· ఏ రాష్ట్ర అభివృద్ధికైనా మౌలిక సదుపాయాలు, ఇంధన రంగాలే వెన్నెముక.. గత 11 ఏళ్లుగా వీటిపై ప్రధానంగా దృష్టి సారించాం
· తమిళనాడు అభివృద్ధి మా ప్రాధాన్యానికి అద్దం పడుతుంది
· నేడు ప్రపంచం భారత్ వికాసంలోనే తన అభివృద్ధిని చూసుకుంటోంది
· తమిళనాడు మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు భారత ప్రభుత్వం కృషి చేస్తోంది

వణక్కం!

తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి గారు, నా కేబినెట్ సహచరులు కింజరపు రామమోహన్ నాయుడు గారు, డా. ఎల్. మురుగన్ గారు, తమిళనాడు మంత్రులు తంగం తెన్నరసు గారు, డా. టి.ఆర్.బి. రాజా గారు, పి. గీతా జీవన్ గారు, అనితా ఆర్. రాధాకృష్ణన్ గారు, ఎంపీ కణిమొళి గారు, తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, మన ఎమ్మెల్యే నయనార్ నాగేంద్రన్ గారు, తమిళనాడు సోదర సోదరీమణులారా!

ఈ రోజు కార్గిల్ విజయ్ దివస్. ముందుగా, కార్గిల్ వీరులకు నా వందనాలు. అమర వీరులకు నివాళి అర్పిస్తున్నాను.

 

మిత్రులారా,

నాలుగు రోజుల విదేశీ పర్యటన తర్వాత నేరుగా రామేశ్వరుడు కొలువై ఉన్న ఈ  పవిత్ర భూమికి వచ్చే అవకాశం దక్కడం నా అదృష్టం. విదేశీ పర్యటన సమయంలో భారత్-ఇంగ్లండ్ మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇది భారత్ పై ప్రపంచానికి పెరుగుతున్న నమ్మకానికి, దేశంలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఈ ఆత్మవిశ్వాసంతోనే మేం అభివృద్ధి చెందిన భారత్, అభివృద్ధి చెందిన తమిళనాడును నిర్మించబోతున్నాం. ఈ రోజు కూడా రామేశ్వరస్వామి, తిరుచ్చెందూరు మురుగన్ స్వామి ఆశీస్సులతో తూత్తుకుడి అభివృద్ధిలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాం. 2014లో తమిళనాడును అభివృద్ధిలో శిఖరాగ్రంలో నిలపడమే లక్ష్యంగా ప్రారంభించిన మిషన్‌కు తూత్తుకుడి సాక్షిగా నిలుస్తోంది.

 

మిత్రులారా,

గతేడాది ఫిబ్రవరిలో ఇక్కడ ‘వి.ఒ. చిదంబరనార్ పోర్ట్’లో ‘ఔటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్’కు శంకుస్థాపన చేశాను. అప్పుడు కూడా వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. సెప్టెంబరులో కొత్త తూత్తుకుడి అంతర్జాతీయ కంటైనర్ టెర్మినల్‌ను ప్రారంభించాను. ఈరోజు మరోసారి రూ. 4800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు జరిగాయి. వీటిలో విమానాశ్రయం, జాతీయ రహదారులు, పోర్టులు, రైల్వేల సంబంధిత ప్రాజెక్టులతోపాటు విద్యుత్ రంగానికి సంబంధించిన ముఖ్యమైన ప్రణాళికలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా తమిళనాడు ప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

 

మిత్రులారా,

ఒక రాష్ట్ర అభివృద్ధికి మౌలిక సదుపాయాలు, ఇంధన రంగాలు వెన్నెముకలాంటివి. గత 11 ఏళ్లుగా మౌలిక సదుపాయాలు, ఇంధన రంగాల్లో తమిళనాడు అభివృద్ధికి మేం ఎంత ప్రాధాన్యమిస్తున్నామో ప్రభుత్వ వైఖరి ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఈరోజు ప్రారంభమైన ప్రాజెక్టులన్నీ కనెక్టివిటీ, స్వచ్ఛ ఇంధనం, కొత్త అవకాశాల నిలయంగా తూత్తుకుడినీ, తమిళనాడునీ మార్చబోతున్నాయి.

