ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు, అంటే అక్టోబర్ 29, 2017 నాడు, కర్ణాటక లో పర్యటించనున్నారు. ఆయన ఆ రోజు మూడు జన సభలలో ప్రసంగిస్తారు.
కర్ణాటక రాష్ట్రంలో ఆయన తన పర్యటనను ధర్మస్థలలో శ్రీ మంజునాథ స్వామి దేవాలయంలో పూజలు చేసి, ప్రారంభిస్తారు. ఒక జన సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఉజీర్ లో శ్రీ క్షేత్ర ధర్మస్థల రూరల్ డివెలప్ మెంట్ ప్రాజెక్టు లో ప్రధాన మంత్రి పాల్గొని, లబ్ధిదారులకు రూపే కార్డులను ప్రదానం చేస్తారు. ఇది స్వయంసహాయ బృందాలు నగదురహిత డిజిటల్ లావాదేవీలను మొదలుపెట్టడానికి దోహదపడనుంది.
ఆ తరువాత ప్రధాన మంత్రి బెంగళూరుకు వెళ్తారు. అక్కడ దశమ: సౌందర్య లహరీ పారాయణోత్సవ మహాసమర్పణె కార్యక్రమానికి హాజరై, సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
ఆది శంకరాచార్యుల వారు రచించిన శ్లోకాల గుచ్ఛమే సౌందర్య లహరి. ఆ శ్లోకాలను జన సందోహం సామూహికంగా పారాయణం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తదనంతరం, ప్రధాన మంత్రి బీదర్ చేరుకొంటారు. బీదర్- కల్ బుర్గీ న్యూ రైల్వే లైన్ ను ప్రారంభిస్తారు. ఆయన ఈ సందర్భంగా ఓ జన సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు కూడా.


