ఉత్తరప్రదేశ్‌లో హెచ్‌సిఎల్ -ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ తయారీ కేంద్రం ఏర్పాటు సాంకేతిక స్వయం-సమృద్ధి దిశగా కీలక ముందడుగు
ప్రపంచ చిప్ తయారీ వ్యవస్థలో పెరగనున్న భారత్ ఉనికి
సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రెండు రంగాల్లోనూ ఏకకాలంలో భారత్ అభివృద్ధి
దేశ సెమీకండక్టర్ వ్యవస్థకు ప్రధాన కేంద్రంగా మారుతున్న ఉత్తరప్రదేశ్
హెచ్‌సిఎల్-ఫాక్స్‌కాన్‌ల నూతన కర్మాగారంతో సాంకేతికకు ప్రధాన కేంద్రంగా బలోపేతం కానున్న యూపీ గుర్తింపు
ఈ డెకేడ్(దశాబ్దం) భారత్ కోసం ఒక టెకేడ్
భారత్ సాధించిన నేటి సాంకేతిక పురోగతి 21వ శతాబ్దంలో మన బలానికి పునాది

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, క్యాబినెట్లో నా సహ మంత్రులు అశ్వనీ వైష్ణవ్ గారు, జితిన్ ప్రసాద గారు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలోని మంత్రులందరికీ, ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ బిజినెస్ గ్రూపు అధ్యక్షుడు బాబ్ చెన్ గారు, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్ రోష్నీ నాడార్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు, సోదరీ సోదరులారా!

అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యంతో భారత్ అత్యంత వేగంగా పని చేస్తోంది. ఆగేందుకు లేదా విశ్రమించేందుకు భారతదేశానికి సమయం లేదని నేను ఎర్రకోట నుంచి చెప్పాను. 2026 ప్రారంభం నుంచి భారత్ తన వేగాన్ని మరింత పెంచింది. జనవరి 12న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌లో లక్షలాది దేశ యువత పాల్గొన్నారు. దేశంలో అంకుర సంస్థల విప్లవానికి నూతన ఉత్సాహాన్ని జోడిస్తూ జనవరి 16న మనం జాతీయ అంకుర సంస్థల దినోత్సవం నిర్వహించుకున్నాం. ఇదే జనవరిలో నిర్వహించిన ఇండియా ఎనర్జీ సదస్సు ద్వారా తన సామర్థ్యంతో ప్రపంచం దృష్టిని భారత్ ఆకర్షించింది. ఆ తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత్ భారత్‌కు కొత్త వేగాన్ని అందించింది. ఈ వారం కూడా భారత్‌కు చరిత్రాత్మకమైనదే. ప్రపంచంలో అనేక దేశాల అధినేతలు, సాంకేతిక ప్రపంచంలో దిగ్గజాలు అందరూ ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొన్నారు. భారతదేశ ఏఐ సామర్థ్యాన్ని ఈ సదస్సు ద్వారా ప్రపంచం చూసింది. మన దార్శనికతను అర్థం చేసుకొని, ప్రశంసించింది.

 

స్నేహితులారా,

ఈ సదస్సు నిన్నే ముగిసింది. వెనువెంటనే భారతీయ సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన ప్రధాన కార్యక్రమంలో పాల్గొంటున్నాం.

స్నేహితులారా,

ఆధునిక ప్రపంచాన్ని నడపడానికి అవసరమైన ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని సమీకరించుకునే ప్రయత్నంలో అగ్రదేశాల సరసన చేరేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అంటే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రెండు అంశాల్లోనూ ఏకకాలంలో భారత్ పనిచేస్తుంది. దేశ సెమీకండక్టర్ రంగానికి ప్రధాన కేంద్రంగా ఉత్తరప్రదేశ్ మారుతూ ఉండటం మనందరికీ గర్వకారణం. సాంకేతిక శక్తి కేంద్రంగా యూపీ నూతన గుర్తింపును హెచ్‌సీఎల్, ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీ మరింత బలోపేతం చేస్తుంది. ఉత్తరప్రదేశ్ పార్లమెంట్ సభ్యునిగా ఇది నాకు కూడా గర్వకారణమే. ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌‌తో పాటు మొత్తం భారతీయ యువతకు ఈ సెమీకండక్టర్ కర్మాగారం ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయి. ఎందుకంటే సెమీకండక్టర్ యూనిట్ ఎక్కడ మొదలవుతుందో.. అక్కడికి డిజైన్ సంస్థలు, పరిశోధనాభివృద్ధి కేంద్రాలు వస్తాయి. అంకుర సంస్థల వ్యవస్థ ఏర్పడుతుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ఇదంతా జరుగుతుంది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్‌ గారికి, ఆయన బృందానికి, యూపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

