గౌరవనీయులైన ప్రధాన మంత్రి మెలోని గారికి,
ఇరు దేశాల ప్రతినిధులకు,
మీడియా మిత్రులకు,
నమస్కారాలు!
బొంజర్నో!

నాకు, నా ప్రతినిధి బృందానికి ఘన స్వాగతం పలికినందుకు ప్రధాన మంత్రి మెలోని గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రోమ్ నగరం ప్రపంచవ్యాప్తంగా ఒక 'శాశ్వత నగరం'గా ప్రసిద్ధి చెందింది. భారత్‌లో నా లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిని కూడా ఒక శాశ్వతమైన, కాలాతీతమైన నగరంగా పరిగణిస్తారు. రెండు ప్రాచీన నాగరికతలు ఒకచోట చేరినప్పుడు వాటి మధ్య జరిగే చర్చలు కేవలం ఒక అధికారిక ఎజెండాకు మాత్రమే పరిమితం కావు. అవి చరిత్ర లోతును, భవిష్యత్తు పట్ల ఉన్న దూరదృష్టిని, స్నేహంలోని సహజమైన ఆత్మీయతను.. ఇలా వీటన్నింటినీ ఒకేసారి ప్రతిబింబిస్తాయి. 

మిత్రులారా, 

గడిచిన దాదాపు మూడున్నర సంవత్సరాల్లో నాకు ప్రధాన మంత్రి మెలోని గారితో పలుమార్లు సమావేశమయ్యే అవకాశాలు లభించాయి. ఇది భారత్, ఇటలీ దేశాల మధ్య ఉన్న సన్నిహిత సహకారానికి, పరస్పర అవగాహనకు నిదర్శనం. ఆమె నాయకత్వంలో మన ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త వేగాన్ని, నూతన దిశను, సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని సంతరించుకున్నాయి. మన బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తూ ఈ రోజు మనం ఒక 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' ప్రకటిస్తుండటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

 

మిత్రులారా, 

ఈ రోజు జరిగిన సమావేశంలో మన భవిష్యత్తు భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై మేం విస్తృతంగా చర్చించాం. మన భాగస్వామ్యానికి ఒక ఆచరణాత్మకమైన, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్న స్పష్టమైన నిబంధనల చట్రాన్ని 'భారతదేశం–ఇటలీ ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-29' అందిస్తుంది. దీని ఆధారంగానే మనం ఒక నిర్దిష్ట కాలపరిమితిలో ముందుకు సాగుతున్నాం. మన ఉమ్మడి ప్రయత్నాల వల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 20 బిలియన్ యూరోల లక్ష్యం దిశగా వేగంగా దూసుకుపోతోంది.

భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 800కు పైగా ఇటాలియన్ కంపెనీలు భారత్ వృద్ధి పథంలో చురుకైన భాగస్వాములుగా మారుతున్నాయి. ఈ రోజు జరుగుతున్న వ్యాపార సదస్సు ఇరు దేశాల వ్యాపార దిగ్గజాలలో ఉన్న సరికొత్త ఉత్సాహాన్ని, నూతన ఆత్మవిశ్వాసాన్ని, మరింత ఉన్నతమైన ఆశయాలను స్పష్టంగా తెలియజేస్తోంది. 

రూపకల్పన, ఖచ్చితత్వానికి ఇటలీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అదే సమయంలో భారీ స్థాయి ఉత్పత్తి, ప్రతిభ, తక్కువ ఖర్చుతో కూడిన ఆవిష్కరణలకు ఒక కేంద్రంగా భారత్ గుర్తింపు పొందింది. అందువల్ల మనం ఇకపై ‘భారత్, ఇటలీలలో రూపకల్పన, అభివృద్ది చేద్దాం.. ప్రపంచానికి అందిద్దాం’ అనే సూత్రం ఆధారంగా ముందుకు సాగుతాం. ఫ్యాషన్ నుంచి ఫిన్ టెక్ వరకు, లెదర్ నుంచి లాజిస్టిక్స్ వరకు,  మొబిలిటీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు.. ప్రతి రంగంలోనూ మన నైపుణ్యాలను మేళవించి మానవాళి అందరి సంక్షేమం కోసం మనం కృషి చేస్తాం. 

'భారత్–ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం' సంప్రదింపులను ముగించే విషయంలో ఇటలీ అందించిన మద్దతుకు గాను నేను ప్రధానమంత్రి మెలోని గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇరుపక్షాల వ్యాపార వర్గాలు దీని ద్వారా పూర్తి ప్రయోజనం పొందేలా ఈ ఒప్పందాన్ని వీలైనంత త్వరగా అమలు చేసేందుకు మేం కలిసికట్టుగా కృషి చేస్తాం. 

మిత్రులారా, 

సాంకేతికత, ఆవిష్కరణలే మన భాగస్వామ్యానికి ప్రధాన చోదక శక్తులు. ఏఐ, క్వాంటం సాంకేతికలు, అంతరిక్ష రంగం, పౌర అణుశక్తి వంటి రంగాల్లో మన మధ్య సహకారానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఇరు దేశాల అంకురాలు, పరిశోధనా కేంద్రాలు, పరిశ్రమలను అనుసంధానించడానికి... మేం 'భారత్-ఇటలీ ఆవిష్కరణల కేంద్రం' ఏర్పాటుపై పనిచేస్తున్నాం. 