మిత్రులారా,

శతాబ్దాలుగా సుసంపన్నమైన భారత నిర్మాణంలో తమిళనాడు, తూత్తుకుడి ప్రజలు కీలక పాత్ర పోషిస్తున్నారు. విశాల దృష్టి కలిగిన వ్యక్తి వి.ఒ. చిదంబరం పిళ్లై పుట్టింది ఇక్కడే. వలస పాలన కాలంలోనే ఆయన సముద్ర మార్గం ద్వారా వాణిజ్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించారు. సముద్రంలో స్వదేశీ నౌకలు నడిపి ఇంగ్లిషువాళ్లకు సవాలు విసిరారు. స్వతంత్ర, సుదృఢమైన భారత్ కోసం కలలు కనడమే కాకుండా అవి కార్యరూపం దాల్చేందుకు కృషి చేసిన వీరపాండ్య కట్టబొమ్మన్, ఆలగుముత్తు కొన్ వంటి మహా పురుషులూ ఇక్కడ పుట్టారు. జాతీయ కవి సుబ్రమణియ భారతి కూడా ఈ ప్రాంతానికి చెందిన వారే. ఆయనకు తూత్తుకుడితో అవినాభావమైన అనుబంధముంది. నా పార్లమెంటరీ నియోజకవర్గమైన కాశీతో కూడా ఆయనకు అంతే బలమైన అనుబంధముందన్న విషయం మీకు తెలిసిందే. కాశీ-తమిళ సంగమం వంటి కార్యక్రమాల ద్వారా మన సాంస్కృతిక వారసత్వాన్ని నిరంతరం బలోపేతం చేసుకుంటున్నాం.

 

మిత్రులారా,

గతేడాది నేను బిల్ గేట్స్‌కు ప్రసిద్ధ తూత్తుకుడి ముత్యాలను బహుమతిగా ఇచ్చిన విషయం నాకు గుర్తుంది. ఆయన వాటిని ఎంతో ఇష్టపడ్డారు. ఇక్కడి పాండ్య ముత్యాలు ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారత ఆర్థిక శక్తికి ప్రతీకగా నిలిచేవి.

 

మిత్రులారా,

నేడు అభివృద్ధి చెందిన తమిళనాడు, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. భారత్ - బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కుదిరింది. ఈ ఒప్పందం కూడా ఈ అభివృద్ధికి బలాన్నిస్తోంది. నేడు ప్రపంచం భారత అభివృద్ధిలో తన అభివృద్ధిని చూస్తోంది. ఈ ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తిని అందించనుంది. దీని వల్ల ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడంలో మన దూకుడు మరింత పెరుగుతుంది.

 

మిత్రులారా,

ఈ ఎఫ్టీఏతో బ్రిటన్‌లో విక్రయించే భారతీయ ఉత్పత్తులలో 99 శాతానికిపైగా ఉత్పత్తులపై ఎలాంటి సుంకాలూ ఉండవు. భారతీయ ఉత్పత్తులు బ్రిటన్‌లో తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తే, అక్కడ వాటికి డిమాండ్ పెరుగుతుంది. దీని వల్ల మన దేశంలో ఆ ఉత్పత్తుల తయారీకి అవకాశాలు పెరుగుతాయి.

 

మిత్రులారా,

తమిళనాడు యువతకు, మన చిన్న పరిశ్రమలకు, ఎంఎస్ఎంఈలకు, అంకుర సంస్థలకు భారత-బ్రిటన్ ఎఫ్టీఏ వల్ల భారీగా ప్రయోజనం లభించనుంది. పరిశ్రమ, మత్స్యకార సోదర సోదరీమణులు, పరిశోధన-ఆవిష్కరణలు... ఇలా అందరికీ ఇది లాభదాయకం.

 

మిత్రులారా,

ఈ రోజు భారత ప్రభుత్వం ‘మేకిన్ ఇండియా’, ‘మిషన్ మానుఫ్యాక్చరింగ్’పై అధికంగా దృష్టి సారిస్తోంది. ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’ మేకిన్ ఇండియా శక్తిని చాటింది. మన దేశంలో తయారైన ఆయుధాలు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు కూడా భారత్‌లో తయారైన ఆయుధాలు ఉగ్రవాద మూకలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

 

మిత్రులారా,

తమిళనాడు సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకునేలా మౌలిక సదుపాయానుల ఆధునికీకరణపై భారత ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోంది. తమిళనాడులోని నౌకాశ్రయాల్లో మౌలిక సదుపాయాలను హైటెక్‌గా తీర్చిదిద్దుతున్నాం. దీనితోపాటు విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, రైల్వేలను అనుసంధానం చేస్తున్నాం. ఈ క్రమంలో తూత్తుకుడి విమానాశ్రయానికి కొత్త ఆధునిక టెర్మినల్ ను ఈరోజు ప్రారంభించడం మరో గొప్ప ముందడుగు. ఈ టెర్మినల్ రూ.450 కోట్ల వ్యయంతో నిర్మితమైంది. ఇప్పుడిక్కడ నుంచి ఏటా 20 లక్షల మందికిపైగా ప్రయాణికుల రాకపోకలకు వీలవుతుంది. ఇంతకుముందు ఈ సామర్ధ్యం 3 లక్షలు మాత్రమే ఉండేది.

