సుమారు రూ. 6,350 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన ప్రధాని
దేశ విధాన నిర్ణయ ప్రక్రియలో మహిళల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి కట్టుబడి ఉన్న మా ప్రభుత్వం: ప్రధాని
అవిశ్రాంతంగా కొనసాగుతోన్న అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించే లక్ష్యం: ప్రధాని
నేను 'వికసిత్ భారత్' గురించి మాట్లాడినప్పుడు దానికి అత్యంత బలమైన ఆధారం దేశంలోని 'నారీ శక్తి': ప్రధాని
కాశీ పార్లమెంట్ సభ్యుడిగా, దేశ ప్రధానమంత్రిగా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఒక ముఖ్యమైన లక్ష్యాన్ని సాధించేందుకు నేను మీ ఆశీస్సులను కోరుతున్నాను. అదే లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం: ప్రధాని

ఈ రోజు వారణాసిలో జరిగిన మహిళా సదస్సులో భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. అక్కడ ఆయన వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. 

ఈ సందర్భానికి ఉన్న ప్రాముఖ్యతను వివరించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. కాశీ దైవిక శక్తులకు నిలయమని ఇక్కడ శృంగార గౌరీ మాత, అన్నపూర్ణ మాత, విశాలాక్షి మాత, సంకట మాత, గంగా మాత కొలువై ఉన్నారని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన సోదరీమణులు, కుమార్తెలతో ఈ కార్యక్రమం అత్యంత పవిత్రంగా మారిందని ఆయన అన్నారు. "కాశీ గడ్డపై ఉన్న మీ అందరికీ అంటే కాశీ తల్లులు, సోదరీమణులు, కుమార్తెలందరికీ నేను నమస్కరిస్తున్నాను" అని ఆయన వ్యాఖ్యానించారు. 

ఈ సందర్భం నారీ శక్తి, అభివృద్ధిని రెండింటినీ ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కాశీలో అన్ని రకాల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు కాశీ, అయోధ్య మధ్య అనుసంధానతను మెరుగుపరిచే పనులను కూడా చేపట్టినట్లు ఆయన తెలిపారు. కాశీ నుంచి పుణెకు, అయోధ్య నుంచి ముంబయికి రెండు అమృత్ భారత్ రైళ్లను ఆయన ప్రారంభించారు. మహారాష్ట్ర ప్రజలు ఈ పుణ్యక్షేత్రాలను చేరుకోవడానికి ఇవి ఆధునిక అనుసంధానతను కల్పిస్తాయి. "ఇది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మధ్య అనుసంధానతను మరింత మెరుగుపరుస్తుంది. అయోధ్య, కాశీ విశ్వనాథ్ పుణ్యక్షేత్రాలను చేరుకోవడానికి ప్రజలకు మరో ఆధునిక మార్గాన్ని అందిస్తుంది" అని ప్రధాని పేర్కొన్నారు.

 

దేశ నిర్మాణంలో మహిళలకు ఉన్న కీలక పాత్రను గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా చెప్పారు. ‌వికసిత్ భారత్‌కు అత్యంత బలమైన ఆధారం 'నారీ శక్తి' అని ఆయన అన్నారు. లోక్‌సభ, విధానసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఒక ప్రధాన జాతీయ లక్ష్యాన్ని సాధించే విషయంలో ఆయన అక్కడున్న వారి ఆశీస్సులను కోరారు. "మీ రిజర్వేషన్ హక్కును నిజం చేసేందుకు నేను అన్ని విధాలా కృషి చేస్తానని.. ఎటువంటి ప్రయత్నం వదిలిపెట్టనని మీకు హామీ ఇస్తున్నాను" అని ఆయన స్పష్టం చేశారు.

మహిళా సాధికారతలోని పరివర్తనాత్మక శక్తిని గురించి మాట్లాడిన ప్రధానమంత్రి.. ఇంట్లో ఒక మహిళ సాధికారత పొందితే మొత్తం కుటుంబానికి బలం చేకూరుతుందని తద్వారా సమాజం, దేశం బలపడతాయన్నారు. భారతీయ మహిళలు ఎదుర్కొన్న చారిత్రక అడ్డంకులను గుర్తుచేసిన ఆయన.. తరతరాలుగా బాలికలు ఎదుర్కొన్న చిన్నచూపును, వారి సామర్థ్యం- అవసరం- పద్ధతులపై ఉన్న ప్రశ్నలను ప్రస్తావించారు. ఇటువంటి వివక్ష కేవలం కాశీకే పరిమితం కాలేదని, ఇది దేశవ్యాప్తంగా ఉందన్న ఆయన.. సమాజం ఈ అన్యాయాన్ని అలవాటుగా మార్చుకుందని పేర్కొన్నారు. "ఈ అడ్డంకులను సహజంగా అంగీకరించేవారు. ఇది మారాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.

