భార‌త‌దేశ వృద్ధికి రూపం ఇవ్వ‌డం, ఆవిష్క‌ర‌ణ‌ల‌కు దారి చూప‌డం, వివిధ రంగాల్లో దేశాన్ని ప్ర‌పంచంలో అగ్ర‌గామిగా నిల‌పాలనే భవిష్య‌త్తు ల‌క్ష్యాల‌ను 78వ స్వాతంత్య్ర దినోత్స‌వ ప్ర‌సంగంలో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌క‌టించారు.

ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగంలోని కీల‌కాంశాల్లో కొన్ని:

1. జీవ‌న సౌల‌భ్యం: అధిక ప్రాధాన్య‌త‌తో జీవ‌న సౌల‌భ్యాన్ని నెర‌వేర్చాల‌నే త‌న స్వ‌ప్నాన్ని ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించారు. క్ర‌మ‌బ‌ద్ధ‌మైన మ‌దింపులు, మౌలిక స‌దుపాయాలు, సేవ‌ల‌ను మెరుగుప‌ర్చ‌డం ద్వారా ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో జీవ‌న నాణ్య‌త‌ను పెంపొందించ‌డంపై ఆయ‌న మాట్లాడారు.

2. న‌లంద స్ఫూర్తి పున‌రుద్ధ‌ర‌ణ‌: ప్రాచీన న‌లంద విశ్వ‌విద్యాల‌య స్ఫూర్తిని పున‌రుద్ధ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య‌క‌ర అభ్యాసం, ప‌రిశోధ‌న‌లను ప్రోత్స‌హించి భార‌త్‌ను ప్ర‌పంచ విద్యా కేంద్రంగా నిల‌పాల‌ని అన్నారు. 2024లో న‌లంద విశ్వ‌విద్యాల‌య ప్రారంభోత్స‌వంతో ఈ స్వ‌ప్నాన్ని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

3. భార‌త్‌లో చిప్‌-సెమీకండ‌క్ట‌ర్ ఉత్ప‌త్తి: సెమీకండ‌క్ట‌ర్ ఉత్ప‌త్తిలో ప్ర‌పంచంలో అగ్ర‌గామిగా నిల‌వాల‌నే భార‌త‌దేశ నిబద్ధ‌త‌ను ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించారు. దిగుమ‌తుల‌పై ఆధార‌ప‌డ‌టాన్ని త‌గ్గించి, సాంకేతికంగా స్వ‌యం స‌మృద్ధిని పెంపొందించాల‌నేది దీని ల‌క్ష్యం.

4. నైపుణ్య భార‌త్‌: భార‌తీయ యువ‌త‌కు శిక్ష‌ణ ఇచ్చి, దేశాన్ని ప్ర‌పంచంలో నైపుణ్య రాజ‌ధానిగా మార్చేందుకు గానూ 2024 బ‌డ్జెట్‌లో ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు.

5. పారిశ్రామిక త‌యారీ కేంద్రం: అపార‌మైన వ‌న‌రులు, నైపుణ్యాలు క‌లిగిన కార్మిక‌శ‌క్తిని స‌ద్వినియోగం చేసుకొని భార‌త్‌ను ప్ర‌పంచ త‌యారీ కేంద్రంగా మార్చాల‌ని ప్ర‌ధాని మోదీ సంక‌ల్పించారు.

6. "భార‌త్‌లో డిజైన్‌, ప్ర‌పంచం కోసం డిజైన్‌": స్వ‌దేశీ డిజైన్ సామ‌ర్థ్యాల‌ను ప్ర‌శంసించిన ప్ర‌ధాన‌మంత్రి, దేశీయ‌, అంత‌ర్జాతీయ విప‌ణుల‌కు అనుగుణంగా వ‌స్తువుల‌ను రూపొందించాల‌ని కోరారు. ఈ మేర‌కు "భార‌త్‌లో డిజైన్‌, ప్ర‌పంచం కోసం డిజైన్‌"అనే వాక్యాన్ని పేర్కొన్నారు.

7. అంత‌ర్జాతీయ గేమింగ్ మార్కెట్‌లో అగ్ర‌గామి: గొప్ప‌ ప్రాచీణ వార‌స‌త్వాన్ని, సాహిత్యాన్ని స‌ద్వినియోగం చేసుకొని భార‌త్‌లో గేమింగ్ ఉత్ప‌త్తుల‌ను త‌యారుచేయాల‌ని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. ఆడ‌టంలోనే కాకుండా ఆట‌ల‌ను తయారు  చేయ‌డంలోనూ భార‌తీయ నిపుణులు అంత‌ర్జాతీయ గేమింగ్ మార్కెట్‌కు నేతృత్వం వ‌హించాల‌ని అన్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌తీయ ఆట‌లు ప్ర‌త్యేక ముద్ర వేసుకోవాల‌ని పేర్కొన్నారు.

