ఉత్తరప్రదేశ్ తో పాటు దేశమంతా ఈ రోజు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల సరికొత్త యుగాన్ని చూస్తోంది: ప్రధానమంత్రి
మీరట్ మెట్రో, నమో భారత్ రైలు, రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కొత్త సెక్షన్ ప్రారంభం ద్వారా ఎన్సీఆర్ ప్రజల జీవితాలు ఇంకా సులభంగా, సాఫీగా, సౌకర్యవంతంగా మారతాయి: ప్రధాని
ఒకసారి ఏదైనా పనికి శంకుస్థాపన జరిగితే, దానిని రేయింబవళ్లు శ్రమించి పూర్తి చేయడం మా పని సంస్కృతి: అందుకే ఇప్పుడు ప్రాజెక్టులు గతంలో మాదిరి పెండింగ్‌లో ఉండవు: ప్రధాని
నమో భారత్ లేదా మెట్రో సర్వీస్ ఏదైనా, రెండింటికీ శంకుస్థాపన చేసే అవకాశం నాకే దక్కింది - ఈ రోజు వాటిని ప్రారంభించే భాగ్యం కూడా నాకే కలిగింది: ప్రధాని
నమో భారత్, మెట్రో రైలు ఒకే స్టేషన్‌లో, ఒకే ట్రాక్‌పై నడవడం దేశంలో ఇదే తొలిసారి: ప్రధాని
ఒకే ప్లాట్‌ఫారమ్ నుంచి నగరంలోకోి ప్రయాణించవచ్చు, అదే స్టేషన్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లి రావచ్చు: ప్రధానమంత్రి
ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఈ రోజు భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి: ప్రధాని
ఈ రోజు అభివృద్ధి చెందిన దేశాలు భారత్‌తో భాగస్వామ్యం కోసం ఆసక్తిగా ఉన్నాయి… అవి తమ భవిష్యత్తును భారత్ అభివృద్ధిలో చూస్తున్నాయి; అలాగే భారత యువశక్తిలో విశ్వాసాన్ని చూస్తున్నాయి: ప్రధాని
నేడు ప్రపంచం 21వ శతాబ్దపు సవాళ్లకు పరిష్కారాలు చూపగల శక్తిగా భారత్‌ను భావిస్తోంది: ప్రధాని
మీరట్-హాపూర్ ప్రాంతం, ఇంకా దాని చుట్టుపక్కల ప్రాంతాలు మొదటి నుంచీ చౌదరి చరణ్ సింగ్ దార్శనికతను చూశాయి... చౌదరి చరణ్ సింగ్ కు భారతరత్న అందించే అవకాశం మా ప్రభుత్వానికి దక్కడం మా అదృష్టం: ప్రధానమంత్రి

భారత్ మాతాకీ జై

భారత్ మాతాకీ జై

భారత్ మాతాకీ జై

గౌరవ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి వర్గ సహచరులు పంకజ్ చౌదరి, జయంతి చౌదరి, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్, యూపీ ప్రభుత్వ మంత్రులు, తోటి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రియమైన సోదరీసోదరులారా!

బాబా ఔఘర్‌నాథ్ పుణ్యభూమి, విప్లవనేల మీరట్‌లో ఇవాళ వికసిత్ ఉత్తరప్రదేశ్, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు నూతనోత్తజం పరుగులు పెడుతోంది. తొలిసారిగా ఒకే వేదిక నుంచి నమో భారత్ రాపిడ్ రైలు, మెట్రో సర్వీసులు ప్రారంభమమయ్యాయి. అభివృద్ధి చెందిన భారతదేశంలోని రవాణా వ్యవస్థకు ఇది అద్భుతమైన ఉదాహరణ. నగరంలో ప్రయాణించేందుకు మెట్రో, జంట నగరాల అనుసంధానానికి అత్యాధునిక నమో భారత్ రైలు అందుబాటులోకి వచ్చాయి. అభివృద్ధిలో ఉత్తరప్రదేశ్ కీలకఘట్టానికి చేరుకున్నందుకు నాకు సంతృప్తిగా ఉంది.

