ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇమ్మిగ్రేషన్, వీసా, ఫారినర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ (ఐవీఎఫ్ఆర్‌టీ) పథకాన్ని 2026 మార్చి 31 తర్వాత కూడా కొనసాగించేందుకు ఆమోదించారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు అయిదేళ్ల కాలానికి రూ.1800 కోట్ల బడ్జెట్ అంచనాతో దీనికి ఆమోద ముద్ర వేశారు.

భారత దేశానికి విదేశీయుల వలస, వీసా జారీ, రిజిష్ట్రేషన్‌కు సంబంధించిన కార్యకలాపాలను ఐవీఎఫ్‌ఆర్‌టీ వేదిక అనుసంధానించి, మెరుగ్గా నిర్వహిస్తుంది. సురక్షితమైన, ఏకీకృతమైన సేవలను అందించే వ్యవస్థ ద్వారా ఇమిగ్రేషన్, వీసా సేవలను ఆధునికీకరించడం, మెరుగుపరచడమే ఐవీఎఫ్ఆర్‌టీ ప్రధాన లక్ష్యం. జాతీయ భద్రతను బలోపేతం చేస్తూనే, చట్టబద్ధమైన ప్రయాణీకులకు సౌలభ్యాన్ని అందించడమే ధ్యేయంగా నిర్దేశించుకుంది. 13.05.2010న రూ.1011 కోట్ల బడ్జెట్ అంచనాతో 2014 సెప్టెంబరు వరకు కొనసాగేలా ఈ ప్రాజెక్టుకు ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. 2015లో ఈ ప్రాజెక్టు బడ్జెట్‌ను రూ.638.90 కోట్లకు సవరిస్తూ.. 2017 మార్చి 31 వరకు పొడిగించారు. ఆ తర్వాత ఎలాంటి అదనపు ఆర్థిక భారం లేకుండా 2021 మార్చి 31 వరకు మరోసారి పొడిగించారు. సవరించిన బడ్జెట్ రూ.638.90 కోట్లలో రూ.613.28 కోట్లు ఖర్చు చేశారు. రూ.1365 కోట్ల బడ్జెట్‌ అంచనాతో అయిదేళ్ల కాల పరిమితితో 01.04.2021 నుంచి 31.03.2026 వరకు కొనసాగించేందుకు 19.01.2022న క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది.

ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడం ద్వారా ఐవీఎఫ్ఆర్‌టీ పథకం విస్తృతిని, సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. అంతే కాకుండా, భద్రతా వ్యవస్థ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలతో వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. మారుతున్న అంతర్జాతీయ ప్రయాణ డిమాండ్లను నెరవేర్చడానికి, కొత్తగా తలెత్తుతున్న జాతీయ భద్రతా సవాళ్లను పరిష్కరించడానికి ఐవీఎఫ్‌ఆర్‌టీ ప్రాజెక్టు ఆధునికీకరణ అవసరం. ఇటీవలే ఇమిగ్రేషన్, ఫారినర్స్ చట్టం - 2025, దాని అనుబంధ నియమాలు, ఉత్తర్వులు అమల్లోకి వచ్చిన అనంతరం ఐవీఎఫ్ఆర్‌టీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన, ఆధునికీకరించాల్సిన అవసరం ఏర్పడింది. తద్వారా అక్రమ వలసలతో సహా, వలసల నియంత్రణ, విదేశీయుల  నిర్వహణలో ప్రస్తుత అవసరాలను, భవిష్యత్తు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. సాంకేతిక మెరుగుదలకు మాత్రమే ఈ ప్రాజెక్టు కొనసాగింపు పరిమితం కాలేదు. ఇది ప్రపంచ స్థాయి ఇమిగ్రేషన్, వీసా జారీ వ్యవస్థ ద్వారా అంతర్జాతీయ ప్రయాణాన్ని ప్రోత్సహించాలనే భారత ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా చేపట్టిన వ్యూహాత్మక మార్పు. ఈ ప్రాజెక్టు తదుపరి దశలో మూడు విస్తృత అంశాలపై దృష్టి సారిస్తుంది. (ఎ) అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలు, (బి) ప్రాథమిక మౌలిక వసతుల అభివృద్ధి (సి) సాంకేతిక పరిజ్ఞానం, సేవల మెరుగుదల.

