ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంపు వంతెన అయిన చీనాబ్ వంతెనను, భారతదేశపు మొట్టమొదటి తీగల రైలు వంతెన అయిన అంజి వంతెనను ప్రారంభించిన ప్రధాని
జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి ప్రయాణంలో ఈ రోజు ప్రారంభించిన భారీ మౌలిక ప్రాజెక్టులు ఒక మలుపుః ప్రధాన మంత్రి
'కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు' అంతా ఒక్కటేనంటూ మేం ఎల్లప్పుడూ భారత మాతను స్మరించుకునేవాళ్ళం. ఇప్పుడు మన రైల్వే నెట్వర్క్ లోనూ అది వాస్తరూపం దాల్చింది: పీఎం
ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లైన్ ప్రాజెక్ట్ కొత్త, సాధికారత కలిగిన జమ్మూ కాశ్మీర్ కు చిహ్నం... భారత్ బలాన్ని ఇది మరింత పెంచుతుంది: పీఎం
చీనాబ్, అంజి వంతెనలు జమ్మూ కాశ్మీర్ పురోగతికి ప్రవేశ ద్వారాలుగా సేవలు అందిస్తాయి:పీఎం
జమ్మూ కాశ్మీర్ భారతదేశానికి తలమానికం: ప్రధాన మంత్రి
ఉగ్రవాదానికి భారత్ తలొగ్గదు, దానికి తగిన సమాధానం ఇవ్వడానికి జమ్మూ కాశ్మీర్ యువత ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు: పీఎం
ఆపరేషన్ సిందూర్ పేరు విన్నప్పుడల్లా పాకిస్థాన్ కు తన అవమానకరమైన ఓటమి గుర్తొస్తుంది: ప్రధాన మంత్రి

 ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లోని కత్రాలో 46,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించి, దేశానికి అంకితం చేశారు. ధైర్యవంతుడైన వీర్ జోరావర్ సింగ్ భూమికి వందనం చేస్తూ, నేటి కార్యక్రమం భారతదేశ ఐక్యత, సంకల్పానికి గొప్ప వేడుక అని ఆయన వ్యాఖ్యానించారు. మాతా వైష్ణో దేవి ఆశీస్సులతో కాశ్మీర్ లోయ ఇప్పుడు భారతదేశంలోని విస్తారమైన రైల్వే నెట్వర్క్ తో అనునుసంధానితమైందని శ్రీ మోదీ అన్నారు.

" 'కాశ్మీర్ నుంచి  కన్యాకుమారి వరకు' అంతా ఒక్కటేనంటూ మేం ఎల్లప్పుడూ భారత మాతను స్మరించుకునేవాళ్ళం. ఇప్పుడు మన రైల్వే నెట్వర్క్ లోనూ అది వాస్తరూపం దాల్చింది" అని చెబుతూ... ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లైన్ ప్రాజెక్ట్ కేవలం ఒక పేరు మాత్రమే కాదు, జమ్మూ కాశ్మీర్ కొత్త శక్తికి, నానాటికీ విస్తృతమవుతున్న భారతదేశపు సామర్థ్యాలకు నిదర్శనం అని  స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో రైల్వే మౌలిక సదుపాయాలు, అనుసంధానాన్ని పెంచాలన్న ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా నిర్మించిన చీనాబ్, అంజి రైలు వంతెనలను ఆయన ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్ లో అనుసంధానాన్ని పెంచే వందే భారత్ రైళ్లను  కూడా ప్రారంభించారు. వీటికి తోడు ఈ ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా జమ్మూలో కొత్త వైద్య కళాశాలకు శ్రీ మోదీ శంకుస్థాపన చేశారు. 46,000 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులు జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధిని వేగవంతం చేస్తాయని, పురోగతి దిశగా నడిపిస్తాయని పేర్కొన్నారు. వృద్ధి, కొత్త మార్పులతో  నవ శకం వైపు అడుగులేస్తున్న ప్రజలకు ప్రధాన మంత్రి తన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారిని అభినందించారు.