 

సోదరీసోదరులారా,

నేటి కార్యక్రమం బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ పనితీరుని ప్రతిబింబిస్తుంది. మన పని సంస్కృతి ఏంటి? ఏదైనా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన తర్వాత, దాన్ని పూర్తి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తాం. అందువల్ల గతంలో లాగా ప్రాజెక్టులు నిలిచిపోవటం, ఆలస్యం వంటివి ఇప్పుడు జరగటం లేదు. నమో భారత్, మెట్రో సర్వీసు రెండింటిని గతంలో నేనే ప్రారంభించాను. ఈ రోజు వాటిని దేశానికి అంకితం చేసే భాగ్యం నాకు కలిగింది.

మిత్రులారా,

కొద్దిసేపటి కిందట నేను మీరట్ మెట్రోలో ప్రయాణించాను. ఆ సమయంలో చాలామంది యువ విద్యార్థులు, ఇతర ప్రయాణికులతో నేను ముచ్చటించాను. ఇలాంటి అద్భుతమైన సౌకర్యం అందుబాటులోకి వస్తుందని వారు ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. గత రోజులను వారు గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా మహిళలు, కుమార్తెలు ఇలా చెప్పారు. కొన్నేళ్ల కిందటి వరకు సాయంత్రం ఈ మార్గం నిశ్శబ్దం, భయంతో నిండిపోయేదన్నారు. ఇప్పుడు ఒకవైపు శాంతిభద్రతలు మెరుగుపడగా, మరోవైపు ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణమార్గం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.

మిత్రులారా,

మహిళా సాధికారతకు చిహ్నంగా నమో భారత్ రాపిడ్ రైల్ మారటం నాకు ఆనందంగా ఉంది. రైలు ఆపరేటర్లుగా, స్టేషన్ నియంత్రణ సిబ్బందిగా, అనేక కీలక బాధ్యతల్లో మన కుమార్తెలు ముందుండి సేవలను నడిపిస్తున్నారు. దేశంలోనే మొదటి నమో భారత్ రాపిడ్ రైల్ సర్వీస్, మీరట్ మెట్రో ప్రారంభమైన సందర్భంగా మీ అందరికీ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా,

నాకు మీరట్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. 2014, 2019 ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమాలను మీరట్ నుంచే ప్రారంభించాను. మీరట్ ప్రజలు, రైతులు, పారిశ్రామికవేత్తలు, చిన్న తరహా పరిశ్రమల కార్మికులు, చేతివృత్తుల వారు, వ్యాపారులు ఎల్లప్పుడూ నాకు ఆశీస్సులు అందిస్తూనే ఉన్నారు.

 

మిత్రులారా,

విషపూరిత రాజకీయాలను వీడి, అభివృద్ధి విషయంలో పోటీ పడమని కాంగ్రెస్, ఎస్పీ-బీఎస్పీలకు నేను చెప్పాను.

మిత్రులారా,

ఆ పార్టీలు విషపూరిత రాజకీయాలను మానుకోలేదు. కానీ.. విధానాల్లో, పనితీరులో, ఉద్దేశంలో బీజేపీ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చింది. అందుకు మీరట్ మెట్రోనే నిదర్శనం.

మిత్రులారా,

2014కు ముందు భారత్‌లో మెట్రో సేవల విస్తరణ నెమ్మదిగా సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం 5 నగరాల్లో మాత్రమే మెట్రో రైలు సర్వీసు ఉండేది. బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా 25కి పైగా నగరాల్లో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా భారత్ అవతరించింది. ఉత్తరప్రదేశ్‌లో కూడా మీరట్ సహా మరికొన్ని నగరాల్లో మెట్రో ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

మిత్రులారా,

11 ఏళ్లలో డజన్ల కొద్దీ నగరాలకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలకు సౌకర్యవంతమైన రవాణాను అందించాలని, ట్రాఫిక్ జామ్, కాలుష్యం లేని అత్యంత వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని పౌరులకు కల్పించాలనేది బీజేపీ ప్రభుత్వ సంకల్పం. కాబట్టే, ఇవాళ నమో భారత్ వంటి ఆధునిక సెమీ హై-స్పీడ్ రైళ్లు, వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.

