మాకు నదులు భౌతికమైనవి కావు, మనకు నదులు ఒక జీవి: ప్రధాని
మోదీ నేను అందుకున్న బహుమతుల ప్రత్యేక ఇ-వేలం ఈ రోజుల్లో జరుగుతోంది. దాని ద్వారా వచ్చే ఆదాయం 'నమామి గంగే' ప్రచారానికి అంకితం చేయబడుతుంది: ప్రధాని
చిన్న ప్రయత్నాలు పెద్ద మార్పులకు దారితీస్తాయి: ప్రధాని మోదీ
మహాత్మా గాంధీ పరిశుభ్రతను ప్రజా ఉద్యమంగా మార్చారు: ప్రధాని మోదీ
మరుగుదొడ్ల నిర్మాణం పేదవారి గౌరవాన్ని పెంచినట్లే, 'ఆర్థిక పరిశుభ్రత' (అవినీతి నిర్మూలన) పేదలకు హక్కులను నిర్ధారిస్తుంది, వారి జీవితాలను సులభతరం చేస్తుంది: ప్రధాని
అక్టోబర్ 2 న బాపు జయంతి రోజున ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరారు
మన్ కీ బాత్: సియాచిన్ హిమానీనదం వద్ద దివ్యాంగ్జాన్ సృష్టించిన ప్రపంచ రికార్డును ప్రధాని మోదీ పేర్కొన్నారు
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయకు ప్రధాని మోదీ ఘనంగా నివాళులు అర్పించారు. , ఆయన నేటికీ అందరికీ స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు

నా ప్రియమైన దేశ వాసులారా! నమస్కారం.. ఒక ముఖ్యమైన కార్యక్రమం కోసం నేను అమెరికా వెళ్లాల్సి ఉందని మీకు తెలుసు. కాబట్టి అమెరికా వెళ్లే ముందు 'మన్ కీ బాత్' రికార్డ్ చేయడం మంచిదని అనుకున్నాను. సెప్టెంబర్‌లో 'మన్ కీ బాత్' ప్రసారం అయ్యే తేదీన మరో ముఖ్యమైన రోజు ఉంది. మనం చాలా రోజులను గుర్తుంచుకుంటాం. వివిధ దినోత్సవాలను జరుపుకుంటాం. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే, మీరు వారిని అడిగితే, సంవత్సరం మొత్తంలో ఏ రోజు ప్రాధాన్యత ఏమిటో మీకు పూర్తి జాబితాను చెప్తారు. కానీ మనమందరం గుర్తుంచుకోవలసిన మరో రోజు ఉంది.  ఈ రోజు భారతదేశ సంప్రదాయాలకు అనుగుణమైంది. ఇది శతాబ్దాలుగా మన సంప్రదాయాలకు అనుబంధంగా ఉన్న అంశంతో అనుసంధానమైంది. ఇది 'వరల్డ్ రివర్ డే'. అంటే ప్రపంచ నదుల దినోత్సవం.

మనకు ఒక లోకోక్తి ఉంది.

“పిబంతి నద్యః స్వయమేవ నాంభః” అని.

  అంటే-  నదులు తమ స్వంత నీటిని తాగవు. కానీ పరోపకారం కోసం ఇస్తాయి. మనకు నదులు భౌతికమైన వస్తువులు కావు. మనకు నది ఒక జీవి.  అందుకే మనం నదులను తల్లిగా పిలుస్తాం. మనకు ఎన్ని పండుగలు, పబ్బాలు, వేడుకలు, ఉల్లాసాలు ఉన్నా ఇవన్నీ మన అమ్మల ఒడిలోనే జరుగుతాయి. మాఘ మాసం వచ్చినప్పుడు మన దేశంలో చాలా మంది ప్రజలు గంగా మాత ఒడ్డున లేదా ఇతర నదుల ఒడ్డున ఒక నెల మొత్తం గడుపుతారని మీకు తెలుసు. ఇప్పుడు లేదు కానీ పూర్వకాలంలో మనం ఇంట్లో స్నానం చేసేటప్పుడు కూడా నదులను గుర్తు చేసుకునే సంప్రదాయం ఉండేది. ఈరోజుల్లో ఈ సంప్రదాయం కనుమరుగై ఉండవచ్చు లేదా చాలా తక్కువ పరిమాణంలో ఉండి ఉండవచ్చు.  కానీ ఈ సంప్రదాయం చాలా గొప్పది.  ఉదయమే- స్నానం చేసే సమయంలోనే-  విశాలమైన భారతదేశ యాత్ర చేసే సంప్రదాయమిది.  ఇది ఒక మానసిక యాత్ర! ఇది దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతంతో అనుసంధానం అయ్యేందుకు ప్రేరణగా మారింది. అది భారతదేశంలో స్నానం చేసేటప్పుడు ఒక శ్లోకం చెప్పే సంప్రదాయం.

గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి |

నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిమ్ కురు ||

ఇంతకు ముందు మన ఇళ్లలో పిల్లల కోసం కుటుంబ పెద్దలు ఈ శ్లోకాలను గుర్తుంచుకునేవారు. ఇది మన దేశంలో నదులపై విశ్వాసాన్ని నింపేది. విశాలమైన భారతదేశ పటం మనస్సులో ముద్రించబడి ఉండేది. నదులకు అనుసంధానంగా ఉండేది. మనకు తల్లిగా తెలిసిన నది- చూస్తుంది, జీవిస్తుంది.  ఆ నదిపై విశ్వాస భావన జన్మించింది. ఇది ఒక ధార్మిక సంస్కార ప్రక్రియ. మిత్రులారా! మన దేశంలో నదుల మహిమ గురించి మాట్లాడుతున్నప్పుడు సహజంగా ప్రతి ఒక్కరూ ఒక ప్రశ్నను లేవనెత్తడం సహజం. ప్రశ్నను లేవనెత్తే హక్కు కూడా ఉంది. దానికి సమాధానం చెప్పడం మన బాధ్యత కూడా. ఎవరైనా ప్రశ్న అడుగుతారు-  “సోదరా! మీరు నదిపై చాలా పాటలు పాడుతున్నారు. నదిని తల్లి అని పిలుస్తున్నారు. మరి ఈ నది ఎందుకు కలుషితం అవుతుంది?” అని. నదులలో కొద్దిగా కలుషితం చేయడం కూడా తప్పు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మన సంప్రదాయాలు కూడా ఇలాగే ఉన్నాయి. మన భారతదేశంలోని పశ్చిమ భాగం-  ముఖ్యంగా గుజరాత్ , రాజస్థాన్‌ లలో - నీటి కొరత చాలా ఉందని మీకు తెలుసు. చాలా సార్లు కరువు పరిస్థితులు వచ్చాయి.  ఇప్పుడు అందుకే అక్కడ సమాజ జీవితంలో కొత్త సంప్రదాయం అభివృద్ధి చెందింది. గుజరాత్‌లో వర్షాలు మొదలైనప్పుడు జల్-జీలనీ ఏకాదశిని జరుపుకుంటారు. డఅని అర్థం ఈ కాలంలో మనం జరుపుకునే 'క్యాచ్ ది రెయిన్'- వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవడమే. వర్షంలోని ప్రతి నీటి బిందువును సేకరించి, పరిరక్షించడం. అదే విధంగా వర్షాల తర్వాత ఛట్ పండుగను బీహార్ లోనూ  తూర్పు ప్రాంతాల్లోనూ జరుపుకుంటారు. ఛట్ పూజలను దృష్టిలో ఉంచుకుని  నదుల వెంబడి ఘాట్లను శుభ్రపరచడం, మరమ్మతు చేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయని నేను ఆశిస్తున్నాను. నదులను శుభ్రం చేసి కాలుష్యం లేకుండా చేసే పనిని అందరి ప్రయత్నం, అందరి సహకారంతో మనం చేయవచ్చు. 'నమామి గంగే మిషన్' కూడా అమల్లో ఉంది. ప్రజలందరి ప్రయత్నాలు, ప్రజా అవగాహన, ప్రజా చైతన్యం- మొదలైన వాటికి ఇందులో ప్రముఖ పాత్ర ఉంది.

మిత్రులారా! మనం నది గురించి మాట్లాడుతున్నప్పుడు-  గంగామాత  గురించి మాట్లాడుతున్నప్పుడు- నేను మీ దృష్టిని మరో విషయం వైపు ఆకర్షించాలనుకుంటున్నాను. మనం 'నమామి గంగే' గురించి మాట్లాడుతున్నప్పుడు, మీరు తప్పనిసరిగా ఒక విషయం గమనించి ఉండాలి.  మన యువత ఖచ్చితంగా గమనించి ఉంటారు. ఈ రోజుల్లో ప్రత్యేక ఈ-వేలం జరుగుతోంది. ప్రజలు నాకు ఎప్పటికప్పుడు ఇచ్చిన బహుమతుల కోసం ఈ ఎలక్ట్రానిక్ వేలం నిర్వహిస్తున్నారు. ఈ వేలం ద్వారా వచ్చే డబ్బు 'నమామి గంగే' ప్రచారానికి అంకితం చేశాం. మీరు నాకు ఎంతో ఆత్మీయ భావన తో ఇచ్చిన బహుమతులోని ఆత్మీయతను ఈ ప్రచారం మరింత దృఢంగా చేస్తుంది.

మిత్రులారా! దేశవ్యాప్తంగా నదులను పునరుద్ధరించడానికి, నీటి పరిశుభ్రత కోసం ప్రభుత్వం, సామాజిక సంస్థలు నిరంతరం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాయి. ఈ రోజు నుండి కాదు-  ఇది దశాబ్దాలుగా కొనసాగుతోంది. కొంతమంది అలాంటి పనులకు తమను తాము అంకితం చేసుకున్నారు. ఈ సంప్రదాయం, ఈ ప్రయత్నం, ఈ విశ్వాసం మన నదులను కాపాడుతున్నాయి. భారతదేశంలోని ఏ ప్రాంతం నుండి అయినా అలాంటి వార్తలు నా చెవికి చేరినప్పుడు  అలాంటి పని చేసే వారి పట్ల గొప్ప గౌరవభావం నా మనస్సులో కలుగుతుంది. ఆ విషయాలు మీకు చెప్పాలని కూడా అనిపిస్తుంది. చూడండి! నేను తమిళనాడులోని వెల్లూరు, తిరువణ్ణామలై జిల్లాల ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ నాగా నది అనే ఒక నది ప్రవహిస్తుంది. ఈ నాగా నది కొన్ని సంవత్సరాల కిందట ఎండిపోయింది. ఈ కారణంగా అక్కడ నీటి మట్టం కూడా చాలా తక్కువ స్థాయికి పడిపోయింది. కానీ అక్కడి మహిళలు తమ నదిని పునరుద్ధరించడానికి చొరవ తీసుకున్నారు. వారు ప్రజలను అనుసంధానించారు.  ప్రజల భాగస్వామ్యంతో కాలువలు తవ్వారు.  చెక్ డ్యామ్‌లు నిర్మించారు. రీఛార్జ్ బావులు నిర్మించారు. మిత్రులారా! ఈ రోజు ఆ నది నీటితో నిండిపోయిందని తెలుసుకొని మీరు కూడా సంతోషిస్తారు.  నీటితో నది నిండినప్పుడు మనస్సు పొందే హాయిని నేను ప్రత్యక్షంగా అనుభవించాను.

మహాత్మాగాంధీ సబర్మతి నది ఒడ్డున సబర్మతి ఆశ్రమాన్ని నిర్మించారు. ఆ సబర్మతి నది కొన్ని దశాబ్దాల కిందట ఎండిపోయిందని మీలో చాలా మందికి తెలుసు. సంవత్సరంలో 6-8 నెలల పాటు నీరు కనిపించేది కాదు. నర్మదా నదితో   సబర్మతి నదిని అనుసంధానించారు. మీరు ఇప్పుడు అహ్మదాబాద్ వెళ్తే  సబర్మతి నది నీరు మనస్సును ఉల్లాసపరుస్తుంది. అదేవిధంగా తమిళనాడుకు చెందిన మన సోదరీమణులు చేసిన పనుల వంటి అనేక కార్యక్రమాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. నాకు తెలుసు- మన ధార్మిక  సంప్రదాయంతో సంబంధం ఉన్న అనేక మంది సాధువులు, గురువులు తమ ఆధ్యాత్మిక ప్రయాణంతో పాటు నీటి కోసం, నదుల కోసం చాలా కృషి  చేస్తున్నారు. చాలామంది నదుల ఒడ్డున చెట్లు నాటడానికి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి నదులలో ప్రవహించే మురికి నీరు నిలిచిపోతుంది.

మిత్రులారా! మనం ఈరోజు 'ప్రపంచ నదీ దినోత్సవం' జరుపుకుంటున్న సందర్భంగా ఈ పనికి అంకితమైన ప్రతి ఒక్కరినీ నేను అభినందిస్తున్నాను. కానీ భారతదేశంలోని ప్రతి మూలలో సంవత్సరానికి ఒకసారి నదీ ఉత్సవాన్ని  జరుపుకోవాలని నేను ప్రతి నది దగ్గర నివసిస్తున్న ప్రజలను, దేశ వాసులను కోరుతున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా!  ఒక చిన్న విషయాన్ని చిన్నగా పరిగణించే తప్పు ఎవరూ చేయకూడదు. చిన్న ప్రయత్నాలు కొన్నిసార్లు పెద్ద మార్పులను తెస్తాయి. మహాత్మాగాంధీ జీవితాన్ని పరిశీలిస్తే ఆయన జీవితంలో చిన్న విషయాలు కూడా ఎంతో  ముఖ్యమైనవని మనకు అనిపిస్తుంది. ఆ చిన్న చిన్న  విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆయన పెద్ద సంకల్పాలను ఎలా సాకారం చేశారో తెలుస్తుంది. స్వాతంత్య్రోద్యమానికి పరిశుభ్రత ప్రచారం నిరంతర శక్తిని ఎలా అందించిందో మన నేటి యువత తెలుసుకోవాలి. మహాత్మా గాంధీ పరిశుభ్రతను ఒక ప్రజా ఉద్యమంగా మార్చారు. పరిశుభ్రతను స్వతంత్రతా స్వప్నంతో ఆయన అనుసంధానించారు. నేడు- అనేక దశాబ్దాల తర్వాత పరిశుభ్రతా ఉద్యమం మరోసారి దేశాన్ని నవీన భారతదేశ కలలతో అనుసంధానించింది. ఇది కూడా మన అలవాట్లను మార్చుకునే ప్రచారంగా మారుతోంది. పరిశుభ్రత అనేది కేవలం ఒక కార్యక్రమం అని మనం మర్చిపోకూడదు. పరిశుభ్రత అనేది ఒక తరం నుండి మరో తరానికి సంస్కారాన్ని బదలాయించే  బాధ్యత. పరిశుభ్రత ప్రచారం ఒక  తరం నుండి మరో తరానికి జరుగుతుంది. అప్పుడు మొత్తం సమాజ జీవితంలో పరిశుభ్రత ఒక స్వభావంగా మారుతుంది. కాబట్టి పరిశుభ్రత ఒకట్రెండేళ్ళు నిర్వహించే అంశం కాదు. ఒక ప్రభుత్వం-మరొక ప్రభుత్వం మొదలైన వాటికి సంబంధించిన అంశం కూడా కాదు. ఒక తరం నుండి మరో తరానికి మనం పరిశుభ్రత గురించి అవగాహనతో, అలుపు లేకుండా, గొప్ప శ్రద్ధతో పరిశుభ్రత ప్రచారం కొనసాగించాలి. మహనీయులైన పూజ్య బాపుకు పరిశుభ్రత గొప్ప నివాళి అని నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మనం ప్రతిసారీ ఈ నివాళిని అర్పించాలి. నిరంతరం అర్పిస్తూనే ఉండాలి.

