గౌరవ ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి శ్రీమతి కమ్లా పెర్సాద్ బిసెసా ఆహ్వానం మేరకు గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూలై 3, 4 తేదీల్లో ఆ దేశంలో అధికారికంగా పర్యటించారు.

గత 26 ఏళ్లలో భారత ప్రధానమంత్రి ఆ దేశంలో చేపట్టిన తొలి ద్వైపాక్షిక పర్యటన ఇది. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు భారతీయుల వలస వెళ్లి180 ఏళ్లు (1845లో) నిండిన నేపథ్యంలో ఈ కీలక పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరుదేశాల మధ్య చిరకాల మైత్రికి ప్రాతిపదికగా నిలిచిన బలమైన నాగరికతా సంబంధాలు, ఉత్తేజకరమైన ప్రజా సంబంధాలు, ఉమ్మడి ప్రజాస్వామిక విలువలను ఈ పర్యటన మరోసారి ప్రపంచానికి చాటింది.

ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి కమ్లా పెర్సాద్ బిసెసాను భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆమె చేసిన కృషిని అభినందించారు.

భారత్‌లోనూ అంతర్జాతీయ వేదికలపైనా అసాధారణ నేతృత్వానికి గుర్తింపుగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత జాతీయ పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’ను అందించారు.

ఉమ్మడి ప్రయోజనాలున్న విస్తృతస్థాయి ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇద్దరు ప్రధానులు సమగ్రంగా చర్చించారు. అన్ని రంగాల్లోనూ విస్తృత సంబంధాలపట్ల వారిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోగ్యం, ఐసీటీ, సంస్కృతి, క్రీడలు, వాణిజ్యం, ఆర్థికాభివృద్ధి, వ్యవసాయం, న్యాయం, చట్టపరమైన వ్యవహారాలు, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో విస్తృత, సమ్మిళిత, భవిష్యత్ దృక్పథంతో కూడిన భాగస్వామ్యాలను నెలకొల్పడంపై తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.

శాంతిభద్రతలకు ఉగ్రవాదంతో తీవ్ర ముప్పు పొంచి ఉన్నదన్న విషయమై వారిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ దానిపట్ల దృఢమైన వ్యతిరేక వైఖరిని వారు పునరుద్ఘాటించారు. సీమాంతర ఉగ్రవాదం సహా ఏ రకమైన ఉగ్రవాదాన్నీ ఉపేక్షించే ప్రసక్తే లేదని ప్రకటించారు.

ఔషధాలు, అభివృద్ధిలో సహకారం, విద్యారంగం, సాంస్కృతిక వినిమయం, దౌత్యపరమైన శిక్షణ, క్రీడల వంటి కీలక రంగాల్లో ముఖ్యమైన ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలను వారు స్వాగతించారు. 2024 నవంబరులో నిర్వహించిన రెండో భారత్ – కారికోమ్ సదస్సు ఫలితాలను గుర్తుచేసుకుని, అందులో ప్రకటించిన కార్యక్రమాల అమలును వేగవంతం చేయడానికి కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు.

డిజిటల్ రంగంలో మరింత సహకారానికి ఇరుదేశాలూ అమితాసక్తిని కనబరిచాయి. భారత ప్రతిష్ఠాత్మక చెల్లింపుల వేదిక అయిన ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ)ని అమలు చేయనున్న తొలి దేశంగా ట్రినిడాడ్ అండ్ టొబాగోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. డిజిలాకర్, ఇ-సైన్, గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ (జీఈఎం) సహా భారత్‌కు చెందిన సాంకేతిక వేదికలను అమలు చేసే దిశగా సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిశ్చయానికి వచ్చారు. ప్రభుత్వ భూమి నమోదు వ్యవస్థ డిజిటైజేషన్, నవీకరణలో భారత్ తోడ్పాటు అందించాలని ట్రినిడాడ్ అండ్ టొబాగో అభ్యర్థించింది. డిజిటల్ గవర్నెన్స్, ప్రభుత్వ సేవలను సమర్థంగా అందించడమన్నవి సమ్మిళిత అభివృద్ధి, ఆవిష్కరణ, జాతీయ స్థాయిలో పోటీతత్వానికి చోదకాలుగా నిలుస్తాయని నేతలిద్దరూ స్పష్టంగా పేర్కొన్నారు.

