నేచర్ క్యూర్ సెంటర్ ప్రారంభ కార్యక్రమానికిగాను న్యూ యార్క్ స్టేట్ లో సమావేశమైన ఉన్నతాధికారులు మరియు ఆహ్వానితులు, ఇంకా, ఈ కార్యక్రమాన్ని టెలివిజన్ లోను, ఆన్‌లైన్ ద్వారాను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారాలు.
మహిళలు మరియు సజ్జనులారా, అంతర్జాతీయ యోగ దినం సందర్భంగా ఇవే శుభాకాంక్షలు!
హిమాలయ పర్వత పాదాలలో నెలకొన్న సుందర నగరమైనటువంటి దెహ్ రాదూన్ లో ఈ సందర్భాన్ని వేడుకగా జరుపుకోవడం కోసం ఈ రోజు ఉదయం గుమికూడిన విభిన్న జీవన మార్గాలకు చెందిన వేలాది ప్రజలతో మమేకం అయినందుకు నేను సంతోషిస్తున్నాను. గత కొద్ది రోజులుగా నేను ఈ వేడుకలలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు పాలుపంచుకొంటున్న చిత్రాలను నేను చూస్తూ వచ్చాను. నిజానికి, కేవలం మూడు సంవత్సరాల లో ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఉద్యమం స్థాయి కి ఎదిగింది. ఇది అనేక దేశాలలో ప్రజల జీవనంలో ఒక విడదీయరాని భాగంగా మారిపోయింది. దీని యొక్క ప్రభావం దీనిని జరుపుకొనే రోజు కు మాత్రమే పరిమితం కాకుండా మరింతగా విస్తరించింది. అంతర్జాతీయ యోగ దినాన్ని జరుపుకోవడంలో మూడు విభిన్న ఇతివృత్తాలను నేను గమనించాను. పలు ఇతర దేశాల విషయంలోను ఇది ఇలాగే ఉండడం తథ్యం అని నేను అనుకొంటున్నాను.
ఒకటో ఇతివృత్తం.. ఇది లక్షలాది ప్రజలను దీనిలోకి చేర్చే సందర్భంగా అయిపోయింది. యోగ నుండి ప్రేరణను పొంది, వారు దీనిని అనుసరించడానికి వారంతట వారు దీక్షాబద్ధులు అవుతున్నారు.
రెండోది.. యోగ తో ఇప్పటికే పరిచయాన్ని కలిగివున్న వారు దీనిని అనుసరించడానికి వారంతట వారుగా పునరంకితం చేసుకొనేటటువంటి సందర్భం కూడాను.
మూడో ఇతివృత్తం ఏమిటంటే, మంచి మాటను వ్యాపింప చేయడం. యోగా నుండి ఇప్పటికే లాభపడ్డ వేల కొద్దీ వ్యక్తులు మరియు సంస్థలు ఈ ప్రయోజనాన్ని పొందని వారికి చేరువగా వెళ్ళడం. ఈ ప్రక్రియ లో అంతర్జాతీయ యోగ దినం ప్రపంచం అంతటా అనేకులు ఒక పండుగ రోజుగా జరుపుకొనే స్థాయి కి సైతం చేరుకొంది. యోగ అనే మాటకు ‘ఏకం చేయడం’ అని అర్థం. అందువల్ల, యోగా పట్ల పెల్లుబుకుతున్న ఆసక్తి నాలో ఆశ ను నింపుతోంది. యోగ ప్రపంచాన్ని కలిపివుంచే ఒక శక్తి కాగలుగుతుందని నేను ఆశిస్తున్నాను.
ఈ నేచర్ క్యూర్ సెంటర్ ప్రారంభ సందర్భానికై అంతర్జాతీయ యోగ దినాన్ని మీరు ఎంపిక చేసుకోవడం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. ఈ కేంద్రం తన అన్ని కార్యక్రమాలలోను యోగ యొక్క అంశాలను జోడించేందుకు పాటుపడుతుందని నేను ఆశ పడుతున్నాను.
