రాజ్యసభలో ప్రధాని ప్రసంగం

Published By : Admin | April 17, 2026 | 11:10 IST
PM Congratulates Shri Harivansh on Historic Third Term as Rajya Sabha Deputy Chairman

గౌరవ చైర్మన్ గారూ,

సభ తరఫునా, నా తరఫునా శ్రీ హరివంశ్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా వరుసగా మూడోసారి ఎన్నికవడమే సభకు మీపై ఉన్న ప్రగాఢమైన విశ్వాసానికి నిదర్శనం. నిజానికి మీ అనుభవం ద్వారా గతంలో పొందిన ప్రయోజనాలకూ, అందరినీ కలుపుకొనిపోయిన మీ కృషికీ సభ ఈ విధంగా ఆమోదముద్ర వేసింది. అనుభవానికి, సహజమైన పనితీరుకు దక్కిన గౌరవమిది. ఆ సహజమైన పనిశైలికి ఇది ఆమోదం కూడా. హరివంశ్ గారి నేతృత్వంలో ఎంత ప్రభావవంతంగా సభ బలోపేతమైందో మనమంతా చూశాం. ఆయన సభ కార్యకలాపాలను నిర్వహించడమే కాదు.. తన జీవితానుభవాన్ని నిశితంగా ఉపయోగిస్తూ సభ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. సభా వ్యవహారాలన్నింటా, నిర్వహణలో, సభ వాతావరణంలో పరిణతిని పెంచడంలో ఆయన అనుభవం ఎంతగానో తోడ్పడింది. డిప్యూటీ చైర్మన్ ఈ కొత్త పదవీకాలం కూడా అదే స్ఫూర్తితో, సమతౌల్యంతో, నిబద్ధతతో సాగుతుందన్న దృఢమైన విశ్వాసం నాకుంది. మనందరి కృషితో సభ గౌరవం మరింత ఇనుమడిస్తుందని ఆశిస్తున్నాను.

గౌరవ చైర్మన్ గారూ,

హరివంశ్ గారు ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామంలో జన్మించారు. ఆయన గ్రామీణ నేపథ్యం కారణంగా సహజంగానే విద్యార్థి దశ నుంచే తన గ్రామాభివృద్ధికి ఏదో ఒక విధంగా కృషి చేస్తున్నారు. ఆయన విద్యాభ్యాసం కాశీలో జరిగింది. గతంలో నాకు ఈ విషయాలన్నిటిపైనా మాట్లాడే అవకాశం వచ్చింది. నేను చాలానే చెప్పాను. కాబట్టి ఈ రోజు మళ్లీ వాటినే చెప్పను. ఈ రోజు నేనొక విషయాన్ని తప్పక చెప్పాలి: ఈ రోజు ఏప్రిల్ 17. నేడు మన మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ గారి జయంతి కూడా. 1927 ఏప్రిల్ 17న ఆయన జన్మించారు. ఆయన జయంతి రోజున మీరు మూడోసారి ఈ బాధ్యతను స్వీకరించబోతుండడం విశేషం. చంద్రశేఖర్ గారితో మీకున్న అనుబంధం, ఆయనపై మీకున్న అభిమానం, ఒక విధంగా ఆయన పదవిలో ఉన్నన్నాళ్లూ ఆయనతో మీరు కలిసి పయనించడం... ఇదంతా యాదృచ్ఛికమే. చంద్రశేఖర్ గారి జీవితంపై మీరు పుస్తకాలు కూడా రాశారు. చంద్రశేఖర్ గారి విస్తృతమైన జీవితాన్ని కొత్త తరానికి అందించడంలో గొప్ప కృషి చేశారు. అందుకే, ఆయన జయంతి రోజున మీ మూడో దఫా పదవీకాలం మొదలవడం మీకు చాలా ప్రత్యేకమైన సందర్భం.


 

