భోపాల్‌లో పలు అభివృద్ధి పనుల ప్రారంభం.. శంకుస్థాపనలు చేసిన ప్రధానమంత్రి
లోకమాత దేవి అహల్యాబాయి హోల్కర్ పేరు మనలో భక్తిభావాన్ని నింపుతుంది.. ఆమె గొప్ప వ్యక్తిత్వం గురించి మాట్లాడటానికి మాటలు సరిపోవు
దేవి అహల్యాబాయి భారత వారసత్వానికి గొప్ప సంరక్షకురాలు
జాతి నిర్మాణంలో మన మహిళా శక్తి అమూల్య సహకారానికి మాతా అహల్యాబాయి ప్రతీక
మా ప్రభుత్వం ‘మహిళల నేతృత్వంలో అభివృద్ధి’ అనే దార్శనికతతో అభివృద్ధిని కొనసాగిస్తోంది
నమో డ్రోన్ దీదీ కార్యక్రమం గ్రామీణ మహిళలను ప్రోత్సహిస్తూ.. వారి ఆదాయాన్ని పెంచుతోంది
నేడు, మన ప్రధాన అంతరిక్ష ప్రయోగాలన్నింటిలో పెద్ద సంఖ్యలో మహిళా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు
ఆపరేషన్ సిందూర్ మన మహిళా శక్తి బలానికి చిహ్నం: ప్రధానమంత్రి

లోకమాత దేవి అహల్యా బాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ఈరోజు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన మహిళా సశక్తికరణ్ మహాసమ్మేళన్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భోపాల్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా 'మా భారతి'కి నివాళులు అర్పిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, భారత మహిళా శక్తి గొప్పతనాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు, వారు ఈ కార్యక్రమానికి రావడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు లోకమాత దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి.. ఇది 140 కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తిదాయకమైన సందర్భం, జాతి నిర్మాణంలో గొప్ప ప్రయత్నాలకు మద్దతునిచ్చే క్షణంగా ఈ సందర్భాన్ని ప్రధానమంత్రి అభివర్ణించారు. దేవి అహల్యాబాయిని ఉటంకిస్తూ, నిజమైన పాలన అంటే ప్రజలకు సేవ చేయడం, వారి జీవితాలను మెరుగుపరచడం అని ఆయన పునరుద్ఘాటించారు. నేటి కార్యక్రమం అహల్యాదేవి దార్శనికతను ప్రతిబింబిస్తూ, ఆమె ఆదర్శాలను ముందుకు తీసుకువెళుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇండోర్ మెట్రో ప్రారంభంతో పాటు, దాటియా, సత్నాలకు విమాన కనెక్టివిటీని జోడించడాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులు మధ్యప్రదేశ్‌లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తాయని, అభివృద్ధిని వేగవంతం చేస్తాయని అలాగే కొత్త ఉపాధి అవకాశాలనూ సృష్టిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి పనుల ప్రారంభ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.

లోకమాత దేవి అహల్యాబాయి హోల్కర్ పేరు వినగానే మనసు భక్తిభావంతో నిండిపోతుందన్న ప్రధానమంత్రి, ఆమె అద్భుతమైన వ్యక్తిత్వాన్ని వర్ణించడానికి మాటలు చాలవన్నారు. దేవి అహల్యాబాయి దృఢ సంకల్పం, అంకితభావాలకు ప్రతీకగా నిలుస్తారనీ, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ పరివర్తనాత్మక ఫలితాలను సాధించవచ్చని ఆమె నిరూపించారని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. చరిత్రను ప్రస్తావిస్తూ, రెండున్నర నుంచి మూడు శతాబ్దాల క్రితం, దేశం అణచివేతకు గురైన సందర్భంలో అసాధారణమైన విజయాలను సాధించడం.. తరతరాలు ఆ విజయాలను గురించి చర్చించుటను కొనసాగించడం అంత తేలికైన విషయం కాదని ఆయన తెలిపారు.
 

