దేశానికీ.. ముఖ్యంగా మిజోరం ప్రజలకు ఈ రోజు చరిత్రాత్మకం
నేటి నుంచి భారత రైల్వే పటంలో కనిపించనున్న ఐజ్వాల్
భారత అభివృద్ధి ఇంజినుగా మారుతున్న ఈశాన్య భారతం
యాక్ట్ ఈస్ట్ పాలసీ.. అభివృద్ధి చెందుతున్న నార్త్ ఈస్ట్ ఎకనమిక్ కారిడార్..
తదుపరితరం జీఎస్టీ అనేక ఉత్పత్తులపై పన్నులు తగ్గించింది..

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మిజోరంలోని ఐజ్వాల్‌లో రూ. 9000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించారు. రైల్వేలు, రోడ్డు మార్గాలు, ఇంధనం, క్రీడలు వంటి అనేక రంగాలకు ఈ ప్రాజెక్టులు ప్రయోజనం కలిగించనున్నాయి. వీడియో అనుసంధానం ద్వారా సభికులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి.. నీలి పర్వతాలతో కూడిన అందమైన ఈ భూమిని రక్షిస్తున్న భగవాన్ పతియాన్‌కు నమస్కరించారు. తాను మిజోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో ఉన్నానన్న ప్రధానమంత్రి.. ప్రతికూల వాతావరణం కారణంగా ఐజ్వాల్‌లో ప్రజలను కలుసుకోలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. ఈ మాధ్యమం ద్వారా కూడా తాను ప్రజల ప్రేమ, ఆప్యాయతల అనుభూతిని పొందగలనని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

స్వాతంత్య్రోద్యమం.. జాతి నిర్మాణం.. వంటి అన్ని సందర్భాల్లోనూ మిజోరం ప్రజలు ఎల్లప్పుడూ దేశ శ్రేయస్సు కోసం తమ వంతు కృషి చేయడానికి ముందుకు వచ్చారని శ్రీ మోదీ పేర్కొన్నారు. లాల్ను రోపులియాని, పసల్తా ఖువాంగ్‌చెరా వంటి మహనీయుల ఆదర్శాలు దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. త్యాగం, సేవ, ధైర్యం, కరుణలు మిజో సమాజంతో లోతుగా ముడిపడిన విలువలుగా శ్రీ మోదీ పేర్కొన్నారు. “భారత అభివృద్ధి ప్రయాణంలో మిజోరం పాత్ర కీలకం” అని ప్రధానమంత్రి తెలిపారు.

ఈ రోజును దేశానికీ, ముఖ్యంగా మిజోరం ప్రజలకు చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించిన శ్రీ నరేంద్ర మోదీ.. “ఈ రోజు నుంచి భారత రైల్వే పటంలో ఐజ్వాల్ కనిపిస్తుంది” అని తెలిపారు. కొన్ని సంవత్సరాల కిందట ఐజ్వాల్ రైల్వే మార్గానికి పునాది వేసే అవకాశం తనకు లభించిందని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. సగర్వంగా ఈ రైల్వే మార్గాన్ని దేశ ప్రజలకు అంకితం చేస్తున్నామని ప్రకటించారు. సంక్లిష్ట భూభాగం సహా అనేక సవాళ్లు ఉన్నప్పటికీ బైరాబి-సైరాంగ్ రైలు మార్గం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇందుకు కారణమైన ఇంజనీర్ల నైపుణ్యాలను, కార్మికుల స్ఫూర్తిని ఆయన ప్రశంసించారు. వారి కృషి ఈ విజయాన్ని సుసాధ్యం చేసిందన్నారు.