హరివంశ్ గారి ప్రజా జీవితం కేవలం పార్లమెంటరీ వ్యవహారాలకే పరిమితం కాలేదు. పాత్రికేయ రంగంలో తన ఉన్నత ప్రమాణాలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆయనకు పాత్రికేయ రంగంలో సుదీర్ఘమైన అనుభవముంది. అందులోనూ ఉన్నత ప్రమాణాలనే ప్రాతిపదికగా ఆయన భావించారు. ఆయన రాతల్లో పదును మనందరికీ తెలుసు. కానీ ఆయన మాట, నడతల్లో సౌమ్యత, మర్యాద నిండి ఉంటాయి. నేను గుజరాత్‌లో ఉన్నప్పుడు కూడా ఆయన వ్యాసాలు చదివేవాడిని. ఆయన తన వాదనను చాలా దృఢంగా వినిపించడాన్ని గమనించాను. విస్తృతమైన అధ్యయనంతోనే అవి మనకు అర్థమవుతాయని నాకనిపించేది. పాత్రికేయ రంగంలోనూ నిరంతర కృషితో.. కింది స్థాయి వ్యక్తులనూ చేరుకోవడంలో ఆయన విజయవంతమయ్యారు. సభలో విధానపరంగా గానీ, ప్రక్రియపరంగా గానీ అంతటా అవి ప్రతిబింబిస్తుంటాయి. మనందరికీ ఇదొక ఆహ్లాదకరమైన అనుభవం. సమాజ వాస్తవికతతో ఎంతగానో అనుసంధితమై పనిచేసే వ్యక్తి ఆయన. లోక్‌సభ అయినా, రాజ్యసభ అయినా.. కొత్తగా వచ్చే ఎంపీలు హరివంశ్ గారి నుంచి చాలా నేర్చుకోవచ్చనీ, ఆయనతో సంభాషించడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని నేను కచ్చితంగా చెబుతాను. ఎందుకంటే, ఆయన పాత్రికేయుడిగా ఉన్న సమయంలో ‘మన ఎంపీ ఎలా ఉండాలి?’ అన్న శీర్షికన ఓ కాలమ్ నిర్వహించేవారు. స్వయానా తనే ఆ స్థానంలో కూర్చుంటారని ఆ సమయంలో ఆయనకు తెలిసుండకపోవచ్చు. ఆయన రాసేవారు. వాటిలో ఎంతో విస్తృతి ఉండేది.

సభ గౌరవం, సభ్యుల బాధ్యత, వారి ప్రవర్తన, ఆలోచనల విషయమై ఆయన చాలా లోతైన అధ్యయనం చేశారు. సభలోని మన సహచరులు ఆయనతో కలిసి పనిచేయడం ద్వారా, ఆ అంశాలను ఉపయోగించుకోవడం ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు, ఎన్నో తెలుసుకోవచ్చు. క్రమశిక్షణతో కూడిన జీవితంలో సమయపాలన, విధుల పట్ల నిబద్ధత మీ ప్రత్యేకత. బహుశా ఈ కారణంగానే అందరికీ ఆమోదయోగ్యమైనదిగా మీ వ్యక్తిత్వం ఎదిగింది. మనం చూసే ఉంటాం.. ఆయన రాజ్యసభ సభ్యుడయ్యాక పూర్తి సమయం సభలోనే ఉంటున్నారని నేను కచ్చితంగా చెప్పగలను. చైర్మన్ లేనప్పుడు సభ నిర్వహణ బాధ్యతలను ఆయన నిర్వర్తిస్తారు. కానీ, వేరే సమయాల్లో కూడా.. ఏ కమిటీలోని సభ్యుడెవరు సభలో కూర్చున్నా, ఆయనెప్పుడూ సభలోనే కనిపించేవారు. ఆయన అన్నీ వింటారు. ఆ సమయంలో సభను నడుపుతున్న వారి పనిని గమనిస్తారు. తన బాధ్యత పట్ల ఆయనకున్న అంకితభావం వల్లే ఇది సాధ్యమవుతుంది. ఇది మనమంతా నేర్చుకోవాల్సిన అంశం. నేను గమనించాను.. ఆయన తన సమయాన్నంతా ఈ విషయాలపైనే వెచ్చిస్తారు.

