Assam has picked up a new momentum of development: PM
Our government is placing farmers' welfare at the centre of all its efforts: PM
Initiatives like PM Dhan Dhanya Krishi Yojana and the Dalhan Atmanirbharta Mission are launched to promote farming and support farmers: PM
Guided by the vision of Sabka Saath, Sabka Vikas, our efforts have transformed the lives of poor: PM

ఉజ్జనిర్ రాయజ్ కేనే ఆసే? ఆపునాలుకొలోయ్ ముర్ ఆంతోరిక్ మొరోమ్ ఆరు శ్రద్ధా జాసిసు.

అస్సాం గవర్నరు శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు, ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ గారు, కేంద్ర ప్రభుత్వంలో నా సహచరుడు, ఇక్కడి మీ ప్రతినిధి అయిన అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ గారు, అస్సాం ప్రభుత్వ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ సభ్యులు, ఇతర ప్రముఖులు, మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసిన నా సోదరీ సోదరులూ... వేదిక లోపలి కన్నా బయటే ఎక్కువ మంది ప్రజలు కనిపిస్తున్నారు.

సౌలుంగ్ సుకాఫా, మహావీరుడు లచిత్ బోర్ఫుకన్ వంటి వీరులుద్భవించిన పుణ్యభూమి ఇది. భీంబెర్ దేవూరి, అమరుడు కుశాల్ కువార్, మోరన్ రాజా బోడౌసా, మాలతీ మేమ్, ఇందిరా మీరి, స్వర్గదేయో సర్బానంద సింగ్, వీరనారి సతీ సాధ్నిలను గన్న నేల ఇది. ఈ ఎగువ అస్సాం పుణ్యభూమికి భక్తితో ప్రణమిల్లుతున్నాను.

మిత్రులారా,

మీరంతా నలుమూలల నుంచి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి.. ఉత్సాహాన్ని, ఆనందాన్ని, అభిమానాన్ని కురిపిస్తున్నారు. ముఖ్యంగా నా తల్లులూ, అక్కాచెల్లెళ్లూ... ఇంత భారీ సంఖ్యలో వచ్చిన మీరంతా మోసుకొచ్చిన ప్రేమాశీర్వాదాలే మాకు అతిపెద్ద బలం, గొప్ప శక్తి. ఇదొక అద్భుతమైన అనుభూతి. ఇక్కడున్న నా అక్కాచెల్లెళ్లు చాలామంది అస్సాం తేయాకు తోటల పరిమళాలను మోసుకొచ్చారు. ఈ తేయాకు పరిమళం.. అస్సాంతో నాకున్న అనుబంధంలో మరింత ప్రత్యేక భావనను కలిగిస్తుంది. మీ అందరికీ వందనాలు. ప్రేమాదరాలను చూపిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

 

 

మిత్రులారా,

అస్సాంకు, మొత్తం ఈశాన్య ప్రాంతానికి నేడొక శుభదినం. నామ్‌రూప్, దిబ్రూగఢ్ ప్రజల చిరకాల స్వప్నం ఎట్టకేలకు ఈ రోజు నెరవేరుతోంది. ఈ ప్రాంత పారిశ్రామిక పురోగతిలో ఓ కొత్త అధ్యాయం మొదలవుతోంది. కొద్దిసేపటి కిందటే నేనిక్కడ అమ్మోనియా - యూరియా ఎరువుల కర్మాగారానికి భూమి పూజ చేశాను. దిబ్రూగఢ్‌కు రాకముందు.. గువహటిలో ఒక విమానాశ్రయ టెర్మినల్‌ను కూడా ప్రారంభించాను. అస్సాం అభివృద్ధిలో కొత్త వేగాన్ని పుంజుకుందని నేడు ప్రతి ఒక్కరూ అంటున్నారు. నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే.. మీరిప్పుడు చూస్తున్నది, మీరు అనుభూతి చెందుతున్నదీ ఆరంభం మాత్రమే.. అస్సాంను మనమింకా చాలా ముందుకు తీసుకువెళ్లాలి. మనందరమూ కలిసి ముందుకు సాగాలి. అహోం రాజ్య కాలంలో మాదిరిగానే.. అభివృద్ధి చెందిన భారత్‌లోనూ అత్యంత శక్తిమంతమైన, ముఖ్యమైన ప్రాంతంగా అస్సాం అవతరిస్తుంది. కొత్త పరిశ్రమల వ్యవస్థాపన, ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణం, సెమీకండక్టర్లూ - వాటి తయారీలో పురోగతి, వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలు, తేయాకు తోటలూ - వాటి కార్మికుల అభివృద్ధి, పెరుగుతున్న పర్యాటక రంగ సామర్థ్యంతో.. ప్రతి రంగంలోనూ అస్సాం పురోగమిస్తోంది. ఈ ఆధునిక ఎరువుల కర్మాగారం పనులు మొదలైన సందర్భంగా మీ అందరికీ, దేశంలోని రైతు సోదరులందరికీ నా శుభాకాంక్షలు. గువహటి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ ప్రారంభోత్సవం సందర్భంగానూ మీకు అభినందనలు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో.. పరిశ్రమలూ, అనుసంధానమూ మధ్య సమన్వయంతో అస్సాం ఆకాంక్షలు నెరవేరుతున్నాయి. పెద్ద కలలు కనేలా మన యువత ప్రేరణ పొందుతున్నారు.

