Hunar Haat has given wings to the aspirations of artisans: PM Modi
Our biodiversity is a unique treasure, must preserve it: PM Modi
Good to see that many more youngsters are developing keen interest in science and technology: PM Modi
New India does not want to follow the old approach, says PM Modi
Women are leading from the front and driving change in society: PM Modi
Our country's geography is such that it offers varied landscape for adventure sports: PM Modi

నా ప్రియమైన దేశప్రజలారా, ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) మాధ్యమం ద్వారా కచ్ నుండి కోహిమా వరకూ, కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకూ దేశ ప్రజలందరి కీ మరోసారి నమస్కారం తెలిపే అవకాశం రావడం నా అదృష్టం. మీ అందరి కీ నమస్కారం. మన దేశం గొప్పతనాన్నీ, వైవిధ్యాల ను తల్చుకుంటూ, వాటికి నమస్కరించడం ప్రతి భారతీయుడూ గర్విస్తూ చేసే పని. ఈ వైవిధ్యాల ను తలుచుకునే అవకాశం వచ్చినప్పుడల్లా ఎంతో ఉత్కంఠత, ఎంతో ఆనందం తో మనసు నిండిపోతుంది. ఒకరకంగా ఇది ఎంతో ప్రేరణ ను కూడా ఇస్తుంది. కొద్ది రోజుల క్రితం నేను ఢిల్లీ లోని హునర్ హాట్ లోని ఒక చిన్న ప్రదేశంలో మన దేశ గొప్పతనం, సంస్కృతి, సంప్రదాయం, ఆహారపదార్థాలు, ఇంకా భావోద్వేగాల్లోని వైవిధ్యాల ను చూసే అవకాశం లభించింది. సాంప్రదాయ వస్త్రాలు, హస్తకళలు, తివాచీలు, పాత్రలు, వెదురు, ఇత్తడి ఉత్పత్తులు, పంజాబ్‌ కు చెందిన ఫుల్కారి, ఆంధ్ర ప్రదేశ్ నుండి విలాసవంతమైన తోలు పని, తమిళ నాడు నుండి అందమైన వర్ణ చిత్రాలు, ఉత్తర ప్రదేశ్ నుండి ఇత్తడి ఉత్పత్తులు, భదోహి నుండి తివాచీ లు, కచ్ నుండి రాగి ఉత్పత్తులు, అనేక సంగీత వాయిద్యాలు, లెక్కలేనన్ని విషయాలు, మొత్తం భారతదేశం యొక్క కళ మరియు సంస్కృతి యొక్క సంగ్రహావలోకనాలు నిజంగా ప్రత్యేకమైనవి! వాటి వెనుక ఉన్న చేతివృత్తుల వారి కథలు, వారి నైపుణ్యాల పట్ల అభిరుచి,  ప్రేమ, వారి కథలు అన్నీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం గా ఉంటాయి. హునర్ హాట్ లో ఒక దివ్యాంగ మహిళ మాటలు విని నాకెంతో సంతోషం కలిగింది. మొదట్లో ఆవిడ ఫుట్ పాత్ పై తన వర్ణ చిత్రాల ను అమ్మేవారని ఆవిడ నాకు చెప్పారు. కానీ, హునర్ హాట్ లో చేరిన తరువాత తన జీవితమే మారిపోయిందని ఆమె అన్నారు. ఇవాళ్టి రోజున ఆమె లో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా, తనకంటూ ఓ సొంత ఇల్లు కూడా ఆమె కు సమకూరింది. హునర్ హాట్ లో మరెందరో కళాకారుల ను కలిసి వారితో మాట్లాడే అవకాశం లభించింది. హునర్ హాట్ ప్రదర్శనల్లో పాల్గొనే కాళాకారుల లో సగానికన్నా ఎక్కువ మంది మహిళలే ఉన్నారని నాకు చెప్పారు.  గత మూడేళ్ళ లో హునర్ హాట్ మాధ్యమం ద్వారా దాదాపు మూడు లక్షల మంది కళాకారుల కీ, వృత్తి విద్యా కళాకారుల కీ ఎన్నో ఉపాధి అవకాశాలు లభించాయి. కళా ప్రదర్శనకు హునర్ హాట్ ఒక మంచి వేదిక మాత్రమే కాక, వారి కలల కు రెక్కల ను కూడా అందిస్తోంది ఈ వేదిక. హునర్ హాట్ లో ఈ దేశం లోని వైవిధ్యాల ను మరువడం అసాధ్యం అనిపించే స్థలం ఒకటి ఉంది. కళా నైపుణ్యం తో పాటు అక్కడ మన ఆహార వైవిధ్యాల ను కూడా చూడవచ్చు. ఒకే వరుస లో అక్కడ ఇడ్లీ-దోశ, ఛోలే-భతూరా, దాల్-బాటీ, ఖమన్-ఖాండ్వీ, ఇంకా ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. నేను స్వయంగా అక్కడ బిహార్ కు చెందిన రుచికరమైన లిటీ-చోఖే తిన్నాను. సంతోషం గా, రుచి ని ఆస్వాదిస్తూ తిన్నాను. భారతదేశం లో ప్రతి ప్రాంతం లోనూ ఇటువంటి సంతలు, తిరునాళ్ళూ, ప్రదర్శనలు జరుగుతూనే ఉంటాయి. భారత దేశాన్ని గురించి తెలుసుకునేందుకు, భారతదేశాన్ని అనుభూతి చెందడానికీ, అవకాశం దొరికినప్పుడల్లా  ఇటువంటి ప్రదర్శనల కు తప్పకుండా వెళ్లాలి. అప్పుడే ‘‘ఏక్ భారత్ – శ్రేష్ఠ్ భారత్’’ని, అంటే, భిన్నత్వం లో ఏకత్వాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి అవకాశం లభిస్తుంది. మీకు దేశం లోని విభిన్న కళలు, సంస్కృతుల తో పరిచయమవడమే కాకుండా, మన దేశం లో కష్టించి పని చేసే కళాకారులు, ముఖ్యం గా మహిళా శ్రేయస్సు కి కూడా మీ వంతు సహకారాన్ని అందించినవారవుతారు. కాబట్టి, అటువంటి ప్రదర్శనల కు తప్పకుండా వెళ్ళండి.

