· “బీహార్‌లో నిర్వహిస్తున్న ఈ యువజన క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు నా శుభాకాంక్షలు.. ఈ వేదికపై అత్యుత్తమ ప్రతిభా ప్రదర్శన ద్వారా సిసలైన మీ క్రీడా నైపుణ్యానికి ప్రోత్సాహం లభించాలని ఆకాంక్షిస్తున్నాను”
· “భారత్‌లో 2036 ఒలింపిక్స్‌ నిర్వహణకు మన దేశం ఇప్పటినుంచే కృషి చేస్తోంది”
· “దేశంలో క్రీడా మౌలిక సదుపాయాల ఆధునికీకరణపై ప్రభుత్వం నిశితంగా దృష్టి సారిస్తోంది”
· “గత దశాబ్ద కాలంలో క్రీడా బడ్జెట్‌ మూడు రెట్లు పెరిగింది... ఈ ఏడాది కేటాయింపులు దాదాపు రూ.4,000 కోట్లకు చేరాయి”
· “దేశంలో అత్యుత్తమ క్రీడాకారులను.. అద్భుత క్రీడా నిపుణులను రూపొందించే లక్ష్యంతో కొత్త జాతీయ విద్యా విధానం కింద క్రీడలను ప్రధాన స్రవంతి విద్యలో భాగం చేశాం”

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు 7వ ఖేలో ఇండియా యువజన క్రీడలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించి, ప్రసంగించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, శిక్షకులు, క్రీడా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు అసమాన ప్రతిభ, దృఢ సంకల్పం ప్రదర్శించారని ఆయన అభినందించారు. వారి అంకితభావం, కృషిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- భారతీయ క్రీడా స్ఫూర్తిని నిలువెత్తున నిలపడంలో వారి పాత్రను ప్రశంసించారు. క్రీడాకారుల అద్భుత నైపుణ్యం, నిబద్ధతను స్పష్టం చేస్తూ- క్రీడలపై వారి మక్కువ, ప్రతిభకు పదును పెట్టుకోవడంలో వారి అకుంఠిత దీక్ష దేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి చెప్పారు. భవిష్యత్తులోనూ వారి కఠోర శ్రమ నిరంతరం ఫలించాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.

ఖేలో ఇండియా యువజన క్రీడల్లో భాగంగా బీహార్‌లోని పాట్నా, రాజ్‌గిర్, గయ, భాగల్‌పూర్, బెగుసరాయ్‌ సహా పలు నగరాల్లో పోటీల విస్తృత నిర్వహణ గురించి ప్రధాని వివరించారు. దేశం నలుమూలల నుంచి 6 వేల మందికిపైగా యువ క్రీడాకారులు తమ కలలు, ఆకాంక్షలను మోసుకుంటూ ఈ క్రీడా సంరంభంలో పాల్గొంటున్నారని శ్రీ మోదీ గుర్తుచేశారు. దేశంలో నేడు క్రీడలు ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపుగా పురోగమిస్తున్నాయంటూ క్రీడాకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. “భారత క్రీడా సంస్కృతి ఇనుమడిస్తున్న కొద్దీ, ప్రపంచ వేదికపై మన దేశం మృదు శక్తి కూడా ఇనుమడిస్తుంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. దేశ యువతకు ఓ కీలక వేదికను సమకూర్చడంలో ఖేలో ఇండియా యువజన క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఉందన్నారు.
ప్రతిభకు పదును పెట్టుకోవడంలో క్రీడాకారులు నిరంతర శ్రమించాల్సి ఉంటుందని ప్రధాని అన్నారు. ఈ మేరకు మరిన్ని మ్యాచ్‌లు ఆడటం, వివిధ వేదికలపై పోటీలలో పాల్గొనడం అవసరమని స్పష్టం చేశారు. తదనుగుణంగా ప్రభుత్వం తన విధానాలలో ఈ అంశానికి సదా అగ్ర ప్రాధాన్యమిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఖేలో ఇండియా కింద-  విశ్వవిద్యాలయ, యువజన, శీతాకాల, పారా క్రీడల వంటి పలు క్రీడా పోటీలను దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా బహుళ స్థాయులలో నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. క్రమం తప్పకుండా నిర్వహించే ఈ పోటీలు క్రీడాకారులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ప్రతిభను వెలికితీస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా క్రికెట్ క్రీడను ఉదాహరిస్తూ- బీహార్‌ క్రీడాకారుడు వైభవ్ సూర్యవంశీ చిన్న వయస్సులోనే ‘ఐపీఎల్‌’లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించాడంటూ ప్రధాని ప్రశంసించారు. ఇలా రాణించడంలో అతని కృషి తక్కువదేమీ కాకపోయినా, పలు పోటీల్లో పాల్గొనడం అతని ప్రావీణ్యం మెరుగులో కీలకపాత్ర పోషించిందని చెప్పారు. ఏ క్రీడాకారుడైనా ఎంత ఎక్కువగా పోటీల్లో పాల్గొంటే అంత బాగా రాణిస్తారని స్పష్టం చేశారు. యువ క్రీడాకారులు జాతీయ స్థాయి క్రీడల సూక్ష్మ నైపుణ్యాలను అవగతం చేసుకోవడంతోపాటు విలువైన అనుభవ సముపార్జనకు ఖేలో ఇండియా యువజన క్రీడలు అవకాశం కల్పిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

మన దేశంలో ఒలింపిక్స్‌ నిర్వహించాలన్నది ప్రతి భారతీయుడి చిరకాల స్వప్నమని శ్రీ మోదీ అన్నారు. ఈ సంకల్ప సాకారంలో భాగంగా 2036లో ఒలింపిక్స్‌ నిర్వహణకు భారత్‌ చేస్తున్న కృషిని వివరించారు. అంతర్జాతీయ క్రీడలలో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోవడంలో దేశం నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. తదనుగుణంగా పాఠశాల స్థాయిలోనే క్రీడా ప్రతిభను పసిగట్టి, విశిష్ట పద్ధతులతో శిక్షణనివ్వడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్‌) పథకం వంటి కార్యక్రమాలు బలమైన క్రీడావరణ వ్యవస్థ రూపకల్పనకు దోహదం చేశాయన్నారు. బీహార్ సహా దేశవ్యాప్తంగా వేలాది క్రీడాకారులకు వీటితో ఎంతో ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. విభిన్న క్రీడలలో అవకాశాల అన్వేషణకు క్రీడాకారులను ప్రోత్సహించడంలోని ప్రాధాన్యాన్ని ఆయన ఉటంకించారు. ఇందులో భాగంగా సుసంపన్న భారత క్రీడా వారసత్వాన్ని ప్రోత్సహిస్తూ ఖేలో ఇండియా యువజన క్రీడలలో “గట్కా, కలరిపయట్టు, ఖో-ఖో, మల్లఖంబ్, యోగాసనాల” వంటి సంప్రదాయ, స్వదేశీ క్రీడలకు చోటు కల్పించామని గుర్తుచేశారు. అంతేకాకుండా సరికొత్త, వర్ధమాన క్రీడాంశాల్లోనూ భారత క్రీడాకారులు తమ ప్రతిభ చాటుకోవడాన్ని శ్రీ మోదీ ప్రస్తావించారు. ఈ మేరకు “వుషు, సెపక్ తక్రా, పెన్కాక్ సిలాట్, లాన్ బౌల్స్, రోలర్ స్కేటింగ్” వంటి క్రీడల్లోనూ మనవాళ్లు ప్రశంసనీయంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళా జట్టు ‘లాన్ బౌల్స్‌’లో పతకం సాధించారన్నారు. ఆ చారిత్రక క్షణాన్ని గుర్తుచేస్తూ- ఈ క్రీడలో భారత్‌కు ప్రపంచ గుర్తింపు లభించేలా చేశారని చెప్పారు.
 

దేశంలో క్రీడా మౌలిక సదుపాయాల ఆధునికీకరణపై ప్రభుత్వం నిశితంగా దృష్టి సారించిందని ప్రధానమంత్రి చెప్పారు. గత దశాబ్ద కాలంలో క్రీడా బడ్జెట్ మూడు రెట్లు పెరిగిన నేపథ్యంలో ఈ సంవత్సరం దాదాపు రూ.4,000 కోట్లకు చేరడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కేటాయింపులలో గణనీయ శాతం మౌలిక సదుపాయాల కల్పనకే వెచ్చిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా నేడు 1,000 కిపైగా ఖేలో ఇండియా కేంద్రాలు పనిచేస్తుండగా, వాటిలో 36కుపైగా బీహార్‌లోనే ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రం తన స్థాయిలో అనేక కార్యక్రమాలను విస్తృతం చేస్తుండటంతోపాటు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో బీహార్‌ ఎంతో ప్రయోజనం పొందుతున్నదని చెప్పారు. ఈ మేరకు రాజ్‌గిర్‌లో ‘ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’, ‘బీహార్ స్పోర్ట్స్ యూనివర్సిటీ’. ‘స్టేట్ స్పోర్ట్స్ అకాడమీ’ వంటి సంస్థల ఏర్పాటును ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇక పాట్నా-గయ హైవే వెంబడి ‘స్పోర్ట్స్ సిటీ’ నిర్మాణం కొనసాగుతున్నదని, అలాగే వివిధ గ్రామాల్లో క్రీడా సౌకర్యాల కల్పన చురుగ్గా చేపట్టారని వివరించారు. ఖేలో ఇండియా యువజన క్రీడలతో జాతీయ క్రీడా పటంలో బీహార్ గుర్తింపు మరింత పటిష్ఠం కాగలదని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు.