స్నేహితులారా,

నేను తరచూ ఓ విషయం చెబుతూ ఉంటాను. ఈ దశాబ్దం భారతదేశపు టెకేడ్. సాంకేతిక రంగంలో ఈ దశాబ్దంలో చేపడుతున్న కార్యక్రమాలు ఇరవై ఒకటో శతాబ్దంలో మన సామర్థ్యానికి పునాదిగా మారతాయి. అది హరిత విద్యుత్తు, అంతరిక్ష సాకేంతికత, డిజిటల్ టెక్నాలజీ, తయారీ రంగమైనా లేదా కృత్రిమ మేధ అయినా.. మానవాళి భవిష్యత్తును నిర్దేశించే ప్రతి టెక్నాలజీలోనూ అపూర్వమైన పెట్టుబడులు భారత్‌కు ఇప్పుడు వస్తున్నాయి. బలమైన సెమీకండక్టర్ వ్యవస్థ అభివృద్ధే దీనికి ఉదాహరణ. సెమీకండక్టర్ రంగంలో భారత్ ఆలస్యంగా తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ, మేం చాలా వేగంగా ముందుకు వెళుతున్నాం. ఇప్పటివరకు 10 సెమీకండక్టర్ తయారీ, ప్యాకేజింగ్ ప్రాజెక్టులకు సెమీకండక్టర్ మిషన్ ద్వారా భారత్ ఆమోదం తెలిపింది. వీటిలో నాలుగు యూనిట్లలో అతి త్వరలో ఉత్పత్తి ప్రారంభం కాబోతోంది.

స్నేహితులారా,

ఇరవయ్యో శతాబ్దంలో చమురు ఉన్న దేశం సంపద, శక్తి రెండింటినీ సాధించిందని మీ అందరికీ తెలుసు. ఇరవై ఒకటో శతాబ్దంలో అదే శక్తి ఓ చిన్న చిప్, దానికి సంబంధించిన నైపుణ్యం, ముడిసరకు చేతిలో ఉంటుంది. చిప్ సరఫరా వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో కరోనా మహమ్మారి సమయంలో మనం చూశాం. చిప్ సరఫరాకు ఒక బ్రేక్ పడగానే, ప్రపంచంలో పరిశ్రమలు ఆగిపోయాయి. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ఆ సంక్షోభం నుంచి భారత్ కూడా పాఠం నేర్చుకొని, దానిని అవకాశంగా మార్చుకొనే ప్రయత్నం ప్రారంభించింది. చిప్ తయారీలో భారత్ స్వావలంబన సాధించాలని మేం భావించాం. దీనికి భారత్‌లోనే సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించాల్సి ఉంటుంది. ఈ దృక్పథాన్ని ఈ రోజు చేపడుతున్న కార్యక్రమం ప్రతిబింబింస్తుంది.

స్నేహితులారా,

భారత్ స్వావలంబన సాధించినప్పుడే వికసిత్ భారత్ కల సాకారమవుతుంది. దీనికోసం, భారత్‌లోనే చిప్ తయారు చేయడం చాలా ముఖ్యం. మేడిన్ ఇండియా చిప్‌ను తయారు చేసినప్పుడు మన అధునాతన సామగ్రిని తయారు చేయడానికి ఇతరుల వైపు చూడాల్సిన అవసరం రాదు. డిజిటల్ ఇండియా, ఏఐ, 5జీ-6జీ, విద్యుత్ వాహనాలు, రక్షణ ఇలా ఏ రంగంలోనైనా ప్రతి వస్తువుకు సెమీకండక్టర్, చిప్ ఆత్మ లాంటిది. మనకు అవసరమైన చిప్‌ మనమే తయారు చేసుకున్నప్పుడు ప్రతి రంగంలోనూ ఎలాంటి అవరోధాలు లేకుండా భారత్ వేగంగా ముందుకెళుతుంది.

