India is not only a fast-growing economy, but also a credible one: PM
Along with being a rising power, India is also a reliable power: PM
For India, Nation First is the highest guiding principle: PM
Maoist terror is breathing its last in India: PM
The shift in mindset from "this can never be done" to "this will be done" is India's greatest achievement: PM
The government is empowering the poor and middle-class: PM
The collective efforts of 140 crore Indians will realise the dream of a Viksit Bharat: PM

స్వర సాధన.. మనోకామన.. ఆరాధన- ఇలాంటి శుభారంభం తర్వాత, మీ కార్యక్రమమే కొనసాగి ఉంటే చాలా బాగుండేదేమో... ఏదేమైనా మీకందరికీ నమస్కారం!

అనేక భాషల్లో ప్రసారమవుతున్న ‘రిపబ్లిక్ టీవీ నెట్‌వర్క్’ వీక్షకులందరికీ ముందుగా నా అభివాదం. ఈ సదస్సుకు హాజరైన మిత్రులందరినీ కూడా సాదరంగా స్వాగతిస్తున్నాను. రాత్రింబవళ్లూ నడిచే (24 గంటల) వార్తా ఛానెళ్లలో ‘బ్రేకింగ్ న్యూస్’కు గల ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. నేడు ఏ వైపు చూసినా, యావత్‌ ప్రపంచం ‘బ్రేకింగ్ న్యూస్’ ధోరణిలో కొట్టుకుపోతున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి ఉరుకుల పరుగుల వాతావరణం నడుమన మీరు ఈ సదస్సును నిర్వహించడమే కాకుండా ఇందులో భాగస్వాములయ్యారు. అందుకే, మీరు ప్రత్యేకంగా అభినందనార్హులు. ఈసారి మీరెంచుకున్న చర్చనీయాంశం “గ్రేట్ పవర్ ఇండియా: నేషన్ ఫస్ట్” (అగ్రశక్తి భారత్: దేశమే ప్రథమం)కూడా అత్యంత ప్రధానమైనదే.

మిత్రులారా!

మన ఇతిహాసాలు “యతో ధర్మస్తతో జయః!” అని ప్రబోధిస్తున్నాయి... అంటే- ‘‘ఎక్కడ ధర్మం వర్ధిల్లుతుందో అక్కడ విజయం సిద్ధిస్తుంది” అని అర్థం. ధర్మం అంటే కర్తవ్యం.. ధర్మమంటే న్యాయం...  ధర్మమం సమానత్వం.. ధర్మమంటే సంభాషణ.. ధర్మమంటే కరుణ. ‘దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తిలో నిండి ఉన్నది వీటన్నిటి సారాంశమే! భారతదేశం తన శక్తిసామర్థ్యాలను ఈ కోణంలోనే చూస్తూ, ఈ త్రాసుతోనే బేరీజు వేసుకుంటుంది.

 

మిత్రులారా!

భారత్‌కు గల మరో విశిష్ట లక్షణాన్ని ప్రపంచం ఇవాళ గుర్తించింది. ఏదైనా సంఘటనపై మన దేశం క్షణికావేశంతో స్పందించదు. అభివృద్ధిని, విధ్వంసాన్ని...  రెండింటినీ చూసిన, అనుభవించిన, తట్టుకుని నిలబడిన దేశం మనది. యుగాల నాటి జ్ఞాపకాలను, సహస్రాబ్దాల స్మృతులను నిత్య చైతన్యంతో నిలబెట్టుకున్న దేశం మనది. అందుకే, ఈ విషయాన్ని నేను పూర్తి బాధ్యతతో, అనంత ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాను- ఈ రోజున భారత్‌ ఏం చేస్తున్నదో అది- రాబోయే వెయ్యేళ్ల భవిష్యత్తును నిర్దేశిస్తుంది. భారత దేశం ప్రపంచానికి చేస్తున్న గొప్ప వాగ్దానం ఇదే. భారత్‌ శరవేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు... విశ్వసనీయమైనది కూడా. ఈ ఎదుగుతున్న శక్తిని- మీ నిఘంటువును విస్తరించడం ద్వారా మీరు ‘అగ్రశక్తి’ (సూపర్ పవర్) అంటున్నప్పటికీ... నేను మాత్రం భారత్‌ ఒక ‘విశ్వసనీయ శక్తి’ అని ఘంటాపథంగా చెబుతాను. కొద్ది రోజుల కిందటే నేను జి7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని తిరిగి వచ్చాను. నేటి భారత్‌కు ‘దేశమే ప్రథమం’ అనేది మహా మంత్రం! అత్యున్నత సూత్రమని అందులో పాల్గొన్న ప్రతి దేశం, ప్రతి నాయకుడు బాగా అవగతం చేసుకున్నారు.

మిత్రులారా!