విద్యను డిజిటలీకరించాలన్న ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ కొనియయాడారు. ఈ విద్యా కార్యక్రమానికి చేయూతనిచ్చేలా 2000 ల్యాప్‌టాప్‌ల బహుమతిని ప్రకటించారు. భారత ప్రభుత్వం అందించే వివిధ స్కాలర్‌షిప్ కార్యక్రమాల కింద భారత్‌లో ఉన్నత విద్య అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి మోదీ ట్రినిడాడ్ అండ్ టొబాగో విద్యార్థులకు సూచించారు.

వ్యవసాయం, ఆహార భద్రతను మరో ప్రాధాన్య రంగంగా వారు గుర్తించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఏఎండీఈవీసీవో)కు ఫుడ్ ప్రాసెసింగ్, నిల్వ కోసం భారత్ 1 మిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ యంత్రాలను అందించింది. లాంఛనంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎన్ఏఎండీఈవీసోకు మొదటి బ్యాచ్ యంత్రాలను ప్రధానమంత్రి మోదీ అందించారు. ప్రకృతి వ్యవసాయం, సముద్రపు కలుపు మొక్కల ఆధారిత ఎరువులు, చిరు ధాన్యాల సాగు రంగాల్లోనూ భారత్ సాయమందిస్తుందని ప్రధానమంత్రి మోదీ హామీ ఇచ్చారు.

ఆరోగ్య సంరక్షణ విషయంలో.. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం భారతీయ ఔషధాలను గుర్తించడంపై ప్రధానమంత్రి మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఔషధ రంగంలో సన్నిహిత సహకారాన్ని మెరుగుపరచడంతోపాటు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రజలు భారత్ నుంచి తక్కువ ధరల్లో నాణ్యమైన జనరిక్ ఔషధాలను పొందే అవకాశాన్నిస్తుంది. అలాగే, భారత్‌లో వైద్య చికిత్సకూ వారికి అవకాశాన్ని అందిస్తుంది. మున్ముందు ట్రినిడాడ్ అండ్ టొబాగోలో 800 మంది వ్యక్తులకు కృత్రిమ అవయవాల అమరిక కోసం శిబిరాన్ని నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు. ఆరోగ్య సంరక్షణపరంగా సహకారం ఔషధాలు, పరికరాలకు మాత్రమే పరిమితం కాదు. ఈ విషయంలో భారత్ చేయూత  పట్ల ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి కమ్లా పెర్సాద్ బిసెసా కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత మెరుగుపరిచేలా 20 హీమోడయాలసిస్ యూనిట్లు, 2 సముద్ర అంబులెన్సులను అందించడంపట్ల భారత ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

సత్వర ప్రభావాన్ని చూపే ప్రాజెక్టులపై అవగాహన ఒప్పందాన్ని స్వాగతిస్తూ.. అభివృద్ధి దిశగా సహకారం అత్యంత ఆవశ్యకమైనదని ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ సాయంతో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో సామాజిక అభివృద్ధి ప్రాజెక్టులను సకాలంలో, ప్రభావవంతంగా అమలు చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది.

కోవిడ్-19 విపత్తు క్లిష్ట సమయాల్లో విలువైన మానవ జీవితాలను కాపాడడంలో భారత్ ముందు నిలిచిందంటూ ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి పెర్సాద్ బిసెసా ప్రశంసించారు. భారత్ సత్వర స్పందన, తమ దేశానికి కోవిడ్ వ్యాక్సిన్లు, వైద్య పరికరాల సరఫరా ఎంతో విలువైన సాయమని అభినందించారు. కోవిడ్-19 ప్రాజెక్టులో 1 మిలియన్ డాలర్ల హాల్ట్ (హై అండ్ లో టెక్నాలజీ) కింద భారత్ అందిస్తున్న సాయాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. మొబైల్ హెల్త్ కేర్ రోబోలు, టెలిమెడిసిన్ కిట్‌లు, హ్యాండ్ హైజీన్ స్టేషన్ల సరఫరా అభినందనీయమన్నారు.

విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ), అంతర్జాతీయ జీవ ఇంధన కూటమిలో చేరాలన్న ట్రినిడాడ్ అండ్ టొబాగో నిర్ణయాన్ని భారత ప్రధానమంత్రి మోదీ స్వాగతించారు. వాతావరణ హిత కార్యాచరణ, సుస్థిరాభివృద్ధిపట్ల వారి నిబద్ధతకు ఇది నిదర్శనం. విపత్తు ప్రమాదాలను తగ్గించడం కోసం భారత్ రూపొందించిన ముందస్తు హెచ్చరిక వ్యవస్థల్లో మరింత సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఇరువురు ప్రధానులు అంగీకరించారు. విదేశాంగ, కారికోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయానికి రూఫ్‌టాప్ కాంతి విద్యుత్ (పీవీ) వ్యవస్థ కోసం భారత్ గ్రాంట్ ఇవ్వడాన్ని ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం అభినందించింది. జాగరూకతతో కూడిన వినియోగం, పర్యావరణ హిత ధోరణులతో కూడిన జీవన శైలిని ప్రోత్సహించేలా భారత ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చిన దార్శనిక కార్యక్రమం ‘మిషన్ లైఫ్’ను ఆ దేశ ప్రధానమంత్రి పెర్సాద్ బిసెసా అభినందించారు. వాతావరణ స్పృహతో కూడిన జీవన విధానం దిశగా ప్రపంచ పౌరులను ఏకం చేయడంలో ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యం ఉందన్నారు.

ట్రినిడాడ్ అండ్ టొబాగోతో భారత్ భాగస్వామ్యంలో సామర్థ్యాభివృద్ధి కీలకమైన రంగంగా గుర్తించారు. వివిధ రంగాల్లో యువతలో నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా ఏటా 85 ఐటీఈసీ స్లాట్‌లను భారత్ అందించడాన్ని ఆ దేశ పక్షం ప్రశంసించింది. అధికారులకు పెద్ద ఎత్తున శిక్షణ కోసం నిపుణులను, శిక్షకులను ట్రినిడాడ్ అండ్ టొబాగోకు పంపించేందుకు భారత బృందం సంసిద్ధతను వ్యక్తం చేసింది.

ఫోరెన్సిక్ సైన్స్, న్యాయ వ్యవస్థల్లో అధికారులు, సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో ట్రినిడాడ్ అండ్ టొబాగోకు సాయమందించడానికి ప్రధానమంత్రి మోదీ సంసిద్ధత వ్యక్తం చేశారు. శిక్షణ కోసం వారిని భారత్‌కు పంపించడం, శిక్షకులు, నిపుణులను వారి దేశానికి పంపించడం ఇందులో భాగంగా ఉంటాయి.

ఇరుదేశాల వ్యాపార సహకార సంస్థల మధ్య ప్రత్యక్ష మార్గాలను ప్రోత్సహించడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం, పరస్పర పెట్టుబడులను పెంచాల్సిన ఆవశ్యకత ఉందని వారు స్పష్టం చేశారు.

రెండు దేశాల మధ్య క్రీడల్లో, ముఖ్యంగా రెండు దేశాల్లోనూ విశేష ఆదరణ ఉన్న క్రికెట్లో బలమైన సంబంధాలను పెంపొందించుకోవాలని ప్రధానులిద్దరూ నిర్ణయానికి వచ్చారు. శిక్షణ, క్రీడాకారుల వినిమయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేలా క్రీడా సహకారంపై అవగాహన ఒప్పందాన్ని వారు స్వాగతించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని ఆశావహులైన యువ మహిళా క్రికెటర్లకు భారత్‌లో శిక్షణ ఇవ్వాలన్న తన ప్రతిపాదనను ప్రధానమంత్రి మోదీ పునరుద్ఘాటించారు.