గౌరవ చైర్మన్ గారూ,

డిప్యూటీ చైర్మన్‌గా ఆయన సభను నడిపిన తీరు, సభ్యుడిగా ఆయన సహకారంపై మనం సహజంగానే సానుకూలంగా మాట్లాడుకుంటాం. అయితే సభ బయట ప్రజల మధ్య ఉంటూ తన ప్రజాస్వామ్య, సామాజిక బాధ్యతలను ఆయనెలా నెరవేరుస్తున్నారన్నది మనలాంటి ప్రజా జీవితంలో ఉన్నవారంతా తప్పక గమనించాల్సిన విషయం. మనం దాన్ని తప్పక చూడాలి. నా అనుభవం ద్వారా నేను చెప్పగలను.. ఆయన చేసే పని ప్రశంసనీయం మాత్రమే కాదు, ఆదర్శప్రాయం కూడా. మనది యువభారత్. హరివంశ్ గారు చాలావరకూ యువత మధ్యే సమయాన్ని గడిపేందుకు ప్రాధాన్యమిస్తారు. దేశమంతటా పర్యటిస్తూ.. గంభీరమైన అంశాలపై యువతలో అవగాహన కల్పిస్తూ, ఒక ప్రజా విద్యావేత్తలా ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. మీడియాలో ఎక్కువగా కనిపించే అలవాటు ఆయనకు లేదు. కానీ ఆయన పర్యటనలు, కార్యక్రమాలు మాత్రం నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. నాకున్న సమాచారం ప్రకారం.. 2018లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఆయన వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో దాదాపు 350 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇది నిజంగా అసాధారణం. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో 350 కార్యక్రమాలకు వెళ్లడం, రావడం, విద్యార్థులతో కూర్చుని మాట్లాడడం, వారి కోసం ప్రత్యేకంగా అంశాలను సిద్ధం చేయడం... ఇది నిజంగా ఓ బృహత్కార్యం. అత్యున్నత స్థాయిలో మీరు ఈ పనిని కొనసగించారు. యువతతో మమేకమవ్వాలన్న లక్ష్యం నుంచి మీరు ఎంతమాత్రమూ పక్కకు జరగలేదు. ‘వికసిత భారత్’.. యువత స్వప్నంగా మారాల్సిన ఆవశ్యకతను వివరించారు. విద్యార్థుల మానసిక స్థితికి అనుగుణంగా, వివిధ రకాలుగా ఆయన వివరిస్తుంటారు. విద్యార్థుల్లో, యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ.. వారెప్పుడూ నిరాశకు గురికాకుండా ఎలా ఉండాలో ఆయన చర్చిస్తుంటారు. గతంలో మనం ఆశించిన వేగంతో ఎందుకు ముందుకు సాగలేకపోయామో చారిత్రక ఆధారాలతో ఆయన వివరిస్తారు. ప్రస్తుతం మన ముందున్న అవకాశం గురించి, దేశం వేయగల సుదీర్ఘమైన ముందడుగుల గురించి మాట్లాడుతూ.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే పనిని ఆయన నిరంతరం చేస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో సాహిత్యోత్సవాల ధోరణి పెరిగింది. అవిప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించాయి. హరివంశ్ గారు తరచుగా ఈ ఉత్సవాలకు వెళ్తూ.. సమాజంలోని ఆ వర్గాలను తన ఆలోచనలతో ప్రభావితం చేస్తూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు.

గౌరవ చైర్మన్ గారూ,

ఆయన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి నేను విన్నాను. బహుశా బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం ఇంత కచ్చితంగా ఉండకపోవచ్చు. 1994లో ఆయన తొలిసారిగా విదేశీ పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లారని విన్నాను. అక్కడ కార్యక్రమాల అనంతరం.. ఎక్కడికైనా వెళ్లాలనుందా లేదా ఏదైనా చేయాలనుందా అని ఆయనను అడిగారు. దానికాయన సమాధానమిస్తూ... ‘‘ఇది అభివృద్ధి చెందిన దేశం. ఇక్కడి విశ్వవిద్యాలయాలు ఎలా ఉంటాయి, ఎలాంటి విద్యా విధానమూ సంస్కృతీ అక్కడున్నాయి, ఈ దేశం అంతగా పురోగమించడానికి కారణమేమిటన్నది నేను తప్పక చూడాలి, అర్థం చేసుకోవాలి’’ అని చెప్పారు. తన మొదటి అమెరికా పర్యటనలో నిర్దేశిత కార్యక్రమాలతోపాటు.. విశ్వవిద్యాలయాల్లోనే ఆయన సమయం గడుపుతూ, అధ్యయనం చేశారు. అంటే, ఒక అభివృద్ధి చెందిన దేశంలోని విశ్వవిద్యాలయాల నుంచి ఇలాంటి ఫలితాలు వస్తున్నప్పుడు.. ‘వికసిత భారత్’ కల సాకారం కావాలంటే భారతీయ విశ్వవిద్యాలయాలు కూడా అలా ఉండాలన్న తపన ఆయన మనసులో బలంగా ఉండేది.