మా ప్రభుత్వం ఇటీవలే పుష్కర కాలం (12 ఏళ్లు) పూర్తి చేసుకుంది. ఈ విశిష్ట ఘనతను కరతాళ ధ్వనులతో అభినందించేలా అర్ణబ్ కూడా మిమ్మల్ని ఈ వేదిక మీదినుంచి ప్రోత్సహించారు. ఈ పన్నెండేళ్ల విజయాలను పరిశీలిస్తే- ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు, ప్రతి ప్రయత్నానికీ దన్నుగా నిలిచింది ‘దేశమే ప్రథమం’ అనే సూత్రమేనని స్పష్టమవుతుంది. ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ నుంచి ‘మేక్ ఇన్ ఇండియా’ వరకు, ఖాదీకి ప్రాధాన్యం నుంచి స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం దాకా- ప్రతి కార్యక్రమం విజయవంతయమైంది. దేశ ప్రజలు జాతి ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యమిచ్చి తమ కర్తవ్యం నిర్వర్తించడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో దేశ పౌరులందరికీ శిరసాభివందనం చేస్తున్నాను.

మిత్రులారా!

ఇప్పుడిక్కడ మన సహచరులు శ్రీ శ్రీధర్ వెంబు మనతో ఉన్నారు. మన పారిశ్రామికవేత్తలు ‘దేశమే ప్రథమం’ స్ఫూర్తితో ముందడుగు వేసినప్పుడు... దేశం అవసరాలను అర్థం చేసుకుని లక్ష్యనిర్దేశం చేసుకున్నపుడు గొప్ప సంస్థలు రూపుదిద్దుకోవడమే కాదు... దేశం పురోగమిస్తుంది. ఈ నేపథ్యంలో వెంబు గారి కృషిపై ఇక్కడెంత చర్చ సాగిందో తెలియదుగానీ, ఇటీవల ఫ్రాన్స్‌లోని ‘వివాటెక్’ కార్యక్రమానికి హాజరైనప్పటి సంగతి చెబుతాను. అందులో దాదాపు 1.5-2 లక్షల మంది యువత పాల్గొన్నారు. వారు ప్రదర్శించిన ఆవిష్కరణల స్టాల్స్‌ను సందర్శిస్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు, నేను ‘జోహో’ (Zoho) స్టాల్ వద్దకు చేరుకున్నాం. అక్కడి నవ్యావిష్కరణపై ఆసక్తితో ఐరోపా యువత పెద్ద సంఖ్యలో గుమిగూడటం చూసి నేనెంతో ఆశ్చర్యపోయినా, అంతకన్నా ఎక్కువగా గర్వపడ్డాను. భారత్‌లో బహుశా దీనిపై అంతగా చర్చ సాగి ఉండకపోవచ్చు. అయితే, ఫ్రాన్స్‌లో నా కంటబడిన దృశ్యం అత్యద్భుతం... ఇందుకుగాను మీకు అభినందనలు.

 

మిత్రులారా!

ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల్లో ‘దేశమే ప్రథమం’ అనే సూత్రం ప్రభావాన్ని మన గిరిజన ప్రాంతాల్లో స్పష్టంగా చూడవచ్చు. నేనిప్పుడు తత్త్వశాస్త్రం బోధించడం కాకుండా ప్రభుత్వ  పనితీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి కొన్ని సర్వసాధారణ ఉదాహరణలను ఉటంకిస్తాను. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల గురించి చెబుతున్నాను. దాదాపు 10 కోట్లకు పైగా గల గిరిజన సమాజం చుట్టూ దశాబ్దాలుగా మావోయిస్టు భీభత్సం పాతుకుపోవడం మనందరికీ తెలుసు. నేటి 21వ శతాబ్దంలోనూ ఆ తీవ్రవాదులు గిరిజన ప్రాంతాలకు ఒక్క సౌకర్యాన్ని కూడా చేరనివ్వలేదు. ప్రభుత్వ వాహనమేదీ వెళ్లే వీల్లేని పరిస్థితి ఉండేది. అడపాదడపా వెళ్తే వాటిపై తూటాల వర్షం కురిపించేవారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. వెళ్లాయి.. మరెన్నో తరాలు గడిచాయి. ఈ హింసాత్మక పీడ ఇక శాశ్వతమై పోతుందేమో అనిపించింది... 2004-2014 మధ్య ఆ పదేళ్లలో... 17,000కు పైగా హింసాత్మక సంఘటనల్లో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. దాదాపు 7,000 మంది ప్రాణాలు కోల్పోయారు.. దీన్నిబట్టి పరిస్థితులు ఎలా ఉండేవో మీరు ఊహించుకోవచ్చు!

మిత్రులారా!

