· వేల ఏళ్లుగా వర్ధిల్లుతున్న వైభవోపేతమైన నాగరికత మనది
· సంప్రదాయాలు చెక్కుచెదరకుండా సుదీర్ఘ కాలం కొనసాగిన ఉదాహరణలు ప్రపంచంలో చాలా అరుదు
· ఆధ్యాత్మిక నిర్దేశానికే పరిమితం కాని మహనీయులెందరో నిరంతరం ప్రభవిస్తున్న సమాజం భారత్
· ప్రజల మధ్యనే జీవించి, కష్టసుఖాలను తెలుసుకుని, వారి వేదనతో సహానుభూతిని చెంది.. దుఃఖం, బాధలు, కష్టాల నుంచి సమాజానికి విముక్తి మార్గం చూపిన మహాత్ములెందరో
· నీటిని పొదుపు చేసి, జాగ్రత్తగా ఉపయోగించుకునేలా మనమంతా సంకల్పిద్దాం: ఇదే నా మొదటి విజ్ఞప్తి
· వృక్షాలు, ప్రకృతి రక్షణ కోసం నా రెండో విజ్ఞప్తి: ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం కింద లక్షలాది మంది తమ తల్లి పేరు మీద మొక్కలు నాటారు... ఆ స్ఫూర్తిని మనమంతా పుణికిపుచ్చుకొందాం, భూమాత రక్షణకు సంకల్పిద్దాం
· ‘స్వచ్ఛత’ నా మూడో విజ్ఞప్తి: ఆధ్యాత్మిక ప్రదేశమైనా, బహిరంగ ప్రదేశమైనా, పల్లెగానీ నగరంగానీ... అంతటా స్వచ్ఛత మన బాధ్యత
· స్వదేశీ, స్వావలంబన... ఇది నా నాలుగో వినతి: భారతీయ ఉత్పత్తులను ఆదరిద్దాం, మన దేశ తయారీదారులను, పరిశ్రమలను బలోపేతం చేద్దాం
· మన దేశ సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం... నా అయిదో విజ్ఞప్తి: భారత్‌ను తెలుసుకుందాం, దేశంలో పర్యటిద్దాం, దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిద్దాం
· దేశ రైతులకు నా ఆరో విజ్ఞప్తి: సేంద్రియ వ్యవసాయం దిశగా మళ్లండి
· ఆరోగ్యకరమైన ఆహారం నా ఏడో విజ్ఞప్తి... దేశంలో సవాలుగా మారుతున్న ఊబకాయం: దీన్ని పరిష్కరించే దిశగా, మీ ఆహారంలో నూనె పరిమాణాన్ని 10% తగ్గించండి
· యోగా, క్రీడలు, దేహదారుఢ్యాలు నా ఎనిమిదో అభ్యర్థన... మనమంతా వీటిని జీవితంలో అంతర్భాగం చేసుకోవాలి
· సేవాస్ఫూర్తిని చాటడమే నా తొమ్మిదో విజ్ఞప్తి
· ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

 

కర్ణాటకలోని మాండ్య జిల్లా శ్రీ క్షేత్ర ఆదిచుంచనగిరిలో శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసిందన్న ప్రధానమంత్రి... వైభవోపేతంగా శ్రీ గురు భైరవైక్య ఆలయాన్ని ప్రారంభించి, మహోన్నతులైన సాధుసంతులతో సంభాషించే భాగ్యాన్ని తనకిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చారిత్రక జ్వాలాపీఠం వద్ద సమయం గడపడం, అశేషంగా తరలివచ్చిన భక్తులనుద్దేశించి ప్రసంగించడం మాటలకందని బలమైన భావోద్వేగాలను కలిగించాయన్నారు. ‘‘ఈ దైవిక అనుభవాలు శాశ్వతంగా నా స్మృతిపథంలో నిలిచిపోతాయి’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ప్రసంగిస్తూ... తత్వజ్ఞానం, తంత్రజ్ఞానం మేళవించిన విశిష్ట ప్రాంతంగా కర్ణాటక ప్రత్యేకతను సంతరించుకున్నదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. చక్కెర నగరమైన మాండ్యా ప్రజల ఆతిథ్యాన్ని, ఆదరణ భావాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్రీ ఆదిచుంచనగిరి మహా సంస్థాన మఠం వంటి సంస్థలు ఈ ప్రాంతానికి నైతిక, ఆధ్యాత్మిక దిక్సూచిగా నిలుస్తాయన్నారు. ‘‘ఈ కర్ణాటక నేల గంభీరమైన తాత్వికతను, ఆధునిక సాంకేతికత శక్తిని పరిపూర్ణంగా మేళవించింది’’ అని శ్రీ మోదీ అభివర్ణించారు.

