హర్మూజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన ప్రపంచ దేశాల నౌకలు.. వాటిలో అధిక సంఖ్యలో భారతీయ సిబ్బంది... ఇది భారత దేశానికి ఆందోళన కలిగించే ఒక ప్రధానాంశం: పీఎం
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, భారత పార్లమెంటులోని ఎగువ సభ నుంచి శాంతి, చర్చలపై ఉమ్మడి స్వరాన్ని వినిపించటం అవసరం: పీఎం
గల్ఫ్ దేశాల్లో ఉన్న దాదాపు కోటి మంది భారతీయుల భద్రత, జీవనోపాధి అంశం కూడా భారత్ కు ఆందోళక కలిగించేదే: పీఎం
పశ్చిమాసియాలో మూడు వారాలుగాపైగా కొనసాగుతోన్న యుద్ధం.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం: పీఎం
వాణిజ్య నౌకలపై దాడులు, హర్మూజ్ జలసంధి వంటి అంతర్జాతీయ జల మార్గాల్లో అంతరాయం కలిగించటం ఆమోదయోగ్యం కాదు: పీఎం
పౌరులు, పౌర మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణాకు సంబంధించిన మౌలిక సదుపాయాలపై దాడులను ఖండించిన భారత్: పీఎం
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పశ్చిమాసియాలోని ప్రధాన దేశాధినేతలతో రెండు సార్లు ఫోన్‌లో చర్చలు: పీఎం
గల్ఫ్ దేశాలు సహా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాతో నిరంతరం సంప్రదింపులు: పీఎం
చర్చలు, దౌత్య చర్యల ద్వారా పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పటమే మన లక్ష్యం: పీఎం
ఉద్రిక్తతలు తగ్గించి, హర్మూజ్ జలసంధిని పునః ప్రారంభించటంపై జరిగిన చర్చలు: పీఎం
యుద్ధ వాతావరణంలోనూ భారత నౌకల సురక్షిత ప్రయాణానికి దౌత్యపరంగా నిరంతరం చర్యలు తీసుకుంటున్న భారత్: పీఎం
యుద్ధం మొదలైనప్పటి నుంచి సవాలుగా మారిన హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల ప్రయాణం.. క్లిష్ట పరిస్థితుల్లోనూ చర్చలు, దౌత్యపరమైన చర్యల ద్వారా మార్గాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం: పీఎం
వీలైన ప్రతిచోటు నుంచి భారత్ కు చమురు, సహజ వాయువు సరఫరా అయ్యేలా చూడటమే మా ప్రయత్నం.. అలాంటి ప్రయత్నాల ఫలితాన్ని చూస్తోన్న భారత్: పీఎం
ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ముడిచమురు, ఎల్‌పీజీతో ఇటీవల భారత్ చేరుకున్న నౌకలు.. రాబోయే రోజుల్లోనూ ఈ దిశగా కొనసాగనున్న ప్రయత్నాలు: పీఎం
బలంగా ఉన్న మన ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక సూత్రాలు.. శరవేగంగా మారుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న ప్రభుత్వం: పీఎం
ప్రతి ప్రభావాన్ని స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలికంగా ఎదుర్కొనే వ్యూహాంతో సాగుతున్న ప్రభుత్వం: పీఎం
తగినంత ఎరువుల సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం: పీఎం
సంక్షోభ ప్రభావం రైతులపై పడకుండా నిరంతరం ప్రయత్నిస్తున్న ప్రభుత్వం: పీఎం
ప్రతి సవాలు పరిష్కారానికి: పీఎం