ఇవాళ్టి మీ వార్తా పత్రికకు లేదా ఓ అరగంట పాటు సాగే టీవీ చర్చకు ‘మావోయిస్టు ఉగ్రవాదం అంతం’ అన్నది ఓ శీర్షిక కావచ్చు. అయితే, పరిస్థితులు అంత సులభంగా వాస్తవ రూపం దాల్చవు. అందుకు అవిరళ, అపార కృషి అవశ్యం కాబట్టే, నేను సవివరంగా చెప్పాలని భావిస్తున్నాను. దేశంలో కొందరు నేడు రాజ్యాంగాన్ని చేతబట్టుకుని ఊపుతూ కనిపిస్తారు. కానీ, వారు అధికారంలో ఉండగా, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ‘రాజ్యాంగం’ అనే పదం వినిపించినా, కాల్పులు తప్పేవి కాదు. ఆనాడు వారు వణికే చేతులతో రాజ్యాంగాన్ని కనీసం ముట్టుకోలేక నిశ్శబ్దంగా ఉండిపోయారు. నాటి బాధాకరమైన పరిస్థితులేవీ కాంగ్రెస్‌పై పెద్దగా ప్రభావం చూపలేదు.

మిత్రులారా!

అయితే, 2014 తర్వాత ‘దేశమే ప్రథమం’ స్ఫూర్తితో పరిస్థితులను మార్చడానికి మేం ముందడుగు వేశాం. ప్రకటనలు... మాటల్లో కాకుండా చేతల్లో చేవ చూపాం. నక్సలిజం-మావోయిజం సమూల నిర్మూలనకు కృతనిశ్చయంతో కదిలాం. ఆ దృఢ సంకల్పం ఫలితాన్ని ఇవాళ యావద్భారతం ప్రత్యక్షంగా చూస్తోంది. దేశంలో నేడు మావోయిస్టు ఉగ్రవాదం కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.

 

అయితే, మిత్రులారా!

అంతిమ ఫలితం ఎంత విస్తృతంగా... గణనీయంగా, అద్భుతంగా ఉంటుందంటే- దాని వెనుక గల కఠోర శ్రమకు గుర్తింపు లభించదు. ఈ వాస్తవాన్ని నేను ప్రత్యేకించి రిపబ్లిక్ టీవీ వీక్షకులకు చెప్పాలని భావిస్తున్నాను.

మిత్రులారా!

అపహరణ, దోపిడీ లేదా లూటీకి భయపడి పగటివేళ బయట అడుగు పెట్టడానికైనా సామాన్యులు వణికిపోయే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి గురించి మాట్లాడటం కూడా అసాధ్యం. కానీ, ప్రగతి సాధనపై ప్రతినబూని ముందుకు సాగాం కాబట్టే, గత 12 ఏళ్లలో ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో 12,000 కిలోమీటర్లకు పైగా పొడవైన రహదారులను నిర్మించగలిగింది. ఈ క్రమంలో నక్సలైట్లు ఎన్నోసార్లు నిర్మాణ పరికరాలను దహనం చేశారు... కాంట్రాక్టర్లను తరిమికొట్టారు. ఒక రహదారిపై 25 మంది పనిచేయాల్సి వస్తే, వారికి రక్షణగా 200 మంది పోలీసులను మోహరించాల్సి వచ్చింది. ఏదేమైనా మా సంకల్పాన్ని సాకారం చేయడమే లక్ష్యంగా ముందుకే వెళ్లాం తప్ప వెనకడుగు వేసింది లేదు.

మిత్రులారా!

అదేవిధంగా 9,500కు పైగా మొబైల్ టవర్లను నిర్మించాం. గతంలో ఒక్కటి ఏర్పాటు చేయడమే గగనం... ఎందుకంటే, దాన్ని తక్షణం ధ్వంసం చేసేవారు. ప్రజల్లో ఆగ్రహావేశాలలు రెచ్చగొట్టడమే వారి నిత్యకృత్యం. కానీ, ఆ పరిస్థితులు అధిగమించి దాదాపు 45,000 గ్రామాలకు మొబైల్ అనుసంధానం కల్పించాం. నక్సల్ ప్రభావిత జిల్లాల్లో 1,800కు పైగా బ్యాంకు శాఖలను ప్రారంభించాం. సుమారు 75,000 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించడంతోపాటు 6,000కు పైగా కొత్త తపాలా కార్యాలయాలను ఏర్పాటు చేశాం. మిత్రులారా... ఈ క్రమంలో మేం బాంబులు, తుపాకులు, తూటాలపైన మాత్రమే ఆధారపడకుండా ప్రజల హృదయాలను గెలుచుకోవడానికి దైవం ప్రసాదించిన ప్రతి రక్తపుబొట్టునూ వెచ్చించాం.

 

మిత్రులారా!