8. హ‌రిత ఉద్యోగాలు, హ‌రిత ఉద‌జ‌ని కార్య‌క్ర‌మం: వాతావ‌ర‌ణ మార్పుపై పోరాడ‌టంలో భార‌త్ ప్ర‌య‌త్నాల కోసం హ‌రిత ఉద్యోగాల ప్రాముఖ్యాన్ని ప్ర‌ధాని మోదీ నొక్కి చెప్పారు. ఇప్పుడు హ‌రిత వృద్ధి, హ‌రిత ఉద్యోగాల‌పై దేశం దృష్టి సారించింద‌ని చెప్పారు. ఇది ఉద్యోగ అవ‌కాశాల‌ను సృష్టించ‌డంతో పాటు ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు దోహ‌ద‌ప‌డుతుంద‌ని తెలిపారు. హ‌రిత ఉద‌జ‌ని ఉత్ప‌త్తిలో భార‌త్‌ ప్ర‌పంచంలో అగ్ర‌గామిగా నిలిచేందుకు, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ, పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగాల్లో సుస్థిర‌మైన ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌డానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి పున‌రుద్ఘాటించారు.

9. స్వ‌స్థ్ భార‌త్ మిష‌న్‌: విక‌సిత్ భార‌త్ 2047 ల‌క్ష్యాన్ని అందుకునేందుకు భార‌త్ ‘స్వ‌స్థ్ భార‌త్’ దిశ‌గా న‌డ‌వాల‌ని, ఇది రాష్ట్రీయ పోష‌న్ అభియాన్ ఆవిష్క‌ర‌ణ‌తో ప్రారంభ‌మైంద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు.

10. రాష్ట్రస్థాయి పెట్టుబ‌డి పోటీ: రాష్ట్ర ప్ర‌భుత్వాలు పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేందుకు స్ప‌ష్ట‌మైన విధానాల‌ను రూపొందించాల‌ని, సుప‌రిపాల‌న‌కు హామీ ఇవ్వాల‌ని, శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిస్థితిపై విశ్వాసాన్ని క‌ల్పించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి పిలుపునిచ్చారు.

11. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాలుగా భార‌తీయ ప్ర‌మాణాలు: నాణ్య‌త విష‌యంలో దేశ‌ నిబ‌ద్ధ‌త‌కు గుర్తింపురావాల‌నే భార‌త ఆకాంక్షపై ప్ర‌ధాని మోదీ మాట్లాడారు. భార‌తీయ ప్ర‌మాణాలు అంత‌ర్జాతీయ ప్ర‌మాణాలుగా మారాల‌ని ఆకాంక్షించారు.

12. వాతావ‌ర‌ణ మార్పు లక్ష్యాలు : 2030 నాటికి 500 గిగావాట్ల పున‌రుత్పాద‌క విద్యుత్తు సామ‌ర్థ్యాన్ని అందుకోవాల‌నే భార‌త‌దేశ ప్ర‌తిష్టాత్మ‌క ల‌క్ష్యాన్ని ప్ర‌ధాన‌మంత్రి పున‌రుద్ఘాటించారు. జీ20 దేశాల్లో పారిస్ ఒప్పంద ల‌క్ష్యాల‌ను అందుకున్నది కేవ‌లం భార‌త్ మాత్ర‌మే అనే విష‌యాన్ని ఆయ‌న పేర్కొన్నారు.

13. వైద్య విద్య విస్త‌ర‌ణ‌: దేశ వైద్య విద్య సామ‌ర్థ్యాన్ని పెంపొందించి, వైద్య‌సంర‌క్ష‌ణ నిపుణుల‌కు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేందుకు గానూ వ‌చ్చే ఐదేళ్లలో  75,000 కొత్త వైద్య విద్య సీట్లు జ‌త చేయాల‌నే ప్ర‌ణాళిక‌ల‌ను ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించారు.
 
14. రాజ‌కీయాల్లోకి యువ‌ర‌క్తాన్ని ఎక్కించ‌డం: రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లోకి  ల‌క్ష మంది యువ‌త‌ను తీసుకురావాల‌ని, ప్ర‌త్యేకించి వారి కుటుంబంలో రాజ‌కీయ చ‌రిత్ర లేని వారిని తీసుకురావాల‌ని ప్ర‌ధాని మోదీ పిలుపునిచ్చారు. బంధుప్రీతి, కుల‌తత్వం వంటి చెడుల‌పై పోరాడ‌టంతో పాటు దేశ రాజ‌కీయాల్లోకి కొత్త ర‌క్తాన్ని ఎక్కించ‌డ‌మే ఈ చొర‌వ ల‌క్ష్య‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves

Media Coverage

Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి 27న ప్రధానమంత్రి ప్రసంగం
August 26, 2026
దేశంలో క్రీడలు.. యువ నాయకత్వం.. పౌర బాధ్యత.. స్వచ్ఛంద సేవ.. దారుఢ్యం.. దేశ ప్రగతి వంటి అంశాలను ఈ చర్చలు ఒకే వేదికపైకి తెస్తాయి
ఈ చర్చలు ప్రధానంగా క్రీడలు.. ఒలింపిక్స్‌ ఆకాంక్షలు.. యువ నేతృత్వం.. వికిసిత భారత్.. మాదకద్రవ్య రహిత యువతరంపై దృష్టి సారిస్తాయి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా ‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. దేశ క్రీడారంగ పురోగమనంలో యువత భాగస్వామ్యం సహా వారి ఆకాంక్షల వెల్లడి, యువతరం నాయకత్వాన బలమైన వికసిత భారత్ కోసం మేధా మధనం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

జాతీయ క్రీడా దినోత్సవం-2026లో భాగంగా ‘మేరా యువ భారత్’ ఆధ్వర్యాన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలోగల రెండు కళాశాలల్లో యువతరం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జాతీయ ప్రగతి కార్యకలాపాల్లో యువత ఆకాంక్షలకు కీలక స్థానమిస్తూ ఆరోగ్యకర, క్రమశిక్షణాయుత. క్రీడాస్ఫూర్తి గల దేశానికి రూపుదిద్దాలన్న ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

దేశంలో క్రీడలు, యువ నాయకత్వం, పౌర కర్తవ్యం, స్వచ్ఛంద సేవ, దారుఢ్యం, దేశ పురోగమనం తదితర అంశాలన్నిటిపైనా చర్చను ఈ కార్యక్రమం ఒకే వేదికపైకి తెస్తుంది. దేశ క్రీడారంగ పురోగమన ఆకాంక్షలతో యువత మమేకమయ్యే ప్రత్యక్ష మార్గాన్ని నిర్దేశిస్తుంది. దేశ యువతరం, క్రీడా వ్యవస్థపై చర్చల సందర్భంగా వారి ఆలోచనలు, దృక్కోణాలను పంచుకునే వేదికగా ఇది ఉపయోగపడుతుంది.

ఈ జాతీయ స్థాయి కార్యక్రమం అనంతరం యువ భాగస్వాములు, మై భారత్ వలంటీర్లు, స్థానిక క్రీడాకారులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్థానిక స్థాయిలో చర్చలు సాగుతాయి. క్రీడాసక్తి గల యువత, ప్రముఖ క్రీడాకారులు, పతక విజేతల మధ్య ప్రత్యక్ష ఇష్టాగోష్ఠి ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఇందులో ‘యువతరం చర్చలు’ ప్రధానాంశంగా ఉంటాయి. యువ భాగస్వాములు తమ ఆలోచనలు, దృక్కోణాలు, ఆకాంక్షలను ఈ వేదిక ద్వారా పంచుకుంటారు. ఈ చర్చలు ప్రధానంగా దిగువ పేర్కొన్న 5 అంశాలపై కేంద్రీకృతమవుతాయి:

· మెరుగైన సౌకర్యాలు, శిక్షణ, క్రీడా విజ్ఞానం, సార్వజనీన భాగస్వామ్యంతో జాతీయ క్రీడా వ్యవస్థ మెరుగుదల.

· శాస్త్రీయ ప్రతిభకు గుర్తింపు, పారదర్శక ఎంపిక, దీర్ఘకాలిక క్రీడా వికాసం ద్వారా 2036లో ఒలింపిక్స్ దిశగా ప్రతిభకు పదును పెట్టడం.

· పరిపాలన వేదికలు, మై భారత్ నేతృత్వంలోని స్వచ్ఛంద సేవ ద్వారా యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దడం.

· పౌర చైతన్యం, భవిష్యత్‌ సంసిద్ధ నైపుణ్యం, వ్యవస్థీకృత స్వచ్ఛంద సేవకు ప్రోత్సాహం, ద్వారా వికసిత భారత్ ప్రస్థానం వైపు యువతరానికి సాధికారత కల్పన.

· ఈ నెల 2న ప్రారంభమైన ‘ప్రధానమంత్రి 100 వారాల ప్రచారం’లో భాగంగా వారానికోసారి జన భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మాదకద్రవ్య వినియోగంపై పోరులో క్రీడలు సహా, సహ రంగాల్లోని వివిధ బృందాల సేవల ద్వారా ‘మాదకద్రవ్య రహిత యువత’ ఉద్యమాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ధ్యేయం.