గౌరవ ఛైర్మన్,

పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం, దాని వల్ల ఉత్పన్నమవుతున్న పరిస్థితుల గురించి మనందరికీ తెలిసిందే. ఈ రోజు, నేను పార్లమెంటు ఎగువ సభ ముందు, నా తోటి పౌరుల ముందు నిలబడి, ఈ ఉద్రిక్త పరిస్థితులపై ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తున్నాను. మూడు వారాలకు పైగా ఈ యుద్ధం కొనసాగుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని సృష్టించింది. భారతదేశానికి కూడా ఈ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మన వాణిజ్య మార్గాలు ప్రభావితమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువులు లాంటి అత్యవసర వస్తువుల సాధారణ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దాదాపు కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నారు. ఉపాధి పొందుతున్నారు. వారి భద్రత, జీవనోపాధి భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. హర్మూజ్ జలసంధిలో అనేక నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో పెద్ద సంఖ్యలో భారతీయ సిబ్బంది ఉన్నారు. ఇది కూడా భారతదేశానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, రాజ్యసభ నుంచి శాంతి, చర్చల ప్రాధాన్యం ప్రపంచానికి తెలియజెప్పేలా ముక్తకంఠంతో మన స్వరం వినిపించడం అవసరం.

గౌరవ ఛైర్మన్,

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి నేను పశ్చిమాసియాలోని అనేక దేశాల అధినేతలతో రెండు పర్యాయాలు ఫోన్లో మాట్లాడాను. అన్ని గల్ఫ్ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాము. అలాగే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. చర్చలు, దౌత్యం ద్వారా ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడమే మా లక్ష్యం. ఉద్రిక్తతలను తగ్గించడం, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం గురించి మేము వారితో మాట్లాడాము. వాణిజ్య నౌకలపై దాడులు చేయడం, హర్మూజ్ జలసంధి లాంటి అంతర్జాతీయ సముద్ర మార్గాలను అడ్డుకోవడం ఆమోదయోగ్యం కాదు. పౌరులు, ప్రజా మౌలిక సదుపాయాలు, ఇంధన, రవాణా సంబంధిత మౌలిక వసతులపై దాడులను భారతదేశం వ్యతిరేకించింది. ఇలాంటి యుద్ధ వాతావరణంలో కూడా భారతీయ నౌకల సురక్షిత ప్రయాణానికి అవసరమైన దౌత్యపరమైన ప్రయత్నాలను భారత్ కొనసాగిస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి చర్చలు మాత్రమే ఏకైక మార్గమని భారత్ సూచించింది. ఈ యుద్ధంలో మానవ ప్రాణాలకు ఏ విధమైన ముప్పు ఎదురైనా మానవాళి ప్రయోజనాలకు విరుద్ధమైనదే. అందుకే, ఈ సమస్యకు వీలైనంత త్వరగా శాంతియుత పరిష్కారాన్ని తీసుకువచ్చేలా అన్ని పక్షాలను భారత్ కోరుతోంది.

గౌరవ ఛైర్మన్,

సంక్షోభ సమయాల్లో, స్వదేశంలోనూ విదేశాల్లోనూ ఉన్న భారతీయుల భద్రతకే మేం అత్యున్నత ప్రాధాన్యమిస్తాం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచీ 3,75,000 మందికి పైగా భారతీయులు సురక్షితంగా దేశానికి తిరిగి వచ్చారు. ఒక్క ఇరాన్ నుంచే, 1,000 మంది తిరిగి రాగా, వారిలో వైద్య విద్యార్థులు 700 మంది ఉన్నారు. ఈ సంక్షోభ సమయంలో మా ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తమ భూభాగంలో ఉన్న భారతీయుల భద్రతపై అన్ని దేశాలు మాకు హామీ ఇచ్చాయి. అయితే, దాడుల కారణంగా కొందరు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం, గాయపడటం విచారకరం. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో, వారి కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నాము. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నాము.

గౌరవ ఛైర్మన్,

ప్రపంచంలోని అతి పెద్ద సముద్ర వాణిజ్య మార్గాల్లో హర్మూజ్ జలసంధి ఒకటి. ఈ మార్గంలో ప్రధానంగా ముడి చమురు, గ్యాస్, ఎరువుల రవాణా పెద్ద ఎత్తున జరుగుతుంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలకు తీవ్ర విఘాతం ఎదురవుతోంది. ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ చర్చలు, దౌత్యపరంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడానికి మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎక్కడ నుంచి వీలైతే అక్కడ నుండి చమురు, గ్యాస్ సరఫరా దేశానికి చేరేలా మేం ప్రయత్నిస్తున్నాం. వీటి ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా వివిధ దేశాల నుంచి ముడి చమురు, ఎల్పీజీ నౌకలు భారత్‌కు చేరుకున్నాయి. భవిష్యత్తులో కూడా ఈ దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతాయి.

