· “ఈ మౌలిక సదుపాయాలతో అనుసంధానం మెరుగుపడి, తమిళనాడు ప్రజలందరికీ గణనీయ ప్రయోజనం చేకూరుతుంది”
· “అధిక-నాణ్యత మౌలిక సదుపాయాల కల్పించడమంటే ప్రజలకు సాధికారత ఇవ్వడమే”
· “కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లుగా తమిళనాడు రహదారుల నిర్మాణానికి భారీ పెట్టుబడులు పెట్టినందువల్ల యాత్రికులకు ప్రయాణ సౌలభ్యం సహా వ్యవసాయ.. సముద్ర ఉత్పత్తుల నిరంతర రవాణాకు భరోసా లభిస్తుంది”
· “గత దశాబ్దంలో రైల్వే రంగంలో చారిత్రక మార్పులు వచ్చాయి... తమిళనాడులో ఈ పరిణామం స్పష్టమవుతోంది... తద్వారా ఆధునిక.. సమర్థ.. ప్రజా కేంద్రక రవాణా వ్యవస్థగా ఇది రూపొందుతోంది”
· “మా ‘మేక్ ఇన్ ఇండియా’ దృక్కోణంతో స్వావలంబన ఇనుమడిస్తూ మన యువతకు ఉద్యోగావకాశాలు లభించడం ఎంతో గర్వకారణం”
· “కేంద్ర బడ్జెట్ తమిళనాడును అరుదైన ఖనిజాల కారిడార్‌లో అగ్రభాగాన నిలిపింది.. తద్వారా అధునాతన తయారీ.. పరిశోధన-సాంకేతిక ప్రగతికి ఉత్తేజం లభిస్తుంది”

శ్రీ ఆర్.ఎన్. రవి, ఎల్. మురుగన్, ఎడప్పాడి కె. పళనిస్వామి, నైనార్ నాగేంద్రన్, ఇ.వి. వేలు, ప్రియమైన తమిళనాడు సోదరీ సోదరులారా... వణక్కం!

 

పవిత్రమైన, చారిత్రక నగరమైన మధురైని సందర్శించడం గౌరవంగా భావిస్తున్నాను. మీనాక్షి అమ్మవారికీ, భగవాన్ సుందరేశ్వరుడికీ భక్తిపూర్వక ప్రణామాలు. తమిళనాడు అభివృద్ధి ప్రస్థానంలో నేటి ఈ కార్యక్రమం గర్వించదగ్గ ఘట్టం. దాదాపు రూ. 4,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశాం. పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసుకున్నాం. ఈ ప్రాజెక్టులు రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తాయి. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఉద్యోగావకాశాలను కల్పించి, లక్షలాది జీవితాల్లో మార్పును తెస్తాయి. రైతులు మార్కెట్లకు చేరుకోవడానికి మెరుగైన రోడ్లు, భక్తులకూ పర్యాటకులకూ సులభతరమైన ప్రయాణం, వ్యాపారులకు వేగవంతమైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. నాణ్యమైన మౌలిక సదుపాయాలను నిర్మించడమంటే ప్రజలను సాధికారత దిశగా నడిపించడమే.

 

మిత్రులారా,

గత పన్నెండేళ్లలో తమిళనాడు హైవే నెట్‌వర్క్ కోసం భారత ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టింది. 2014 నుంచి ఇక్కడ నాలుగు వేల కిలోమీటర్లకు పైగా రహదారులను నిర్మించాం. నేడు రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. మొదటిది మరక్కాణం – పుదుచ్చేరి సెక్షన్ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించడం. దీని కోసం రూ. 2,100 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నాం. ఇది తమిళనాడు, పుదుచ్చేరి రెండింటిలోనూ తీరప్రాంత పర్యాటక రంగం, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. రెండోది పరమకుడి – రామనాథపురం రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించడం. ఈ ప్రాజెక్టులో రూ. 1,800 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నాం. ఇది రామేశ్వరం, ధనుష్కోడి వంటి క్షేత్రాలకు ప్రయాణ సౌకర్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. దీనివల్ల భక్తులకు ప్రయాణం సులభతరం కావడమే కాకుండా.. వ్యవసాయ, సముద్ర ఉత్పత్తుల రవాణా మరింత వేగంగా జరుగుతుంది.

 

మిత్రులారా,

 

గత దశాబ్ద కాలంలో భారతీయ రైల్వేలో చరిత్రాత్మక మార్పులొచ్చాయి. ఆధునికమైన, సమర్థమైన, ప్రజల అవసరాలే ప్రధానంగా ఉండే రవాణా వ్యవస్థగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఈ మార్పు తమిళనాడులో స్పష్టంగా కనిపిస్తోంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమిళనాడుకు రైల్వే బడ్జెట్ కేటాయింపులు దాదాపు తొమ్మిది రెట్లు పెరిగాయి. 2009 నుంచి 2014 మధ్య సగటు వార్షిక రైల్వే కేటాయింపు రూ. 880 కోట్లుగా ఉండేది. 2026–27లో ఈ కేటాయింపు రూ. 7,600 కోట్లకు పెరిగింది.

