· “బీహార్‌లో నిర్వహిస్తున్న ఈ యువజన క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు నా శుభాకాంక్షలు.. ఈ వేదికపై అత్యుత్తమ ప్రతిభా ప్రదర్శన ద్వారా సిసలైన మీ క్రీడా నైపుణ్యానికి ప్రోత్సాహం లభించాలని ఆకాంక్షిస్తున్నాను”
· “భారత్‌లో 2036 ఒలింపిక్స్‌ నిర్వహణకు మన దేశం ఇప్పటినుంచే కృషి చేస్తోంది”
· “దేశంలో క్రీడా మౌలిక సదుపాయాల ఆధునికీకరణపై ప్రభుత్వం నిశితంగా దృష్టి సారిస్తోంది”
· “గత దశాబ్ద కాలంలో క్రీడా బడ్జెట్‌ మూడు రెట్లు పెరిగింది... ఈ ఏడాది కేటాయింపులు దాదాపు రూ.4,000 కోట్లకు చేరాయి”
· “దేశంలో అత్యుత్తమ క్రీడాకారులను.. అద్భుత క్రీడా నిపుణులను రూపొందించే లక్ష్యంతో కొత్త జాతీయ విద్యా విధానం కింద క్రీడలను ప్రధాన స్రవంతి విద్యలో భాగం చేశాం”

బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు, మన్సుఖ్ భాయ్, సోదరి రక్షా ఖడ్సే, శ్రీ రామ్ నాథ్ ఠాకూర్ జీ, బీహార్ ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి జీ మరియు విజయ్ కుమార్ సిన్హా జీ, హాజరైన ఇతర విశిష్ట అతిథులు, క్రీడాకారులు, కోచ్ లు, ఇతర సిబ్బంది నా ప్రియమైన యువ స్నేహితులు!

దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులందరికి నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా. మీరంతా ఒకర్ని మించి మరొకరు అసమాన ప్రతిభావంతులు.

మిత్రులారా...

ఖేలో ఇండియా యువజన క్రీడల్లో భాగంగా బీహార్లోని పాట్నా, రాజ్గిర్, గయ, భాగల్పూర్, బెగుసరాయ్ సహా పలు నగరాల్లో పోటీలు జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి 6 వేల మందికిపైగా యువ క్రీడాకారులు తమ కలలు, ఆకాంక్షలను మోసుకుంటూ ఈ క్రీడా సంరంభంలో పాల్గొంటున్నారు. అందరికీ నా శుభాకాంక్షలు. దేశంలో నేడు క్రీడలు ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపుగా పురోగమిస్తున్నాయి. భారత క్రీడా సంస్కృతి ఇనుమడిస్తున్న కొద్దీ, ప్రపంచ వేదికపై మన దేశం శక్తి కూడా ఇనుమడిస్తుంది. దేశ యువతకు ఓ కీలక వేదికను సమకూర్చడంలో ఖేలో ఇండియా యువజన క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఉంది.

మిత్రులారా..

ప్రతిభకు పదును పెట్టుకోవడంలో క్రీడాకారులు నిరంతర శ్రమించాల్సి ఉంటుంది. ఈ మేరకు మరిన్ని మ్యాచ్ లు ఆడటం, వివిధ వేదికలపై పోటీలలో పాల్గొనడం అవసరం. తదనుగుణంగా ఎన్డీఏ ప్రభుత్వం తన విధానాలలో ఈ అంశానికి సదా అగ్ర ప్రాధాన్యమిస్తుంది. ఇప్పుడు ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ, ఖేలో ఇండియా యువజన, ఖేలో ఇండియా శీతాకాల, ఖేలో ఇండియా పారా క్రీడల వంటి పలు క్రీడా పోటీలను దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా బహుళ స్థాయులలో నిర్వహిస్తున్నారు. క్రమం తప్పకుండా నిర్వహించే ఈ పోటీలు క్రీడాకారులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ప్రతిభను వెలికితీస్తాయి. బీహార్ క్రీడాకారుడు వైభవ్ సూర్యవంశీ చిన్న వయస్సులోనే ‘ఐపీఎల్’లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించడాన్ని మనం ఈమధ్యే చూశాం. ఇలా రాణించడంలో అతని కృషి తక్కువదేమీ కాకపోయినా, పలు పోటీల్లో పాల్గొనడం అతని ప్రావీణ్యం మెరుగులో కీలకపాత్ర పోషించింది. మరోరకంగా చెప్పాలంటే ఏ క్రీడాకారుడైనా ఎంత ఎక్కువగా పోటీల్లో పాల్గొంటే అంత బాగా రాణిస్తారు. యువ క్రీడాకారులు జాతీయ స్థాయి క్రీడల సూక్ష్మ నైపుణ్యాలను అవగతం చేసుకోవడంతోపాటు విలువైన అనుభవ సముపార్జనకు ఖేలో ఇండియా యువజన క్రీడలు అవకాశం కల్పిస్తాయి.

