అల్బెర్టాలోని కననాస్కిస్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, ఈ రోజు జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో కెనడా ప్రధానమంత్రి శ్రీ మార్క్ కార్నీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.
కెనడాలో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత ప్రధానమంత్రిగా శ్రీ కార్నీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నేతలు ఇద్దరూ ముఖాముఖి సమావేశం కావడం ఇదే మొదలు. భారత్-కెనడా సంబంధాల స్థితితో పాటు ముందున్న మార్గం విషయమై ఇరు పక్షాలకూ నిర్మొహమాటంగా, ముందుచూపుతో కూడిన చర్చలను నిర్వహించే అవకాశాన్ని ఈ సమావేశం అందించింది.
ఉమ్మడి ప్రజాస్వామిక విలువలు, చట్ట నియమావళి పట్ల గౌరవ భావం, వీటితో పాటు సార్వభౌమత్వం, ఇంకా ప్రాదేశిక సమగ్రత.. ఈ సిద్ధాంతాలను తు.చ. తప్పక సంరక్షించుకోవాలన్న నిబద్ధతపై ఆధారపడిన ఇండియా-కెనడా సంబంధాలకు ఉన్న ప్రాధాన్యాన్ని నేతలు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఆందోళనకర అంశాలు, స్పందనశీలత.. వీటి పట్ల పరస్పర గౌరవం, ప్రజల మధ్య పరస్పరం బలమైన సంబంధాలతో పాటు నానాటికీ పెరుగుతున్న ఆర్థిక పరస్పర పూరకాలపై ఆధారపడే ఒక ఫలప్రద, సమతుల్య భరిత భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు ప్రధానంగా ప్రస్తావించారు. ఇరు పక్షాల సంబంధాల్లో స్థిరత్వాన్ని ఇంతకు ముందున్న స్థితికి తీసుకు పోవడానికి సంతులిత, సహాయక చర్యలను తీసుకోవాలనీ, దీనికోసం తొలి నిర్ణయంగా ఇరు దేశాల రాజధాని నగరాల్లోనూ వీలయినంత త్వరగా హై కమిషనర్లను తిరిగి నియమించుకోవాలని అనుకున్నారు.
ద్వైపాక్షిక సంబంధాల్లో నమ్మకాన్ని పెంచి, వేగాన్ని తీసుకు రావడానికి వేర్వేరు రంగాల్లో సీనియర్ మంత్రుల స్థాయి సంభాషణలతో పాటు కార్యాచరణ స్థాయి మాటామంతీని తిరిగి ప్రారంభించడం ముఖ్యమని నేతలు స్పష్టం చేశారు.
పర్యావరణ అనుకూల ఇంధనం, డిజిటల్ మార్పు, కృత్రిమ మేధ, ఎల్ఎన్‌జీ, ఆహారానికి లోటు లేకుండా చూడటం, కీలక ఖనిజాలు, ఉన్నత విద్యావకాశాలను కల్పించడం, సమర్థ రాకపోకల విధానం, ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తూత్పత్తుల సరఫరాల్లో అంతరాయాలు ఏర్పడకుండా పక్కా వ్యవస్థను నిర్మించడం వంటి రంగాల్లో భవిష్యత్కాలంలో సహకరించుకోవడానికి ఉన్న అవకాశాలపై నేతలు చర్చించారు. స్వతంత్ర ఇండో-పసిఫిక్, ఆంక్షలకు తావు ఉండని ఇండో-పసిఫిక్ ఆవిష్కరణను ప్రోత్సహించాలనేదే తమ రెండు దేశాల అభిమతమని పునరుద్ఘాటించారు. కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్ అగ్రిమెంట్ (సీఈపీఏ)కు మర్గాన్ని సుగమం చేయాలన్న దృష్టితో నేతలు అర్లీ ప్రోగ్రెస్ ట్రేడ్ అగ్రిమెంట్ (ఈపీటీఏ)పై నిలిచిపోయిన సంప్రదింపులను మళ్లీ మొదలుపెట్టడం ముఖ్యమని కూడా అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో బాధ్యతలను అధికారులకు అప్పగించేందుకు అంగీకరించారు.
జీ7 శిఖరాగ్ర సదస్సులో చోటుచేసుకున్న ప్రధాన ప్రగతిని ఇద్దరు నేతలు గుర్తించారు. వాతావరణ సంబంధిత కార్యాచరణ, అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాలకు అందేటట్టు చూడటం, అభివృద్ధి సాధనను నిరంతరాయంగా కొనసాగిస్తూ ఉండటం.. ఈ తరహా ప్రపంచ ప్రాధాన్య అంశాల్లో కలిసికట్టుగా ఫలప్రద కృషికి నడుం కడదామన్న ఉమ్మడి అభిలాషను వ్యక్తం చేశారు.
రెండు దేశాల ప్రజల మధ్య పరస్పరం విస్తృత సంబంధాలు నెలకొన్న సంగతిని నేతలు ప్రధానంగా ప్రస్తావించి, ఉభయ పక్షాలకు మేలు కలిగేలా ఈ అవగాహనను ఊతంగా తీసుకొని ముందుకు పోవడానికి అంగీకరించారు.
నేతలు ఇద్దరూ తరచుగా సంప్రదింపులు జరుపుకొంటూ ఉండాలని సమ్మతించడంతో పాటు వీలయినంత త్వరలో మరో సారి భేటీ అవుదామన్న అభిలాషను కూడా వ్యక్తం చేశారు.
Had an excellent meeting with Prime Minister Mark Carney. Complimented him and the Canadian Government for successfully hosting the G7 Summit. India and Canada are connected by a strong belief in democracy, freedom and rule of law. PM Carney and I look forward to working closely… pic.twitter.com/QyadmnThwH
— Narendra Modi (@narendramodi) June 17, 2025


