· మన స్వాతంత్ర్యోద్యమాన్ని ఉత్తేజితం చేసిన వందేమాతరం
· వందేమాతరం 150 ఏళ్ల వేడుకలో పాల్గొనడం మనందరికీ గర్వకారణం
· మన స్వాతంత్ర్య సమరయోధుల స్వప్నాలను సాకారం చేసుకునే దిశగా మనల్ని ముందుకు నడిపే చోదక శక్తి మందేమాతరం
· వేల ఏళ్లుగా దేశంలో బలంగా వేళ్లూనుకుని ఉన్న భావనను పునరుత్తేజపరిచిన వందేమాతరం
· వేల ఏళ్ల సాంస్కృతిక శక్తి, స్వతంత్రతా సంకల్పం, స్వతంత్ర భారత లక్ష్యాన్ని ప్రతిధ్వనించిన వందేమాతరం
· మన స్వతంత్రోద్యమ ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా.. ప్రజల్లో విశేష ఆదరణ పొందిన వందేమాతరం
· స్వాతంత్ర్యోద్యమంలో జవసత్వాలను నింపి, దిశానిర్దేశం చేసిన వందేమాతరం
· స్వేచ్ఛ, త్యాగం, స్వచ్ఛత, అంకితభావం, ఉత్తేజం... అన్నింటికీ ప్రేరణగా నిలిచిన సర్వవ్యాప్త మంత్రం వందేమాతరం: ప్రధాని

గౌరవనీయులైన అధ్యక్షా,

ఈ ప్రత్యేక సందర్భంలో సామూహికంగా చర్చించేందుకు ముందుకు వచ్చినందుకు మీకు, ఈ సభలోని గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని శక్తి, త్యాగస్పూర్తి, నిరాడంబరతను నింపిన ఆ మంత్రాన్ని, ఆ స్పష్టమైన పిలుపును గౌరవంగా గుర్తుచేసుకుంటూ.. ఈ సభలో వందేమాతరాన్ని స్మరించుకోవడం మనందరికీ గొప్ప గౌరవం. వందేమాతరం 150 సంవత్సరాల చారిత్రక ఘట్టానికి మనం సాక్షులుగా నిలబడటం చాలా గర్వకారణం. ఈ కాలం చరిత్ర విస్తృతి నుంచి లెక్కలేనన్ని సంఘటనలను మన ముందుకు తీసుకువస్తుంది. ఈ చర్చ ఖచ్చితంగా సభ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. కానీ మనం ఈ క్షణాన్ని సమష్టిగా ఉపయోగించుకుంటే రాబోయే తరాలకు, ప్రతి తరానికి కూడా నేర్చుకునే మూలంగా ఉపయోగపడుతుంది.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

 

చరిత్రలోని అనేక స్ఫూర్తిదాయకమైన అధ్యాయాలు మరోసారి మన ముందు సజీవంగా ఉన్న కాలమిది. ఇటీవలే మన రాజ్యాంగం 75 సంవత్సరాల వేడుకను ఎంతో గర్వంగా జరుపుకున్నాం. అదే విధంగా దేశం సర్దార్ వల్లభాయ్ పటేల్, భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని కూడా జరుపుకుంటోంది. మనం గురు తేగ్ బహదూర్ గారి 350వ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకున్నాం. నేడు వందేమాతరం 150 సంవత్సరాల సందర్భంగా ఈ సభ సమిష్టి శక్తిని అనుభవించడానికి ప్రయత్నిస్తూ మనం ఇక్కడ నిలబడి ఉన్నాం. ఈ 150 సంవత్సరాల ప్రయాణం అనేక దశలను దాటింది.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

వందేమాతరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు.. దేశం బానిసత్వ సంకెళ్లలో జీవించాల్సి వచ్చింది. అది 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు దేశం అత్యవసర పరిస్థితి సంకెళ్లలో చిక్కుకుంది. శతాబ్ది ఉత్సవాలను గొప్ప వేడుకగా జరుపుకోవాల్సిన సమయంలో భారత రాజ్యాంగం గొంతు కోశారు. వందేమాతారానికి 100 సంవత్సరాలు నిండినప్పుడు దేశభక్తి కోసం జీవించి, మరణించిన వారు జైళ్ల పాలయ్యారు. దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడటానికి శక్తినిచ్చిన ఆ పాట, దాని శత జయంతిని చేరుకునే సమయంలో మన చరిత్రలో ఒక చీకటి అధ్యాయం విప్పుకుంది.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

ఆ అధ్యాయం గొప్పతనాన్ని, ఆ వైభవాన్ని తిరిగి స్థాపించేందుకు ఈ 150వ సంవత్సరం మనకు అవకాశాన్ని ఇస్తోంది. ఈ అవకాశాన్ని ఈ సభ గానీ, దేశం గానీ వదులుకోకూడదని నేను భావిస్తున్నాను. 1947లో దేశాన్ని చివరికి స్వాతంత్ర్యానికి నడిపించింది వందేమాతరమే. స్వాతంత్ర్య పోరాటానికి భావోద్వేగ నాయకత్వం ‘వందేమాతరం’ అనే విజయవంతమైన నినాదంలోనే నిక్షిప్తమైంది.

