‘ప్రధానమంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రం’ ప్రారంభం;
దేవగఢ్‘లోని ఎయిమ్స్‘లో 10,000వ జనౌషధి కేంద్రం జాతికి అంకితం;
జనౌషధి కేంద్రాల సంఖ్యను 10 వేల నుంచి 25 వేలకు పెంచే కార్యక్రమానికి శ్రీకారం;
‘‘ప్రభుత్వ పథకాల అమలులో సంతృప్తత సాధన.. దేశ ప్రజలందరికీ ప్రయోజనం అందించడమే వికసిత భారతం సంకల్ప యాత్ర లక్ష్యం";
‘‘ఇప్పటిదాకా 12 వేలకుపైగా పంచాయతీలలో పర్యటించిన
‘మోదీ హామీ వాహనం’.. 30 లక్షలమంది ప్రజలతో మమేకం’’;
‘‘ప్రభుత్వ కార్యక్రమంగా మొదలై ప్రజా ఉద్యమంగా రూపొందిన విబీఎస్‘వై’’;
‘‘ఇప్పటికీ ప్రభుత్వ పథకాలు.. సేవలు అందనివారికి లబ్ధి కల్పించడమే వికసిత భారతం సంకల్ప యాత్ర లక్ష్యం’’;
‘‘ఇతరుల ద్వారా ప్రజాకాంక్షలు ఎక్కడ నెరవేరలేదో అక్కడ మోదీ హామీ అమలు ప్రారంభమవుతుంది’’; ‘‘భారత నారీశక్తి.. యువశక్తి.. దేశంలోని రైతులు.. పేద కుటుంబాలే వికసిత భారతంలోని 4 అమృత స్తంభాలు’’;

   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వికసిత భారతం సంకల్పయాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన ‘ప్ర‌ధానమంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రా’న్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేవగడ్‘లోని ఎయిమ్స్ ప్రాంగణంలో జనౌషధి కొత్త మైలురాయిలో భాగంగా 10,000వ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను 10,000 నుంచి 25 వేలకు పెంచే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. కాగా, స్వయం సహాయ సంఘాల మహిళలకు డ్రోన్ల పంపిణీతోపాటు జనౌషధి కేంద్రాల సంఖ్యను 10 వేల నుంచి 25 వేలకు పెంచుతామని ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆనాటి హామీలు నేటి కార్యక్రమంతో నెరవేరినట్లయింది. జార్ఖండ్‌లోని దేవగఢ్, ఒడిషాలోని రాయగఢ్, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, అరుణాచల్ ప్రదేశ్‌లోని నాంశై,  జమ్ముకశ్మీర్‌లోని అర్నియా ప్రాంతాల లబ్ధిదారులతో ప్రధాని సంభాషించారు.

 

   ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ- వికసిత భార‌తం సంక‌ల్ప యాత్ర (విబిఎస్‌వై) నేటితో 15 రోజులు పూర్తిచేసుకోవడంతోపాటు వేగం పుంజుకున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ యాత్ర సంబంధిత ప్రత్యేక వాహనానికి తొలుత ‘ప్రగతి రథం’గా పేరుపెట్టామని ఆయన గుర్తుచేశారు. అయితే, యాత్ర కొనసాగేకొద్దీ వెల్లువెత్తిన ప్రజా భాగస్వామ్యం, వారి ప్రేమాభిమానాల నేపథ్యంలో దీనికి ‘మోదీ హామీ వాహనం’గా పున:నామకరణం చేశామన్నారు. ప్రభుత్వంపై పౌరులు ప్రదర్శిస్తున్న విశ్వాసానికి ఇది నిదర్శనమని అభివర్ణిస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇక ‘విబిఎస్‌వై’ లబ్ధిదారులతో సంభాషించడంపై ఆయన హర్షం ప్రకటిస్తూ- వారి స్ఫూర్తి, ఉత్సాహం, సంకల్పాలను కొనియాడారు. ‘‘మోదీ హామీ వాహనం’’ ఇప్పటిదాకా 12,000కు పైగా పంచాయతీల్లో పర్యటించిందని, ఈ యాత్రలో సుమారు 30 లక్షల మంది పౌరులు మమేకమయ్యారని తెలిపారు. ‘విబిఎస్‌వై’లో మహిళలు కూడా భాగస్వాములు కావడం అభినందనీయమని పేర్కొన్నారు.