 

మిత్రులారా,

ఈ కొత్త టెర్మినల్ ద్వారా తూత్తుకుడికి దేశంలోని అనేక రహదారులతో అనుసంధానం మరింత పెరుగుతుంది. కార్పొరేట్ ప్రయాణాలు, విద్యా కేంద్రాలు, తమిళనాడులోని ఆరోగ్య మౌలిక సౌకర్యాలకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. దీనితోపాటు ఈ ప్రాంతంలో పర్యాటకానికి కూడా కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయి.

 

మిత్రులారా,

ఈ రోజు తమిళనాడులో రెండు ముఖ్యమైన రహదారి ప్రాజెక్టులను కూడా ప్రజలకు అంకితం చేశాం. దాదాపు రూ.2,500 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించాం. ఇవి చెన్నైకి సంబంధించిన రెండు ప్రధాన అభివృద్ధి ప్రాంతాలను అనుసంధానిస్తాయి. ఈ రహదారుల వల్ల చెన్నైకి డెల్టా జిల్లాలతో ఉన్న అనుసంధానం మరింత మెరుగైంది.

 

మిత్రులారా,

ఈ ప్రాజెక్టుల వల్ల తూత్తుకుడి పోర్ట్‌కు కనెక్టివిటీ చాలా మెరుగైంది. ఈ రహదారులు ఈ ప్రాంతంలో జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాక వాణిజ్య, ఉపాధి అవకాశాలకు కొత్త దారులు తెరుస్తాయి. 

 

మిత్రులారా,

మన ప్రభుత్వం దేశ రైల్వేలను పరిశ్రమల అభివృద్ధికి, ఆత్మనిర్భర భారత్‌కు  వెన్నెముకగా భావిస్తోంది. అందుకే గత పదకొండు సంవత్సరాల్లో దేశ రైల్వే మౌలిక సదుపాయాలలో విస్తృత ఆధునికీకరణ జరిగింది. రైల్వే మౌలిక సదుపాయాల నవీకరణలో తమిళనాడు ప్రధాన కేంద్రంగా మారింది. మన ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తమిళనాడులో 77 రైల్వే స్టేషన్లను పునరుద్ధరిస్తోంది. వందే భారత్ రైళ్ల  ద్వారా తమిళనాడు ప్రజలకు కొత్త తరహా ప్రయాణ అనుభూతి లభిస్తోంది. దేశంలో మొదటి, ప్రత్యేకమైన వర్టికల్ లిఫ్ట్ రైల్ బ్రిడ్జ్ అయిన పంబన్ బ్రిడ్జిని కూడా తమిళనాడులోనే నిర్మించాం. ఈ వంతెన వల్ల వాణిజ్య నిర్వహణ సౌలభ్యం, ప్రయాణ సౌలభ్యం రెండూ మెరుగయ్యాయి.

 

మిత్రులారా,

నేడు దేశవ్యాప్తంగా భారీ, ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఓ బృహత్తర కార్యక్రమం నడుస్తోంది. కొన్ని రోజుల కిందట జమ్మూ కాశ్మీర్‌లో ప్రారంభించిన చీనాబ్ బ్రిడ్జి ఓ ఇంజినీరింగ్ అద్భుతం. ఇది తొలిసారిగా జమ్మూను శ్రీనగర్‌ను రైలు మార్గంతో అనుసంధానించింది. అంతేకాకుండా దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన అయిన అటల్ సేతును నిర్మించాం. అస్సాంలో బోగీబీల్ వంతెన నిర్మించాం. 6 కిలోమీటర్ల కన్నా ఎక్కువ పొడవైన సోనామార్గ్ సొరంగాన్నీ నిర్మించాం. ఇలాంటి అనేక ప్రాజెక్టులను భారత ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.

 

మిత్రులారా,

ఈ రోజు తమిళనాడులో జాతికి అంకితం చేసిన రైల్వే ప్రాజెక్టులు కూడా దక్షిణ తమిళనాడులో లక్షలాది మందికి ప్రయోజనం కలిగించబోతున్నాయి. మదురై నుంచి బోడి-నాయకనూరు వరకు రైలు మార్గ విద్యుదీకరణ పూర్తయిన తర్వాత వందే భారత్ వంటి రైళ్లు నడిచేందుకు మార్గం సుగమమైంది. ఈ రైల్వే ప్రాజెక్టులు తమిళనాడులో వేగాన్నీ, అభివృద్ధి స్థాయినీ మరింత పెంచబోతున్నాయి.