 

గౌరవనీయలైన అధ్యక్షా,

వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ చర్చను ప్రారంభించడానికి నేను నేడు మీ ముందు నిలబడి ఉన్నాను. ఇక్కడ అధికార పక్షంగానీ, ప్రతిపక్షంగానీ ఏదీ లేదు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మనందరికీ ఇది లోతైన భావాన్ని కలిగించే సందర్భం. వందేమాతరం వల్లే దృఢ సంకల్పం కలిగిన వ్యక్తులు స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపారు. దాని ఫలితమే నేడు మనమందరం ఇక్కడ కూర్చున్నాం. అందుకే పార్లమెంటు సభ్యులందరూ, ప్రజాప్రతినిధులందరూ వందేమాతరానికి రుణపడి ఉన్నామని అంగీకరించేందుకు ఇది ఒక పవిత్ర క్షణం. దాని నుంచి స్ఫూర్తి పొంది వందేమాతరం ద్వారా దేశ స్వాతంత్ర్య పోరాటాన్ని ఏకం చేసిన స్ఫూర్తిని మనం మరోసారి పునరుద్ధరించాలి. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమం ఇలా దేశమంతా ఒకే స్వరంతో ముందుకు సాగింది. మరోసారి మనల్ని కలిసి నడవాలని, దేశాన్ని మనతో పాటు తీసుకువెళ్లాలని ఈ క్షణం పిలుస్తోంది. మన స్వాతంత్ర్య సమరయోధులు కన్న కలలు, వందేమాతరం 150 మనకు స్పూర్తిగా, శక్తిగా మారి.. 2047 నాటికి భారత్ ను స్వావలంబనగా, అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు మనల్ని ప్రేరేపించాలి. వందేమాతరం అనే ఈ సందర్భం ఆ ప్రతిజ్ఞను పునరుద్ఘాటించడానికి మనకు గొప్ప అవకాశాన్ని ఇస్తుంది.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

దాదా, మీరు బాగానే ఉన్నారా? లేదు, లేదు, కొన్నిసార్లు ఈ వయసులో కూడా అలాంటివి జరుగుతాయి.

1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం తీవ్ర కుదుపునకు గురైన సమయంలో, బంకిమ్ చంద్ర గారు 1875లో వందేమాతరం రచించిన సమయంలో దీని ప్రయాణం మొదలైంది. వారు భారత్‌పై అనేక రకాలుగా ఒత్తిని పెంచుతూ, లెక్కలేనన్ని దారుణాలకు పాల్పడుతూ, దేశ ప్రజలను బలవంతంగా హింసకు గురిచేశారు. ఆ సమయంలో వారి జాతీయ గీతం ‘‘గాడ్ సేవ్ ది క్వీన్’’ను భారత్‌లోని ప్రతి ఇంట్లోనూ ప్రచారం చేయడానికి కుట్ర జరిగింది. అలాంటి సమయంలోనే బంకిం దా ఆ సవాలును స్వీకరించి తాను ఎదుర్కొన్న దానికంటే ఎక్కువ శక్తితో స్పందించాడు. అప్పుడే వందేమాతరం పుట్టింది. కొన్ని సంవత్సరాల తరువాత 1882లో అతను ఆనందమఠం రాసినప్పుడు ఈ పాటను అందులో చేర్చాడు.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

వేల సంవత్సరాలుగా దేశ నరనరాల్లో నిక్షిప్తమై ఉన్న ఆ ఆలోచనను వందేమాతరం పునరుద్ధరించింది. ఆయన మనకు అదే భావనను, అదే విలువలను, అదే సంస్కృతిని, సంప్రదాయాన్ని, లోతైన, ఉన్నతమైన పదాల ద్వారా బహుమతిగా ఇచ్చారు. వందేమాతరం కేవలం రాజకీయ స్వేచ్ఛ కోసం ఒక మంత్రం కాదు. బ్రిటిష్ వారు వెళ్లిపోవాలని, తద్వారా మనం మన సొంత మార్గంలో స్వతంత్రంగా నిలబడగలమని చెప్పే పిలుపు మాత్రమే కాదు. అది అంతకు మించి స్ఫూర్తినిచ్చింది. ఈ మాతృభూమిని విముక్తం చేయడానికి స్వాతంత్ర్య పోరాటం ఒక పవిత్రమైన యజ్ఞం. భారత మాతను తన సంకెళ్ల నుంచి విడిపించేందుకు సాగిన ధర్మ యుద్ధం. వందేమాతరం నినాదం సాంస్కృతిక పునాదిని పరిశీలిస్తే దాని విలువల పరంపరం వేద యుగం వరకు సాగింది. మనం వందేమాతరం పలికినప్పుడల్లా వేద కాలం నాటి అదే ఆలోచన వస్తుంది: ‘‘భూమి తల్లి భూమి పుత్రుడు’’, ‘‘భూమి నా తల్లి, నేను ఆమె కొడుకును’’

 

గౌరవనీయులైన అధ్యక్షా,

శ్రీ రాముడు కూడా లంక వైభవాన్ని తిరస్కరించినప్పుడు వ్యక్తం చేసిన భావన ఇదే... ‘‘తల్లి, మాతృభూమి స్వర్గం కంటే గొప్పవి’’. వందేమాతరం ఈ ఉన్నతమైన సాంస్కృతిక సంప్రదాయానికి ఆధునిక రూపం.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

బంకిం దా వందేమాతరాన్ని రచించినప్పుడు అది సహజంగానే స్వాతంత్ర్య ఉద్యమ గొంతుకగా మారింది. తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు, వందేమాతరం ప్రతి భారతీయుడి సంకల్పంగా మారింది. వందేమాతరాన్ని ప్రశంసిస్తూ.. ఈ కింది వాక్యాలు రాశారు.

 

"స్వాతంత్ర్య వేదికపై మాతృభూమి ఆనందంతో ఉంది. స్వాతంత్ర్య వేదికపై మాతృభూమి ఆనందంతో ఉంది. స్వార్థాన్ని త్యజించే బలిదానం ఇది. ఈ మాటలే వందేమాతరం, ఇది జీవిత మంత్రం కూడా, ఇది ప్రపంచాన్ని జయించే మంత్రం కూడా.. ఇది శక్తిని ఆవహించే మంత్రం, ఈ మాటలే వందేమాతరం. వేడి రక్తంతో లిఖించండి, హృదయాన్ని చీల్చి వెలువడే వీరుడి గర్వం ఇది, ఈ మాటలే వందేమాతరం.’’

అర్థం.. మాతృభూమి స్వాతంత్ర్యపు బలిపీఠంపై స్వార్థాన్ని సంతోషంగా త్యాగం చేయడమే-ఈ మాటలే వందేమాతరం.

