ఇది భారతదేశ అద్భుత క్రీడా ప్రతిభను పండుగ చేసుకొనే ఘడియ..
దేశం నలుమూలలా ఉన్న క్రీడాకారుల ఉత్సాహాన్ని ప్రదర్శించే వేదిక కూడా: ప్రధాని
మేం క్రీడలను భారత సంపూర్ణ అభివృద్ధికి ఒక కీలక ఇంజినుగా చూస్తున్నాం: ప్రధానమంత్రి
మన క్రీడాకారులకు మరిన్ని ఎక్కువ అవకాశాలనిస్తున్నాం.. దాంతో వారు వారి ప్రతిభను పూర్తిస్థాయిలో పెంచుకోవచ్చు: ప్రధాని
భారత్ 2036 ఒలింపిక్స్‌ను నిర్వహించాలని గట్టిగా ప్రయత్నిస్తోంది: ప్రధానమంత్రి

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 38వ జాతీయ క్రీడలను ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు  ప్రారంభించారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ఉత్తరాఖండ్ లో ఈ రోజు యువ శక్తి పొంగిపొరలుతోందంటూ అభివర్ణించారు. బాబా కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగ మాతల ఆశీర్వాదాలతో 38వ జాతీయ క్రీడలు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్ ఆవిర్భవించి ఇప్పటికి ఇది 25వ సంవత్సరం అని శ్రీ మోదీ ప్రధానంగా చెబుతూ, ఈ యువ రాష్ట్రంలో  దేశం నలుమూలల నుంచి వచ్చిన యువత తన ప్రతిభను చాటిచెప్పనుందని వ్యాఖ్యానించారు.  ఈ కార్యక్రమం ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ సుందర చిత్రాన్ని ఆవిష్కరించిందని కూడా ఆయన ప్రశంసించారు. జాతీయ క్రీడల తాజా సంచికలో అనేక స్థానిక ఆటలను చేర్చారనీ, ‘హరిత క్రీడలు’ ఈ ఆటలపోటీకి ఇతివ‌ృత్తంగా ఉందనీ ఆయన చెప్పారు. ఈ ఇతివృత్తం గురించి ప్రధాని మరింతగా వివరిస్తూ, ఈ పోటీల సందర్భంగా ప్రదానం చేసే ట్రోఫీలు, పతకాలను ఎలక్ట్రానిక్ వ్యర్ధాల (ఈ-వేస్ట్)తో తయారు చేశారనీ, పతకాన్ని గెలిచే ప్రతి ఒక్క విజేత పేరుతో ఒక మొక్కను నాటనున్నారనీ ఆయన వెల్లడిస్తూ ఇది ఒక గొప్ప కార్యక్రమమని కొనియాడారు.
 

ఈ నేషనల్ గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారులు, క్రీడాకారిణులూ అందరికీ ఆయన తన శుభాకాంక్షలను తెలియజేశారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికీ, ఉత్తరాఖండ్ ప్రజలకూ కూడా ఆయన అభినందనలు తెలిపారు.

బంగారాన్ని పుటం పెట్టినందువల్ల అది శుద్ధం అయినట్లే, క్రీడాకారులకు, క్రీడాకారిణులకు వారి శక్తిని పెంపొందింపచేసుకోవడానికి మరిన్ని అవకాశాలను ఇస్తున్నారని ప్రధానమంత్రి పోలికగా చెప్పారు. ప్రస్తుతం సంవత్సర కాలంలో అనేక ఆటల పోటీలను నిర్వహిస్తున్నారనీ, ఖేలో ఇండియా శ్రేణిలో అనేక కొత్త టోర్నమెంట్‌లను చేర్చారనీ ఆయన వెల్లడించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేక మంది యువ క్రీడాకారులకు, యువ క్రీడాకారిణులకు వారి బాటలో ముందుకు సాగిపోవడానికి అనేక అవకాశాలను అందించిందనీ, ఇక యూనివర్సిటీ గేమ్స్ విశ్వవిద్యాలయాల విద్యార్థులకు చాలా అవకాశాలను ప్రసాదిస్తోందనీ శ్రీ మోదీ స్పష్టం చేశారు. దివ్యాంగ క్రీడాకారులు, దివ్యాంగ క్రీడాకారిణులు వారి ఆటతీరుకు మెరుగులు పెట్టుకోవడానికీ, కొత్త కొత్త విజయాలను చేజిక్కించుకోవడానికీ ఖేలో ఇండియా పారా గేమ్స్ తోడ్పడ్డాయని ఆయన అన్నారు.  ఖేలో ఇండియా శీతాకాల క్రీడలు ఇటీవల లద్దాఖ్‌లో మొదలయ్యాయి, కిందటి ఏడాదిలో సముద్ర తీర క్రీడలనూ నిర్వహించారు అని ప్రధానమంత్రి గుర్తుకు తెచ్చారు.
 