స్నేహితులారా,

ఫాక్స్‌కాన్ లాంటి దిగ్గజ సంస్థలు ఇప్పుడు భారత్‌కు వస్తున్నాయి. చిప్ తయారీలో సహకరిస్తున్నాయి. అలాగే అంతర్జాతీయ సందేశాన్ని మోసుకొస్తున్నాయి. ఈ ప్రపంచానికి భారత్‌లాంటి ప్రజాస్వామ్య దేశమే విశ్వసనీయమైన భాగస్వామి. ఏదైనా విలువ ఆధారిత వ్యవస్థలో భారత్ భాగస్వామ్యం పెరిగితే..ఆ వ్యవస్థ మొత్తం బలోపేతమవుతుంది. ప్రపంచ కర్మాగారంగా భారత్ గుర్తింపు.. దేశానికి, ప్రపంచానికి కూడా విజయాన్ని అందిస్తుంది.

 

స్నేహితులారా,

టెక్ భవిష్యత్తుకు కేంద్రంగా భారత్‌ను ఈ ప్రపంచం చూస్తోంది. దీనికి ప్రధాన కారణం భారతదేశంలో ఉన్న ప్రతిభే. చిప్ డిజైనింగ్‌లో టాలెంట్ పూల్‌ను విస్తరించడమే కాకుండా.. సెమీకండక్టర్లకు సంబంధించిన ఇతర నైపుణ్యాలకు కూడా అత్యంత ప్రాధాన్యమిస్తోంది. చిప్ టు స్టార్టప్ అనే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. సెమీకండక్టర్ల రంగంలో పారిశ్రామిక అవసరాలకు తగినట్టుగా 85 వేల మందికి పైగా నిపుణులను తీర్చిదిద్దడమే దీని లక్ష్యం. భారత సెమీకండక్టర్ మిషన్ రెండో దశను ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించాం. అంటే, అన్ని రకాల చిప్‌ తయారీ కేంద్రాలు, అధునాతన ప్యాకేజింగ్, పరిశోధనాభివృద్ధికి అవసరమైన పూర్తి సహకార వ్యవస్థ భారత్‌లోనే అభివృద్ధి చెందుతుంది. సెమీకండక్టర్, బ్యాటరీ తయారీకి అరుదైన ఖనిజాలు అవసరం. దీనిలో సైతం స్వావలంబన సాధించేందుకు భారత్ కృషి చేస్తోంది. దేశంలో అరుదైన ఖనిజాల కారిడార్ల ఏర్పాటును ఈ ఏడాది బడ్జెట్ ప్రకటించింది. సెమీకండక్టర్ల రంగానికి ఇది భారీ ప్రోత్సాహాన్నిస్తుంది.

స్నేహితులారా,

మనం ఏదైనా సంకల్పించుకుంటే దాన్ని సాధించి చూపిస్తామని గత 11 ఏళ్లుగా భారత్ రుజువు చేస్తూనే ఉంది. మేక్ ఇన్ ఇండియా సాధించాలని దేశం సంకల్పించుకున్నప్పుడు కొంతమంది సందేహాలను, అనుమానాలను వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు, శక్తిమంతమైన బ్రాండ్‌గా మేక్ ఇన్ ఇండియా అవతరించింది. గడచిన 11 ఏళ్లలో భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ ఆరు రెట్లు పెరిగింది. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు సైతం ఎనిమిది రెట్లు పెరిగాయి. అందులోనూ, మొబైల్ తయారీలో ఇరవై ఎనిమిది రెట్లు కంటే ఎక్కువ వృద్ధి సాధించింది. మన మొబైల్ ఫోన్ ఎగుమతులు వంద రెట్లు కంటే ఎక్కువ పెరిగాయి.

