పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆరంభం కావడానికి ముందు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో ప్రసార మాధ్యమాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. వర్షాకాల సమావేశాలకు ప్రతి ఒక్కరికీ స్వాగతం అని ఆయన అన్నారు. వర్షాకాలం అంటే నవకల్పనకు, పునరుద్ధరణకు ప్రతీక అని అభివర్ణించారు. ‘ప్రస్తుతం దేశం నలుమూలలా వాతావరణ స్థితిగతులు అనుకూలిస్తున్నాయి, ఇది పంటలకు ప్రయోజనకరమంటూ ముందస్తు అంచనాలు వెలువడుతున్నాయి’ అని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. వర్షపాతం ఒక్క గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కీలకం కాదని, దేశ సమగ్ర ఆర్థిక వ్యవస్థకు, ప్రతి కుటుంబ ఆర్థిక శ్రేయానికీ వానలు ముఖ్యమని చెప్పారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే ఈ ఏడాది జలాశయాల్లో నీటిమట్టం స్థాయిలు గత పది సంవత్సరాలతో పోలిస్తే మూడింతలు అయ్యాయని శ్రీ మోదీ తెలిపారు. ఈ వృద్ధి రాబోయే కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు చెప్పుకోదగ్గ స్థాయిలో మేలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
‘‘ప్రస్తుత వర్షాకాల సమావేశాలు భారత ప్రజలకు గర్వకారక ఘట్టం, ఈ సందర్భం దేశం తన గెలుపును పండుగ చేసుకోవడానికి ఒక ప్రతీకగా ఉండబోతోంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మొట్టమొదటిసారి భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన చరిత్రాత్మక క్షణాన్ని ఆయన గుర్తు చేసి, ఇది దేశంలో అందరికీ అమిత సంతోషదాయక విషయమంటూ అభివర్ణించారు. ఈ విజయం దేశవ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ, నవకల్పనల రంగాల్లో ఒక సరికొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించిందని స్పష్టం చేశారు. ఈ ఘనతను సాధించడం పట్ల పూర్తి పార్లమెంటు.. ఇటు లోక్ సభ, అటు రాజ్య సభ.. వీటితో పాటు మన దేశ ప్రజలంతా తమ ఆనందాన్ని ఒక్కుమ్మడిగా వ్యక్తం చేస్తున్నారని శ్రీ మోదీ తెలిపారు. ఈ సమష్టి సంబురాలు ఇండియా రాబోయే కాలంలో చేపట్టే అంతరిక్ష అన్వేషణ సాహసయాత్రలకు ప్రేరణగా నిలవడంతో పాటు ప్రోత్సాహాన్ని అందిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

భారత్ సాధించిన విజయాలను పండుగ చేసుకొనే సందర్భమే ఈ వర్షాకాల సమావేశాలు అని శ్రీ మోదీ అభివర్ణించారు. భారత్ సాయుధ దళాల శక్తి సామర్థ్యాలను ప్రపంచం గమనించిందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ, భారతీయ సైన్యం లక్ష్యాల వైపునకు గురిపెట్టి 100 శాతం గెలుపు సాధించిందని ప్రధానంగా చెప్పారు. ఆపరేషన్ సిందూర్ చేపట్టి, 22 నిమిషాల్లో భారత్ బలగాలు పేరుమోసిన లక్ష్యాలను స్థావరాల వారీగా నామరూపాలు లేకుండా నాశనం చేశాయని ఆయన ఉద్ఘాటించారు. ఈ ఆపరేషన్‌ను గురించి బీహార్‌లో ఒక జనసభలో తాను ప్రస్తావించానని, సాయుధ దళాలు తమ చేవను వెనువెంటనే నిరూపించాయని గుర్తు చేశారు. రక్షణ రంగంలో భారత్ ‘‘మేడ్ ఇన్ ఇండియా’’ శక్తియుక్తులను ప్రదర్శిస్తుంటే, ఈ అంశంలో ప్రపంచ దేశాల ఆసక్తి అంతకంతకు పెరుగుతోందని ప్రధానమంత్రి వివరించారు. ఇటీవల తాను వివిధ దేశాల నేతలతో జరిపిన ముఖాముఖి చర్చల్లో భారత్ సైనిక సామగ్రిని దేశీయంగానే తయారు చేసుకొన్నందుకు వారు ప్రశంసలు కురిపించారని శ్రీ మోదీ తెలిపారు. ఈ విజయాన్ని పండుగ చేసుకోవడానికి వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభలు తమ వాణిని ఏక స్వరంతో వినిపిస్తాయన్న విశ్వాసం తనకుందన్నారు. ఇది భారత సైనిక శక్తికి మరింత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇవ్వగలదని ఆయన అన్నారు. ఈ సామూహిక భావన పౌరులకు కూడా స్ఫూర్తిదాయకం అవుతుందని, రక్షణ రంగంలో పరిశోధన, నవకల్పన, తయారీలకు కొత్త వేగాన్ని జతపరచడంతో పాటు దేశ యువతకు నూతన ఉద్యోగావకాశాలను కల్పించగలదని ప్రధానమంత్రి అన్నారు.