క్రీడలను ప్రోత్సహించడానికి చేపట్టే ప్రయత్నాలకు ఒక్క ప్రభుత్వానిదే బాధ్యతగా లేదనీ, కొత్త ప్రతిభావంతులను తెర ముందుకు తీసుకురావడం కోసం పార్లమెంట్ సభ్యుల్లో చాలా మంది వారి వారి నియోజకవర్గాల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారని  శ్రీ మోదీ తెలిపారు. కాశీ పార్లమెంటరీ నియోజకవర్గానికి సభ్యునిగా ఉన్న శ్రీ మోదీ ఒక్క తన పార్లమెంటరీ నియోజకవర్గంలోనే దాదాపుగా రెండున్నర లక్షల మంది యువత ఏటా ఆటల పోటీలలో పాల్గొనే అవకాశాలను అందుకొంటున్నారన్నారు. దేశంలో క్రీడలను ఒక సుందరమైన పుష్పగుచ్ఛంగా తీర్చిదిద్దుతున్నారనీ, పూలు ప్రతి కాలంలో పూస్తూ ఉన్న విధంగానే ఆటల పోటీలను నిరంతరాయంగా నిర్వహిస్తూ వస్తున్నారనీ ఆయన అభివర్ణించారు.
 
‘‘భారత సమగ్రాభివ‌ృద్ధికి ఒక కీలక మాధ్యమంగా క్రీడలను లెక్కలోకి తీసుకొంటున్నార’’ని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఒక దేశం క్రీడల్లో రాణించిందంటే దాని పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయన్నారు. ఈ కారణంగా, క్రీడలను భారతదేశ అభివృద్ధితోనూ, దేశ యువతలో విశ్వాసం స్థాయిలతోనూ పెనవేస్తున్నారని ప్రధాని అన్నారు. మన దేశం ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక శక్తిగా మారే దిశలో వేగంగా పయనిస్తోందనీ, ఈ కృషిలో క్రీడాప్రధాన ఆర్థిక వ్యవస్థ ముఖ్యపాత్రను పోషిస్తోందనీ ఆయన ప్రధానంగా చెప్పారు. ప్రతి ఒక్క క్రీడాకారుడు, క్రీడాకారిణి వెనుక కోచ్‌లు, శిక్షకులు, పోషణ నిపుణులు, దేహదారుఢ్య విషయాల ప్రవీణులు, వైద్యులు, క్రీడాసామగ్రి ల వంటి విస్తారిత అనుబంధ వ్యవస్థ (ఇకోసిస్టమ్) దన్నుగా నిలుస్తోందని ఆయన అన్నారు. ప్రపంచమంతటా క్రీడాకారులు ఉపయోగిస్తున్న నాణ్యత కలిగిన క్రీడా పరికరాల తయారీదారుగా భారత్ రూపొందుతోందని శ్రీ మోదీ చెప్పారు. క్రీడాసాధన సామగ్రిని తయారు చేస్తున్న చిన్నా, పెద్దా ఫ్యాక్టరీలు కలుపుకొని 35,000కు పైగా మేరఠ్‌లో ఏర్పాటయ్యాయనీ, అవి 3 లక్షల కన్నా ఎక్కువ మందికి బతుకుతెరువును కల్పిస్తున్నాయనీ ఆయన వివరించారు. ఈ తరహా విస్తారిత అనుబంధ వ్యవస్థలను దేశం అంతటా ఏర్పాటు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
 