ఇది జీవాన్ని ఇచ్చే మంత్రం, లోకాన్ని జయించే మంత్రం; ఇది శక్తిని ఆవాహనం చేసే మంత్రం-ఈ మాటలే వందేమాతరం.

వెచ్చని రక్తంతో లిఖించండి, గుండెను చీల్చి రాయండి-ఇదే వీరుల గర్వం-ఈ మాటలే వందేమాతరం.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

కొన్ని రోజుల క్రితం వందేమాతరం 150 వేడుకలు ప్రారంభమైనప్పుడు ఆ కార్యక్రమంలో వందేమాతరం వేల ఏళ్ల సాంస్కృతిక శక్తికి ప్రతీక అని నేను చెప్పాను. ఇది స్వాతంత్ర్య స్పూర్తిని మాత్రమే కాకుండా, స్వతంత్ర భారతదేశ ధృక్పథాన్ని కూడా ప్రతిబింబించింది. బ్రిటిష్ పాలన సమయంలో దేశాన్ని బలహీనంగా, పనికి రానిదిగా, సోమరిగా, చిత్రీకరించడం ఒక ఫ్యాషన్ గా మారింది. భారత్‌ను అన్ని విధాలుగా తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగింది. ఆ బ్రిటిష్ ప్రభావంలో పెరిగిన వారు కూడా అదే భాష, అదే భావజాలాన్ని అవలంభించారు. ఆ అల్పత్వ భావన నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు, భారత్ శక్తిని ప్రపంచానికి తెలియజేయడానికి బంకిమ్ దా తన శక్తిమంతమైన గీతంలో ఇలా రారు.

 

"నీవు పది ఆయుధాలు ధరించిన దుర్గాదేవివి.. కమల దళాలపై విహరించే కమలవు... విద్యను ప్రసాదించే వాణివి. నిన్ను నమస్కరిస్తున్నాను, కమల స్వరూపిణికి నమస్కరిస్తున్నాను, నిర్మలమైన, సాటిలేని, మంచి నీటిని, మంచి ఫలాలను ఇచ్చే తల్లి, నీకు నేను నమస్కరిస్తున్నాను. వందే మాతరం!

 

దీని అర్థం.. భారత మాత జ్ఞానం, శ్రేయస్సుకు దేవతగా ఉండటమే కాదు..తన శత్రువుల ముందు తన ఆయుధాలతో నిలబడే యోధురాలు కూడా దుర్గా.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

ఈ మాటలు, ఈ భావోద్వేగం. ఈ స్ఫూర్తి వలస పాలనలో నిరాశలో కూరుకుపోతున్న భారతీయులను ఉత్తేజపరిచింది. ఈ పంక్తులు కోట్లాది మంది దేశ ప్రజలకు ఈ పోరాటం కేవలం ఒక భూమి కోసం కాదని, కేవలం అధికార పీఠం కోసం కాదని, బానిసత్వ సంకెళ్ల నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి, దాని పురాతన సంప్రదాయాలు, గొప్ప సంస్కృతి, అద్భుతమైన చరిత్రకు పునర్జన్మనివ్వడం కోసం అని తెలియజేశాయి.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

ప్రజలతో వందేమాతరానికి ఉన్న లోతైన అనుబంధం మన స్వాతంత్ర్య పోరాట సుదీర్ఘ గాథ ద్వారా వ్యక్తమవుతుంది.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

సింధు, సరస్వతి, కావేరి, గోదావరి, గంగా లేదా యమున ఏ నది గురించి మాట్లాడినా దాని పక్కనే ఒక సాంస్కృతిక ప్రవాహం, అభివృద్ధి ప్రయాణం, మానవ జీవిత చరిత్ర కూడా ప్రవహిస్తుంది. కానీ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలోని ప్రతి దశ వందేమాతరం భావోద్వేగాల ద్వారానే ప్రవహించిందని ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? అది దాని ఒడ్డున వికసించింది. అలాంటి కవితాత్మక భావోద్వేగం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

1857 తర్వాత భారత్‌లో తమ పాలన ఎక్కువ కాలం నిలబడటం కష్టమని బ్రిటిష్ వారికి అర్థమైంది. వారు దేశాన్ని విభజించకపోతే ప్రజలను విడగొట్టి తమ మధ్య గొడవలు సృష్టించకపోతే వారి పాలన మనుగడ సాగించదని వారు గ్రహించారు. అందుకే ‘‘విభజించి పాలించు’’ అనే విధానాన్ని అవలంబించారు. బెంగాల్‌ను తమ ప్రయోగశాలగా చేసుకున్నారు. ఎందుకంటే బెంగాల్ మేధో బలం ఒకప్పుడు యావత్ దేశానికి దిశానిర్దేశం చేసి, శక్తిని, స్ఫూర్తిని ఇచ్చిందని వారికి తెలుసు. అందుకే ఆ శక్తిని బలహీనపరచాలని బ్రిటిష్ వారు కోరుకున్నారు. బెంగాల్ విభజిస్తే దేశమంతా విచ్ఛిన్నమవుతుందని, అప్పుడు తాము కోరుకున్నంత కాలం పాలించవచ్చని వారు ఆలోచించారు. 1905లో వారు బెంగాల్‌ను విభజించారు. కానీ ఆ పాపం చేసినప్పుడు వందేమాతరం ఒక శిలలా స్థిరంగా నిలిచింది. అది ప్రతి వీధి, ప్రతి మూల గొంతుకగా మారింది. బెంగాల్ ఐక్యత కోసం ప్రతిధ్వనించింది. ఆ నినాదం ప్రజల స్ఫూర్తిగా మారింది. బెంగాల్ విభజనతో, బ్రిటిష్ వారు భారతదేశాన్ని మరింత బలహీనపరచడానికి తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కానీ వందేమాతరం ఒకే గొంతుకగా, ఐక్యంగా, వారికి నిరంతరం పెరుగుతున్న సవాలుగా, దేశానికి బలాన్నిచ్చే శిలగా మారింది. మన దేశంలోని చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టలేదు. వారిని కొరడాలతో కొట్టారు; చిన్న వయసులో వారిని జైలులో పడేశారు. ఆ రోజుల్లో, ముఖ్యంగా బెంగాల్ సందులలో, వందేమాతరం జపిస్తూ ఉదయం ఊరేగింపులు తప్పకుండా జరిగేవి. వారు బ్రిటిష్ వారికి నిరంతరం ఒక ముల్లుగా మారారు. ఆ సమయంలో, బెంగాల్ అంతటా ఒక పాట ప్రతిధ్వనించింది:

 

గౌరవనీయులైన అధ్యక్షా,

బెంగాల్ విభజన జరిగింది. అయినప్పటికీ దాని నేపథ్యంలో భారీ స్వదేశీ ఉద్యమం ఉప్పొంగింది. ఆ సమయంలో వందేమాతరం ప్రతిచోటా ప్రతిధ్వనించింది. బెంగాల్ గడ్డ నుంచి అసాధారణమైనదేదో ఉద్భవించిందని బ్రిటిష్ వారు గ్రహించారు. బంకిం దా ఈ భావోద్వేగ మంత్రం... సరే, ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు, నేను మీ భావాలను గౌరవిస్తాను. బంకిం బాబు... బంకిం బాబు. ధన్యవాదాలు, దాదా, ధన్యవాదాలు. నేను మిమ్మల్ని దాదా అని పిలవవచ్చా? లేకపోతే మీరు కూడా దీనికి అభ్యంతరం చెప్పవచ్చు. ఈ ఉద్వేగభరితమైన నినాదం ద్వారా బంకిం బాబు సృష్టించిన భావోద్వేగ ప్రపంచం బ్రిటిష్ వారిని, వారి మూలాలను కుదిపేసింది. ఈ పాటకు అమితమైన బలం ఉండటంతో బ్రిటిష్ వారు బెంబేలెత్తి దీనిపై చట్టపరమైన నిషేధాన్ని విధించారు. దానిని పాడినందుకు శిక్షించారు. ముద్రించినందుకు శిక్షించారు. చివరికి వందేమాతరం అనే పదాలను పలికినప్పటికీ శిక్షించారు. అలాంటి కఠిన చట్టాను అమలు చేశారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి వందలాది మంది మహిళలు నాయకత్వం వహించారు. లెక్కలేనంత మంది మహిళలు గొప్ప సంకల్పంతో సహకరించారు. నేను ఒక సంఘటనను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. బారిసాల్‌లో వందేమాతరం పాడినందుకు అత్యంత దారుణమైన అకృత్యాలు జరిగాయి. ఆ బారిసాల్ నేడు భారతదేశంలో భాగం కాదు. ఆ సమయంలో మన తల్లులు, సోదరీలు, బారిసాల్ పిల్లలు వీధుల్లోకి వచ్చారు. ఈ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమతరం గౌరవం కోసం యుద్ధభూమిలోకి అడుగుపెట్టారు. అప్పుడు బారిసాల్‌కు చెందిన ఈ వీర మహిళ శ్రీమ సరోజిని ఘోష్ ఉద్భవించింది. వందేమాతరంపై నిషేధం ఎత్తివేసే వరకు తాను ధరించిన గాజులు తీసివేస్తానని ఆమె ప్రకటించింది. దేశంలో ఆ రోజుల్లో గాజులు తీసివేయడం ఒక స్త్రీ జీవితంలో ఒక ముఖ్యమైన చర్యగా పరిగణించేవారు. అయినప్పటికీ ఆమెకు వందేమాతరం అన్నిటికంటే గొప్ప భావోద్వేగం. ఆమె తన బంగారు గాజులు తీసివేసి వందేమాతరంపై నిషేధం ఉపసంహరించుకునే వరకు వాటిని మళ్లీ ధరించనని ప్రతిజ్ఞ చేసింది. ఆమె చేసిన గొప్ప ప్రమాణం అలాంటింది. మన దేశంలోని చిన్న పిల్లలు కూడా వదిలిపట్టలేదు. వారిని కొరడాలతో కొట్టారు. చిన్న వయస్సులోనే వారిని జైల్లో వేశారు. ఆ రోజుల్లో ముఖ్యంగా బెంగాల్ వీధుల్లో వందే మాతరం జపిస్తూ ఉదయం ఊరేగింపులు తప్పక జరిగేవి. అవి బ్రిటిష్ వారికి నిరంతరం ఇబ్బందిగా మారాయి. ఆ సమయంలో బెంగాల్ అంతటా ఒక పాట ప్రతిధ్వనించింది.

 

‘‘జీవితం సాగిపోతుంది, జీవితం ముందుకు సాగుతూనే ఉంటుంది, ప్రపంచం నీ భుజం మీద వాలి వందేమాతరం పలుకుతుంది’’

