గౌరవ అధ్యక్షుడు,

ఇరు దేశాల ప్రతినిధులు,

మీడియా మిత్రులు,

నమస్కారం!

మబుహాయ్!

భారతదేశానికి వచ్చిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు, ఆయన బృందానికి మొదట హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నా. ఈ ఏడాది భారత్, ఫిలిప్పీన్స్ 75 ఏళ్ల దౌత్య సంబంధాల వేడుకలను జరుపుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో వీరి పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మన దౌత్య సంబంధాలు ఈమధ్యే ప్రారంభమైనవైనప్పటికీ, మన నాగరికతల బంధం చాలా పురాతనమైనది. ఫిలిప్పీన్స్ రామాయణ రూపం అయిన "మహారదియా లవానా" మన సాంస్కృతిక సంబంధాల ప్రత్యేకతను తెలియజెబుతుంది. ఇరుదేశాల జాతీయ పుష్పాలతో విడుదల చేసిన తపాలా స్టాంపులు మన స్నేహ పరిమళాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

మిత్రులారా,

ప్రతి స్థాయిలో సంభాషణ, ప్రతి రంగంలో సహకారం మన సంబంధాల ప్రత్యేకతను చాటిచెబుతుంది. ఉభయులమూ నేడు  ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విశ్లేషణాత్మక చర్చలు జరిపాం. మన సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నాం. ఈ భాగస్వామ్యం కార్యరూపం దాల్చేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం.

 

మన ద్వైపాక్షిక వాణిజ్యం నిరంతరం పెరుగుతూ ప్రస్తుతం 3 బిలియన్ డాలర్లు దాటింది. దీన్ని మరింతగా పెంచేందుకు ఇండో-ఆసియన్ స్వేచ్చా వాణిజ్య ఒప్పంద పునః సమీక్షను త్వరగా పూర్తిచేయడం మన ప్రాధాన్యత. దీనికి తోడు ద్వైపాక్షిక ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం కోసం కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాం.

సమాచారం, డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్యం, ఆటోమొబైల్స్, మౌలిక వసతులు, ఖనిజాలు వంటి దాదాపు అన్ని రంగాల్లో ఇరు దేశాల కంపెనీలు చురుగ్గా పనిచేస్తున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికొస్తే వైరాలజీ, కృత్రిమ మేధ, అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి అంశాల్లో సంయుక్త పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ రోజు సంతకం చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ సహకార ప్రణాళిక ఈ ప్రయత్నాలకు మరింత వేగం అందించనుంది.

వారణాసిలోని అంతర్జాతీయ బియ్యం పరిశోధన సంస్థ ప్రాంతీయ కేంద్రం తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉన్న బియ్యంపై పరిశోధనలు చేస్తోంది. అంటే రుచి, ఆరోగ్యం రెండింటిపైనా మనం కలిసి పనిచేస్తున్నాం! అభివృద్ధి భాగస్వామ్యం కింద ఫిలిప్పీన్స్‌లో సత్వర ప్రభావిత ప్రాజెక్ట్ ల సంఖ్యను పెంచాలని నిర్ణయించాం. అలాగే ఫిలిప్పీన్స్‌లో సార్వభౌమ డేటా క్లౌడ్ మౌలికవసతుల అభివృద్ధిలోనూ భాగస్వామ్యం అందిస్తాం.

పుడమిపై మన భాగస్వామ్యం ఇప్పటికే బలంగా ఉంది; ఇప్పుడు అంతరిక్షంపైనా దృష్టి సారించాం . ఇందుకు సంబంధించి  ఒక ఒప్పందాన్ని కూడా నేడు కుదుర్చుకున్నాం.

 

మిత్రులారా,

రక్షణ రంగంలో బలపడుతున్న సహకారం మన మధ్య ఉన్న విశ్వాసానికి ప్రతీక. సముద్రతీర దేశాలైన మనకు సముద్ర సంబంధిత సహకారం సహజమైనదే కాక అవసరమైనదీ కూడా.

మానవతా సహాయం, విపత్తు సమయంలో సహాయ చర్యలు, విపత్తు రక్షణ కార్యకలాపాల్లో మనం కలిసి పని చేస్తున్నాం. నేడు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు భారత్లో ఉన్న సమయంలో, భారత నౌకాదళానికి చెందిన మూడు నౌకలు ఫిలిప్పీన్స్‌లో నావికా కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి. భారత హైడ్రోగ్రఫీ నౌక కూడా ఇందులో ఒక భాగం.

భారత్ నెలకొల్పిన ఇండియన్ ఓషన్ రీజియన్ అంతర్జాతీయ ఫ్యూజన్ సెంటర్‌లో చేరాలన్న ఫిలిప్పీన్స్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించినందుకు, ఉగ్రవాదంపై మన పోరాటంలో మద్దతు తెలిపినందుకు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం, అధ్యక్షుడికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.

పరస్పర న్యాయ సహాయం, ఖైదీల బదిలీకి సంబంధించి ఈరోజు జరిగిన సంతకాలు మన భద్రతా భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి.

మిత్రులారా,

భారత పర్యాటకులకు వీసా మినహాయింపు ఇచ్చేందుకు ఫిలిప్పీన్స్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ప్రతిగా  ఫిలిప్పీన్స్ పర్యాటకులకు ఉచిత ఈ-వీసా సౌకర్యం కల్పించాలన్న నిర్ణయాన్ని భారత్ తీసుకుంది. ఈ సంవత్సరం చివర్లోగా ఢిల్లీ-మనీలా మధ్య నేరుగా విమాన సేవలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తాం.

ఈ రోజు ముగిసిన సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం మన చారిత్రక సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేస్తుంది.

 

మిత్రులారా,

మన యాక్ట్ ఈస్ట్ పాలసీ, “మహాసాగర” విజన్ లో ఫిలిప్పీన్స్ కీలక భాగస్వామి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, ఆర్ధిక సమృద్ధి, నిబంధనల పాటింపులకు మేం కట్టుబడి ఉన్నాం. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నావిగేషన్ స్వేచ్ఛకు మద్దతు ఇస్తున్నాం.

వచ్చే ఏడాది  ఫిలిప్పీన్స్ ఆసియన్ అధ్యక్ష బాధ్యతలు చేపడుతోంది. అది విజయవంతం కావడానికి మేం సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం.

ఎక్సెలెన్సీ,

భారత్, ఫిలిప్పీన్స్ దేశాలు స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకుని ఉండొచ్చు గాక... కానీ భాగస్వామ్యం అన్నది విధి లిఖితం. హిందూ మహా సముద్రం నుంచి పసిఫిక్ వరకు విలువల పాటింపులో మాది ఒకటే మాట. మాది ఎప్పటినుంచో ఉన్న స్నేహం మాత్రమే కాదు.. భవిష్యత్ ఒడంబడికలకూ స్పష్టమైన పూచీ.

మరామింగ్ సలామత్ పో!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 డిసెంబర్ 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions