సర్వతోముఖాభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధానమంత్రి
నేడు అజ్మీర్ నుంచి దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా ప్రచారాన్ని ప్రారంభించడంతోపాటు.. అనేక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, యువతకు నియామక లేఖలు పంపిణీ చేసే అదృష్టం నాకు లభించింది: ప్రధానమంత్రి
హెచ్‌పీవీ టీకా ప్రచారం అజ్మీర్ నుంచి ప్రారంభమైంది. ఇది దేశంలోని మహిళా శక్తిని శక్తిమంతం చేసే దిశగా ఒక కీలక అడుగు: ప్రధానమంత్రి
రాజస్థాన్ వారసత్వం, అభివృద్ధి రెండింటినీ మేళవించి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది: ప్రధానమంత్రి
మా ప్రభుత్వం ప్రారంభించిన నదుల అనుసంధాన ఉద్యమం రాజస్థాన్‌కు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుంది: ప్రధానమంత్రి
రాజస్థాన్‌లో సూర్యరశ్మికి కొరత లేదు, ఈ ఎండ సామాన్యులకు పొదుపు, ఆదాయ వనరుగా మారుతోంది: ప్రధానమంత్రి
రాజస్థాన్ తలరాతను మార్చే శక్తి పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకానికి ఉంది. ఇది రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది: ప్రధానమంత్రి

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

తీర్థరాజ్ పుష్కర్, సావిత్రీ అమ్మవారికి నిలయమైన ఈ పవిత్ర క్షేత్రంలో ఈ రోజు మీ మధ్యన నిలిచి ఆశీస్సులు పొందే అవకాశం నాకు లభించింది. సుర్‌సురాలోని తేజాజీధామ్‌కూ, పృథ్వీరాజ్ చౌహాన్ పుణ్యభూమి అయిన అజ్మీర్‌కూ ఈ వేదిక నుంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

నాతో కలిసి పలకండి –

తీర్థరాజ్ పుష్కర్ కీ జై

తీర్థరాజ్ పుష్కర్ కీ జై

వీర తేజాజీ మహారాజ్ కీ జై

వీర తేజాజీ మహారాజ్ కీ జై

ప్రభు దేవ నారాయణ కీ జై

ప్రభు దేవ నారాయణ కీ జై

వరుణావతార ప్రభు జులేలాల్ జీ కీ జై

ప్రభు జులేలాల్ జీ కీ జై

వేదికపై ఉన్న గౌరవ రాజస్థాన్ గవర్నర్ శ్రీ హరిభావూ బాగ్డే గారు, ప్రజాదరణ చూరగొన్న ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ గారు, మాజీ ముఖ్యమంత్రి సోదరి వసుంధర గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు శ్రీ భాగీరథ్ చౌదరి గారు, ఉప ముఖ్యమంత్రులు శ్రీ ప్రేమ్‌చంద్ బైర్వా గారు, శ్రీమతి దియా కుమారి గారు, నా పార్లమెంటు సహచరుడు - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మదన్ రాథోడ్ గారు, గౌరవ మంత్రులు, విశిష్ట అతిథులు, ప్రియమైన రాజస్థాన్ సోదరీ సోదరులారా...! ఈ సందర్భంగా మనల్ని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసిన పూజ్యులైన సాధుసంతులకు వినమ్రపూర్వక కృతజ్ఞతలు.

మిత్రులారా,

ఆధ్యాత్మికతకూ, శౌర్యానికీ అజ్మీర్ నిలయం. పవిత్ర పుణ్యక్షేత్రాలతోపాటు విప్లవకారుల జాడలు కూడా ఇక్కడ ఉన్నాయి. నిన్ననే నేను ఇజ్రాయెల్ పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగొచ్చాను. రాజస్థాన్ ముద్దుబిడ్డ మేజర్ దళపత్ సింగ్ పరాక్రమాన్ని ఇజ్రాయెల్ ప్రజలు నేటికీ గర్వంగా స్మరించుకుంటారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో వీరుడు మేజర్ దళపత్ సింగ్‌కు నివాళి అర్పించే భాగ్యం కూడా నాకు కలిగింది. ఇజ్రాయెల్‌లోని హైఫా నగర విముక్తిలో కీలక పాత్ర పోషించిన రాజస్థాన్ వీరయోధుల శౌర్యాన్ని అక్కడ స్మరించుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.

