలాంటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, అక్కడ నక్సలైట్, మావోయిస్టుల హింస వేళ్లూనుకుపోయిందని ప్రధానమంత్రి వర్ణించారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగం అమల్లో ఉన్నప్పటికీ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం దాని గురించి ప్రస్తావించడానికి సైతం ఎవరూ సాహసించేవారు కాదని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు కూడా ఈ ప్రాంతాల్లో అధికారం ఉండేది కాదన్నారు. చీకటైతే.. బయటకు అడుగుపెట్టడం ఎంత ప్రమాదకరంగా ఉండేదో.. ప్రజలకు భద్రత కల్పించాల్సిన వారికి కూడా భద్రత కల్పించాల్సి వచ్చేదని ప్రధాని వివరించారు.
గడచిన 50-55 ఏళ్లుగా మావోయిస్టు తీవ్రవాదం చూపిన వినాశకరమైన ప్రభావం గురించి వివరిస్తూ.. దీనివల్ల భద్రతా సిబ్బంది, యువకులతో సహా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని శ్రీ మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణాలను నక్సలైట్లు అడ్డుకున్నారని, ఉన్నవాటిని బాంబులతో కూల్చివేసేవారన్నారు. ఫలితంగా.. దేశంలో ఎక్కువ భూభాగం, జనాభాలో ఓ పెద్ద వర్గం దశాబ్దాల తరబడి అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి. హింసకు గురైన, అభివృద్ధికి దూరంగా ఉన్న గిరిజన తెగలను, దళిత సోదరీసోదరులను దీర్ఘకాలం పాటు కొనసాగిన ఈ నిర్లక్ష్యం ప్రభావితం చేసిందన్నారు.
‘‘దేశ యువతకు మావోయిస్టు తీవ్రవాదం వల్ల తీవ్రమైన అన్యాయం, నష్టం జరుగుతోంది’’ అన్న ప్రధాని.. అలాంటి పరిస్థితుల్లో యువత చిక్కుకోవడాన్నితాను అనుమతించబోనన్నారు. అందుకే, తప్పుదారి పట్టిన యువతను తిరిగి ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తోందన్నారు. ఈ ప్రయత్నాల ఫలితాలను ప్రధానమంత్రి వెల్లడించారు: 11 ఏళ్ల క్రితం మన దేశంలో 125 నక్సల్ హింస ప్రభావిత జిల్లాలు ఉండగా ఇప్పుడు అవి 11కు తగ్గాయి. వాటిలోనూ 3 జిల్లాల్లో మాత్రమే నక్సల్ ప్రభావం అధికంగా ఉంది.
గడచిన దశాబ్దంలోనే వేల సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోయారని, గడచిన 75 గంటల్లో 303 మంది నక్సలైట్లు తమ ఆయుధాలను విడిచిపెట్టారని వెల్లడించారు. వీరంతా సాధారణ తిరుగుబాటుదారులు కాదని, వారిలో కొందరిపై రూ.1 కోటి, రూ.15 లక్షలు లేదా రూ. 5 లక్షల నజరానా ఉందన్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. వీరంతా.. ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి అడుగుపెడుతున్నారని, తప్పుదారిలో నడిచామని బహిరంగంగా ఒప్పుకున్నారని తెలిపారు. ఇప్పుడు వారు రాజ్యాంగంపై నమ్మకంతో ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు.
ఒకప్పుడు నక్సలిజానికి ప్రధాన స్థావరంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో జరిగిన ఘటనల కథనాలు వార్తల్లో ప్రధానాంశాలుగా ఉండేవని, ఇప్పుడు అక్కడి గిరిజన యువత శాంతికి, అభివృద్ధికి చిహ్నంగా బస్తర్ ఒలింపిక్స్ నిర్వహిస్తున్నాయంటూ.. ఆ ప్రాంతంలో వచ్చిన మార్పులను వివరించారు. మావోయిస్టు తీవ్రవాదం నుంచి విముక్తి పొందిన ప్రాంతాలు, సరికొత్త ఉత్సాహంతో ఆనందమనే దీపాలతో దీపావళిని నిర్వహించుకుంటాయని తెలియజేశారు. నక్సలిజం, మావోయిస్టు తీవ్రవాదం నుంచి దేశం పూర్తిగా విముక్తి పొందే రోజు ఎంతో దూరంలో లేదని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇది తమ ప్రభుత్వ గ్యారంటీ అన్నారు.
‘‘అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు భారత్ చేస్తున్న ప్రయాణం కేవలం పురోగతి కోసం మాత్రమే కాదు. అభివృధ్ధి, గౌరవం రెండూ కలసి ముందుకు సాగాలి. ఆ వేగం పౌరుల పట్ల బాధ్యతతో కూడినదై ఉండాలి. సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మాత్రమే కాకుండా.. సానుభూతి, కరుణ లక్ష్యంగా ఆవిష్కరణ ఉండాలి. ఈ దృక్పథంతోనే భారత్ ముందుకు సాగుతోంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. ఈ లక్ష్యాన్నిముందుకు తీసుకువెళ్లడంలో ఎన్డీటీవీ అంతర్జాతీయ సదస్సు లాంటి వేదికలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయంటూ.. దేశ దృక్పథాన్ని తెలియజేసే అవకాశం తనకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ శుభాకాంక్షలు చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు.
శ్రీలంక ప్రధానమంత్రి డాక్టర్ హరిణి అమరసూర్య, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్, యునైటెడ్ కింగ్డమ్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
India is not in the mood to stop today!
— PMO India (@PMOIndia) October 17, 2025
We will neither pause nor slow down.
140 crore Indians will move forward together with full momentum. #NDTVWorldSummit2025 pic.twitter.com/gq51votOo5
Today, as the world faces various roadblocks and speed breakers, it is only natural to talk about an unstoppable India. #NDTVWorldSummit2025 pic.twitter.com/g9sw14Y8lF
— PMO India (@PMOIndia) October 17, 2025
Today, from chips to ships, India is self-reliant and filled with confidence in every sphere. #NDTVWorldSummit2025 pic.twitter.com/1o2Hn3oxik
— PMO India (@PMOIndia) October 17, 2025
Today, India's growth is shaping global opportunities. #NDTVWorldSummit2025 pic.twitter.com/qa3vmHIHvs
— PMO India (@PMOIndia) October 17, 2025
The entire world today sees India as a reliable, responsible and resilient partner. #NDTVWorldSummit2025 pic.twitter.com/HameOjkGf2
— PMO India (@PMOIndia) October 17, 2025
For the world, the edge of the unknown may seem uncertain.
— PMO India (@PMOIndia) October 17, 2025
But for India, it is a gateway to new opportunities. #NDTVWorldSummit2025 pic.twitter.com/hxzp80A7zY
We have turned every risk into reform, every reform into resilience and every resilience into a revolution. #NDTVWorldSummit2025 pic.twitter.com/jS2sy5m7zI
— PMO India (@PMOIndia) October 17, 2025
In the past 11 years, we have worked to democratise both policy and process. #NDTVWorldSummit2025 pic.twitter.com/453NBbu47o
— PMO India (@PMOIndia) October 17, 2025
Today, we can proudly say that India is among the top five countries in the world with its own domestic 4G stack. #NDTVWorldSummit2025 pic.twitter.com/FGjlMUnRjW
— PMO India (@PMOIndia) October 17, 2025
Maoist terrorism is a great injustice and a grave sin against the nation's youth. I could not leave the country's youth in that state: PM @narendramodi at #NDTVWorldSummit2025 pic.twitter.com/NxoziagC4k
— PMO India (@PMOIndia) October 17, 2025


