ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో దాదాపు రూ.13,430 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- తొలుత అహోబిలంలోని నరసింహ స్వామితోపాటు మహానందిలోని శ్రీ మహానందీశ్వర స్వామికి ప్రణామాలు అర్పించారు. అలాగే సకలజన సౌభాగ్యం ఆకాంక్షిస్తూ మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు కోరారు.
అనంతరం ఆయన “సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైల మల్లికార్జునమ్” అనే ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలోని శ్లోకపఠనం చేశారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో సోమనాథుడు, మల్లికార్జున స్వామి పేర్లు ఆదిలోనే సంయుక్తంగా కనిపిస్తాయని శ్రీ మోదీ వివరించారు. “సోమనాథుని పవిత్ర భూమి గుజరాత్‌లో జన్మించడం, విశ్వనాథుని పావన కాశీ నగరం నుంచి దేశ సేవ చేయడం, నేడు శ్రీశైల మల్లికార్జున స్వామి దివ్యాశీస్సులు పొందడం నాకు దక్కిన భాగ్యం” అని భక్తిపురస్సరంగా వ్యాఖ్యానించారు. శ్రీశైలం ఆలయంలో పూజల అనంతరం ప్రధానమంత్రి శివాజీ స్పూర్తి కేంద్రంలో నివాళి అర్పించి, అటుపైన వేదిక నుంచే ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే అల్లమ ప్రభు, అక్క మహాదేవి వంటి పూజనీయ శైవ సాధువులకు వందనాలు అర్పించారు. ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి, శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు వంటి నాయకులకు నివాళి అర్పించారు.

ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావిస్తూ’ “స్వాభిమానం, సంస్కృతికి పట్టుగొమ్మగానే కాకుండా శాస్త్ర విజ్ఞానం-ఆవిష్కరణలకూ కేంద్రంగా ఈ రాష్ట్రం వెలుగొందుతోంది” అని ప్రధానమంత్రి కొనియాడారు. రాష్ట్రానికి అపార సామర్థ్యం ఉందని, యువతరం ప్రతిభకు ఎల్లలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైనదల్లా- సరైన దృక్కోణం, సమర్థ నాయకత్వమేనని వ్యాఖ్యానించారు. ఆ మేరకు ఇవాళ శ్రీ చంద్రబాబు నాయుడు, శ్రీ పవన్ కల్యాణ్ వంటివారి దార్శనికత నాయకత్వం సహా కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు కూడా రాష్ట్రానికి లభిస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ గత 16 నెలల నుంచి శరవేగంగా పురోగమిస్తున్నదని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యాన ప్రగతి పథంలో పరుగు తీస్తున్నదని అభివర్ణించారు. ఈ మేరకు సత్వర వృద్ధి దిశగా జాతీయ, రాష్ట్ర రాజధానులు ఢిల్లీ-అమరావతి సంయుక్తంగా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. దేశం 2047 నాటికి ‘వికసిత భారత్’గా రూపొందడం తథ్యమని ప్రధాని చెప్పారు. ఈ ఘనత ప్రస్తుత 21వ శతాబ్దపు దేశానికి, 140 కోట్ల మంది పౌరులకే చెందుతుందని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా విద్యుత్తు, రైల్వేలు, రహదారులు సహా వాణిజ్య సంబంధిత అనేక ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన, జాతికి అంకితం చేయడం గురించి ఆయన ప్రకటించారు. ఇవన్నీ రాష్ట్రవ్యాప్త అనుసంధానాన్ని బలోపేతం చేయడంతోపాటు పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతూ, జనజీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయని చెప్పారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టులతో కర్నూలు, పరిసర ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంటూ, రాష్ట్ర ప్రజలకు శుభాభినందనలు తెలిపారు.
దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి పథంలో పయనించాలంటే ఇంధన భద్రత అవశ్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ దిశగా విద్యుత్ రంగంలో సుమారు రూ.3,000 కోట్ల విలువైన ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టును ప్రారంభించామని తెలిపారు. దీనివల్ల దేశ ఇంధన సామర్థ్యం కూడా ఇనుమడిస్తుందని, ప్రస్తుత సత్వర అభివృద్ధి నేపథ్యంలో గతకాలపు దుస్థితిని విస్మరించరాదని ప్రజలకు సూచించారు. దేశంలో 11 ఏళ్లకిందట నేటి ప్రతిపక్ష కేంద్ర ప్రభుత్వ హయాంలో తలసరి విద్యుత్ వినియోగం 1,000 యూనిట్లకన్నా తక్కువేనని గుర్తుచేశారు. అలాగే దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో సరఫరా కోత వంటి సవాళ్లు నిత్యం వేధించేవని శ్రీ మోదీ పేర్కొన్నారు. వేలాది గ్రామాలకు ప్రాథమికంగా విద్యుత్ స్తంభాలు కూడా ఉండేవి కావని చెప్పారు. అలాంటి దురవస్థ నుంచి నేడు కాలుష్య రహిత ఇంధనం నుంచి మొత్తం ఉత్పాదన దాకా అన్ని రంగాల్లోనూ భారత్ కొత్త రికార్డులను సృష్టిస్తోందని ఆయన వెల్లడించారు. ఇవాళ ప్రతి గ్రామానికీ విద్యుత్ సదుపాయం చేరువ కాగా, తలసరి వినియోగం 1,400 యూనిట్లకు పెరగడంతోపాటు పరిశ్రమలు-గృహాలకు విద్యుత్తు సరఫరాలో కొరత మాటే లేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

భారత్ ఇంధన విప్లవ విజయంలో ఆంధ్రప్రదేశ్‌ను ఒక ప్రధాన కూడలిగా ప్రధానమంత్రి అభివర్ణించారు. శ్రీకాకుళం నుంచి అంగుల్ దాకా సహజ వాయువు పైప్‌లైన్ ప్రాజెక్టును ప్రారంభించడాన్ని ఆయన ఉటంకించారు. దీనిద్వారా దాదాపు 15 లక్షల గృహాలకు గ్యాస్ సరఫరా అవుతుందని తెలిపారు. చిత్తూరులో రోజువారీగా 20 వేల సిలిండర్ల సామర్థ్యంతో ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్‌ను ఆయన ఇవాళ ప్రారంభించారు. ఈ సదుపాయం వల్ల స్థానిక రవాణా, నిల్వపరంగా ఉపాధి లభిస్తుందని, యువతకు కొత్త అవకాశాలు అందివస్తాయని పేర్కొన్నారు.
“దేశమంతటా బహుళ రవాణా మౌలిక సదుపాయాలు వేగంగా వృద్ధి చెందడంతోపాటు గ్రామాల నుంచి నగరాలకు, నగరాల నుంచి ఓడరేవులకు అనుసంధాన కల్పనపై మేం నిశితంగా దృష్టి సారించాం” అని ప్రధానమంత్రి చెప్పారు. ఇందులో భాగంగా సబ్బవరం-షీలానగర్ మధ్య నిర్మించిన కొత్త రహదారితో అనుసంధానం మరింత మెరుగవుతుందని ఆయన అన్నారు. రైల్వేలకు సంబంధించి కొత్త మార్గాల ప్రారంభం, రైలు ఫ్లైఓవర్ల నిర్మాణంతో నవశకం మొదలైందని పేర్కొన్నారు. తద్వారా ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా ఈ ప్రాంత పరిశ్రమలకు నవ్యోత్తేజం లభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
దేశం 2047 నాటికి ‘వికసిత భారత్’గా రూపొందాలన్న లక్ష్యానికి ప్రభుత్వం, ప్రజానీకం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఈ సంకల్పాన్ని స్వర్ణాంధ్ర దార్శనికత మరింత శక్తిమంతం చేయగలదని ప్రధానమంత్రి అన్నారు. ఈ రాష్ట్రంతోపాటు యువతరం కూడా సాంకేతికంగా నిత్యం ముందంజ వేస్తున్నదని పేర్కొన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరింతగా పెంచుకుంటున్నాయని వ్యాఖ్యానించారు.