లోకమాత అహల్యాబాయి హోల్కర్ ప్రజా సేవను దైవ సేవగా భావించేవారని స్పష్టం చేసిన ప్రధానమంత్రి, ఆమె ఎల్లప్పుడూ తన వెంట శివలింగాన్ని తీసుకెళ్లేవారని.. ఇది ఆమెకు గల భక్తిభావాన్ని సూచిస్తుందన్నారు. ఆమె కాలంలోని సవాళ్లను గుర్తుచేసుకుంటూ, అటువంటి యుగంలో ఒక రాష్ట్రాన్ని నడిపించడం ముళ్ల కిరీటం ధరించడంతో సమానమని ఆయన అభివర్ణించారు. అయినప్పటికీ, లోకమాత అహల్యాబాయి తన రాష్ట్ర శ్రేయస్సుకు దిశానిర్దేశం చేసి, పేదలకు సాధికారత కల్పించేందుకు తనను తాను అంకితం చేసుకున్నారని తెలిపారు. "లోకమాత అహల్యాబాయి భారత వారసత్వానికి గొప్ప సంరక్షకురాలు" అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశ సంస్కృతి, దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు దాడికి గురైన సమయంలో, వాటిని పరిరక్షించే బాధ్యతను ఆమె స్వీకరించారని ఆయన పేర్కొన్నారు. కాశీ విశ్వనాథ ఆలయం సహా దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల పునరుద్ధరణకు ఆమె చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. లోకమాత అహల్యాబాయి విస్తృతమైన అభివృద్ధి పనులు చేపట్టిన వారణాసి నగరంలోనే, తానూ సేవ చేసే అవకాశం పొందడం తనకు దక్కిన గౌరవమని ఆయన పేర్కొన్నారు.

"మాతా అహల్యాబాయి పేదలు, అణగారిన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే ఆదర్శప్రాయమైన పాలనా నమూనాను అమలు చేశారు" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఉపాధిని, వ్యవస్థాపకతను మెరుగుపరిచేందుకు ఆమె అనేక కార్యక్రమాలను ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల ఆధారిత కుటీర పరిశ్రమలు, చేతివృత్తులను అహల్యా దేవి ఎంతగానో ప్రోత్సహించారన్నారు. వ్యవసాయ దిగుబడులను పెంచడానికి, చిన్న కాలువలు అభివృద్ధి చేయడం సహా, విస్తృతమైన జల సంరక్షణ ప్రయత్నాలను ఆమె చేపట్టారనీ, సుమారు 250-300 సంవత్సరాల క్రితమే అనేక చెరువులను నిర్మించారని ప్రధానమంత్రి వివరించారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి పత్తి, సుగంధ ద్రవ్యాల సాగును ఆమె ప్రోత్సహించారని తెలిపారు. గిరిజన తెగలు, సంచార సమూహాల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు నిరుపయోగంగా ఉన్న భూముల్లో వారు వ్యవసాయం చేసుకుని ఉపాధి పొందేలా అహల్యా దేవి ప్రణాళిక చేశారని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. గిరిజన మహిళ అయిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము మార్గదర్శనంలో పనిచేయడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. ప్రపంచ ప్రఖ్యాత మహేశ్వరి చీరల కోసం కొత్త పరిశ్రమలను స్థాపించడం, దేశంలోని నేత కార్మికులకు గణనీయ ప్రయోజనం చేకూర్చడం ద్వారా వస్త్ర రంగానికి దేవి అహల్యాబాయి అందించిన సహకారాన్ని ఆయన ప్రశంసించారు. 250-300 సంవత్సరాల క్రితం గుజరాత్‌లోని జునాగఢ్ నుంచి చీరలను నేసే కొన్ని కుటుంబాలను దేవి అహల్యాబాయి ఆహ్వానించి, చీరల పరిశ్రమను ప్రారంభించారని ఆయన వివరించారు.
 

"నాటి కాలంలో చర్చించడానికి కూడా భయపడే విషయాలు అయిన.. బాలికల వివాహానికి కనీస వయస్సు పెంపు, మహిళలకు ఆస్తి హక్కును కల్పించడం, వితంతువుల పునర్వివాహానికి మద్దతు వంటి ముఖ్యమైన సామాజిక సంస్కరణల కోసం పాటుపడిన దేవి అహల్యాబాయి హోల్కర్ చిరస్మరణీయులు" అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సామాజిక సవాళ్లు ఉన్నప్పటికీ, దేవి అహల్యాబాయి ఈ ప్రగతిశీల సంస్కరణలకు బలంగా మద్దతు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఆమె మాల్వా సైన్యంలో ఒక ప్రత్యేక మహిళా విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి, గ్రామాల్లో మహిళా భద్రతా సమూహాలను స్థాపించి, మహిళల రక్షణ.. సాధికారతకు కృషి చేశారని తెలిపారు. "మాతా అహల్యాబాయి దేశ నిర్మాణంలో మహిళల అమూల్యమైన సహకారానికి ప్రతీకగా నిలుస్తారు" అని వ్యాఖ్యానించిన శ్రీ నరేంద్ర మోదీ.. ఆమెకు నివాళులు అర్పిస్తూ, అందరిపై లోకమాత నిరంతర ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.
 

