దావూదీ బోహ్రా సమాజానికి చెందిన ప్రతినిధుల బృందంతో ఈ రోజు లోక కల్యాణ్ మార్గ్ లోని తన నివాసంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముచ్చటించారు.

ఈ బృందంలో దావూదీ బోహ్రా సమాజానికి చెందిన వ్యాపారవేత్తలు, నిపుణులు, వైద్యులు, విద్యావేత్తలు, ఇతర ప్రముఖులు ఉన్నారు. తమ సమాజం ఎదుర్కొన్న ఇబ్బందులను, తమలో కొందరికి చెందిన ఆస్తులను వక్ఫ్ అక్రమంగా ఎలా స్వాధీనం చేసుకుందో వివరించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చినందుకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మార్పు చేయాలన్న డిమాండు దీర్ఘకాలంగా ఆచరణకు నోచుకోలేదన్నారు.

దావూదీ బోహ్రా సమాజంతో ప్రధానమంత్రికి చాలాకాలంగా ఉన్న అనుబంధం గురించి, ఆయన చేపడుతున్న అభివృద్ధి గురించి వారు మాట్లాడారు. ఈ చట్టం వల్ల తమ సమాజానికి కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తూ.. ప్రధానమంత్రి ఆ చట్టాన్ని కేవలం మైనారిటీల కోసం మాత్రమే కాకుండా మైనారిటీల్లో ఉన్న మైనారిటీల కోసం తీసుకువచ్చారని పేర్కొన్నారు. తమ ఉనికిని గుర్తించేందుకు భారత్ నిరంతరం సహకరిస్తూనే ఉందని తెలిపారు. ప్రధానమంత్రి నాయకత్వంలో సమ్మిళిత స్ఫూర్తిని కళ్లారా చూస్తున్నట్లు వెల్లడించారు.
2047 నాటికి వికసిత భారత్ సాధించాలన్న ప్రధానమంత్రి లక్ష్యం గురించి మాట్లాడుతూ.. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు సాధ్యమైనంత వరకు అన్ని విధాలా సహకరిస్తామని వారు తెలిపారు. నిజమైన అభివృద్ధికి ప్రజలే కేంద్రంగా ఉండాలనే ప్రధానమంత్రి నాయకత్వాన్ని ప్రశంసించారు. ఆత్మనిర్భర భారత్, ఎంఎస్ఎంఈలకు తోడ్పాటు, తదితర కీలకమైన కార్యక్రమాలను ప్రశంసిస్తూ.. ఇవి ముఖ్యంగా చిన్న వ్యాపారాలకు సహకారాన్ని అందిస్తున్నాయన్నారు. అలాగే బేటీ బచావో బేటీ పడావో లాంటి నారీశక్తికి సాధికారత కల్పించే కార్యక్రమాలను సైతం వారు మెచ్చుకున్నారు.

వక్ఫ్ సవరణ చట్టం తీసుకు రావడానికి ఏళ్ల తరబడి చేసిన కృషి గురించి ప్రధానమంత్రి వివరించారు. వక్ఫ్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతూ.. మునుపటి వ్యవస్థలో ఎక్కువ మంది బాధిత మహిళలు వితంతువులుగా ఉండటమే ఈ చట్టం తీసుకురావడానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటని పేర్కొన్నారు.

దావూదీ బోహ్రా సమాజంతో తనకున్న బలమైన అనుంబంధాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. సామాజిక సంక్షేమం కోసం పనిచేయాలనే వారి సంస్కృతిని అనేక సంవత్సరాలుగా చూస్తున్నానని ప్రశంసించారు. ఈ చట్టాన్ని తీసుకురావడంతో ఈ సమాజం చేసిన కృషిని సైతం ఆయన అభినందించారు. వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చే పని ప్రారంభమైనప్పుడు దాని గురించి తాను మొదట చర్చించిన వారిలో సయ్యద్నా ముఫద్ధల్ సైఫుద్దీన్ ఒకరని, చట్టంలోని 99 లోపాలపై వివరణాత్మకమైన వ్యాఖ్యలు అందించడంలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు.

Had a wonderful meeting with members of the Dawoodi Bohra community! We talked about a wide range of issues during the interaction.@Dawoodi_Bohras pic.twitter.com/OC09EgcJPG
— Narendra Modi (@narendramodi) April 17, 2025


