జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (ఎన్‌టిఇపి) గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు ఉదయం న్యూఢిల్లీలోని 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో గల ఆయన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
2024లో టీబీ రోగులను ముందుగానే గుర్తించడం ద్వారా చికిత్సలో గణనీయమైన పురోగతి సాధ్యపడిందని ప్రశంసించిన ప్రధానమంత్రి... దేశవ్యాప్తంగా విజయవంతమైన ఈ వ్యూహాలను అమలు చేయాలని పిలుపునిచ్చారు. టీబీ నిర్మూలన పట్ల భారతదేశ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
ఇటీవల ముగిసిన 100 రోజుల టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం గురించి ప్రధానమంత్రి సమీక్ష నిర్వహిచారు. ఈ కార్యక్రమంలో భాగంగా 12.97 కోట్ల మంది టీబీ ముప్పు గల వ్యక్తులకు పరీక్షలు నిర్వహించి, 7.19 లక్షల మందిలో టీబీ వ్యాధిగ్రస్థులను గుర్తించారు. వీటిలో 2.85 లక్షల మందిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే టీబీ నిర్ధారణ అయింది. ఈ ప్రచారంలో భాగంగా ఒక లక్షకు పైగా కొత్త ని-క్షయ్ మిత్రాలు ఈ ప్రయత్నంలో భాగస్వాములయ్యారు. ఇది దేశవ్యాప్తంగా యావత్ ప్రభుత్వ, యావత్ సమాజ విధానాన్ని వేగవంతం చేసి, ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించడానికి వీలు కల్పించే జన్ భాగీదారి కోసం ఒక నమూనాగా నిలిచింది.
పట్టణ.. గ్రామీణ ప్రాంతాల ఆధారంగా, అలాగే వారి జీవనోపాధి ఆధారంగా కూడా టీబీ రోగుల ధోరణులను విశ్లేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇది ముఖ్యంగా నిర్మాణం, మైనింగ్, టెక్స్‌టైల్ మిల్లుల వంటి రంగాల్లోని కార్మికుల్లో ముందస్తు పరీక్షలు, చికిత్స అవసరమయ్యే సమూహాలను గుర్తించడంలో సహాయపడుతుందన్నారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో సాంకేతికత మెరుగవుతున్న క్రమంలో, నిక్షయ్ మిత్రాలు (టీబీ రోగుల సహాయకులు) టీబీ రోగులతో అనుసంధానం అయ్యేందుకు సాంకేతికతను ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. సంభాషణల ద్వారా, సులభంగా ఉపయోగించగల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రోగులకు వ్యాధిని గురించి, దాని చికిత్సను గురించి అవగాహన కలిగించాలని ప్రధానమంత్రి సూచించారు.
క్రమం తప్పకుండా తీసుకునే చికిత్సతో ఇప్పుడు టీబీని పూర్తిగా నయం చేయగలగడం వల్ల, ప్రజల్లో దీని గురించి భయాన్ని తగ్గించి, అవగాహనను పెంచాలని ప్రధానమంత్రి కోరారు.
టీబీ నిర్మూలనలో జన్ భాగీదారీ ద్వారా పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించడం కీలకమైన చర్యగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి రోగికి సరైన చికిత్స లభించేలా వ్యక్తిగతంగా వారిని సంప్రదించే ప్రయత్నాలు జరగాలని ఆయన కోరారు.
డబ్ల్యుహెచ్ఓ గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2024 వెల్లడించిన ప్రోత్సాహకరమైన ఫలితాలను ఈ సమావేశంలో ప్రధానమంత్రి ప్రస్తావించారు. టీబీ వ్యాప్తి 18 శాతం తగ్గిందని (2015 నుంచి 2023 మధ్య కాలంలో టీబీ సోకిన రోగుల 237 నుంచి 195 లక్షలకు తగ్గింది) ఈ నివేదిక ధ్రువీకరించింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కంటే భారత్‌లో టీబీ కేసుల తగ్గుదల వేగం రెట్టింపుస్థాయిలో ఉంది. అలాగే టీబీ మరణాల్లో సైతం 21 శాతం తగ్గుదల (లక్ష జనాభాకు 28 నుంచి 22 కి), 85 శాతం చికిత్స కవరేజ్, భారత్‌లో ఈ కార్యక్రమ పరిధి విస్తరణను, దాని ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
కీలక మౌలిక వనతులను మెరుగుపరచడం గురించి ప్రధానమంత్రి సమీక్షించారు. టీబీ రోగనిర్ధారణ కేంద్రాల నెట్‌వర్క్‌ను 8,540 ఎన్ఎఎటి (న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్టింగ్) ల్యాబ్‌లు, 87 కల్చర్- డ్రగ్ ససెప్టెబిలిటీ ల్యాబ్‌లకు విస్తరించడం, 500 ఏఐ- ఆధారిత హ్యాండ్‌హెల్డ్ ఎక్స్-రే పరికరాలు సహా 26,700 కి పైగా ఎక్స్-రే యూనిట్లు ఏర్పాటు చేయడం, అలాగే మరో 1,000 యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక చేయడం వంటి పనులు ఇందులో భాగంగా ఉన్నాయి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లలో ఉచిత స్క్రీనింగ్, రోగ నిర్ధారణ, చికిత్స, పోషకాహారం అందించడం సహా అన్ని రకాల టీబీ సేవల వికేంద్రీకరణ గురించి ప్రధానమంత్రి వివరించారు.
స్క్రీనింగ్ కోసం ఏఐ ఆధారిత హ్యాండ్-హెల్డ్ ఎక్స్-రేలు, డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కోసం స్వల్పకాలిక చికిత్సా విధానం, కొత్త స్వదేశీ మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్, పోషకాహారం అందించడం, అలాగే గనులు, టీ తోటలు, నిర్మాణ ప్రదేశాలు, పట్టణప్రాంతంలోని మురికివాడల వంటి ప్రదేశాల్లో పనిచేసే వారిలో వ్యాధిని ముందస్తుగా గుర్తించడం కోసం స్క్రీనింగ్ నిర్వహణ వంటి అనేక కొత్త కార్యక్రమాలను ప్రారంభించినట్లు ప్రధానమంత్రి వివరించారు. వీటిలో పోషకాహార కార్యక్రమాలు కూడా భాగంగా ఉన్నాయి. 2018 నుంచి 1.28 కోట్ల టీబీ రోగులకు ని-క్షయ్ పోషణ్ యోజన ద్వారా డిబిటి చెల్లింపులు చేయడంతో పాటు, 2024లో ఆ ప్రోత్సాహకాన్ని రూ. 1,000 కు పెంచడం జరిగిందన్నారు. ని-క్షయ్ మిత్ర కార్యక్రమం కింద, 2.55 లక్షల ని-క్షయ్ మిత్రాలు 29.4 లక్షల ఫుడ్ బాస్కెట్లను పంపిణీ చేసినట్లు ప్రధానమంత్రి తెలిపారు.
ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ పి.కె. మిశ్రా, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి-2 శ్రీ శక్తికాంత దాస్, ప్రధానమంత్రి సలహాదారు శ్రీ అమిత్ ఖారే, ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Chaired a meeting on India’s mission to eliminate TB. Driven by active public participation, the movement has gained significant momentum over the last few years. Our Government remains committed to working closely with all stakeholders to realise the vision of a TB-free India. pic.twitter.com/axi2cJJOhV
— Narendra Modi (@narendramodi) May 13, 2025


