భారత్ అజేయంగా ముందుకు వెళుతోంది! మేం ఆగము.. వేగాన్ని తగ్గించం...
140 కోట్ల మంది భారతీయులంతా కలసి అత్యంత వేగంగా ముందుకు సాగుతాం: పీఎం
నేటి ప్రపంచం వివిధ ఇబ్బందులను, అవరోధాలను ఎదుర్కొంటున్న సమయంలో
అజేయంగా దూసుకెళుతున్న భారత్ గురించి మాట్లాడుకోవడం సహజం: పీఎం
అతి బలహీనమైన అయిదు దేశాల నుంచి ప్రపంచంలోనే
అయిదు అగ్ర ఆర్థికవ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఎదిగింది: పీఎం
చిప్‌ల నుంచి నౌకల వరకు ప్రతి రంగంలోనూ భారత్ స్వావలంబన సాధించింది, విశ్వాసం నింపుకొంది: పీఎం
ప్రస్తుతం భారత్ సాధిస్తున్నవృద్ధే అంతర్జాతీయంగా అవకాశాలను సృష్టిస్తోంది: పీఎం
ప్రస్తుత ప్రపంచం భారత్‌ను విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన,
స్థిరమైన భాగస్వామిగా చూస్తోంది: పీఎం
ప్రపంచం కనిపించని అనిశ్చితులను ఎదుర్కొంటోంది..

శ్రీలంక ప్రధానమంత్రి హరిణి అమరసూర్య గారికి, ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి, నా స్నేహితుడు టోనీ అబాట్‌ గారికి, బ్రిటన్‌ మాజీ ప్రధానమంత్రి రిషి సునక్‌ గారికి, గౌరవ అతిథులకు, సోదరీ సోదరులకూ నా నమస్కారం!

ఇది పండుగల కాలం. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఉత్సాహభరితమైన వాతావరణంలో ఎన్డీటీవీ అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఈ సదస్సుకు మీరు ఎంచుకున్న ఇతివృత్తం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ‘‘దూసుకుపోతున్న భారత్‌’’ (అన్‌స్టాపబుల్‌ భారత్‌).. నిజానికి నేడు భారత్ ఆగిపోయే పరిస్థితుల్లో లేదు. మేము (భారత్‌) ఎప్పుడూ ఆగం, ఆపం కూడా. 140 కోట్ల మంది భారతీయులం.. కలిసికట్టుగా వేగంగా ముందుకు సాగిపోతున్నాం.

మిత్రులారా,

ఈ రోజు ప్రపంచం గణనీయమైన అవరోధాలు, అడ్డంకులను ఎదుర్కొంటున్న సమయంలో.. ‘‘దూసుకుపోతున్న భారత్‌ (అన్‌స్టాపబుల్‌ భారత్‌)’’ అనే చర్చ సహజమే. నేను దీనిని- పదకొండు సంవత్సరాల కిందటి పరిస్థితి.. ఇప్పటి పరిస్థితి అనే సందర్భంలో వివరించాలనుకుంటున్నాను. మీకు గుర్తుందనుకుంటాను... 2014 కు ముందు ఇలాంటి సదస్సులో ఎలాంటి విషయాలు, అంశాలు చర్చ వచ్చి ఉంటాయో?. వీధుల్లో, పొరుగు ప్రాంతాల్లోని సమావేశాల్లో ఎలాంటి చర్చలు జరిగేవో మీరు ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. ప్రపంచ ఆర్థిక ఒత్తిళ్లను భారత్‌ ఎలా ఎదుర్కొంటుంది?. ఆర్థికంగా బలహీనమైన అయిదు దేశాల నుంచి భారత్ ఎప్పుడు బయటకొస్తుంది? భారత్‌లో విధాన స్థబ్దత ఎంతకాలం కొనసాగుతుంది? భారత్‌లో భారీ కుంభకోణాలు ఎప్పటికి ఆగుతాయి?  అప్పుడు చర్చలు ఇలా ఉండేవి!

మిత్రులారా,
ఒకప్పుడు మహిళల భద్రతపై అనేక ప్రశ్నలు ఉండేవి. ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ పై ఎలాంటి నియంత్రాణాలేదని వార్తలూ వచ్చాయి. ‘‘మహంగాయి డైన ఖాయే జాత్ హై’’ (ద్రవ్యోల్బణం అనే పిశాచి దేశాన్ని కబళిస్తోంది) వంటి పాటలు ప్రజల్లో విస్తృతంగా వినిపించేవి. 2014కి ముందు పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడు మీకు స్పష్టంగా గుర్తుకు రావొచ్చు. ఎన్నో సంక్షోభాల్లో చిక్కుకున్న భారత్ ఈ పరిస్థితుల నుంచి బయటపడలేదని దేశ వాసులతోపాటు ప్రపచమంతా నమ్మేవారు. కానీ గత పదకొండు సంవత్సరాల్లో భారత్ ఆ సందేహాలన్నింటిని తొలగించింది. ప్రతి సవాలును అధిగమించింది. నేడు భారత్ అయిదు ఆర్థిక బలహీన దేశాల్లో లేదు. ఇప్పుడు ప్రపంచంలో అయిదు గొప్ప ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటిగా ఎదిగింది. ఈ రోజు ద్రవ్యోల్బణం 2 శాతంకంటే తక్కువ ఉంది. వృద్ధిరేటు 7 శాతం కంటే ఎక్కువగా ఉంది. ‘‘"చిప్స్’’ నుంచి ‘‘షిప్పుల’’ వరకూ స్వావలంబన భారత్.. ఆత్మవిశ్వాసంతో నిండిన భారత్‌గా మారింది. నేడు భారత్‌పై ఉగ్రదాడులు జరిగితే నిశ్శబ్దంగా ఉండదు. సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్ లాంటి తగిన ప్రతిచర్యలు తీసుకుంటోంది.