తిరోగమన ఆలోచనలను విచ్ఛిన్నం చేయాలనే తన నిబద్ధతను గుర్తుచేసిన శ్రీ నరేంద్ర మోదీ.. 25 ఏళ్ల క్రితం తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బాలికల కోసం రెండు అగ్రగామి పథకాలను ప్రారంభించిన విషయాన్ని చెప్పారు. అవే.. అమ్మాయిలు బడికి వెళ్లి చదువు పూర్తి చేసేలా చూడటానికి 'శాల ప్రవేశోత్సవం', వారి ఫీజుల చెల్లింపులో సహాయం చేయడానికి 'ముఖ్యమంత్రి కన్యా కేలవని నిధి' అని తెలియజేశారు. "అప్పటి నుంచి నేటి వరకు మా ప్రభుత్వ విధానాలలో మహిళా సంక్షేమానికి నిరంతరం అత్యధిక ప్రాధాన్యత లభించింది" అని ఆయన పేర్కొన్నారు.

 

2014 నుంచి చేపట్టిన సమగ్ర సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ.. 12 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం, 30 కోట్ల మందికి పైగా సోదరీమణుల కోసం బ్యాంక్ ఖాతాలను తెరవటం, 2.5 కోట్ల కంటే ఎక్కువ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు కల్పించటం, 12 కోట్ల కంటే ఎక్కువ గృహాలకు నల్లా నీటి సౌకర్యం కల్పించటం వంటివి చేసినట్లు ప్రధానమంత్రి తెలియజేశారు. ‘‘సుకన్య సమృద్ధి యోజన, ముద్రా యోజన, మాతృ వందన యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలతో సహా ఈ కార్యక్రమాలు సోదరీమణులు, కుమార్తెలను జాతీయ అభివృద్ధిలో కేంద్ర బిందువుగా ఉంచాయి. ప్రతి ప్రధాన పథకంలో సోదరీమణులు, కుమార్తెలను కేంద్రంగా ఉంచడం మా నిజమైన నిబద్ధతకు నిదర్శనం" అని ప్రధాని పేర్కొన్నారు.

కాశీలో జరిగిన ఒక విజయవంతమైన కార్యక్రమాన్ని గుర్తుచేస్తూ.. రెండు సంవత్సరాల క్రితం కేవలం ఒక నెలలోనే 27,000 మంది బాలికలకు సుకన్య సమృద్ధి ఖాతాలను తెరిచి ప్రతి ఖాతాలో రూ. 300 జమ చేసిన విషయాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఈ పథకం బాలికల విద్యను బలోపేతం చేయగా ముద్రా యోజన వారి ఆదాయానికి భరోసా కల్పించింది. అలాగే పీఎం ఆవాస్ యోజన ద్వారా మొదటిసారిగా కోట్ల మంది సోదరీమణుల పేరు మీద ఆస్తులు నమోదయ్యాయి. "ఈ రోజు మన తల్లులు, సోదరీమణులు నిజంగా తమ ఇళ్లకు యజమానులవుతున్నారు" అని ఆయన పేర్కొన్నారు.

సాధికారతకు సౌకర్యం, భద్రత పునాది అని చెప్పిన ప్రధానమంత్రి .. ఉత్తరప్రదేశ్‌లో గతంలో బాలికలు ఇంటి బయటకు రావడమే కష్టంగా ఉండే పరిస్థితితో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని పోల్చారు. భారతీయ న్యాయ సంహిత మహిళలపై నేరాల్లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేలా కొత్త ఆత్మవిశ్వాసాన్ని కల్పించిందన్నారు. మహిళా పోలీస్ స్టేషన్లు, కౌన్సెలింగ్ కేంద్రాల నెట్‌వర్క్ నిరంతరం విస్తరిస్తోందని పేర్కొన్నారు. "కుమార్తెల పట్ల దురుద్దేశంతో వ్యవహరించే ఎవరికైనా ఏ గతి పడుతుందో ఇప్పుడు బాగా తెలుసు" అని ఆయన స్పష్టం చేశారు.

