గౌరవనీయ మిత్రులారా, నమస్కారం!

 ఈ సదస్సు కోసం ఘనమైన ఏర్పాట్లు చేసిన థాయిలాండ్ ప్రభుత్వానికి, గౌరవనీయ షినవత్ర గారికి నా కృతజ్ఞతలు.

 మిత్రులారా,

ఇటీవల మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో భూకంపం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాల పట్ల భారత ప్రజలందరి తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. విపత్తు బాధితులకు సంఘీభావాన్ని  తెలియపరుస్తూ  క్షతగాత్రులైన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం.

మిత్రులారా,

గత మూడేళ్ళగా సమర్థవంతమైన నాయకత్వంతో  బిమ్స్ టెక్  కు సారథ్యం వహిస్తున్న ప్రధానమంత్రికి, వారి బృందానికి అభినందనలు తెలుపుతున్నాను.  

దక్షిణాసియా, ఆగ్నేయాసియాల మధ్య  వారధిగా ఉన్న బిమ్స్ టెక్,   ప్రాంతీయ సహకారం, అనుసంధానం, సామూహిక ప్రగతికి దోహదం చేసే కీలక వేదికగా ఆవిర్భవిస్తోంది.

గతేడాది బిమ్స్ టెక్ ప్రణాళికాపత్రం అమలు ప్రారంభం సంతృప్తినిచ్చే అంశం.

ఇక ఈరోజు అవలంబించబోయే బ్యాంకాక్ విజన్-2030, బంగాళాఖాత ప్రాంతాన్ని సుసంపన్న, సురక్షిత, సమ్మిళిత ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న మన తపనకు మరింత ఊతమిస్తుందనడంలో సందేహమే లేదు .
 

మిత్రులారా,

బిమ్స్ టెక్ ను మరింత బలోపేతం చేసేందుకు కూటమి పరిధిని, సంస్థాగత సామర్థ్యాన్ని పెంచవలసి ఉంది.

హోం మంత్రిత్వ వ్యవస్థను సంస్థాగతం చేయడం శుభ పరిణామం. సైబర్ నేరాలు, సైబర్ భద్రతా సవాళ్ళు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల వ్యాపారం, మానవ అక్రమ రవాణా వంటి సవాళ్ళను ఎదుర్కోవడంలో ఈ వేదిక కీలక పాత్ర పోషించగలదు. ఈ ఏడాది జరగబోయే ‘హోం మినిస్టర్ వ్యవస్థ’ తొలి సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు మేం సిద్ధమని  ఈ సందర్భంగా ప్రతిపాదిస్తున్నాను.

మిత్రులారా,

ప్రాంతీయ అభివృద్ధికి డిజిటల్, ఇంధన అనుసంధానాలతో పాటు భౌతిక అనుసంధానమూ ముఖ్యమైనదే.

బెంగళూరులోని బిమ్స్ టెక్ ఇంధన కేంద్రం తన కార్యకలాపాలను ప్రారంభించిందని తెలియజేయడం సంతోషాన్నిస్తోంది. కూటమి దేశాల మధ్య ఎలక్ట్రిక్ గ్రిడ్ అనుసంధానాన్ని సాధించేందుకు మన బృందాలు కృషిని పెంచాలి.

మా దేశంలో అమలు చేస్తున్న డిజిటల్ పౌర సదుపాయాల వ్యవస్థ (డీపీఐ) ప్రజలకు సేవల అందజేతలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. సమర్థమైన పాలన, మెరుగైన పారదర్శకత, వేగవంతమైన సమ్మిళిత ఆర్థిక వృద్ధికి డీపీఐ దోహదపడింది. బిమ్స్ టెక్   సభ్య దేశాలతో మా డీపీఐ అనుభవాన్ని పంచుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రణాళికకు కార్యరూపం ఇచ్చేందుకు, సభ్యదేశాల ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక అధ్యయనాన్ని చేపట్టవచ్చు.

భారత్ యూపీఐ (యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ని బిమ్స్ టెక్ సభ్యదేశాల పేమెంట్ వ్యవస్థలతో అనుసంధానించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. ఇటువంటి అనుసంధానం వ్యాపార, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు లబ్ధి చేకూర్చి, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమివ్వగలదు.
 

మిత్రులారా,

మన సమష్టి పురోగతికి వ్యాపార, వాణిజ్యపరమైన అనుసంధానం ఎంతో ముఖ్యమైనది.