మిత్రులారా,

అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించడంలో మన దేశ రైతులు, మన అన్నదాతలది కీలక పాత్ర. అందుకే రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ మా ప్రభుత్వం రేయింబవళ్లూ పనిచేస్తోంది. ఇక్కడ మీ అందరికీ రైతుహిత పథకాల ప్రయోజనాలు లభిస్తున్నాయి. వ్యవసాయ సంక్షేమ పథకాలతోపాటు.. అంతరాయం లేకుండా ఎరువుల సరఫరా కూడా మన రైతులకు చాలా ముఖ్యం. ఈ యూరియా ప్లాంటు మున్ముందు ఈ దిశగా భరోసానిస్తుంది. ఈ ఎరువుల ప్రాజెక్టుపై సుమారు రూ. 11 వేల కోట్లు వెచ్చించబోతున్నాం. ఇక్కడ ఏటా 12 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి ఇక్కడే జరిగితే, సరఫరా వేగవంతమవడంతోపాటు రవాణా వ్యయం తగ్గుతుంది.

 

మిత్రులారా,

నామరూప్‌లోని ఈ యూనిట్ వేలాది కొత్త ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. ప్లాంటు కార్యకలాపాలు మొదలవగానే చాలా మందికి ఇక్కడే శాశ్వత ఉద్యోగాలు లభిస్తాయి. అంతేకాకుండా ప్లాంటుకు సంబంధించి నిర్వహణ, సరఫరా, నిర్మాణం వంటి పనులు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఈ రంగాలన్నింటిలోనూ స్థానిక ప్రజలకు, ముఖ్యంగా మన యువతకు ఉపాధి లభిస్తుంది.

కానీ సోదరీ సోదరులారా,

ఒక్కసారి ఆలోచించండి.. రైతుల సంక్షేమం కోసం పనులు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎందుకు జరుగుతున్నాయి? మన నామ్‌రూప్ కొన్ని దశాబ్దాలుగా ఎరువుల ఉత్పత్తికి కేంద్రంగా ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఉత్పత్తి అయిన ఎరువులు ఈశాన్య ప్రాంతంలోని పొలాలకు జవసత్వాలనిచ్చి.. రైతుల పంటలకు అండగా నిలిచేవి. దేశంలోని అనేక ప్రాంతాలలో ఎరువుల సరఫరా సవాలుగా మారినప్పటికీ, రైతుల పాలిట నామ్‌రూప్ ఆశాకిరణంగా నిలిచింది. అయితే, పాత కర్మాగారాల సాంకేతికత కాలక్రమేణా పాతబడిపోయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు దానిపై ఎలాంటి శ్రద్ధ చూపలేదు. దీని ఫలితంగా నామ్‌రూప్ ప్లాంటులోని అనేక యూనిట్లు మూతపడ్డాయి. ఈశాన్య ప్రాంతమంతటా రైతులు తీవ్రంగా నష్టపోయారు. దేశవ్యాప్తంగా కూడా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి ఆదాయాలపై అది ప్రతికూల ప్రభావం చూపింది. వ్యవసాయం మరింత సవాలుగా మారింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. వారు ఉదాసీనంగా ఉండిపోయారు. కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ఈ సమస్యలను నేడు మా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పరిష్కరిస్తోంది.