“వేగం, పరిమాణం రీత్యా భారత్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచం నేడు దృష్టి సారిస్తోంది” అని శ్రీ మోదీ ప్రకటించారు. రెండు రోజుల కిందట ఈ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు గూగుల్ ప్రకటించడాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మేరకు భారత్‌లో తన తొలి కృత్రిమ మేధ (ఏఐ) కూడలిని ఆంధ్రప్రదేశ్‌లోనే ఏర్పాటు చేయబోతున్నదని వెల్లడించారు. తద్వారా శక్తిమంతమైన ‘ఏఐ’ మౌలిక సదుపాయాలు, విస్తృత డేటా సెంటర్ సామర్థ్యం, పెద్ద ఎత్తున ఇంధన వనరులు సహా విస్తృత ఫైబర్-ఆప్టిక్ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తాయని ప్రధానమంత్రి వివరించారు.
గూగుల్ సంస్థ పెట్టుబడి పెట్టే ‘ఏఐ’ కూడలి ప్రాజెక్టులో కొత్త అంతర్జాతీయ ‘సబ్‌సీ గేట్‌వే’ (సముద్ర గర్భ కేబుల్ నెట్‌వర్క్) నిర్మాణం కూడా భాగంగా ఉంటుందని ప్రధానమంత్రి ప్రకటించారు. దీనిద్వారా విశాఖపట్నంలోని భారత తూర్పు తీరానికి బహుళ అంతర్జాతీయ ‘సబ్‌సీ కేబుళ్లు’ విస్తరిస్తాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో విశాఖపట్నం ‘ఏఐ’కి, అంతర్జాతీయ అనుసంధానానికి ప్రధాన కేంద్రం కాగలదని చెప్పారు. ఇది దేశానికేగాక యావత్ ప్రపంచానికీ సేవలందిస్తుందని పేర్కొంటూ- ఈ ప్రాజెక్టు సాధనలో రాష్ట్రం విజయవంతం కావడంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
భారత ప్రగతికి ఆంధ్రప్రదేశ్ పురోగమనం అత్యంత అవశ్యమని, అదే తరహాలో రాష్ట్ర ప్రగతికి రాయలసీమ అభివృద్ధి ఎంతో ముఖ్యమని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు గడ్డపై నేడు ప్రారంభించిన ప్రాజెక్టులు ఈ ప్రాంతంలోని ప్రతి జిల్లాలో ఉపాధి, శ్రేయస్సుకు కొత్త బాటలు వేస్తాయని, తద్వారా సీమలో పారిశ్రామిక వృద్ధి వేగం పుంజుకుంటుదని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగిరపరచే దిశగా కొత్త పారిశ్రామిక కారిడార్లు, కేంద్రాల ఏర్పాటు ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఓర్వకల్, కొప్పర్తిని రాష్ట్రానికి కొత్త పారిశ్రామిక గుర్తింపు కేంద్రాలుగా ప్రభుత్వం రూపొందిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెరుగుతూ నిరంతర కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని తెలిపారు.
“ప్రపంచం నేడు భారత్‌ను 21వ శతాబ్దపు కొత్త తయారీ కూడలిగా గుర్తిస్తోంది. స్వయం సమృద్ధ భారత్ దృక్కోణమే ఈ విజయానికి పునాది” అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. అలాగే ఈ దిశగా భారత్ ముందంజలో ఆంధ్రప్రదేశ్ కీలక సహకార శక్తిగా ఎదుగుతున్నదని వివరించారు. గత ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని నిర్లక్ష్యం చేశాయని, దీంతో మొత్తంగా దేశానికి ఎదురుదెబ్బ తగిలిందని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ ప్రగతికి సారథ్యం వహించగల రాష్ట్రం ఒకనాడు స్వీయాభివృద్ధి కోసం పోరాడాల్సిన దుస్థితిలో పడిందని వ్యాఖ్యానించారు. అయితే, తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఉత్పాదక రంగం వేగంగా వృద్ధి సాధించిందని చెప్పారు. తద్వారా పురోగమన పథం కొత్త పుంతలు తొక్కుతున్నదని, ఇది తనకెంతో సంతృప్తినిస్తున్నదని తెలిపారు. నిమ్మలూరులో ‘అడ్వాన్స్‌డ్ నైట్ విజన్’ కర్మాగారాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా ఇది మరో ముందడుగని, తద్వారా ‘నైట్ విజన్ పరికరాలు, క్షిపణి సెన్సర్లు, డ్రోన్ రక్షణ వ్యవస్థల' ఉత్పాదనలో దేశ సామర్థ్యం ఇనుమడిస్తుందని తెలిపారు. అంతేగాక రక్షణ ఎగుమతులు ఉన్నత శిఖరాలకు చేరుతాయని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా స్వదేశీ ఆయుధ వ్యవస్థల శక్తిసామర్థ్యాలను, సాధించిన విజయాలను యావత్ ప్రపంచం ప్రత్యక్షంగా చూసిందని ఆయన వ్యాఖ్యానించారు.