గౌరవ చైర్మన్ గారూ,

పార్లమెంటు సభ్యుల మధ్య ఎంపీ లాడ్ నిధుల గురించి చాలా చర్చలు జరుగుతుంటాయి. ఎంపీలకు ఇదొక ముఖ్యమైన అంశంగా మారింది. ఎమ్మెల్యేల నిధులతో పోలిస్తే ఎంపీ నిధులు ఎంత ఉన్నాయనే విషయమై ఒక్కోసారి కొంత సంఘర్షణ కూడా జరుగుతుంది. అయితే ఎంపీ నిధులను అసలెలా వినియోగించాలనే విషయంలో హరివంశ్ గారి ఆలోచనలు నన్ను వ్యక్తిగతంగా ఎంతో ప్రభావితం చేశాయి. కానీ మాకూ కొన్ని పరిమితులున్నాయి. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో ఉండే కొన్ని పరిమితుల వల్ల, ఆయన ఆశించిన స్థాయిలో మేము కొన్ని పనులు చేయలేకపోయి ఉండవచ్చు. కానీ, ఆయన స్వయంగా ఆ బాధ్యతను ఎలా నెరవేర్చారో మనమంతా చూశాం. విద్యారంగాన్ని, యువతరాన్ని కేంద్రంగా చేసుకుని.. తన ఆలోచనలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి ఆయన ఈ నిధులను ఉపయోగించారు. ఎంపీ నిధుల వినియోగంలో ఆయనొక గొప్ప ఉదాహరణగా నిలిచారు. దీర్ఘకాలం ప్రభావం చూపే అధ్యయన కేంద్రాలను విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో ఆయన నెలకొల్పారు. అందునా సమస్యలకు ప్రాజెక్టు ఆధారిత పరిష్కారానికే ఆయన ప్రాధాన్యమిచ్చారు. ఉదాహరణకు- కనుమరుగైపోతున్న భారతీయ భాషల పరిరక్షణ కోసం, ఐఐటి పాట్నాలో ఒక అధ్యయన కేంద్రం కోసం ఆయన ఎంపీల్యాడ్ నిధులను ఉపయోగించారు. ఆ పని అక్కడ నిరంతరం జరుగుతోంది. మరో పని కూడా చేశారు: ఎప్పుడూ భయంకరమైన భూకంప సంఘటనలతో ఉలిక్కిపడే కొన్న ప్రాంతాలు బీహార్‌లో ఉన్నాయి. నేపాల్‌లో చిన్న భూకంపం వచ్చినా సరే.. ఆ ప్రాంతాన్ని అది ప్రభావితం చేస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎంపీల్యాడ్ నిధుల ద్వారా ‘భూకంప ఇంజనీరింగ్ కేంద్రం’ రూపంలో ఒక పరిశోధన అధ్యయన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అంటే అధ్యయనం, పరిశోధన నిరంతరం జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు.. జయప్రకాశ్ గారు పుట్టిన సితాబ్‌దియారా గ్రామమే హరివంశ్ గారిది కూడా. గంగా, ఘాఘరా అనే రెండు నదుల మధ్య ఉన్న ఆ ఊరు ఎప్పుడూ నీటికోత సమస్యతో సతమతమవుతూ ఉంటుంది. నదీ ప్రవాహ మార్గం మారుతూ ఉండడం వల్ల భారీ నష్టం జరుగుతుంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. ఈ సమస్యపై శాస్త్రీయ అధ్యయనం కోసం ఆయన తన ఎంపీ లాడ్స్ నిధులను ఉపయోగించి పాట్నాలోని ఆర్యభట్ట నాలెడ్జ్ యూనివర్సిటీలో ఒక నదీ అధ్యయన కేంద్రాన్ని ప్రారంభింపజేశారు. పాట్నాలోని చంద్రగుప్త ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఒక బిజినెస్ ఇంక్యుబేషన్ - ఇన్నొవేషన్ సెంటర్‌ను నిర్మిస్తున్నారు. ఈ ఏఐ యుగంలో.. మగధ్ యూనివర్సిటీలో ఒక కృత్రిమ మేధ కేంద్రాన్ని ఆయన నిర్మించారు. అంటే, ఎంపీల్యాడ్ నిధులను ఒక నిర్దేశిత లక్ష్యం దిశగా ఎలా ఉపయోగించవచ్చో మీరొక ఆదర్శంగా నిలిచారు.

గౌరవ చైర్మన్ గారూ,

ప్రజలు తమ గ్రామం నుంచి మరో నగరానికి వలస వెళ్లినప్పుడు.. ఒక విధంగా వారు తమ జీవితంలో ఊరికి దూరమవుతారన్నది మనందరికీ అనుభవమే. నేటికీ హరివంశ్ గారి జీవితం తన సొంతూరితో అనుసంధానమై ఉంది. అక్కడి ప్రజల సుఖదుఃఖాలలో తోడుగా ఉంటూ, తన వంతు సాయాన్ని ఎప్పుడూ అందిస్తూనే ఉన్నారాయన.