   ఈ యాత్ర ప్రభుత్వ కార్యక్రమంగా మొదలై ప్రజా ఉద్యమంగా రూపొందిందని ఆయన అన్నారు. తద్వారా ‘‘ప్రతి గ్రామంలో.. ప్రతి వ్యక్తికీ అభివృద్ధి అంటే ఏమిటో అర్థమవుతుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమ వేదికలలో దేశంలోని పాత, కొత్త లబ్ధిదారుల డిజిటల్ కార్యకలాపాల సంఖ్య పెరగడంతోపాటు ‘విబిఎస్‌వై’తో మమేకం కావడంపై ఆయన శ్రీ మోదీ హర్షం వెలిబుచ్చారు. ఈ కార్యకలాపాల ఫొటోలు, వీడియోలను తాను నిత్యం పరిశీలించే ‘నమో యాప్’లో అప్‌లోడ్ చేయాల్సిందిగా వారిని కోరారు. మరోవైపు యువతరం కూడా ‘విబిఎస్‌వై’కి ప్రతినిధులుగా రూపొందారని ఆయన అన్నారు. ‘మోదీ హామీ వాహనం’ వెళ్లిన చోటల్లా స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలతో గ్రామాల్లో పరిశుభ్రతపై ‘విబిఎస్‌వై’ ప్రభావం స్పష్టమవుతున్నదని ఆయన అన్నారు. ‘‘భారత్ ఇప్పుడు అలుపెరుగని రీతిలో దూసుకుపోతోంది... ఈ వేగాన్ని ఆపడం ఎవరితరమూ కాదు. దేశాన్ని వికసిత భారతంగా రూపుదిద్దాలని ప్రజలు దృఢ సంకల్పం పూనారు” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇటీవల ముగిసిన పండుగల సమయంలో ‘స్థానికతే మన నినాదం’ ప్రతిబింబించిన తీరును కూడా ఆయన ప్రస్తావించారు.

   ‘విబిఎస్‌వై’ విజయవంతం కావడంలో ప్రభుత్వ కృషి, తద్వారా ప్రజలలో ఏర్పడిన విశ్వాసమే ప్రధాన పాత్ర పోషించాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇళ్లు, మరుగుదొడ్లు, విద్యుత్తు, గ్యాస్ కనెక్షన్లు, బీమా లేదా బ్యాంకు ఖాతాలు వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా ఒక వర్గం ప్రజలకు అందని ఒకనాటి దుస్థితిని ఈ సందర్భంగా ప్రదాని ప్రస్తావించారు. అలాగే లంచగొండితనం వంటి జాడ్యాన్ని, బుజ్జగింపు-ఓటు బ్యాంకు రాజకీయాలను కూడా ప్రధానిఎత్తిచూపారు. ఫలితంగా నాటి ప్రభుత్వాలు ప్రజా విశాసం కోల్పోయాయని వ్యాఖ్యానించారు. అటువంటి దుష్పరిపాలనను సుపరిపాలనగా మార్చిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానిదేనని ఆయన నొక్కి చెప్పారు. ‘‘ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తిస్తూ వారికి హక్కులు కల్పించాలి. ఇది సహజ న్యాయం.. సామాజిక న్యాయం’ అని ప్రధాని ఉద్ఘాటించారు. ఈ విధానాల వల్లనే ప్రజల్లో కొత్త ఆకాంక్షలు చిగురించాయని, కోట్లాది పౌరులలో ఉదాసీనతకు తెరపడిందని తెలిపారు. ‘‘ఇతరుల ద్వారా ప్రజాకాంక్షలు ఎక్కడ నెరవేరలేదో అక్కడ మోదీ హామీ అమలు ఆరంభమవుతుంది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

   ‘‘వికసిత భారతం సంకల్పం మోదీ మదిలోనిదో లేదా ఏదో ఒక ప్రభుత్వానిదో కాదు... ప్రతి ఒక్కరినీ ప్రగతి పథంలో నడిపించాలన్నదే దీని అంతరార్థం’’ అని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. అభివృద్ధి ఫలాలు అందనివారికి ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలను చేరువ చేయడమే వికసిత భారతం సంకల్ప యాత్ర లక్ష్యమన్నారు. ఈ యాత్ర పరిణామాలను తాను ప్రతిరోజూ ‘నమో యాప్‌’లో నిశితంగా పరిశీలిస్తున్నానని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కొడవలి రక్తకణ వ్యాధి (ఎస్‌సిడి) నిర్ధారణ పరీక్షలు, ఆరోగ్య శిబిరాల నిర్వహణతోపాటు డ్రోన్ ప్రదర్శనలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ‘విబిఎస్‌వై’ వాహనం పర్యటనతో అధికశాతం పంచాయతీలలో పథకాల సంతృప్త స్థాయి 100 శాతానికి చేరిందని ప్రధాని మోదీ అన్నారు. దీంతోపాటు వెనుకబాటుకు గురైన ప్రాంతాల్లో పథకాల గురించి  ప్రజలకు మరింత సమాచారం ఇస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఉజ్వల, ఆయుష్మాన్ కార్డుల వంటి అనేక పథకాలతో లబ్ధిదారులను తక్షణం అనుసంధానిస్తున్నట్లు చెప్పారు. యాత్ర తొలిదశలో 40 వేల మందికిపైగా లబ్ధిదారులకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. ‘మై భారత్’లో స్వచ్ఛంద కార్యకర్తలుగా చేరి, సంబంధిత కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని యువతరాన్ని ఆయన కోరారు.