 

మిత్రులారా,

కొద్ది సేపటి కిందటే రాజస్థాన్‌లోని బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది. నేడు రాజస్థాన్ సరికొత్త అభివృద్ధిపథంలో దూసుకుపోతుండడం ఎంతో సంతోషాన్నిస్తోంది. ఏ ప్రగతి వాగ్దానాలతో మీకు సేవలందించేందుకు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో.. వాటిని అత్యంత వేగంగా నెరవేరుస్తోంది. ఈ అభివృద్ధి పరంపరను మరింత వేగవంతం చేసే రోజు ఈ రోజు. కొద్దిసేపటి కిందటే రాజస్థాన్ అభివృద్ధికి సంబంధించి దాదాపు 17 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు జరిగాయి. రోడ్లు, విద్యుత్, నీరు, ఆరోగ్యం, విద్య వంటి ప్రతి రంగంలోనూ నూతన ఉత్తేజం నెలకొంటోంది. ఈ ప్రాజెక్టులన్నీ రాజస్థాన్ ప్రజల సౌకర్యాలను మెరుగుపరచడమే కాకుండా.. ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలను కూడా అందిస్తాయి.

మిత్రులారా,

బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం యువతను నిరంతరం సాధికారత దిశగా నడిపిస్తోంది. రెండేళ్ల కిందట రాజస్థాన్ అంటే కేవలం నియామకాల్లో అవినీతి, పేపర్ లీకేజీలతోనే వార్తల్లో ఉండేది. నేడు ఆ పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట పడింది. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ రోజు ఇదే వేదిక నుంచి రాజస్థాన్‌కు చెందిన 21 వేల మందికి పైగా యువతకు నియామక పత్రాలను అందించాం. ఇదొక విశేషమైన మార్పు. ఈ మార్పు సందర్భంగా, ఈ కొత్త ఉద్యోగాలను పొందిన సందర్భంగా, అభివృద్ధి పనుల సందర్భంగా.. రాజస్థాన్ వాసులందరికీ హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా,

వీరనారులకు నిలయమైన ఈ నేల నుంచి దేశంలోని ఆడబిడ్డల కోసం ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం నాకు నేడు లభించింది. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం అజ్మీర్ నుంచే మొదలైంది. దేశంలోని మహిళా శక్తిని సాధికారత దిశగా నడిపించడంలో ఇదొక కీలక ముందడుగు.

మిత్రులారా,

ఒక తల్లి అనారోగ్యం పాలైతే ఆ ఇల్లంతా ఎంత అల్లకల్లోలమవుతుందో మనందరికీ తెలుసు. అదే తల్లి ఆరోగ్యంగా ఉంటే, ఆ కుటుంబం ఎలాంటి సంక్షోభాన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలదు. ఈ భావనతోనే మహిళలను సశక్తులను చేయడం లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించింది.

మిత్రులారా,

2014కు ముందున్న కాలాన్ని మనం చూశాం. టాయిలెట్లు లేకపోవడం వల్ల మన అక్కాచెల్లెళ్లూ,  ఆడబిడ్డలూ ఎంతో బాధను, అవమానాన్ని అనుభవించారు. పాఠశాలల్లో ప్రత్యేకంగా టాయిలెట్ల సదుపాయం లేక ఆడపిల్లలు చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చేది. పేద ఆడబిడ్డలు శానిటరీ ప్యాడ్లు కొనుక్కోలేని స్థితిలో ఉండేవారు. గతంలో అధికారంలో ఉన్నవారికి ఇవి చాలా చిన్న విషయాలుగా,  కనీసం చర్చించడానికి కూడా పనికిరానివిగా అనిపించేవి. కానీ మేం మాత్రం వీటిని మన అక్కాచెల్లెళ్లూ, ఆడబిడ్డల ఆరోగ్యానికీ, గౌరవానికీ సంబంధించిన సున్నితమైన అంశాలుగా భావించాం. అందుకే మేం యుద్ధ ప్రాతిపదికన వాటిని పరిష్కరించాం.

 

మిత్రులారా,

గర్భధారణ సమయంలో పోషకాహార లోపం తల్లులకు ప్రాణాపాయ ముప్పుగా ఉండేది. మాతృత్వాన్ని సురక్షితమైన చేయడం లక్ష్యంగా పలు పథకాలను మేం ప్రారంభించాం. తల్లులకు పౌష్టికాహారం అందేలా చూస్తూ, వారి ఖాతాల్లో నేరుగా రూ. 5,000 జమ చేస్తున్నాం. గతంలో తల్లులు పొగలో దగ్గుతూ వంట చేసేవారు. కానీ వారెప్పుడూ ఫిర్యాదు చేసేవారు కాదు. ఇదిలాగే కొనసాగడానికి వీల్లేదని మేము నిశ్చయించుకున్నాం. అందుకే ఉజ్వల గ్యాస్ పథకాన్ని ప్రారంభించాం. బీజేపీ ప్రభుత్వం అధికార గర్వంతో కాదు.. సునిశితంగా ఆలోచిస్తూ బాధ్యతతో పనిచేయడం వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి.