భారతదేశం పక్షాన ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారుల బృందాన్ని ఈమధ్యే ఢిల్లీలో తన నివాసంలో కలుసుకొనే అవకాశం తనకు లభించిందని ప్రధానమంత్రి చెబుతూ, ఆ సందర్భంగా తమ మధ్య జరిగిన సంభాషణల్లో క్రీడాకారుల్లో ఒకరు తనను ప్రధానమంత్రి గా కాకుండా ‘పరం మిత్ర’ అని సరికొత్త నిర్వచనాన్ని చెప్పారని గుర్తుచేసుకొన్నారు. ఈ నమ్మకమే తనలో శక్తిని నింపుతుందని ఆయన అన్నారు. మన క్రీడాకారుల ప్రతిభ, సామర్థ్యాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు. గత పది సంవత్సరాల్లో వారి ప్రతిభకు అండదండలను అందించడంపై అదే పనిగా శ్రద్ధ తీసుకొంటున్నట్లు, గడచిన దశాబ్ద కాలంలో క్రీడలకు కేటాయించిన బడ్జెట్ మూడింతల కన్నా ఎక్కువగా ఉందని ప్రధాని వివరించారు. టీఓపీఎస్ పథకంలో భాగంగా, డజన్ల కొద్దీ క్రీడాకారులకు కోట్లాది రూపాయల విలువైన సాయాన్ని అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఖేలో ఇండియా కార్యక్రమం దేశం నలుమూలలా ఆధునిక క్రీడా సంబంధ మౌలిక వసతి, సదుపాయాలను సమకూరుస్తోందని ఆయన ఉద్ఘాటించారు. పాఠశాలల్లో క్రీడలను ప్రధాన స్రవంతిలో చేర్చారనీ, దేశంలోనే మొట్టమొదటి క్రీడా విశ్వవిద్యాలయాన్ని మణిపూర్‌లో ఏర్పాటు చేస్తున్నారనీ శ్రీ మోదీ చెప్పారు.  

ప్రభుత్వం ఈ రంగంలో చేస్తున్న కృషి మైదానంలోనే కాకుండా పతకాల పట్టికలో కూడా కనపడుతోందనీ, భారతీయ క్రీడాకారులు, క్రీడాకారిణులు ప్రతి ఒక్క అంతర్జాతీయ పోటీలో వారి ప్రతిభను కనబరుస్తూ వారిదైన ముద్రను వేస్తున్నారనీ ప్రధానమంత్రి ప్రధానంగా చెప్పారు. ఒలింపిక్స్‌లో, పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు, క్రీడాకారిణులు శ్రేష్ఠ ప్రదర్శననిచ్చిన సంగతిని ఆయన ప్రశంసిస్తూ, ఉత్తరాఖండ్‌కు చెందిన చాలా మంది ఆటగాళ్లు కూడా పతకాలు సంపాదించారని గుర్తుచేశారు. ఈ ఆటల పోటీల్లో పాల్గొంటున్న వారిని ఉత్సాహపరచడానికి పతక విజేతలు అనేక మంది ఈ సభాస్థలానికి తరలివచ్చినందుకు శ్రీ మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
 

హాకీ వెలిగిపోయిన రోజులు మళ్లీ తిరిగి వస్తున్నాయని శ్రీ మోదీ అభివర్ణించారు. భారతదేశ ఖో-ఖో జట్టు ఇటీవల ప్రపంచ కప్‌ను గెలిచింది, చిరంజీవి గుకేశ్ డి. ప్రపంచ చదరంగం చాంపియన్‌షిప్‌ను సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇంకా, కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఈవెంట్‌లో మహిళా విజేతగా నిలిచారు అని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ విజయాలు భారత్‌లో క్రీడలు ఇక విద్యేతర కార్యకలాపాలుగానే ఎంతమాత్రం మిగిలిపోలేదని, యువత క్రీడలను వృత్తి పరంగా ఒక ప్రధాన ఎంపికగా భావిస్తున్నారని ప్రధాని స్పష్టం చేశారు.