మిత్రులారా,
యోగ మరియు ఆయుర్వేదం వంటి సాంప్రదాయక భారతీయ విజ్ఞాన వ్యవస్థ లు మనం ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతాయి. శరీరంలోను మరియు బుద్ధిపరంగాను.. ఉభయత్రా అంతర్గతంగా ఉన్నటువంటి బలహీనతలను అధిగమించడానికి ఇవి మార్గాన్ని చూపుతాయి. ఈ వ్యవస్థలు వ్యక్తులను గౌరవంతోను, శ్రద్ధతోను చూసుకొంటాయి. వీటి వైఖరి అనుచితంగా గాని, సంబంధం లేకుండా గాని ఉండదు. సంప్రదాయబద్ధ చికిత్స విధానాలకు అలవాటు పడ్డ వారికి ఇది ఒక నూతనోత్సాహాన్ని ఇచ్చేటటువంటి మార్పు గా తోస్తుంది. సంప్రదాయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల శ్రద్ధ- దురదృష్టవశాత్తు- నివారణ కన్నా చికిత్స పైనే ఎక్కువగా ఉంది. ప్రస్తుత కాలంలోని ఆరోగ్య సంబంధమైన పెను సవాళ్ళను పరిష్కరించడం కోసం మనకు సంప్రదాయ వైద్యం అవసరం అనడాన్ని తోసిపుచ్చలేము. అయితే, పరిష్కారం లభించనటువంటి కొన్ని ఖాళీ ప్రదేశాలు ఇంకా మిగిలే ఉన్నాయి అనడం కూడా ఒక వాస్తవమే. యోగ మరియు ఆయుర్వేదం వంటి వ్యవస్థలు సంప్రదాయబద్ధమైన వైద్య వ్యవస్థ లకు పూరకంగా ఉండగలుగుతాయంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంరక్షణ నిపుణులు ప్రస్తుతం ప్రశంసిస్తున్నారు అనేది కూడా యథార్థమే. ఈ సంపూర్ణమైన వ్యవస్థలు వ్యాధి నివారణ పైన మరియు క్షేమం పైన దృష్టి ని నిలుపుతాయి. ఈ సంపూర్ణ అభ్యాసాలను అనుసరించడం వ్యక్తులలో, సముదాయాలలో ఆరోగ్యం మరియు క్షేమం పెరిగేందుకు బాటను పరుస్తుంది. కొంత మంది ఆలోచన సరళికి భిన్నంగా యోగ అనేది వ్యాయామాలకు మరియు భంగిమలకే పరిమితమైంది కాదు. ఇందులో భాగంగా బుద్ధి, శరీరం, ఇంకా ఆత్మల యొక్క లోతులకు వెళ్ళి వెతుకులాటను కొనసాగించవలసి వుంటుంది. ఇది ఒకరిలో స్వీయ అవగాహన ను పెంపొందించుకొనేందుకు దోహదపడుతుంది. ఇంకా, ఇది సాంఘిక క్రమశిక్షణకు మరియు అక్కడి నుండి నీతిశాస్త్రానికి, మరి అలాగే, జీవితానికి చెందిన విలువల పెంపుదలకు కూడా దోవ తీస్తుంది. బాధల నుండి స్వేచ్ఛను పొందడం కోసం లేదా ముక్తి మార్గంలో సాగడం కోసం మనకు సహాయం చేయగల ఒక గాఢమైనటువంటి తత్వ శాస్త్రమే యోగ.

మిత్రులారా,
యోగా కు ఒక మతమంటూ లేదు అని నేను సదా నమ్ముతూ వచ్చాను. ఇందులో ప్రతి ఒక్కరికి, తమను విశ్వాసులుగా పరిగణించుకోని వారికి సైతం లాభం చేకూరేటటువంటి ఆచరణీయ మార్గాలు ఉన్నాయి. ఆధునిక యోగాభ్యాసాలలో ప్రాచీన విజ్ఞానం తాలూకు వివిధ అంశాలు తరచూ మిళితం అవుతాయి. వీటిలో నైతికత, నీతి శాస్త్ర నియమాలు, దేహాన్ని తగినదిగా ఉంచేందుకు ఉద్దేశించినటువంటి అంగ విన్యాసాలు, ఆధ్యాత్మిక వేదాంతం, ఒక గురువు ద్వారా లభించే ఉపదేశం, మంత్రోపాసన, శ్వాస ను అదుపు చేసి భావాతీత ధ్యానం ద్వారా బుద్ధిని కుదుటపరుచుకోవడం వంటివి భాగంగా ఉంటాయి. వ్యక్తి యొక్క జీవన శైలి ని మార్చడం పై యోగ శ్రద్ధ తీసుకొంటుంది. ఇలా చేయడం ద్వారా జీవన శైలి కి సంబంధించిన అనారోగ్యాలు సులభంగా నివాణకు గురి అయ్యి సంబాళింపబడుతాయి. యోగ ను నిత్యం అభ్యసించినందువల్ల దానంతట అదే లాభసాటిగా ఉంటుందని, తద్వారా ఆరోగ్యం, మానసిక క్షేమం, బుద్ధిపరంగా స్పష్టత, ఇంకా జీవించడంలోని ఉల్లాసం.. ఇవన్నీ లభిస్తాయని యోగ నిపుణులు గమనించారు. కొన్ని రకాలైన యోగ భంగిమలు మరియు ప్రాణాయామం పలు వ్యాధులను నియంత్రించడంలో సహాయకారిగా ఉంటాయన్న విశ్వాసం కొన్ని శతాబ్దాలుగా విస్తృత వ్యాప్తి లో ఉంది. ప్రస్తుతం దీనిని బలపరచే సాక్ష్యాన్ని తయారు చేయడం కోసం నవీన శాస్త్ర విజ్ఞానం కూడా తోడుగా వచ్చింది. యోగ ద్వారా మానవ దేహం లోని గుండెకాయ, మస్తిష్కం, ఇంకా అంతస్స్రావి గ్రంథులతో సహా అనేక అవయవాల విధులపైన నియంత్రణ సాధ్యపడుతుందని శాస్త్ర విజ్ఞానం సైతం నిరూపించింది.