మిత్రులారా,

ఢిల్లీలో కాంగ్రెస్, ఎస్పీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇవి సాధ్యం కాలేదు. ఆ సమయంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కుంభకోణాల్లో చిక్కుకున్నాయి. చివరికి మెట్రో వ్యవస్థకు సంబంధించిన సాంకేతికతను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఆ కుంభకోణాలకు మేం అడ్డుకట్ట వేసి, దేశాన్ని స్వావలంబన దిశగా నడిపించాం. ఎందుకంటే దేశాభివృద్ధి, ప్రజల సౌలభ్యం, సుసంపన్నతే బీజేపీ ప్రభుత్వ ప్రాధాన్యత. మీరట్, పశ్చిమ యూపీ ప్రజల జీవితాలు ఎంతగా మారాయో ఒకసారి చూడండి. సరాయ్ కాలే ఖాన్, ఆనంద్ విహార్, ఘజియాబాద్, మీరట్‌లోని రైల్వే, మెట్రో స్టేషన్లు, బస్ టెర్మినళ్లను అనుసంధానం చేశారు. దేశంలోనే మొదటిసారిగా నమో భారత్, మెట్రో రైలు.. ఒకే స్టేషన్ నుంచి, ఒకే ట్రాక్‌పై పరుగులు పెట్టనున్నాయి. దీనివల్ల మీరు ఒకే ప్లాట్‌ఫామ్ నుంచి నగరంలో ప్రయాణించటమే కాక, అదే స్టేషన్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకోవచ్చు. చదువులు, ఉద్యోగాలు, ఇతర పనుల కోసం రోజూ మీరట్ నుంచి ఢిల్లీకి ప్రయాణించే వేలమంది ప్రజలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఢిల్లీలో పనిచేస్తూ మీరట్‌లో నివసించేవారు.. ఇకపై ఢిల్లీలో అద్దె ఇళ్లలో ఉండాల్సిన పనిలేదు.

 

మిత్రులారా,

ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు నేడు బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తోంది. ఇది మీ డబ్బుని ఆదా చేయటమే కాక, యువతకు ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది. పశ్చిమ యూపీలో చూడండి- నూతన ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం, సరుకు రవాణాకు ప్రత్యేక కారిడార్ల అభివృద్ధి జరుగుతోంది. జెవార్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో ఉపాధి అవకాశాలుంటాయి. తర్వాత కొత్త పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలకు మార్గం సుగమం అవటంతో మరిన్ని ఉద్యోగాల సృష్టికి అవకాశం ఉంటుంది.

మిత్రులారా,

శ్రమకు, సృజనాత్మకతకు నిలయం ఉత్తరప్రదేశ్. ఇక్కడి రైతులు, పశుపోషకులు, చిన్న తరహా పారిశ్రామికవేత్తలు, చేనేత కార్మికులు, చేతివృత్తుల వారందరూ వారసత్వ, అభివృద్ధి మంత్రాన్ని సాకారం చేస్తున్నారు. భారతదేశం శక్తిమంతంగా ఎదిగినప్పుడు, ఉత్తరప్రదేశ్‌లోని ఈ శ్రమజీవులందరూ ఆ ప్రయోజనాలను పొందవచ్చు.

మిత్రులారా,

ఇటీవల కాలంలో భారత్‌పై ప్రపంచానికి ఎంత నమ్మకం కుదిరిందో, ప్రజలు ఎంత ఆశావహ దృక్పథంతో ఉన్నారో మీరు చూడవచ్చు. అభివృద్ధి చెందిన ఎన్నో దేశాలు భారత్‌తో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకున్నా, అభివృద్ధి చెందిన దేశాలతో ఇలాంటి ఒప్పందాలు జరిగేవి కాదు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అవినీతి ముద్ర, కుంభకోణాల కారణంగా భారత్‌తో లావాదేవీలకు ప్రపంచదేశాలు వెనుకాడేవి. కానీ నేడు అభివృద్ధి చెందిన దేశాలు భారత్‌తో భాగస్వామ్యానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. భారతదేశ అభివృద్ధిలో భవిష్యత్తును చూసుకుంటున్నాయి. భారత యువశక్తిపై నమ్మకంతో ఉన్నాయి. 21వ శతాబ్దపు సవాళ్లకు సమర్థవంతమైన పరిష్కారాలను అందించే శక్తి భారతదేశమని ప్రపంచం బలంగా విశ్వసిస్తుంది.