సామాన్యుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే దృఢ సంకల్పంతో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లాం. ఓ పేరు మోసిన నక్సలైట్‌ను పట్టిస్తే ప్రభుత్వం కోట్ల రూపాయల పారితోషికం ప్రకటించిన నేపథ్యంలో మేమిచ్చిన తొలి రేషన్ కార్డును అతని తల్లి అందుకున్నదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. తన కొడుకు ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నాడు కాబట్టి, ఆమెకు మేమీ కార్డు ఇప్పించలేదు... ఇలాంటి ఉదంతాలెన్నో ఉన్నాయి. అప్పటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా మౌనం దాల్చడం నాకెంతో దిగ్భ్రాంతి కలిగించింది. అయితే, మా కృషి ఫలితంగా ప్రజల్లో విశ్వాసం మళ్లీ చిగురించింది. ఈ రోజు బస్తర్‌ ప్రాంతం ఎలా ఉందో గమనించండి... నిత్యం బాంబులు, తుపాకుల మోతమోగే ఆ ప్రాంతంలో ‘బస్తర్ ఒలింపిక్స్‌’ను ఎంతో ఉత్సాహంతో నిర్వహించుకున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఈ క్రీడోత్సవాలను నిర్వహించగా- తొలిసారి 1.5 లక్షల మందికి పైగా, రెండో దఫా దాదాపు 4 లక్షల మంది యువకులు పాల్గొన్నారు. ఒకప్పుడు ఉగ్రవాదం ఉరిమిన చోట ఇప్పుడు ప్రతిభ మెరుస్తుండగా, క్రీడలు వర్ధిల్లుతున్నాయి.

మిత్రులారా!

నిరాశనిస్పృహల నుంచి బయటపడి ఆశలు, ఆకాంక్షలతో నిండిన భారత దేశానికి రూపుదిద్దడం గడచిన 12 ఏళ్ల మా సేవా కాలంలో సాధించిన గొప్ప విజయాలలో ఒకటి.

మిత్రులారా!

నక్సలిజం ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉండవచ్చుగానీ, దాని దుష్ఫలితాలను దేశం నలుమూలలా ప్రజలు అనుభవించాల్సి వచ్చింది. కాబట్టే, నక్సలిజం అంతమవుతోందన్న వార్త, ఆ నమ్మకం ప్రభావిత ప్రాంతాలకే పరిమితం కాకుండా దేశమంతటా విస్తరించింది. అంతకుముందు 2014దాకా పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజల అసంతృప్తి పాలనకు మాత్రమే పరిమితం కాలేదు... నిరాశనిస్సృహలు అంతకన్నా దట్టంగా అలముకున్నాయి. ఇక ఏదీ మారదు... ఏదీ మెరుగుపడదు అనుకుంటూ దేశం ఆశలు వదిలేసుకుంది.

మిత్రులారా!

కానీ, భారత్‌ గత 12 ఏళ్లలో నిరాశను ఆశగా మలచుకోవడం నాకెంతో సంతృప్తినిస్తోంది. స్వల్ప కృషితోనే అనల్ప విజయాలు సాధించవచ్చునని నేడు ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. “ఇది అసాధ్యం.. దుస్సాధ్యం” అనుకుంటూ కుంగిపోయే రోజులు పోయాయి... ఆ శకం ముగిసింది. ఇప్పుడు “ఇది కచ్చితంగా సాధ్యమే”ననే స్ఫూర్తి నిలువెల్లా నిండుగా ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఈ కొత్త ఆత్మవిశ్వాసమే భారత్‌ సాధించిన వాస్తవ విజయం... ఇదే అసలైన శక్తి. సవాళ్లు ఉన్నాయి... ఎప్పుడూ ఉంటాయి... కొత్త రూపాల్లో వస్తుంటాయి కూడా. కానీ, అవి ఏ రూపంలో వచ్చినా, మనం మొక్కవోని దీక్షతో పోరాడి అధిగమిస్తాం. ఆ విధంగా “ఇది సాధ్యమే... మనం చేయగలం” అనే నమ్మకంతో దేశం ముందడుగు వేస్తేనే కలలు సాకారమవుతాయి.

 

మిత్రులారా!

ఇప్పుడిక దేశంలోని 100కు పైగా జిల్లాలు, 500కు పైగా సమితుల గురించి చెప్పాలని భావిస్తున్నాను. అభివృద్ధి సంబంధిత ప్రతి అంశంలోనూ ఇవి ఎన్నో ఏళ్లుగా వెనుకబడి ఉండేవి. అందుకే గత ప్రభుత్వాలు వీటిపై “వెనుకబడిన జిల్లాలు, సమితులు”గా ముద్ర వేశాయి. ఈ విస్తృత ప్రాంతాలో వెనుకబాటనే నిరాశ నుంచి బయటపడి, అభివృద్ధిపై ఆకాంక్షలు రగిలించాం. ఈ కృషిలో తొలుత వాటిమీద పడిన ముద్రను తొలగిస్తూ “ఆకాంక్షాత్మక జిల్లాలు, సమితులు”గా ప్రకటించాం. వీటికోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి, అభివృద్ధి సంబంధిత ప్రతి అంశంపై ప్రభుత్వం శ్రద్ధగా పనిచేయడం ప్రారంభించింది. ఒక్కో జిల్లాలో అధిగమించాల్సిన 3 లేదా 6 అంశాలను గుర్తించి, ప్రత్యేకంగా  దృష్టి సారించాం. ఫలితంగా ఒకనాడు అభివృద్ధికి నోచని, ఈ జిల్లాలు, సమితులు నేడు ఆయా రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి సారథులుగా మారాయి. ఈ ప్రాంతాల ప్రజలు ఒకనాడు పేదరికం, వనరుల లేమితో సతమతం అయ్యేవారు. ఈ పరిస్థితుల నడుమ కొన్నేళ్లలోనే 25 కోట్ల మంది పేదలు పేదరిక విముక్తులు కాగా, ఈ విజయంలో ఆకాంక్షిత జిల్లాలు ప్రధాన పాత్ర పోషించాయి.

మిత్రులారా!

ఒక వ్యక్తి అనారోగ్యం నుంచి కోలుకుంటే, అతనికి మాత్రమేగాక కుటుంబం మొత్తానికీ ఊరట కలుగుతుంది. అదేవిధంగా కొడుకు లేదా కూతురు ఏదైనా సాధిస్తే, ఆ విజయం వారొక్కరిదే కాదు... కుటుంబమంతా గర్వంతో, ఆత్మవిశ్వాసంతో పొంగిపోతుంది. అలాగే, ఎవరైనా పేదరికం నుంచి బయటపడితే సమాజమే కాదు... యావద్దేశం ప్రయోజనం పొందుతుంది. కాబట్టి, 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడి నవ్య మధ్యతరగతిలో ప్రవేశించినప్పుడు అది ఆ కుటుంబాలకే కాదు... మధ్యతరగతికీ ప్రయోజనకరమే. ఎందుకంటే- మన ఆర్థిక వ్యవస్థను నడిపించే కొత్త వినియోగదారులు వీరే... అంతిమంగా ఈ పరిణామం మధ్యతరగతి అవకాశాలను ఇనుమడింపజేస్తుంది. అందువల్ల, పేదరిక నిర్మూలన సంక్షేమ సంబంధితం మాత్రమే కాదు... ఇది అవకాశాలను విస్తరించే గాథ, నవ్యాకాంక్షలకు మూలం.

మిత్రులారా!

దేశంలో విస్తరించిన మధ్యతరగతి గత 12 ఏళ్లలో ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశంగా మారింది. మధ్యతరగతి ప్రజల జీవన సౌలభ్యం కోసం ప్రభుత్వం ప్రతి స్థాయిలోనూ కృషి చేసింది. ముఖ్యంగా సొంతింటి కలనే పరిగణలోకి తీసుకుంటే- ప్రతి కుటుంబానికి అదొక స్వప్నం. కానీ, 2014లో ఇల్లు కొనాలనుకుంటే, గృహ రుణాలపై వడ్డీ రేట్లు రెండంకెల స్థాయిలో ఉండేవి కాగా, ఇవాళ బ్యాంకుల నుంచి 7-8 శాతం వడ్డీతో రుణం లభిస్తోంది. ఇక ఆ రుణం మంజూరు చేయించుకోవడం లోగడ ఓ పెద్ద యుద్ధం గెలవాల్సినంత ప్రయాస పడాల్సి వచ్చేది. బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి రావడంతో వ్యయప్రయాసలు తప్పేవి కాదు. నేడు ఇంట్లో కూర్చునే ఆ పని సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో పట్టణ మధ్యతరగతి కోసం ఉద్దేశించిన వేలాది ఇళ్ల నిర్మాణం అర్థాంతరంగా ఆగిపోవడం అందరికీ తెలిసిందే. ఎన్నో కుటుంబాలు జీవితమంతా శ్రమించి కూడబెట్టుకున్న సొమ్ము బిల్డర్ల పాలైంది. ఆకర్షణీయ కరపత్రాలతో కలల్లో విహరింపజేసిన  బిల్డర్లు ఇళ్ల నిర్మాణం మాత్రం పూర్తి చేయలేదు. అంతులేని నిరీక్షణతో అలసిపోవడమే కాకుండా అద్దె భారంతో కుటుంబాలు కుంగిపోవాల్సి వచ్చింది. అదెంతో దారుణమైన పరిస్థితి... అటువంటి స్తంభించిన ప్రాజెక్టులెన్నిటినో పూర్తి చేయించడానికి మేం ₹25,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశాం. దీనివల్ల చిరకాలం కలగా మిగిలిపోయిన దాదాపు 60,000 ఇళ్లు ఇప్పుడు లబ్ధిదారులకు సొంతమయ్యాయన్నది మీకెంతో సంతోషాన్నిచ్చే వార్త అవుతుందనడంలో సందేహం లేదు.