అర్థం: ఓ తల్లీ, నిన్ను సేవిస్తూ వందేమాతరం జపిస్తూ జీవితం గడిచిపోతే, అలాంటి జీవితం కూడా ధన్యమే. బెంగాల్ సందుల్లోని పిల్లలు ఇలా ప్రకటిస్తున్నారు. ఆ పాట ఆ పిల్లల ధైర్యానికి స్వరం, వారి ధైర్యం దేశానికి బలాన్నిచ్చింది. బెంగాల్ సందుల నుంచి ఉద్భవించిన స్వరం మొత్తం దేశానికి స్వరం అయింది. 1905లో హరిత్‌పూర్‌లోని ఒక గ్రామంలో చిన్న పిల్లలు వందేమాతరం నినాదం ఇస్తుండగా బ్రిటిష్ వారు కనికరం లేకుండా వారిని కొరడాతో కొట్టారు. వారు జీవన్మరణాల మధ్య పోరాటం చేయాల్సి వచ్చింది. వారిపై జరిగిన క్రూరత్వం అలాంటిది. 1906లో నాగ్‌పూర్‌లోని నీల్ సిటీ హైస్కూల్ పిల్లలపై బ్రిటిష్ వారు ఇలాంటి దారుణాలకే పాల్పడ్డారు. వారు చేసిన ఏకైక నేరం ఏంటంటే.. అందరూ కలిసి నిలబడి ఒకే ఒక్క నినాదం చేయడం.. అదే వందేమాతరం. వారి బలం ద్వారా ఈ మంత్రం పవిత్ర శక్తిని ప్రదర్శించడానికి ఆ పిల్లలు ప్రయత్నించారు. మన ధైర్యవంతులైన విప్లవకారులు భయం లేకుండా ఉరిశిక్షలను స్వీకరించారు. వారి చివరి శ్వాస వరకు చెప్పిన మాట ఒకటే. వందేమాతరం, వందేమాతరం, వందేమాతరం. ఖుదీరామ్ బోస్, మదన్ లాల్ ధింగ్రా, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రోషన్ సింగ్, రాజేంద్రనాథ్ లాహిరి, రామకృష్ణ బిస్వాస్ ఇలా లెక్కలేనంత మంది వందే మాతరం జపిస్తూ ఉరికొయ్యకు బలయ్యారు. ఇది వివిధ జైళ్లలో వివిధ ప్రాంతాలలో జరిగింది. హింసించిన వారి ముఖాలు భిన్నంగా ఉన్నాయి. భిన్న ప్రజలకు హింసకు గురయ్యారు. వారి భాషలు భిన్నంగా ఉన్నాయి. కానీ ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’ అనే మంత్రం అందరికీ ఒకటే: వందేమాతరం. స్వదేశీ విప్లవంలో బ్రిటిష్ వారిని సవాలు చేసిన చిట్టగాంగ్‌ యువకులు కూడా మన చరిత్రలో నిలిచిపోయిన పేర్లు. హరగోపాల్ కౌల్, పులిన్ బికాష్ ఘోష్, త్రిపుర సేన్ దరూ దేశం కోసం తమను తాము త్యాగం చేసుకున్నారు. 1934లో మాస్టర్ సూర్య సేన్ను ఉరితీసినప్పుడు అతను తన సహచరులకు ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో ఒకే ఒక పదం ప్రతిధ్వనించింది.. అదే వందేమాతరం.

 

అధ్యక్షా,

భారతీయులమైన మనం గర్వించాలి. శతాబ్దాలుగా లక్షలాది ప్రజలకు ఒకే లక్ష్యం దిశగా ప్రేరణ కలిగిస్తున్న, ఆ లక్ష్యం కోసమే వారి జీవితాలను అంకితం చేసేలా స్ఫూర్తినిస్తున్న పద్యమూ, స్ఫూర్తిదాయకమైన గేయమూ ప్రపంచ చరిత్రలో మరొకటి లేదు. వందేమాతరం తప్ప, అలాంటి ఉద్వేగభరిత గేయం ప్రపంచంలో మరెక్కడా లేదు. దేశం దాస్య శృంఖలాల్లో ఉన్న సమయంలో కూడా ఈ రకమైన గేయాలను సృజించగల అసాధారణ వ్యక్తులు ఈ దేశంలో జన్మించారని ప్రపంచానికి తెలియాలి. ప్రపంచం దీన్నో అద్భుతంలా చూస్తుంది. మనం ఈ విషయాన్ని గర్వంగా చాటాలి. అప్పుడు ప్రపంచం కూడా దీన్ని గౌరవించడం మొదలుపెడుతుంది. అది మన స్వతంత్రతా మంత్రం, నివేదనా మంత్రం, శక్తిదాయక మంత్రం, పవిత్రతా మంత్రం, నిబద్ధతా మంత్రం, త్యాగమూ తపమూ కూడిన మంత్రం, కష్టాలను తట్టుకుని నిలిచే బలాన్నిచ్చిన మంత్రం... ఆ మంత్రం వందేమాతరం. అందుకే గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ ఇలా రాశారు: ఏక కార్యే సోంపియాఛి సహస్ర జీవన్ – వందేమాతరం (బెంగాలీలో). అంటే, “ఒకే సూత్రం వేలాది హృదయాలను పెనవేసుకుంది. వేలాది జీవితాలు ఒకే లక్ష్యానికి అంకితమయ్యాయి: వందేమాతరం”.. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిందిది.

 

అధ్యక్షా,

అదే సమయంలో వందేమాతరం రికార్డింగులు ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు చేరాయి. విప్లవకారులకు లండన్ ఒక పవిత్ర క్షేత్రంగా మారింది. ఆ లండన్ ఇండియా హౌస్‌లో వీర సావర్కర్ వందేమాతరాన్ని ఆలపించారు. ఆ గేయం ఎన్నోసార్లు అక్కడ ప్రతిధ్వనించింది. దేశం కోసమే జీవించి, దేశం కోసమే ప్రాణాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్న యోధులకు ఇదెంతగానో స్ఫూర్తిదాయకం. అదే సమయంలో బిపిన్ చంద్రపాల్, మహర్షి అరబిందో ఘోష్ ఒక వార్త పత్రికను ప్రారంభించారు. దానికి ‘వందేమాతరం’ అని పేరు పెట్టారు. నిజానికి బ్రిటిష్ వారికి కంటి మీద కునుకు లేకుండా చేసేందుకు ‘వందేమాతరం’ ఒక్కటి చాలు. అందుకే వారు ఈ పేరును ఎంచుకున్నారు. బ్రిటిష్ వారు వార్త పత్రికలపై నిషేధం విధించిన సమయంలో మేడమ్ భికాజీ కామా పారిస్‌లో ఓ పత్రికను ప్రారంభించి, దానికి ‘వందేమాతరం’ పేరు పెట్టారు.

