గౌరవ అధ్యక్షులు లీ,

 

రెండు దేశాల విశిష్ట ప్రతినిధులు,

 

పాత్రికేయ మిత్రులకు,

 

నమస్కారం!

 

భారతదేశానికి తొలిసారి వచ్చిన అధ్యక్షుడు లీని స్వాగతించడం ఎంతో సంతోషంగా ఉంది. . ఆయన జీవితం పట్టుదల, సేవ, అంకితభావాలకు స్ఫూర్తిదాయక నిదర్శనం. ఆయన ఎదుర్కొన్న ప్రతి సవాలు ప్రజలకు సేవ చేయాలనే ఆయన సంకల్పాన్ని మరింత బలపరిచింది. ఇది ఆయన తొలి భారత పర్యటన అయినప్పటికీ, మా మొదటి సమావేశం లోనే దేశంపై ఆయనకున్న అభిమానం, ఆత్మీయత స్పష్టంగా కనిపించింది. 

 

మిత్రులారా, 

 

ఎనిమిది ఏళ్ల విరామం తర్వాత జరుగుతున్న కొరియా అధ్యక్షుని ఈ భారత పర్యటన ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రజాస్వామ్య విలువలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, చట్ట పాలన పట్ల గౌరవం మన రెండు దేశాల మూలాల్లో లోతుగా ఇమిడి ఉన్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంపై మాకు ఉమ్మడి దృక్పథం ఉంది. ఈ భాగస్వామ్య సూత్రాల ఆధారంగా గత దశాబ్దంలో మా సంబంధం మరింత చురుకైనదిగా, విస్తృతమైనదిగా మారింది.

 

ఈరోజు అధ్యక్షుడు లీ రాకతో, ఈ నమ్మకమైన భాగస్వామ్యాన్ని భవిష్యత్తు దిశగా సాగే భాగస్వామ్యంగా మారుస్తున్నాం. చిప్స్ నుండి ఓడల వరకు, ప్రతిభ నుంచి సాంకేతికత వరకు, పర్యావరణం నుంచి ఇంధనం వరకు అన్ని రంగాల్లో సహకారానికి కొత్త అవకాశాలను సాధిస్తాం. కలిసి కట్టుగా రెండు దేశాల ప్రగతిని, శ్రేయస్సును పెంపొందిస్తాం. 

 

మిత్రులారా, 

 

భారత్, కొరియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఈరోజు 27 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2030 నాటికి దీనిని 50 బిలియన్ డాలర్లకు పెంచే దిశగా ఈరోజు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం. 

 

రెండు దేశాల ఆర్థిక లావాదేవీలు సులభతరం చేసేందుకు భారత్-కొరియా ఆర్థిక వేదికను ప్రారంభించాం.వ్యాపార భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు పారిశ్రామిక సహకార కమిటీ ఏర్పాటు చేశాం. కీలక సాంకేతికతలు, సరఫరా వ్యవస్థలలో సహకారం పెంచేందుకు ఆర్థిక భద్రతా చర్చలు ప్రారంభిస్తున్నాం. 

 

భారతదేశంలో కొరియా సంస్థలను, ముఖ్యంగా చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటును సులభతరం చేసేందుకు, కొరియా పారిశ్రామిక వాడను కూడా ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా, వచ్చే ఏడాదిలోగా భారత్-కొరియా వాణిజ్య ఒప్పందాన్ని నవీకరిస్తాం. 

 

మిత్రులారా, 

 

రాబోయే దశాబ్దం విజయగాథలకు నేడు పునాది వేస్తున్నాం. కృత్రిమ మేధ, సెమీ కండక్టర్లు, సమాచార సాంకేతిక రంగాలలో రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్-కొరియా డిజిటల్ వారధిని ప్రారంభిస్తున్నాం. నౌకా నిర్మాణం, సుస్థిరత, ఉక్కు, ఓడరేవుల వంటి రంగాలలో అవగాహన ఒప్పందాలపై సంతకాలు కూడా చేస్తున్నాం. 

 

సంస్కృతి, సృజనాత్మక పరిశ్రమలలో పరస్పర సహకారంతో చలనచిత్ర, యానిమేషన్, ఆటల రంగాలలో కొత్త మైలురాళ్లు నెలకొల్పుతాం.నేటి వ్యాపార సదస్సు ఈ అవకాశాలను కంటికి కనిపించే ఫలితాలుగా మార్చడానికి ఒక సాధనంగా పనిచేస్తుంది.

మిత్రులారా, 

 

భారత్, కొరియా దేశాలు వేల ఏళ్ల సాంస్కృతిక బంధాలను కలిగి ఉన్నాయి. రెండు వేల ఏళ్ల క్రితం నాటి అయోధ్య రాజకుమారి సూరిరత్న, కొరియా రాజు కిమ్ సురోల కథ మన ఉమ్మడి వారసత్వంలో ఒక భాగం.

 

భారతదేశంలో కొరియా సంగీతం, కొరియా ధారావాహికలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అలాగే కొరియాలో కూడా భారతీయ చలన చిత్రాలకు, సంస్కృతికి గుర్తింపు పెరుగుతోంది. భారతీయ చలన చిత్రాలను అధ్యక్షుడు లీ ఇష్టపడతారనే విషయం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు 2028లో భారత్-కొరియా మైత్రి ఉత్సవాన్ని నిర్వహిస్తాం. 

 

అలాగే, ప్రజల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేయడానికి విద్య, పరిశోధన, పర్యాటక రంగాలలో సహకారాన్ని ప్రోత్సహిస్తాం. 

 

మిత్రులారా, 

 

ప్రస్తుత ప్రపంచ ఉద్రిక్తతల కాలంలో భారత్, కొరియా కలిసి శాంతి, సుస్థిరత సందేశం అందిస్తున్నాయి. కొరియా నేడు అంతర్జాతీయ సౌర కూటమి, ఇండో-పసిఫిక్ మహాసముద్రాల చొరవలో చేరుతున్నందుకు మాకు సంతోషం కలిగిస్తోంది. ఉమ్మడి కృషి ద్వారా శాంతియుత, ప్రగతిశీల, సమ్మిళిత ఇండో-పసిఫిక్ నిర్మాణానికి మా తోడ్పాటును అందిస్తూనే ఉంటాం.

 

సమకాలీన ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి అంతర్జాతీయ సంస్థలలో సంస్కరణలు అవసరమని మేం కూడా అంగీకరిస్తున్నాం. 

 

గౌరవ అధ్యక్షా,

 

దాదాపు వంద ఏళ్ల క్రితం, భారత గొప్ప కవి రవీంద్రనాథ్ ఠాగూర్ కొరియాను 'తూర్పు దీపం'గా అభివర్ణించారు. 2047 నాటికి మా ‘అభివృద్ధి చెందిన భారత్‘ లక్ష్యాన్ని సాకారం చేసుకునే ప్రయాణంలో కొరియా ముఖ్య భాగస్వామిగా ఉంటుంది. 

 

మన భాగస్వామ్యంతో మన రెండు దేశాలకే కాకుండా, ప్రపంచం మొత్తం ప్రగతికి, శ్రేయస్సుకు మార్గాన్ని మార్గం సుగమం చేద్దాం.

 

చాలా ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Jumbo Indian contingent comprising 768 athletes, support staff and officials for Asian Games

Media Coverage

Jumbo Indian contingent comprising 768 athletes, support staff and officials for Asian Games
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 4 సెప్టెంబర్ 2026
September 04, 2026

Make in India, Power India, Play for India: Multi-Sector Momentum Under PM Modi’s Leadership