 

తమిళనాడులో 1,300 కిలోమీటర్లకు పైగా కొత్త రైల్వే లైన్లను నిర్మించాం. 97 శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని సాధించాం. వందలాది ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం వల్ల ప్రయాణ భద్రత, సామర్థ్యం మెరుగయ్యాయి. గతేడాది తమిళనాడులో కొత్త పాంబన్ వంతెనను ప్రారంభించే అదృష్టం నాకు కలిగింది. దేశంలో సముద్ర మట్టం నుంచి నిట్టనిలువుగా పైకి లేచేలా నిర్మించిన మొదటి సముద్ర వంతెన (వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి) ఇది. ఇది మన ఇంజినీరింగ్ నైపుణ్యానికి ఇది నిదర్శనం. ఈ వంతెన ఇప్పుడు తమిళనాడులో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది.

 

మిత్రులారా,

ప్రస్తుతం 9 వందే భారత్ రైళ్లు, 9 అమృత్ భారత్ రైళ్లు తమిళనాడు ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఇలాంటి అత్యాధునిక, వేగవంతమైన రైళ్ల కోచ్‌లు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలోనే తయారవుతున్నాయి. మన మేక్ ఇన్ ఇండియా దార్శనికత స్వావలంబనను పెంచడమే కాకుండా, మన యువతకు ఉద్యోగావకాశాలను కూడా కల్పిస్తుండటం గర్వకారణం. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 77 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నాం. సౌకర్యం, లభ్యత, స్థానిక సంస్కృతికి ఈ స్టేషన్లు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. పునరుద్ధరించిన 8 రైల్వే స్టేషన్లను నేడు తమిళనాడులో ప్రారంభిస్తున్నాం. అలాగే చెన్నై బీచ్ – చెన్నై ఎగ్మోర్ నాలుగో లైన్‌ ప్రారంభం వల్ల చెన్నైలో రోజూ ప్రయాణించే వేలాది మందికి మేలు జరుగుతుంది. కుంభకోణం, యెర్కాడ్, వెల్లూరులలో ఆకాశవాణి కొత్త ఎఫ్ఎం రిలే ట్రాన్స్‌మిటర్లను ప్రారంభించడం కూడా నాకెంతో సంతోషాన్నిస్తోంది. ఈ రేడియో కేంద్రాలు నేటి నుంచి మీకు సేవలందిస్తాయి.

 

మిత్రులారా,

 

గత దశాబ్దంతో పోలిస్తే తమిళనాడుకు మౌలిక సదుపాయాల నిధులు ఇప్పుడు మూడు రెట్లు పెరిగాయి. 2026 బడ్జెట్ కూడా తమిళనాడుపై ప్రత్యేకంగా దృష్టి సారించి అదే ధోరణిని కొనసాగించింది. బెంగళూరు – చెన్నై, చెన్నై – హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ఈ బడ్జెటులో మేం ప్రతిపాదించాం. ఇవి ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తాయి. అలాగే ఈ బడ్జెట్ తమిళనాడును రేర్ ఎర్త్ కారిడార్లలో భాగంగా నిలుపుతోంది. ఇవి అత్యాధునిక తయారీ రంగం, పరిశోధన, సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి.

 

మిత్రులారా,

సుసంపన్నమైన చరిత్ర, వారసత్వం తమిళనాడుకు ఉన్నాయి. ఆదిఛనల్లూర్ వంటి చరిత్రాత్మక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం. పులికాట్ సరస్సు, పొదిగై మలై పరిసరాల్లో పర్యావరణ హిత పర్యాటక కార్యక్రమాల వల్ల.. ప్రకృతి వ్యవస్థల సంరక్షణతోపాటు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా దాదాపు రెండు వందల పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించి, వాటికి తోడ్పాటును అందిస్తున్నాం. ఎన్నో పరిశ్రమలకు తమిళనాడు నిలయమని మనందరికీ తెలుసు. ఈ పథకం ఇక్కడి యువతకు ఎంతో మేలు చేస్తుంది.

 

మిత్రులారా,

 

2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే లక్ష్యంతో ప్రతి భారతీయుడూ స్ఫూర్తిని పొందుతున్నాడు. దేశ భవితను తీర్చిదిద్దడంలో తమిళనాడు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. అభివృద్ధి చెందిన భారత్ కోసం అభివృద్ధి చెందిన తమిళనాడు అన్నదే మనందరి ఉమ్మడి లక్ష్యం. సమ్మిళిత అభివృద్ధికీ, రాష్ట్ర పురోగతికీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.

 

నండ్రి!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
21% YoY rise in engineering exports in June shows sector's resilience amid global challenges: EEPC India Chairman

Media Coverage

21% YoY rise in engineering exports in June shows sector's resilience amid global challenges: EEPC India Chairman
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 14 జూలై 2026
July 14, 2026

From Local Fields to Global Recognition: PM Modi’s ‘Vocal for Local’ is Now Delivering Real Global Respect