రైల్వే కనెక్టివిటీ అన్నది జమ్మూ కాశ్మీర్ ప్రజల తరతరాల కల అని.. ఈ రోజు ఆ కల సాకారమైందని శ్రీ మోదీ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇటీవల చేసిన ఒక ప్రకటనను ప్రస్తావిస్తూ.. శ్రీ అబ్దుల్లా ఈ ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారా అని ఏడు లేదా ఎనిమిదో తరగతి చదివే కుర్రాడు కూడా ఎదురుచూస్తున్నాడని ప్రధాని పేర్కొన్నారు. ఈ సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చడం జమ్మూ కాశ్మీర్లోని లక్షలాది మందికి చారిత్రాత్మక క్షణమని, మెరుగైన అనుసంధానం, పురోగతికి ఇది మార్గం సుగమం చేసిందని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
 

ఈ ప్రతిష్టాత్మక రైల్వే ప్రాజెక్ట్ ఆయన హయాంలో మొదలై ఇప్పుడు విజయవంతంగా పూర్తవడం వారికి గర్వకారణమన్న శ్రీ మోదీ, గతుకుల ప్రాంతాలు, క్లిష్ట వాతావరణ పరిస్థితులు, కొండ చరియలు  విరిగిపడటం వంటి సవాళ్లు ఈ ప్రాజెక్ట్ కు ఎదురయ్యాయని  చెప్పారు. ఏదేమైనా, ఆ ప్రభుత్వం సవాళ్లను దృఢ సంకల్పంతో ఎదుర్కోవటానికి సిద్ధమైందని ఆయన వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్ లో వాతావరణంతో ముడిపడి కొనసాగుతున్న అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఇందుకు నిదర్శనమని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఈమధ్యే సోనామార్గ్ సొరంగాన్ని ప్రారంభించడం, చీనాబ్ వంతెన, అంజి వంతెన మీదుగా ప్రయాణించడం తన జీవితంలో విశేషమైన మైలురాళ్ళుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ భారత ఇంజినీర్లు, కార్మికుల అచంచల అంకితభావాన్ని శ్రీ మోదీ ప్రశంసించారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంపు వంతెన అయిన చెనాబ్ వంతెన భారతదేశ దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈఫిల్ టవర్ ను చూడటానికి ప్రజలు పారిస్ కు వెళుతుండగా, చీనాబ్ వంతెన ఎత్తులో దానిని అధిగమించిందని, మౌలిక రంగంలో ఇదొక కీలక పరిణామమే గాక,పర్యాటక ఆకర్షణగా కూడా మారిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా, అంజి వంతెనను భారతదేశపు మొట్టమొదటి తీగల రైల్వే వంతెనగా నిర్మించడం ఇంజినీరింగ్ అద్భుతంగా ప్రధాని అభివర్ణించారు. ఈ నిర్మాణాలు కేవలం ఉక్కు, కాంక్రీటు మాత్రమే కాదని,  ఎత్తైన పీర్ పంజాల్ పర్వతాలలో భారతదేశ బలాన్ని ప్రతిబింబించే సజీవ చిహ్నాలు అని ఆయన చెప్పారు. ఈ విజయాలు అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న భారత్ దార్శనికతకు నిదర్శనాలని శ్రీ మోదీ తెలిపారు. ఇది భారత పురోగతి కల ఎంత గొప్పదో దాని సామర్థ్యం, సంకల్పం కూడా అంతే గొప్పవని రుజువు చేస్తుంది. అన్నింటికంటే మించి కల్మషం లేని ఉద్దేశాలు, అవిశ్రాంత అంకితభావం మారుతున్నభారతదేశాన్ని ముందుకు నడిపించే  చోదక శక్తులని ఆయన చెప్పారు.