గౌరవ ఛైర్మన్,

చమురు, గ్యాస్, ఎరువులు వంటి అత్యవసరమైన వస్తువులను తీసుకువచ్చే నౌకలు సురక్షితంగా దేశానికి చేరుకునేలా భారత్ ప్రయత్నిస్తోంది. అయితే, ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగితే, తీవ్రమైన పరిణామాలు అనివార్యమవుతాయి. అందుకే, గత కొన్నేళ్లుగా స్థిరత్వాన్ని సాధించే దిశగా చేపడుతున్న చర్యలను భారత్ వేగవంతం చేస్తోంది.

గౌరవ ఛైర్మన్,

ప్రతి సంక్షోభం మన ధైర్యాన్ని, మన ప్రయత్నాలను రెండింటినీ పరీక్షిస్తుంది. ఇలాంటి సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొనేలా, గత పదకొండేళ్లలో అనేక నిర్ణయాలు తీసుకున్నాం. ఈ ప్రయత్నాల్లో ఇంధన దిగుమతులను వైవిధ్యీకరించడం ఒక భాగంగా ఉంది. గతంలో 27 దేశాల నుంచి ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ, ఎల్పీజీలను భారత్ దిగుమతి చేసుకునేది. ఇప్పుడు 41 దేశాల నుంచి ఇంధన దిగుమతులు చేసుకుంటోంది. గడచిన దశాబ్ద కాలంలో, సంక్షోభ సమయాల్లో ఉపయోగపడేలా ముడి చమురు నిల్వలను పెంచుకోవడానికి కూడా భారతదేశం ప్రాధాన్యమిచ్చింది. అత్యవసర పరిస్థితుల కోసం మన చమురు సంస్థలు వద్ద గణనీయంగా పెట్రోల్, డీజిల్ నిల్వలున్నాయి. గత పదకొండేళ్లలో 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను ఏర్పాటు చేశాం. అలాగే 6.5 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ నిల్వలను ఏర్పాటు చేసుకొనే దిశగా దేశం కృషి చేస్తోంది. వీటితో పాటుగా, గత దశాబ్దంలో చమురు శుద్ధిలో దేశ సామర్థ్యాలు గణనీయంగా పెరిగాయి. మీ ద్వారా, భారతదేశం వద్ద తగినన్ని ముడి చమురు నిల్వలు ఉన్నాయని, సరఫరా నిరంతరాయంగా సాగేందుకు ఏర్పాట్లు చేశామని ఈ సభకు, దేశానికి హామీ ఇవ్వాలనుకుంటున్నాను.

గౌరవ  ఛైర్మన్,

ఏదైనా ఒకే ఇంధన వనరుపై అతిగా ఆధార పడకుండా ఉండేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. గృహాసవరాల కోసం ఎల్పీజీతో పాటుగా పీఎన్జీ వినియోగానికి మా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. గడచిన దశాబ్దంలో, పీఎన్జీ కనెక్షన్లను పెంపొందించేందుకు మునుపెన్నడూ లేని రీతిలో కృషి చేశాం. ఇటీవలి కాలంలో ఈ ప్రయత్నాలు ముమ్మరం చేశాం. అదే సమయంలో దేశీయంగా ఎల్ఎన్‌జీ ఉత్పత్తిని పెంపొందించేందుకు విస్తృత స్థాయిలో ప్రయత్నాలు చేపడుతున్నాం.

