* ప్రస్తుతం ప్రపంచమంతా వికసిత్ భారత్ సంకల్పం గురించే చర్చ మౌలిక వసతుల్లో మార్పునకు ప్రతిబింబం ఈ పునాదులపైనే అభివృద్ధి చెందిన భారత్: పీఎం
* ఒకటే దేశం, ఒకటే గ్యాస్ గ్రిడ్ లక్ష్యం ఆధారంగా పనిచేశాం... ప్రధానమంత్రి ఊర్జా గంగా పరియోజనను రూపొందించాం: పీఎం
* 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చేయాలి... మన మార్గం అభివృద్ధి ద్వారా సాధికారత, స్పందన ద్వారా సుపరిపాలన: పీఎం

పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సి.వి. ఆనంద బోస్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు హర్దీప్ సింగ్ పురీ గారు, శాంతనూ ఠాకుర్ గారు, సుఖాంత మజుందార్ గారు, పశ్చిమ బెంగాల్ శాసనసభ ప్రతిపక్ష నాయకులు సువేందు అధికారి గారు, పార్లమెంటులో నా సహచరులు సౌమిక్ భట్టాచార్య గారు, జ్యోతిర్మయ్ సింగ్ మహతో గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, నా ప్రియమైన సోదర సోదరీమణులారా, నమస్కారం!

మన దుర్గాపూర్ ఉక్కు నగరంగానే కాకుండా భారత శ్రామిక శక్తికి ప్రధాన కేంద్రంగా కూడా పేరుగాంచింది. దుర్గాపూర్ భారత్ అభివృద్ధిలో గణనీయమైన పాత్ర పోషిస్తోంది. నేడు ఆ పాత్రను మరింత బలోపేతం చేసుకునే అవకాశం మనకు ఉంది. కొద్దిసేపటి కిందట 5,400 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలు ఇక్కడ జరిగాయి. ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో అనుసంధానాన్ని పెంచుతాయి. ఇవి గ్యాస్ ఆధారిత రవాణా వ్యవస్థను, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థనూ ప్రోత్సహిస్తాయి. ఈ రోజు ప్రారంభించుకున్న ప్రాజెక్టులు ఈ ఉక్కు నగరం గుర్తింపును మరింత బలోపేతం చేస్తాయి. మరో మాటలో చెప్పాలంటే, ఈ కార్యక్రమాలు "మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్" అనే మంత్రంతో పశ్చిమ బెంగాల్ మరింత ముందుకు సాగడానికి తోడ్పడుతాయి. ఇవి ఈ ప్రాంత యువతకు అనేక ఉపాధి అవకాశాలను కూడా అందిస్తాయి. ఈ ప్రాజెక్టుల ప్రారంభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు.

 

మిత్రులారా,

నేడు ప్రపంచం 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) తీర్మానాల గురించి మాట్లాడుతోంది. భారత్ అంతటా కనిపిస్తున్న మార్పు దీని వెనక ఉన్నాయి. అవి 'వికసిత్ భారత్' కు పునాది వేస్తున్న పరివర్తనలు. ఈ మార్పుల్లో ప్రధానమైనది దేశంలోని మౌలిక సదుపాయాలు. నేను మౌలిక సదుపాయాల గురించి మాట్లాడేటప్పుడు.. నేను సామాజిక, భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలను ప్రస్తావిస్తాను. అవి పేదలకు నాలుగు కోట్లకు పైగా శాశ్వత గృహాలు, కోట్లాది మరుగుదొడ్లు, 12 కోట్లకు పైగా కుళాయి నీటి కనెక్షన్లు, వేల కిలోమీటర్ల కొత్త రహదారులు, కొత్త జాతీయ రహదారులు, కొత్త రైలు మార్గాలు, చిన్న నగరాల్లోనూ విమానాశ్రయాలు, ప్రతి ఇంటికీ, గ్రామానికీ ఇంటర్నెట్ సదుపాయం. ఈ ఆధునిక మౌలిక సదుపాయాలన్నీ పశ్చిమ బెంగాల్‌ సహా దేశంలోని ప్రతి రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుస్తున్నాయి.

మిత్రులారా,

పశ్చిమ బెంగాల్‌లో రైలు కనెక్టివిటీ విషయంలో అపూర్వమైన అభివృద్ధి జరిగింది. దేశంలో వందే భారత్ రైళ్లు పెద్ద సంఖ్యలో నడుస్తున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి. కోల్‌కతా మెట్రో వేగంగా విస్తరిస్తోంది. ఇక్కడ కొత్త రైల్వే లైన్లు వేస్తున్నారు. రైలు మార్గాల విస్తరణ, విద్యుదీకరణ పనులూ వేగంగా జరుగుతున్నాయి. అనేక రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నారు. అదనంగా పెద్ద సంఖ్యలో రైల్వే ఓవర్‌బ్రిడ్జిలు కూడా నిర్మిస్తున్నారు. ఈరోజు పశ్చిమ బెంగాల్‌కు మరో రెండు రైల్వే ఓవర్‌బ్రిడ్జిలు మంజూరయ్యాయి. ఈ ప్రయత్నాలన్నీ బెంగాల్ ప్రజల జీవితాలను ఎంతో సులభతరం చేస్తాయి.

