డబ్ల్యుటిఒ మంత్రుల స్థాయి లాంఛనప్రాయ సమావేశానికి హాజరవుతున్న మంత్రులు/సీనియర్ ఉన్నతాధికారులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని ఈ రోజు కలుసుకొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సంభాషణలో, బహుళ పాక్షిక వ్యాపారానికి సంబంధించిన వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. ఈ మంత్రుల స్థాయి సమావేశానికి ఆతిథేయిగా వ్యవహరించడంలో భారతదేశం తీసుకొన్న చొరవను పలువురు మంత్రులు ప్రశంసించారు.

ప్రధాన మంత్రి ఉన్నతాధికారులకు స్వాగతం పలుకుతూ, డబ్ల్యుటిఒ మంత్రుల స్థాయి లాంఛనప్రాయ సమావేశంలో జరిగే సంప్రదింపులు నిర్మాణాత్మకంగా ఉంటాయన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. నియమాల పైన ఆధారపడి ఉండేటటువంటి, అలాగే అందరినీ కలుపుకొని పోయేటటువంటి మరియు ఏకాభిప్రాయ సూత్రంపైన ఆధారపడే ఒక బహుళ పాక్షిక వ్యాపార వ్యవస్థ నెలకొనాలని భారతదేశం నిబద్ధతతో ఉందని ఆయన పునరుద్ఘాటించారు. బలవత్తరమైన వివాద పరిష్కార యంత్రాంగమొకటి డబ్ల్యుటిఒ యొక్క కీలక ప్రయోజనాలలో ఒకటి అని ఆయన పేర్కొన్నారు.
బహుళ పాక్షిక వ్యాపార వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్ళకు ఎదురొడ్డి నిలవడం ముఖ్యమని ప్రధాన మంత్రి చెప్పారు. దోహా విడత మరియు బాలి మంత్రిత్వ స్థాయి సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను ఇప్పటికీ ఇంకా అమలు చేయవలసే ఉందని ఆయన గుర్తుకు తెచ్చారు. ఎంత మాత్రం అభివృద్ధి చెందని దేశాల పట్ల ఒక దయా పూరితమైన వైఖరిని అవలంభించవలసిన అవసరం ఉందని ఆయన మరో మారు నొక్కి చెప్పారు.

లాంఛన ప్రాయ సమావేశానికి భారతదేశం ఇచ్చిన ఆహ్వానానికి చక్కటి ప్రతిస్పందన లభించడం పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది బహుళ పాక్షిక వాదం మరియు డబ్ల్యుటిఒ సూత్రాల పట్ల ప్రపంచ స్థాయి విశ్వాసాన్ని అభివ్యక్తీకరిస్తోందని ఆయన అన్నారు.
వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి శ్రీ సురేశ్ ప్రభు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు.