గౌరవ  ఛైర్మన్,

ఇటీవలి కాలంలో ప్రతి రంగంలో ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. రోజురోజుకూ స్వయంసమృద్ధిని పెంచుకోవడమే మన ముందున్న ఏకైక మార్గం. ఉదాహరణకు భారతదేశ చమురులో 90 శాతం కంటే ఎక్కువ విదేశీ నౌకల ద్వారానే రవాణా అవుతోంది. ఇది ఏదైనా ప్రపంచ సంక్షోభం తలెత్తినప్పుడు మన పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తుంది. అందువల్ల 'భారత్‌లో తయారైన' నౌకల కోసం ప్రభుత్వం సుమారు 70,000 కోట్ల రూపాయల విలువైన భారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారత్ ఇప్పుడు నౌకల నిర్మాణం, నౌకలను విడగొట్టడం, నిర్వహణ, ఓవర్‌హాలింగ్ సౌకర్యాలను వేగంగా అభివృద్ధి చేస్తోంది. అదేవిధంగా రక్షణ రంగాన్ని కూడా భారత్ మరింత బలోపేతం చేస్తోంది. గత దశాబ్ద కాలంలో చేసిన కృషి వల్ల నేడు అవసరమైన మెజారిటీ ఆయుధాలను భారత్ స్వదేశీయంగానే తయారు చేస్తోంది. ఒకప్పుడు ప్రాణరక్షక ఔషధాల విషయంలో ముడి పదార్థాలైన ఏపీఐల కోసం కూడా మనం ఇతర దేశాలపై భారీగా ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇటీవలి కాలంలో దేశంలోనే 'ఏపీఐ వ్యవస్థను'ను తయారుచేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. అదేవిధంగా అరుదైన ఖనిజాల విషయంలో కూడా విదేశీ ఆధారితాన్ని తగ్గించడానికి కీలక చర్యలు తీసుకుంటున్నాం. 

గౌరవ  ఛైర్మన్,

ప్రస్తుత సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. పశ్చిమాసియాలో ఇప్పటికే జరిగిన నష్టాన్ని పూడ్చుకొని ప్రపంచం కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయితే భారతదేశంపై దీని ప్రభావం వీలైనంత తక్కువగా ఉండేలా నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్ఠంగా ఉన్నాయి. వేగంగా మారుతున్న పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రభావాలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఒక వ్యూహంతో ముందుకు సాగుతోంది. మన ఎగుమతి, దిగుమతుల్లో ఎదురయ్యే ప్రతి ఇబ్బందిని అంచనా వేయడానికి, అవసరమైన పరిష్కారాలను కనుగొనడానికి 'వివిధ మంత్రిత్వ శాఖల బృందాన్ని' కూడా ఏర్పాటు చేశాం. ఈ బృందం క్రమం తప్పకుండా సమావేశమవుతోంది. కరోనా మహమ్మారి సమయంలో వివిధ రంగాల్లోని సవాళ్లను ఎదుర్కోవడానికి నిపుణులు, అధికారులతో కూడిన 'సాధికారిక బృందాలను' ఏర్పాటు చేసినట్లుగానే.. నిన్న ఏడు కొత్త సాధికారిక బృందాలను కూడా ఏర్పాటు చేశాం. ఈ బృందాలు సరఫరా గొలుసులు, పెట్రోల్ - డీజిల్, ఎరువులు, గ్యాస్, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై వేగంగా, వ్యూహాత్మకంగా పనిచేస్తాయి. ఈ సామూహిక ప్రయత్నాల ద్వారా మనం ఈ పరిస్థితులను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలమని నేను నమ్ముతున్నాను.

గౌరవ  ఛైర్మన్,

రాబోయే విత్తన సమయంలో రైతులకు తగినన్ని ఎరువులు అందేలా చూడటానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎరువుల సరఫరాలో ఎటువంటి కొరత లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. ఏ సంక్షోభం వల్ల కూడా రైతులపై అదనపు భారం పడకూడదన్నదే ప్రభుత్వ నిరంతర ప్రయత్నం. దేశంలోని రైతులకు నేను మరోసారి హామీ ఇస్తున్నాను.. ప్రతి సవాలును ఎదుర్కోవడం, పరిష్కారాలను కనుగొనడంలో ప్రభుత్వం మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.