మిత్రులారా,

అస్సాంలో మాదిరిగానే దేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా చాలా ఎరువుల కర్మాగారాలు మూతపడ్డాయి. నాడు రైతుల దుస్థితి మీకు గుర్తుందా? రైతులు యూరియా కోసం పెద్ద పెద్ద క్యూ లైన్లలో నిలబడాల్సి వచ్చింది. యూరియా దుకాణాల వద్ద పోలీసులను మోహరించాల్సి వచ్చింది. పోలీసులు రైతులపై లాఠీచార్జి చేసేవారు.

సోదరీ సోదరులారా,

కాంగ్రెస్ పార్టీ దిగజార్చిన పరిస్థితులను మెరుగుపరచడానికి మా ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. వారు పరిస్థితులను ఎంత దారుణంగా దిగజార్చారంటే.. 11 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన తర్వాత కూడా, చేయాల్సింది ఇంకా చాలా ఉంది. కాంగ్రెస్ పాలనలో ఎరువుల కర్మాగారాలు మూతపడగా.. మా ప్రభుత్వం మాత్రం గోరఖ్‌పూర్, సింద్రీ, బరౌని, రామగుండం వంటి ప్రాంతాల్లో అనేక ప్లాంట్లను ప్రారంభించింది. ఈ రంగంలో ప్రైవేటు రంగాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాం. దాంతో అనతికాలంలోనే యూరియా రంగంలో స్వావలంబన సాధించే దిశగా నేడు మనం బలంగా పురోగమిస్తున్నాం.

 

మిత్రులారా,

2014లో దేశంలో ఉత్పత్తి అయిన యూరియా 225 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. మీకిది గుర్తుందా? ఈ సంఖ్య మీకు గుర్తుందా? 10 -11 సంవత్సరాల కిందట మీరు నాకు పని చేసే అవకాశాన్నిచ్చారు. అప్పుడు ఉత్పత్తి 225 లక్షల మెట్రిక్ టన్నులు ఉండేది. ఈ సంఖ్యను గుర్తుంచుకోండి. గత 10 -11 ఏళ్లుగా కష్టపడి పనిచేసి.. మేం ఆ ఉత్పత్తిని సుమారు 306 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాం. కానీ మనం ఇక్కడితో ఆగకూడదు. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. అప్పట్లో వారు చేయాల్సిన పనిని చేయలేదు. అందుకే ఇప్పుడు నేను కొంచెం అదనపు శ్రమ పెట్టాల్సి వస్తోంది. ప్రస్తుతం మనకు ప్రతి సంవత్సరం సుమారు 380 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. మనం 306 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకున్నాం. మరో 70 - 80 లక్షల టన్నులు మనం ఉత్పత్తి చేయాల్సి ఉంది. కానీ నేను దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాను – మేం కష్టపడి పనిచేస్తున్న తీరు, మేము ప్రణాళికలు రచిస్తున్న విధానం, నా రైతు సోదరులు మమ్మల్ని ఆశీర్వదిస్తున్న తీరును బట్టి... వీలైనంత త్వరలోనే ఈ అంతరాన్ని పూరించేందుకు మేం అన్ని విధాలా ప్రయత్నిస్తాం. అందుకే నేను కొంచెం ఎక్కువగా పనిచేయాల్సి వస్తోంది.