 

“క్రీడాకారులు ఎప్పుడూ పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకున్నట్టుగానే భారత్ కూడా గొప్ప తీర్మానాలతో ముందుకు సాగుతోంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. 2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ విశేషంగా కృషి చేస్తోందని, ఇది భారత క్రీడా రంగాన్ని కొత్త శిఖరాలకు చేరుస్తుందని అన్నారు. ఒలింపిక్స్ కేవలం క్రీడా కార్యక్రమం మాత్రమే కాదని, ఆతిథ్య దేశంలో అనేక రంగాల్లో అది జవసత్వాలను నింపుతుందని శ్రీ మోదీ చెప్పారు. ఒలింపిక్స్ కోసం క్రీడా మౌలిక సదుపాయాల నిర్మాణం వల్ల ఉద్యోగావకాశాలు లభిస్తాయని, భవిష్యత్ క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు సమకూరుతాయని అన్నారు. ఒలింపిక్స్ ఆతిథ్య నగరంలో అనుసంధాన మౌలిక సదుపాయాలు మెరుగుపడి నిర్మాణ, రవాణా రంగాలకు ఊతమిస్తాయన్నారు. కొత్త హోటళ్ల నిర్మాణంతోపాటు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులు, వీక్షకుల  వల్ల దేశ పర్యాటక రంగానికీ గణనీయమైన లబ్ధి చేకూరుతుందని ప్రధానమంత్రి తెలిపారు. దేవభూమి ఉత్తరాఖండ్ లో జరుగుతున్న జాతీయ క్రీడలు స్థానిక ఆర్థిక వ్యవస్థ వృద్దికి కూడా దోహదపడుతాయన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వీక్షకులు  ఉత్తరాఖండ్ లోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తారన్న ప్రధాని.. తద్వారా ఈ పోటీలు క్రీడాకారులకే కాకుండా ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకూ ప్రయోజనం కలిగిస్తాయని స్పష్టం చేశారు.

 

21వ శతాబ్దాన్ని భారతదేశ శతాబ్దంగా ప్రపంచం కొనియాడుతోందని స్పష్టం చేసిన శ్రీ మోదీ.. బాబా కేదార్‌నాథ్‌ను దర్శించుకున్న అనంతరం ఇది ఉత్తరాఖండ్ దశాబ్దమన్న భావన సహజంగానే మదిలో మెదిలిందని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ వేగంగా అభివృద్ధి చెందుతుండడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. బిడ్డలు, తల్లులు, అక్కాచెల్లెల్ల గౌరవప్రదమైన జీవితానికి పునాదిగా నిలిచే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువలను బలోపేతం చేస్తుందన్నారు. దీనిని క్రీడా వేడుకకు అనుసంధానిస్తూ, క్రీడా స్ఫూర్తి వివక్షా భావాలన్నింటినీ తొలగిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రతి విజయమూ ప్రతి పతకమూ సమష్టి కృషి ద్వారానే లభిస్తాయని, క్రీడలు బృంద స్ఫూర్తిని ప్రేరేపిస్తాయని అన్నారు. వివక్ష లేకుండా అందరినీ సమానంగా పరిగణించే ఉమ్మడి పౌర స్మృతికి కూడా ఇదే స్ఫూర్తి వర్తిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ చారిత్రక చర్య తీసుకున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు.