కర్నూలును భారతదేశ డ్రోన్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంకల్పం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి.. కర్నూలు, ఆంధ్ర అంతటా డ్రోన్ పరిశ్రమ నుంచి భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాలతో ముడిపడి ఉన్న అనేక కొత్త రంగాలు ఉద్భవిస్తాయని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో డ్రోన్ల ఉపయోగాన్ని ప్రస్తావించిన ప్రధాని.. రాబోయే సంవత్సరాల్లో డ్రోన్ల విభాగంలో కర్నూలు జాతీయ శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు జీవన సౌలభ్యాన్ని అందించేందుకు ఉద్దేశించిన సంస్కరణల గురించి మాట్లాడుతూ.. ప్రజా కేంద్రీకృత అభివృద్ధిపై ప్రభుత్వ దార్శనికతను పునరుద్ఘాటించారు. రూ. 12 లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను లేదన్న ఆయన.. అందుబాటు ధరల్లో మందులు, తక్కువ ఖర్చుతో కూడిన ఆరోగ్య సంరక్షణ, వృద్ధుల కోసం ఆయుష్మాన్ కార్డులు వంటి కార్యక్రమాలు జీవన సౌలభ్యంలో కొత్త అధ్యాయానికి నాంది పలికాయని అన్నారు.
భారీగా తగ్గిన జీఎస్టీ రేట్లు నవరాత్రి మొదటి రోజు నుంచే అమల్లోకి వచ్చాయని ప్రధానమంత్రి అన్నారు. నారా లోకేష్ గారి నేతృత్వంలో జీఎస్టీ బచత్ ఉత్సవాన్ని వీక్షించడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. "సూపర్ జీఎస్టీ - సూపర్ పొదుపు" ప్రచారాన్ని విజయవంతంగా ప్రారంభించడం పట్ల ప్రశంసలు వ్యక్తం చేశారు. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు రూ. 8,000 కోట్లకు పైగా ఆదా చేసుకోవటంతో పండుగ వాతావరణం మరింత మెరుగుపడిందని తెలిపారు. 'వోకల్ ఫర్ లోకల్'కు అనుగుణంగా జీఎస్టీ పొదుపు పండుగను జరుపుకోవాలని ప్రధానమంత్రి కోరారు. అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ ద్వారా వికసిత్ భారత్ అనే కల సాకారం అవుతుందని పేర్కొంటూ ఆయన ప్రసంగాన్ని ముగించారు. కొత్త ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రజలకు మరోసారి అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు.. కేంద్ర కేబినెట్ మంత్రులు శ్రీ రామ్మోహన్ నాయుడు కింజరాపు, డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ.. ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
నేపథ్యం-
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దాదాపు రూ. 13,430 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. పరిశ్రమలు, విద్యుత్ సరఫరా, రోడ్లు, రైల్వేలు, రక్షణ తయారీ, పెట్రోలియం, సహజ వాయువు వంటి కీలక రంగాలకు చెందిన ఈ ప్రాజెక్టులు.. ప్రాంతీయ మౌలిక సదుపాయాలను పెంపొందించడం, పారిశ్రామికీకరణను వేగవంతం చేయడం, రాష్ట్రంలో సమ్మిళిత సామాజిక-ఆర్థిక వృద్ధిని సాధించాలన్న ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తున్నాయి.