 

మిత్రులారా!

దేశంలో రవాణా, అనుసంధానం మన దైనందిన జీవితాలను ప్రభావితం చేసిన మరో అంశం. ఇవాళ సామాజిక మాధ్యమాలను గమనిస్తే, ప్రపంచ పర్యాటకులంతా మన మెట్రో వ్యవస్థను చూసి ఆశ్చర్యపోతున్నారు.

మిత్రులారా!

మన దేశంలో 2014 నాటికి నిత్యం సుమారు 28 లక్షల మంది మెట్రోను వినియోగించుకోగా, నేడు దాదాపు 1.28 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. ఇక ఇప్పుడు వందే భారత్, నమో భారత్, అమృత భారత్ వంటి హై-స్పీడ్ రైళ్లు దేశాన్ని ఒకటి చేస్తున్నాయి. మెరుగైన రోడ్లు, జాతీయ రహదారులతో సమయం ఆదా కావడమేగాక వాహన నిర్వహణ ఖర్చులు కూడా బాగా తగ్గాయి. ఇటీవల దేశంలో విమానాశ్రయాల సంఖ్య కూడా రెట్టింపై, అనేక చిన్న నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు తొలిసారి విమాన ప్రయాణ అవకాశం లభించింది.

మిత్రులారా!

భారత దేశం గత 12 ఏళ్లలో మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని మాత్రమేగాక వారి పొదుపును కూడా పెంచింది. మధ్యతరగతిపై 2013-14లో సుమారు ₹2 లక్షల దాకా ఆదాయంపై పన్ను భారం ఉండేది.. కానీ, ఇవాళ ₹12 లక్షల దాకా ఆదాయంపై పన్ను లేదు. మరో మాటలో- పన్ను రహిత ఆదాయం అనేక రెట్లు పెరిగింది.

మిత్రులారా!

జీఎస్టీ సంస్కరణలు మధ్యతరగతి ఎంతో సౌకర్యాన్నిచ్చాయి. పన్ను రిటర్నుల దాఖలు సులువు కావడంతో సమయం, డబ్బు రెండూ ఆదా అవుతున్నాయి. అదేవిధంగా ఆదాయపు పన్ను రిటర్న్‌లను కూడా ఇంటి నుంచే దాఖలు చేయవచ్చు. ప్రత్యక్ష హాజరీతో నిమిత్తం లేకుండా సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయి.

 

మిత్రులారా!

మధ్యతరగతి కుటుంబాలకు మధుమేహం, ఇతర జీవనశైలి అనారోగ్యాల చికిత్స ఒక ప్రధాన వ్యయం. జనౌషధి కేంద్రాల్లో సంబంధిత మందులు 80 శాతం తగ్గింపుతో లభిస్తాయి. లోగడ మందుల కోసం ₹1,000 ఖర్చు చేయాల్సి వస్తే, ఇవాళ కేవలం ₹200 మాత్రమే వెచ్చిస్తున్నారు... అంటే- ₹800 ఆదా అవుతోంది. దీనివల్ల లెక్కలేనన్ని కుటుంబాలకు దాదాపు ₹40,000 కోట్లదాకా సొమ్ము ఆదా అయింది. ఇక మధ్యతరగతి బడ్జెట్‌లో మరికొంత భాగం వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు కేటాయించక తప్పదు. అలాంటి కుటుంబాలపై ఆర్థిక భారం తప్పిస్తూ 70 ఏళ్లు దాటిన ప్రతి వృద్ధుడికీ ₹5 లక్షల దాకా ఉచిత చికిత్స లభిస్తుంది.

మిత్రులారా!

సౌకర్యాలు నిత్యకృత్యమైనప్పుడు గతకాలపు కష్టాలను మరచిపోవడం మానవ నైజం. ఇంతకుముందు మీరు ₹2 లక్షల ఆదాయంపైనా పన్ను చెల్లించేవారు.. ఇప్పుడు ₹12 లక్షల దాకా పన్ను భారం లేదు. అయిన్పటికీ, ఈ వాస్తవాన్ని గుర్తుచేస్తేనే కరతాళధ్వనులు మారుమోగుతాయి. మరోవైపు బస్సు లేదా రైలు ఆలస్యమైతే, ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి... అలా గళమెత్తే వర్గమిదే.

మిత్రులారా!

నేను ఇంతకుముందే చెప్పినట్లు... ప్రజలు పాత కష్టాలను సులువుగా మరచిపోతారు. ఎలాగంటే- డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ కోసం మీరు పడిన అవస్థలు ఇప్పుడు మీకు గుర్తున్నాయా? లోగడ అదొక పోరాటం... కానీ, ఇవాళ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం సులువు.. పాస్‌పోర్ట్‌ సాధారణంగా మూడు రోజుల్లోనే జారీ అవుతుంది.