సోదరీ సోదరులారా,

నేను మీకు మరో విషయం చెబుతాను. మీ ప్రయోజనాల పట్ల మా ప్రభుత్వం చాలా సున్నితంగా ఆలోచిస్తుంది. మనం విదేశాల నుంచి అధిక ధరలకు దిగుమతి చేసుకునే యూరియా భారాన్ని కూడా మన రైతులపై పడనీయడం లేదు. సబ్సిడీల ద్వారా బీజేపీ ప్రభుత్వమే ఆ భారాన్ని భరిస్తోంది. మన దేశంలో రైతులకు ఒక బస్తా యూరియా 300 రూపాయలకే దొరుకుతుంది. కానీ మనం యూరియాను దిగుమతి చేసుకునే దేశాలకు.. ఆ ఒక్క బస్తా కోసం భారత ప్రభుత్వం సుమారు 3,000 రూపాయలు చెల్లిస్తోంది. ఒక్కసారి ఆలోచించండి.. మనం 3,000 రూపాయలకు దాన్ని కొని, 300 రూపాయలకే విక్రయిస్తున్నాం. ఈ భారం మొత్తాన్ని దేశ రైతులపై పడనీయడం లేదు. నా రైతు సోదరీ సోదరులపై భారం పడకూడగన్న ఉద్దేశంతో ప్రభుత్వమే ఈ ఖర్చు మొత్తాన్ని భరిస్తోంది. అయితే, నా రైతు సోదరీ సోదరులకు నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు కూడా నాకొక సాయం చేయాలి. అది కేవలం నా కోసమే కాదు, నా రైతు సోదరులందరి కోసం కూడా... అదే భూమాతను కాపాడుకోవడం. భూమాతను కాపాడుకోకపోతే.. మనం ఎన్ని బస్తాల యూరియా వాడినా, ఆమె మనకు తిరిగి ఏమీ ఇవ్వదు. మనకు అనారోగ్యం వస్తే సరైన మోతాదులో మందులు తీసుకోవాలి. మనకు రెండు మాత్రలు అవసరమైన సమయంలో నాలుగు తీసుకుంటే.. అది శరీరానికి సాయం చేయకపోగా, హాని చేస్తుంది. భూమాతకు కూడా ఇదే వర్తిస్తుంది. మన పొరుగు వారిని చూసి మనం కూడా అధిక మొత్తంలో ఎరువులు వేస్తూ పోతే.. భూమాత మనకు వ్యతిరేకంగా మారుతుంది. బలవంతంగా యూరియా వేసి భూమాతను చంపే హక్కు మనకు లేదు. ఆమె మన తల్లి. ఈ తల్లిని కూడా మనం కాపాడుకోవాలి.

మిత్రులారా,

ఈ రోజు విత్తనం వేసినప్పటి నుంచి పంటను మార్కెటుకు చేర్చే వరకు బీజేపీ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతోంది. వ్యవసాయ పనుల కోసం డబ్బును నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నాం. రైతులు రుణాల కోసం అటూఇటూ తిరగాల్సిన అవసరం లేదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇప్పటివరకు సుమారు 4 లక్షల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు బదిలీ చేశాం. ఈ సంఖ్య మీకు గుర్తుంటుందా? లేక మర్చిపోతారా? నేరుగా నా దేశ రైతుల ఖాతాల్లో 4 లక్షల కోట్ల రూపాయలు జమ చేశాం. రైతులకు అండగా నిలిచేలా 35 వేల కోట్ల రూపాయల విలువైన రెండు కొత్త పథకాలను ఈ సంవత్సరం ప్రారంభించాం – 35 వేల కోట్ల రూపాయలు! ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన, దాల్హన్ ఆత్మ నిర్భరత (పప్పు దినుసుల్లో స్వావలంబన) మిషన్ వ్యవసాయానికి ఊతమిస్తాయి.

 

మిత్రులారా, 

రైతుల ప్రతీ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని మేం పనిచేస్తున్నాం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంట నష్టం జరిగితే ఫసల్ బీమా యోజన రైతులకు అండగా నిలుస్తోంది. రైతులు తమ పంటలకు సరైన ధరలు పొందేలా కొనుగోలు వ్యవస్థలను మెరుగుపరిచాం. రైతులు బలంగా ఉన్నప్పుడే దేశం పురోగమిస్తుందని మా ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తుంది. దీన్ని సాధించేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నాం.