“క్రీడాలోకం, దానితో ముడిపడిన ఆర్థిక వ్యవస్థ దాని పరిధికి మించి విస్తరిస్తోంది. యువతరానికి ఉపాధి సరికొత్త మార్గాల సృష్టితోపాటు వ్యవస్థాపనకూ దోహదం చేస్తోంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా “ఫిజియోథెరపీ, డేటా అనలిటిక్స్, స్పోర్ట్స్ టెక్నాలజీ, బ్రాడ్‌కాస్టింగ్, ఇ-స్పోర్ట్స్, మేనేజ్‌మెంట్” వంటి వివిధ వర్ధమాన రంగాలను ఆయన ఉటంకించారు. వీటిద్వారా విభిన్న వృత్తులలో అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. “శిక్షకులు, ఫిట్‌నెస్ ట్రైనర్లు, రిక్రూట్‌మెంట్ ఏజెంట్లు, ఈవెంట్ మేనేజర్లు, స్పోర్ట్స్ లాయర్లు, మీడియా నిపుణులు”గా సరికొత్త పాత్రల్లో ఇమిడిపోయే అవకాశాలను యువ వృత్తి నిపుణులు అన్వేషించవచ్చునని సూచించారు. “స్టేడియం అన్నది ఇవాళ మ్యాచ్‌లకు వేదిక మాత్రమే కాదు... వేలాది ఉద్యోగాలకూ మూలస్తంభంగా మారింది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. జాతీయ క్రీడా విశ్వవిద్యాలయాల ఏర్పాటు, కొత్త జాతీయ విద్యా విధానం ద్వారా ప్రధాన స్రవంతి విద్యలో క్రీడలను ఏకీకృతం చేయడం వంటి కార్యక్రమాలతో క్రీడా పారిశ్రామికతలోనూ అవకాశాలు పెరుగుతున్నాయని స్పష్టం చేశారు. జీవితంలోని ప్రతి అంశంలోనూ క్రీడా స్ఫూర్తి ప్రాధాన్యాన్ని శ్రీ మోదీ ప్రస్ఫుటం చేశారు. జట్టుగా సమష్టి కృషిని, సహకారాన్ని, పట్టుదలను క్రీడలు ఎంతగానో పెంచగలవని చెప్పారు. ఆయా క్రీడలకు బ్రాండ్ అంబాసిడర్లుగా.. ‘ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తికి ప్రతినిధులుగా అత్యుత్తమంగా రాణించాలని ఆయన వారిని ప్రోత్సహించారు. ఈ క్రీడలు ముగిసేనాటికి అందరూ బీహార్ నుంచి మధుర స్మృతులతో తమ స్వస్థలాలకు చేరగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆటగాళ్లు ‘లిట్టి చోఖా’ బీహార్‌కు ప్రత్యేకమైన ప్రసిద్ధ ‘మఖానా’ రుచిని ఆస్వాదించాలని ఆయన సూచించారు.
ప్రస్తుత ఖేలో ఇండియా యువజన క్రీడల్లో పాల్గొంటున్నవారిలో క్రీడా స్ఫూర్తి, దేశభక్తి ఇనుమడించగలవని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 7వ ఖేలో ఇండియా యువజన క్రీడల ప్రారంభాన్ని అధికారికంగా ప్రకటించారు.

 ఈ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, కేంద్ర మంత్రులు శ్రీ మన్సుఖ్ మాండవీయ, శ్రీమతి రక్షా ఖడ్సే, శ్రీ రామ్‌నాథ్‌ ఠాకూర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Make in India Electronics: Cos create 1.33 million job as PLI scheme boosts smartphone manufacturing & exports

Media Coverage

Make in India Electronics: Cos create 1.33 million job as PLI scheme boosts smartphone manufacturing & exports
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister chairs the National Conference of Chief Secretaries
December 27, 2025

The Prime Minister, Shri Narendra Modi attended the National Conference of Chief Secretaries at New Delhi, today. "Had insightful discussions on various issues relating to governance and reforms during the National Conference of Chief Secretaries being held in Delhi", Shri Modi stated.

The Prime Minister posted on X:

"Had insightful discussions on various issues relating to governance and reforms during the National Conference of Chief Secretaries being held in Delhi."