అధ్యక్షా,

వందేమాతరం భారత్‌కు స్వావలంబన పథాన్నీ నిర్దేశించింది. అప్పట్లో అగ్గిపెట్టెల నుంచి పెద్ద పెద్ద ఓడల వరకు.. వాటిపై వందేమాతరం రాసే సంప్రదాయం మొదలైంది. అది విదేశీ కంపెనీలను సవాలు చేసే సాధనంగా, స్వదేశీ మంత్రంగా మారింది. స్వదేశీ మంత్రంలాగే స్వతంత్రతా మంత్రమూ విస్తరించడం మొదలైంది.

అధ్యక్షా,

మరో సంఘటననూ నేను ప్రస్తావిస్తున్నాను. 1907లో వి.వొ. చిదంబరం పిళ్ళై స్వదేశీ కంపెనీ ఓడను రూపొందించిన సమయంలో దానిపై వందేమాతరం అని రాశారు. జాతీయ కవి సుబ్రమణ్య భారతి వందేమాతరాన్ని తమిళంలోకి అనువదించి స్తుతి కీర్తనలు కూర్చారు. ఆయన రాసిన అనేక తమిళ దేశభక్తి గీతాల్లో వందేమాతరం పట్ల అనురక్తి స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా తమిళనాడు ప్రజలకు ఇది తెలిసే ఉండవచ్చు, కానీ ఇతరులకు అంతగా తెలిసుండకపోవచ్చు. భారతీయ పతాక గీతాన్ని స్వయంగా వి. సుబ్రమణ్య భారతే రాశారు. వందేమాతర గేయానికి ఆధారభూతంగా నిలిచిన పతాకమే.. సుబ్రమణ్య భారతి పతాక గేయ వర్ణనకూ ఆధారంగా ఉంది. తమిళంలో ఈ గీతానికి శీర్షిక ‘థాయిన్ మణికోడి పరీర్, తఝండు పానింతు పుకజంథిద వరీర్!’. అంటే “మాతృభూమి ప్రేమికులారా.. రండి, ఇదిగో, భక్తితో నమస్కరించండి. నా తల్లి దివ్య పతాకాన్ని స్తుతించండి.”

 

అధ్యక్షా,

 

వందేమాతరంపై మహాత్మాగాంధీ భావాలనూ ఈ సభలో ప్రస్తావించదలిచాను. దక్షిణాఫ్రికా నుండి ప్రచురితమయ్యే ‘ఇండియన్ ఒపీనియన్’ అనే వారపత్రిక 1905 డిసెంబరు 2న మహాత్మాగాంధీ రాసిన విషయాలను ప్రచురించింది. దాన్ని నేను ఉటంకిస్తున్నాను. గాంధీ ఇలా రాశారు: “బంకించంద్ర రచించిన వందేమాతర గేయం బెంగాల్ అంతటా విశేష ప్రజాదరణ పొందింది. స్వదేశీ ఉద్యమ సమయంలో బెంగాల్‌లో భారీ సమావేశాలు జరిగాయి. అక్కడ లక్షలాది మంది ఒక్కచోటకు వచ్చి బంకించంద్ర రచించిన గేయాన్ని ఆలపించారు.” గాంధీజీ ఇంకా ఇలా రాశారు.. ఇది చాలా ముఖ్యమైనది. ఆయన 1905లో ఇలా రాశారు: “ఈ గేయం ఎంతలా ప్రజాదరణ పొందిందంటే.. అది మన జాతీయ గీతంలా మారిపోయింది. ఇందులోని భావోద్వేగాలు ఉదాత్తమైనవి. వేరే దేశాల గేయాల కన్నా మధురమైనది ఇది. మనలో దేశభక్తి స్ఫూర్తిని మేల్కొల్పడమే దీని ఏకైక లక్ష్యం. ఇది భారత్‌ను తల్లిగా భావించి, ఆమెను కీర్తిస్తుంది.”

 

అధ్యక్షా,

 

1905లోనే మహాత్మాగాంధీ జాతీయగీతంగా పరిగణించిన వందేమాతరం.. దేశంలో నలుమూలలా, దేశం కోసం జీవించి, దేశభక్తినే శ్వాసించిన ప్రతీ వ్యక్తి జీవితంలో మార్మోగిన ఈ గేయం భారత్‌కోసం జాగరూకులైన ప్రతిఒక్కరికీ అపారమైన శక్తినిచ్చింది. వందేమాతరం చాలా గొప్పది. దాని స్ఫూర్తి ఉన్నతమైనది. అలాంటప్పుడు గత శతాబ్ద కాలంగా దానికి ఇంత దారుణమైన అన్యాయం ఎందుకు జరిగింది? వందేమాతరానికి ఎందుకు ద్రోహం జరిగింది? ఎందుకీ అన్యాయం జరిగింది? పూజ్య బాపూజీ మనోభావాల కన్నా కూడా శక్తిమంతమైన ఆ తలంపులు ఎమై ఉంటాయి? వందేమాతరం వంటి పవిత్ర భావోద్వేగాన్ని వివాదంలోకి లాగిందెవరు? నేడు మనం వందేమాతర 150 వసంతాల వేడుక నిర్వహిస్తున్న తరుణంలో.. ఈ ద్రోహానికి దారితీసిన పరిస్థితుల గురించి కొత్త తరాలకు చెప్పడం మన బాధ్యతగా నేను భావిస్తున్నాను. వందేమాతరాన్ని వ్యతిరేకించే ముస్లిం లీగ్ రాజకీయాలు తీవ్రతరమవుతున్న సమయమది. 1937 అక్టోబరు 15 న ముహమ్మద్ అలీ జిన్నా లక్నో నుండి వందేమాతరానికి వ్యతిరేకంగా గట్టి నినాదాలు చేశారు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్ లాల్ నెహ్రూ తన రాజకీయ పునాదులు కదిలిపోతున్నాయని భావించారు. ముస్లిం లీగ్ నిరాధార ప్రకటనలను గట్టిగా తిప్పికొట్టడానికి బదులు, వాటిని ఖండించడానికి బదులు, వందేమాతరం పట్ల తనకూ కాంగ్రెస్ పార్టీకీ ఉన్న విధేయతను వ్యక్తపరచడానికి బదులు... అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఆయనలా ఎందుకు ప్రవర్తించారో ఎవరికీ తెలియదు.. ఆయననెవరూ అడగలేదు. వందేమాతరాన్ని ఆసాంతం పరిశీలించారు. జిన్నా వ్యతిరేకత వ్యక్తపరిచిన అయిదు రోజుల తర్వాత అక్టోబరు 20న నేతాజీ సుభాష్ బోస్‌కు నెహ్రూ ఒక లేఖ రాశారు. జిన్నా వ్యక్తం చేసిన భావాలే ధ్వనించేలా.. ఆనంద మఠ్ నేపథ్యమున్న ‘వందేమాతరం’ ముస్లింలకు అసౌకర్యాన్ని కలిగించవచ్చని ఆ లేఖలో అంగీకరించారు. నెహ్రూ గారు ఏం రాశారో నేను చదువుతాను. “వందేమాతరం గేయం నేపథ్యాన్ని నేను అధ్యయనం చేశాను” అని ఆయన అన్నారు. “ఈ నేపథ్యం ముస్లింలను రెచ్చగొట్టవచ్చని నేను భావిస్తున్నాను” అని అప్పుడు నెహ్రూ రాశారు.