 

దేశంతో ప్రజల హృదయాలు ఎల్లప్పుడూ నేరుగా అనుసంధానమై ఉన్నాయన్న ప్రధానమంత్రి.. మొదటిసారిగా రాజధాని ఎక్స్‌ప్రెస్ ద్వారా మిజోరంలోని సైరాంగ్‌ను ఢిల్లీతో నేరుగా అనుసంధానిస్తున్నట్లు ప్రకటించారు. ఇది కేవలం రైల్వే అనుసంధానం మాత్రమే కాదనీ.. పరివర్తనకు జీవనాధారమన్నారు. ఇది మిజోరం ప్రజల జీవితాలనూ, జీవనోపాధినీ విప్లవాత్మకంగా మారుస్తుందని ఆయన స్పష్టం చేశారు. మిజోరం రైతులు, వ్యాపారులు ఇప్పుడు దేశవ్యాప్తంగా మరిన్ని మార్కెట్లను చేరుకోగలరని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ప్రజలకు మరిన్ని ఎంపికలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఈ అభివృద్ధితో పర్యాటకం, రవాణా, ఆతిథ్య రంగాల్లో ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు చాలా కాలంగా ఓటు బ్యాంకు రాజకీయాలనే ఆచరిస్తున్నాయని ప్రధానమంత్రి విమర్శించారు. వారి దృష్టి ఎక్కువగా ఓట్లు.. సీట్లు ఉన్న ప్రదేశాలపైనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మిజోరం వంటి రాష్ట్రాలతో పాటు మొత్తం ఈశాన్య ప్రాంతం వారి ఈ వైఖరి కారణంగా తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. ప్రస్తుత విధానం చాలా భిన్నంగా ఉందనీ.. గతంలో నిర్లక్ష్యానికి గురైన వారు ఇప్పుడు ముందంజలో ఉన్నారని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఒకప్పుడు అణిచివేతకు గురైన వారు ఇప్పుడు ప్రధాన స్రవంతిలో భాగమయ్యారని ఆయన పేర్కొన్నారు. గత 11 సంవత్సరాలుగా ఈశాన్య ప్రాంత అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం స్థిరంగా కృషిచేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ ప్రాంతం భారత వృద్ధికి ఇంజిన్‌గా మారుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

గత కొన్ని సంవత్సరాలుగా ఈశాన్యంలోని అనేక రాష్ట్రాలు భారత రైల్వే పటంలో తొలిసారిగా స్థానం సంపాదిస్తున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. గ్రామీణ రహదారులు, హైవేలు, మొబైల్-ఇంటర్నెట్ కనెక్షన్లు, విద్యుత్, కుళాయి నీరు, ఎల్‌పీజీ కనెక్షన్లు వంటి అన్ని రకాల కనెక్టివిటీలను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం నిరంతర కృషి చేసిందని ఆయన పేర్కొన్నారు. విమాన ప్రయాణం కోసం ఉడాన్ పథకం ద్వారా మిజోరం కూడా ప్రయోజనం పొందుతుందని ఆయన ప్రకటించారు. ఈ ప్రాంతంలో త్వరలోనే హెలికాప్టర్ సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇది మిజోరంలోని మారుమూల ప్రాంతాల అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

"యాక్ట్ ఈస్ట్ పాలసీ.. అభివృద్ధి చెందుతున్న నార్త్ ఈస్ట్ ఎకనమిక్ కారిడార్.. రెండింటిలోనూ మిజోరం పాత్ర కీలకమైనది" అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. కలడాన్ మల్టీ-మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్, సైరాంగ్-మాంగ్బుచువా రైలు మార్గం ఏర్పాటుతో ఆగ్నేయాసియా ద్వారా మిజోరం బంగాళాఖాతంతో అనుసంధానం అవుతుందన్నారు. ఈ అనుసంధానం ఈశాన్య భారతంతో పాటు ఆగ్నేయాసియా అంతటా వాణిజ్యం, పర్యాటకాన్ని పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

 