ఇలాంటి భారీ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్నదని పేర్కొన్న ప్రధానమంత్రి.. ఇది ఆ రాష్ట్రం సాధించిన విశేషమైన విజయమని ప్రశంసించారు. దీని ద్వారా ఉపాధి అవకాశాలు మరింత పెరిగి స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఉత్తరాఖండ్‌ ఆర్థిక వ్యవస్థ కేవలం చార్‌ ధామ్‌ యాత్రపైనే ఆధారపడకుండా, అభివృద్ధి కోసం కొత్త మార్గాలను అన్వేషించాలని ఆయన కోరారు. ఈ యాత్రల ఆకర్షణను పెంచేలా ప్రభుత్వం ఎప్పటికప్పుడు సౌకర్యాలను మెరుగుపరుస్తోందని, ప్రతి సీజన్‌లో యాత్రికుల సంఖ్య కొత్త రికార్డులను సృష్టిస్తోందని తెలిపారు. అయినప్పటికీ ఇది సరిపోదన్నారు. ఉత్తరాఖండ్‌లో శీతాకాలపు ఆధ్యాత్మిక యాత్రలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని శ్రీ మోదీ అన్నారు. ఈ దిశగా సరికొత్తగా చర్యలు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ఈ శీతాకాల యాత్రల్లో పాలుపంచుకోవాలని భావిస్తున్నట్టు తెలిపారు. యాత్రికుల సంఖ్య తక్కువగా ఉన్న సమయంలో శీతాకాలాల్లో ఉత్తరాఖండ్ ను సందర్శించాలని దేశ యువతకు ఆయన సూచించారు. అనేక సాహస కృత్యాలకు అక్కడ అవకాశాలున్నాయన్నారు. జాతీయ క్రీడల అనంతరం ఈ అవకాశాలన్నింటినీ వినియోగించుకోవాలని, ఈ దేవభూమి ఆతిథ్యాన్ని మరికొన్ని రోజులు ఆస్వాదించాలని క్రీడాకారులను ఆయన కోరారు.
 

తమ తమ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులు జాతీయ రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను నెలకొల్పడానికి తీవ్రంగా పోటీ పడతారన్న ప్రధానమంత్రి.. అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలని కోరారు. జాతీయ క్రీడలు కేవలం ఆటల పోటీలే కావనీ భారత వైవిధ్యాన్ని చాటిచెప్పే ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’కు వేదిక అనీ శ్రీ మోదీ స్పష్టం చేశారు. తమ పతకాలు దేశ ఐక్యతను, ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తాయని ప్రతి క్రీడాకారుడూ గుర్తించాలన్నారు. వివిధ రాష్ట్రాల భాషలు, వంటకాలు, సంగీతం గురించి తెలుసుకోవాలని ఆయన వారిని కోరారు. పారిశుద్ధ్యం ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి.. ఉత్తరాఖండ్ ప్లాస్టిక్ రహితంగా ఎదిగేలా పురోగమిస్తోందని, క్రీడాకారుల సహకారం లేకుండా ఈ లక్ష్యాన్ని సాధించలేమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

శారీరక దారుఢ్య ప్రాధాన్యాన్ని, దేశంలో పెరుగుతున్న స్థూలకాయ సమస్యను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. స్థూలకాయం సమస్య యువత సహా అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేస్తోందనీ మధుమేహం, గుండె జబ్బుల వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని అన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమం ద్వారా ఫిట్‌నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలిపై దేశ ప్రజలు మరింత అవగాహన పొందుతున్నారని శ్రీ మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. శారీరక శ్రమ, క్రమశిక్షణ, సమతౌల్య జీవనం ప్రాధాన్యాన్ని జాతీయ క్రీడలు వెల్లడిస్తాయన్నారు. వ్యాయామం, ఆహారం - ఈ రెండు విషయాలపైనా దృష్టిపెట్టాలని దేశ ప్రజలను ప్రధానమంత్రి కోరారు. నడక ద్వారా, లేదా కసరత్తుల ద్వారా ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలని సూచించారు. సమతౌల్య, పోషకాహార ప్రాధాన్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అనారోగ్యకరమైన కొవ్వులు, నూనెల వినియోగాన్ని తగ్గించాలని కోరారు. ప్రతి నెలా వంట నూనెల వాడకాన్ని కనీసం 10% తగ్గించాలని ఆయన సూచించారు. చిన్న చిన్న చర్యలు ఆరోగ్యాన్ని విశేషంగా మెరుగుపరుస్తాయన్నారు. ఆరోగ్యకరమైన శరీరం ద్వారా ఆరోగ్యకరమైన మనస్సు సాధ్యపడుతుందనీ తద్వారా ఆరోగ్యకరమైన దేశాని నిర్మించవచ్చనీ ఆయన వ్యాఖ్యానించారు. శారీరక దారుఢ్యం, పోషకాహారంపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలు, పాఠశాలలు, కార్యాలయాలు, బృంద నాయకులకు శ్రీ మోదీ పిలుపునిచ్చారు. సరైన పోషకాహారం ప్రాధాన్యంపై తమ ఆచరణాత్మక అనుభవాలను, పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ ప్రజలతో పంచుకోవాలని కోరారు. ‘ఫిట్ ఇండియా’ నిర్మాణం కోసం సమష్టి కృషికి పిలుపునిస్తూ.. 38వ జాతీయ క్రీడల ప్రారంభాన్ని ప్రకటించిన ప్రధాని, క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగాన్ని ముగించారు.