నా ప్రియమైన దేశప్రజలారా, మన దేశం లో ఎన్నో గొప్ప సంప్రదాయాలు ఉన్నాయి. మన పూర్వీకులు మనకు వారసత్వం గా ఇచ్చినవి, మనకు లభించిన విద్య, ఉపదేశాలూ అన్నీనూ.  వీటిలో తోటి జీవుల పట్ల కనికరం, ప్రకృతి పట్ల ఉన్న అపారమైన ప్రేమ, ఇవన్నీ మన సాంస్కృతిక వారసత్వాలు. ప్రతి ఏడాదీ భారతదేశం లోని ఈ వాతావరణం ఆతిథ్యాన్ని తీసుకోవటానికి, ప్రపంచం నలుమూలల నుండి వివిధ జాతుల  భారతదేశం వస్తాయి. ఏడాది పొడుగునా ఎన్నో వలస జాతుల కు భారతదేశం ఇల్లు గా మారుతుంది. ఐదు వందల కన్నా ఎక్కువ పక్షులు, రకరకాల జాతుల పక్షులు, రకరకాల ప్రాంతాల నుండి వస్తాయని చెబుతూ ఉంటారు. ఇటీవల, గాంధీ నగర్ లో ‘సిఒపి – 13 కన్వెన్శన్’ జరిగింది. అందులో ఈ విషయంపై ఎన్నో ఆలోచనలు, ఎంతో చింతన, ఎంతో మేధోమథనం జరిగాయి. భారతదేశం చేస్తున్న ప్రయత్నాల కు కూడా ఎంతో ప్రశంస లభించింది. మిత్రులారా, రాబోయే మూడేళ్ల పాటు వలస జాతులపై జరగనున్న ‘సిఒపి కన్వెన్శన్’ కు భారతదేశం అధ్యక్షత వహించటం మనందరికీ గర్వకారణం. ఈ సందర్భాన్ని మనం ఎలా ఉపయోగకరం గా మార్చుకోవచ్చునో, మీరు మీ సలహాలను తప్పక తెలియచేయండి.

 

‘సిఒపి కన్వెన్శన్’ గురించి జరుగుతున్న చర్చ మధ్యన నా ధ్యాస మేఘాలయ తో ముడిపడిన మరొక విషయం పైకి మళ్ళింది.  ఈ మధ్య జీవ శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం చేపల ను కనుగొన్నారు. ఇవి కేవలం మేఘాలయ లోని గుహల్లో మాత్రమే ఉంటాయి. గుహల్లోని భూ భాగం క్రిందన ఉండే జలచరాలలో కెల్లా ఇవి పెద్ద రకాని కి చెందినవని తెలుసుకున్నారు. ఇవి భూమి కి బాగా అడుగున, ఏ మాత్రం వెలుతురు వెళ్ళలేని చీకటి గుహల్లోని అట్టడుగు భూ భాగం లో మాత్రమే ఈ రకం చేపలు ఉంటాయిట. అంత పెద్ద చేపలు, అంతటి లోతైన గుహల్లో ఎలా జీవిస్తున్నాయి? అని శాస్త్రవేత్తలు ఆశ్చర్యపడుతున్నారు. మన భారతదేశం, ముఖ్యం గా మేఘాలయ అరుదైన జాతుల కు ఇల్లుగా మారడం అనేది సంతోషకరమైన విషయం . ఇది మన భారతదేశం లోని జీవవైవిధ్యానికి ఒక కొత్త పరిమాణాన్ని అందిస్తుంది. మన చుట్టుపక్కల ఇటువంటిచ ఇంకా కనిపెట్టవలసిన విచిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి విషయాల ను గురించి కనుక్కోవాలంటే పరిశోధనాత్మక అభిరుచి ఉండాలి. గొప్ప తమిళా కవయిత్రి అవ్వయార్ ఏమన్నారంటే,

“कट्टत केमांवु कल्लादरु उडगड़वु, कड्डत कयिमन अड़वा कल्लादर ओलाआडू”

“కట్టత కేమావూ కల్లాదరు ఉడగడవు, కడ్డత కయిమన అడవా కల్లాదరు ఓలాఆడు”

దీని అర్థం ఏమిటంటే “మనకి తెలుసినది కేవలం ఒక ఇసుక రేణువంత, కానీ మనకి తెలియనిది ఒక బ్రహ్మాండం తో సమానం”

 

ఈ దేశం లో వైవిధ్యాలు కూడా అలాంటివే. ఎంత తెలుసుకున్నా తక్కువే. మన వద్ద ఉన్న జీవ వైవిధ్యాలు కూడా అటువంటివే. అవి యావత్ మానవజాతి కి ప్రత్యేక నిధి వంటివి. వాటిని మనం కాపాడుకోవాలి.  పరిరక్షించుకోవాలి.  ఇంకా ఎన్నో తెలుసుకోవాలి కూడా.

 

నా ప్రియమైన యువమిత్రులారా, ఈ మధ్యన మన దేశ యువత లో, పిల్లల లో, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం (Science&Technology) పట్ల బాగా ఆసక్తి పెరుగుతోంది. అంతరిక్షంలో రికార్డు స్థాయిలో శాటిలైట్ ప్రయోగాలు, కొత్త కొత్త రికార్డులు, కొత్త కొత్త లక్ష్యాలు ప్రతి భారతీయుడినీ గర్వం తో నింపుతాయి. చంద్రయాన్-2 ప్రయోగ సమయం లో బెంగుళూరు లో ఉన్నప్పుడు అక్కడి కి వచ్చిన పిల్లల ఉత్సాహాన్ని చూశాను.  వాళ్ల మొహాల్లో నిద్రన్న మాటే లేదు.  ఒకరకంగా రాత్రంతా వారు మేల్కొనే ఉన్నారు. వాళ్ళల్లో విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, ఇంకా సృజనాత్మకత పట్ల కనబడిన ఉత్సాహం మర్చిపోలేనిది. పిల్లల్లో, యువత లో ఉన్న ఈ ఉత్సాహాన్ని ప్రోత్సహించడానికి, వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని  ప్రోత్సాహించడానికి మరొక ఏర్పాటు మొదలైంది. శ్రీహరి కోట లో జరిగే రాకెట్ ప్రయోగాన్ని ఇప్పుడు మీరు దగ్గర నుండి, నేరుగా చూడచ్చు. ఈ మధ్యనే అందరి కోసమూ ఒక విజిటర్ గేలరీ తెరవడం జరిగింది. అందులో పది వేల మంది కూర్చునే ఏర్పాటు జరిగింది. ఐఎస్ఆర్ఒ వెబ్ సైట్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్ లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. ఎన్నోచోట్ల నుండి పాఠశాల విద్యార్థుల ను రాకెట్ ప్రయోగాన్ని చూపించడానికి, వాళ్లని మోటివేట్ చెయడానికి టూర్ పై తీసుకు వస్తున్నారని నాకు చెప్పారు. రాబోయే కాలం లో ఈ సౌకర్యాన్ని తప్పకుండా వినియోగించుకోవాల్సింది గా అన్ని పాఠశాల ల ప్రధానోపాధ్యాయులను, అధ్యాపకులను నేను కోరుతున్నాను.

 

 

మిత్రులారా,

 

నేను మీకు మరొక ఉత్సాహకరమైన సమాచారాన్ని చెప్పాలనుకుంటున్నాను. నమో యాప్ లో నేను ఝార్ఖండ్ లోని ధన్ బాద్ నివాసి పారస్ కామెంట్ చదివాను. ఇస్రో కి చెందిన “యువిక” కార్యక్రమం గురించి యువమిత్రుల కు నేను చెప్పాలని పారస్ కోరాడు. యువత ని సైన్స్ తో జతపరచడానికి ఇస్రో చేసిన మెచ్చుకోదగ్గ ప్రయత్నమే ‘‘యువిక’’. 2019లో ఈ కార్యక్రమం స్కూల్ పిల్లల కోసం లాంచ్ చేశారు. ‘‘యువిక’’ అంటే యువ విజ్ఞాన కార్యక్రమం. ఈ కార్యక్రమం మన స్వప్నమైన ‘‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్’’ నినాదాని కి ప్రతిరూపం. ఈ కార్యక్రమం లో పరీక్షల తర్వాత, విద్యార్థులు తమ సెలవుల్లో ఇస్రో తాలూకూ రకరకాల సెంటర్ల కు వెళ్ళి అంతరిక్ష సాంకేతిక విజ్ఞానం, అంతరిక్ష విజ్ఞానం, అంతరిక్షశాస్త్ర ప్రయోగం  గురించి తెలుసుకుంటారు. ట్రైనింగ్ ఎలా ఉంటుంది? ఏ రకంగా ఉంటుంది? ఎంత అద్భుతం గా ఉంటుంది? మొదలైన విషయాలు తెలుసుకోవాలి అంటే క్రితం సారి ఎవరైతే హాజరైయ్యారో, వారి అనుభవాల ను చదవండి.  మీరు స్వయం గా రావాలి అనుకుంటే ఇస్రో తో జతపరచబడిన ‘‘యువిక’’ వెబ్ సైట్ లో మీ వివరాల ను రిజిస్టర్ చేసుకోవచ్చు. నా యువ మిత్రులారా, మీ కోసం ఆ వెబ్ సైట్ పేరు చెప్తున్నాను, రాసుకోండి. ఇవాళే తప్పకుండా ఆ వెబ్ సైట్ ను చూడండి www.yuvika.isro.gov.in  రాసుకున్నారుగా ?

 

నా ప్రియమైన దేశ ప్రజలారా, 2020,జనవరి 31న లడఖ్ లోని అందమైన లోయలు ఒక చారిత్రాత్మక ఘటన కు సాక్షులు గా నిలిచాయి. లేహ్ లోని కుషోక్ బకులా రింపోచీ విమానాశ్రయం నుండి భారతీయ వాయుసేన కు చెందిన ఎఎన్-32 విమానం గాల్లోకి బయలుదేరగానే ఒక కొత్త చరిత్ర సృష్టించబడింది. ఈ విమానం ఇంధనం లో  పది శాతం(10%) భారతీయ బయో-జెట్ ఇంధనాన్ని కలిపి (Bio-jet fuel) నింపారు. విమానం లోని రెండు ఇంజన్ల లోనూ ఈ మిశమాన్ని నింపడం అనేది ఇదే మొదటిసారి. ఇంతేకాకుండా, లేహ్ లో ఈ విమానం బయలుదేరిన విమానాశ్రయం భారతదేశం లోనే గాక, యావత్ ప్రపంచం లోనే అత్యంత ఎత్తు లో ఉన్న విమానాశ్రయాల్లో ఒకటి. ముఖ్యమైన విషయం ఏమిటంటే బయో-జెట్ ఇంధనం (Bio-jet fuel) non-edible tree borne oil నుండి తయారు చేయబడింది. దీనిని భారతదేశం లోని విభిన్న ఆదివాసీ ప్రాంతాల నుండి కొనుగోలు చేస్తారు. ఈ ప్రయత్నాల వల్ల కార్బన్ ప్రసరణ (బయటకు పంపడం) తగ్గడమే కాక ముడి చమురు దిగుమతుల పై భారతదేశం ఆధారపడటం తగ్గించవచ్చు. ఇంత పెద్ద కార్యక్రమం లో పాలుపంచుకున్నవారందరికీ, ముఖ్యంగా సిఎస్ఐఆర్, డేహ్రాడూన్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం లోని శాస్త్రవేత్తల కు నేను ఆభినందన లు తెలుపుతున్నాను. బయో ఇంధనం తో విమానం నడపడమనే టెక్నాలజీ ని  చేసి చూపెట్టారు వాళ్ళు.  వారి ప్రయత్నాలు ‘మేక్ ఇన్ ఇండియా’ ను కూడా శక్తివంతం చేస్తాయి.

