పలు పర్యావరణహిత పథకాలూ, కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు
ప్రారంభమైన ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు ఎంతో ముఖ్యమైందన్న ప్రధానమంత్రి
“ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా లక్ష్యం... రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలన్నదే మా ఆశయం: శ్రీ మోదీ
భావి సాంకేతికతలకు కేంద్రంగా ఆంధ్రా...
పట్టణీకరణ మా ప్రభుత్వానికి ఒక గొప్ప అవకాశమన్న ప్రధానమంత్రి
“సముద్రం నుంచీ సంపద సృష్టి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు నీలి ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాం”

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం.. విశాఖపట్నంలో రూ. 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ...60 ఏళ్ల విరామం తర్వాత ప్రజల ఆశీర్వాదంతో కేంద్రంలో వరుసగా మూడోసారి ఒకే ప్రభుత్వం ఎన్నికైందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారికంగా ఇది తన మొదటి కార్యక్రమమని శ్రీ మోదీ తెలిపారు. కార్యక్రమానికి ముందు జరిగిన రోడ్‌షో సందర్భంగా తనకు ఘన స్వాగతం పలికిన ప్రజలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రసంగంలో శ్రీ చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి మాటను, భావాన్ని తాను గౌరవిస్తున్నానని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్, భారతదేశ ప్రజల మద్దతుతో శ్రీ నాయుడు తన ప్రసంగంలో పేర్కొన్న అన్ని లక్ష్యాలను సాధించగలమన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

"మన ఆంధ్రప్రదేశ్ అవకాశాలకు గని" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ అవకాశాలను వినియోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని, తద్వారా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తమ లక్ష్యమని, రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలన్నది తమ ఆశయమని ప్రధాని అన్నారు. 
2047 నాటికి ఆంధ్రప్రదేశ్ 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడాన్ని లక్ష్యంగా పెట్టుకుందని శ్రీ మోదీ గుర్తు చేశారు. ఈ ఆశయ సాకారం కోసం శ్రీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ‘స్వర్ణ ఆంధ్ర@2047’ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌తో భుజం భుజం కలిపి పని చేస్తోందని, లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యాన్నిస్తోందని ప్రధాని వెల్లడించారు. ఈ రోజు రూ. 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువగల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు జరిగాయంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, దేశ ప్రజలకు ప్రధాని అభినందనలు తెలియజేశారు.

 

వినూత్న స్వభావం గల ఆంధ్రప్రదేశ్... ఐటీ, సాంకేతికత రంగానికీ  ముఖ్యమైన కేంద్రంగా ఉందని చెబుతూ, "ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సాంకేతికతలకు కీలక కేంద్రంగా మారడానికి ఇది సరైన సమయం" అని వ్యాఖ్యానించారు. గ్రీన్ హైడ్రోజన్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో మార్గదర్శిగా ఉండటం ముఖ్యమని అన్నారు.  2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2023లో ప్రారంభమైందని శ్రీ మోదీ పేర్కొన్నారు. తొలిదశలో రెండు గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు  ఏర్పాటు అవుతాయని, అందులో ఒకటి విశాఖపట్నంలో ఉండగలదని చెప్పారు. ప్రపంచంలోని అతి పెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సౌకర్యాలు కలిగిన అతికొద్ది నగరాల్లో విశాఖపట్నం ఒకటిగా నిలుస్తుందని ప్రధాని అన్నారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని, ఆంధ్రప్రదేశ్‌లో తయారీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని ప్రధాని తెలియజేశారు.

నక్కపల్లిలో ‘బల్క్ డ్రగ్ పార్క్’ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసే అవకాశం తనకు కలిగిందని, ఇటువంటి పార్కు ఏర్పాటు అవుతున్న మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటని ప్రధాని అన్నారు. ఈ పార్క్  తయారీ, పరిశోధనలకు అద్భుతమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని, స్థానిక ఫార్మా కంపెనీలకు ప్రయోజనం చేకూర్చడమే కాక  పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని పెంపొందిస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు.

తమ ప్రభుత్వం పట్టణీకరణను ఒక అవకాశంగా పరిగణిస్తోందని, నవీన తరం పట్టణీకరణకు ఆంధ్రప్రదేశ్‌ను ఉదాహరణగా నిలపాలని భావిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఈ ఆశయ సాకారం  కోసం  ‘క్రిస్ సిటీ’గా పిలిచే కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతానికి ఈరోజు శంకుస్థాపన చేశామన్నారు. ఈ స్మార్ట్ సిటీ చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగం అవుతుందని, వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని, ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది పారిశ్రామిక ఆధారిత ఉద్యోగాలు వస్తాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

ఇప్పటికే తయారీ కేంద్రమైన శ్రీసిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ లబ్ది పొందుతోందని వ్యాఖ్యానిస్తూ, పారిశ్రామిక, తయారీ రంగాల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలన్నదే తమ లక్ష్యమని శ్రీ మోదీ తెలియజేశారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం -పిఎల్‌ఐ (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం తయారీని ప్రోత్సహిస్తోందని, దరిమిలా వివిధ ఉత్పత్తులను తయారు చేయడంలో ప్రపంచంలోని అగ్ర దేశాల సరసన భారతదేశం స్థానం పొందుతోందని  ప్రధాన మంత్రి అన్నారు.

సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి విశాఖపట్నం కొత్త నగరంలో శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ  ప్రత్యేక రైల్వే జోన్‌ కోసం సుదీర్ఘకాలంగా ఉన్న ఆంధ్ర ప్రజల కోరిక ఇక నెరవేరనుందని అన్నారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయ, వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తాయని, పర్యాటకం, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలు లభిస్తాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. వేల కోట్ల విలువైన కనెక్టివిటీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను కూడా ప్రధాని ప్రస్తావించారు. 100% రైల్వే విద్యుదీకరణ జరిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 70కి పైగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని శ్రీ మోదీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం ఏడు వందే భారత్ రైళ్లు, ఒక అమృత్ భారత్ రైలును నడుపుతున్నట్లు ప్రధానమంత్రి చెప్పారు.

 

“మెరుగైన అనుసంధానం, సౌకర్యాలతో ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయాల విప్లవం రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చివేస్తుంది” అని శ్రీ మోదీ అన్నారు. ఈ పరిణామం జీవన సౌలభ్యాన్ని, వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందిస్తుందని, ఆంధ్రప్రదేశ్ 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి పునాదిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలు శతాబ్దాలుగా భారతదేశ వాణిజ్యానికి ద్వారాలుగా ఉన్నాయని, ఇప్పటికీ వాటి ప్రాముఖ్యం తగ్గలేదని పేర్కొన్న ప్రధాన మంత్రి, సముద్ర వాణిజ్య అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవడానికి మిషన్ మోడ్‌లో నీలి ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్నట్లు  చెప్పారు. మత్స్య పరిశ్రమలో భాగమైన వారి ఆదాయం, వ్యాపారాలను పెంచేందుకు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌ ఆధునీకరణ అనివార్యమని  అభిప్రాయపడ్డారు. మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డుల వంటి సౌకర్యాలు కల్పించడంతోపాటు నౌకా వాణిజ్య భద్రతకు తీసుకుంటున్న చర్యలను శ్రీ మోదీ తెలియజేశారు.

 

అభివృద్ధి ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందేందుకు  ప్రతి రంగంలో సమ్మిళిత, సర్వతోముఖాభివృద్ధి సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ మోదీ  చెప్పారు. సుసంపన్నమైన, ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సౌభాగ్యానికి భరోసా కల్పించేటటువంటి ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభమయ్యాయంటూ అందరికీ అభినందనలు తెలియజేసి  ప్రధాని తమ ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

నేపథ్యం:

గ్రీన్ ఎనర్జీ, సుస్థిర భవిష్యత్తు కోసం తీసుకుంటున్న చర్యల పట్ల మరోసారి నిబద్ధత చాటుతూ ఆంధ్రప్రదేశ్‌, విశాఖపట్నం సమీపంలోని పూడిమడకలో అత్యాధునిక ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్ట్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ప్రారంభమవుతున్న మొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్. 20 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు సహా ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 1,85,000 కోట్ల పెట్టుబడి అవసరమవుతోంది. రోజుకి 1500 టన్నుల (టీపీడీ) గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మిథనాల్, గ్రీన్ యూరియా, పర్యావరణహిత విమాన ఇంధనం వంటి గ్రీన్ హైడ్రోజన్ సహ ఉత్పత్తులు సహా 7500 టీపీడీ ఉత్పాదన సామర్థ్యంతో, దేశంలోని అతిపెద్ద సమీకృత గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సౌకర్యాలలో ఇది ఒకటిగా నిలుస్తోంది. ప్రధానంగా ఎగుమతులే గ్రీన్ హబ్ లక్ష్యం. 2030 నాటికి శిలాజేతర ఇంధన లక్ష్యమైన 500 గిగావాట్ల సాధనలో ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుంది.

విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన సహా ఆంధ్రప్రదేశ్‌లో రూ. 19,500 కోట్ల విలువైన వివిధ రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి ప్రధాన మంత్రి అనేక అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితమిచ్చారు. ఈ ప్రాజెక్టులు రద్దీని తగ్గించడమే కాక, అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి, ప్రాంతీయ, సామాజిక ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి.

 

అందుబాటులో,  తక్కువ ఖర్చయ్యే  ఆరోగ్య సంరక్షణ లక్ష్యాన్ని అందుకునే దిశగా అనకాపల్లి జిల్లా, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్‌కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ బల్క్ డ్రగ్ పార్క్ విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ), విశాఖపట్నం-కాకినాడ పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్ పెట్టుబడి ప్రాంతాలకు సమీపంలో ఉన్నందున, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంలో సహాయపడుతూ వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌ తిరుపతి జిల్లాలోని  చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ కింద కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియా (క్రిస్ సిటీ)కి కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద అగ్రగామి ప్రాజెక్ట్ అయిన కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియాను (క్రిస్ సిటీ), గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా అభివృద్ధిపరచనున్నారు. ఈ ప్రాజెక్ట్ సుమారు రూ. 10,500 కోట్ల విలువైన ఉత్పాదక పెట్టుబడులను ఆకర్షించగలదని, దాదాపు 1 లక్ష ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించగలదని అంచనా. ఈ ప్రాజెక్టు మెరుగైన ఉపాధి అవకాశాలను అందించడమే కాక,  ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుంది. 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's telecom sector surges in 2025! 5G rollout reaches 85% of population; rural connectivity, digital adoption soar

Media Coverage

India's telecom sector surges in 2025! 5G rollout reaches 85% of population; rural connectivity, digital adoption soar
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 డిసెంబర్ 2025
December 20, 2025

Empowering Roots, Elevating Horizons: PM Modi's Leadership in Diplomacy, Economy, and Ecology