 

మిత్రులారా,

కోవిడ్ కాలం గురించి ఒకసారి ఆలోచించండి. ఆ సమయంలో జీవన్మరణాల మధ్య ప్రపంచం ఊగిసలాడింది. ఇంత పెద్ద జనాభా ఉన్న దేశం ఇంత పెద్ద సంక్షోభాన్ని ఎలా తట్టుకుంటుందోనని ప్రపంచం ఆలోచిస్తున్నప్పుడు, అంతేగాక భారత్‌ కారణంగా ప్రపంచం మునిగిపోతుందని భావించినప్పుడు- రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కానీ భారత్‌ ప్రతి ఊహాగానాన్నీ తప్పని నిరూపించింది. మేం వాటిని తిప్పికొట్టాం. త్వరగా మా సొంత వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాం. రికార్డు సమయంలో వ్యాక్సిరన్లను అందించాం. అంత పెద్ద సంక్షోభం నుంచి బయటపడిన తర్వాత.. మేం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మారాం.

మిత్రులారా,

కరోనా ప్రభావం పూర్తిగా ముగియకముందే.. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో గొడవలు, యుద్ధాలు మొదలయ్యాయి. వార్తల ముఖ్యాంశాల్లో యుద్ధం గురించి కథనాలు కనిపించడం ప్రారంభించాయి. ఇలాంటి సంక్షోభ సమయంలో భారత్ అభివృద్ధి ఎలా సాధించగలదనే ప్రశ్న మళ్లీ తలెత్తింది. కానీ అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ మళ్లీ అన్ని ఊహాగానాలను తిప్పికొట్టింది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తన ప్రస్థానాన్ని కొనసాగించింది. గత మూడేళ్లలో భారత్ సగటు వృద్ధి రేటు 7.8 శాతం. ఇది అపూర్వమైనది. ఊహించని స్థాయిలో ఉంది. కేవలం రెండు రోజుల క్రితమే వస్తువుల ఎగుమతుల గణాంకాలు బయటకు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే మన వస్తువుల ఎగుమతుల్లో సుమారు 7 శాతం పెరిగాయి. గతేడాది భారత్‌ సుమారు రూ. 4.5 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అనేక దేశాల అస్థిర రేటింగ్‌ల నేపథ్యంలో ఎస్‌ అండ్‌ పీ సంస్థ 17 సంవత్సరాల తర్వాత భారతదేశ క్రెడిట్ రేటింగ్‌ను ఉన్నత స్థాయికి చేర్చింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ కూడా భారత్‌ వృద్ధిని మెరుగుపరిచింది. కొన్ని రోజుల క్రితమే గూగుల్‌ సంస్థ భారత్‌లో కృత్రిమ మేధ రంగంలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. నేడు హరిత ఇంధనం, సెమికండక్టర్ల రంగాల్లోకి కూడా భారీ స్థాయిలో పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి.

మిత్రులారా,

నేడు భారత్ అభివృద్ధి చెందడమే కాదు. ప్రపంచ అవకాశాలను కూడా రూపొందిస్తోంది. నేను దీన్ని పూర్తి బాధ్యతతో చెబుతున్నాను. ఇటీవల సంతకం చేసిన ఈఎఫ్‌టీఏ వాణిజ్య ఒప్పందం ఇందుకు గొప్ప ఉదాహరణ. యూరోపియన్ దేశాలు భారత్‌లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది దేశంలో లక్షలాది ఉద్యోగాలను కల్పిస్తుంది. కొన్ని రోజుల కిందట నా స్నేహితుడు ఇంగ్లాండ్ ప్రధాని స్టార్మర్ తన అతిపెద్ద వ్యాపార ప్రతినిధి బృందంతో భారత్‌ను సందర్శించారు. భారత్‌లో ఉన్న విస్తృత అవకాశాల కోసం ప్రపంచమెంతో ఆశతో చూస్తున్నదనే దానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. నేడు జీ7 దేశాలతో భారత్‌ వాణిజ్యం 60 శాతానికిపైగా పెరిగింది. ప్రపంచం మొత్తం దేశాన్ని ఒక నమ్మకమైన, బాధ్యతాయుతమైన, మేలైన భాగస్వామిగా చూస్తోంది. ఎలక్ట్రానిక్స్ నుంచి ఫార్మా వరకు, ఆటోమొబైల్స్ నుంచి మొబైల్ తయారీ వరకు పెట్టుబడుల ప్రవాహం భారత్ వైపు వస్తోంది. ఈ పెట్టుబడులు భారత్‌ను ప్రపంచ సరఫరా వ్యవస్థలో ఒక నాడీ కేంద్రంగా మార్చేందుకు సహాయపడుతుంది.