మిత్రులారా,

21వ శతాబ్దంలో నాలుగో వంతు ఇప్పటికే గడిచిపోయింది. రాజస్థాన్ అభివృద్ధికి ఇది కీలక సమయం. రాజస్థాన్ వారసత్వమూ, పురోగతీ రెండింటినీ బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు ముందుకు తీసుకెళ్తోంది.  మంచి రోడ్లు, రైల్వేలు, విమానయాన సౌకర్యాలు కేవలం ప్రయాణాన్ని సులభతరం చేయడం మాత్రమే కాదు.. మొత్తం ప్రాంత తలరాతనే మార్చేస్తాయని మనందరికీ తెలుసు. ప్రతి ఊరికీ రోడ్లుంటే రైతులు తమ పంటలను సరైన ధరలకు అమ్ముకోగలుగుతారు. వ్యాపారులు తమ వస్తువులను సులభంగా బయటి ప్రాంతాలకు పంపగలరు. ఇక అజ్మీర్ - పుష్కర్ ప్రాంత పర్యాటక శక్తి గురించి తెలియనిదెవరికి? మెరుగైన రవాణా సౌకర్యాల ప్రభావం పర్యాటక రంగంపైనే అత్యధికంగా ఉంటుంది. ప్రయాణం సులభతరమైతే సందర్శకుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది.

మిత్రులారా,

పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తే సహజంగానే హోటళ్లు కళకళలాడుతాయి. రోడ్డు పక్కన ఉండే తినుబండారాల దుకాణాలకు గిరాకీ పెరుగుతుంది. కచోరీలు, దాల్ బాటీ విక్రయాలు పెరుగుతాయి. రాజస్థాన్ హస్తకళాకారుల ఉత్పత్తులను కొనేవారు పెరుగుతారు. టాక్సీలు తిరుగుతాయి. గైడ్‌లకు పని దొరుకుతుంది. అంటే, ఒక్క పర్యాటకుడు ఎన్నో కుటుంబాలకు జీవనాధారమవుతాడు. ఈ ఆలోచనతోనే రాజస్థాన్‌లో ఆధునిక రవాణా సదుపాయాలపై మా ప్రభుత్వం గట్టిగా దృష్టి పెట్టింది.  

మిత్రులారా,

రాజస్థాన్‌లో అనుసంధానం విస్తరిస్తున్న కొద్దీ పెట్టుబడులకు అవకాశాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ చుట్టూ పరిశ్రమల కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే రాజస్థాన్‌ను అవకాశాల గనిగా మార్చడానికి మన డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అనేక విధాలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.

మిత్రులారా,

రాజస్థాన్ తల్లులు తమ పిల్లలను పెంచేటప్పుడే వారిలో దేశభక్తి విలువలను నింపుతారు. ఈ రాజస్థాన్ గడ్డకు దేశం పట్ల గౌరవం అంటే ఏంటో బాగా తెలుసు. అందుకే ఈరోజు ఈ రాజస్థాన్ నేల మీద మీతో మరో ఆలోచనను పంచుకోవడానికి వచ్చాను.

 

మిత్రులారా,

ఇటీవల ఢిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సదస్సు జరిగింది.  అనేక దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షులు, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల అధినేతలు కూడా ఒకే చోట చేరారు.  వారంతా బహిరంగంగా భారత్‌ను ప్రశంసించారు. నేను నా రాజస్థాన్ సోదర సోదరీలను అడగాలనుకుంటున్నాను.. ప్రపంచం నలుమూలల నుంచి ఇంతమంది భారత్‌ను ప్రశంసిస్తుంటే మీకు గర్వంగా అనిపించడం లేదా?  మీకు గౌరవంగా అనిపించడం లేదా? మీ తల గర్వంతో పైకి లేవడం లేదా? మీ ఛాతి గర్వంతో ఉప్పొంగడం లేదా?

మిత్రులారా,

మీరు గర్వంగా భావించారు. కానీ వరుస ఓటములతో నిరాశ, నిస్పృహలలో కూరుకుపోయిన కాంగ్రెస్ ఏం చేసిందో కూడా మీరు చూశారు.  ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అతిథుల ముందు కాంగ్రెస్ దేశాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నించింది. వి దేశీ ప్రతినిధుల ముందు దేశాన్ని అవమానించడానికి వారు ఒక పెద్ద నాటకమే ఆడారు.