మిత్రులారా..

మన దేశంలో ఒలింపిక్స్ నిర్వహించాలన్నది ప్రతి భారతీయుడి చిరకాల స్వప్నం. ఈ సంకల్ప సాకారంలో భాగంగా 2036లో ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ కృషి చేస్తోంది. అంతర్జాతీయ క్రీడలలో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోవడంలో భాగంగా  పాఠశాల స్థాయిలోనే క్రీడా ప్రతిభను పసిగట్టి, విశిష్ట పద్ధతులతో శిక్షణనివ్వడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఖేలో ఇండియా కింద, టాప్ (టార్గెట్ ఒలింపిక్ పోడియం) వంటి కార్యక్రమాలు బలమైన క్రీడావరణ వ్యవస్థ రూపకల్పనకు దోహదం చేశాయి. బీహార్ సహా దేశవ్యాప్తంగా వేలాది క్రీడాకారులకు వీటితో ఎంతో ప్రయోజనం చేకూరింది. విభిన్న క్రీడలలో అవకాశాల అన్వేషణకు క్రీడాకారులను ప్రోత్సహించడంపై మా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే  ఖేలో ఇండియా యువజన క్రీడలలో “గట్కా, కలరిపయట్టు, ఖో-ఖో, మల్లఖంబ్, యోగాసనాల” వంటి సంప్రదాయ, స్వదేశీ క్రీడలకు చోటు కల్పించాం. అంతేకాకుండా సరికొత్త, వర్ధమాన క్రీడాంశాల్లోనూ భారత క్రీడాకారులు తమ ప్రతిభ చాటుకుంటున్నారు. ఈ మేరకు “వుషు, సెపక్ తక్రా, పెన్కాక్ సిలాట్, లాన్ బౌల్స్, రోలర్ స్కేటింగ్” వంటి క్రీడల్లోనూ మనవాళ్లు ప్రశంసనీయంగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళా జట్టు ‘లాన్ బౌల్స్’లో పతకం సాధించింది.

మిత్రులారా..

దేశంలో క్రీడా మౌలిక సదుపాయాల ఆధునికీకరణపై ప్రభుత్వం నిశితంగా దృష్టి సారించింది. గత దశాబ్ద కాలంలో క్రీడా బడ్జెట్ మూడు రెట్లు పెరిగింది. ఈ ఏడాది  దాదాపు రూ.4,000 కోట్లు కేటాయించాం. ఇందులో అధిక  శాతం మౌలిక సదుపాయాల కల్పనకే వెచ్చిస్తున్నాం. దేశవ్యాప్తంగా నేడు 1,000 కిపైగా ఖేలో ఇండియా కేంద్రాలు నడుస్తున్నాయి. వాటిలో 36కుపైగా బీహార్లోనే ఉన్నాయి. ఎన్డీఏ  డబుల్ ఇంజిన్ ప్రభుత్వ నమూనాతో  బీహార్ కూడా ప్రయోజనం పొందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తన స్థాయిలో సొంతంగా అనేక పథకాలను చేపడుతోంది. రాజ్గిర్లో ‘ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటైంది. అదీగాక బీహార్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్టేట్ స్పోర్ట్స్ అకాడమీ వంటి సంస్థలు కూడా ఏర్పాటయ్యాయి. ఇక పాట్నా-గయ హైవే వెంబడి ‘స్పోర్ట్స్ సిటీ’ నిర్మాణం కొనసాగుతోంది.  అలాగే వివిధ గ్రామాల్లో క్రీడా సౌకర్యాల కల్పన చురుగ్గా చేపట్టారు. ఖేలో ఇండియా యువజన క్రీడలతో జాతీయ క్రీడా పటంలో బీహార్ గుర్తింపు మరింత పటిష్టమవుతుంది.