మన వ్యాపార సంఘాల మధ్య  భాగస్వామ్య, సహకారాలను పెంపొందించేందుకు బిమ్స్ టెక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను ఏర్పాటుచేయాలని ప్రతిపాదిస్తున్నాను. ఆపై మెరుగైన ఆర్థిక అనుసంధానం కోసం వార్షిక వ్యాపార సదస్సును ఏర్పాటు చేయవచ్చు.  

బిమ్స్ టెక్  ప్రాంతంలో సభ్య దేశాల మధ్య వాణిజ్యాన్ని  స్థానిక కరెన్సీలో చేపట్టే వీలు గురించి అధ్యయనం చేపట్టాలని నా సూచన.

 
మిత్రులారా,


సురక్షితమైన హిందూ మహాసముద్రం అందరికీ అందుబాటులో ఉండాలన్నది మన అందరి కోరిక. నేడు ఖరారైన నౌకావాణిజ్య, రవాణా ఒప్పందం నౌకా వాణిజ్యాన్ని, సరుకుల రవాణాని పటిష్టపరచి కూటమి దేశాల మధ్య వాణిజ్యానికి ఊతమివ్వగలదు.  

బలమైన నౌకా వాణిజ్య, రవాణా కేంద్రాన్ని ప్రారంభించాలని భారత్ ప్రతిపాదిస్తోంది. ఈ కేంద్రం సామర్థ్య పెంపు, పరిశోధన, నూతన ఆవిష్కరణలు లక్ష్యాలుగా పనిచేస్తూ, నౌకావాణిజ్య విధాన రూపకల్పనలో సహకారాన్ని సాధిస్తుంది. ఈ ప్రాంతంలో నౌకారవాణా భద్రత విషయమై సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడంలో కూడా సహాయపడుతుంది.  
 

మిత్రులారా,

బిమ్స్ టెక్ ప్రాంతం ప్రకృతి విలయాలను ఎక్కువగా చవిచూసే ప్రాంతమని ఇటీవల సంభవించిన భూకంపం మనకు మరోసారి గుర్తు చేసింది.

సంక్షోభ సమయాల్లో భారత్ తొలి ఆపన్నహస్తం అందించే మిత్ర దేశమని మీకు తెలుసు. మయన్మార్ విపత్తు బాధితులకు సకాలంలో సాయమందించగలగడం మాకు ఊరటనిచ్చే అంశం. ప్రకృతి విపత్తులపై మనకు ఎటువంటి అదుపు లేకపోయినా, వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధత, వేగవంతమైన స్పందన విషయాల్లో ఎటువంటి ఉపేక్షకు తావులేదు.  

ఈ నేపథ్యంలో భారతదేశంలో బిమ్స్ టెక్ విపత్తు నిర్వహణ ప్రధానకేంద్రం ఏర్పాటు చేయాలని నేను ప్రతిపాదిస్తున్నాను. విపత్తు సంసిద్ధత, సహాయ, పునరావాస చర్యలను ఈ కేంద్రం పర్యవేక్షించగలదు. ఇక బిమ్స్ టెక్ విపత్తు నిర్వహణ సంస్థల నాలుగో సంయుక్త విన్యాసాలు ఈ ఏడాది తరువాయి భాగంలో మా దేశంలో జరుగుతాయి.  

మిత్రులారా,

మన సమష్టి సామాజిక అభివృద్ధిలో ప్రజారోగ్యం మూలస్థంభం వంటిది.
క్యాన్సర్ వ్యాధి నిర్వహణలో బిమ్స్ టెక్ సభ్య దేశాలకు శిక్షణ, ఆరోగ్య వ్యవస్థల సామర్థ్య పెంపు అంశాల్లో సాయాన్నందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఆరోగ్యం పట్ల మా సమగ్ర వైఖరికి చిహ్నంగా పారంపరిక చికిత్సా విధానాలను గురించి తెలియజేసే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేస్తాం.

రైతుల ప్రయోజనార్థం వ్యవసాయ రంగానికి సంబంధించి మరో ఉన్నత స్థాయి కేంద్రాన్ని భారత్ లో  ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నాం. ఈ కేంద్రం ఉత్తమ సాగు పద్ధతులు, సమాచార మార్పిడి, పరిశోధనల్లో సహకారం, వ్యవసాయ రంగంలో సామర్థ్యాల పెంపుకు దోహదపడుతుంది.  