 

ఆర్థిక సాధికారతకు ఉన్న ప్రాముఖ్యతను ప్రముఖంగా చెబుతూ.. మహిళల ఆర్థిక శక్తి పెరిగినప్పుడు  కుటుంబంలో వారి గొంతు కూడా అంతే బలంగా మారుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గత 11 ఏళ్లలో సుమారు 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక బృందాలతో అనుసంధానమయ్యారు. ఇందులో కాశీకి చెందిన సుమారు 1.25 లక్షల మంది సోదరీమణులు ఉన్నారు. వారికి లక్షలాది రూపాయల సహాయం అందిస్తూ వారు స్వతంత్రంగా పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాం. "ఇటువంటి ప్రయత్నాల ద్వారా ఇప్పటివరకు 3 కోట్ల మంది సోదరీమణులు 'లఖ్‌పతి దీదీ'లుగా మారారు. ఇందులో వారణాసికి చెందిన వేలాది మంది కూడా ఉన్నారు" అని ఆయన పేర్కొన్నారు. 

మహిళా సాధికారతలో పాడిపరిశ్రమకు ఉన్న పాత్ర గురించి మాట్లాడుతూ.. బనాస్ డెయిరీతో అనుబంధం ఉన్న లక్షలాది మంది సోదరీమణులకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. వీరు నేడు నేరుగా రూ. 106 కోట్ల బోనస్‌ను అందుకున్నారు. కాశీలోని పాడిపరిశ్రమలో ఉన్న మహిళలు తమ పనిని మరింత విస్తరించాలని కోరిన ఆయన.. భవిష్యత్తులో ఈ రంగం మరింత వృద్ధి చెందుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. "ఇది కేవలం ఆరంభం మాత్రమే. వారణాసి అభివృద్ధి చెందుతుంది. బనాస్ డెయిరీ వృద్ధి చెందుతుంది. ఈ బోనస్ కూడా పెరుగుతూనే ఉంటుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. 

ప్రభుత్వం మహిళలను మార్పు కారకాలుగా తీర్చిదిద్దే తీరును వివరిస్తూ.. వారిని స్వయం సమృద్ధిపరులుగా మార్చడానికి, 'వికసిత్ భారత్' నిర్మాణంలో కీలక పాత్ర పోషించేలా వారికి నాయకత్వ బాధ్యతలను అప్పగించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధానమంత్రి తెలియజేశారు. బ్యాంకింగ్ సఖీలు డిజిటల్ చెల్లింపులను ముందుకు తీసుకెళ్తున్నారని, ఇన్సూరెన్స్ సఖీలు బీమా కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారని, కృషి సఖీలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారని, నమో డ్రోన్ దీదీలు వ్యవసాయ డ్రోన్ విప్లవానికి సారథ్యం వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా సైన్యం, నౌకాదళం, వాయుసేన, సైనిక పాఠశాలలు, రక్షణ అకాడమీలలో మన కుమార్తెల కోసం కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలిపారు. "మా ప్రభుత్వం అంటే మహిళా సాధికారత, మహిళల అభ్యున్నతి, మహిళల జీవితాలను సులభతరం చేయడం అని అర్థం" అని ఆయన ఉద్ఘాటించారు. 

 

అన్ని రంగాలలో మహిళలు అద్భుత ప్రతిభను కనబరుస్తున్నారన్న ప్రధానమంత్రి.. అందుకే విధాన రూపకల్పన, జాతీయ నిర్ణయాధికారంలో వారికి మరింత పెద్ద పాత్ర ఉండాలని అభిప్రాయపడ్డారు. కొత్త పార్లమెంటును నిర్మించడంలో సోదరీమణుల భాగస్వామ్యం కూడా ఒక ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. కొత్త పార్లమెంటు భవనం నిర్మించిన తర్వాత చేపట్టిన మొదటి పని 'నారీ శక్తి వందన్ అధినియం-2023'ని ఆమోదించడమన్న ఆయన.. 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ చట్టం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తుందని తెలిపారు. "ఇప్పుడు ఈ చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాల్సిన అవసరం ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇటీవల జరిగిన పార్లమెంటరీ కార్యకలాపాలపై అసంతృప్తిని వ్యక్తం చేసిన శ్రీ నరేంద్ర మోదీ.. ఎక్కువ మంది మహిళలు విధానసభ, పార్లమెంటుకు ఎన్నికయ్యేలా చేయడానికి ఒక రాజ్యాంగ సవరణను తీసుకొచ్చినా కానీ అది ఆమోదం పొందలేదని అన్నారు. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో మహిళలు రికార్డు స్థాయిలో ఓటు వేయడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

‘నాగరిక్ దేవో భవ’ అనే మంత్రంతో ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా కేంద్రీకృత విధానాన్ని వివరిస్తూ.. విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ, నీటిపారుదల, ఫిర్యాదుల పరిష్కారం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలని ప్రధానమంత్రి చెప్పారు. ఇదే స్ఫూర్తితో ఈ రోజు అనేక కీలక ప్రాజెక్టులతో కాశీ అభివృద్ధిని విస్తరించినట్లు ఆయన పేర్కొన్నారు. "గంగా నదిపై నిర్మిస్తున్న సిగ్నేచర్ బ్రిడ్జ్ పూర్వాంచల్‌ అనుసంధానతను మరింత బలోపేతం చేస్తుంది" అని  ఆయన పేర్కొన్నారు.