గౌరవ  ఛైర్మన్,

ఇది రాష్ట్రాల సభ. రాబోయే కాలంలో ఈ సంక్షోభం మన దేశానికి ఒక పెద్ద పరీక్ష కానుంది. ఇందులో విజయం సాధించాలంటే రాష్ట్రాల సహకారం చాలా కీలకం. అందువల్ల ఈ సభ ద్వారా నేను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని విజ్ఞప్తులు చేయాలనుకుంటున్నాను. సంక్షోభ సమయాల్లో పేదలు, కార్మికులు, వలస కూలీలు అత్యధికంగా ప్రభావితమవుతారు. కాబట్టి 'పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన' ప్రయోజనాలు వారికి సకాలంలో అందేలా చూడాలి. వలస కార్మికులు ఎక్కడ పనిచేస్తున్నా వారి కష్టాలను తగ్గించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి పరిస్థితులను పర్యవేక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే అది వారికి ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు మరో సవాలుపై కూడా నిశితంగా దృష్టి సారించాలి.. ఇటువంటి సమయాల్లో నల్లబజారు క్రయవిక్రయదారులు, అక్రమ నిల్వదారులు చాలా చురుగ్గా మారుతుంటారు. అటువంటి ఫిర్యాదులు ఎక్కడ వచ్చినా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడటమే ప్రతి రాష్ట్రం ప్రథమ ప్రాధాన్యత కావాలి.

గౌరవ  ఛైర్మన్,

నేను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మరో విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. సంక్షోభం ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ  వేగవంతమైన భారతదేశ వృద్ధిని కాపాడటం మనందరి ఉమ్మడి బాధ్యత. దీని కోసం అవసరమైన ప్రతి చర్యను, ప్రతి సంస్కరణను అత్యంత వేగంగా అమలు చేయాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక గొప్ప అవకాశం కూడా. ఇది 'టీమ్ ఇండియా'కు ఒక పెద్ద పరీక్ష. కరోనా వంటి మహా సంక్షోభ సమయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి కోవిడ్ నిర్వహణలో ఒక అద్భుతమైన నమూనాను ప్రపంచానికి చాటిచెప్పాయి. వేర్వేరు రాజకీయ పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పటికీ టీమ్ ఇండియా కృషితో పరీక్షలు, టీకాల పంపిణీ, నిత్యావసర వస్తువుల సరఫరాను విజయవంతంగా నిర్వహించాం. మనం అదే స్ఫూర్తితో పని చేయాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి కృషితో దేశం ఈ తీవ్రమైన ప్రపంచ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది.

గౌరవ  ఛైర్మన్,

ఈ సంక్షోభం ఒక భిన్నమైన స్వభావాన్ని కలిగి ఉంది. దీని పరిష్కారాలు కూడా విభిన్న రీతిలో నిర్ణయమవుతున్నాయి. మనం ప్రతి సవాలును సహనం, నిగ్రహం, ప్రశాంతమైన మనస్సుతో ఎదుర్కోవాలి.

గౌరవ  ఛైర్మన్,

మనం చూస్తున్నట్లుగానే ఈ యుద్ధానికి సంబంధించిన పరిస్థితులు క్షణక్షణానికి మారుతున్నాయి. అందువల్ల ప్రతి సవాలును ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలని నా తోటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యుద్ధం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం బలంగా ఉంది. అయితే ప్రభుత్వం అప్రమత్తంగా, సిద్ధంగా ఉందని.. వ్యూహాత్మకంగా పూర్తి గంభీరతతో పనిచేస్తూ అవసరమైన ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటుందని నేను దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాను. ప్రజల సంక్షేమమే మాకు పరమావధి. ఇదే మా గుర్తింపు.. ఇదే మా బలం. ఈ స్ఫూర్తితోనే నేను నా ప్రకటనను ముగిస్తున్నాను.

ధన్యవాదాలు!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Inspiring India: Gujarat Woman's Solar Mission Earns PM Modi’s Praise, Invitation to I-Day Ceremony

Media Coverage

Inspiring India: Gujarat Woman's Solar Mission Earns PM Modi’s Praise, Invitation to I-Day Ceremony
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi calls upon people to celebrate National Handloom Day by showcasing India's rich handloom heritage
August 06, 2026

The Prime Minister, Shri Narendra Modi, has called upon citizens to celebrate National Handloom Day on 7th August by promoting India's rich and diverse handloom traditions.

“Share your videos with your favourite handloom products, including GRWM videos on social media”, Shri Modi said.

Shri Modi posted on X;

Tomorrow, 7th August is National Handloom Day. Let’s make India’s handloom diversity popular.

Share your videos with your favourite handloom products, including GRWM videos on social media.

Don’t forget to use #NationalHandloomDay.