మిత్రులారా!

మా ప్రభుత్వ పనితీరు ప్రజల్లో ఎన్నో ఆశలు పెంచిందని నాకు తెలుసు. ఒక అవసరం తీరగానే, ప్రజలు వెంటనే అంతకంటే మెరుగైన, ఉన్నతమైన దాన్ని కోరుకుంటారు. ఒకప్పుడు కొత్త రోడ్డు కావాలన్నవారే, ఇప్పుడది పూర్తయ్యాక “మెట్రో ఎప్పుడొస్తుంది?” అంటారు. ఒకనాడు రైళ్లు సమయానికి రావాలని, సీట్లు శుభ్రంగా ఉండాలని ఆశించేవారు కాగా, నేడు “మా ఊరి మీదుగా వందే భారత్ రైలు ఎందుకు నడపరు?” అని  అడుగుతున్నారు.

 

మిత్రులారా!

ప్రజల నుంచి వచ్చే ఈ డిమాండ్లు కొందరికి అసంతృప్తిగా కనిపించవచ్చు. వాస్తవానికి అది మరింత ఉన్నతంగా ఎదగాలన్న ఆకాంక్షకు ప్రతీక. కాంగ్రెస్ పార్టీ కూడా తరచూ “మోదీ జీ.. ఇది చేయాలి.. అది చేయాలి” అంటూంటుంది. అంటే- పనులు చేసి చూపగల సామర్థ్యం ఈ ప్రభుత్వానికే ఉందని దానర్థం.

మిత్రులారా!

కలలు సాకారం కాగలవన్న నమ్మకం ఉన్నచోటే మరిన్ని ఆశలు పుట్టుకొస్తాయి. ఈ దేశ యువత, పేదలు, మధ్యతరగతి ప్రజల ఆశలివే... నేడు, బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వాలకు ప్రధాన చోదక శక్తిగా ఇదే.

మిత్రులారా!

ఒకవైపు దేశంలోని అధికశాతం ప్రజల్లో ఆకాంక్షలు అధికంగా ఉంటే, మరోవైపు “నిత్య వ్యతిరేకత”ను జీవనశైలిగా మార్చుకున్న రాజకీయ వర్గం ఒకటుంది. ఇది నిరంతర అసంతృప్తితో రగులుతూంటుంది. వారెవరో గుర్తించేందుకు వీలుగా రిపబ్లిక్ టీవీ వీక్షకులతో కొన్ని లక్షణాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను. వారు “ఇక్కడ 24 గంటల విద్యుత్తు సరఫరా ఎందుకు లేదు?” అని ప్రశ్నిస్తారుగానీ, మరునాడే ఆనకట్టలు, సోలార్ పార్కులు, థర్మల్ ప్లాంట్లు లేదా అణు విద్యుత్ ప్రాజెక్టులపై నిరసన చేపడతారు. ఈరోజు విద్యుత్తు లేదన్నవారే మరుసటి రోజున విద్యుదుత్పాదనను వ్యతిరేకిస్తారు. ఒకప్పుడు ఖనిజాల తవ్వకాన్ని వ్యతిరేకించిన వారే, నేడు దేశంలో అరుదైన ఖనిజ నిల్వలు, సరఫరా వ్యవస్థలు ఎక్కడున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఇతర దేశాల్లాగా విద్యుత్‌ వాహన వ్యవస్థ భారత్‌లో ఎందుకు లేదని అడుగుతారు. ఒకప్పుడు “డేటా ముఖ్యమా... ఆహారం ముఖ్యమా?” అంటూ చర్చ లేవదీసిన వారే ఇవాళ భారత్ ఏఐ రంగంలో చేసిందేమిటని నిలదీస్తున్నారు. ఇటు ఏఐ మరింత అభివృద్ధి చెందాలంటూనే అటు డేటా సెంటర్లు, సెమీకండక్టర్ ప్లాంట్లను వ్యతిరేకిస్తూ సామాజిక మాధ్యమాల్లో, టీవీ చర్చల సందర్భంగా వార్తాపత్రికల కథనాల్లో అంతులేని లోపాలను అన్వేషిస్తుంటారు.

మిత్రులారా!

ప్రపంచం ముందు భారత్‌ను దోషిగా నిలపడానికి వీరు అంతర్జాతీయ అవినీతి సూచీలను ప్రస్తావిస్తారు. వారి అనుకూల మీడియా దాన్ని 24 గంటలూ ప్రచారం చేస్తుంది. కానీ,  అవినీతిపై చర్యలు తీసుకుంటే మాత్రం దాడులు, విచారణలతో వేధింపులని ఆరోపిస్తూ గగ్గోలు పెడతారు. ఎప్పుడో తీసుకెవాల్సిన చర్యలు ఇప్పుడెందుకు తీసుకున్నారు. ‘ఎ’ మీదనే ఎందుకు... ‘బి’ మీద ఎందుకు తీసుకోరు? అని యాగీ చేయడం వారి వికృత క్రీడ.

