“భారత యువత నిరంతరం దేశ ప్రగతివైపు నడిచేలా ‘ఎన్‌సిసి’ స్ఫూర్తినిచ్చింది”
“ప్రపంచ శ్రేయస్సు దిశగా భారత యువత ఓ కీలక శక్తి”
“భారత యువత ఎదుర్కొంటున్న అనేక అవరోధాల తొలగింపు దిశగా గత పదేళ్లలో మా కృషి ఫలించడంతో వారి సామర్థ్యం ఇనుమడించింది”
“ప్రస్తుత అమృత కాలంలో మన ఏకైక లక్ష్యం ‘వికసిత భారత్’... మన ప్రతి నిర్ణయానికీ ఇదే ప్రమాణం... మన ప్రతి కార్యాచరణకూ అదే గమ్యం కావాలి”

దేశ రాజధాని ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఇవాళ నిర్వహించిన వార్షిక ‘నేషనల్ కేడెట్‌ కోర్‌ (ఎన్‌సిసి) పీఎం ర్యాలీ’లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఓ సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించడంతోపాటు ఉత్తమ కేడెట్లకు పురస్కార ప్రదానం చేశారు. ‘ఎన్‌సిసి దినోత్సవం’ నేపథ్యంలో సభికులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ- 18 మిత్రదేశాల నుంచి దాదాపు 150 మంది కేడెట్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని వారందరినీ స్వాగతిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ‘మేరా యువ భారత్’ (మై భారత్) పోర్టల్ ద్వారా దేశం నలుమూలల నుంచి ఆన్‌లైన్‌లో పాల్గొన్న యువతను కూడా ఆయన అభినందించారు. 

అనంతరం వారినుద్దేశించి మాట్లాడుతూ- “గణతంత్ర దినోత్సవ కవాతుకు ఎంపిక కావడమే  ఎన్‌సిసి కేడెట్లు సాధించిన ఒక విజయం” అని ప్రశంసించారు. ఒక గణతంత్రంగా భారత్‌ 75 ఏళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఈ ఏడాది వేడుకలు ప్రత్యేకమైనవని ఆయన అన్నారు. ఈ జ్ఞాపకాలన్నీ జీవితాంతం నిలిచిపోతాయని, ఈ చిరస్మరణీయ సందర్భంలో భాగస్వాములైన కేడెట్లకు ఇది గర్వకారణమని ప్రధాని పేర్కొన్నారు. పురస్కార విజేతలైన కేడెట్లను అభినందిస్తూ- ‘ఎన్‌సిసి’ సంబంధిత పలు కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం లభించడం తన అదృష్టమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భారత వారసత్వాన్ని యువత ఆకాంక్షలతో అనుసంధానిస్తాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కార్యక్రమాల్లో పాలుపంచుకున్న కేడెట్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

 

   మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంలో ఆవిర్భవించిన ‘ఎన్‌సిసి’ దేశ రాజ్యాంగానికన్నా ముందే తన పయనం ప్రారంభించిందని శ్రీ మోదీ గుర్తుచేశారు. గడచిన 75 ఏళ్ల గణతంత్రంలో ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం ఎనలేని స్ఫూర్తినిచ్చిందని, పౌర విధుల ప్రాధాన్యాన్ని స్పష్టం చేసిందని ప్రధాని అన్నారు. అదే తరహాలో భారత యువతకు క్రమశిక్షణ ప్రాముఖ్యాన్ని తెలియజెప్పిన ‘ఎన్‌సిసి’- దేశ ప్రగతి వైపు పయనించేలా వారిలో స్ఫూర్తి నింపిందన్నారు. ‘ఎన్‌సిసి’ పరిధి, బాధ్యతల విస్తరణ కోసం ఇటీవలి కాలంలో ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టడంపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ‘ఎన్‌సిసి’ని సరిహద్దు ప్రాంతాలు సహా తీరప్రాంత జిల్లాలకు విస్తరించామని తెలిపారు. ఈ మేరకు 170కిపైగా సరిహద్దు తాలూకాలు, దాదాపు 100 తీరప్రాంత తాలూకాల్లో ‘ఎన్‌సిసి’ పనిచేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ జిల్లాల్లో యువ కేడెట్లకు ప్రత్యేక శిక్షణనిచ్చే బాధ్యతను స్వీకరించిన త్రివిధ దళాలను శ్రీ మోదీ అభినందించారు. దీనివల్ల ముఖ్యంగా సరిహద్దు ప్రాంత వాసులైన వేలాది యువతకు ప్రయోజనం చేకూర్చిందని చెప్పారు. కేడెట్ల సంఖ్య పెరగడాన్ని బట్టి ‘ఎన్‌సిసి’లో సంస్కరణల ఫలితాలు సుస్పష్టం అవుతున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఆ మేరకు 2014లో కేడెట్ల సంఖ్య దాదాపు 14 లక్షలు కాగా, నేడు 20 లక్షలకు పెరిగిందని, వీరిలో బాలికల సంఖ్య 8 లక్షలుగా ఉందని వివరించారు. విపత్తుల నిర్వహణలో కీలక పాత్ర పోషించడంతోపాటు క్రీడా లోకంలోనూ కేడెట్లు ప్రతిభను చాటుకుంటున్నారని ప్రధాని కొనియాడారు. ప్రపంచంలో యూనిఫాం సహిత అతిపెద్ద యువజన సంస్థగా ‘ఎన్‌సిసి’కి గుర్తింపు లభించడంపై తానెంతో గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు.