మిత్రులారా,

ఈ సమావేశంలో మనం ‘‘అజ్ఞాతపు అంచున’’(ఎడ్జ్‌ ఆఫ్‌ ది అన్‌నోన్‌) అనే అంశంపై చర్చిస్తున్నాం. ప్రపంచానికి ఇది ఒక అనిశ్చిత విషయం కావచ్చు. కానీ భారత్‌కు ఇది అవకాశాల స్వర్గం. అనేక శతాబ్దాలుగా అన్వేషణకు, అపరిచిత మార్గాల్లో నడకకు భారత్ ధైర్యం చూపిస్తూ వచ్చింది. మన సాధువులు, శాస్త్రవేత్తలు, నావికులు ఎప్పుడూ ‘మొదటి అడుగు’ మార్పునకు నాంది అని నిరూపించారు. అది సాంకేతికత నుంచి కరోనా టీకా అవసరం వరకు, నైపుణ్యం కలిగిన మానవశక్తి అయినా, ఫిన్‌టెక్ లేదా హరిత ఇంధనం రంగం అయినా ప్రతీ ప్రమాదాన్ని మనం సంస్కరణగా మార్చాం. ప్రతి సంస్కరణను స్థిరత్వంగా మార్చాం. ఆ స్థిరత్వాన్ని విప్లవంగా మార్చాం. దేశంలోని సంస్కరణల ధైర్యాన్ని చూసి ఆయన ఎంతో ఆఆనందంగా ఉందని ఇటీవల ఐఎంఎఫ్‌ ముఖ్య అధికారి ఒకరు చెప్పారు. ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఒకప్పుడు భారత్‌లో ఒక సంస్కరణ జరిగిందని మీకు తెలిసి ఉండొచ్చు. ఆ సంస్కరణ గురించి కొన్ని వర్గాలు ఇంకా పాటలు పాడుతూనే ఉంటాయి. మా స్నేహితులు అక్కడ నవ్వుతున్నారు. ఎందుకంటే అది ఒక బలవంతం వల్ల జరిగింది. ఆ బలవంతం కూడా ఐఎంఎఫ్‌ నుంచి వచ్చింది. కానీ ఇవాళ సంస్కరణలు మన నమ్మకంతో జరుగుతున్నాయి. అదే ఐఎంఎఫ్‌ ఇప్పుడు దేశ సంస్కరణల ధైర్యాన్ని ప్రశంసిస్తోంది. ఐఎంఎఫ్‌ అధికారి ఒక ఉదాహరణ కూడా చెప్పారు. సామూహిక స్థాయిలో డిజిటల్ గుర్తింపు అందించడం సాధ్యం కాదని అందరూ అనుకున్నారు. కానీ భారత్ అది సాధించి చూపించింది. ఇప్పుడు ప్రపంచంలో జరిగే వాస్తవిక డిజిటల్ లావాదేవీల్లో 50 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయి. అర్థం చేసుకోండి. 50 శాతం! ప్రపంచ డిజిట్‌ చెల్లింపు వ్యవస్థలో భారత యూపీఐ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. దీని అర్థం ప్రతి అంచనాను అధిగమించడం నేడు భారత్‌ ధోరణిగా మారింది. నేను ‘స్వభావం’ అనలేదు, ‘ధోరణి’ అన్నాను. ఎందుకంటే మోదీ ఉన్నంతకాలం ఆయన ధోరణి గురించి మాట్లాడుతాడు. అందుకే భారత్ అడ్డుకోలేనిది.

 

మిత్రులారా,

దేశం సాధించిన విజయాల వెనుక ఉన్న అసలైన శక్తి ప్రజల నుంచే వస్తుంది. కానీ ఆ ప్రజలు తమ సామర్థ్యాన్ని సమర్ధంగా ఉపయోగించగలగాలంటే వారి జీవితాల్లో ప్రభుత్వ హస్తం, ప్రభుత్వ ఒత్తిడి లేకుండా ఉండాలి. ప్రభుత్వం జోక్యం ఎక్కువైతే అభివృద్ధికి అడ్డుకట్టలు పెరుగుతాయి. కానీ ప్రజాస్వామ్యీకరణ ఎక్కువైతే అభివృద్ధికి వేగం పెరుగుతుంది. దురదృష్టవశాత్తూ 60 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పాలన విధానాలనూ, ప్రక్రియల్నీ ప్రభుత్వాధీనంగా మార్చడంపైనే దృష్టి పెట్టింది. దాంతో ప్రతీ వ్యవస్థపై ఓ కఠినమైన నియంత్రణ ఏర్పడింది. కానీ గత 11 ఏళ్లుగా మన ప్రభుత్వం విధానాల ప్రక్రియపై, ప్రజాస్వామ్యీకరణపై దృష్టి పెట్టింది. ఇది కూడా అన్‌స్టాపబుల్ భారత్‌ వెనకున్న ఒక ప్రధాన కారణం. బ్యాంకింగ్ రంగాన్ని ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. 1960వ దశాబ్దంలో ఇందిరా గాంధీ బ్యాంకుల జాతీయీకరణ వెనుక కారణం ఏంటి? రైతులకు, పేదలకు, కార్మికులైన దేశ సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించాలన్నది తమ నినాదమని చెప్పారు. కానీ వాస్తవంగా ఏం జరిగింది?. కాంగ్రెస్‌ ఏం చేసింది? బ్యాంకులు ప్రజలకు మరింత దూరమయ్యాయి. పేదలు బ్యాంకు గేటు దాటి లోపలికి వెళ్ళడానికే భయపడే పరిస్థితి వచ్చింది. ఇది ప్రభుత్వం మీద ప్రజలకు పడిన భారమే. మన ప్రభుత్వం 2014లో బాధ్యతలు చేపట్టినప్పుడు దేశంలో సగానికి పైగా ప్రజలకు బ్యాంకు ఖాతాలే లేవు. ఇక్కడ సమస్య వాళ్లకు బ్యాంకు ఖాతా లేకపోవడమే కాదు. దీని అర్థం దేశ జనాభాలో ఎక్కువ భాగం ప్రజలు బ్యాంకింగ్ ప్రయోజనాలనే కోల్పోయారు. దీంతో వాళ్లు అవసరాల కోసం అత్యధిక వడ్డీలపై అప్పులు తీసుకోవాల్సి వచ్చేది. ఇళ్లు, భూములు తనఖా పెట్టాల్సి వచ్చి, విలువైన ఆస్తులను కోల్పోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

మిత్రులారా,

ఈ ప్రభుత్వ నియంత్రిత వ్యవస్థ నుంచి దేశాన్ని విముక్తం చేయడం అత్యవసరం అయ్యింది. మేము దానిని సాధించాం. బ్యాంకింగ్ రంగాన్ని ప్రజాస్వామ్యీకరించాం, సంస్కరించాం. నిబద్ధత, కృషితో పని చేసి 50 కోట్లకు పైగా జనధన్ ఖాతాలు తెరిచాం. ఇది గొప్ప విశేషం. ఎందుకంటే ప్రపంచంలో తెరిచిన అన్ని ఖాతాల మొతం ఒకవైపు ఉంటే.. భారత్‌ మాత్రమే మరో వైపుగా నిలుస్తుంది. నేడు దేశంలోని ప్రతి గ్రామానికీ ఏదో ఒక బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయి. డిజిటల్ లావాదేవీలతో భారత్ ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక ఆర్థిక స్వారజనీనత కలిగిన దేశాల్లో ఒకటిగా నిలిచింది.