మిత్రులారా,

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓడిపోతోంది. ఆ కోపంతో భారత్‌ ప్రతిష్టను దెబ్బతీస్తూ వారు కక్ష తీర్చుకుంటున్నారు.  ఒకప్పుడు కాంగ్రెస్ అంటే ఐఎన్‌సీ—ఇండియన్ నేషనల్ కాంగ్రెస్.  కానీ ఈరోజు అది ఇకపై ఐఎన్‌సీ కాదు ఎంఎంసీగా మారింది. ఎంఎంసీ అంటే ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్.

ధైర్యవంతులైన నా రాజస్థాన్ ప్రజలారా,

ముస్లిం లీగ్ భారత్‌ను ద్వేషించిందని, అది దేశాన్ని విభజించిందని చరిత్ర సాక్ష్యంగా ఉంది.  ఈరోజు కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది.  మావోయిస్టులు కూడా దేశ అభివృద్ధిని,  మన రాజ్యాంగాన్ని, మన విజయవంతమైన ప్రజాస్వామ్యాన్ని ద్వేషిస్తున్నారు.  వారు మాటువేసి దాడి చేస్తారు.  కాంగ్రెస్ కూడా దేశాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఎక్కడైనా దొంగచాటుగా ప్రవేశిస్తుంది.  కాంగ్రెస్ చేస్తున్న ఇటువంటి దుశ్చర్యలను దేశం ఎన్నటికీ క్షమించదు.

 

మిత్రులారా,

దేశాన్ని కించపరచడం, మన సాయుధ దళాలను బలహీనపరచడం కాంగ్రెస్‌కు పాత అలవాటు.  గుర్తుంచుకోండి.. మన సైనికులను కనీసం ఆయుధాలు, యూనిఫాంల కోసం కూడా అలమటించేలా చేసిన కాంగ్రెస్ ఇదే.  సైనిక కుటుంబాలకు దశాబ్దాల తరబడి వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకాన్ని దక్కకుండా చేసిన కాంగ్రెస్ ఇదే.  విదేశాలతో జరిగిన రక్షణ ఒప్పందాలలో భారీ కుంభకోణాలకు పాల్పడిన కాంగ్రెస్ కూడా ఇదే.

మిత్రులారా,

గత 11 ఏళ్లలో భారత సైన్యం ప్రతి రంగంలోనూ ఉగ్రవాదులు, శత్రువులపై గట్టి దెబ్బ కొట్టింది. మన సైన్యం ప్రతి మిషన్‌లోనూ,  ప్రతి యుద్ధంలోనూ విజయం సాధించింది.  సర్జికల్ స్ట్రైక్స్ నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు మన సైనికులు తమ పరాక్రమాన్ని నిరూపించుకున్నారు.  అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు మన శత్రువుల అబద్ధాలనే ఎక్కువగా ప్రచారం చేశారు.  దేశానికి ఏది మంచిదో,  ప్రజలకు ఏది ప్రయోజనకరమో వాటన్నింటినీ కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది.  అందుకే ఈరోజు దేశం కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతోంది.

మిత్రులారా,

రాజస్థాన్‌లో కాంగ్రెస్ దుష్పరిపాలనను మీరు దగ్గరుండి చూశారు.  ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కేవలం అవినీతి, అంతర్గత కలహాలలోనే మునిగిపోయింది.  కాంగ్రెస్ ఎల్లప్పుడూ మన రైతులను వంచించింది.  సాగునీటి ప్రాజెక్టులను దశాబ్దాల తరబడి ఎలా నిలిపివేసిందో గుర్తుంచుకోండి. దీనివల్ల రాజస్థాన్ రైతులకు అపారమైన నష్టం జరిగింది.  ఈఆర్‌సీపీ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కేవలం ఫైళ్లకు, ప్రకటనలకే పరిమితమైపోయింది.  మన ప్రభుత్వం రాగానే ఈ పథకాన్ని ఫైళ్ల నుంచి బయటకు తీసి క్షేత్రస్థాయిలోకి తీసుకురావడానికి కృషి చేసింది.

మిత్రులారా,

మన ప్రభుత్వం చేపట్టిన నదుల అనుసంధాన ప్రక్రియ వల్ల రాజస్థాన్‌కు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.  సవరించిన పార్వతి-కాళిసింధ్-చంబల్ లింక్ ప్రాజెక్టు అయినా లేదా యమునా-రాజస్థాన్ లింక్ ప్రాజెక్టు అయినా..సాగునీటి ప్రాజెక్టుల ప్రయోజనాలను రైతులకు అందించడానికి ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. నేడు కూడా ఝలావర్, బరాన్, కోట, బండి జిల్లాల కోసం అనేక నీటి ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. రాజస్థాన్‌లో భూగర్భ జలాల మట్టాన్ని పెంచడం కూడా మా ప్రధాన లక్ష్యం.