మిత్రులారా!

ఇటువంటి వారి స్వభావాన్ని దేశం అర్థం చేసుకోవడం అత్యావశ్యకం. ముఖ్యంగా మన యువతరం... మరీ ముఖ్యంగా ‘జెన్ జీ’ వీరిని త్వరగా గుర్తించాలి. లేకపోతే, నేను చెప్పినట్లు “సూర్యవంశీ వచ్చేశాడు”, అతడు చక్కగా వివరిస్తాడు.

మిత్రులారా!

సాయుధ దళాలకు స్వేచ్ఛ, ఆధునిక ఆయుధాలు లేవని ఈ వ్యక్తులు వాదిస్తారు. కానీ,  ప్రభుత్వం ఒక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నా, ఆయుధాలు కొనుగోలు చేసినా ఇప్పుడెందుకని ప్రశ్నించే వారిలో వీరే ముందుంటారు. ప్రపంచవ్యాప్తంగా భారత దౌత్యనీతిని వీరు సవాలు చేస్తారు కానీ, దౌత్యం సహా భద్రత కోసం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మిస్తే, గట్టిగా నిరసన తెలుపుతారు.

మిత్రులారా!

ఇలాంటి కీలక తరుణంలో భారత్‌ అలాంటి వ్యక్తులను గుర్తించి, తప్పుదోవ పట్టించే  వాదనలను అర్థం చేసుకుని, అప్రమత్తంగా వ్యవహరించాలి. దురదృష్టవశాత్తూ, నేడు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ అటువంటి అరాచక శక్తుల చేతిలోకి వెళ్లిపోయింది. గాంధీజీ కాలం తరహాలో కాంగ్రెస్ ఇప్పుడు ‘దేశమే ప్రథమం’ అని మాట్లాడుతుందన్న ఊహ ఇవాళ కేవలం ఓ కల!

మిత్రులారా!

ప్రపంచం ఇవాళ కాలం చెల్లిన విధానాలను సవాలు చేస్తోంది. అలాగే, ఈ మార్పుల స్థాయి కూడా అసాధారణమైనది కాగా, కొత్త సవాళ్లు కొత్త అవకాశాలను కూడా తెస్తాయి. దేశంలోని ప్రతి యువకుడు, పారిశ్రామికవేత్త, ఆవిష్కర్త, అంకుర సంస్థ ఈ అవకాశాలపై నిశితంగా దృష్టి సారించాలి. ‘దేశమే ప్రథమం’ స్ఫూర్తితో ప్రభుత్వం కూడా ప్రజలకు పూర్తి చేయూతనిస్తోంది. భారత్‌ ఇప్పుడు ‘సంస్కరణల ప్రస్థానం’లో శరవేగంగా దూసుకెళ్తోంది. ఈ వేగం మరింత పుంజుకోవడం తథ్యం. ‘రిపబ్లిక్ టీవీ’ వేదికగా నేను మరోసారి చెబుతున్నాను: మన కలలు విస్తృతం... మన కృషి అపారం... 140 కోట్ల మంది భారతీయుల సామూహిక ప్రయత్నం అభివృద్ధి చెందిన దేశాన్ని రూపుదిద్దుతుంది. ఆ వికసిత భారత్‌ను మీలో అనేకమంది స్వయంగా చూడగలరని నేను వాగ్దానం చేస్తున్నాను. దీని కోసం భవిష్యత్తరాలు ఎంతో కాలం వేచి చూసే అవసరం లేదు. ఇదే విశ్వాసంతో రిపబ్లిక్ టీవీ, దాని వీక్షకులు సహా ఈ కార్యక్రమానికి హాజరైన మీకందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

అనేకానేక ధన్యవాదాలు!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Inspiring India: Gujarat Woman's Solar Mission Earns PM Modi’s Praise, Invitation to I-Day Ceremony

Media Coverage

Inspiring India: Gujarat Woman's Solar Mission Earns PM Modi’s Praise, Invitation to I-Day Ceremony
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi calls upon people to celebrate National Handloom Day by showcasing India's rich handloom heritage
August 06, 2026

The Prime Minister, Shri Narendra Modi, has called upon citizens to celebrate National Handloom Day on 7th August by promoting India's rich and diverse handloom traditions.

“Share your videos with your favourite handloom products, including GRWM videos on social media”, Shri Modi said.

Shri Modi posted on X;

Tomorrow, 7th August is National Handloom Day. Let’s make India’s handloom diversity popular.

Share your videos with your favourite handloom products, including GRWM videos on social media.

Don’t forget to use #NationalHandloomDay.