మిత్రులారా! పరిశుభ్రత గురించి మాట్లాడే అవకాశాన్ని నేను ఎన్నడూ వదులుకోలేదని ప్రజలకు తెలుసు. అందుకే “ఈ స్వతంత్ర భారత అమృత మహోత్సవంలో బాపూజీ నుండి నేర్చుకుంటూ ఆర్థిక స్వచ్ఛత కోసం కూడా ప్రతిజ్ఞ చేయాల”ని మన 'మన్ కీ బాత్' శ్రోతల్లో ఒకరైన రమేష్ పటేల్ గారు రాశారు. మరుగుదొడ్ల నిర్మాణం పేదవారి గౌరవాన్ని పెంచినట్టే ఆర్థిక స్వచ్ఛత పేదలకు అధికారాన్ని సునిశ్చితం చేస్తుంది. వారి జీవితాలను సులభతరం చేస్తుంది. జన్ ధన్ ఖాతాలకు సంబంధించి దేశం ప్రారంభించిన ప్రచారం ఇప్పుడు మీకు తెలుసు. ఈ కారణంగా నేడు పేదల డబ్బు నేరుగా వారి ఖాతాలకు బదిలీ అవుతోంది. దీని వల్ల అవినీతి వంటి అడ్డంకులు భారీగా తగ్గాయి. ఆర్థిక స్వచ్ఛతలో సాంకేతికత ఎంతగానో సహాయపడుతుందనేది నిజం. ఈ రోజు పల్లెటూళ్లలో కూడా సాధారణ ప్రజలు ఫిన్-టెక్ UPI ద్వారా డిజిటల్ లావాదేవీలు చేసే స్థాయికి చేరడం మాకు సంతోషకరమైన విషయం. దాని వినియోగం పెరుగుతోంది. మీరు గర్వపడే ఒక సంఖ్యను నేను మీకు చెప్తాను-  ఆగస్టు నెలలో 355 కోట్ల లావాదేవీలు UPI ద్వారా ఒక నెలలో జరిగాయి.  అంటే 350 కోట్ల కంటే ఎక్కువ పర్యాయాలు డిజిటల్ లావాదేవీల కోసం UPIని ఉపయోగించారు. సగటున 6 లక్షల కోట్ల రూపాయలకు కు పైగా లావాదేవీలు డిజిటల్ పద్ధతిలో UPI ద్వారా జరుగుతున్నాయి. ఈ స్వచ్ఛత కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత వస్తోంది. ఫిన్-టెక్  ప్రాముఖ్యత చాలా పెరుగుతోందని ఇప్పుడు మనకు తెలుసు.

మిత్రులారా!  బాపూజీ స్వచ్ఛతను స్వేచ్ఛతో ముడిపెట్టినట్టే  ఖాదీని కూడా స్వాతంత్ర్యానికి గుర్తుగా మార్చారు. నేడు- స్వాతంత్య్రం వచ్చిన 75 వ సంవత్సరంలో, స్వాతంత్ర్య అమృత మహోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు, ఖాదీకి స్వాతంత్ర్యోద్యమంలో ఉన్న గౌరవాన్నే నేటి మన యువ తరం అందిస్తోందని సంతృప్తిగా చెప్పగలం. నేడు ఖాదీ, చేనేత ఉత్పత్తి అనేక రెట్లు పెరిగింది. డిమాండ్ కూడా పెరిగింది. ఢిల్లీలోని ఖాదీ షోరూమ్ ఒక రోజులో కోటి రూపాయలకు పైగా వ్యాపారం  చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని మీకు కూడా తెలుసు. పూజ్య బాపు జన్మదినమైన అక్టోబర్ 2 న మనమందరం మరోసారి కొత్త రికార్డు సృష్టించాలని నేను మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. మీరు మీ పట్టణంలో ఎక్కడైనా ఖాదీ, చేనేత, హస్తకళల ఉత్పత్తులను కొనండి.  దీపావళి పండుగ ముందుంది. ఆ పండుగ కోసం చేసే ఖాదీ, చేనేత, కుటీర పరిశ్రమకు సంబంధించిన ప్రతి కొనుగోలు స్థానిక ఉత్పత్తుల ప్రచారం -ఓకల్ ఫర్ లోకల్ కు బలం చేకూరుస్తుంది. ఈ విషయంలో పాత రికార్డులను అధిగమించాలి.