 

మిత్రులారా,

2000 మెగావాట్ల కుడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టుతో అనుసంధానం ఉన్న ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్‌కు ఈరోజు శంకుస్థాపన చేశాం. సుమారు రూ.550 కోట్ల వ్యయంతో నిర్మించబోయే ఈ ప్రాజెక్ట్ మున్ముందు దేశానికి స్వచ్ఛమైన విద్యుత్ అందించడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత అంతర్జాతీయ ఇంధన లక్ష్యాలు, పర్యావరణ ప్రమాణాలను నెరవేర్చే దిశగా ముందడుగు పడుతుంది. విద్యుదుత్పత్తి పెరిగితే తమిళనాడు పరిశ్రమలు, గృహ వినియోగదారులకూ ఎంతో మేలు జరుగుతుంది.

 

మిత్రులారా,

ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం కూడా తమిళనాడులో వేగంగా అమలవుతుండడం ఆనందాన్ని కలిగిస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వానికి దాదాపు లక్ష దరఖాస్తులు రాగా.. 40,000కు పైగా ఇళ్ల పైకప్పుపై సౌర విద్యుత్ సదుపాయాలును ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ పథకం కేవలం ఉచితంగా, పర్యావరణ హితంగా విద్యుత్ అందించడమే కాకుండా, ఆ రంగంలో వేల సంఖ్యలో ఉద్యోగాలను కూడా కల్పిస్తోంది.

 

మిత్రులారా,

తమిళనాడు అభివృద్ధి, అభివృద్ధి చెందిన తమిళనాడును సాకారం చేయాలన్నదే మన దృఢ సంకల్పం. తమిళనాడు అభివృద్ధికి సంబంధించిన విధానాలకు మేమెప్పుడూ ప్రాధాన్యమిస్తూనే వచ్చాం. గత దశాబ్ద కాలంలో కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు వికేంద్రీకరణ ద్వారా మూడు లక్షల కోట్ల రూపాయలు అందించింది. ఇది గత యూపీఏ ప్రభుత్వమిచ్చిన మొత్తానికి మూడింతలు ఎక్కువ. ఈ పదకొండు సంవత్సరాల్లో తమిళనాడుకు పదకొండు కొత్త మెడికల్ కాలేజీలు లభించాయి. తీరప్రాంతాల మత్స్యకార సముదాయాల పట్ల ఇంతగా శ్రద్ధ చూపిన మొదటి ప్రభుత్వం మనదే. నీలి విప్లవం ద్వారా తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థను విస్తరిస్తున్నాం.

 

మిత్రులారా,

ఈ రోజు అభివృద్ధిలో కొత్త అధ్యాయానికి తూత్తుకుడి సాక్షిగా నిలుస్తోంది. అనుసంధానం, విద్యుత్ ప్రసారం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నీ అభివృద్ధి చెందిన తమిళనాడు, అభివృద్ధి చెందిన భారత్‌కు బలమైన పునాది వేస్తాయి. ఈ ప్రాజెక్టుల నేపథ్యంలో నా తమిళనాడు కుటుంబ సభ్యులందరినీ మరోసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. మీరంతా ఎంతో ఉత్సాహంగా ఉండడాన్ని నేను చూస్తున్నా. ఓ పని చేయండి, మీ మొబైల్ ఫోన్లు తీసుకొని ఈ కొత్త విమానాశ్రయానికి మరిన్ని వెలుగులద్దేలా మీ ఫోన్ ఫ్లాష్ లైట్లను ఆన్ చేయాలని కోరుతున్నాను.

 

భారత్ మాతా కీ  జై

భారత్ మాతా కీ  జై

భారత్ మాతా కీ  జై...

మీ అందరికీ మనఃపూర్వక  ధన్యవాదాలు. 

వణక్కం ।

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
1 in 4 iPhones are now made in India as Apple ramps up production by 53 per cent

Media Coverage

1 in 4 iPhones are now made in India as Apple ramps up production by 53 per cent
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam emphasising on collective strength and resolve for progress and well-being of the nation
March 11, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam emphasising on collective strength and resolve for progress and well-being of the nation:

“स्वस्ति पन्थामनुचरेम सूर्याचन्द्रमसाविव।

पुनर्ददाताघ्नता जानता सङ्गमेमहि॥”

The Prime Minister said that boundless strength of the people of India is the axis of the nation's development. Through our capabilities and mutual trust, we have realized every resolve and will continue to do so in the future.

The Subhashitam conveys that, may we continuously walk on the auspicious path like the sun and the moon. May we move forward together with mutual nonviolence, harmony, and wisdom, and with each others’ support towards progress and well-being.

The Prime Minister wrote on X;

“भारतवासियों की असीम शक्ति ही देश के विकास की धुरी है। अपने सामर्थ्य और परस्पर विश्वास से हम हर संकल्प को साकार करते आए हैं और आगे भी करते रहेंगे।

स्वस्ति पन्थामनुचरेम सूर्याचन्द्रमसाविव।

पुनर्ददाताघ्नता जानता सङ्गमेमहि॥”