మిత్రులారా,

ఇటీవల సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు సూక్ష్మ, చిన్న, కుటీర పరిశ్రమలకు గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. దీనివల్ల మీరట్‌లో క్రీడా సామాగ్రి, కత్తెరల తయారీదారులు, ఖుర్జా పాత్రలు, మొరాదాబాద్ ఇత్తడి సామాగ్రి, బాఘ్‌పత్ గృహోపకరణాలు, సహరన్‌పూర్ చెక్క కళ.. తోలు, వస్త్ర, నగల సంబంధిత పరిశ్రమలకు ఎంతో మేలు జరుగుతుంది. చిన్న, కుటీర పరిశ్రమలన్నీ అపారమైన ప్రయోజనాన్ని పొందుతాయి. భారతదేశంలోని చిన్న, పెద్ద నగరాల శక్తిని ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి చేరవేయటం, ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల ప్రత్యేక గుర్తింపును పెంపొందించటమే బీజేపీ ప్రాధాన్యత.

 

మిత్రులారా,

మీరట్ సహా పరిసర ప్రాంతాలన్నీ చిన్న తరహా పరిశ్రమలకు, ఎంఎస్ఎంఈలకు ప్రధాన కేంద్రాలు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో చిన్న తరహా పరిశ్రమలకు రూ.1000 కోట్లను ప్రత్యేకంగా కేటాయించాం. దీనిద్వారా యూపీలోని ఎంఎస్ఎంఈలు సులభంగా రుణాలు పొందవచ్చు. వస్త్ర పరిశ్రమ, చేనేత కార్మికుల కోసం మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్ యోజనను బడ్జెట్‌లో ప్రకటించాం. ఖాదీ, చేనేత, హస్తకళల ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌కు చేరుకోవటానికి ఇది దోహదపడుతుంది.

మిత్రులారా,

ఇదివరకు, చిన్న తరహా చేతివృత్తుల కళాకారులు కొరియర్ ద్వారా రూ.10 లక్షల విలువైన వస్తువులను మాత్రమే పంపేందుకు వీలుండేది. ఇప్పుడు ఈ పరిమితిని పూర్తిగా తొలగించారు. దీనివల్ల మీరట్, యూపీ వ్యాప్తంగా నేత కార్మికులు, చిన్నతరహా పారిశ్రామికవేత్తలు, ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా అమెరికా, ఐరోపా వంటి దేశాల్లోని వినియోగదారులకు ఉత్పత్తులను సులభంగా పంపవచ్చు.

మిత్రులారా,

మీరట్-హాపూర్ సహా పరిసర ప్రాంతాలు మొదటి నుంచి చౌదరి చరణ్ సింగ్ దార్శనికతకు సాక్యాలు. చౌదరి చరణ్ సింగ్‌కు భారతరత్న ప్రకటించే భాగ్యం కలగటం మా ప్రభుత్వ అదృష్టం. వారి ఆశయాలకు అనుగుణంగా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఆహార శుద్ధి రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అందే నిధులు చిన్న రైతులకు మేలు చేకూరుస్తున్నాయి. ఈ పథకం ద్వారా యూపీ రైతులకు ఇప్పటివరకు సుమారు రూ.95,000 కోట్లు అందాయి. కేవలం మీరట్ రైతులకే దాదాపు రూ.800 కోట్లను అందించాం.