 

   ప్రస్తుత 21వ శతాబ్దంలో దేశాభివృద్ధితో పాటు ప్రపంచ ప్రగతిని కూడా నిర్ణయించేది భారత యువతేనని ప్రధాని సగర్వంగా ప్రకటించారు. “భారత యువత దేశాభివృద్ధికి దోహదం చేయడమే కాకుండా ప్రపంచ శ్రేయస్సుకు పాటుపడే కీలక శక్తి” అని ఆయన స్పష్టం చేశారు. గత దశాబ్ద కాలంలో భారత యువత సాధించిన ఘనతను వార్తాపత్రికలలో ఇటీవల వెలువడిన ఒక నివేదిక వివరించిందని ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు 1.5 లక్షల అంకుర సంస్థల ఏర్పాటు సహా 100కుపైగా ‘యూనికార్న్‌’ సంస్థలను యువతరం సృష్టించినట్లు ఆ కథనం పేర్కొన్నదని ఆయన ఉటంకించారు. అంతేకాకుండా ప్రపంచంలోని 200కుపైగా ప్రధాన కంపెనీలను భారత సంతతి నిపుణులే నడిపిస్తున్నారని, ప్రపంచ ‘జిడిపి’కి ఆ సంస్థలు రూ.కోటానుకోట్లు జోడిస్తున్నాయని పేర్కొన్నారు. తద్వారా లక్షలాది ప్రజల జీవితాలను మెరుగుదిద్దడంలో తమవంతు తోడ్పాటునిస్తున్నారని ప్రధాని తెలిపారు. ప్రపంచ పురోగమనాన్ని వేగిరపరచడంలో భారత శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఉపాధ్యాయుల కృషి అమూల్యమని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఏ రంగంలోనైనా భారత యువత సామర్థ్యం, ప్రతిభ లేని ప్రపంచ భవిష్యత్తును ఊహించడం కష్టం కాబట్టే వారిని ‘ప్రపంచ శ్రేయస్సుకు తోడ్పడే శక్తి’గా అభివర్ణిస్తున్నానని పేర్కొన్నారు.

   అనవసర అవరోధాలను అధిగమించగలిగితే వ్యక్తి లేదా దేశం బలం ఇనుమడిస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ఆ మేరకు గత 10 సంవత్సరాల్లో భారత యువతకుగల అనేక అడ్డంకులు తొలగించామని గుర్తుచేశారు. దీనివల్ల యువతరంలోనే కాకుండా దేశ సామర్థ్యం కూడా మెరుగుపడిందని సంతృప్తి వ్యక్తం చేశారు. నేటి యువకులలో అధికశాతం 2014 నాటికి దాదాపు 10-12 ఏళ్ల వయస్కులని గుర్తుచేస్తూ- అప్పటి పరిస్థితుల గురించి వారి కుటుంబ సభ్యులను వాకబు చేయాలని సూచించారు. లోగడ అడ్మిషన్లు, పరీక్షలు, నియామకాల కోసం అర్హత పత్రాలపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ అవసరమయ్యేదని గుర్తుచేశారు. దీనివల్ల యువత ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేదని, ఈ సమస్య పరిష్కారం దిశగా పత్రాల స్వీయ ధ్రువీకరణ పద్ధతిని ప్రభుత్వం అనుమతించిందని ప్రధాని ఉదాహరించారు. విద్యార్థులకు ఉపకారవేతన నిధుల పంపిణీలో అనేక సమస్యలు ఉండేవని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుల సమర్పణ, ఉపకారవేతనం మంజూరు ప్రక్రియలలో నానా బాధలూ పడాల్సి వచ్చేదని చెప్పారు. ఈ అవస్థలకు స్వస్తి చెబుతూ ప్రభుత్వం ఏకగవాక్ష (సింగిల్ విండో) పద్ధతిని ప్రవేశపెట్టిందని తెలిపారు. దీంతో చికాకు పెట్టే సమస్యలన్నీ సమసిపోయాయని వివరించారు. అలాగే పాఠ్యాంశాల ఎంపికలో లోగడ విద్యార్థులు ఎదుర్కొన్న చిక్కులను శ్రీ మోదీ ప్రస్తావించారు. బోర్డు పరీక్షల అనంతరం ఒక పాఠ్యాంశాన్ని ఎంచుకున్న విద్యార్థికి ఆ తర్వాత దాన్ని మార్చుకోవడం అమిత కష్టంగా ఉండేదన్నారు. అయితే, ఇప్పుడు కొత్త జాతీయ విద్యా విధానం కింద విద్యార్థులు తమ అభిరుచికి అనుగుణంగా పాఠ్యాంశాలను మార్చుకునే వెసులుబాటు లభించిందని తెలిపారు.