చీనాబ్, అంజి వంతెనలు రెండూ జమ్మూ కాశ్మీర్ పురోగతికి ఉత్ప్రేరకాలుగా నిలుస్తాయని  చెబుతూ, "ఈ బృహత్తర ప్రాజెక్టులు పర్యాటకానికి దోహదపడటమే కాక, ఆర్థిక వ్యవస్థ లోని వివిధ రంగాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయి. వ్యాపారాలు-పరిశ్రమలకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయి" అని ప్రధాన మంత్రి అన్నారు. జమ్మూ కాశ్మీర్ మధ్య మెరుగైన రైలు అనుసంధానం స్థానిక పారిశ్రామికవేత్తలకు కొత్త తలుపులు తెరుస్తుందని, ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ఆయన చెప్పారు. కాశ్మీర్ యాపిల్స్ ఇప్పుడు దేశంలోని ప్రధాన మార్కెట్లకు తక్కువ ఖర్చుతో చేరుకుంటాయని, తద్వారా వాణిజ్యం మరింత పెరుగుతుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. డ్రై ఫ్రూట్స్,  ప్రఖ్యాత కాశ్మీరీ  పష్మినా శాలువాలతో పాటు ఇతర సంప్రదాయ హస్తకళలు ఇప్పుడు దేశంలోని ప్రతి చోటకు సులభంగా రవాణా అవుతాయి. తద్వారా ఈ ప్రాంతంలోని చేతివృత్తుల పరిశ్రమ మరింత బలోపేతం అవుతుంది. ఈ మెరుగైన అనుసంధానం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తుందని, దేశంలోని వివిధ ప్రాంతాలకు  ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలకు వీలు కల్పిస్తుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

సంగల్దాన్‌లోని ఒక విద్యార్థి చెప్పిన విచారదాయకమైన మాటను ప్రధాని పంచుకున్నారు. ఇప్పటివరకు గ్రామంలోని వారు రైలును చూడలేదని, ఊరు దాటిన వాళ్లు మాత్రమే నిజ జీవితంలో రైలును చూశారని తెలిపారు. చాలా మంది గ్రామస్తులు వీడియోలలో మాత్రమే రైళ్లను చూశారని, త్వరలో రైళ్లు ప్రత్యక్షంగా వారి కళ్ల ముందు తిరుగతాయని,  ఇది వారికి కనువిందు చేస్తుందని అన్నారు. కొత్త రైలు మార్గం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ రైళ్ల సమయాలను గుర్తుంచుకునే పనిలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు వాతావరణం ఆధారంగా రోడ్లు పనిచేస్తున్నాయా లేదా మూసేసి ఉన్నాయా అనే అంశంతో తమకు సంబంధం ఉండదని ఒక యువతి చేసిన వ్యాఖ్యను ప్రధానంగా ప్రస్తావించారు. కొత్తగా వచ్చిన ఈ రైలు సేవలు అన్ని కాలాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటాయి. "భారత మాత కిరీటంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ నేలలో ప్రతి ఒక్కటి అపారమైన సౌందర్యం, సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. వీటినే రత్నాలుగా ఈ తల్లి అలంకరించుకొని ఉంది." అని ప్రధానమంత్రి వర్ణించారు. ఈ ప్రాంతానికి ఉన్న ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక స్పృహ, సహజ ప్రాకృతిక సౌందర్యం, ఔషధ మూలికలు, పండ్ల తోటలు, ఉత్సాహభరితమైన యువత ప్రతిభను ప్రశంసించారు. ఇవన్నీ భారతమాత కిరీటంలో విలువైన రత్నాలలా ప్రకాశిస్తున్నాయని అన్నారు. దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్‌ను సందర్శిస్తోన్న అంశాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి.. ఈ ప్రాంతం సామర్థ్యాన్ని లోతుగా అర్థం చేసుకున్నట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ నిరంతర అభివృద్ధి, అభ్యున్నతికి, ఇక్కడి ప్రజలు శ్రేయస్సుతో ఉండేలా చూసుకునేందుకు అంకితభావంతో ఉన్నట్లు పునరుద్ఘాటించారు.
 

"జమ్మూ కాశ్మీర్ చాలా కాలంగా భారత విద్య, సాంస్కృతిక వారసత్వానికి మూలస్తంభంగా ఉంది" అని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా భారత్ ఎదుగుతోన్న వేళ ఈ మార్పులో జమ్మూ కాశ్మీర్ భాగస్వామ్యం కూడా పెరుగుతోందని అన్నారు. జమ్మూ, శ్రీనగర్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటు ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్, ఎన్ఐటీ వంటి ప్రముఖ సంస్థలు ఈ ప్రాంతంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయని చెప్పారు. ఆవిష్కరణలు, అభ్యాస అవకాశాలను మరింత పెంచుతూ ఇక్కడ పరిశోధన వ్యవస్థ విస్తరిస్తోందని అన్నారు.