 

 

నా ప్రియమైన దేశప్రజలారా,

 

మన నవభారతదేశం పాత పధ్దతుల లో నడవడానికి తయారు గా లేదు. ముఖ్యం గా, మన ‘న్యూ ఇండియా’ సోదరీమణులు, తల్లులు ధైర్యం గా ముందుకు వెళ్ళి ఎన్నో సవాళ్ళ ను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. వారి వల్లనే  సమాజం లో ఒక సానుకూల మార్పును మనం చూడగలుగుతున్నాం.  బీహార్ కు చెందిన పూర్ణియా కథ యావత్ దేశాని కీ స్ఫూర్తి ని ఇవ్వదగినది. కొన్ని దశాబ్దాలు గా వరదల వల్ల విషాదం లో కూరుకుపోయిన ప్రాంతం ఇది. ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం, ఆదాయాన్ని ఇవ్వగల అన్ని వనరుల సమీకరణ ఎంతో కష్టం అక్కడ. ఇటువంటి పరిస్థితుల్లో పూర్ణియా కు చెందిన కొందరు మహిళలు ఒక కొత్త మార్గాన్ని కనుగొన్నారు. మిత్రులారా, ఇంతకు మునుపు ఈ ప్రాంతం లో మహిళలు మల్బరీ చెట్ల పై ఉండే పట్టు పురుగుల నుండి Cocoon(పట్టుపురుగుల గూడు) లను తయారు చేసేవారు. దానికి చాలా నామమాత్రపు ధర వారికి లభించేది. వాటిని  కొనుక్కున్నవారు మాత్రం ఇవే పట్టు గూళ్ళ నుండి పట్టు దారాలు తయారు చేసి ఎక్కువ లాభాలు సంపాదించుకునేవారు. నేడు పూర్ణియా కు చెందిన మహిళలు ఒక కొత్త మార్గానికి నాంది పలికి మొత్తం చిత్రాన్నే మార్చివేశారు. ఈ మహిళలు ప్రభుత్వ సహకారం తో మల్బారీ ఉత్పత్తి సమూహాన్ని తయారు చేశారు. తర్వాత పట్టుపురుగుల గూళ్ళ నుండి పట్టుదారాల ను తయారు చేశారు. ఆ తర్వాత ఆ దారాల తో సొంతం గా పట్టుచీరల ను నేయించడం మొదలు పెట్టారు. మొదట్లో పట్టుపురుగుల గూళ్ళ ను అతి తక్కువ ధరకు అమ్మిన అదే మహిళలు, ఇప్పుడు వాటితో తయారు చేసిన చీరల ను వేల రూపాయిల కు అమ్ముతున్నారు. ‘‘ఆదర్శ్ జీవికా మహిళా మల్బారీ ఉత్పాదన సమూహ్’’ కు చెందిన సోదరీమణులు చేసిన అద్భుతం తాలూకూ ప్రభావం  ఇప్పుడు ఎన్నో గ్రామాల్లో కనబడుతోంది. పూర్ణియా కు చెందిన ఎన్నో గ్రామాల కు చెందిన రైతు సోదరీమణులు ఇప్పుడు చీరలు నేయించడమే కాక పెద్ద పెద్ద ప్రదర్శనల్లో తమ సొంత స్టాల్స్ ను  ఏర్పాటు చేసుకుని, వారి ఉత్పాదనల ను వారే స్వయం గా అమ్ముకుంటున్నారు. నేటి మహిళలు కొత్త శక్తి తో, కొత్త ఆలోచనల తో, ఎలా కొత్త లక్ష్యాల ను సాధిస్తున్నారో తెలుసుకోవడానికి ఇది మంచి ఉదాహరణ.