శాంతి, ప్రగతి చెట్టపట్టాల్ వేసుకొని ముందుకు సాగిపోవడానికి ఈ దశాబ్దం ప్రతీకగా నిలిచిందని, అడుగడుగున అభివృద్ధి భావన ఉట్టిపడుతోందని ప్రధానమంత్రి అన్నారు. ‘‘దేశం చాలా కాలంగా వివిధ హింసాత్మక సంఘటనలతో సతమతం అయింది.. అవి ఉగ్రవాద దాడులు కావచ్చు, లేదా నక్సలిజం కావచ్చు.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇవి కొనసాగుతూవచ్చాయి’’ అని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. నక్సలిజం, మావోయిజం జాడలు ఇప్పుడు వేగంగా కుదించుకుపోతున్నాయని వ్యాఖ్యానించిన శ్రీ మోదీ.. దేశ భద్రతా దళాలు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఇదివరకటి కంటే ఎక్కువ ఉత్సాహంతో ప్రస్తుతం నక్సలిజాన్ని, మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించే లక్ష్యం వైపు స్థిరంగా ముందుకు కదులుతున్నాయని చెప్పారు. నక్సల్ హింస పట్టు నుంచి బయటపడడంతో, దేశంలో వందలాది జిల్లాలు ఇక స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకొంటున్నాయని ఆయన సగర్వంగా చాటిచెప్పారు. ఆయుధాలపైనా, హింసపైనా భారత రాజ్యాంగానిదే పైచేయి అవుతోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
ఇదివరకటి ‘రెడ్ కారిడార్’ ప్రాంతాలు ప్రస్తుతం ‘గ్రీన్ గ్రోత్ జోన్స్’ (పచ్చదనంతో కళకళలాడుతున్న అభివృద్ధి మండలాలు)గా స్పష్టమైన మార్పును సంతరించుకొంటూ, దేశానికి భవిష్యత్తు ఆశాభరితంగా ఉందనడానికి సూచికగా నిలుస్తున్నాయని ఆయన వివరించారు.

ఈ ఘట్టాలలో ప్రతి ఘట్టం వెనుకా దేశమంటే భక్తి, ప్రజాసంక్షేమం పట్ల అంకిత భావం ఉట్టిపడుతున్నాయని ప్రధానమంత్రి చెప్తూ, ఈ ఘట్టాలు పార్లమెంటులో ప్రతి ఒక్క సభ్యునికి, సభ్యురాలికి గర్వకారణమైన ఘట్టాలేనని అభివర్ణించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రతి రాజకీయపక్షానికి చెందిన ప్రతి ఎంపీ వ్యక్తం చేసే అభిప్రాయం జాతి గర్వపడుతున్న ఈ విజయోత్సవానికి జయ ఘోషగా మారి, యావత్తు దేశ పౌరుల చెవులకు సోకగలదని శ్రీ మోదీ అన్నారు.