సోదరీసోదరులారా,

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజలు అహర్నిశలు శ్రమిస్తుంటే, కొన్ని రాజకీయ పార్టీలు ఈ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సదస్సు భారత్ లో జరగటం మీరు చూశారు. ఈ సదస్సు కోసం 80కి పైగా దేశాల ప్రతినిధులు ఢిల్లీకి వచ్చారు. దాదాపు 20 దేశాల అధినేతలు భారత్‌కు విచ్చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఢిల్లీకి చేరుకున్నారు. ఏ అభివృద్ధి చెందుతున్న దేశంలోనూ ఇంత భారీ సదస్సు ఇదివరకు ఎన్నడూ జరగలేదు. నేను మీరట్ ప్రజలను అడుగుతున్నాను- ఈ ఏఐ సదస్సు చూసి మీరు గర్వించారా లేదా? గట్టిగా చెప్పండి.. మీరు గర్వపడ్డారా లేదా? గర్వంతో తల ఎత్తుకున్నారా లేదా? గర్వంతో మీ రొమ్ము విరుచుకు నిలబడ్డారా లేదా? ఇది భారతదేశం కోసం జరిగిందా లేదా? ఇది భారత యువత కోసం జరిగిందా లేదా? ఇది భారతదేశ తలరాతను మార్చటానికి జరిగిందా లేదా? 21వ శతాబ్దంలో ప్రపంచ నాయకత్వాన్ని చేపట్టటానికి జరిగిందా లేదా? దేశమంతా గర్వంతో నిండిపోయింది. కానీ.. కాంగ్రెస్ వ్యవస్థ ఏం చేసింది?

 

మిత్రులారా,

భారతదేశం గర్వించదగిన అంతర్జాతీయ వేదికను నీచ, సిగ్గుమాలిన రాజకీయాలకు అడ్డాగా కాంగ్రెస్ మార్చింది. విదేశీ ప్రతినిధుల ఎదుట కాంగ్రెస్ నాయకులు బట్టలు విప్పి నిరసన తెలిపారు. నేను కాంగ్రెస్ నేతలను ఒకటే అడుగుతున్నాను. రాజకీయంగా మీరు దివాళా తీశారని అందరికీ తెలిసినప్పుడు, మళ్లీ బట్టలు విప్పి నిరసన చేయాల్సిన అవసరం ఏముంది? దేశంలోనే పురాతన పార్టీ సిద్ధాంతపరంగా ఎంత పతనమైందో, ఎంతటి దారిద్ర్యంలో ఉందో వారి ప్రవర్తన స్పష్టం చేస్తుంది.

మిత్రులారా,

ఎవరూ దీన్ని ఊహించలేరు. ఒక గ్రామంలో పెళ్లి జరిగితే, ఆ ఊరంతా ఏకమై వేడుకను విజయవంతం చేసే సంస్కృతి మనది. ఎందుకంటే అతిథులు సంతృప్తిగా తిరిగివెళ్లినప్పుడే గ్రామానికి మంచి పేరు వస్తుందనుకుంటాం. కానీ, కాంగ్రెస్ మాత్రం దేశ పరువుని తీయటంలో నిమగ్నమైంది.

మిత్రులారా,

కాంగ్రెస్ నాయకులకు మోదీ అంటే గిట్టదు. నేను భూస్థాపితం కావాలని వారు కోరుకుంటారు. నా తల్లిని అవమానించేందుకు కూడా వెనుకాడరు. బీజేపీని, ఎన్డీయేని వ్యతిరేకిస్తారు. వారి రాజకీయాలకు అదే అవసరమైతే.. దాన్ని మేం అర్థం చేసుకోగలం. భరించగలం. కానీ, ఏఐ గ్లోబల్ సమ్మిట్ బీజేపీ కార్యక్రమం కాదని, అక్కడ బీజేపీ నాయకులు లేరని కాంగ్రెస్ గుర్తుంచుకోవాల్సింది. అది దేశం గర్వపడే జాతీయ కార్యక్రమం. ప్రజలు చిందించిన చెమటతో ఏర్పాటు చేసిన వేదిక. అయినా, కాంగ్రెస్ హద్దులు దాటి ప్రవర్తించింది. కాంగ్రెస్ తీరుని దేశమంతా ఖండిస్తోంది. దేశాన్ని అవమానించిన వారిని చూసి సిగ్గుపడాల్సింది పోయి, దురదృష్టవశాత్తు పాత పార్టీ నాయకులు, వారిని ఉత్సాహపరుస్తున్నారు. మొదట్నుంచి కాంగ్రెస్ తీరు ఇలానే ఉంది. వాళ్లు పార్లమెంటులో ఏం చేశారో చూడండి- వాళ్లు సరిగ్గా పనిచేయకపోవటమే కాక, మిత్రపక్షాలను కూడా మాట్లాడనివ్వరు. పార్లమెంటు సమావేశాలను సాగనివ్వరు. దీనివల్ల నష్టపోయేది కాంగ్రెస్ మిత్రపక్షాలే. ఈ విషయం వారికి కూడా అర్థమవుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ చేసిన సిగ్గుమాలిన చర్య వల్ల మిత్రపక్షాలన్నీ ఇబ్బందిపడ్డాయి. ఇప్పుడు వారంతా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు.