ట్రినిడాడ్ అండ్ టొబాగో పండితులకు భారత్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. సాంస్కృతికంగా ఇదో ప్రధానమైన ముందడుగు. భారత్‌లో జరిగే ‘గీతా మహోత్సవ్’లో కూడా ఈ పండితులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంపై ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి కమ్లా పెర్సాద్ బిసెసా హర్షం వ్యక్తం చేశారు. అలాగే, భారత్‌లో వేడుకలతోపాటే తమ దేశంలోనూ గీతా మహోత్సవాన్ని సంయుక్తంగా నిర్వహించాలన్న భారత ప్రతిపాదనకు ఉత్సాహంగా మద్దతిచ్చారు.

సాంస్కృతిక రంగంలో సహకారానికి సంబంధించి.. ద్వైపాక్షిక ‘సాంస్కృతిక వినిమయ కార్యక్రమం’ ద్వారా సాధించిన పురోగతిని ఇరువురు నాయకులు గుర్తించారు. దీనిద్వారానే 1997లో మహాత్మా గాంధీ సాంస్కృతిక సహకార సంస్థ ఏర్పాటైంది. ఈ కార్యక్రమాన్ని 2025-28 కాలానికి పునరుద్ధరించేలా అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం- ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసేలా.. ట్రినిడాడ్ అండ్ టొబాగో వాద్య కళాకారులు (స్టీల్ పాన్), ఇతర కళాకారులను పంపిస్తుంది. దేశవ్యాప్తంగా యోగాను, హిందీ భాషను ప్రోత్సహించడంపట్ల ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వానికి భారత ప్రధానమంత్రి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ నుంచి యోగా శిక్షకులను పంపడానికి, ఆ దేశ పాఠ్యాంశాల్లో యోగాను చేర్చే అంశానికి మద్దతిచ్చేందుకు ఆయన ముందుకొచ్చారు.

1845లో ట్రినిడాడ్ అండ్ టొబాగోకు తొలి భారతీయ వలసకు 2025 మే 30 నాటికి 180 ఏళ్లుపూర్తయిన సందర్భాన్ని ఇద్దరు ప్రధానులు గుర్తు చేసుకున్నారు. సాంస్కృతిక పర్యాటకానికి నేల్సన్ ద్వీపం ప్రాధాన్యాన్ని వారు గుర్తించారు. భారతీయుల ఆగమనంతోపాటు జాతీయ పురా గ్రంథాలయాల్లోని ఇతర రికార్డులను డిజిటలీకరించాల్సిన అవసరం ఉందన్న భావన వ్యక్తం చేశారు. ఆ దేశంలోని భారతీయ సంతతి ప్రజల్లో ఆరో తరం వరకు ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డులను జారీ చేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు.

వెస్టిండీస్ విశ్వవిద్యాలయంలో హిందీ విద్యా పీఠాలు, భారతీయ అధ్యయనాల పునరుద్ధరణను ప్రధానులిద్దరూ స్వాగతించారు. ఇది ఇరుదేశాల మధ్య విద్య, సాంస్కృతిక సంబంధాలను మరింత పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానం, వారసత్వ వ్యాప్తినీ ప్రోత్సహిస్తుంది.

భారత్ - ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంటరీ మిత్ర బృందం, ఆ దేశ పార్లమెంటు సభ్యులకు భారత్‌లో శిక్షణను పునరుద్దరించల్సిన ఆవశ్యకతను ఇద్దరు ప్రధానులు ప్రముఖంగా పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య పార్లమెంటరీ ప్రతినిధి బృందాల పరస్పర సందర్శనలు క్రమం తప్పకుండా నిర్వహించాల్సిన అవసరముందన్నారు.

ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరుపక్షాలు చర్చించాయి. శాంతి, వాతావరణ హిత కార్యాచరణ, సమ్మిళిత అభివృద్ధి, అభివృద్ధి చెందుతున్న దేశాల గళాన్ని మరింత విస్తృతంగా వినిపించడానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించాయి. బహుపాక్షిక వేదికలపై విలువైన పరస్పర మద్దతుపట్ల ఇరుదేశాలు హర్షం వ్యక్తం చేశాయి.

ప్రస్తుత ప్రపంచ వాస్తవికతను మెరుగ్గా ప్రతిబింబించేలా భద్రతా మండలి విస్తరణ సహా ఐక్యరాజ్యసమితిలో సమగ్ర సంస్కరణల ఆవశ్యకతను ప్రధాననులిద్దరూ పునరుద్ఘాటించారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఘర్షణల నేపథ్యంలో చర్చలు, దౌత్యం అవసరమని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని విస్తరించి భారత్‌కు శాశ్వత సభ్యత్వం విషయమై ట్రినిడాడ్ అండ్ టొబాగో పూర్తి మద్దతును పునరుద్ఘాటించింది. 2027-28 కాలానికి భద్రతా మండలిలో తాత్కాలిక స్థానం కోసం ట్రినిడాడ్ అండ్ టొబాగో అభ్యర్థిత్వానికి మద్దతిచ్చేందుకు భారత్ కూడా అంగీకరించింది. అలాగే, 2028-29 కాలానికి భారత్ అభ్యర్థిత్వానికి ఆ దేశం మద్దతిస్తుంది.

అసాధారణ ఆతిథ్యాన్నిచ్చిన ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వానికి, ప్రజలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వీలు చూసుకుని భారత్‌ను సందర్శించాల్సిందిగా ఆ దేశ ప్రధానమంత్రి కమ్లా పెర్సాద్ బిసెసాను ఆహ్వానించారు. అలాగే, ఆమె కూడా మరోసారి తమ దేశంలో పర్యటించాల్సిందిగా మోదీని కోరారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారిక పర్యటన విజయవంతం కావడంపై ప్రధానులిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య ఉన్నతమైన ద్వైపాక్షిక సంబంధాలతో కొత్త శకానికి ఇది నాంది పలుకుతుందని ధీమా వ్యక్తపరిచారు. దృఢమైన, సమ్మిళిత, భవిష్యత్ దార్శనికతతో కూడిన భారత్ - ట్రినిడాడ్ అండ్ టొబాగో భాగస్వామ్యంపై తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Why industry loves the India–EU free trade deal

Media Coverage

Why industry loves the India–EU free trade deal
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi highlights Economic Survey as a comprehensive picture of India’s Reform Express
January 29, 2026

The Prime Minister, Shri Narendra Modi said that the Economic Survey tabled today presents a comprehensive picture of India’s Reform Express, reflecting steady progress in a challenging global environment. Shri Modi noted that the Economic Survey highlights strong macroeconomic fundamentals, sustained growth momentum and the expanding role of innovation, entrepreneurship and infrastructure in nation-building. "The Survey underscores the importance of inclusive development, with focused attention on farmers, MSMEs, youth employment and social welfare. It also outlines the roadmap for strengthening manufacturing, enhancing productivity and accelerating our march towards becoming a Viksit Bharat", Shri Modi stated.

Responding to a post by Union Minister, Smt. Nirmala Sitharaman on X, Shri Modi said:

"The Economic Survey tabled today presents a comprehensive picture of India’s Reform Express, reflecting steady progress in a challenging global environment.

It highlights strong macroeconomic fundamentals, sustained growth momentum and the expanding role of innovation, entrepreneurship and infrastructure in nation-building. The Survey underscores the importance of inclusive development, with focused attention on farmers, MSMEs, youth employment and social welfare. It also outlines the roadmap for strengthening manufacturing, enhancing productivity and accelerating our march towards becoming a Viksit Bharat.

The insights offered will guide informed policymaking and reinforce confidence in India’s economic future."