ఆటంకాలు లేని, సురక్షితమైన ప్రయాణానికి మొబైల్ ఆధారిత సేవలు, సెల్ఫ్ సర్వీసు కియోస్కులతో సహా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించడం ద్వారా ఇమిగ్రేషన్, వీసా వ్యవస్థను ఈ పథకం ఆధునికీకరిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా పటిష్టమైన, విస్తరించదగిన వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఇమిగ్రేషన్ పోస్టులు, ఎఫ్ఆర్‌ఆర్‌వోలు, డేటా సెంటర్లలో ప్రాథమిక మౌలిక వసతులను మెరుగుపరచి, విస్తరిస్తుంది. సామర్థ్యాన్ని, వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ఏకీకృత డిజిటల్ వేదికలను ప్రారంభించడం, ప్రధాన అప్లికేషన్ నిర్మాణాన్ని పునరుద్ధరించడం, నెట్‌వర్క్, విస్తరణ విధానాలను బలోపేతం చేయడం ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని, సేవల పంపిణీని మెరుగుపరుస్తుంది. ఫలితంగా జాతీయ భద్రతను బలోపేతం చేస్తూనే చట్టబద్ధమైన ప్రయాణికులకు సౌలభ్యాన్ని అందిస్తుంది. ఈ పథకం సేవలను కొనసాగించడంతో పాటు భవిష్యత్తులో విదేశ పర్యాటకులను ఆకర్షించేలా సాంకేతిక ఆవిష్కరణలను ప్రవేశపెట్టడానికి తోడ్పడుతుంది. అలాగే, పర్యాటకం, వైద్యం, వ్యాపార రంగాలకు ఊతమిస్తుంది. అంతర్జాతీయంగా రాకపోకలను, వ్యాపారాన్ని, వాణిజ్యాన్ని, పర్యాటకాన్ని పెంపొందించడానికి అవసరమైన అనేక సానుకూల అంశాలను ఐవీఎఫ్‌ఆర్‌టీ కలిగి ఉంది. ఇది ఆర్థిక వృద్ధికి, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది.

దేశవ్యాప్తంగా 117 ఇమిగ్రేషన్ పోస్టులు (జేపీలు), 15 మంది విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ అధికారులు (ఎఫ్ఆర్ఆర్ఓలు), 854 ఫారినర్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఎఫ్ఆర్‌వోలు)/పోలీసు సూపరింటెండెంట్లు (ఎస్పీలు)/డిప్యూటీ పోలీసు కమిషనర్లు దీని పరిధిలోకి వస్తారు.

ఇమిగ్రేషన్, వీసా కార్యకలాపాల్లో సేవల పంపిణీని, కార్యనిర్వాహక సామర్థ్యాన్ని ఐవీఎఫ్‌ఆర్‌టీ వ్యవస్థ గణనీయమైన మెరుగుపరిచింది. ఆన్‌లైన్ అపాయింట్మెంట్ షెడ్యూలింగ్, చెల్లింపుల ద్వారా 100 శాతం కాంటాక్ట్‌లెస్, ఫేస్‌లెస్ వీసా ప్రక్రియలను ఈ వ్యవస్థ సుసాధ్యం చేసింది. ఫలితంగా గత అయిదేళ్లలో ఈ-వీసాల అప్లికేషన్లలో 91.24 శాతం 72 గంటల లోపే ఆమోదం పొందాయి. బయోమెట్రిక్స్‌తో సహా ఇమిగ్రేషన్ పోస్టుల వద్ద సగటు ప్రయాణీకుల క్లియరెన్స్ సమయం 5-6 నిమిషాల నుంచి 2.5-3 నిమిషాలకు తగ్గింది.

ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్-ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం (ఎఫ్‌టీఐ-టీటీపీ) ద్వారా 13 ప్రధాన విమానాశ్రయాల్లో ఆటోమేటెడ్ ఈ-గేట్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఇమిగ్రేషన్ క్లియరెన్స్ సమయం 2.5-3 నిమిషాల నుంచి 30 సెకన్లకు తగ్గింది. ప్రస్తుతం ఈ రిజిస్ట్రేషన్ భారతీయ పౌరులకు, ఓసీఐ కార్డుదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది.

వ్యాపార సౌలభ్యం, సౌకర్యం, భద్రతా హామీలను అందించడం ద్వారా ఐవీఎఫ్‌ఆర్‌టీ వ్యవస్థ గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను అందిస్తోంది. పర్యాటకం, వ్యాపారం, వాణిజ్యం, పరిశ్రమ, సేవారంగాలు, ప్రత్యేకించి విమానయానం, ఆతిథ్యం రంగాలు ఐవీఎఫ్‌ఆర్‌టీ వ్యవస్థ ద్వారా విస్తృత స్థాయిలో లబ్ధిని పొందుతాయి.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region

Media Coverage

Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 07 ఆగష్టు 2026
August 07, 2026

Viksit Bharat Accelerating: 4x Data Centres, Record EV Sales, Ethanol Validation & Northeast Connectivity Under PM Modi’s Watch