మిత్రులారా!  అమృత మహోత్సవం జరుగుతున్న ఈ కాలంలో-  దేశంలో స్వాతంత్ర్య చరిత్రలో చెప్పలేని కథలను ప్రజలకు తెలియజేయడానికి ఒక ప్రచారం కూడా జరుగుతోంది. దీని కోసం వర్ధమాన రచయితలకు, దేశంలోని , ప్రపంచంలోని యువతకు పిలుపునివ్వడం జరిగింది. ఈ ప్రచారం కోసం ఇప్పటివరకు 13 వేలకు పైగా ప్రజలు నమోదు చేసుకున్నారు. అది కూడా 14 వివిధ భాషలలో. 20 కంటే ఎక్కువ దేశాలలోని అనేక మంది ప్రవాస భారతీయులు కూడా ఈ ప్రచారంలో చేరడానికి తమ కోరికను వ్యక్తం చేయడం నాకు సంతోషకరమైన విషయం. మరో చాలా ఆసక్తికరమైన సమాచారం ఉంది- 5000 కంటే ఎక్కువ మంది వర్ధమాన రచయితలు స్వాతంత్ర్య సమరం లోని ఘట్టాల కోసం, గాథల కోసం వెతుకుతున్నారు. బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని అన్‌సంగ్ హీరోల గురించి,  అనామకులుగా మిగిలిపోయిన వారి గురించి, చరిత్ర పేజిలలో పేర్లు కనిపించని ప్రజా నాయకుల వారి జీవితాలపై, ఆ సంఘటనలపై రాసేందుకు యువత ఆసక్తి చూపిస్తున్నారు. గత 75 ఏళ్లలో చర్చించని స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను దేశం ముందుకు తీసుకురావాలని యువత నిర్ణయించింది. శ్రోతలందరికీ నా అభ్యర్థన. విద్యా ప్రపంచంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ నా అభ్యర్థన. యువతకు మీరంతా ప్రేరణగా నిలవండి. మీరు కూడా ముందుకు రండి. స్వాతంత్ర్య భారత అమృతమహోత్సవంలో చరిత్ర రచన చేసే వారు కూడా చరిత్ర సృష్టించబోతున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా!  సియాచిన్ గ్లేషియర్ గురించి మనందరికీ తెలుసు. అక్కడ చలి చాలా భయానకంగా ఉంటుంది. అక్కడ నివసించడం సామాన్యులకు సాధ్యం కాదు. సుదూరం వరకు మంచు-మంచు- ఎక్కద చూసినా మంచే కనబడే ఆ ప్రాంతంలో చెట్లు, మొక్కల ఉనికి కూడా ఉండదు. అక్కడ ఉష్ణోగ్రత కూడా మైనస్ 60 డిగ్రీల వరకు కూడా చేరుతుంది. కొద్ది రోజుల క్రితం సియాచిన్ లోని ఈ దుర్గమ ప్రాంతంలో 8 మంది దివ్యాంగుల బృందం అద్భుతాలు చేసింది. ఇది ప్రతి పౌరుడికి గర్వకారణం. ఈ బృందం సియాచిన్ గ్లేసియర్ లో  15 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న 'కుమార్ పోస్ట్' పై జెండాను ఎగురవేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. శారీరక అవరోధాలు, సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ దివ్యాంగులు చేసిన విన్యాసాలు మొత్తం దేశానికి స్ఫూర్తి. ఈ బృందంలోని సభ్యుల గురించి మీకు తెలిసినప్పుడు, మీరు కూడా నాలాగే ధైర్యం, ఉత్సాహం పొందుతారు. ఈ ధైర్యవంతులైన దివ్యాంగులు - మహేశ్ నెహ్రా గారు,ఉత్తరాఖండ్‌కు చెందిన అక్షత్ రావత్ గారు, మహారాష్ట్రకు చెందిన పుష్పక్ గవాండే గారు, హర్యానాకు చెందిన అజయ్ కుమార్ గారు,లడఖ్‌ కు చెందిన  లోబ్‌సాంగ్ చోస్పెల్ గారు, తమిళనాడుకు చెందిన మేజర్ ద్వారకేష్ గారు, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఇర్ఫాన్ అహ్మద్ మీర్ గారు, హిమాచల్ ప్రదేశ్ కు చెందిన చొంజిన్ ఎంగ్మో గారు. సియాచిన్ హిమానీనదాన్ని జయించే ఈ ఆపరేషన్ భారత సైన్యానికి చెందిన ప్రత్యేక దళాల అనుభవజ్ఞుల కారణంగా విజయవంతమైంది.  ఈ చరిత్రాత్మక, అపూర్వమైన విజయానికి నేను ఈ బృందాన్ని అభినందిస్తున్నాను. "నేను చేయగలనన్నసంస్కృతి”, "నేను చేయగలనన్నసంకల్పం", "నేను చేయగలనన్న వైఖరి"తో ప్రతి సవాలును ఎదుర్కొనే భావనతో ఉన్న మన దేశ ప్రజల స్ఫూర్తిని కూడా ఇది ప్రకటిస్తుంది.