మిత్రులారా,

కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. కిసాన్ క్రెడిట్ కార్డ్ సదుపాయాన్ని పాడి రైతులు, మత్స్యకారులకు కూడా మేం విస్తరించాం. కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) సదుపాయం అందుబాటులోకి రావడంతో మన పాడి రైతులు, మత్స్యకారులు చాలా ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ సంఖ్యను కూడా గుర్తుంచుకోండి.. ఈ సంవత్సరం కేసీసీ ద్వారా రైతులకు రూ. 10 లక్షల కోట్లకు పైగా సాయమందించాం. జీవ ఎరువులపై జీఎస్టీ తగ్గింపు వల్ల కూడా రైతులు ఎంతగానో లబ్ధి పొందారు. భారతీయ రైతులకు సేంద్రియ వ్యవసాయం కోసం కూడా బీజేపీ ప్రభుత్వం గణనీయమైన ప్రోత్సాహాన్నిస్తోంది. అస్సాంలో కొన్ని తహసీళ్లలో వంద శాతం సేంద్రియ వ్యవసాయమే జరిగే వాతావరణం ఏర్పడాలన్నది నా కోరిక. చూడండీ.. అస్సాం భారత్‌కు దిశానిర్దేశం చేయగలదు. అస్సాం రైతులు దేశానికి మార్గదర్శకులు కాగలరు. జాతీయ సేంద్రియ వ్యవసాయ మిషన్‌ను మేం ప్రారంభించాం. నేడు లక్షలాది మంది రైతులు ఇందులో భాగస్వాములయ్యారు. గత కొన్నేళ్లలో దేశంలో 10 వేల రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పివోలు) ఏర్పడ్డాయి. ఈశాన్య ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ.. వంటనూనెలకు సంబంధించి, ముఖ్యంగా పామాయిల్‌కు సంబంధించి ఒక మిషన్‌ను కూడా మా ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మిషన్ భారత్‌ను వంటనూనెల విషయంలో ఆత్మనిర్భరగా మార్చడమే కాకుండా, ఇక్కడి రైతుల ఆదాయాన్ని కూడా పెంచుతుంది.

మిత్రులారా,

ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో తేయాకు తోటల కార్మికులు కూడా ఉన్నారు. అస్సాంలోని ఏడున్నర లక్షల మంది తేయాకు తోటల కార్మికుల కోసం జన్ ధన్ బ్యాంక్ ఖాతాలను తెరిచింది కూడా బీజేపీ ప్రభుత్వమే. వారిప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం కావడంతో.. నేరుగా తమ ఖాతాల్లోనే చెల్లింపులు జమ అవుతున్నాయి. తేయాకు తోటల ప్రాంతాల్లో పాఠశాలలు, రోడ్లు, విద్యుత్తు, నీరు, ఆస్పత్రుల వంటి సదుపాయాలను మా ప్రభుత్వం పెంచుతోంది.

మిత్రులారా,

‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ మంత్రంతో మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మా ఈ కార్యాచరణ దేశంలోని పేదల జీవితాల్లో గణనీయమైన మార్పును తెచ్చింది. గత పదకొండేళ్లలో మా కృషి, పథకాలు, వాటి అమలు కారణంగా 25 కోట్ల మంది.. ఈ సంఖ్యను కూడా గుర్తుంచుకోండి.. 25 కోట్ల భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారు. దేశంలో ఒక నూతన మధ్యతరగతి వర్గం ఆవిర్భవించింది. కొన్నేళ్లుగా దేశంలోని పేద కుటుంబాల జీవన ప్రమాణం నిరంతరం మెరుగుపడటం వల్లే ఇది సాధ్యమైంది. దేశంలో మార్పులను సూచించే కొన్ని తాజా గణాంకాలూ వెలువడ్డాయి.

 

మిత్రులారా,

ఈ విషయాలన్నీ మీడియాలో చాలా ఉపయోగపడతాయి. కాబట్టి నేను మీకు చెప్పిన విషయాలను గుర్తుంచుకుని, వాటిని ఇతరులతో కూడా పంచుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.

మిత్రులారా,

గతంలో గ్రామాల్లోని అత్యంత పేద కుటుంబాల్లో.. పదింటిలో ఒక్క ఇంట్లో కూడా మోటార్‌ సైకిల్ ఉండేది కాదు. పదింటిలో ఒక్కరికి కూడా... కానీ, ఇటీవలి సర్వేల ప్రకారం నేడు గ్రామాల్లో దాదాపు సగం కుటుంబాలకు బైకో లేదా కారో ఉన్నాయి. మొబైల్ ఫోన్లు దాదాపు ప్రతి ఇంటికీ చేరాయి. ఒకప్పుడు విలాసవంతమైన వస్తువులుగా చూసిన రిఫ్రిజిరేటర్ల వంటివి ఇప్పుడు మన కొత్త మధ్యతరగతి ఇళ్లలో కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడిది పల్లెల్లోని వంటగదులకూ వెళ్లింది. స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నప్పటికీ.. టీవీలు కూడా కొనే ధోరణి గ్రామాల్లోనూ పెరుగుతోందని తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఈ మార్పు యాదృచ్చికంగా వచ్చినదేమీ కాదు. దేశంలో పేదలు సాధికారత సాధించిన ఫలితమిది. ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న అత్యంత పేద ప్రజలకు కూడా అభివృద్ధి ఫలాలు చేరుతున్నాయన్నది వాస్తవం.