భారత నాగరికత అత్యంత శక్తిమంతమైనదని, లక్షల ఏళ్ల చరిత్ర మనకుందని ప్రధానమంత్రి అన్నారు. శ్రీ ఆదిచుంచనగిరి మఠం 2000 ఏళ్ల చరిత్రలో అవిచ్ఛిన్నమైన సంప్రదాయ పరంపర ఉందని, ఈ నిరంతరత అత్యంత అరుదైనదని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ బాలగంగాధరనాథ మహాస్వామిజీ వంటి మహనీయుల ప్రగాఢమైన ఆధ్యాత్మిక మార్గనిర్దేశాన్ని ఆయన కొనియాడారు. ఆ వారసత్వాన్ని నవోత్తేజంతో ముందుకు తీసుకెళ్తున్న ప్రస్తుత సారథులను అభినందించారు. ‘‘తరతరాలుగా సేవాభావంతో ఈ పవిత్ర సంస్థ మన భూమిని పావనం చేస్తోంది’’ అని ప్రధానమంత్రి మోదీ అన్నారు.

సమాజ పరివర్తనలో మహోన్నతులైన సాధుసంతుల పాత్రను వివరిస్తూ... సామాన్యులు, గ్రామీణ యువత కష్టాలను పరిష్కరించడంలోనే డాక్టర్ బాలగంగాధరనాథ మహాస్వామీజీ ఆధ్యాత్మిక శక్తి నిక్షిప్తమై ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భక్తి అంటే బాధ్యతల నుంచి తప్పించుకోవడం కాదని, ప్రజల అభ్యున్నతి దిశగా క్రియాశీల బాధ్యతను స్వీకరించడమేనంటూ... భక్తి భావనపై ఆ మహానుబావుడి దృక్కోణాన్ని శ్రీ మోదీ వివరించారు. ‘‘సమాజ శ్రేయస్సు కోసం బాధ్యతాయుతంగా ముందడుగు వేయడమే నిజమైన భక్తి’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

 

మహాస్వామీజీ చేపట్టిన విస్తృతమైన ప్రజోపయోగ కార్యక్రమాలను ప్రధానమంత్రి వివరించారు. నిరుపేద పిల్లల కోసం ప్రాథమిక విద్య నుంచి వృత్తి విద్యా కోర్సుల వరకు ఉచితంగా అందించే అనేక విద్యా సంస్థలను ఈ మఠం స్థాపించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆరోగ్య రంగంలో మఠం అనుసరిస్తున్న దూరదృష్టితో కూడిన విధానం వల్ల... ఎలాంటి వివక్ష లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందరికీ చేరువవుతున్నాయన్నారు. ‘‘నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండడం ప్రజలందరి హక్కు. అది కేవలం కొందరికే పరిమితమైన సదుపాయం కాదు’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

మఠం చేపడుతున్న మానవతా చర్యలకు, ప్రభుత్వ సంక్షేమ విధానాలకు నడుమ సారూప్యతను ప్రధానమంత్రి వివరించారు. కోట్లాది నిరుపేదలకు ఉచిత వైద్య చికిత్సలనందిస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం విజయవంతమైన తీరును ఆయన ఉదాహరించారు. ఇటీవల ఈ పథకాన్ని మరింత విస్తరిస్తూ.. 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరినీ దీని పరిధిలోకి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. ‘‘మన పెద్దలకు అవసరమైన ఆరోగ్య సదుపాయాలను అత్యంత గౌరవప్రదమైన రీతిలో వారికి అందించాలని మేం నిశ్చయించుకున్నాం’’ అని ఆయన పునరుద్ఘాటించారు.

సమస్త జీవరాశిపైనా మహాస్వామీజీకి గల అపారమైన కారుణ్యాన్ని ప్రస్తావిస్తూ... నెమళ్ల సంరక్షణ కోసం అంకితభావంతో ఆయన చేపట్టిన సామాజిక ఉద్యమాన్ని ప్రధానమంత్రి కొనియాడారు. పర్యావరణ పరిరక్షణతోపాటు, దేశ సాంస్కృతిక వారసత్వంతోనూ ఈ ఉద్యమం ముడిపడి ఉందన్నారు. ఢిల్లీలోని నివాసంలో తన పరిశీలనలను ప్రజల ముందుంచారు. జాతీయ పక్షితో తనకున్న ఆత్మీయానుబంధాన్ని వారితో పంచుకున్నారు. ‘‘నెమలి మన దేశానికి గర్వకారణం మాత్రమే కాదు... అది అత్యంత అందమైన, శాంతియుతమైన జీవి’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