కానీ కాంగ్రెస్ పాలనలో బ్యాంకుల్లో ఎన్పీఏల పర్వం ఏర్పడింది. అటు ప్రైవేట్ రంగం, ఇటు ప్రభుత్వ రంగం కుదేలయ్యాయి. కానీ బీజేపీ తీసుకువచ్చిన ప్రజాస్వామ్య విధానాలు, బ్యాంకులకు రికార్డు లాభాలు తీసుకువచ్చాయి. గత 11 సంవత్సరాల్లో మహిళల స్వయం సహాయ సంఘాలు, చిన్న రైతులు, పశుపెంపకందారులు, మత్స్యకారులు, వీధి వ్యాపారులు, విశ్వకర్మ మిత్రులు.. ఇలా ఎంతోమందికి లక్షల కోట్ల రూపాయల రుణాలు అందాయి. ఇవన్నీ బ్యాంకుహామీలు లేకుండానే ఇవ్వడం జరిగింది.

మిత్రులారా,

పెట్రోల్, గ్యాస్ రంగానికి సంబంధించిన మరో ఉదాహరణ కూడా నేను మీకు ఇస్తాను. 2014 కి ముందు పరిస్థితి ఎలా ఉండేదో మీకు తెలుసా? జాతీయీకరణ ఆలోచన ప్రబలంగా ఉన్నప్పుడు పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా ఉండేదో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. పెట్రోల్, డీజిల్ పై సబ్సిడీలు పెరగకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పెట్రోల్ బంకులను మూసివేయడానికి సిద్ధం అయ్యింది. అంటే ఎవరైన పెట్రోలు పోయించుకోవాలనుకుంటే సాయంత్రం 7 గంటలకు వెళ్లిపోవాలి. వీళ్లు ప్రజల అవసరాలకు ఎంత విలువ ఇచ్చారో చూడండి. కానీ నేటీ పరిస్థితి మారింది. పెట్రోల్ బంకులు 24 గంటలూ తెరిచి ఉంటున్నాయి. ప్రజలకు అవసరమైన వేళ పెట్రోలు, డీజిల్ అందుబాటులో ఉంది. అంతేగాక ప్రత్యామ్నాయ ఇంధనాలు, విద్యుత్ మొబిలిటీ, హరిత ఇంధనాలపై మా ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడూ లేనంత పెట్టుబడులు పెట్టుతోంది.

 

మిత్రులారా,

కాంగ్రెస్ పాలనలో ఒక గ్యాస్ కనెక్షన్ కోసం కూడా పార్లమెంటు సభ్యుల చేతి మీదుగా లేఖలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఒక పార్లమెంట్ సభ్యుడు తన ప్రాంతంలోని ప్రజలకు గ్యాస్‌ కనెక్షన్ల కోసం సంవత్సరానికి 25 కూపన్లు పొందేవారు. ఆయన నియోజకవర్గంలో ఎవరికైనా కనెక్షన్ కావాలంటే ఎంపీ ఇంటి ముందు క్యూలో నిలబడి.. “నాకు గ్యాస్ కూపన్ ఇవ్వండి” అని అడగాల్సిన పరిస్థితి. 2013లో పత్రికలు తీసి చూడండి.. మీరు ఆశ్చర్యపోతారు. 2014లో మోదీకి పోటీగా వ్యూహం రూపొందించేందుకు ప్రయత్నించింది. అప్పుడు వాళ్లకు నేను తెలియదు.. బహుశా ఇప్పటికీ నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎప్పటికీ తెలియదు అనుకుంటా! వాళ్ల చర్చ ప్రజలకు ఏం వాగ్దానం చేయాలనే దాని గురించి... సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఇవ్వాలా? లేదా తొమ్మిది ఇవ్వాలా? అని. ఇంతగా వ్యవస్థ ప్రభుత్వీకరణలో చిక్కుకుంది. కానీ మేమేం చేశాం.. వ్యవస్థను ప్రజలకు దగ్గరకు చేరవేశాం. కలలో కూడా ఊహించని 10 కోట్లకు పైగా పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించాం. ఇంతకముందు గ్రామానికి గ్యాస్ సిలిండర్ వస్తే అది ధనవంతుల కోసమని సామాన్యులు అనుకునేవారు. “అది పెద్ద వాళ్ల ఇళ్లకే వస్తుంది.. మన ఇళ్లకి కాదు” అనేది వారి భావన. ఈ పరిస్థితిని మేం తిప్పికొట్టాం. గ్యాస్ పొయ్యలు కోట్లాది ఇళ్లలో వెలుగులు నింపాయి. ఇదే వ్యవస్థలో ప్రజాస్వామ్యీకరణ, ఇదే భారత రాజ్యాంగం స్ఫూర్తి.