   వికసిత భారతం ప్రధానంగా  నాలుగు స్తంభాలపై ఆధారపడి ఉందని తాను ‘విబిఎస్‌వై’ ఆరంభంలో చెప్పడాన్ని ప్రధాని గుర్తుచేశారు. భారత నారీశక్తి, యువశక్తి, రైతులు, పేద కుటుంబాలే ఆ నాలుగు స్తంభాలని పేర్కొంటూ, ఈ వర్గాలన్నీ ఇక వేగంగా పురోగమిస్తూ దేశాన్ని వికసిత భారతంగా రూపుదిద్దగలవని విశ్వాసం వెలిబుచ్చారు. జీవన ప్రమాణాల మెరుగుదల, పేదరికం నుంచి నిరుపేదలకు విముక్తి, యువతకు ఉపాధి-స్వయం ఉపాధి అవకాశాల సృష్టి, మహిళా సమస్యల పరిష్కారం ద్వారా వారికి సాధికారత కల్పన, రైతుల ఆదాయం-సామర్థ్యాల వృద్ధి ప్రభుత్వ అగ్ర ప్రాథమ్యాలని, ఈ దిశగా అవిరళ కృషి చేస్తామని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. ‘‘రైతులు. పేదలు, మహిళలు, యువతరం సమస్యలన్నిటినీ పూర్తిగా పరిష్కరించేదాకా నేను విశ్రమించేది లేదు’’ అని ప్రధాని మోదీ ప్రతినబూనారు.

   వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ద్వారా మహిళలకు సాధికారత కల్పనతోపాటు పేదలకు తక్కువ ధరలకే మందులు లభించేలా చేపట్టిన రెండు కార్యక్రమాలను ప్రధాని ప్రస్తావించారు. ఇందులో భాగంగా ‘పిఎం మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రా’ల ప్రారంభం గురించి మాట్లాడుతూ- దీనిపై తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రకటన చేశానని గుర్తుచేశారు. తదనుగుణంగా రాబోయే రోజుల్లో డ్రోన్ పైలట్‌ శిక్షణతోపాటు 15,000 స్వయం సహాయ బృందాలకు డ్రోన్లను కూడా అందుబాటులో ఉంచుతామని ఆయన వెల్లడించారు. ఈ సంఘాల ద్వారా మహిళల స్వావలంబన దిశగా సాగుతున్న కార్యక్రమాన్ని ఇకపై ‘డ్రోన్ దీదీ’ అమలుతో బలోపేతం చేస్తామన్నారు. ఈ విధంగా వారికి అదనపు ఆదాయార్జన మార్గం చూపుతామని చెప్పారు. ‘‘దేశంలోని రైతులు దీనిద్వారా అత్యంత స్వల్ప వ్యయంతో డ్రోన్ల వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ప్రయోజనం పొందగలుగుతారు. తద్వారా సమయంతోపాటు పురుగు మందులు, ఎరువులు కూడా ఆదా అవుతాయి’’ అన్నారు.

 

   దేశంలో 10,000వ జనౌషధి కేంద్రం ప్రారంభాన్ని ప్రస్తావిస్తూ- వీటిద్వారా పేద, మధ్యతరగతి ప్రజలందరికీ తక్కువ ధరతో మందులు లభ్యత సాధ్యమైందని శ్రీ మోదీ అన్నారు. ‘‘జనౌషధి కేంద్రాలను ఇప్పుడు ‘మోదీ మందుల షాపు’గా పిలుస్తున్నారు. వారి ప్రేమాభిమానాలకు ఎంతయినా కృతజ్ఞుడిని” అని ప్రధాని పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా దాదాపు 2,000 రకాల మందులను 80 నుంచి 90 శాతం రాయితీతో విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే జనౌషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుంచి 25,000కు విస్తరించే కార్యక్రమాన్ని ప్రారంభించడంపైనా ప్రజలకు... ముఖ్యంగా మహిళలకు ఆయన అభినందనలు తెలిపారు. ‘పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ను మరో ఐదేళ్లు పొడిగించడం కూడా తనకు సంతోషం కలిగించిందని చెప్పారు. ఆ మేరకు ‘‘మోదీ హామీ అంటే అది తప్పక నెరవేరే హామీ’’ అని వ్యాఖ్యానించారు.