 

మిత్రులారా,

 

దీని తరువాత.. వందేమాతర గేయాలాపనను సమీక్షించడం కోసం అక్టోబరు 26 నుంచి కలకత్తాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమవుతుందని కాంగ్రెస్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. బంకిం బాబు పుట్టిన బెంగాల్‌నే, ఆయన నడిచిన కలకత్తా నగరాన్నే ఈ సమీక్ష కోసం ఎంచుకున్నారు. దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. ఇందుకు నిరసనగా దేశవ్యాప్తంగా వందేమాతరం ఆలపిస్తూ.. దేశభక్తులు ఉదయం వేళ కవాతులు చేశారు. కానీ దురదృష్టవశాత్తు అక్టోబరు 26న వందేమాతరం విషయంలో కాంగ్రెస్ రాజీపడింది. వందేమాతరాన్ని ముక్కలుగా విడగొట్టాలని వారు నిర్ణయించారు. ‘సామాజిక సామరస్యం’ అన్న ముసుగులో వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ, ముస్లిం లీగ్ ఎదుట కాంగ్రెస్ మోకరిల్లిందని చరిత్ర స్పష్టంగా చెబుతోంది. ముస్లింలీగ్ ఒత్తిడితోనే కాంగ్రెస్ దీనికి అంగీకరించింది. వారి బుజ్జగింపు రాజకీయాలను కొనసాగించేందుకు ఇదొక మార్గంగా చూశారు.

 

అధ్యక్షా,

 

బుజ్జగింపు రాజకీయాల ఒత్తిడితో వందేమాతర విభజన కోసం కాంగ్రెస్ తలవంచింది. అందుకే దేశ విభజన కోసమూ కాంగ్రెస్ తలొగ్గాల్సి వచ్చింది. కాంగ్రెస్ తన నిర్ణయాధికారాన్ని పొరుగు సేవలకు అప్పగించినట్టు కనిపిస్తోంది. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ విధానాలు ఇంకా అలాగే ఉన్నాయి. అంతేకాదు.. ఐఎన్సీ క్రమంగా ఎంఎంసీగా మారింది. నేటికీ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్న వారంతా.. ఇప్పటికీ వందేమాతరంపై వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

 

అధ్యక్షా,

 

అత్యుత్తమ దశలో ఉన్నప్పుడు కాదు.. సవాళ్లూ, సంక్షోభాల సమయంలోనే నిజానికి ఏ దేశ సామర్థ్యమైనా వెల్లడవుతుంది. మనం ఎంత దృఢంగా ఉన్నామో, ఎంత శక్తిమంతులమో, ఎంతటి సమర్థులమో పరీక్షను ఎదుర్కొన్నప్పుడే.. అది మన వాస్తవిక బలానికి పరీక్ష. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు మారాయి. దేశ ప్రాధాన్యాలు మారాయి. కానీ, ఆ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ.. దేశ స్వభావమూ, చైతన్యమూ అలాగే ఉన్నాయి. సంక్షోభాన్ని ఎదుర్కొన్న ప్రతిసారీ.. వందేమాతరం స్ఫూర్తితో భారత్ ముందుకు సాగింది. మధ్యలో కొన్నేళ్లలో ఏమైనా జరిగి ఉండనివ్వండి. కానీ నేటికీ ఆగస్టు 15న, జనవరి 26న లేదా ‘హర్ ఘర్ తిరంగా’ సమయంలో అదే భావోద్వేగం ప్రతిచోటా స్పష్టంగా కనిపిస్తోంది. త్రివర్ణ పతాకాలు సగర్వంగా రెపరెపలాడుతున్నాయి. ఒకప్పుడు దేశం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో.. వందేమాతరం స్ఫూర్తితోనే మన రైతులు విశేషంగా కృషి చేసి మన ధాన్యాగారాలను నిండుకుండలుగా చేశారు. దేశ స్వాతంత్ర్యాన్ని అణచివేసే ప్రయత్నాలు జరిగిన వేళ, రాజ్యాంగంపై దాడి చేసిన వేళ, ఎమర్జెన్సీ విధించిన వేళ... వందేమాతరం ఇచ్చిన శక్తివల్లే దేశం ఉవ్వెత్తున లేచి, ఆ కుయుక్తులను తిప్పికొట్టింది. దేశంపై యుద్ధాలు జరిగిన ప్రతిసారీ, మనం సంఘర్షణలో చిక్కుకున్న ప్రతిసారీ... వందేమాతర స్ఫూర్తే మన సైనికులు సరిహద్దుల్లో దృఢంగా నిలిచేలా చేసింది. ఆ స్ఫూర్తే భరతమాత జయధ్వజం రెపరెపలాడేలా చేసింది. కరోనా వంటి అంతర్జాతీయ సంక్షోభం తలెత్తినప్పుడు కూడా దేశం అదే స్ఫూర్తితో కలిసి నిలబడింది. దానిని అధిగమించి ముందుకు సాగింది.