 

గత దశాబ్ద కాలంలో కాశీ ఉత్తర, తూర్పు భారతదేశానికి ఒక ప్రధాన ఆరోగ్య కేంద్రంగా ఎదిగిందన్న ప్రధానమంత్రి.. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను 500 పడకల మల్టీ-సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. 100 పడకల క్రిటికల్ కేర్ భవనానికి కూడా శంకుస్థాపన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. "ఇది తీవ్రమైన వ్యాధులకు చికిత్స అందించడానికి కాశీలో ఒక భారీ సదుపాయాన్ని కల్పిస్తుంది" అని ఆయన అన్నారు. 

కాశీ అభివృద్ధికి ఉన్న సమగ్ర, సున్నితమైన స్వభావాన్ని వివరించిన ప్రధానమంత్రి.. గంగా నది శుద్ధీకరణ, ఘాట్ల అభివృద్ధి, పరిపాలనా భవనాల నిర్మాణం, హర్హువా- భవానీపూర్‌లో రైతుల కోసం నిల్వ సౌకర్యాలు, వృద్ధాశ్రమాలు, మహిళా వసతి గృహాలతో సహా అనేక కార్యక్రమాలను ప్రస్తావించారు. "ఈ ప్రాజెక్టులన్నీ వారణాసివాసులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తాయి. ఇవి సున్నితమైన, ప్రజా-కేంద్రీకృత అభివృద్ధి పట్ల మా నిబద్ధతను తెలియజేస్తున్నాయి" అని ఆయన పేర్కొన్నారు.

కాశీ వారసత్వం, వైభవాన్ని బలోపేతం చేసేందుకు తీసుకున్న నిరంతర చర్యల గురించి చెప్పిన శ్రీ నరేంద్ర మోదీ.. ఈ కృషిలో అంతర్భాగంగా ఉన్న 'సత్ కబీర్ స్థలి' అభివృద్ధి, నగ్వాలోని 'సత్ రవిదాస్ పార్కు' పునరుద్ధరణను ప్రత్యేకంగా ప్రస్తావించారు. "మన వారసత్వాన్ని కాపాడటంతో పాటు బలోపేతం చేయడానికి మేం చేపట్టిన నిరంతర కార్యక్రమాల్లో ఇవి భాగం" అని ఆయన పేర్కొన్నారు.

కాశీకి ఉన్న శాశ్వత స్వభావానికి, కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు మధ్యనున్న సరిపోలిక ప్రస్తావించిన ప్రధానమంత్రి ప్రసంగాన్ని ముగించారు. ఈ అభివృద్ధి పనుల విషయంలో శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన.. సభలో ఉన్నవారి ఆశీస్సులకు కృతజ్ఞతలు తెలిపారు. "మన కాశీ అక్షయమైనది.. నిరంతరం సాగేది. అదేవిధంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిరంతరం చైతన్యవంతంగా సాగుతాయి" అని ఆయన ఉద్ఘాటించారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's commercial vehicle sales surge, manufacturers double growth projections to 10-15% this fiscal

Media Coverage

India's commercial vehicle sales surge, manufacturers double growth projections to 10-15% this fiscal
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister remembers victims of 9/11 attacks, reiterates unwavering resolve to combat terrorism
September 11, 2026

The Prime Minister, Shri Narendra Modi has remembered and honoured the victims of the horrific 9/11 attacks on the 25th anniversary and expressed solidarity with the families whose lives were forever changed.

Shri Modi said that terrorism has claimed countless lives around the world and noted that, as a victim of cross-border terrorism, India has been at the forefront of the fight against terrorism for several decades.

He further added that while the threat of terrorism continues to evolve, India’s resolve and opposition to terrorism in all its forms and manifestations remain unwavering. He expressed solidarity with all efforts to combat this scourge.

The Prime Minister also shared glimpses from his visit to the 9/11 Memorial & Museum in 2014.

In a post on X, Shri Modi said;

“25 years on from the horrific 9/11 attacks, we remember and honour the victims and stand in solidarity with the families whose lives were forever changed.

Terrorism has claimed countless lives around the world. As a victim of cross-border terrorism, India has been at the forefront of this fight for several decades.

While the threat keeps evolving, our resolve and opposition to terrorism in all its forms and manifestations remain unwavering. We stand in solidarity with all efforts to combat this scourge.

Here are glimpses from my visit to the 9/11 Memorial & Museum in 2014.”