మిజోరం ప్రతిభావంతులైన యువతను కలిగి ఉండే వరం పొందినదని పేర్కొన్న శ్రీ నరేంద్ర మోదీ.. వారిని శక్తిమంతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. మిజోరంలో ఇప్పటికే 11 ఏకలవ్య గురుకుల పాఠశాలలు స్థాపించగా.. మరో 6 పాఠశాలల్ని ప్రారంభించేందుకు పనులు జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు. ఈశాన్య ప్రాంతం అంకురసంస్థలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో దాదాపు 4,500 అంకురసంస్థలు, 25 ఇంక్యుబేటర్లు పనిచేస్తుండడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మిజోరం యువత ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ.. అందరి కోసం కొత్త అవకాశాలనూ సృష్టిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రపంచ క్రీడల ప్రధాన కేంద్రంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్న ప్రధానమంత్రి.. ఈ వృద్ధి దేశంలో క్రీడా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికీ తోడ్పడుతోందని వ్యాఖ్యానించారు. క్రీడల్లో మిజోరం గొప్ప సాంప్రదాయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఫుట్‌బాల్, ఇతర క్రీడల్లో అనేక మంది ఛాంపియన్లను అందించిన మిజోరం ఘనతను ఆయన కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ క్రీడా విధానాలు మిజోరానికి కూడా ప్రయోజనం చేకూరుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఖేలో ఇండియా పథకం కింద ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు మద్దతునిస్తున్నట్లు శ్రీ మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇటీవల ఖేలో ఇండియా ఖేల్ నీతి పేరుతో జాతీయ క్రీడా విధానాన్ని ప్రవేశపెట్టిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం మిజోరం యువతకు అనేక కొత్త అవకాశాలను కల్పిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

దేశవిదేశాల్లోనూ అందమైన సంస్కృతికి రాయబారిగా ఈశాన్య ప్రాంతం పోషిస్తున్న పాత్ర పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈశాన్య ప్రాంత సామర్థ్యాన్ని ప్రదర్శించే వేదికలను ప్రోత్సహించాల్సిన ప్రాముఖ్యాన్ని ఆయన స్పష్టం చేశారు. కొన్ని నెలల కిందట ఢిల్లీలో జరిగిన అష్టలక్ష్మీ ఉత్సవంలో తాను పాల్గొన్న విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. ఈ ఉత్సవంలో ఈశాన్య ప్రాంత వస్త్రాలు, హస్తకళలు, జీఐ- ట్యాగ్ పొందిన ఉత్పత్తులు, పర్యాటక సామర్థ్యాన్నీ ఘనంగా ప్రదర్శించారని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైజింగ్ నార్త్ ఈస్ట్ సమ్మిట్‌లో పెట్టుబడిదారులు ఈ ప్రాంత విస్తార సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలని తాను ప్రోత్సహించానన్నారు. ఈ సదస్సు భారీ పెట్టుబడులు, ప్రాజెక్టులకు మార్గం సుగమం చేస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమం ఈశాన్య ప్రాంత హస్త కళాకారులు, రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. మిజోరం ఉత్పత్తి చేసే వెదురు ఉత్పత్తులు, సేంద్రీయ అల్లం, పసుపు, అరటిపండ్లు ఎంతో ప్రసిద్ధి చెందాయని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

జీవన, వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని ప్రధానంగా చెబుతూ.. "ఇటీవల ప్రవేశపెట్టిన తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అనేక ఉత్పత్తులపై పన్నులు తగ్గించటంతో పాటు గృహాల రోజు వారీ జీవనాన్ని సులభతరం చేస్తాయి" అని ప్రధాని అన్నారు. 2014 కి ముందు టూత్‌పేస్ట్, సబ్బు, నూనె వంటి నిత్యావసర వస్తువులపై కూడా 27 శాతం పన్ను ఉండేదని ఆయన గుర్తు చేశారు. నేడు వీటిపై 5 శాతం జీఎస్టీ మాత్రమే ఉందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు పాలనలో ఉన్నప్పుడు మందులు, రోగ నిర్ధారణ కిట్లు, బీమా పాలసీలపై పన్ను ఎక్కువగా ఉండేదని.. దీనివల్ల ఆరోగ్య సంరక్షణ ఖరీదైనదిగా మారిందని, సాధారణ కుటుంబాలకు బీమా అందుబాటులో ఉండేది కాదని పేర్కొన్నారు. నేడు ఇవన్నీ అందుబాటు ధరల్లో ఉన్నాయని ప్రధానంగా చెప్పారు. కొత్త జీఎస్టీ రేట్లు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల మందులను కూడా మరింత తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొస్తాయని ప్రధాన మంత్రి అన్నారు. సెప్టెంబర్ 22 తర్వాత సిమెంట్, నిర్మాణ సామగ్రి కూడా చౌకగా మారుతాయని తెలిపారు. స్కూటర్లు, కార్లను తయారు చేసే అనేక కంపెనీలు ఇప్పటికే ధరలను తగ్గించినట్లు ప్రధాని పేర్కొన్నారు. రాబోయే పండుగ సీజన్‌ దేశవ్యాప్తంగా మరింత ఉత్సాహంగా ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