మిత్రులారా,

బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పేదల, గిరిజనుల, యువత, మహిళల ప్రభుత్వం. అందుకే అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న హింసను అంతం చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. మా ప్రభుత్వం ఎప్పుడూ అస్సాం అస్తిత్వానికి, సంస్కృతికి పెద్దపీట వేస్తోంది. బీజేపీ ప్రభుత్వం ప్రతి వేదికపైనా అస్సామీల ఆత్మగౌరవ ప్రతీకలను సగర్వంగా నిలుపుతోంది. అందుకే మహావీరుడు లచిత్ బోర్ఫుకన్ 125 అడుగుల విగ్రహాన్ని గర్వంగా నిర్మిస్తున్నాం. అస్సాంకు గర్వకారణమైన భూపేన్ హజారికా జన్మ శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. మేం అస్సాం కళలు, హస్తకళలకూ, అలాగే అస్సాం గమోసాకు (సంప్రదాయ కండువా) ప్రపంచవ్యాప్త గుర్తింపును తెస్తున్నాం. కొన్ని రోజుల కిందటే రష్యా అధ్యక్షుడు శ్రీ పుతిన్ భారతదేశాన్ని సందర్శించారు. ఆయన ఢిల్లీలో ఉన్న సమయంలో.. అస్సామీ బ్లాక్ టీని ఆయనకు గర్వంగా బహూకరించాను. అస్సాం గౌరవ ప్రతిష్ఠలను పెంచే ప్రతి పనికీ మేం ప్రాధాన్యమిస్తున్నాం.

కానీ సోదరీ సోదరులారా,

బీజేపీ ఈ పనులు చేస్తే ఎక్కువగా బాధపడేది కాంగ్రెస్ పార్టీనే. మీకు గుర్తుండే ఉంటుంది.. మా ప్రభుత్వం భూపేన్ దాకు భారతరత్న ఇచ్చినప్పుడు కాంగ్రెస్ దాన్ని బాహాటంగానే వ్యతిరేకించింది. మోదీ నృత్యకారులకు, గాయకులకు భారతరత్న ఇస్తున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు అన్నారు. చెప్పండి.. ఇది భూపేన్ దాకు అవమానం కాదా? ఇది కళకూ, సంస్కృతికీ అవమానం కాదా? ఇది అస్సాంకు అవమానం కాదా? కాంగ్రెస్ రేయింబవళ్లూ చేసేది ఇదే.. అవమానించడమే. మేం అస్సాంలో సెమీకండక్టర్ యూనిట్‌ను ఏర్పాటు చేసినప్పుడు కూడా కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకించింది. దశాబ్దాల తరబడి తేయాకు తోటల కార్మికులుగా ఉన్న మన సోదరీ సోదరులకు భూ హక్కులను నిరాకరించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అన్న విషయాన్ని మరచిపోవద్దు! బీజేపీ ప్రభుత్వం వారికి భూ హక్కులను, గౌరవప్రదమైన జీవితాన్ని అందించింది. పైగా నేను స్వయంగా టీ అమ్మినవాడిని. నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు? ఈ కాంగ్రెస్ ఇంకా దేశ వ్యతిరేక భావజాలాన్ని ప్రోత్సహిస్తోంది. బంగ్లాదేశీ చొరబాటుదారులను అస్సాం అటవీ భూముల్లో స్థిరపరిచేలా చూడాలని వీళ్లనుకుంటున్నారు. దీనివల్ల వారి ఓటు బ్యాంకు బలపడుతుంది. మీరు నాశనమైనా వారికి పట్టింపు లేదు.. వారు తమ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవాలి అంతే.