కర్నూలు-III పూలింగ్ స్టేషన్‌లో రూ.2,880 కోట్లకు పైగా వ్యయంతో ఏర్పాటు చేసిన సరఫరా వ్యవస్థను మెరుగుపరిచే ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా 765 కేవీ డబుల్-సర్క్యూట్ కర్నూలు-III పూలింగ్ స్టేషన్- చిలకలూరిపేట విద్యుత్ సరఫరా లైన్ నిర్మించనున్నారు. ఇది కరెంట్ సరఫరా సామర్థ్యాన్ని 6000 ఎంపీఏలు పెంచుతుంది. దేశాభివృద్ధిలో కీలకమైన పునరుత్పాదక విద్యుత్ సరఫరాను భారీ ఎత్తున మెరుగుపరుస్తుంది.

ప్రధానమంత్రి కర్నూలులోని ఓర్వకల్ పారిశ్రామిక ప్రాంతం, కడపలోని కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతానికి శంకుస్థాపన చేశారు. రూ. 4,920 కోట్లకు పైగా వ్యయంతో చేపడుతోన్న ఈ రెండింటిని.. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (ఎన్ఐసీడీఐటీ), ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థల (ఏపీఐఐసీ) ఉమ్మడి వెంచర్ అభివృద్ధి చేస్తోంది. పలు రంగాల్లో కార్యకలాపాలు నిర్వహించే ఈ ప్రాజెక్టులను వాక్-టు-వర్క్ పద్ధతిలో ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపాయాలతో ఆధునిక, ఆవిష్కరణ ఆధారిత తయారీ కేంద్రాలుగా రూపొందించారు. ఇవి రూ. 21,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించటం, సుమారు 1 లక్ష ఉద్యోగాలను సృష్టించడం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధి, ప్రపంచ పోటీతత్వాన్ని పెంచుతాయన్న అంచనా ఉంది.
రోడ్డు రవాణా మౌలిక సదుపాయాలను పెంచే చర్యల్లో భాగంగా సబ్బవరం నుంచి షీలానగర్ వరకు రూ. 960 కోట్ల విలువైన 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ రహదారికి గౌరవ ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఇది విశాఖపట్నంలో రద్దీని తగ్గించటంతో పాటు వాణిజ్యం, ఉపాధి అవకాశాలను పెంచుతుంది. దీనితో పాటు రూ. 1140 కోట్ల విలువైన 6 ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. పీలేరు నుంచి కలూర్ విభాగాన్ని (భాక్రాపేట వరకు) నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసిన రహదారి, కడప లేదా నెల్లూరు సరిహద్దు నుంచి సీఎస్ పురం వరకు వెడల్పు చేసిన రహదారి, గుడివాడ - మచిలీపట్నం ఎన్‌హెచ్-165 విభాగంలో గుడివాడ - నూజెల్ల రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు వరుసల ఆర్ఓబీ, ఎన్‌హెచ్-716 రహదారిలో పాపాగ్ని నదిపై నిర్మించిన భారీ వంతెన, ఎన్‌హెచ్-565లో కనిగిరి బైపాస్, ఎన్. గుండ్లపల్లి పట్టణంలో ఎన్‌హెచ్-544 డీడీలో మెరుగుపరిచిన బైపాస్‌లు ఇందులో ఉన్నాయి. ఇవి భద్రతను మెరుగుపరచడం, ప్రయాణ సమయాన్ని తగ్గించటంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ అనుసంధానను మెరుగుపరుస్తాయి.

ప్రధానమంత్రి రూ. 1,200 కోట్ల విలువైన అనేక కీలక రైల్వే ప్రాజెక్టులలో కొన్నింటికి శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేశారు. కొత్తవలస-విజయనగరం నాలుగో రైల్వే లైన్, పెందుర్తి- ఉత్తర సింహాచలం మధ్య రైల్వే ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేశారు. కొత్తవలస-బొడ్డవర విభాగం, శిమిలిగూడ-గోరాపూర్ విభాగాల డబ్లింగ్‌ను జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులు రద్దీని తగ్గించటంతో పాటు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. ఆటంకం లేని ప్రయాణికులతో పాటు సరకు రవాణాకు వీలు కల్పిస్తాయి. ఈ ప్రాంతం మొత్తం పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక వృద్ధిని ప్రోత్సహిస్తాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తాయి.