ప్రస్తుత కాలంలో, పశ్చిమ ప్రాంత దేశాలలోయోగ పట్ల ఆసక్తి శర వేగంగా వ్యాపిస్తోంది. పశ్చిమ దేశాలలో ఎంతో మంది యోగ ను ప్రశంసించారని చెప్పడం అతిశయోక్తి కాబోదు. ఒక్క యుఎస్ఎ లోనే 20 మిలియన్ మందికి పైగా యోగ ను అభ్యసిస్తున్నారని, మరి ఈ సంఖ్య ప్రతి సంవత్సరం సగటున 5 శాతం మేర పెరుగుతోందని నాకు చెప్పారు. యుఎస్ఎ లో, యూరోప్ లో అనేక ఆధునిక వైద్య శాస్త్ర సంస్థలు యోగ ను ఒక ప్రత్యామ్నాయంగా లేదా అనేక అనారోగ్యాలకు సమ్మిళిత చికిత్స విధానంగా అంగీకరించాయి. ఇటీవలి కాలంలో యోగ లో బోలెడంత పరిశోధనను చేపట్టడమైంది. ప్రజారోగ్య సంరక్షణ లో సంప్రదాయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై ఆధారపడిన నిరూపిత విధానాలను అమలులోకి తీసుకు రావడానికి భారత ప్రభుత్వం వచనబద్ధురాలైంది. గడచిన సంవత్సరంలో ప్రకటించిన మా జాతీయ ఆరోగ్య విధానం వ్యాధుల నివారణపైన ప్రధానంగా దృష్టిని సారిస్తోంది. అసాంక్రామిక వ్యాధుల నియంత్రణకు, నివారణకు లక్షించిన దేశవ్యాప్త కార్యక్రమాలను కూడా మేము ప్రారంభించాము. భారతదేశం ప్రపంచంలో రెండో అతి పెద్ద జనాభా ను కలిగినటువంటి పెద్ద దేశంగా ఉంది. ఈ రోజు తీసుకొన్న కార్యక్రమాలు ఫలితాలను ఇవ్వడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. అయితే, ఆచరణాత్మకమైన ఫలితాలు త్వరలోనే అందుతాయన్న విశ్వాసంతో నేనున్నాను.
చివరగా, ఉపశమనం కోసం మరియు ఓదార్పు కోసం నేచర్ క్యూర్ ఫెసిలిటీ కి వచ్చే వారు అందరికీ యోగ తాలూకు ప్రయోజనాలను అందించడం కోసం మీ యొక్క నేచర్ క్యూర్ సెంటర్ పాటుపడుతుందని నేను మరోమారు చెప్పాలనుకొంటున్నాను. మీ ఈ సెంటర్ అందించాలనుకొంటున్న క్షేమకరమైనటువంటి మార్గాలు వ్యక్తుల యొక్క స్వీయ ఆందోళనలను తొలగించడమే ధ్యేయంగా పెట్టుకొన్నాయని తెలుసుకొని నేను సంతోషిస్తున్నాను. జీవన పర్యంతం క్షేమం అనేది వారి యొక్క ధ్యేయంగా ఉండడం కూడా చెప్పుకోదగినటువంటిదే. ప్రామాణికత పట్ల గౌరవం, శాస్తీయ వైఖరి పట్ల నమ్మకం అనేవి ఈ లక్ష్యాలలో అంతర్గతంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఇటువంటి సరళి తో ఈ కేంద్రం వెల్ నెస్ ఉద్యమానికై గణనీయ తోడ్పాటును అందించడంతో పాటు యోగా యొక్క లాభాలను యుఎస్ఎ లో పెద్ద సంఖ్యలో ప్రజలకు అందించగలుగుతుంది. మీ కేంద్రం ఆ ప్రాంతంలో ప్రత్యక్షంగా అయిదు వందల ఉద్యోగాలను, పరోక్షంగా పదిహేను వందల ఉద్యోగాలను ఇస్తుందని తెలుసుకొని నేను సంతోషిస్తున్నాను. ఈ రకంగా ఇది సముదాయంలో ఒక బాధ్యతాయుత సభ్యురాలు కాగలదు. ఈ పని లో మీకు అంతా శుభమే జరగాలని నేను కోరుకొంటున్నాను.
మీకు ఇవే ధన్యవాదాలు.
మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు.