   చివరగా- ఈ మొత్తం కార్యక్రమ నిర్వహణలో యావత్ ప్రభుత్వ యంత్రాంగం, ఉద్యోగుల ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 7 పథకాలను దేశంలోని 60 వేల గ్రామాల ప్రజలకు చేరువ చేసేందుకు కొన్నేళ్ల కిందట రెండు దశలుగా చేపట్టిన గ్రామస్వరాజ్‌ అభియాన్‌ విజయవంతం కావడాన్ని ఆయన గుర్తుచేశారు. ఇందులో భాగా ‘‘ఆకాంక్షాత్మక జిల్లాల పరిధిలోని వేలాది గ్రామీణులు కూడా ఇందులో చేర్చబడ్డారు’’ అని ప్రధాని పేర్కొన్నారు. దేశానికి, సమాజానికి సేవ చేయడంలో భాగంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రభుత్వ ప్రతినిధుల కృషిని ఆయన ప్రశంసించారు. ‘‘పూర్తి నిజాయితీతో దృఢంగా విధులు నిర్వర్తించండి.. ప్రతి గ్రామానికి చేరువ కండి... వికసిత భారతం సంకల్ప యాత్ర అందరి కృషితో మాత్రమే సంపూర్ణం కాగలదు’’ అని శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.

   కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ సహా వివిధ ప్రదేశాల నుంచి ఇతర భాగస్వాములు, లబ్ధిదారులు వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

   కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మ‌క పథకాల ప్రయోజనాలు నిర్దేశిత లబ్ధిదారులందరికీ సకాలంలో అందేవిధంగా చూడడం ద్వారా సంతృప్త స్థాయి సాధించడం లక్ష్యంగా వికసిత భార‌తం సంక‌ల్ప యాత్ర ప్రారంభించబడింది.

   మహిళా చోదక ప్రగతి లక్ష్యంగా ప్రధానమంత్రి చేపట్టిన నిరంతర కృషిలో ఈ యాత్ర ఒక భాగం. తదనుగుణంగా మరో ముందడుగు వేస్తూ ‘ప్రధానమంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రా’న్ని ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రాల ద్వారా మహిళా స్వయం సహాయ సంఘాలకు (ఎస్‌హెచ్‌జి) డ్రోన్‌లను పంపిణీ చేస్తారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు తమ జీవనోపాధి కోసం వాడుకోగలుగుతారు. ఈ మేరకు రాబోయే మూడేళ్లలో 15,000 డ్రోన్లను అందించడమే కాకుండా వాటిని నియంత్రణ-నిర్వహణకు తగిన పైలట్ శిక్షణ కూడా ఇప్పిస్తారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని ఇది ఎంతగానో ప్రోత్సహిస్తుంది.

   ఆరోగ్య భారతం దిశగా ప్రధాని దార్శనిక కృషిలో చౌక, సౌలభ్య ఆరోగ్య సంరక్షణ ఒక మూలస్తంభం. ఈ దిశగా చేపట్టిన కీలక కార్యక్రమాల్లో పేద, మధ్యతరగతి వర్గాలకు సరసమైన ధరతో మందులు లభించేలా జనౌషధి కేంద్రాల స్థాపన ఒకటి. ఇందులో భాగంగానే దేవగఢ్‘లోని ఎయిమ్స్ ప్రాంగణంలో ఒక మైలురాయికి సంకేతంగా 10,000వ జనౌషధి కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుంచి 25,000కు పెంచే కార్యక్రమానికీ ఆయన శ్రీ‌కారం చుట్టారు.

 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
Tamil Nadu is writing a new chapter of progress in Thoothukudi: PM Narendra Modi

Media Coverage

Tamil Nadu is writing a new chapter of progress in Thoothukudi: PM Narendra Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles loss of lives due to road accident in Dindori, Madhya Pradesh
February 29, 2024

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to road accident in Dindori district of Madhya Pradesh.

Shri Modi also wished speedy recovery for those injured in the accident.

The Prime Minister’s Office posted on X;

“मध्य प्रदेश के डिंडोरी में हुई सड़क दुर्घटना अत्यंत दुखद है। मेरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं। ईश्वर उन्हें इस कठिन समय में संबल प्रदान करे। इसके साथ ही मैं सभी घायल लोगों के जल्द स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की देखरेख में स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव सहायता में जुटा है: PM @narendramodi”