తమ ప్రభుత్వం 2014లో పాలన పగ్గాలను అందుకొన్నప్పుడు, భారత్ సులువుగా దెబ్బతినగల అయిదు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉందని ప్రధానమంత్రి చెప్పారు. ఆ కాలంలో, ప్రపంచ ఆర్థిక ర్యాంకింగుల్లో భారత్ 10వ స్థానంలో ఉందని, అయితే ప్రస్తుతం ఇండియా శరవేగంగా దూసుకుపోతూ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే స్థితికి చేరువ అవుతోందన్నారు. 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారు, ఈ మార్పును ప్రపంచ సంస్థలు అనేకం గుర్తించి, అభినందించాయని ఆయన స్పష్టం చేశారు. 2014 కంటే ముందు, భారత్ రెండంకెల ద్రవ్యోల్బణంతో అల్లాడిందని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఇవాళ, ద్రవ్యోల్బణం రేట్లు సుమారు 2 శాతం వద్దే తిరుగాడుతున్నాయి. పౌరులు ఊరట చెందుతున్నారు.. జీవన సౌలభ్యం మెరుగైంది. తక్కువ ద్రవ్యోల్బణానికి అధిక వృద్ధి తోడు కావడం బలమైన, నిలకడతనంతో కూడిన అభివృద్ధి బాటలో దేశ పురోగమనాన్ని సూచిస్తోంది’’ అని శ్రీ మోదీ వివరించారు.
‘‘డిజిటల్ ఇండియా, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) వంటి కార్యక్రమాలు భారత్‌లో అందివస్తున్న అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్తున్నాయి. భారత డిజిటల్ అనుబంధ విస్తారిత వ్యవస్థ పట్ల ప్రపంచ దేశాల్లో గుర్తింపు, ఆసక్తి అంతకంతకు పెరుగుతున్నాయి’’ అని ప్రధానమంత్రి అన్నారు. ఫిన్‌టెక్ రంగంలో యూపీఐ బలమైన ఉనికిని ఏర్పరుచుకొందని ఆయన వ్యాఖ్యానించారు. రియల్-టైం లావాదేవీల్లో ప్రపంచ దేశాలన్నిటి కంటే ఎక్కువగా నమోదు చేస్తూ భారత్ అగ్రగామిగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్న ఒక ప్రపంచ స్థాయి శిఖరాగ్ర సదస్సులో భారత్ ప్రధాన విజయాలను సాధించడాన్ని గురించి శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ)ను ఉదాహరించారు. ఇండియాలో 90 కోట్ల మందికి పైగా పౌరులకు సామాజిక భద్రత లభిస్తోందని, సామాజిక సంక్షేమం పరంగా చూస్తే ఇది ఒక ప్రధాన విజయమని ఐఎల్ఓ పేర్కొందని ఆయన తెలిపారు. వానాకాలంలో సాధారణంగా వ్యాపించే కంటి వ్యాధి ‘ట్రాకోమా’ ఆనవాళ్లు భారత్‌లో మచ్చుకైనా లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొన్న సంగతిని కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ గుర్తింపు భారత్ ప్రజారోగ్యసంరక్షణ కృషిలో ఒక చెప్పుకోదగ్గ ముఖ్య ఘట్టమని ఆయన స్పష్టం చేశారు.
పహల్‌గామ్‌లో క్రూర హత్యలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేయడమే కాక, ఉగ్రవాదం పట్ల ఉగ్రవాదానికి కొమ్ముకాస్తున్న శక్తుల పట్ల ప్రపంచం దృష్టిని సారించేలా చేశాయని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఈ హత్యాకాండకు ప్రతిస్పందనగా చాలావరకు రాజకీయ పక్షాల ప్రతినిధులు, రాష్ట్రాలు పక్షపాత ప్రయోజనాలకు అతీతంగా వ్యవహరించి దేశ ప్రజల సేవను మిన్నగా భావిస్తూ అంతర్జాతీయ ప్రచారానికి కదం తొక్కినట్లు ఆయన వివరించారు. ఈ సమైక్య దౌత్య ప్రచారోద్యమం పాకిస్తానును ఉగ్రవాద మద్దతుదారు దేశంగా ప్రపంచ రంగస్థలంపై నిలబెట్టి, సఫలమైందని ఆయన ప్రధానంగా చెప్పారు. ఈ కీలక జాతీయ కార్యక్రమానికి తోడ్పాటును అందించిన రాజకీయపక్షాలను, ఎంపీలను శ్రీ మోదీ మనస్ఫూర్తిగా అభినందించారు. వారి ప్రయత్నాలు దేశంలో ఒక సానుకూల వాతావరణాన్ని నెలకొల్పడమే కాకుండా ఉగ్రవాదం విషయంలో భారత్ దృక్పథాన్ని అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకొనేటట్లు చేశాయని ఆయన అన్నారు. దేశ హితం కోరి ఈ ముఖ్య సేవలో పాలుపంచుకొన్న ప్రతి ఒక్కరినీ ప్రశంసించడం తనకు దక్కిన అదృష్టంగా తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు.