 

మిత్రులారా,

బీజేపీ ప్రభుత్వం రాజస్థాన్ సామర్థ్యాన్ని అర్థం చేసుకుని పథకాలను రూపొందించి అమలు చేస్తోంది. రాజస్థాన్ ఇప్పుడు సూర్యశక్తి ద్వారా సంపదను ఆర్జించే ప్రాంతంగా మారడం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. రాష్ట్రంలో సూర్యరశ్మికి కొదవ లేదని మనందరికీ తెలుసు.  ఇప్పుడు ఈ సూర్యరశ్మి సామాన్య గృహాలకు పొదుపు, ఆదాయ వనరుగా మారుతోంది. ఇందులో ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. రాజస్థాన్ తలరాతను మార్చే శక్తి ఈ పథకానికి ఉంది. ఈ పథకం కింద ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలను ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రభుత్వం రూ. 78,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ప్రభుత్వం నేరుగా మీ బ్యాంకు ఖాతాకే ఈ డబ్బును బదిలీ చేస్తుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అన్ని బడ్జెట్లు, పథకాలను ఒకసారి చూడండి. మధ్యతరగతి ప్రజలకు ఇంతగా ప్రయోజనం చేకూర్చే పథకం మీకు ఎక్కడా కనిపించదు. ఈరోజు సౌర ఫలకాలను అమర్చుకోవడానికి ప్రభుత్వం నుంచి నేరుగా రూ. 78,000 పొందుతున్నారు. దీనివల్ల మధ్యతరగతి వారే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. ఇది ఇంట్లోనే ఒక చిన్న విద్యుత్ కేంద్రాన్ని సృష్టించినట్లు అవుతుంది. పగటిపూట సూర్యరశ్మి నుంచి విద్యుత్ తయారవుతుంది. దానిని ఇంట్లో వాడుకోగా మిగిలిన విద్యుత్ గ్రిడ్‌కు వెళ్తుంది. విద్యుత్తును ఉత్పత్తి చేసే కుటుంబానికి దీనివల్ల లాభం చేకూరుతుంది.

 

మిత్రులారా,

నేడు రాజస్థాన్‌లో 1,25,000 కంటే ఎక్కువ కుటుంబాలు ఈ పథకంలో చేరాయి. ఈ పథకం కారణంగా చాలా ఇళ్లలో విద్యుత్ బిల్లులు దాదాపు సున్నాకి పడిపోతున్నాయి. అంటే ఖర్చులు తగ్గి, పొదుపు పెరిగింది.

మిత్రులారా,

మేం నిరంతరం వికసిత రాజస్థాన్ ద్వారా వికసిత భారత్ అనే మంత్రంతో పనిచేస్తున్నాం. ఈరోజు ప్రారంభమైన ప్రాజెక్టులు వికసిత్‌ రాజస్థాన్ పునాదిని మరింత బలోపేతం చేస్తాయి. రాజస్థాన్ అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడి ప్రతి కుటుంబం సంపన్న జీవితాన్ని గడుపుతుంది. ఈ అభివృద్ధి ప్రాజెక్టుల సందర్భంగా మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నాతో కలిసి చెప్పండి.

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

దేశం వందేమాతరం 150 ఏళ్ల వేడుకలను జరుపుకుంటోంది. నాతో కలిసి చెప్పండి.

వందేమాతరం.

వందేమాతరం.

వందేమాతరం.

వందేమాతరం.

వందేమాతరం.

వందేమాతరం.

వందేమాతరం.

వందేమాతరం.

వందేమాతరం.

వందేమాతరం.

చాలా ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Join sports, playgrounds more important than PlayStation: PM to youth

Media Coverage

Join sports, playgrounds more important than PlayStation: PM to youth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tributes to Sree Narayana Guru on his birth anniversary
August 28, 2026

The Prime Minister, Shri Narendra Modi, paid tributes to Sree Narayana Guru on his birth anniversary, today. Shri Modi described Sree Narayana Guru as a towering social reformer, spiritual leader and thinker who devoted his life to building a society rooted in dignity and compassion.

The Prime Minister posted on X:

Tributes to Sree Narayana Guru on his birth anniversary!

A towering social reformer, spiritual leader and thinker, he devoted his life to building a society rooted in dignity and compassion. His thoughts gave strength to countless people. Equally noteworthy was his focus on education and learning.