దేశంలోని మీడియాకు నాదొక విన్నపం. మీడియా నుంచి ఎదురయ్యే వాటిని తట్టుకునే శక్తిని ప్రసాదించమని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. కానీ ఈరోజు వారిని ఒకటే కోరుతున్నాను. మేం విమర్శలు చేసినప్పుడు దయచేసి "మోదీ విపక్షాలపై విరుచుకుపడ్డారు" వంటి శీర్షికలను పెట్టకండి. కాంగ్రెస్‌ను కాపాడటానికి ఇలాంటి జిమ్మిక్కులు చేయటం ఆపండి. మీరు "విపక్షాలు" అనటం ద్వారా కాంగ్రెస్‌ను కాపాడుతున్నారు. దానివల్ల ఇతర ప్రతిపక్ష పార్టీలు నష్టపోతున్నాయి. పాపం చేసేది కాంగ్రెస్ అయినా మూల్యం చెల్లించేది ఇతరులు. కాంగ్రెస్ వ్యవస్థ ఎప్పుడూ ఇలాగే వ్యవహరిస్తుంది- తప్పు కాంగ్రెస్సే చేస్తుంది. విమర్శలు కాంగ్రెస్ పైనే వస్తాయి. ఆగ్రహం కాంగ్రెస్‌ పైనే ఉంటుంది. కానీ మీడియాలో మాత్రం కాంగ్రెస్ పదానికి బదులుగా "విపక్షం" అని మాత్రమే వస్తుంది. మీరు కాంగ్రెస్ ని ఎందుకు కాపాడుతున్నారు? ఇలా చేయటం వల్ల పార్టీని రక్షించలేరు.. పార్టీలో మార్పు తీసుకురాలేరు. కాంగ్రెస్ తప్పు చేసిందని మీరు స్పష్టంగా రాయటం మొదలుపెడితే, జరగబోయే మార్పును మీరే చూస్తారు. ఢిల్లీలో టీఎంసీ ఏదైనా తప్పు చేసిందా? లేదు. డీఎంకే ఏదైనా పాపం చేసిందా? లేదు. బీఎస్పీ ఏదైనా తప్పు చేసిందా? లేదు. ఫరూక్ అబ్దుల్లా పార్టీ ఏదైనా తప్పు చేసిందా? లేదు. కేవలం బాధ్యతారహిత్యంతో కాంగ్రెస్ నేతలు మాత్రమే దేశాన్ని నాశనం చేయటానికి సిద్ధమయ్యారు. మీరు ప్రధానమంత్రి పదవిని చేపట్టాలనుకుంటే, ముందుగా ప్రజల మనసులను గెలవాలి. మహిళా ఎంపీల ద్వారా బలవంతంగా సీట్లను ఆక్రమించుకున్నంత మాత్రాన ఎవరూ ప్రధానమంత్రి కాలేరు. ఇలా తల్లులను, ఆడబిడ్డలను బలవంతంగా ఎందుకు ముందుకు నెడుతున్నారు? అంతలా దిగజారిపోయారా?