మిత్రులారా! ఈ రోజు దేశంలో దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘ఒక టీచర్-ఒక కాల్’ అనే పేరుతో ఉత్తరప్రదేశ్‌లో చేస్తున్న అలాంటి ఒక ప్రయత్నం గురించి తెలుసుకునే అవకాశం నాకు లభించింది. బరేలీలో ఈ ప్రత్యేక ప్రయత్నం వికలాంగ పిల్లలకు కొత్త మార్గాన్ని చూపుతోంది. ఈ ఉద్యమానికి డభౌర గంగాపూర్‌లోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్ దీప మాలా పాండేయ గారు నాయకత్వం వహిస్తున్నారు. కరోనా కాలంలో ఈ ప్రచారం కారణంగా పెద్ద సంఖ్యలో పిల్లల ప్రవేశం సాధ్యపడటమే కాకుండా 350 మందికి పైగా ఉపాధ్యాయులు సేవా స్ఫూర్తితో చేరారు. ఈ ఉపాధ్యాయులు వికలాంగులైన పిల్లలను పిలుస్తూ,  గ్రామ గ్రామానికి వెళ్లి శోధిస్తారు. ఏదో ఒక పాఠశాలలో వారి ప్రవేశాన్ని నిర్ధారించుకుంటారు. వికలాంగుల కోసం దీప మాల గారు, వారి  తోటి ఉపాధ్యాయులు చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను. విద్యా రంగంలో అలాంటి ప్రతి ప్రయత్నం మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దబోతోంది.

     నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు మన జీవితాల పరిస్థితి ఏమిటంటే రోజులో వందల సార్లు కరోనా అనే పదం మన చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. వంద సంవత్సరాలలో అతిపెద్ద ప్రపంచ మహమ్మారి అయిన కోవిడ్-19 ప్రతి దేశ పౌరుడికి చాలా విషయాలు నేర్పింది. ఈరోజు ఆరోగ్య పరిరక్షణ, స్వస్థతపై ఆసక్తి, అవగాహన పెరిగాయి. ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉండే సాంప్రదాయిక, సహజ ఉత్పత్తులు మన దేశంలో సమృద్ధిగా లభిస్తాయి. ఒడిషాలోని కలహండి ప్రాంతంలోని నాందోల్ లో నివసించే పతాయత్ సాహు గారు ఎన్నో  సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన పని చేస్తున్నారు. వారు ఒకటిన్నర ఎకరాల భూమిలో ఔషధ మొక్కలను నాటారు. ఇది మాత్రమే కాదు-  సాహు గారు ఈ ఔషధ మొక్కల డాక్యుమెంటేషన్ కూడా చేశారు. రాంచీకి చెందిన సతీష్ గారు ఇలాంటి ఒక సమాచారాన్ని నాకు ఒక లేఖ ద్వారా పంచుకున్నారు. సతీష్ గారు జార్ఖండ్‌లోని ఒక కలబంద సాగు గ్రామం వైపు నా దృష్టిని ఆకర్షించారు. రాంచీ సమీపంలోని దేవరి గ్రామంలోని మహిళలు మంజు కచ్ఛప్ గారి నాయకత్వంలో బిర్సా వ్యవసాయ విద్యాలయంలో కలబంద సాగులో శిక్షణ పొందారు. తరువాత కలబంద సాగును ప్రారంభించారు. ఈ సాగు కారణంగా ఆరోగ్య రంగంలో ప్రయోజనం కలగడమే కాకుండా ఈ మహిళల ఆదాయం కూడా పెరిగింది. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా వారికి మంచి ఆదాయం వచ్చింది. దీనికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే శానిటైజర్ తయారుచేసే కంపెనీలు వారి నుండి నేరుగా కలబందను కొనుగోలు చేయడం. ఈ రోజు దాదాపు నలభై మంది మహిళల బృందం ఈ పనిలో పాలుపంచుకుంటోంది. కలబంద అనేక ఎకరాలలో సాగు అవుతోంది. ఒడిషాకు చెందిన పతాయత్ సాహు గారి కృషి లేదా దేవరీ లోని ఈ మహిళల బృందం కృషి వ్యవసాయ క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంతో ముడిపెట్టడానికి ఉదాహరణగా చెప్పవచ్చు.

మిత్రులారా! అక్టోబర్ 2 వ తేదీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా. వారి  జ్ఞాపకార్థం ఈ రోజు వ్యవసాయ రంగంలో కొత్త ప్రయోగాల గురించి కూడా తెలుసుకోవాలి. ఔషధ మొక్కల రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి గుజరాత్‌లోని ఆనంద్‌లో మెడి-హబ్ TBI పేరుతో ఇంక్యుబేటర్ పనిచేస్తోంది. ఔషధ, సుగంధ మొక్కలతో అనుసంధానించిన ఈ ఇంక్యుబేటర్ 15 మంది పారిశ్రామికవేత్తల వ్యాపార ఆలోచనలకు చాలా తక్కువ సమయంలో సహకారం అందించింది. ఈ ఇంక్యుబేటర్ సహాయం పొందిన తర్వాతనే సుధా చేబ్రోలు తన స్టార్టప్‌ను ప్రారంభించారు. ఆమె కంపెనీలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు.  వినూత్న మూలికల ఫార్ములా తయారీకి కూడా వారు బాధ్యత వహిస్తారు. ఈ ఔషధ, సుగంధ మొక్కల ఇంక్యుబేటర్ నుండి సహాయం పొందిన మరొక వ్యవస్థాపకులు సుభాశ్రీ గారు. సుభాశ్రీ గారి కంపెనీ- గదులు, కార్ల  ఫ్రెష్ నర్ల తయారీ రంగంలో పనిచేస్తోంది. వారు 400 కంటే ఎక్కువ ఔషధ మూలికలున్న మూలికల మిద్దె తోటను కూడా సృష్టించారు.

మిత్రులారా! పిల్లల్లో ఔషధ, మూలికా మొక్కల గురించి అవగాహన పెంచడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆసక్తికరమైన చొరవ తీసుకుంది. మన ప్రొఫెసర్ ఆయుష్మాన్ గారు ఈ విషయంలో ముందడుగు వేశారు. ప్రొఫెసర్ ఆయుష్మాన్ ఎవరు అని మీరు అనుకోవచ్చు. వాస్తవానికి ప్రొఫెసర్ ఆయుష్మాన్ ఒక హాస్య పుస్తకం పేరు. ఇందులో విభిన్న కార్టూన్ పాత్రల ద్వారా చిన్న కథలను సిద్ధం చేశారు. వీటితో పాటు కలబంద, తులసి, ఉసిరి, తిప్పతీగ, వేప, అశ్వగంధ, బ్రాహ్మి వంటి ఆరోగ్యకరమైన ఔషధ మొక్కల ఉపయోగం గురించి ఈ పుస్తకంలో పేర్కొన్నారు.

మిత్రులారా! నేటి పరిస్థితిలో ఔషధ మొక్కలు, మూలికల ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రజల అవగాహన పెరిగినందువల్ల భారతదేశానికి అపారమైన అవకాశాలున్నాయి. గత కొద్దికాలంగా ఆయుర్వేద, మూలికా ఉత్పత్తుల ఎగుమతిలో గణనీయమైన పెరుగుదల ఉంది.

శాస్త్రవేత్తలు, పరిశోధకులు, స్టార్ట్-అప్ ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులు అటువంటి ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను. ఇది ప్రజల ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మన రైతులు, యువత ఆదాయాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది.

మిత్రులారా! సాంప్రదాయిక వ్యవసాయ దశను దాటి వ్యవసాయం రంగంలో కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. కొత్త పరికల్పనలు నిరంతరం కొత్త స్వయం ఉపాధి మార్గాలను సృష్టిస్తున్నాయి. పుల్వామాకు చెందిన ఇద్దరు సోదరుల కథ కూడా దీనికి ఉదాహరణ. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో బిలాల్ అహ్మద్ షేక్ గారు, మునీర్ అహ్మద్ షేక్ గారు తమ కోసం కొత్త మార్గాలను కనుగొన్న విధానం నవీన భారతదేశానికి ఒక ఉదాహరణ. 39 ఏళ్ల బిలాల్ అహ్మద్ గారు అత్యంత అధిక అర్హతలు కలిగినవారు. ఆయన అనేక డిగ్రీలు సాధించారు. నేడు వ్యవసాయంలో సొంతగా స్టార్ట్-అప్ ప్రారంభించి ఉన్నత విద్యకు సంబంధించిన తన అనుభవాన్ని ఉపయోగిస్తున్నారు. బిలాల్ గారు తన ఇంట్లో వర్మీ కంపోస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ నుంచి తయారు చేసిన జీవ ఎరువులు వ్యవసాయంలో ఎంతో ప్రయోజనం అందించడమే కాకుండా ప్రజలకు ఉపాధి అవకాశాలను కూడా అందించాయి. ప్రతి సంవత్సరం ఈ సోదరుల యూనిట్ల నుండి రైతులు సుమారు మూడు వేల క్వింటాళ్ల వర్మీ కంపోస్ట్ పొందుతున్నారు. వారి వర్మి కంపోస్టింగ్ యూనిట్‌లో 15 మంది పని చేస్తున్నారు.

ఈ యూనిట్‌ను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్తున్నారు. వారిలో ఎక్కువ మంది వ్యవసాయ రంగంలో ఏదైనా చేయాలనుకునే యువకులు. పుల్వామాకు చెందిన షేక్ సోదరులు ఉద్యోగార్ధులుగా ఉండే బదులుగా ఉద్యోగాల సృష్టికర్తలమవుతామని ప్రతిజ్ఞ చేశారు. నేడు వారు జమ్మూ కాశ్మీర్‌కు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలకు కొత్త మార్గాన్ని చూపుతున్నారు.