 

గౌరవ చైర్మన్ గారూ,

మనమిప్పుడు కూర్చున్న ఈ కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఆయనతో కలిసి సన్నిహితంగా పనిచేసే అవకాశం నాకు లభించింది. నా ఆలోచనలన్నీ ఆయనతో పంచుకుంటూ.. ‘‘మనమిలా చేస్తే ఎలా ఉంటుంది?’’ అని అడిగేవాడిని. అయితే, రెండు రోజుల్లోనే ఆయన ఆ ఆలోచనను పూర్తిస్థాయిలో రూపొందించి నా ముందుకు తెచ్చేవారు. భవనంలోని వివిధ భాగాలకు పేర్లు పెట్టడం కావచ్చు, ప్రత్యేక గుర్తింపుతో ఈ సభను తీర్చిదిద్దడం కావచ్చు... ఈ భవన నిర్మాణం, ఆర్ట్ గ్యాలరీ లేదా వివిధ ద్వారాలకు నామకరణం చేయడంలో ఆయన ఎంతగానో కృషి చేశారు. అలా ప్రతి విషయంలోనూ భాగస్వామిగా, ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం నాకెంతో సంతోషాన్నిచ్చింది.

గౌరవ చైర్మన్ గారూ,

సభ నిర్వహణలో హరివంశ్ గారి నైపుణ్యాన్ని మనం ఇప్పటికే చూశాం. అయితే దానితోపాటు - వివిధ రాష్ట్రాల శాసనసభలు, శాసనమండళ్లు, సభాధిపతులకు శిక్షణ ఇవ్వడంలోనూ.. వారికి ఏ విధంగా తోడ్పాటునందించాలనే విషయంలోనూ ఆయనెంతో సమయాన్ని వెచ్చించి కృషి చేశారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్‌లో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ తనదైన ముద్రను వేయడంలో ఆయన అత్యంత క్రియాశీల పాత్ర పోషించారు. 21వ శతాబ్దపు ఈ రెండో పాదంలో.. ఈ సభ దేశానికి విశిష్ట సేవలందిస్తుందని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో, అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ఈ సభ ఎంతగానో కృషి చేస్తుందన్న దృఢమైన విశ్వాసం నాకుంది. అందుకే సభాధిపతుల బాధ్యత అత్యంత విస్తృతమైనది. మీరు ఆశించిన లక్ష్యాలను సాధించడంలో సహచర సభ్యులంతా మీకు పూర్తిగా సహకరిస్తారన్న దృఢమైన విశ్వాసం నాకుంది. మీరు మరింత మెరుగైన ఫలితాలను అందించేలా.. మీ పనిలో ఆటంకాలు లేకుండా సభ్యులంతా సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఇక నేను ముందే చెప్పినట్టు.. అంతా ఆ ‘హరికృప’ (దేవుడి దయ)పైనే ఆధారపడి ఉంటుంది. ‘హరి’ ఇక్కడా ఉంటారు.. ‘హరి’ అక్కడా ఉంటారు.. ‘హరి’ ఇక్కడే ఆసీనులై ఉంటారు. ఆ హరికృప ఎల్లప్పుడూ మనతో ఉండాలని కోరుకుంటూ.. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

ధన్యవాదాలు!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s power sector set for strong FY27 growth on rising demand, capacity additions: Report

Media Coverage

India’s power sector set for strong FY27 growth on rising demand, capacity additions: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Mr. Andy Burnham on assuming office as Prime Minister of the United Kingdom
July 21, 2026

Prime Minister Shri Narendra Modi today extended congratulations to Mr. Andy Burnham on assuming office as Prime Minister of the United Kingdom.

Shri Modi noted that India and the UK are bound by shared democratic values and enjoy wide-ranging cooperation across trade, investment, technology, defence, and people-to-people relations. With CETA entering into force this month, the Prime Minister pointed out that the bilateral partnership is poised to grow even stronger.

The Prime Minister stated that he looks forward to working closely with him to further deepen the India-UK Comprehensive Strategic Partnership and advance their shared Vision 2035.

In a post on X, the Prime Minister shared:

"Warmest congratulations to Mr. Andy Burnham on assuming office as Prime Minister of the United Kingdom.

India and the UK are bound by shared democratic values and enjoy wide-ranging cooperation across trade, investment, technology, defence and people-to-people relations. With CETA entering into force this month, our bilateral partnership is poised to grow even stronger.

I look forward to working closely with you to further deepen the India-UK Comprehensive Strategic Partnership and advance our shared Vision 2035.

@andyburnham"