 

మిత్రులారా,

దేశానికి కాంగ్రెస్ భారంలా మారింది. ఢిల్లీలో జరిగిన ఆ ఘటన తర్వాత కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ ఆ పార్టీని విమర్శించినందుకు నాకు తృప్తిగా ఉంది. నిజం, దేశ గౌరవం పక్షాన నిలబడినందుకు ప్రతిపక్ష మిత్రపార్టీలకు నేను బహిరంగంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

మిత్రులారా,

దేశాభివృద్ధి, ఉత్తరప్రదేశ్ అభివృద్ధి బీజేపీ ప్రభుత్వానికి అత్యంత కీలకమైనవి. గుర్తుంచుకోండి. పదేళ్ల కిందట ఉత్తరప్రదేశ్ దేనికి పేరుగాంచింది? మీరట్‌లో అల్లర్లు, పశ్చిమ యూపీలో నేరగాళ్ల ముఠాలు, అధ్వాన్నమైన రహదారులు, విద్యుత్ కోతలు, వెనుకబాటుతనం గురించే అందరూ మాట్లాడుకునేవారు. పశ్చిమ యూపీలోని నేరాల నేపథ్యంలో సినిమాలను కూడా చిత్రీకరించారు. ఎస్పీ ప్రభుత్వం యూపీని ఆ స్థాయికి దిగజార్చింది. కానీ, నేడు అభివృద్ధికి మారుపేరుగా యూపీ నిలిచింది. బ్రహ్మోస్ క్షిపణులు, ఫోన్ల తయారీ, విమానాశ్రయాలు, పర్యాటక సౌకర్యాల వృద్ధికి యూపీ పేరుగాంచింది. క్రీడా రంగంలోనూ యూపీ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోంది. మీరట్‌లో స్పోర్ట్స్ యూనివర్సిటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

మిత్రులారా,

ఎస్పీ హయాంలో నేరస్తులు నిర్భయంగా తిరిగేవారు. నేడు యోగీ జీ పాలనలో వారు జైలు పాలవుతున్నారు. కళాశాలల నుంచి బయటకు వచ్చే ఆడబిడ్డలను అవమానించే ధైర్యం ఇప్పడు ఎవరికీ లేదు.

మిత్రులారా,

శాంతి భద్రతలు మెరుగుపడినప్పుడు.. వాణిజ్యం, వ్యాపారం, దుకాణాల వృద్ధికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. అందువల్లే నేడు యూపీ ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన వృద్ధిని సాధిస్తుంది. యోగీ జీ నాయకత్వంలో దేశంలోనే ప్రధాన తయారీ కేంద్రంగా యూపీ అవతరిస్తోంది. నిన్న యూపీలో మొదటి సెమీకండక్టర్ పరిశ్రమకు శంకుస్థాపన చేసే అవకాశం లభించింది. ఈ ఫ్యాక్టరీతో యూపీ మరింత శక్తిమంతంగా మారుతుంది. ఇది నూతన పెట్టుబడులకు, కొత్త ఉద్యోగాలకు ఉత్తమ అవకాశాలను కలిగిస్తుంది. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా యూపీని మార్చేందుకు బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని నేను హామీ ఇస్తున్నా. యూపీ అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. నమో భారత్ రైలు, మెట్రో ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా మరోసారి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. మనం వందేమాతరం 150 ఏళ్ల వేడుకలను జరుపుకుంటున్నాం. నాతో కలిసి అనండి-

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Kamal Haasan Backs PM Modi's Call To Save Energy Amid US-Iran War: 'India Will Emerge Stronger'

Media Coverage

Kamal Haasan Backs PM Modi's Call To Save Energy Amid US-Iran War: 'India Will Emerge Stronger'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives in China mining accident
May 23, 2026

Prime Minister Shri Narendra Modi today expressed deep sadness over the tragic loss of lives resulting from a mining accident in the Shanxi Province of China.

On behalf of the people of India, the Prime Minister extended his heartfelt condolences to President Xi Jinping and the people of China. Shri Modi prayed that the bereaved families find strength in this tragic hour, while also wishing for the early and safe recovery of all remaining missing persons.

The Prime Minister posted on X:

"Saddened by the loss of lives in a mining accident in Shanxi Province in China. On behalf of the people of India, my condolences to President Xi Jinping and the people of China. May the bereaved families find strength in this tragic hour. Praying for the early and safe recovery of all remaining missing persons."