మిత్రులారా,

అప్పటి జాతీయీకరణ కాలంలో మన ప్రభుత్వ సంస్థలకు, మన పీఎస్‌యూలకు తాళం వేసిన తర్వాత కాంగ్రెస్‌ పాలకులు ప్రశాంతంగా నిద్రపోయేవారు. బ్యాంకు ముంచిపోతున్నదా? తాళం వేసేయండి! కంపెనీ నష్టాల్లో ఉందా? మూసేయండి! వాళ్ల ఆలోచనేంటో తెలుసా? “మన జేబు ఖర్చవుతుందా? కాదు కదా! మరి ఎందుకు కష్టపడాలి?” మనం ఎందుకు కష్టపడి పనిచేయాలి. అది మునిగిపోతే అది మునిగిపోతుంది,  సహజ మరణం అవుతుందన్నది కాంగ్రెస్ ఆలోచన. కానీ ఈ ఆలోచనను కూడా మేం మార్చాం. మేం ఆ సంస్థలను మళ్లీ నమ్మాం. ఎల్‌ఐసీ అయినా, ఎస్‌బీఐ అయినా, ఇతర పెద్ద ప్రభుత్వ సంస్థలైనా.. అన్ని లాభాల్లో రికార్డులు నెలకొల్పుతున్నాయి.

మిత్రులారా,

ప్రభుత్వ విధానాలు ప్రభుత్వీకరణ కంటే ప్రజాస్వామ్యీకరణపై ఆధారపడి ఉన్నప్పుడు ప్రజల నైతికత ఎక్కువగా ఉంటుంది. కానీ కాంగ్రెస్ ఎన్నో దశాబ్దాలుగా  “పేదలను తొలగించండి, పేదరికాన్ని తొలగించండి” అదే నినాదాన్ని ఇచ్చింది. ప్రతి ఎన్నికలో అదే మాట. ఎర్ర కోట నుంచి ఈ కుటుంబం చేసిన అన్ని ప్రసంగాలను వినండి. ఈ కుటుంబం నుంచి ఎర్రకోట మీదకు ఎవరు వెళ్లినా.. వాళ్ల ప్రసంగాల్లో మొదటి నుంచి చివరి వరకు పేదరికం గురించి లేకుండా ఉండేది కాదు. ఇవాళ యూట్యూబ్‌లో వెతికినా ఆ ప్రసంగాలు దొరుకుతాయి. కానీ పేదరికం తగ్గిందా? లేదు. అదే మాప్రజాస్వామ్య విధానం ఫలితంగా గత 11 సంవత్సరాల్లో 25 కోట్ల మంది పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చింది. అందుకే దేశ ప్రజలు మాపై విశ్వాసం ఉంచుతున్నారు. అందుకే భారతదేశం అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. అందుకే భారత్ అన్‌స్టాపబుల్‌గా నిలిచింది.

మిత్రులారా,

నిరుపేదలు, తమ హక్కులను పొందలేని స్థితిలో ఉన్న వారికి సేవ చేసేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. వెనుకబడిన వర్గాలకు మేం ప్రాధాన్యతనిస్తున్నాం. వారి జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాం. పెద్ద పెద్ద చర్చల్లో ఈ అంశం గురించి అంతగా పట్టించుకోరు. దీనికి ఒక ఉదాహరణ చెబుతాను. ఇటీవల మేడ్ ఇన్ ఇండియా 4జీ స్టాక్ ను బీఎస్ఎన్ఎల్ ప్రారంభించిందన్న చర్చ జరిగింది.

 

మిత్రులారా,

ఇది మన దేశానికి చాలా పెద్ద విజయమని నేను చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ మనం గర్వంగా చెప్పుకోవచ్చు. 4జీ స్టాక్ తయారుచేసుకున్న ప్రపంచంలోని 5 అగ్రగామి దేశాల్లో భారత్ ఒకటి. భారత్ లో ఎటుచూసినా అన్ని వార్తల్లోనూ 2జీ, 2జీ, 2జీ అని వినిపించేది. 2జీలో అది జరిగింది, ఇది జరిగింది అంటూ వార్తా పత్రికల్లో అవే శీర్షికలు ఉండేవి. ఇప్పుడు నేను 4జీ గురించి మాట్లాడుతున్నాను. ఇది అందరికీ అర్థమయ్యేలా చెప్పటానికి కాస్త సమయం పడుతుంది. చెప్పి చెప్పి నాకు అలసట వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పతనం చేయాలనుకున్న ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్... ఇప్పుడు ఘన విజయాలు సాధిస్తోంది.

కానీ మిత్రులారా, 

దేశం సాధించిన విజయాల్లో ఇది ఒక అంశం మాత్రమే. మరో కోణంలో చూస్తే.. బీఎస్ఎన్ఎల్ 4జీ స్టాక్ ను మొదలుపెట్టిన రోజున దాదాపు లక్ష 4జీ మొబైల్ టవర్లను ప్రారంభించింది. దీని ఫలితం ఏంటంటే? ఇన్ని రోజులు అధిక వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులో లేని మారుమూల అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలకు ఆ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

మిత్రులారా,

ఇప్పుడు నేను మీకు మరో ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను. మనం ఎప్పుడూ 2జీ, 4జీ, 6జీ అని వింటుంటాం. అలా విన్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి, ఆలోచన చేసినప్పుడు, ఏదైనా కొత్తగా చేయాలనుకుంటాం. దేశం సాధించిన ఈ విజయంలోని మూడో ముఖ్యమైన విషయాన్ని ఇవాళ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు మీడియా కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇలాంటి చాలా విషయాలు వెనుకబడిపోయాయి. అయితే ఇలాంటి సదుపాయాలు మారుమూల ప్రాంత ప్రజల జీవితాలను ఎంతగానో మార్చుతాయి. మీరు ఈ-సంజీవని గురించి వినుండొచ్చు. ఈ ఉదాహరణే మీకు చెబుతాను. ఒక మారుమూల అటవీ ప్రాంతంలో ఒక కుటుంబం నివసిస్తుందని అనుకుందాం. ఆ కుటుంబంలోని ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ సమయంలో వాతావరణం అనుకూలించపోవటంతో అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని డాక్టర్ వద్దకు తీసుకెళ్లలేకపోయారు. అలాంటప్పుడు వాళ్లు ఏం చేస్తారు? ఆ పరిస్థితిలో అధిక వేగవంతమైన కనెక్టివిటీ ద్వారా ఈ-సంజీవని సర్వీసు వారికి సహకరిస్తుంది.

మిత్రులారా,

ఈ-సంజీవని యాప్ ద్వారా స్పెషలిస్ట్ వైద్యుడితో అనారోగ్యంతో ఉన్నవారు సంప్రదించి, మెరుగైన సేవలను పొందుతారు. 42 కోట్ల మంది ఇప్పటివరకు ఈ-సంజీవని ద్వారా ఓపీడీ సేవలు పొందారని తెలుసుకుంటే ఎన్డీటీవీ వీక్షకులు సంతోషిస్తారు. 4జీ, 2జీ అంటే కేవలం ఇంటర్నెట్ సదుపాయం కాదు.. ఇది మన జీవితంలో మార్పు తీసుకువచ్చే ఒక నూతన శక్తి. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను మీతో మాట్లాడే ఈ 12 గంటల్లోనే దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా ప్రజలు ఈ-సంజీవని యాప్ ద్వారా వైద్య సేవలు పొందారు. ఈ-సంజీవని ఒక సాధారణ సదుపాయం మాత్రమే కాదు.. ఒక నమ్మకం. ఎప్పుడు ఆపద వచ్చినా వైద్య సహాయం అందుతుందని ప్రజలకు ఇది భరోసానిస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ సమానావకాశాలు కల్పించటం వల్ల వచ్చే అద్భుతమైన ఫలితాలకు ఇది చక్కని ఉదాహరణ!

మిత్రులారా, 

బాధ్యతాయుత పాలన చేసే ప్రభుత్వం, ప్రజాస్వామ్యానికి అంకితమైన ప్రభుత్వం, రాజ్యాంగానికి కట్టుబడి ఉండే ప్రభుత్వం మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుని, ఉత్తమమైన విధానాలను రూపొందిస్తుంది. ప్రజల జీవన విధానాలను సులభతరం చేయటం, వారి పొదుపు మొత్తాలను పెంచటం అనే అంశాలపైనే మేం దృష్టి సారిస్తున్నాం. ఉదాహరణకు గతంలో రూ.300 ఉండే 1జీబీ డేటా ధర ఇప్పుడు రూ.10గా ఉంది. అంటే ప్రతి భారతీయుడికి ఏటా వేల రూపాయలు ఆదా అవుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేద ప్రజలు రూ.1.25 లక్షల కోట్ల వరకు ఆదా చేసుకోగలిగారు. పీఎం జన ఔషధి కేంద్రాల్లో 80 శాతం తగ్గింపు ధరతో ఔషధాలు లభిస్తుండటంతో ప్రజలు సుమారుగా రూ.40 వేల కోట్లు ఆదా చేసుకున్నారు. గుండె సమస్యలున్న వారికి అవసరమైన స్టంట్ల ధరలు తగ్గించటం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు ఏటా రూ.12 వేల కోట్లు ఆదా చేసుకుంటున్నారు.

 

మిత్రులారా,  

నిజాయితీగా పన్ను చెల్లించే వారికి కూడా మేం ప్రత్యక్ష ప్రయోజనాలు అందించాం. ఆదాయ పన్ను, జీఎస్టీలో భారీ తగ్గింపు లభించింది. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపు ఇచ్చాం. ప్రస్తుతం జీఎస్టీ పొదుపు ఉత్సవం పూర్తిస్థాయిలో జరుగుతోంది. ఎక్కడ చూసినా, గూగుల్ లో వెతికినా మార్కెట్ల సందడి కనిపిస్తోంది. జీఎస్టీ పొదుపు ఉత్సవమే ఇందుకు కారణం. ఈ క్రమంలో విక్రయాలకు సంబంధించి గత రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. ఆదాయ పన్ను, జీఎస్టీకి సంబంధించి తీసుకున్న రెండు నిర్ణయాల ద్వారా, దేశ ప్రజలు ఏడాదికి సుమారు రూ.2.5 లక్షల కోట్లు ఆదా చేయగలరని ఖచ్చితంగా చెప్పగలం.