ఐకమత్యానికి ఉన్న శక్తి, ఒకే స్వరాన్ని వినిపించే భావన .. ఇవి దేశ ప్రజలకు స్ఫూర్తిని పంచుతాయి, వారిని ఉత్తేజితులను చేస్తాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ భావనలనే ప్రస్తుత వర్షాకాల సమావేశాలు కూడా ప్రతిబింబిస్తాయని ఆయన అన్నారు. ఈ క్రమంలో విజయోత్సవ స్ఫూర్తికి ఈ సమావేశాలు అద్దం పడతాయని, భారత సైనిక శక్తి, దేశ సామర్థ్యాలను గౌరవిస్తూ, 140 కోట్ల మంది పౌరులకు ప్రేరణనివ్వగలవని కూడా ప్రధానమంత్రి చెప్పారు. మన అందరి ప్రయత్నాలు రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధనకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను బలపరచగలవని శ్రీ మోదీ అన్నారు. సాయుధ దళాల బలాన్ని దేశం గుర్తించి, ప్రశంసించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయ పక్షాలతో పాటు ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఐకమత్యం నుంచి, ఒకే వాణిగా వినిపించే మాట నుంచి వెలువడే ప్రభావం చాలా బలంగా ఉంటుందని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ భావనను పార్లమెంటులో వ్యక్తపరచండంటూ ఎంపీలందరికీ ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ పక్షాలకు వేటికి వాటికి వాటి వాటి ఎజెండాలంటూ ఉంటాయని శ్రీ మోదీ అంగీకరిస్తూ, అభిప్రాయాలు అనేవి పార్టీ ప్రయోజనాల పరంగా భిన్నమైనవే అవ్వొచ్చుగాక.. దేశ హితంతో ముడిపడ్డ విషయాలలో పొందికతో కూడిన సంకల్పం ఉండితీరాలని స్పష్టం చేశారు. ఆయన తన ప్రసంగం చివర్లో, ఈ పార్లమెంట్ సమావేశాలు దేశాభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో ప్రతిపాదిస్తున్న అనేక బిల్లులకు వేదిక అవుతాయని, ఈ సమావేశాలు పౌరులకు సాధికారతను కల్పిస్తూ, దేశ ప్రగతిని బలపరుస్తాయని పునరుద్ఘాటించారు. ఫలప్రదం కాగల, అధిక నాణ్యతతో కూడిన చర్చలో పాల్గొనాల్సిందిగా ఆశిస్తూ పార్లమెట్ సభ్యులకు ఆయన తన శుభాకాంక్షలు తెలిపారు.
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
The Monsoon Session stands as a proud moment for the nation, a true celebration of our collective achievements: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 21, 2025
The world has witnessed the strength of India's military power. In Operation Sindoor, Indian soldiers achieved their objective with 100% success, demolishing the masterminds behind terrorism in their hideouts: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 21, 2025
India has endured many violent challenges, be it terrorism or Naxalism, but today, the influence of Naxalism and Maoism is shrinking rapidly. The Constitution prevails over bombs and guns. The red corridors of the past are now transforming into green zones of growth and…
— PMO India (@PMOIndia) July 21, 2025
Digital India is making waves globally, with UPI gaining popularity across many countries. It has become a recognised name in the world of FinTech: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 21, 2025
The brutal massacre in Pahalgam shocked the entire world and drew global attention to terrorism and its epicentre. Rising above party lines, representatives from across India united to expose Pakistan's role: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 21, 2025