మనం పొందే ప్రతిదానితో మనం ప్రజలకు రుణపడుతామని, అందుకే ఆ రుణం తిరిగి చెల్లించాలని దేవి అహల్యాబాయి హోల్కర్ చేసిన స్ఫూర్తిదాయక ప్రకటనను గుర్తుచేసుకుంటూ, తమ ప్రభుత్వం అహల్యాదేవి ఆచరించిన విలువలకు అనుగుణంగా పనిచేస్తోందనీ, తమ పాలన మంత్రంగా 'నాగరిక్ దేవో భవ' సూత్రాన్ని సమర్థిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మహిళల నేతృత్వంలో అభివృద్ధి అనే దార్శనికత దేశ పురోగతికి కేంద్రంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అందించే ప్రతీ పథకం తల్లులు, సోదరీమణులు, ఆడబిడ్డలకు సాధికారత కల్పించే లక్ష్యానికి అనుగుణంగానే ఉంటుందని స్పష్టం చేశారు. నాలుగు కోట్ల ఇళ్ళు నిరుపేదల కోసం నిర్మించామని, వాటిలో ఎక్కువ భాగం మహిళల పేర్లతోనే రిజిస్టర్ అయ్యాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ మహిళల్లో చాలా మంది తమ పేరుతో ఆస్తి హక్కులను కలిగి ఉండడం ఇదే మొదటిసారి అని, ఈ విధంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలను మొదటిసారిగా ఇంటి యజమానులను చేసిన చారిత్రాత్మక మార్పును ఇది సూచిస్తుందని ఆయన తెలిపారు.

 

కొత్త సాంకేతికలకు మహిళలను దూరంగా ఉంచిన కాలం ఒకప్పుడు ఉండేదని ప్రధానమంత్రి ప్రధానంగా పేర్కొన్నారు. దేశం ఆ కాలాన్ని దాటి ముందుకు సాగిందని, మహిళలు సాంకేతిక పురోగతిలో చురుగ్గా భాగస్వాములౌతున్నారని.. ఆధునిక సాంకేతికతల్లో మహిళలు, కుమార్తెలు నాయకత్వ పాత్రలు పోషించేలా చూసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వ్యవసాయంలో డ్రోన్ విప్లవాన్ని దీనికి ఉదాహరణగా బెబుతూ.. గ్రామీణ మహిళలు ఈ పరివర్తనకు నాయకత్వం వహిస్తున్నారని ప్రధానంగా చెప్పారు. "నమో డ్రోన్ దీదీ కార్యక్రమం గ్రామీణ మహిళల విశ్వాసాన్ని పెంచుతోంది. వారి ఆదాయ అవకాశాలను మెరుగుపరుస్తోంది. వారికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తోంది" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

 

దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఆడబిడ్డలు శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజినీర్లు, పైలట్లుగా జీవిస్తున్నారని మోదీ ప్రధానంగా చెప్పారు. శాస్త్ర విజ్ఞానం, గణిత విద్యలో బాలికల నమోదు క్రమంగా పెరుగుతోందని అన్నారు. "నేడు మన ప్రధాన అంతరిక్ష కార్యకలాపాలన్నింటిలోనూ పెద్ద సంఖ్యలో మహిళా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు" అని అన్నారు. చంద్రయాన్-3 మిషన్‌లో 100 మందికి పైగా మహిళా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు భాగస్వామ్యమయ్యారని అన్నారు. దేశంలోని దాదాపు 45% అంకురాలకు కనీసం ఒక మహిళ డైరెక్టర్‌గా ఉన్నారని, ఈ సంఖ్య పెరుగుతూనే ఉన్నట్లు  పేర్కొన్నారు.