మిత్రులారా,

మేం ఇక్కడి విమానాశ్రయాన్ని ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకంతో అనుసంధానించాం. గత సంవత్సరంలోనే, 5,00,000 కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించారు. అటువంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసినప్పుడు ప్రజలు మెరుగైన సౌకర్యాల నుంచి ప్రయోజనం పొందడమే కాకుండా, వేలాది మంది యువతకు ఉపాధి కూడా లభిస్తుందని మీకు బాగా తెలుసు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఉపయోగించే ముడి పదార్థాల తయారీ ద్వారానూ పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తోంది.

 

మిత్రులారా,

గత 10–11 సంవత్సరాల్లో దేశంలో గ్యాస్ కనెక్టివిటీపై జరిగిన కృషి సాటిలేనిది. గత దశాబ్దంలో ఎల్‌పీజీ గ్యాస్ దేశంలోని ప్రతి ఇంటికీ చేరుకుంది. ఈ విజయాన్ని ప్రపంచమంతా ప్రశంసించింది. మేం ఒకే దేశం, ఒకే గ్యాస్ గ్రిడ్ దార్శనికతతో పనిచేశాం. ప్రధానమంత్రి ఉర్జా గంగా యోజనను ప్రారంభించాం. ఈ పథకం కింద, పశ్చిమ బెంగాల్‌ సహా తూర్పు భారతంలోని ఆరు రాష్ట్రాల్లో గ్యాస్ పైప్‌లైన్లు వేస్తున్నారు. ఈ రాష్ట్రాల్లోని పరిశ్రమలకు, గృహాలకూ సరసమైన ధరకే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేయడం దీని లక్ష్యం. గ్యాస్ అందుబాటులో ఉంటే ఈ రాష్ట్రాల్లోని వాహనాలు సీఎన్‌జీతో నడుస్తాయి. అలాగే మన పరిశ్రమలూ గ్యాస్ ఆధారిత సాంకేతికతలను అందిపుచ్చుకుంటాయి. దుర్గాపూర్ పారిశ్రామిక ప్రాంతం ఇప్పుడు జాతీయ గ్యాస్ గ్రిడ్‌లో భాగమవడం సంతోషంగా ఉంది. ఇది స్థానిక పరిశ్రమలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా పశ్చిమ బెంగాల్‌లోని సుమారు 25 నుంచి 30 లక్షల గృహాలకు సరసమైన ధరకు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుంది. దీని అర్థం ఈ కుటుంబాల జీవితం.. ముఖ్యంగా మన తల్లులు, సోదరీమణుల జీవితం సులభతరం అవుతుంది. ఫలితంగా వేలాది ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయి.

 

మిత్రులారా,

ప్రధాన ఉక్కు, విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమలైన దుర్గాపూర్, రఘునాథ్‌పూర్‌లోనూ కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. వాటిలో దాదాపు 1,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. ఈ ప్లాంట్లు ఇప్పుడు మరింత సమర్థంగా మారి.. ప్రపంచంతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయినందుకు బెంగాల్ ప్రజలకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

భారత కర్మాగారాలు అయినా, మన పంటపొలాలు, సాగుభూములు అయినా - 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే స్పష్టమైన సంకల్పంతోనే ప్రతిచోటా పనులు జరుగుతున్నాయి. అభివృద్ధి ద్వారా సాధికారత, ఉపాధి ద్వారా స్వావలంబన, సున్నితత్వం ద్వారా సుపరిపాలన అందించడం మా మార్గంగా ఉంది. ఈ సూత్రాల మార్గనిర్దేశంలో పశ్చిమ బెంగాల్‌ను భారత్ అభివృద్ధి ప్రయాణంలో శక్తిమంతమైన చోదకశక్తిగా మార్చాలని మేం నిశ్చయించాం. మరోసారి, ఈ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభ సందర్భంగా మీ అందరినీ అభినందిస్తున్నాను. ఇంకా చెప్పాల్సినవి చాలానే ఉన్నాయి. కానీ ఈ వేదికపై చెప్పడానికి బదులుగా.. సమీపంలోని తదుపరి వేదిక ద్వారా మరిన్ని విషయాలను చెప్పడం మంచిది. అక్కడ నేను ఏమి చెబుతానో వినడానికి మొత్తం బెంగాల్, యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మీడియా కూడా చాలా ఆసక్తిగా ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ కార్యక్రమం కోసం నేను ఇక్కడ నా మాటలను ఇంతటితో ఆపుతాను. కానీ కొద్ది సేపట్లోనే అక్కడ నుంచి మరిన్ని విషయాలను మీతో పంచుకుంటాను.

చాలా ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA

Media Coverage

Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 14 డిసెంబర్ 2025
December 14, 2025

Empowering Every Indian: PM Modi's Inclusive Path to Prosperity