 

నా ప్రియమైన దేశప్రజలారా,

 

మన దేశ మహిళల, ఆడబిడ్డల ఉద్యమ స్ఫూర్తి, వారి సాహసం, ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. మన ఆడబిడ్డలు పాత పరిమితుల ను అధిగమించి, ఉన్నత శిఖరాల ను ఎలా అధిరోహిస్తున్నారో తెలుసుకోవడానికి మన చుట్టుపక్కలే మనకి ఇటువంటి ఉదాహరణలు అనేకం కనిపిస్తాయి. పన్నెండేళ్ల ఆడబిడ్డ కామ్య కార్తికేయన్ సాధించిన విజయం గురించి మీకు నేను తప్పకుండా చెప్పాలనుకున్నాను. కేవలం పన్నెండేళ్ల వయసు లో కామ్య Mount Aconcagua ని అధిరోహించి చూపెట్టింది. ఇది దక్షిణ అమెరికా లోని ANDES పర్వతాల లో ఉన్న అతి ఎత్తయిన పర్వతం. దాని ఎత్తు దాదాపు  7000 మీటర్లు. ఈ నెల మొదట్లో కామ్య ఈ పర్వతాన్ని విజయవంతం గా అధిరోహించి, ముందుగా అక్కడ మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిందన్న వార్త ప్రతి భారతీయుడి మనసునీ  తప్పక ఆనందమయం చేస్తుంది. దేశం గర్వపడేలాంటి పని చేసిన కామ్య ఒక కొత్త లక్ష్యాన్ని చేపట్టిందని నేను విన్నాను. దాని పేరు ‘‘మిశన్ సాహస్’’. ఇందులో భాగం గా కామ్య అన్ని ఖండాల లోనూ ఉన్న ఎత్తయిన పర్వతాల ను అధిరోహించే లక్ష్యం చేపట్టింది. ఈ ప్రయత్నం లో ఉత్తర, దక్షిణ ధృవాల్లో skiing చేయాల్సి ఉంది. కామ్య ‘‘మిశన్ సాహస్’’లో విజయం సాధించాలని కోరుతూ ఆమెకు అభినందనలు తెలుపుతున్నాను. కామ్య సాధించిన విజయం అందరూ ఫిట్ గా ఉండాలనే స్ఫూర్తి ని కూడా అందిస్తుంది. ఇంత చిన్న వయసు లో కామ్య సాధించిన విజయానికి నిస్సందేహంగా ఫిట్ నెస్ కూడా ఒక కారణమే. ‘ఎ నేశన్ దట్ ఈజ్ ఫిట్, విల్ బి ఎ నేశన్ దట్ ఈజ్ హిట్’ (A Nation that is fit, will be a nation that is hit) అంటే..  ‘ఏ దేశం ఫిట్ గా ఉంటుందో, ఆ దేశానికి అన్నింటా విజయమే లభిస్తుంది.’ ఇది వచ్చే నెల లో జరగనున్న అడ్వంచర్ స్పోర్ట్స్   కి కూడా ఎంతో తగినది.  భారతదేశంలో అడ్వంచర్ స్పోర్ట్స్  జరగడానికి తగిన భౌగోళిక పరిస్థితులు మన దేశం లో ఉన్నాయి. ఒక పక్క ఎత్తయిన పర్వతాలు ఉంటే, మరో పక్క సుదూరాల వరకూ వ్యాపించిన ఎడారి ఉంది. మన దేశం ఒక పక్క దట్టమైన అడవుల కు నెలవయితే, మరో పక్క విస్తరించిన సముద్రం ఉంది. అందువల్ల మీ అందరినీ నేను కోరేది ఏమిటంటే, మీకు నచ్చిన చోట, మీకు ఇష్టమైన పని ని ఎంచుకుని, మీ జీవితాన్ని తప్పకుండా (adventure) సాహసం తో జత పరచండి. జీవితం లో (adventure) సాహసం కూడా ఉండి తీరాలి కదా.

 

మిత్రులారా,

 

పన్నెండేళ్ళ ఆడబిడ్డ కామ్య సాధించిన విజయగాథ తరువాత, 105 సంవత్సరాల బాగీరథమ్మ విజయగాథ ను గురించి    మీరు వింటే నిర్ఘాంతపోతారు.  మిత్రులారా, మనం జీవితం లో ప్రగతి సాధించాలన్నా, అభివృధ్ధి చెందాలన్నా, ఏదన్నా సాధింఛాలన్నా కూడా మొదటి షరతు ఏమిటంటే, మన లోపల ఉండే విద్యార్థి ఎప్పుడూ బ్రతికే ఉండాలి. మన 105 సంవత్సరాల బాగీరథమ్మ ఇదే విషయం లో స్ఫూర్తిని అందిస్తుంది. ఈ బాగీరథమ్మ ఎవరా అని మీరు ఆలోచిస్తున్నారా? బాగీరథమ్మ కేరళా లోని కొల్లమ్ లో ఉంటుంది. చాలా చిన్నతనం లోనే ఆమె తన తల్లిని కోల్పోయింది. చిన్నతనం లోనే వివాహం జరిగింది కానీ భర్త ని కూడా పిన్నవయసు లోనే కోల్పోయింది. అయితే, బాగీరథమ్మ తన ధైర్యాన్ని కోల్పోలేదు. తన ఆత్మస్థైరాన్ని కోల్పోలేదు. పదేళ్ల కన్నా చిన్న వయసు లోనే ఆమె పాఠశాల చదువు ఆగిపోయింది. 105 సంవత్సరాల వయసు లో ఆవిడ మళ్ళీ పాఠశాల లో చేరి, మళ్ళీ చదువు మొదలుపెట్టారు. అంత వయసు లో కూడా ఆవిడ లెవెల్-4 పరీక్షలు రాసి, ఎంతో ఆత్రుతగా ఫలితాల కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు. పరీక్షల్లో ఆవిడ 75 శాతం మార్కులు సంపాదించుకున్నారు. అంతే కాదు, గణితం లో నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆవిడ ఇంకా చదువుకోవాలని ఆశ పడుతున్నారు. తరువాతి పరీక్షలు కూడా రాయాలని అనుకుంటున్నారావిడ. బాగీరథమ్మ లాంటి వాళ్లే ఈ దేశాని కి బలం. ఇటువంటివారే స్ఫూర్తి కి అతిపెద్ద మూలం. నేనివాళ ముఖ్యం గా బాగీరథమ్మకు నమస్కరిస్తున్నాను.

 

మిత్రులారా,

 

జీవితం లో ప్రతికూల పరిస్థితుల్లో మన ధైర్యం, మన ధృఢ సంకల్పం ఎటువంటి పరిస్థితులనైనా మార్చేస్తుంది. ఈమధ్యన నేను మీడియా లో ఒక కథ చదివాను. దాని గురించి మీతో తప్పకుండా చెప్పాలనుకున్నాను. మురాదాబాద్ తాలూకా లోని హమీర్ పూర్ గ్రామం లో నివసించే సల్మాన్ కథ ఇది. సల్మాన్ జన్మత: దివ్యాంగుడు. అతడి కాళ్ళు అతడికి సహకరించవు. అయినా కూడా ఏ మాత్రం ఓటమి ని అంగీకరించకుండా సొంతం గా ఏదైనా పని చేసుకుని బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. అంతేగాక, తనలాగే ఇబ్బంది పడే మరికొందరు దివ్యాంగుల కు కూడా తాను సహాయపడాలని అతడు అనుకున్నాడు. తన ఊరిలోనే చెప్పులు, డిటర్జెంట్లు తయారు చేసే పని ప్రారంభించాడు సల్మాన్. చూస్తూండగానే వారితో పాటూ మరో ముఫ్ఫై మంది దివ్యాంగులు వారికి జతయ్యారు. మీరు గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, సల్మాన్ తాను నడవలేక పోయినా ఇతరుల కు నడక తేలికవ్వడానికి ఉపయోగపడే చెప్పుల ను తయారుచే యాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే తన తోటి దివ్యాంగుల కు తానే శిక్షణ ను ఇచ్చాడు. ఇప్పుడు వారందరూ కలిసి తయారీ చేస్తారు, క్రయవిక్రయాలు కూడా వారే చేసుకుంటారు. తమ కష్టం తో కేవలం తమకు మాత్రమే ఉపాధి సంపాదించుకోవడం కాకుండా, తమ కంపెనీ ని కూడా లాభాల్లోకి తెచ్చిపెట్టారు. వీళ్ళంతా కలిసి ఇప్పుడు రోజంతా కష్టపడి రోజుకు 150 జతల చెప్పులు తయారు చేస్తారు. ఇంతేకాదు, ఈ ఏడాది ఒక వంద మంది దివ్యాంగుల కు పని ఇవ్వాలని సల్మాన్ సంకల్పించుకున్నడు. వీరందరి ధైర్యం, వారి ఉద్యమస్ఫూర్తి కి వందనాలు సమర్పిస్తున్నాను. ఇటువంటి సంకల్పశక్తి గుజరాత్ లో కచ్ ప్రాంతాని కి చెందిన అజరక్ గ్రామం లోని ప్రజలు చూపెట్టారు. 2001లో వచ్చిన భూకంప విధ్వంసాని కి  అందరూ గ్రామం వదిలి వెళ్ళి పోతుంటే ఇస్మయిల్ ఖత్రీ అనే ఆయన, గ్రామం లోనే ఉంటూ ‘‘అజరక్ ప్రింట్’’ అనే తమ సంప్రదాయ కళను పరిరక్షించాలనే సంకల్పాన్ని చేసుకున్నాడు. చూస్తూండగానే ప్రకృతి లోని సహజ రంగుల తో తయారైన సంప్రదాయక కళ ‘‘అజరక్ ప్రింట్’’ అందరినీ ఆకర్షించడం మొదలు పెట్టింది. గ్రామ ప్రజలందరూ తమ సంప్రదాయక కళాప్రక్రియ తో ముడిపడిపోయారు. గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్ల పూర్వం తయారైన ఈ కళను రక్షించడమే కాక, ఆధునిక ఫ్యాషన్ కు ఈ కళ ను జత చేశారు. ఇప్పుడు పెద్ద పెద్ద డిజైనర్ లు, పెద్ద పెద్ద డిజైనర్ సంస్థలు, అజరక్ ప్రింట్ ను వాడుకోవడం మొదలు పెట్టారు. గ్రామం లో కష్టపడి పని చేసేవారి కారణం గా ఇవాళ ‘‘అజరక్ ప్రింట్’’ పెద్ద బ్రాండ్ గా మారింది. ప్రపంచం లోని పెద్ద వ్యాపారస్తులు ఈ ప్రింట్ వైపుకి ఆకర్షితులవుతున్నారు.