 

   ఓ దశాబ్దం కిందట బ్యాంకు రుణం పొందాలంటే యువత కచ్చితమైన పూచీకత్తు (హామీ) ఇవ్వాల్సి ఉండేదని ప్రధాని గుర్తుచేశారు. దీంతో రుణం తెచ్చుకోవడమంటే అమిత భారంగా ఉండేదని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నడుమ 2014లో తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక దేశ యువత బాధ్యతను స్వీకరిస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. తదనుగుణంగా ప్రభుత్వం ముద్ర యోజనను ప్రవేశపెట్టిందని, దీనిద్వారా హామీరహిత రుణ సౌలభ్యం కలిగిందన్నారు. ఈ పథకం గురించి వివరిస్తూ- ప్రారంభంలో రూ.10 లక్షలదాకా హామీరహిత రుణాలివ్వగా, తమ ప్రభుత్వ  మూడో దఫా పదవీకాలంలో ఈ పరిమితిని రూ.20 లక్షలకు పెంచామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ముద్ర యోజన కింద గత పదేళ్లలో రూ.40 లక్షల కోట్లకుపైగా నిధుల పంపిణీతో లక్షలాది యువత సొంత వ్యాపారం ప్రారంభించే అవకాశం లభించిందని చెప్పారు.

   యువతరం భవిష్యత్తు విషయంలో ఎన్నికల వ్యవస్థ ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ-  రెండు రోజుల కిందట జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించుకోవడాన్ని ప్రధాని గుర్తుచేశారు. ఈ సందర్భంగా చాలామంది యువకులు తొలిసారి ఓటర్లుగా మారారని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఓటర్ల గరిష్ఠ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే ఓటర్ల దినోత్సవం ప్రధానోద్దేశమని ఆయన అన్నారు. ప్రపంచంలో అత్యంత భారీ ఎన్నికల ప్రక్రియను నిర్వహించే సామర్థ్యాన్ని భారత్‌ ఎన్నడో రుజువు చేసుకున్నదని గుర్తుచేశారు. అయితే, కొన్ని నెలలకు ఒకసారి తరచూ ఎన్నికలు నిర్వహించాల్సి రావడం అనేక సవాళ్లకు దారితీస్తున్నదని ప్రధాని ప్రస్తావించారు. ఆదిలో లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు ఒకేసారి నిర్వహించే సంప్రదాయం ఉండేదని, ఈ విధానంలో మార్పుతో దేశానికి నేడు క్లిష్ట సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు.