మిత్రులారా,

ఇటీవల కాలంలో దేశం, ప్రపంచమంతా ఆపరేషన్ సింధూర్ గురించి చర్చించుకున్నాయి. ఇటీవలే మా మిత్రుడు రాహుల్ జీ కూడా ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు. ఆయన, సైనిక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కావటం వల్ల దీనిపై ఆయనకు సహజంగానే మక్కువ ఉంటుంది. సైనిక అంశాలు ఆయన రక్తంలోనే ఉంటాయి. ఆపరేషన్ సింధూర్ ను ఆయన గర్వంగా కొనియాడారు. దేశం, ప్రపంచం కూడా ప్రశంసించాయి. ఈ రోజు మరో అంశాన్ని మీ ముందు ప్రస్తావించాలనుకుంటున్నాను. ఇది కేవలం దేశ భద్రతకు మాత్రమే కాదు.. నా దేశ యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఇది నక్సలిజానికి సంబంధించిన అంశం. కొందరు నక్సలిజం అనే పేరును పెట్టినా.. నిజానికి ఇది మావోయిస్టుల ఉగ్రవాదం అని నా అభిప్రాయం. మావోయిస్టు తీవ్రవాదం కథను ఇవాళ మీకు చెప్పాలనుకుంటున్నాను. కాంగ్రెస్ పాలనలో అర్బన్ నక్సల్స్ వ్యవస్థ ఉండేది. ఈ అర్బన్ నక్సల్స్ ఆధిపత్యం చెలాయించేవారు.. ఇప్పటికీ చెలాయిస్తున్నారు. మావోయిస్టు ఉగ్రవాదానికి సంబంధించిన విషయాలేవీ దేశ ప్రజలకు తెలియకుండా వారు తీవ్రంగా ప్రయత్నించేవారు. మన దేశంలో ఉగ్రవాదం గురించి, ఆర్టికల్ 370 గురించి చాలా చర్చలు జరిగేవి. కానీ, కాంగ్రెస్ హయాంలో నగరాల్లో వృద్ధి చెందిన పలు సంస్థలను తమ ఆధీనంలోకి తీసుకున్న అర్బన్ నక్సల్స్, మావోయిస్టు తీవ్రవాదాన్ని దాచిపెట్టి దేశాన్ని చీకట్లోకి నెట్టేశారు. కొద్ది రోజుల కిందట చాలామంది మావోయిస్టు తీవ్రవాద బాధితులు ఢిల్లీకి వచ్చారు. చాలా బాధాకరమైన విషయం ఎంటంటే.. పెద్ద సంఖ్యలో వచ్చిన వారిలో కొందరికి కాళ్లు, మరికొందరికి చేతులు, ఇంకొందరికి కళ్లు లేవు. కొందరు శరీర భాగాలు కోల్పోయారు. మావోయిస్టు బాధితుల్లో... పేదవారు, గిరిజనులు, పల్లెల్లో నివసించే అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, రైతుల కుమారులు, తల్లులు చాలామంది కాళ్లు కోల్పోయారు. వారంతా ఢిల్లీకి వచ్చి ఏడు రోజులున్నారు. తమ సందేశాన్ని దేశ ప్రజలకు చేరవేయమని చేతులు జోడించి విన్నవించారు. వారంతా నిర్వహించిన ఒక పత్రికా సమావేశాన్ని మీలో ఎవరూ చూసుండకపోవచ్చు. విని ఉండకపోవచ్చు. ఇక్కడున్న మావోయిస్టు తీవ్రవాద కాంట్రాక్టర్లు, ఆ బాధితుల బాధాకరమైన కథను దేశ ప్రజలకు చేరకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ వ్యవస్థ దీని గురించి చర్చించేందుకు కూడా అనుమతించలేదు.  

మిత్రులారా,

దేశంలోని పెద్ద రాష్ట్రాలు నక్సలైట్ల హింస, మావోయిస్టుల తీవ్రవాదం గుప్పిట్లో ఉండేవి. మిగతా దేశమంతా రాజ్యాంగ విలువలతో నడుస్తున్నా, నక్సల్ ప్రభావిత ప్రాంతంలో మాత్రం దాని గురించి మాట్లాడే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. నేను ఒక విషయాన్ని బాధ్యతతో చెబుతున్నాను. గౌరవిస్తున్నామని రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్న వాళ్లు కూడా, ఆ రాజ్యాంగాన్ని నమ్మని మావోయిస్టులను రక్షించటానికి ఇప్పటికీ అహర్నిశలూ శ్రమిస్తున్నారు.

మిత్రులారా,

ప్రజలతో ఎన్నికైన ఏ ప్రభుత్వ ప్రభావమూ, రెడ్ కారిడార్ ప్రాంతంలో ఉండేది కాదు. సాయంత్రమైతే ఇంట్లోంచి రావటానికి ప్రజలు భయపడేవారు. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులు కూడా భద్రతతో తిరగాల్సి వచ్చేది.

మిత్రులారా,

మావోయిస్టుల హింస కారణంగా గత 50-55 ఏళ్లలో వేలాది మంది ప్రజలు మరణించారు. ఎంతో మంది భద్రతా సిబ్బంది బలైపోయారు. ఎంతో మంది యువకులను మనం కోల్పోయాం. నక్సలైట్లు, మావోయిస్టు ఉగ్రవాదులు పాఠశాలలు, ఆస్పత్రుల నిర్మాణానికి అనుమతించలేదు. ఆస్పత్రులు ఉన్నా, వైద్యులను కనీసం లోపలకు రానివ్వలేదు. ఎన్నో నిర్మాణాలను బాంబులతో కూల్చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చాలామంది ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉండిపోయారు. దీనివల్ల గిరిజనులు, దళితులు, పేదవాళ్లు ఎంతో నష్టపోయారు.

మిత్రులారా,  

దేశ యువతకు జరుగుతున్న తీవ్ర అన్యాయం, ఘోరమైన పాపం మావోయిస్టు తీవ్రవాదం. దేశ యువతను ఈ పరిస్థితిలో వదిలిపెట్టలేకపోతున్నాను. ఇంతకాలం నా మనసులో దాచుకున్న బాధను ఈ రోజు మీకు చెబుతున్నాను. కుమారులను పోగొట్టుకున్న తల్లుల బాధ నాకు తెలుసు. ఆ తల్లులు తమ కుమారులపై ఎన్నో ఆశలు పెట్టుకుని, వారి భవిష్యత్తు కోసం కలలు కంటారు. మావోయిస్టు అబద్ధపు మాటల్లో యువత చిక్కుకున్నారు. మావోయిస్టుల హింసకు బలయ్యారు. అందువల్ల దారితప్పిన యువతను జనజీవన స్రవంతిలో కలిపేందుకు 2014 నుంచి మా ప్రభుత్వం ప్రయత్నించింది. ఇవాళ మొదటిసారి దేశ ప్రజలకు నేను ఈ విషయాన్ని చెబుతున్నాను. ఇది విని ప్రజలు సంతోషిస్తారు. మమ్మల్ని ప్రశంసిస్తారు. కుమారుల్ని కోల్పోయిన తల్లులు మమ్మల్ని, దేశశక్తిని ఆశీర్వదిస్తారు. మా ప్రయత్నాల ఫలితాలను ఇవాళ దేశం చూస్తోంది. పదకొండేళ్ల కిందట వరకు దేశంలో 125కు పైగా జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండేది.