విధాన రూపకల్పనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం నిబద్ధతను పునరుద్ఘాటించిన ఆయన.. గత దశాబ్దంలో ఈ లక్ష్యాన్ని సాధించడానికి తీసుకున్న ప్రగతిశీల చర్యలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశంలో తొలిసారిగా రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రిగా మహిళ పూర్తికాలం పనిచేశారని అన్నారు. పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు మహిళల ప్రాతినిధ్యం క్రమంగా పెరిగిందని, ప్రస్తుతం 75 మంది మహిళలు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారని ప్రధానంగా తెలిపారు. ఈ సంఖ్యను మరింత పెంచే ప్రాముఖ్యతను చెప్పారు. నారీ శక్తి వందన్ అధినియం ఈ దార్శనికతను ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ చట్టం చేయటం సంవత్సరాల తరబడి జాప్యమైనప్పటికీ, తమ ప్రభుత్వం విజయవంతంగా ఆమోదించి పార్లమెంటు, శాసనసభలలో మహిళా రిజర్వేషన్లను పటిష్టం చేసిందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ప్రతి స్థాయిలో, ప్రతి రంగంలో మహిళలకు సాధికారత కల్పిస్తోందని పునరుద్ఘాటించారు.

"భారతదేశం లోతైన సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. ఇక్కడ సిందూరం స్త్రీ బలాన్ని సూచిస్తుంది" అని మోదీ ప్రధానంగా చెప్పారు. రాముడి భక్తిలో మునిగిపోయిన హనుమంతుడు కూడా సిందూరంతో తనను తాను అలంకరించుకున్నాడని, శక్తిని పూజించే సంప్రదాయంలో దీనిని సమర్పిస్తారని పేర్కొన్నారు. "సిందూరం ఇప్పుడు భారత పరాక్రమానికి చిహ్నంగా మారింది" అని వ్యాఖ్యానించారు.
 

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ.. ఉగ్రవాదులు భారతీయుల రక్తాన్ని చిందించడమే కాకుండా, దేశ సాంస్కృతిక నైతికతను దెబ్బతీసేందుకు, సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించారని ఆయన అన్నారు. ముఖ్యంగా వారు భారతదేశ నారీ శక్తిని సవాలు చేశారు. ఈ సవాలు ఉగ్రవాదులకు, వారి నిర్వాహకులకు ప్రాణాంతకంగా మారింది. "భారత చరిత్రలో అతిపెద్ద, అత్యంత విజయవంతమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఆపరేషన్ సిందూర్" అని ప్రధానంగా వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ దళాలు ఎప్పుడూ ఊహించని ప్రదేశాలలో ఆపరేషన్ చేపట్టిన భారత సాయుధ దళాలు ఉగ్రవాద స్థావరాలను కూల్చివేసాయని ప్రధానంగా చెప్పారు. ఉగ్రవాదం ద్వారా పరోక్ష యుద్ధాలను సహించబోమని ఆపరేషన్ సిందూర్ స్పష్టమైన సందేశాన్ని పంపిందని అన్నారు. భారత్‌ తన భూభాగంలోని ముప్పులను తొలగించడమే కాకుండా, ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే వారు కూడా భారీ మూల్యం చెల్లించేలా చేస్తుందని ప్రధానంగా పేర్కొన్నారు. "ప్రతి భారతీయుడు ఇప్పుడు అదే భావనను కలిగి ఉన్నారు. మీరు బుల్లెట్లను వాడితే మీరు ఫిరంగి గుండ్లను ఎదుర్కొంటారు" అని వ్యాఖ్యానించారు.

"ఆపరేషన్ సిందూర్ భారత నారీ శక్తి బలం, పరాక్రమానికి నిదర్శనం" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పోషించిన కీలక పాత్రను ఆయన ప్రధానంగా చెప్పారు. జమ్మూ నుంచి పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వరకు గణనీయమైన సంఖ్యలో బీఎస్ఎఫ్ మహిళా సిబ్బంది ముందు వరుసలో ఉన్నారని పేర్కొన్నారు. సరిహద్దులో ప్రత్యర్థి కాల్పులకు ప్రతిస్పందనను.. కమాండ్, కంట్రోల్ కేంద్రాలలో, అలాగే శత్రు స్థానాలను నిర్మూలించడంలో వారి చురుకైన భాగస్వామ్యాన్ని ఆయన ప్రశంసించారు. దేశ రక్షణలో భారత ఆడ బిడ్డల సామర్థ్యాన్ని ప్రపంచం తెలుసుకుంటోందని అన్నారు. గత దశాబ్దంలో భద్రతా దళాలలో మహిళల పాత్రను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ప్రధానంగా చెప్పారు. బాలికల కోసం సైనిక్ పాఠశాలల ద్వారాలు తెరిచామని, ఇది ఒక చారిత్రాత్మక అడుగు అని అన్నారు. 2014లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) క్యాడెట్లలో 25% మాత్రమే మహిళలు ఉన్నారని, నేడు వారి భాగస్వామ్యం 50%కి చేరినట్లు తెలిపారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) నుంచి మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు బయటకు రావటాన్ని ఒక కీలక ఘట్టమని, ఇది వేడుక చేసుకోవాల్సిన సందర్భమని అన్నారు. ఆర్మీ, నేవీ, వైమానిక దళాల్లో ప్రస్తుతం మహిళలు ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారని ప్రధానంగా చెప్పారు. యుద్ధ విమానాల నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌక వరకు మహిళా అధికారులు తమ ధైర్యసాహసాలను, నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారని.. దేశ రక్షణ దళాలలో పెరుగుతున్న వారి పాత్రను తెలియజేస్తోందని అన్నారు.