సోదరీ సోదరులారా,

కాంగ్రెస్ పార్టీకి అస్సాంపై గానీ, అస్సాం ప్రజలపై గానీ, మీ అస్తిత్వంపై గానీ ఎలాంటి శ్రద్ధ లేదు. వారికి అధికారం, ప్రభుత్వం, గతంలో తాము చేసిన పనులను కొనసాగించడంపైనే ఆసక్తి ఉంది. అందుకే చట్టవిరుద్ధ బంగ్లాదేశీ చొరబాటుదారులను వాళ్లు ఎక్కువగా ఇష్టపడతారు. అక్రమ చొరబాటుదారులను స్థిరపరిచింది కాంగ్రెస్సే, వారిని కాపాడుతున్నది కూడా కాంగ్రెస్సే. అందుకే ఓటర్ల జాబితా సవరణను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ అనుసరిస్తున్న ఈ విషపూరిత సంతుష్టీకరణ విధానం, ఓటు బ్యాంకు రాజకీయాల నుంచి అస్సాంను మనం కాపాడుకోవాలి. అస్సాం అస్తిత్వాన్ని, అస్సాం గౌరవాన్ని కాపాడేందుకు ఉక్కులా కవచంలా బీజేపీ మీతో నిలుస్తుందని ఈ రోజు నేను మీకు హామీ ఇస్తున్నాను.

మిత్రులారా,

అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో మీ ఆశీర్వాదాలే నాకు బలం. మీ ప్రేమే నాకు గొప్ప ఆస్తి. అందుకే ప్రతీ క్షణం మీ కోసం జీవించడంలో నేను ఆనందాన్ని పొందుతాను. అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో తూర్పు భారత్, మన ఈశాన్య ప్రాంతం పాత్ర నిరంతరం పెరుగుతోంది. దేశాభివృద్ధికి తూర్పు భారత్ చోదక శక్తిగా మారుతుందని నేను గతంలో కూడా చెప్పాను. నామ్‌రూప్‌లోని ఈ కొత్త యూనిట్ ఈ గణనీయమైన మార్పునకు మంచి ఉదాహరణ. ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఎరువులు కేవలం అస్సాంలోని వ్యవసాయ క్షేత్రాలకు మాత్రమే పరిమితం కాదు. ఇవి బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తూర్పు ఉత్తరప్రదేశ్ వరకు చేరుతాయి. ఇది చిన్న విషయమేం కాదు. దేశ ఎరువుల అవసరాలను తీర్చడంలో ఈశాన్య ప్రాంతం అందిస్తున్న విశేష సహకారమిది. రాబోయే కాలంలో ఆత్మనిర్భర భారత్‌కు ఈశాన్య భారతం ప్రధాన కేంద్రంగా నిలుస్తుందని నామ్‌రూప్ వంటి ప్రాజెక్టులు చాటుతున్నాయి. ఈశాన్య ప్రాంతం నిజంగా ‘అష్టలక్ష్మి’గా నిలవబోతోంది. ఈ కొత్త ఎరువుల కర్మాగారం భూమిపూజ సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు... నాతో కలిసి నినదించండి:

భారత్ మాతా కీ జై.

భారత్ మాతా కీ జై.

వందేమాతరం ఆవిర్భవించి ఈ యేడు 150 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఇది మనకెంతో గర్వకారణమైన క్షణం. అందరం కలిసి నినదిద్దాం:

వందేమాతరం.

వందేమాతరం.

వందేమాతరం.

వందేమాతరం.

వందేమాతరం.

వందేమాతరం.

వందేమాతరం.

వందేమాతరం.

వందేమాతరం.  

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
UP's exports to BRICS nations, partners cross $5.36 billion in FY26: Govt

Media Coverage

UP's exports to BRICS nations, partners cross $5.36 billion in FY26: Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister extends birthday greetings to President of India, Smt. Droupadi Murmu
June 20, 2026

The Prime Minister, Shri Narendra Modi has extended warm birthday greetings to the President of India, Smt. Droupadi Murmu.

The Prime Minister said that her journey, marked by courage, simplicity, humility and unwavering commitment to public service, continues to inspire people across the country.

Shri Modi noted that through her many years in public life, the President has served the nation in an outstanding manner and has been especially passionate about the wellbeing of the underprivileged and marginalised.

The Prime Minister stated that her steadfast dedication to India’s development is very motivating.

Shri Modi prayed for her long and healthy life in the service of the nation and said that he looks forward to meeting her later in the day at a programme in Odisha.

The Prime Minister wrote on X;

“Warm birthday greetings to the President of India, Smt. Droupadi Murmu Ji. Her journey, marked by courage, simplicity, humility and unwavering commitment to public service, continues to inspire people across the country.

Through her many years in public life, she has served the nation in an outstanding manner, especially passionate about the wellbeing of the underprivileged and marginalised. Her steadfast dedication to India’s development is very motivating.

May she be blessed with a long and healthy life in the service of the nation. I look forward to meeting her later today at the programme in Odisha.

@rashtrapatibhvn”