స్నేహితులారా,

భారతదేశ తయారీ రంగ విజయంలో బలమైన ఆధారంగా యూపీ ఎదుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మొబైల్ ఫోన్ల తయారీ గురించి మాట్లాడుకుంటే.. ప్రస్తుతం దేశంలో తయారవుతున్న ఫోన్లలో సగం కంటే ఎక్కువ ఉత్తరప్రదేశ్‌లోనే తయారవుతున్నాయి. భవిష్యత్తులో యూపీలో ఈ సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఎందుకంటే సెమీకండక్టర్ల రంగంతో పాటుగా చిన్న ఎలక్ట్రానిక్ విడిభాగాలు కూడా ఇక్కడ తయారవుతాయి. ఇది కూడా పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.

స్నేహితులారా,

ఉత్తరప్రదేశ్‌లో తయారీ గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇక్కడికి వస్తున్న వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన వార్తల్లో ఉత్తరప్రదేశ్ ఉంటోంది. దశాబ్దం క్రితం ప్రతికూల అంశాల్లో ఉత్తరప్రదేశ్ పేరు ఎక్కువగా వినిపించేది. వలసలు, కొరత, వసతుల లేమి, నేరాలు - ఇది దేశంలోని అతి పెద్ద రాష్ట్రానికి పట్టిన దురదృష్టంగా అనిపించేవి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై యూపీ ప్రజల నమ్మకం, పదే పదే వారు అందిస్తున్న ఆశీర్వాదాల ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేడు, ఉత్తరప్రదేశ్‌ ఎక్స్‌ప్రెస్ రహదారుల రాష్ట్రంగా మారింది. యూపీ రక్షణ కారిడార్ గురించి మాట్లాడుకుంటున్నారు. దేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అభిమానించే పర్యాటక ప్రదేశంగా ఉత్తరప్రదేశ్ మారింది.

 

స్నేహితులారా,

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు యూపీకి వస్తున్నారు. ఎందుకంటే యూపీలో వారు పెట్టిన పెట్టుబడికి పెద్ద మొత్తంలో రాబడి వస్తుందని వారికి తెలుసు. ప్రత్యేక సరకు రవాణా కారిడార్, జేవర్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధిలో ఈ ప్రాంతాన్ని నూతన శిఖరాలకు చేరుస్తున్నాయి. రేపు అంటే ఆదివారం నేను ఢిల్లీ-మీరట్ నమోభారత్ రైలు కారిడార్‌ను ప్రారంభించబోతున్నాను. ఇక్కడ జరుగుతున్న పనులతో ఉత్తరప్రదేశ్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా కచ్చితంగా మారుతుంది. మరోసారి హెచ్‌సీఎల్, ఫాక్స్‌కాన్‌ సంస్థలకు ధన్యవాదాలు తెలిజేస్తున్నాను. ఈ సెమీకండక్టర్ యూనిట్ ఉత్తరప్రదేశ్ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను.

మరోసారి, మీ అందరికీ శుభాకాంక్షలు.

ధన్యవాదాలు. 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
‘A New Example...’: Indian Railways Builds Pedestrian Subway Under Ahmedabad Track In Just 8 Hours

Media Coverage

‘A New Example...’: Indian Railways Builds Pedestrian Subway Under Ahmedabad Track In Just 8 Hours
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister extends greetings on National Sports Day
August 29, 2026

The Prime Minister, Shri Narendra Modi has extended his greetings to all sports lovers on National Sports Day. Shri Modi said that the dedication, passion and determination of sportspersons make the entire nation proud.

The Prime Minister also paid homage to the legendary Major Dhyan Chand Ji, whose brilliance and contribution to Indian hockey continue to inspire generations.

Shri Modi posted on X:

“To every sports lover…your dedication, passion and determination make everyone proud.

We also pay homage to the legendary Major Dhyan Chand Ji, whose brilliance inspires generations.

#NationalSportsDay”