భారత నావికా సాగర్ పరిక్రమను ప్రస్తావిస్తూ ఇటీవల భారత నావికాదళానికి చెందిన మహిళలు ప్రదర్శించిన ధైర్యసాహసాలపై ప్రధాని మాట్లాడారు. ఇద్దరు ధైర్యవంతులైన మహిళా అధికారులు దాదాపు 250 రోజుల సముద్ర ప్రయాణాన్ని పూర్తి చేసి, ప్రపంచాన్ని చుట్టి వచ్చారని పేర్కొన్నారు. కేవలం గాలితో నడిచే పడవను ఉపయోగించి వేల కిలోమీటర్లు ప్రయాణించి, కనుచూపు మేరలో భూమి లేకుండా సముద్రంలోనే ఎక్కువసేపు ప్రయాణించిన అద్భుతమైన ఘనతను ఆయన ప్రధానంగా చెప్పారు. వారు తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, తుఫానులను ఎదుర్కొనప్పటికీ ధృడంగా నిలిచారని అన్నారు. భారత ఆడబిడ్డలు అత్యంత తీవ్రమైన సవాళ్లను కూడా జయించగల సామర్థ్యానికి వారి విజయం నిదర్శనమని వ్యాఖ్యానించారు. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో అయినా, సరిహద్దు ముప్పులను ఎదుర్కోవడంలో అయినా, దేశాన్ని రక్షించడంలో అయినా పెరుగుతున్న వారి పాత్రను ఆయన ప్రధానంగా తెలిపారు. భారత నారీ శక్తి బలం, దృఢ సంకల్పానికి దేవి అహల్యాబాయి భూమి నుంచి వందనం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
 

తన పాలనలో దేవి అహల్యాబాయి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా భారత ఘన వారసత్వాన్ని కూడా కాపాడారని ప్రధానమంత్రి చెప్పారు. ఆధునిక భారత్‌ అదే మార్గాన్ని అనుసరిస్తోందని, సాంస్కృతిక పరిరక్షణతో పురోగతిని సమతుల్యం చేస్తోందని ప్రధానంగా చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడంలో దేశానికి ఉన్న నిబద్ధతను ఆయన తెలిపారు. నేటి కార్యక్రమాన్ని ఒక ఉదాహరణగా ప్రస్తావించిన ఆయన.. మధ్యప్రదేశ్ తన మొదటి మెట్రో రైలును పొందిందని, ఇది ఒక కీలక ఘట్టమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పరిశుభ్రతకు గుర్తింపు పొందిన ఇండోర్‌ను ఇప్పుడు దానికి మెట్రోతో కూడా గుర్తింపు లభిస్తుందని అన్నారు. భోపాల్‌లో మెట్రో నిర్మాణం కూడా వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రత్లాం-నాగ్డా మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించడానికి ఆమోదం తెలిపిందని, దీనివల్ల రైలు రాకపోకలు పెరిగి, రద్దీ తగ్గుతుందని ప్రధాని పేర్కొన్నారు. అదనంగా ఇండోర్-మన్మాడ్ రైలు ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని.. ఈ ప్రాంతంలో అనుసంధానత, మౌలిక సదుపాయాలను మరింత పెంచుతుందని ప్రధానంగా తెలిపారు. దాతియా, సత్నా ఇప్పుడు దేశంలోని విమాన మార్గాలలో ఉన్నాయని.. బుందేల్‌ఖండ్, వింధ్య ప్రాంతాలలో ఇది అనుసంధానతను మెరుగుపరుస్తోందని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి వల్ల పీతాంబర మాత, శారదా దేవి మాత, పూజ్యమైన చిత్రకూట్ ధామ్ వంటి పవిత్ర స్థలాలకు సులభంగా చేరుకోవడానికి వీలువుతుందని అన్నారు.