మిత్రులారా,

అంతరిక్ష రంగంలో భారతీయ శాస్త్రవేత్తలు సాధించిన ఘన విజయాలు అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల యువతకు  స్ఫూర్తినిస్తున్నాయి. బిమ్స్ టెక్ సభ్య దేశాలతో మా పరిజ్ఞానం, అనుభవాలను పంచుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.
ఈ విషయమై సిబ్బంది శిక్షణ, నానో శాటిలైట్ల తయారీ, ప్రయోగం, రిమోట్ సెన్సింగ్ డేటా వినియోగాలను గురించి అవగాహన పెంపును సాధ్యం చేసేందుకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నాను.

మిత్రులారా,

ఈ ప్రాంతంలోని యువత నైపుణ్యాల మెరుగుదల కోసం ‘బోధి’ (బిమ్స్ టెక్ ఫర్ ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) పేరిట ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.
ఈ పథకం కింద బిమ్స్ టెక్ సభ్య దేశాలకు చెందిన 300 మంది  యువతకు ఏటా భారత్ లో శిక్షణనిస్తాం.  
భారత్ ఫారెస్ట్రీ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ లో బిమ్స్ టెక్ విద్యార్థులకు ఉపకార వేతనాన్ని అందించగలం, నలందా విశ్వవిద్యాలయంలోని స్కాలర్షిప్ సదుపాయాన్ని విస్తరిస్తాం. అంతేకాక, కూటమి దేశాల యువ దౌత్యవేత్తలకు భారత్ వార్షిక శిక్షణా కార్యక్రమాన్ని అందిస్తుంది.

మిత్రులారా,

మన సమష్టి  సాంస్కృతిక వారసత్వం బలమైన అనుబంధానికి పునాది కాగలదు.
ఒడిశా ‘బలి జాత్ర’, బౌద్ధ, హిందూ మతాల మధ్య గల బలమైన చారిత్రాత్మక బంధాలు, సంప్రదాయాలు, భాషాపరమైన సారూప్యాలు – ఇవన్నీ మన మధ్య నెలకొన్న సాంస్కృతిక అనుబంధాలకి ప్రతీకలే.
మన మధ్య గల బంధాలను వేడుక చేసుకునేందుకు తొలి  సాంప్రదాయిక సంగీతోత్సవాన్ని భారత్ ఈ ఏడాది నిర్వహిస్తుంది.

మిత్రులారా,

మన యువత మధ్య మరింత సహకారాన్ని పెంపొందించేందుకు బిమ్స్ టెక్ యంగ్ లీడర్స్ సమిట్ ను ఏర్పాటు చేస్తున్నాం. అదే విధంగా యువతలో సృజనాత్మకత, సహకార స్ఫూర్తులను పెంపొందించేందుకు  బిమ్స్ టెక్ హ్యాకథాన్,  
యంగ్ ప్రొఫెషనల్ విజిటర్స్ ప్రోగ్రాంను ప్రారంభిస్తాం.
ఇక క్రీడారంగం విషయానికొస్తే, ఈ ఏడాది బిమ్స్ టెక్ అథ్లెటిక్స్ మీట్ కు ఆతిథ్యమివ్వగలమని ప్రతిపాదిస్తున్నాం.  2027లో బిమ్స్ టెక్  30వ వార్షికోత్సవం సందర్భంగా భారత్ తొలి బిమ్స్ టెక్   గేమ్స్ కు ఆతిథ్యమిస్తుంది.

మిత్రులారా,

బిమ్స్ టెక్ ను మేము కేవలం ఒక ప్రాంతీయ కూటమిగా భావించడం లేదు. సమ్మిళిత అభివృద్ధి, ఉమ్మడి భద్రతకు మన కూటమి మచ్చుతునక.. మన ఉమ్మడి బాధ్యతలకు, బలానికీ తార్కాణం.
“సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్” అన్న స్ఫూర్తికి నిండైన ప్రతీక.  

మన మధ్య గల సంఘీభావాన్ని, సమ్యక్ స్ఫూర్తిని, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకుని బిమ్స్ టెక్ ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దగలమని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను.  

బిమ్స్ టెక్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించబోయే బంగ్లాదేశ్ కు  హృదయపూర్వక అభినందనలు. వారి నాయకత్వం విజయవంతమవ్వాలని ఆకాంక్షిస్తున్నాను.

 అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool

Media Coverage

How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 డిసెంబర్ 2025
December 20, 2025

Empowering Roots, Elevating Horizons: PM Modi's Leadership in Diplomacy, Economy, and Ecology