సంస్కరణల్లో భాగంగా చాలా వరకు హోటళ్లపై జీఎస్టీ కేవలం 5 శాతానికి తగ్గిందని ప్రధానమంత్రి అన్నారు. వివిధ ప్రాంతాలకు ప్రయాణించడం, హోటళ్లలో బస చేయడం, బయట తినడం అనేవి ఇప్పుడు మరింత తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించేందుకు, అన్వేషించడానికి, ఆస్వాదించడానికి ఎక్కువ మందిని ఇది ప్రోత్సహిస్తుందని మోదీ ప్రధానంగా చెప్పారు. ఈ మార్పు వల్ల ఈశాన్య ప్రాంతాల వంటి పర్యాటక కేంద్రాలు ప్రముఖంగా ప్రయోజనం పొందుతాయని ఆయన పేర్కొన్నారు.

"2025–26 మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీని అర్థం ఏంటంటే భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ" అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. భారత్‌లో తయారీ, ఎగుమతులలో కూడా భారత్ బలమైన వృద్ధిని సాధిస్తోందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి భారత సైనికులు గుణపాఠం నేర్పిన తీరును దేశం మొత్తం చూసిందని పేర్కొన్నారు. సాయుధ దళాల పట్ల దేశం మొత్తం గర్వంతో నిండిపోయిందని అన్నారు. ఈ ఆపరేషన్ సమయంలో దేశాన్ని రక్షించడంలో భారత్‌లో తయారైన ఆయుధాలు కీలక పాత్ర పోషించినట్లు మోదీ ప్రధానంగా చెప్పారు. జాతీయ భద్రతకు దేశ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగ వృద్ధి చాలా కీలకమని ఆయన అన్నారు.

దేశంలోని ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం, ప్రతి ప్రాంత సంక్షేమం పట్ల ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నట్లు పునరుద్ఘాటిస్తూ ప్రధానమంత్రి ప్రసంగాన్ని ముగించారు. ప్రజా సాధికారత ద్వారా అభివృద్ధి చెందిన భారత్‌ నిర్మాణమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో మిజోరాం ప్రజలు కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారతదేశ రైల్వే పటంలో ఐజ్వాల్‌ చేరటాన్ని స్వాగతించారు. వాతావరణ పరిస్థితుల కారణంగా ఐజ్వాల్‌ను సందర్శించలేకపోయినప్పటికీ.. త్వరలోనే అక్కడి ప్రజలతో సమావేశం అవుతానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో మిజోరం గవర్నర్ జనరల్ వీ.కే. సింగ్, మిజోరం ముఖ్యమంత్రి శ్రీ లాల్దుహోమా, కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, శివారు ప్రాంతాలకు అనుసంధానతను అందించాలన్న నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి రూ. 8,070 కోట్లకు పైగా విలువైన బైరాబి-సైరాంగ్ కొత్త రైలు మార్గాన్ని ప్రారంభించారు. ఇది మిజోరం రాజధానిని మొట్టమొదటిసారిగా భారత రైల్వే వ్యవస్థతో కలుపుతుంది. భౌగోళికంగా సవాళ్లతో కూడిన కొండ ప్రాంతంలో నిర్మించిన ఈ రైల్వే మార్గంలో 45 సొరంగాలు ఉన్నాయి. వీటితో పాటు 55 ప్రధాన వంతెనలు, 88 చిన్న వంతెనలు కూడా ఉన్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాలతో మిజోరం రాష్ట్రానికి ప్రత్యక్ష రైలు అనుసంధానం వల్ల ఈ ప్రాంత ప్రజలకు సురక్షితమైన, సమర్థవంతమైన, అందుబాటు ధరల్లో ప్రయాణం చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఇది ఆహార ధాన్యాలు, ఎరువులు, ఇతర ముఖ్యమైన వస్తువుల విశ్వసనీయ సరఫరాను సకాలంలో జరిగేలా చూసుకుంటుంది. తద్వారా మొత్తం రవాణా సామర్థ్యం పెరుగుతుంది. దీనితో పాటు ఈ ప్రాంతానికి చేరుకోవటాన్ని సులభతరం చేస్తుంది.