"చరిత్రలో కీలకమైన సమయంలో భారత్ ఉంది. ఇప్పుడు దేశం భద్రత, బలం, సాంస్కృతిక వారసత్వంపై ఏకకాలంలో పనిచేయాలి" అని మోదీ ఉద్ఘాటిస్తూ పెరిగిన కృషిని ప్రధానంగా ప్రస్తావించారు. దేశ భవిష్యత్తును రూపొందించడంలో మాతలు, సోదరీమణులు, బిడ్డలతో కూడుకున్న మాతృశక్తి ముఖ్యమైన పాత్రను తెలిపారు. రాణి లక్ష్మీబాయి, రాణి దుర్గావతి, రాణి కమలాపతి, అవంతిబాయి లోధి, కిట్టూర్ రాణి చెన్నమ్మ, రాణి గైడెన్‌లియు, వేలు నాచియార్, సావిత్రిబాయి ఫూలే వంటి గొప్ప మహిళా నాయకుల వారసత్వంతో పాటు లోకమాత అహల్యాబాయి ప్రేరణను ప్రస్తావించారు. ఈ పేర్లలో ప్రతి ఒక్కటి దేశాన్ని గర్వంతో నింపుతోందని అన్న ఆయన.. లోకమాత అహల్యాబాయి 300వ జయంతి భావి తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే శతాబ్దాల పాటు సశక్త భారత్ పునాదులను బలోపేతం చేయాలని కోరుతూ ప్రధానమంత్రి మోదీ ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ ఛగన్భాయ్ పటేల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం

ప్రధానమంత్రి లోక్‌మాతా దేవి అహల్యాబాయి మహిళా సశక్తీకరణ్ మహాసమ్మేళనంలో పాల్గొని స్మారక తపాలా బిళ్లను, లోక్‌మాతా దేవి అహల్యాబాయితో ఉన్న ప్రత్యేక నాణేన్ని  విడుదల చేశారు. రూ. 300 నాణెంపై అహల్యాబాయి హోల్కర్ చిత్రపటం ఉంటుంది. గిరిజన, జానపద, సంప్రదాయ కళలలో కృషి చేసిన మహిళా కళాకారిణికి జాతీయ దేవి అహల్యాబాయి అవార్డును కూడా ఆయన ప్రదానం చేశారు.
 

చివరి మైలు వరకు విమాన అనుసంధానతకు భారీ ఊతం ఇస్తూ  ప్రధానమంత్రి దాటియా, సత్నా విమానాశ్రయాలను ప్రారంభించారు. వింధ్య ప్రాంతంలో పరిశ్రమ, పర్యాటకం, విద్య, ఆరోగ్య సంరక్షణకు ఇది నూతన అవకాశాల ద్వారాలను తెరుస్తుంది.
 

నగరాల్లో ప్రయాణాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలనే ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి ఇండోర్ మెట్రో ఎల్లో మార్గంలోని సూపర్ ప్రియారిటీ కారిడార్‌లో ప్రయాణీకుల సేవలను ప్రారంభించారు. ఇది ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంతో పాటు ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించనుంది.
 

480 కోట్ల రూపాయల విలువైన 1,271 అటల్ గ్రామ సుశాసన్ భవనాల నిర్మాణానికి మొదటి విడత నిధులను ప్రధానమంత్రి విడుదల చేశారు. ఈ భవనాలు గ్రామ పంచాయతీలకు శాశ్వత మౌలిక సదుపాయాలను కల్పిస్తాయి. పరిపాలనా విధులను, సమావేశాలను నిర్వహించడానికి.. రికార్డులను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఇవి సహాయపడనున్నాయి. 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
One of the world’s first canal-top solar projects placed a 750-meter solar array above an Indian irrigation canal, generating clean power while saving an estimated 9 million liters of water each year

Media Coverage

One of the world’s first canal-top solar projects placed a 750-meter solar array above an Indian irrigation canal, generating clean power while saving an estimated 9 million liters of water each year
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 జూలై 2026
July 17, 2026

Green Trains, Private Rockets & Global Partnerships — PM Modi’s New India is Playing to Win