 

అధ్యక్షా,

 

ఇది దేశ బలం. గాఢమైన భావోద్వేగంతో దేశమంతటినీ ఏకం చేసే ఉత్తేజకరమైన శక్తి ప్రవాహం. అవిచ్ఛిన్నమైన మన సాంస్కృతిక వాహినిని ప్రతిబింబిస్తూ.. నిరంతరం దాన్ని చాటే చేతనా స్రవంతి ఇది. వందేమాతరం మనమేదో కేవలం గుర్తుంచుకోవాల్సిన అంశం మాత్రమే కాదు.. కొత్త శక్తినీ, కొత్త స్ఫూర్తినీ పొందేలా మనం పునరంకితం కావాలి. ఇంతకుముందే నేను చెప్పినట్టుగా.. వందేమాతరానికి మనం రుణపడి ఉన్నాం. ఈ రోజు మనమున్న స్థితికి చేరుకునేందుకు బాటలు వేసింది వందేమాతరమే. అందుకే మనం దానికి రుణపడి ఉన్నాం. ప్రతి సవాలునూ అధిగమించే శక్తి భారత్‌కు ఉంది. వందేమాతరమే దీనికి స్ఫూర్తి. వందేమాతరం కేవలం ఓ గేయమో, స్ఫూర్తిదాయకమైన శ్లోకమో మాత్రమే కాదు.. దేశం పట్ల విధ్యుక్తులమయ్యేలా మనల్ని జాగరూకులను చేసే చోదక శక్తి. అందుకే మనం దీన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాలి. ‘ఆత్మనిర్భర భారత్’ సంకల్పంతో మనం ముందుకు సాగుతున్నాం. దానిని మనం నెరవేర్చుకోవాలి. వందేమాతరమే మనకు స్ఫూర్తి. మనం స్వదేశీ ఉద్యమాన్ని బలోపేతం చేయదలిచాం. కాలం మారి ఉండొచ్చు, రూపాలు మారి ఉండొచ్చు.. కానీ పూజ్య బాపూజీ వ్యక్తపరిచిన స్ఫూర్తి నేటికీ సజీవంగా ఉంది. వందేమాతరం మనల్నింకా ఏకం చేస్తూనే ఉంది. మహనీయులైన మన నాయకుల స్వప్నం ‘స్వతంత్ర భారత్’ కాగా... నేటి నవ తరం ‘సంపన్న భారత్‌’ను సాకారం చేయాలని స్వప్నిస్తోంది. వందే భారత్ స్ఫూర్తి స్వతంత్ర భారత స్వప్నాన్ని సాకారం చేసింది.. వందేమాతర స్ఫూర్తి సంపన్న భారత్ కలను సాకారం చేసి తీరుతుంది. ఈ భావోద్వేగాలతోనే మనం ముందుకు సాగాలి. ‘ఆత్మనిర్భర్ భారత్’ను సాకారం చేసుకోవాలి. 2047 నాటికి దేశం ‘వికసిత భారత్’గా నిలచి తీరాలి. స్వాతంత్ర్యానికి 50 ఏళ్లకు ముందుగానే వారు స్వతంత్ర భారతాన్ని స్వప్నించారు కదా.. అలాగే మనమూ 2047కు 25 ఏళ్ల ముందే సంపన్న, ‘వికసిత భారత్’ను స్వప్నిద్దాం. ఈ కలను సాకారం చేసుకోవడానికి పునరంకితమవుదాం. ఇదే మంత్రప్రదంగా, ఇదే సంకల్పంతో.. వందేమాతరం మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. వందేమాతరానికి రుణపడి ఉన్నామని గుర్తిద్దాం. దాని స్ఫూర్తిని ముందుకు తీసుకెళదాం. దేశ ప్రజలనూ ఇందులో భాగం చేద్దాం. కలిసి నడుద్దాం... కలను సాకారం చేసుకుందాం. ఈ భావనతోనే నేడు ఈ చర్చ ప్రారంభమవుతోంది. ఇది దేశంలో స్ఫూర్తిని రగిలిస్తుందని, పార్లమెంటు ఉభయ సభల్లోనూ మన నవ తరాన్ని శక్తిమంతం చేస్తుందని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. ఈ మాటలతో.. నాకు ఈ అవకాశాన్నిచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. ధన్యవాదాలు!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Gyan Bharatam Portal Houses Over 88,800 Manuscripts, Government Informs Lok Sabha

Media Coverage

Gyan Bharatam Portal Houses Over 88,800 Manuscripts, Government Informs Lok Sabha
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister expresses delight as Sarnath is inscribed on the UNESCO World Heritage List
July 25, 2026

Prime Minister Shri Narendra Modi today expressed that it is a proud moment for every Indian, sharing his delight that Sarnath in Uttar Pradesh has been inscribed on the UNESCO World Heritage List.

He noted that Sarnath has a close association with Lord Buddha, whose timeless message of wisdom, compassion and harmony inspires the world.

Shri Modi highlighted that this recognition celebrates India’s profound civilisational and spiritual heritage. The Prime Minister observed that it will also inspire more people across the world to come to Sarnath and connect with the ideals of Lord Buddha.

In a post on X, the Prime Minister shared:

 "A proud moment for every Indian!

Delighted that Sarnath in Uttar Pradesh has been inscribed on the UNESCO World Heritage List.

Sarnath has a close association with Lord Buddha, whose timeless message of wisdom, compassion and harmony inspires the world.

This recognition celebrates India’s profound civilisational and spiritual heritage. It will also inspire more people across the world to come to Sarnath and connect with the ideals of Lord Buddha.

@UNESCO"