ప్రస్తుత జగద్గురువు డాక్టర్ నిర్మలానందనాథ మహాస్వామీజీ సేవలను కొనియాడారు. గురువు అడుగుజాడల్లో విధేయుడై నడుస్తూ... ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులను తేవడంలో ఆయన అంకితభావాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. కొత్తగా నిర్మించిన శ్రీ గురు భైరవైక్య మందిరం కేవలం ఒక భౌతిక నిర్మాణం మాత్రమే కాదని, అచంచలమైన ఆధ్యాత్మిక శక్తికి అది సజీవ రూపమని అభివర్ణించారు. ‘‘నిస్సందేహంగా ఈ ఆలయం సేవకు, స్ఫూర్తికి శాశ్వత దిక్సూచిగా నిలుస్తుంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

ఆహారం, విద్య, ఆరోగ్యం, ఆధ్యాత్మికత, కరుణ వంటి అంశాలను మేళవిస్తూ.. శ్రీ ఆదిచుంచనగిరి మఠం పాటిస్తున్న తొమ్మిది మూల సూత్రాలను ప్రధానమంత్రి వివరించారు. వీటి స్ఫూర్తితో ఒక సమష్టి జాతీయ తీర్మానాన్ని ఆయన ప్రతిపాదించారు. సామాజిక ప్రయోజనమున్న తొమ్మిది నిర్దిష్ట రంగాలపై దృష్టి సారించడం ద్వారా, ఈ విలువలను అందిపుచ్చుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ‘‘మన సమష్టి బలోపేతం చేసేలా, తొమ్మిది కీలక విజ్ఞాపనలను ఈ రోజు మీ ముందు పెడుతున్నాను’’ అని శ్రీ మోదీ చెప్పారు.

 

మొదటి ఐదు విజ్ఞప్తులను వివరిస్తూ... జల సంరక్షణను ఒక ఉద్యమంగా చేపట్టాలని, ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని మాండ్య ప్రజలకు ప్రధానమంత్రి కోరారు. అన్ని బహిరంగ, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో స్వచ్ఛతను కాపాడాలని విన్నవించారు. అలాగే భారతీయ ఉత్పత్తులను ఆదరించడం ద్వారా స్వావలంబనపై దృష్టి సారించాలని, అద్భుతమైన దేశ సౌందర్యాన్ని ఆస్వాదించేలా దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని అభ్యర్థించారు. ‘‘మనం భూమాతను కాపాడుకోవాలి. క్రియాశీలంగా వ్యవహరిస్తూ మన దేశీయ పరిశ్రమలను బలోపేతం చేయాలి’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

 

ఆరోగ్యం, వ్యవసాయ రంగాల ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. రైతులు సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబించాలని కోరారు. శ్రీ హెచ్.డి. దేవెగౌడ ప్రాచుర్యంలోకి తెచ్చిన, ఈ ప్రాంత ప్రధాన ఆహారమైన రాగిముద్దతోపాటు చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని యువతను కోరారు. ఊబకాయాన్ని ఎదుర్కొనేందుకు వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించాలని, దేహదారుఢ్యాన్ని దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, సేవా దృక్పథాన్ని అలవరచుకోవాలని కోరారు. ‘‘యోగా, ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యమివ్వడం మన దైనందిన జీవితానికి అత్యావశ్యకం’’ అని శ్రీ మోదీ అన్నారు.

అభాగ్యులకు సేవచేయడం జీవితానికి గొప్ప సార్థకతను చేకూరుస్తుందని, సామాజిక నిర్మాణాన్ని బలోపేతం చేస్తుందని చెబుతూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ఈ తొమ్మిది అభ్యర్థనలను పాటించడం వల్ల... అభివృద్ధి చెందిన కర్ణాటక, అభివృద్ధి చెందిన భారత్ దిశగా మన సమష్టి పయనం మరింత వేగవంతమవుతుందని దృఢ విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. ‘‘వికసిత భారత్ లక్ష్యం దిశగా దృఢ సంకల్పంతో మనం వేగంగా పురోగమిద్దాం’’ అని శ్రీ మోదీ పిలుపునిచ్చారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Nepal praises India's efforts in times of crisis; calls PM Modi 'exceptionally generous'

Media Coverage

Nepal praises India's efforts in times of crisis; calls PM Modi 'exceptionally generous'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 30 ఆగష్టు 2026
August 30, 2026

Tiranga in Tashkent, Relief in Nepal: Soft Power Meets First Responder

Vocal for Local, Nari Shakti, Real Heroes: Mann Ki Baat’s Atmanirbhar Hour