ఇంధన విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లో 124 కి.మీ, ఒడిశాలో 298 కి.మీ పొడవున్న గెయిల్ (ఇండియా) లిమిటెడ్‌కు చెందిన శ్రీకాకుళం - అంగుల్ సహజ వాయువు పైప్‌లైన్‌ను (మెయిన్‌లైన్) కూడా గౌరవ ప్రధానమంత్రి జాతికి అంకింతం చేశారు. దీన్ని రూ. 1,730 కోట్ల పూర్తి వ్యయంతో నిర్మించారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఇండియన్ ఆయిల్‌కు చెందిన 60 టీఎమ్‌టీపీఏ (సంవత్సరానికి వెయ్యి మెట్రిక్ టన్నులు) ఎల్‌పీజీ బాట్లింగ్ కేంద్రాన్ని కూడా గౌరవ ప్రధానమంత్రి ప్రారంభించారు. రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎల్‌పీజీ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లోని 4 జిల్లాలు, తమిళనాడులోని 2 జిల్లాలు, కర్ణాటకలోని 1 జిల్లాల్లో 7.2 లక్షల మందికి పైగా వినియోగదారులకు 80 పంపిణీదారుల ద్వారా సేవలందించనుంది. గృహాలు, వ్యాపార సంస్థలకు స్థిరమైన, విశ్వసనీయమైన ఎల్‌పీజీ సరఫరా ఉండేలా చూసుకోవటంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది.
రక్షణ రంగ తయారీని పెంచే చర్యల్లో భాగంగా కృష్ణాజిల్లాలోని నిమ్మలూరులో రూ. 362 కోట్ల పెట్టుబడితో రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ- భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ఏర్పాటు చేసిన రాత్రి చూసేందుకు ఉపయోగపడే ఉత్పత్తుల అధునాతన కర్మాగారాన్ని (ఏఎన్‌వీపీఎల్- అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీ) ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఈ కర్మాగారం భారత రక్షణ దళాలకు కావాల్సిన అధునాతన ఎలక్ట్రో-ఆప్టికల్ వ్యవస్థలను తయారు చేస్తుంది. ఇది రక్షణ తయారీలో స్వావలంబనను బలోపేతం చేయటంతో పాటు ఈ ప్రాంతంలో నైపుణ్య ఆధారిత ఉపాధిని ప్రోత్సహిస్తుంది.
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
I feel blessed to be born in Gujarat, the land of Somnath, to serve in Kashi, the land of Baba Vishwanath and to receive the blessings of Srisailam today: PM @narendramodi pic.twitter.com/cM6j5B1Y0X
— PMO India (@PMOIndia) October 16, 2025
I had the opportunity to pay tribute at the Sree Shivaji Spoorthi Kendra. I bow to Chhatrapati Shivaji Maharaj: PM @narendramodi pic.twitter.com/Ka3JFgGITM
— PMO India (@PMOIndia) October 16, 2025
Andhra Pradesh is the land of 'Swabhimaan' and 'Sanskriti'. It is also a hub of science and innovation. pic.twitter.com/n2T3Uaxrn8
— PMO India (@PMOIndia) October 16, 2025
Today, from clean energy to total energy production, India is setting new records in every field. pic.twitter.com/KJoLC0Hx4P
— PMO India (@PMOIndia) October 16, 2025
Today, multi-modal infrastructure is developing rapidly across the country. We are focusing strongly on connectivity, from villages to cities and from cities to ports. pic.twitter.com/Uj3LE7k6wE
— PMO India (@PMOIndia) October 16, 2025
Today, the world is witnessing the speed and scale of both India and Andhra Pradesh. Google is set to establish India's first Artificial Intelligence Hub in Andhra Pradesh. pic.twitter.com/SfBNzsWMiE
— PMO India (@PMOIndia) October 16, 2025
Today, the world sees India as the new manufacturing centre of the 21st century. pic.twitter.com/cpuD4x9yYj
— PMO India (@PMOIndia) October 16, 2025
Our government's vision is citizen-centric development. Through continuous reforms, we are making people's lives easier. pic.twitter.com/OQe2MDHQLA
— PMO India (@PMOIndia) October 16, 2025