మిత్రులారా..

క్రీడాలోకం, దానితో ముడిపడిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మైదానాలకే పరిమితం కాదు. యువతరానికి సరికొత్త ఉద్యోగ మార్గాల సృష్టితోపాటు స్వయం ఉపాధికీ దోహదం చేస్తోంది.  ఫిజియోథెరపీ, డేటా అనలిటిక్స్, స్పోర్ట్స్ టెక్నాలజీ, బ్రాడ్కాస్టింగ్, ఇ-స్పోర్ట్స్, మేనేజ్మెంట్” వంటివి ముఖ్యమైన ఉప రంగాలుగా ఎదుగుతున్నాయి.  వీటిద్వారా శిక్షకులు, ఫిట్నెస్ ట్రైనర్లు, రిక్రూట్మెంట్ ఏజెంట్లు, ఈవెంట్ మేనేజర్లు, స్పోర్ట్స్ లాయర్లు, మీడియా నిపుణులు”గా సరికొత్త పాత్రల్లో ఇమిడిపోయే అవకాశాలను యువ వృత్తి నిపుణులు అన్వేషించవచ్చు. మరోరకంగా చెప్పాలంటే స్టేడియం అన్నది ఇవాళ మ్యాచ్లకు వేదిక మాత్రమే కాదు... వేలాది ఉద్యోగాలకూ మూలస్తంభంగా మారింది. క్రీడా సంస్థల రంగంలో యువతకు అనేక కొత్త అవకాశాలు కూడా తెరుచుకుంటున్నాయి.

జాతీయ క్రీడా విశ్వవిద్యాలయాల ఏర్పాటు, కొత్త జాతీయ విద్యా విధానపు ప్రధాన విద్యలో క్రీడలను ఏకీకృతం చేయడం జరిగింది. ఈ రెండూ దేశంలో అత్యుత్తమ క్రీడాకారులను మాత్రమే కాకుండా అగ్రశ్రేణి క్రీడా నిపుణులను కూడా తయారుచేసే లక్ష్యంతో పనిచేస్తున్నాయి.

 

నా యువ మిత్రులారా..

జీవితంలోని ప్రతి అంశంలోనూ క్రీడా స్ఫూర్తి కి ఎంత ప్రాధాన్యం ఉందో మనందరికీ   తెలుసు. జట్టుగా సమష్టి కృషిని, సహకారాన్ని, పట్టుదలను క్రీడలు ఎంతగానో పెంచుతాయి. ఆయా క్రీడలకు బ్రాండ్ అంబాసిడర్లుగా.. ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్  (ఒకే భారతం - శ్రేష్ఠ భారతం) స్ఫూర్తికి ప్రతినిధులుగా మీరంతా అత్యుత్తమంగా రాణించాలి. ఈ క్రీడలు ముగిసేనాటికి మీరంతా  బీహార్ నుంచి మధుర స్మృతులతో మీ స్వస్థలాలకు వెళ్తారని విశ్వసిస్తున్నా. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆటగాళ్లు ‘లిట్టి చోఖా’ , బీహార్ కే ప్రత్యేకమైన ప్రసిద్ధ ‘మఖానా’ రుచిని ఆస్వాదించండి.

మిత్రులారా..

ప్రస్తుత ఖేలో ఇండియా యువజన క్రీడల్లో పాల్గొంటున్నవారిలో క్రీడా స్ఫూర్తి, దేశభక్తి ఇనుమడించగలవని ఆశిస్తూ..  7వ ఖేలో ఇండియా యువజన క్రీడల ప్రారంభమైనట్లు ప్రకటిస్తున్నా. 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
From strategic partnership upgrade to defence roadmap: Key outcomes of PM Modi–Meloni meeting in Rome

Media Coverage

From strategic partnership upgrade to defence roadmap: Key outcomes of PM Modi–Meloni meeting in Rome
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 మే 2026
May 21, 2026

Appreciation by Citizens on Leadership That Delivers: PM Modi's Journey of Development, Diplomacy & Farmer-First Progress