 

మిత్రులారా, 

రక్షణ, భద్రతా రంగాల్లో మన మధ్య ఉన్న నిరంతర సన్నిహిత సహకారం మనకున్న లోతైన పరస్పర నమ్మకానికి నిదర్శనం. ఈ సహకారం కేవలం మన సాయుధ దళాల మధ్య మాత్రమే కాకుండా ఇరు దేశాల రక్షణ రంగ పరిశ్రమల మధ్య కూడా విస్తరిస్తోంది. మన 'రక్షణ పారిశ్రామిక రోడ్‌మ్యాప్'.. ఉమ్మడి అభివృద్ధి, సహ-ఉత్పత్తికి బాటలు వేసింది. సముద్రతీర శక్తులుగా అనుసంధానత రంగంలో భారత్, ఇటలీల మధ్య సన్నిహిత సహకారం అనేది చాలా సహజమైన విషయం. నౌకాయానం, ఓడరేవుల ఆధునికీకరణ, లాజిస్టిక్స్, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థలపై మేం కలిసికట్టుగా పనిచేస్తాం. 

ఇరుపక్షాలకూ లాభదాయకమైన మన భాగస్వామ్యాన్ని ఇతర దేశాలకు విస్తరించడంపై కూడా మేం చర్చించాం. ఈ దిశగా అడుగులు వేస్తూ ఆఫ్రికా ఖండంలో కొన్ని నిర్దిష్టమైన ప్రాజెక్టులపై కలిసి పనిచేసేందుకు మేం అంగీకరించాం. 

మిత్రులారా, 

ఉగ్రవాదం అనేది మానవాళికి ఎదురవుతున్న ఒక తీవ్రమైన సవాలు అనే విషయంలో భారత్, ఇటలీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి. ఉగ్రవాదానికి అందే నిధుల సరఫరాను నిలువరించేందుకు మనం చేపట్టిన ఉమ్మడి కార్యక్రమాలు ప్రపంచం ముందు ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలిచాయి. బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్య దేశాలు ఉగ్రవాదాన్ని కేవలం ఖండించడమే కాకుండా దాని ఆర్థిక నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేయడానికి నిర్దిష్టమైన చర్యలు కూడా తీసుకుంటాయనే స్పష్టమైన సందేశాన్ని భారత్, ఇటలీలు ప్రపంచానికి చాటాయి. ఉక్రెయిన్, పశ్చిమ ఆసియా, ఇతర అంతర్జాతీయ ఉద్రిక్తతలకు సంబంధించిన అంశాలపై మేం నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. అన్ని సమస్యలనూ కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలనేదే భారతదేశానికి ఉన్న స్పష్టమైన విధానం.

మిత్రులారా, 

మన చారిత్రక సాంస్కృతిక, ప్రజా సంబంధాల ప్రభావం ఇరు దేశాలలోనూ అడుగడుగునా కనిపిస్తుంది. ఇటలీలో భారతీయ కళలు, యోగా, ఆయుర్వేదం, వంటకాల పట్ల ఆసక్తి నిరంతరం పెరుగుతోంది. సంస్కృతం, లాటిన్ వంటి ప్రాచీన భాషలు ఒకే భాషా కుటుంబానికి చెందినవి. ఇది మన బంధం కేవలం దౌత్యపరమైనది మాత్రమే కాదు ఒక ఉమ్మడి వారసత్వ బంధం అని కూడా నిరూపిస్తుంది.

 

వచ్చే ఏడాది భారత్, ఇటలీ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 80 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఒక 'సాంస్కృతిక సంవత్సాన్ని' నిర్వహించుకోనున్నాం. ఇది మన సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఇటలీలో నివసిస్తున్న భారీ భారతీయ సంతతి మన రెండు దేశాల మధ్య ఒక సజీవ వారధిగా పనిచేస్తోంది. వారి పట్ల చూపుతున్న ఆదరణకు, అందిస్తున్న మద్దతుకు నేను ప్రధాన మంత్రి మెలోని గారికి, ఇటలీ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మూడేళ్ల క్రితం కుదిరిన 'వలసలు, రవాణా భాగస్వామ్య ఒప్పందం' ఇరు దేశాల మధ్య ప్రజల రాకపోకలను మరింత మెరుగుపరిచింది.

గౌరవనీయులైన ప్రధాని గారూ,

ఈ రోజు జరిగిన అత్యంత ఫలప్రదమైన సమావేశానికి, మీ స్నేహపూర్వక ఆత్మీయతకు నేను మీకు మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 140 కోట్ల మంది భారత ప్రజల తరఫున మిమ్మల్ని భారత్ సందర్శించాల్సిందిగా నేను మరోసారి ఆహ్వానిస్తున్నాను.

ధన్యవాదాలు.
గ్రాత్సియే మిల్లే!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Every voter had valid ID': Trump praises India polls, renews push for SAVE America Act

Media Coverage

'Every voter had valid ID': Trump praises India polls, renews push for SAVE America Act
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 18 ఆగష్టు 2026
August 18, 2026

PM Modi’s 12 Years of Structural Power: Manufacturing, FTAs, Airports & Uncompromising Security