 

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మూడు కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. అవి- సైరంగ్ (ఐజ్వాల్)-ఢిల్లీ (ఆనంద్ విహార్ టెర్మినల్) రాజధాని ఎక్స్‌ప్రెస్, సైరంగ్-గుహవాటి ఎక్స్‌ప్రెస్, సైరంగ్-కోల్‌కతా ఎక్స్‌ప్రెస్. ఇప్పుడు రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో ఐజ్వాల్ నేరుగా ఢిల్లీతో అనుసంధానమైంది. సైరంగ్-గుహవాటి ఎక్స్‌ప్రెస్ మిజోరాం, అస్సాం మధ్య రాకపోకలను సులభతరం చేస్తుంది. సైరంగ్-కోల్‌కతా ఎక్స్‌ప్రెస్ మిజోరాంను కోల్‌కతాకు నేరుగా అనుసంధానిస్తుంది. ఈ మెరుగైన అనుసంధానత ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, మార్కెట్లకు చేరుకోవటాన్ని సులభతరం చేస్తుంది. తద్వారా ఈ ప్రాంతం అంతటా విద్యా, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు బలోపేతం కానున్నాయి. ఇది ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని గణనీయంగా పెంచుతుంది.

రహదారి మౌలిక సదుపాయాలకు భారీ ఊతం ఇస్తూ బహుళ రహదారుల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. వీటిలో ఐజ్వాల్ బైపాస్ రోడ్డు, తెన్జాల్–సియాల్సుక్ రోడ్డు, ఖాంకాన్–రోంగురా రహదారులు ఉన్నాయి.

ప్రధానమంత్రి ఈశాన్య ప్రాంత అభివృద్ధి కార్యక్రమం (పీఎం-డివైన్) పథకం కింద రూ. 500 కోట్లకు పైగా ఖర్చుతో చేపట్టిన 45 కి.మీ ఐజ్వాల్ బైపాస్ రోడ్డు ఐజ్వాల్ నగరంలో రద్దీని తగ్గించడం.. లుంగ్లీ, సియాహా, లాంగ్ట్లై, లెంగ్పుయ్ విమానాశ్రయం, సైరంగ్ రైల్వే స్టేషన్ వంటి వాటికి అనుసంధానతను మెరుగపరచనుంది. ఇది రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల నుంచి ఐజ్వాల్‌కు ప్రయాణ సమయాన్ని దాదాపు 1.5 గంటలు తగ్గిస్తూ ఈ ప్రాంత ప్రజలకు భారీ ప్రయోజనం అందించనుంది. ఈశాన్య ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం (ఎన్ఈఎస్ఐడీఎస్) (రోడ్లు) కింద తెన్జావాల్-సియాల్సుక్ రోడ్డుకు అనుసంధానత మెరుగుపరడటంతో అనేక మంది ఉద్యాన రైతులు, డ్రాగన్ ఫ్రూట్ పెంపకందారులు, వరి పంట పండించే వారు, అల్లం శుద్ధి చేసే వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. అదే సమయంలో ఇది ఐజ్వాల్-తెన్జావాల్-లుంగ్లీ రహదారితో అనుసంధానను మరింత మెరుగుపరచనుంది. సెర్చిప్ జిల్లాలోని ఎన్ఈఎస్ఐడీఎస్ (రోడ్లు) కింద ఉన్న ఖంకౌన్-రోంగురా రోడ్డు.. మార్కెట్లకు చేరుకోవటాన్ని సులభతరం చేస్తుంది. ఇది ఈ ప్రాంతంలోని వివిధ ఉద్యాన రైతులు, ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. అంతేకుకండా రానున్న అల్లం శుద్ధి కేంద్రానికి ఇది మద్దతునిస్తుంది.