 

నా ప్రియమైన దేశప్రజలారా,

 

ఇటీవలే దేశవ్యాప్తం గా అందరూ మహాశివరాత్రి పండుగ ను జరుపుకున్నారు. శివపార్వతుల ఆశీర్వాదమే దేశ చైతన్యాన్ని జాగృతం చేస్తోంది.  మహాశివరాత్రి సందర్భం గా ఆ భోలేనాథుడి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి. మీ అందరి కోరికలనూ భగవంతుడైన శివుడు తీర్చాలని, మీరు శక్తివంతులు గా ఉండాలని, ఆరోగ్యం గా ఉండాలని, సుఖం గా ఉండాలని, దేశం పట్ల మీ మీ కర్తవ్యాల ను నిర్వర్తిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.

 

మిత్రులారా,

 

మహాశివరాత్రి తో పాటుగా, ఇక వసంత ఋతువు తాలూకూ వెలుగు కూడా దినదినమూ పెరుగుతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో హోలీ పండుగ ఉంది. దాని వెంటనే ‘ఉగాది’ (గుడీ పడ్వా) కూడా రాబోతోంది. నవరాత్రి పండుగ కూడా దీనితో పాటే కలిసి ఉంటుంది. రామనవమి కూడా ఆ వెంటనే వస్తుంది. పండుగలు, పర్వదినాలు మన దేశంలో సామాజిక జీవితాల తో విడదీయలేని భాగం గా ఉంటూ వచ్చాయి. ప్రతి పండుగ వెనకాల ఏదో ఒక సామాజిక సందేశం దాగి ఉంటుంది. అది సమాజాన్ని మాత్రమే కాక యావత్ దేశాన్నీ ఐకమత్యం తో కట్టిపడేస్తుంది. హోలీ తర్వాత వచ్చే చైత్ర శుక్ల పాడ్యమి నుండీ భారతీయ విక్రమ నామ నూతన సంవత్సరం మొదలవుతుంది. అందుకు గానూ, భారతీయ నూతన సంవత్సరాది కి కూడా నేను మీ అందరి కీ ముందస్తు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నాను.

 

నా ప్రియమైన దేశ ప్రజలారా, తదుపరి ‘మన్ కీ బాత్’ వరకూ కూడా విద్యార్థులందరూ పరీక్షలు రాయడం లో నిమగ్నమై ఉంటారు. పరీక్షలు అయిపోయినవారు సంతోషం గా ఉంటారు. చదువుకుంటున్నవారి కీ, చదువు అయిపోయినవారి కీ కూడా నా శుభాకాంక్షలు. రండి, తదుపరి ‘మన్ కీ బాత్’ కోసం అనేకానేక కబుర్ల ను తీసుకుని వద్దాం. మళ్ళీ కలుద్దాం.

 

అనేకానేక ధన్యవాదాలు. నమస్కారం!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Manufacturing to hit 25% of GDP as India builds toward $25 trillion industrial vision: BCG report

Media Coverage

Manufacturing to hit 25% of GDP as India builds toward $25 trillion industrial vision: BCG report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 డిసెంబర్ 2025
December 12, 2025

Citizens Celebrate Achievements Under PM Modi's Helm: From Manufacturing Might to Green Innovations – India's Unstoppable Surge