నా ప్రియమైన దేశ ప్రజలారా!  సెప్టెంబర్ 25 న దేశమాత గొప్ప బిడ్డ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి. దీన్ దయాళ్ గారు గత శతాబ్దపు గొప్ప ఆలోచనాపరులలో ఒకరు. ఆయన ఆర్థిక విధానాలు, సమాజాన్ని శక్తిమంతం చేయడానికి ఆయన చూపిన దారులు, ఆయన చూపిన అంత్యోదయ మార్గం ఈనాటికీ ప్రాసంగికత కలిగి ఉన్నాయి. అవి అంతే స్ఫూర్తిదాయకం కూడా. మూడేళ్ల  కిందట సెప్టెంబర్ 25 న ఆయన జయంతి సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా పథకం - ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభమైంది. నేడు దేశంలో రెండు-  రెండున్నర కోట్ల మందికి పైగా పేదలు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆసుపత్రుల్లో 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స పొందారు. పేదల కోసం ప్రారంభించిన ఇంత పెద్ద పథకం దీన్ దయాళ్ గారి అంత్యోదయ తత్వానికి అంకితమైంది. ఈనాటి యువత తమ విలువలు, ఆదర్శాలను తమ జీవితాల్లోకి తీసుకువస్తే అది వారికి గొప్ప సహాయకారిగా ఉంటుంది. “ఎన్ని మంచి విషయాలు, మంచి లక్షణాలు ఉన్నాయి - ఇవన్నీ సమాజం నుండే మనకు లభిస్తాయి. మనం సమాజం రుణం తీర్చుకోవాలి, మనం ఇలా ఆలోచించాలి.” అని ఒకసారి లక్నోలో దీన్ దయాళ్ గారు అన్నారు. అంటే దీన్ దయాళ్ గారు మనం సమాజం నుండి, దేశం నుండి చాలా తీసుకుంటున్నామని బోధించారు. మన స్థానం దేశం వల్ల మాత్రమేనని, కాబట్టి దేశం పట్ల మన రుణం ఎలా తీర్చుకోవాలో మనం ఆలోచించాలని ఆయన అన్నారు. నేటి యువతకు ఇది గొప్ప సందేశం.

మిత్రులారా! మనం ఎన్నటికీ ఓటమిని అంగీకరించకూడదనే పాఠాన్ని కూడా దీన్ దయాళ్ గారి జీవితం నుండి నేర్చుకుంటాం. ప్రతికూల రాజకీయ, సైద్ధాంతిక పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన  భారతదేశ అభివృద్ధి కోసం స్వదేశీ నమూనా సృష్టికి  దూరంగా ఉండలేదు. నేడు చాలా మంది యువకులు సిద్ధంగా ఉన్న మార్గాల నుండి బయటపడటం ద్వారా ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. వారు తమదైన రీతిలో పనులు చేయాలనుకుంటున్నారు. దీన్ దయాళ్  గారి జీవితం వారికి చాలా సహాయపడుతుంది. అందుకే యువత తప్పనిసరిగా వారి గురించి తెలుసుకోవాలని నేను కోరుతున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా! మనం ఈరోజు అనేక అంశాలపై చర్చించాం. మనం మాట్లాడుకున్నట్టు రాబోయే సమయం పండుగల కాలం. అసత్యంపై ధర్మ విజయంగా  పురుషోత్తముడైన శ్రీరాముని విజయోత్సవాన్ని దేశం మొత్తం జరుపుకోబోతోంది. కానీ ఈ పండుగలో మనం మరో పోరాటం గురించి గుర్తుంచుకోవాలి - అది కరోనాపై దేశం చేసిన పోరాటం. ఈ పోరాటంలో టీం ఇండియా ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చర్చల్లో ఉన్న అనేక రికార్డులను వాక్సినేషన్ రంగంలో దేశం నెలకొల్పింది.  ఈ పోరాటంలో ప్రతి భారతీయుడిది కీలక పాత్ర. మన వంతు వచ్చినప్పుడు మనం టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ భద్రతా వలయం నుండి ఎవరూ బయటపడకుండా మనం జాగ్రత్త వహించాలి. చుట్టుపక్కల వ్యాక్సిన్ తీసుకోని వారిని కూడా టీకా కేంద్రానికి తీసుకెళ్లాలి. టీకా తీసుకున్న తర్వాత కూడా అవసరమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఈ పోరాటంలో మరోసారి టీం ఇండియా తన జెండాను ఎగురవేస్తుందని నేను ఆశిస్తున్నాను. వచ్చేసారి మరికొన్ని ఇతర అంశాలపై 'మన్ కీ బాత్'- మనసులో మాట చెప్పుకుందాం. మీ అందరికీ-  ప్రతి దేశ పౌరుడికీ-  చాలా సంతోషకరమైన పండుగ శుభాకాంక్షలు.

ధన్యవాదాలు.

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s digital PRAGATI

Media Coverage

India’s digital PRAGATI
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 డిసెంబర్ 2024
December 07, 2024

PM Modi’s Vision of an Inclusive, Aatmanirbhar and Viksit Bharat Resonating with Citizens