ఉత్తరాఖండ్ గవర్నర్, లెఫ్టినెంట్ జనరల్ (విశ్రాంత) గుర్మీత్ సింగ్, ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామీ, కేంద్ర సహాయ మంత్రులు శ్రీ అజయ్ తాంతా, శ్రీమతి రక్షా ఖడ్సేతోపాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

నేపథ్యం

రాష్ట్ర రజతోత్సవ సంవత్సరం వేళ ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో 38వ జాతీయ క్రీడలను నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి వచ్చే నెల 14 వరకు ఆ రాష్ట్రంలోని 8 జిల్లాలకు చెందిన 11 నగరాలు ఈ క్రీడలకు వేదికలు కానున్నాయి.

జాతీయ క్రీడల్లో 36 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పాల్గొంటున్నాయి. 17 రోజుల పాటు 35 క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. వీటిలో 33 క్రీడలకు పతకాలు అందజేస్తారు. మరో రెండు ప్రదర్శన క్రీడలు. యోగా, మల్లఖంబ్‌లను తొలిసారిగా జాతీయ క్రీడల్లో చేర్చారు. దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

సుస్థిరతను పెంపొందించడంపై దృష్టిసారించి ఈ ఏడాది జాతీయ ఇతివృత్తాన్ని ‘గ్రీన్ గేమ్స్’గా నిర్ణయించారు. వేదిక సమీపంలో స్పోర్ట్స్ ఫారెస్ట్ పేరుతో ప్రత్యేక పార్కును ఏర్పాటు చేస్తారు. క్రీడాకారులు, అతిథులు అక్కడ 10,000 కన్నా ఎక్కువ మొక్కలు నాటుతారు. క్రీడాకారుల పతకాలు, ధ్రువీకరణ పత్రాలను పర్యావరణ హిత, బయో డీగ్రేడబుల్ వస్తువులతో తయారు చేస్తారు.  

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Rural commercial vehicle retail sales growth outpaces urban: Fada data

Media Coverage

Rural commercial vehicle retail sales growth outpaces urban: Fada data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM condoles loss of lives in firecracker factory mishap in Kaushambi
August 31, 2026
PM announces ex-gratia from Prime Minister’s National Relief Fund

The Prime Minister, Shri Narendra Modi has expressed deep sorrow over the loss of lives in a mishap at a firecracker factory in Kaushambi, Uttar Pradesh. Shri Modi conveyed his condolences to the bereaved families and prayed for the speedy recovery of the injured.

Shri Modi also announced an ex-gratia of ₹2 lakh from the Prime Minister’s National Relief Fund (PMNRF) to the next of kin of each deceased and ₹50,000 for the injured.

The Prime Minister posted on X;

Extremely saddened by the loss of lives due to a mishap at a firecracker factory in Kaushambi, Uttar Pradesh. My thoughts are with the bereaved families in this hour of grief. May the injured recover at the earliest.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi