అస్సాంలో రెండు ఆస్పత్రులకు ప్రధాని శంకుస్థాపన; ‘అస్సాం మేళా’కు శ్రీకారం
   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 ఫిబ్రవరి 7వ తేదీన అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అస్సాంలో రాష్ట్ర రహదారులు, ముఖ్యమైన జిల్లా రహదారుల సంబంధిత కార్యక్రమంలో భాగంగా ఉదయం 11:45 గంటలకు సోనిత్‌పూర్‌ జిల్లాలోని ధేకియాజులి వద్ద ‘అస్సాం మేళా’ను ఆయన ప్రారంభిస్తారు. దీంతోపాటు రెండు ఆస్పత్రుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం 4:50 గంటలకు ప‌శ్చిమ‌బెంగాల్‌లోని హల్దియాలో కొన్ని కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. అదే సమయంలో మరికొన్ని ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.
ప‌శ్చిమ‌బెంగాల్‌లో ప్రధానమంత్రి
   భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించిన వంటగ్యాస్ (ఎల్పీజీ) దిగుమతి కేంద్రాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. మొత్తం రూ.1,100 కోట్లతో నిర్మించిన ఈ కేంద్రానికి ఏటా మిలియన్ టన్నుల వంటగ్యాస్ నిల్వచేయగల సామర్థ్యం ఉంది. పశ్చిమబెంగాల్ సహా తూర్పు, ఈశాన్య భారత రాష్ట్రాల్లో పెరుగుతున్న వంటగ్యాస్ అవసరాలను ఇది తీర్చగలదు. ప్రతి ఇంటికీ పరిశుభ్రమైన వంటగ్యాస్ సరఫరాపై ప్రధానమంత్రి స్వప్న సాకారం దిశగా ఇదొక ముఖ్యమైన అడుగు. ‘‘ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్’’లో భాగమైన 348 కిలోమీటర్ల దోభీ-దుర్గాపూర్ సహజవాయు పైప్‌లైన్‌ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ‘ఒకే దేశం – ఒకే గ్యాస్ గ్రిడ్’ లక్ష్య సాధనలో ఇదొక మైలురాయి కాగలదు. సుమారు రూ.2,400 కోట్ల పెట్టుబడితో ఈ పైప్‌లైన్‌ నిర్మాణంతో సింధ్రీలోని ‘హెచ్‌యూఆర్ఎల్‌’ (ఝార్ఖండ్) ఎరువుల కర్మాగారం పునఃప్రారంభం కానుంది. దుర్గాపూర్‌ (పశ్చిమబెంగాల్)లోని ‘మాటిక్స్’ ఎరువుల కర్మాగారానికి గ్యాస్ సరఫరా అవుతుంది. దీంతోపాటు రాష్ట్రంలోని పారిశ్రామిక, వాణిజ్య, ఆటోమొబైల్ రంగాల గ్యాస్ డిమాండ్ తీర్చడమేగాక ప్రధాన నగరాలు, పట్టణాల గ్యాస్ పంపిణీకి తోడ్పడుతుంది.
   ఇండియన్ ఆయిల్ కార్పొరేష‌న్‌కు చెందిన హల్దియా చమురుశుద్ధి కేంద్రంలో రెండో ఉత్ప్రేరక-ఐసోడెవాక్సింగ్ యూనిట్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఏటా 2,70,000 టన్నుల నిల్వ సామర్థ్యంగల ఈ యూనిట్ ప్రారంభమయ్యాక విదేశీ మారకం రూపేణా దాదాపు 185 మిలియన్ల అమెరికా డాలర్ల మేర ఆదా అవుతుంది. ఇక హల్దియాలో జాతీయ రహదారి-41పైగల రాణిచక్ వద్ద నిర్మించిన 4 వరుసల రోడ్డు ఓవర్ బ్రిడ్జి-కమ్-ఫ్లయ్ ఓవర్‌ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. దాదాపు రూ.190 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లయ్ ఓవర్‌ ప్రారంభమైతే కొలాఘాట్ నుంచి హల్దియా రేవు ప్రాంగణంతోపాటు పరిసర ప్రాంతాలకు వాహనాల రాకపోకలు నిరంతరాయంగా కొనసాగే వెసులుబాటు లభిస్తుంది. అంతేగాక ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, రేవులోకి రాకపోకలు సాగించే భారీ వాహనాల నిర్వహణ నిర్వహణ వ్యయం కూడా ఆదా అవుతుంది. తూర్పు భారతంలో ప్రగతికి చోదకాలు కాగల ఈ ప్రాజెక్టులన్నీ ‘పూర్వోదయ’ పేరిట ప్రధానమంత్రికిగల దృక్పథానికి అనుగుణమైనవి కావడం గమనార్హం. కాగా- ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్‌తోపాటు ముఖ్యమంత్రి, కేంద్ర పెట్రోలియం-సహజవాయువుల శాఖ మంత్రి కూడా పాల్గొంటారు.
అస్సాంలో ప్రధానమంత్రి
   అస్సాంలో రాష్ట్ర రహదారులు, ప్రధాన జిల్లా రోడ్ల నెట్‌వ‌ర్క్‌ మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ‘‘అస్సాం మేళా’’ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ‘రహదారి ఆస్తుల నిర్వహణ వ్యవస్థ’తో అనుసంధానం సహా క్షేత్రస్థాయి గణాంకాల నిరంతర సేకరణద్వారా వాటిని సమర్థంగా నిర్వహించడానికి ప్రాధాన్యం ఇస్తున్నందున ఇదెంతో విశిష్టమైన కార్యక్రమం. జాతీయ రహదారులు, రాష్ట్రంలోని గ్రామీణ రోడ్ల నెట్‌వ‌ర్క్‌ మధ్య నాణ్యమైన అంతర్గత సంధానానికి ‘అస్సాం మేళా’ వీలు కల్పిస్తుంది. అంతేగాక నిరంతర బహుళ-రవాణా సదుపాయాలకు బాటలు పరుస్తుంది. దీనివల్ల రవాణా మార్గాలతో ఆర్థిక వృద్ధి కేంద్రాలు సంధానమై, అంతర్రాష్ట్ర అనుసంధానం కూడా మెరుగుపడుతుంది. ప్రధానమంత్రి పాల్గొనే ఈ కార్యక్రమానికి అస్సాం ముఖ్యమంత్రి కూడా హాజరవుతారు.
   ఇదేకాకుండా బిశ్వనాథ్, చరైడియోలలో రూ.1100 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబోయే రెండు వైద్య కళాశాలలు, ఆసుపత్రులకు ప్రధానమంత్రి శంకుస్థాపన కూడా చేస్తారు. ఈ ఆస్పత్రులలో 500 వంతున పడకలు, 100 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయి. తద్వారా రాష్ట్రంలో వైద్య కళాశాలలు, ఆసుపత్రుల సంఖ్య పెరగడం వల్ల వైద్యుల కొరత తీరడమేగాక ఈశాన్య ప్రాంతం మొత్తానికీ తృతీయ ఆరోగ్య సంరక్షణకు, వైద్య విద్యకు అస్సాం కూడలిగా మారుతుంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Somnath Swabhiman Parv: “Feeling blessed to be in Somnath, a proud symbol of our civilisational courage,” says PM Modi

Media Coverage

Somnath Swabhiman Parv: “Feeling blessed to be in Somnath, a proud symbol of our civilisational courage,” says PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 11 జనవరి 2026
January 11, 2026

Dharma-Driven Development: Celebrating PM Modi's Legacy in Tradition and Transformation