   దేశంలో తరచూ ఎన్నికల నిర్వహణ వల్ల ఓటర్ల జాబితాల నవీకరణతోపాటు అనేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని ప్రధాని చెప్పారు. ముఖ్యంగా ఉపాధ్యాయుల విధులకు ఆటంకంతోపాటు విద్యార్థుల చదువులు-పరీక్షల సన్నాహాలపైనా దుష్ప్రభావం పడుతుందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. అలాగే పదేపదే ఎన్నికల ఫలితంగా పాలనపరంగానూ ఇబ్బందులు తప్పవని, చెప్పారు. అందుకే, “ఒక దేశం-ఒకే ఎన్నిక” భావన దేశంలో నేడు ప్రధాన చర్చనీయాంశమైందని ఆయన అన్నారు. ఈ చర్చలో దేశ యువత కూడా చురుగ్గా పాలుపంచుకోవాలని శ్రీ మోదీ సూచించారు. ఇది వారి భవిష్యత్తును ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని స్పష్టం చేశారు. అమెరికా వంటి దేశాల్లో నాలుగేళ్లకు ఒకసారి ఎన్నికల నిర్వహణతోపాటు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తేదీ ఖరారై ఉంటుందని గుర్తుచేశారు. అదేవిధంగా కళాశాలలు లేదా పాఠశాలల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు కూడా ఒకేసారి పూర్తవుతాయని ఆయన తెలిపారు. అయితే, నెలకోసారి ఏదో ఒక ఎన్నిక నిర్వహించాల్సిన కారణంగా వారి చదువులపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఆలోచించాలన్నారు. ఈ నేపథ్యంలో “ఒకే దేశం-ఒకే ఎన్నిక”పై చర్చలో పాల్గొనాల్సిందిగా యువతను ఆయన ప్రోత్సహించారు.

 

   ఈ 21వ శతాబ్దపు ప్రపంచం వేగంగా మారుతున్నందున దానికి అనుగుణంగా ముందడుగు వేయడం చాలా అవసరమని, ఈ రూపాంతరీకరణలో యువత పాత్ర కీలకమని ప్రధాని స్పష్టం చేశారు. కళ, పరిశోధన లేదా ఆవిష్కరణ వంటి ఏ రంగంలోనైనా తమ ఆవిష్కరణాత్మక ఆలోచనలు, సృజనాత్మకతతో కొత్త శక్తి నింపేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆ క్రమంలో రాజకీయాల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ- దీన్ని కూడా ఒక కీలక  రంగంగా గుర్తించాలని ప్రధానమంత్రి స్పష్టీకరించారు. ఆ మేరకు కొత్త సూచనలు, వినూత్న ఆలోచనలతో యువత రాజకీయ రంగప్రవేశం చేయాలని, ఇది నేటి తక్షణావసరమని యువతకు సూచించారు. దీనిపై తాను ఇంతకుముందు ఎర్రకోట పైనుంచి పిలుపునిస్తూ- లక్ష మంది యువత రాజకీయాల్లోకి రావాలని కోరడాన్ని గుర్తుచేశారు. యువతరం శక్తిసామర్థ్యాలేమిటో “వికసిత భారత్: యువ నాయక చర్చాగోష్ఠి” కార్యక్రమంలో తాను చూశానని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశంలోని లక్షలాది యువత అమూల్య సూచనలిచ్చారని, వికసిత భారత్‌ సంకల్ప సాకారంపై తమ ఆలోచనలను పంచుకున్నారని పేర్కొన్నారు.

 

   స్వాతంత్ర్య ఉద్యమం సందర్భంగా ఏ వృత్తిలో ఉన్నవారికైనా- “భారత స్వాతంత్ర్యం” ఒక్కటే ఏకైక లక్ష్యంగా ఉండేదని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ప్రస్తుత అమృత కాలంలో ‘వికసిత భారత్‌” మన ఏకైక లక్ష్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మన ప్రతి నిర్ణయానికీ ఇదే ప్రమాణం కావాలని, మన ప్రతి కార్యాచరణకూ అదే గమ్యం కావాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ‘పంచ ప్రాణ్‌’ మంత్రాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరాన్ని ప్రధాని గుర్తుచేశారు. తదనుగుణంగా “వికసిత భారత్‌ నిర్మాణం, బానిస మనస్తత్వం నుంచి విముక్తం కావడం, మన వారసత్వంపై గర్వించడం, దేశ సమైక్యతకు కృషి చేయడం, నిజాయితీతో విధి నిర్వహణ”  ప్రధానమని స్పష్టం చేశారు. ఈ పంచ ప్రాణ్ సూత్రం ప్రతి భారతీయుడికీ మార్గనిర్దేశం చేసి, స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత కార్యక్రమంలో భాగంగా తాను తిలకించిన సాంస్కృతిక ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుందని శ్రీ మోదీ ప్రశంసించారు. దేశానికి ఎంతో బలమైన “ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్” స్ఫూర్తిని ఇది ప్రతిబింబించిందని వ్యాఖ్యానించారు. ప్రయాగ మహా కుంభమేళా దేశ ఐక్యతకు ప్రతీక అని, దీన్ని ‘ఐక్యత కుంభ్’గా ఆయన అభివర్ణించారు. దేశ పురోగమనానికి ఈ సమైక్యత అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.

   ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సదా గుర్తుంచుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తూ దివ్య, భవ్య వికసిత భారత్‌ నిర్మాణానికి పునాది వేసేది ఇదేనని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. చివరగా- దేశవ్యాప్తంగాగల ‘ఎన్‌సిసి’ కేడెట్లకు, యువతకు స్ఫూర్తినిచ్చే దిశగా తాను రాసిన కొన్ని పంక్తులను వారితో పంచుకున్నారు. అటుపైన అందరికీ ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలతో తన ప్రసంగం ముగించారు.

 

   ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్, రక్షణ సిబ్బంది చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, వైమానిక సిబ్బంది చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి.సింగ్, నావికాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠీ, ‘ఎన్‌సిసి’ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్‌పాల్ సింగ్, రక్షణశాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ శిబిరంలో మొత్తం 2361 మంది ‘ఎన్‌సిసి’ కేడెట్లు పాల్గొనగా, వీరిలో 917 మంది బాలికలు కూడా ఉన్నారు. ఇప్పటివరకు బాలికలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్న వేడుకలు ఇవే కావడం గమనార్హం. ప్రధానమంత్రి ర్యాలీలో ఈ కేడెట్లందరూ పాల్గొనడం ద్వారా న్యూఢిల్లీలో నెల రోజులపాటు సాగిన ‘ఎన్‌సిసి’ గణతంత్ర దినోత్సవ శిబిరం 2025 విజయవంతంగా ముగిసింది. కాగా, ‘యువశక్తి:వికసిత భారత్‌’ ఇతివృత్తంగా ఈ సంవత్సరం ‘ఎన్‌సిసి ప్రధానమంత్రి ర్యాలీ’ నిర్వహించారు.

 

దేశాభివృద్ధిపై ‘ఎన్‌సిసి’ నిబద్ధతను చాటేవిధంగా 800 మందికిపైగా కేడెట్లు సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చారు. అలాగే 18 మిత్రదేశాల నుంచి 144 మంది యువ కేడెట్లు కూడా ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

మేరా యువ భారత్, విద్యా మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల శాఖ ద్వారా 650 మందికిపైగా వలంటీర్లు కూడా ‘ఎన్‌సిసి’ ప్రధానమంత్రి ర్యాలీలో ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Cotton duty relief: Textile industry welcomes import tax waiver, sees boost for exports and MSMEs

Media Coverage

Cotton duty relief: Textile industry welcomes import tax waiver, sees boost for exports and MSMEs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tribute to Lokmata Ahilyabai Holkar on her birth anniversary
May 31, 2026

The Prime Minister, Shri Narendra Modi has paid tributes to Lokmata Ahilyabai Holkar on her birth anniversary.

Shri Modi said that the entire nation remembers Lokmata Ahilyabai Holkar with deep respect and reverence for her wisdom, compassion and unwavering commitment to public welfare.

The Prime Minister noted that her life remains an exemplary model of good governance, patriotism and cultural pride. He said that she always led with courage and a strong sense of duty.

The Prime Minister highlighted her unparalleled contribution to ensuring justice and welfare for all, as well as her efforts towards the reconstruction of sacred temples and pilgrimage sites across the country. He remarked that her work further strengthened India’s cultural consciousness.

The Prime Minister stated that Lokmata Ahilyabai Holkar’s dedication to society, culture and nation-building will continue to inspire every generation of the country.

The Prime Minister wrote on X;

“लोकमाता अहिल्याबाई होल्कर जी को उनकी जयंती पर कोटि-कोटि नमन! बुद्धिमत्ता, करुणा और जनकल्याण के प्रति अटूट निष्ठा को लेकर पूरा देश उन्हें आदर और सम्मान के साथ स्मरण करता है। उनका जीवन सुशासन, राष्ट्रभक्ति और सांस्कृतिक गौरव का एक उत्कृष्ट उदाहरण है। उन्होंने सदैव साहस और कर्तव्यनिष्ठा के साथ नेतृत्व किया। देशभर में पावन मंदिरों और तीर्थस्थलों के पुनर्निर्माण से लेकर सभी के लिए न्याय और कल्याण सुनिश्चित करने में उन्होंने अतुलनीय योगदान दिया। उन्होंने भारत की सांस्कृतिक चेतना को और सशक्त बनाया। समाज, संस्कृति और राष्ट्र निर्माण के प्रति उनका समर्पण भाव देश की हर पीढ़ी को प्रेरित करता रहेगा।”