లాంగ్ట్‌లాయ్‌ -సియాహా రోడ్డులోని చిమ్తుయిపుయ్ నది వంతెనకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఇది అన్ని వాతావరణాల్లో అనుసంధానాన్ని అందిస్తుంది. ప్రయాణ సమయాన్ని రెండు గంటలు తగ్గిస్తుంది. ఈ వంతెన కలదన్ బహుళ నమూనా రవాణా విధానం కింద సరిహద్దు వాణిజ్యానికి కూడా మద్దతు ఇస్తుంది.

క్రీడల అభివృద్ధికి ఉద్దేశించిన ఖేలో ఇండియా మల్టీపర్పస్ ఇండోర్ హాల్‌కు ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేశారు. తుయికువల్‌లోని ఈ ప్రాంగణం ఆధునిక క్రీడా సౌకర్యాలను అందిస్తుంది. ఇందులో బహుళ అవసరాలకు ఉపయోగపడే ఇండోర్ అరేనా కూడా ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో యువత పాల్గొనేలా ఇది ప్రోత్సహించనుంది. అంతేకాకుండా ఆయా పోటీల్లో పాల్గొనే వారికి ఉపయోగపడనుంది. 

ఈ ప్రాంతంలో ఇంధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా ఐజ్వాల్‌లోని ముల్ఖాంగ్‌లో 30 టీఎంటీపీఏ (సంవత్సరానికి వెయ్యి మెట్రిక్ టన్నులు) ఎల్‌పీజీ బాట్లింగ్ కేంద్రానికి ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేశారు. మిజోరాం, ఇరుగు పొరుగు రాష్ట్రాలలో స్థిరమైన, నమ్మదగిన ఎల్‌పీజీ సరఫరాను ఉండేలా ఇదిచూసుకుంటుంది. దీంతో స్వచ్ఛమైన వంట ఇంధనం సులభంగా లభిస్తుంది. ఇది స్థానికంగా ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది.

ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమ్ (పీఎంజేవీకే) పథకం కింద కౌర్తాలో ఆవాస పాఠశాలను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఆకాంక్షాత్మక జిల్లా అయిన మామిత్‌లో ఉన్న ఈ పాఠశాలలో ఆధునిక తరగతి గదులు, హాస్టళ్లు, ఫుట్‌బాల్ గ్రౌండ్‌తో కూడిన క్రీడా సౌకర్యాలు ఉన్నాయి. ఇది 10,000 మందికి పైగా పిల్లలు, యువతకు ప్రయోజనం చేకూర్చనుంది. తద్వారా దీర్ఘకాలిక సామాజిక, విద్యా పురోగతికి ఆధారంగా నిలువనుంది. 

అందరికీ నాణ్యమైన విద్య అనే దార్శనికతను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధానమంత్రి త్లాంగ్నువామ్‌లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ప్రారంభించారు. ఈ పాఠశాల గిరిజన యువత నమోదును పెంచనుంది. మధ్యలో చదువు ఆపేసే వారి శాతాన్ని తగ్గించనుంది. తద్వారా వారికి సమగ్ర విద్యా అవకాశాలను అందించనుంది. 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Can we have a picture? BRICS delegates gather around PM Modi for candid photo op

Media Coverage

Can we have a picture? BRICS delegates gather around PM Modi for candid photo op
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister extends greetings on Rosh Hashanah to PM Netanyahu, people of Israel and Jewish communities worldwide
September 12, 2026

The Prime Minister, Shri Narendra Modi has extended greetings on the occasion of Rosh Hashanah to Prime Minister of Israel, Benjamin Netanyahu, the people of Israel and Jewish communities across the globe.

The Prime Minister wished that the new year be filled with peace, hope, good health and continued progress for all.

In a post on X, Shri Modi wrote;

“‎Shana Tova!

‎Wishing a very happy Rosh Hashanah to Prime Minister Netanyahu, the people of Israel and Jewish communities across the globe.

‎May the new year be filled with peace, hope, good health and continued progress for all.

‎שנה טובה!

 

‎ מאחל שנה טובה ושמחה לראש הממשלה נתניהו, לעם ישראל ולקהילות היהודיות ברחבי העולם.

 

‎ מי ייתן והשנה החדשה תביא עמה שלום, תקווה, בריאות טובה וקדמה לכולם.


‎ ⁦‪@netanyahu‬⁩”