మిత్రులారా,  

మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య ఇవాళ 11కు తగ్గింది. ఇందుకోసం ఎంతో కృషి చేయాల్సి వచ్చిందని మీకు తెలుసు. ఆ 11 జిల్లాల్లో 3 జిల్లాలు మావోయిస్టుల హింస వల్ల ఎక్కువగా ఇబ్బందిపడుతున్నాయి.

మిత్రులారా,

దశాబ్ద కాలంలో వేల మంది నక్సలైట్లు లొంగిపోయారు. కేవలం 75 గంటల వ్యవధికి సంబంధించిన గణాంకాలను నేను చెప్తాను. ఇది మీడియాతో చర్చించే విషయం కాదని నాకు తెలుసు. కానీ, కేవలం 75 గంటల్లో 303 మంది నక్సలైట్లు లొంగిపోవటం నా జీవితంలో ఎంతో సంతృప్తినిచ్చే విషయం. గతంలో రైఫిళ్లు పట్టుకుని తిరిగిన 303 మంది ఇవాళ వాటిని వదిలేసి లొంగిపోయారు. లొంగిపోయిన వారు సాధారణ నక్సలైట్లు కాదు. కొంతమందిపై కోటి రూపాయలు, మరికొందరిపై 15 లక్షలు, ఇంకొందరిపై 5 లక్షల వరకు రివార్డులున్నాయి. ఈ నక్సలైట్ల నుంచి చాలా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్లంతా తుపాకులు, బాంబులు వదిలిపెట్టి దేశ రాజ్యాంగ విలువల పట్ల గౌరవంతో జీవించటానికి సిద్ధంగా ఉన్నారు. రాజ్యాంగాన్ని నిబద్ధతతో అనుసరించే ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పు దారిలో వెళ్లే వ్యక్తి వెనక్కి వచ్చి, ఆ రాజ్యాంగమే తనకు రక్షణ అని భావిస్తాడు. ఇప్పుడు వాళ్లు అభివృద్ధి చెందుతున్న జన స్రవంతిలోకి వస్తున్నారు. వారు సరైన మార్గంలో వెళ్లలేదని భావిస్తున్నారు. ఐదు దశాబ్దాలు గడిచాయి. వాళ్ల విలువైన సమయాన్ని కోల్పోయినా, ఆశించిన మార్పు రాలేదు. ప్రస్తుతం వారు భారత రాజ్యాంగంపై నమ్మకంతో ముందుకు సాగుతారు.

మిత్రులారా,

గతంలో చత్తీస్ గఢ్ లోని బస్తర్ లో ఇది జరిగింది.. అది జరిగింది.. ఒక బస్సును పేల్చేశారు... చాలామంది భద్రతా సిబ్బంది చనిపోయారు... అంటూ మీడియాలో వార్తలు వచ్చేవి. బస్తర్ ఒకప్పుడు మావోయిస్టులు, నక్సలైట్లకు బలమైన స్థావరంగా ఉండేది. ఇవాళ అదే బస్తర్ ను ఉదాహరణగా చెబుతున్నాను. ఇప్పుడు అక్కడి గిరిజన యువత బస్తర్ ఒలింపిక్స్ ని నిర్వహిస్తున్నారు. లక్షల మంది యువత ఈ బస్తర్ ఒలింపిక్స్ లో పాల్గొని తమ సత్తాను చాటుతున్నారు. ఇదే అసలైన మార్పు.

మిత్రులారా, 

మావోయిస్టు హింస నుంచి విముక్తి పొందిన ప్రాంతాల్లో ఈసారి దీపావళి వేడుకలు మరింత ఉల్లాసంగా జరగనున్నాయి. 50-55 ఏళ్లుగా దీపావళి అంటే తెలియనివారు ఇప్పుడు ఆ పండగ వాతావరణాన్ని చూస్తారు. మిత్రులారా, నేను కచ్చితంగా నమ్ముతున్నాను. మన కష్టం ఫలించి, అక్కడ కూడా ఆనందపు దీపాలు వెలుగుతాయి. దేశ ప్రజలకు, ఎన్డీటీవీ ప్రేక్షకులకు నేను ఇవాళ హామీ ఇస్తున్నాను. నక్సలిజం, మావోయిస్టు ప్రభావం నుంచి భారత్ పూర్తిగా విముక్తి పొందే రోజు ఎంతో దూరంలో లేదు. ఇది మోదీ గ్యారెంటీ.

మిత్రులారా,

మనది కేవలం అభివృద్ధికి సంబంధించిన ప్రయాణం మాత్రమే కాదు. ఇందులో అభివృద్ధి, గౌరవం రెండూ కలిసి సాగాలి. సమర్థంగా పనిచేసే పౌరులకు గౌరవం లభించాలి. సమర్థత మాత్రమే కాదు, సానుభూతి, కరుణ వంటివి ఆవిష్కరణ లక్ష్యం కావాలి. ఈ లక్ష్యం దిశగా మనం ముందుకు సాగాలి. ఇలాంటి వాటిని ముందుకు తీసుకెళ్లటంలో ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ లాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయి. దేశం కోసం మాట్లాడేందుకు నాకు అవకాశమిచ్చిన ఎన్డీటీవీకి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే, దీపావళి శుభాకాంక్షలు. 

ధన్యవాదాలు!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors

Media Coverage

PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 డిసెంబర్ 2025
December 13, 2025

PM Modi Citizens Celebrate India Rising: PM Modi's Leadership in Attracting Investments and Ensuring Security