ఇటీవలి సంవత్సరాలలో రెండు రాష్ట్ర స్థాయి క్యాన్సర్ సంస్థలు ఏర్పాటు కావటంతో ఆరోగ్య సంరక్షణలో గణనీయమైన పురోగతి జరిగిందని ప్రధానంగా ప్రస్తావించారు. గత ఐదు సంవత్సరాలలో కొత్తగా ఏడు వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయని.. ఇవి రోగులకు, వైద్య విద్యార్థులకు భారీగా ప్రయోజనం చేకూర్చాయని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఎంబీబీఎస్ సీట్లు 500 నుంచి 1300కు పెరిగాయని, ఇది వైద్య విద్యను ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకొచ్చిందని ప్రధానంగా పేర్కొన్నారు. రియాసి జిల్లాకు కొత్త వైద్య కళాశాల రానున్నట్లు తెలిపిన ప్రధాని.. ఇది ఈ ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను మెరుగుపరుస్తుందన్నారు. శ్రీ మాతా వైష్ణో దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్‌ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఇదొక ఆధునిక ఆసుపత్రి మాత్రమే కాదని, భారత గొప్ప దాతృత్వ సంప్రదాయానికి ఒక స్వరూపమని అభివర్ణించారు. భారతదేశం నలుమూలల ఉన్న భక్తుల సహకారాన్ని కూడా ప్రశంసించిన ఆయన.. వారి విరాళాలు సంస్థను ఏర్పాటు చేయటంలో సహాయపడ్డాయన్నారు. ఈ గొప్ప పనిలో అంకితభావంతో కృషి చేసినందుకు శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డును ఆయన అభినందించారు. వైద్య సేవలను మరింత మెరుగుపరుస్తూ ఆసుపత్రి సామర్థ్యాన్ని 300 నుంచి 500 పడకలకు విస్తరిస్తామని ప్రకటించారు. కత్రాలోని మాతా వైష్ణో దేవిని సందర్శించే భక్తులకు ఇది మరింత సౌకర్యాన్ని తీసుకొస్తుందని అన్నారు.

ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, ఈ కాలాన్ని పేదల అభ్యున్నతికి, ప్రజలకు సాధికారిత కల్పించేందుకు అంకింతం చేశామన్న ఆయన.. లక్షలాది మంది జీవితాలను మార్చిన అనేక కీలక సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. పక్కా ఇళ్లు అందించడం ద్వారా 4 కోట్ల పేద కుటుంబాల కలను నెరవేర్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ప్రస్తావించారు. 10 కోట్ల ఇళ్ల నుంచి పొగను దూరం చేయటం.. మహిళలు, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడిన ఉజ్వల పథకం గురించి మట్లాడారు. 50 కోట్ల మంది పేద పౌరులు రూ. 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య సంరక్షణ పొందేందుకు వీలు కల్పించిన ఆయుష్మాన్ భారత్‌‌ గురించి చెప్పారు.   ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఆహార భద్రత ఉండేలా చూసుకుందని, ప్రతి ఒక్కరి కంటంలో తగినంత పోషకాహారాలు ఉండేలా చూసుకుందని అన్నారు. జన్ ధన్ యోజన 50 కోట్లకు పైగా పేదలకు బ్యాంకింగ్ సేవలను అందించిందని, వారిని ఆర్థికంగా ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు సహాయపడిందని అన్నారు. చీకటిలో నివసిస్తోన్న 2.5 కోట్ల కుటుంబాలకు విద్యుత్తు సదుపాయాన్ని అందించే సౌభాగ్య యోజన, బహిరంగ మలవిసర్జనను తొలగించి 12 కోట్ల మరుగుదొడ్లను నిర్మించిన స్వచ్ఛ భారత్ మిషన్ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. జల్ జీవన్ మిషన్ 12 కోట్ల కుటుంబాలకు నల్లా నీటిని అందించిందని, ఇది మహిళలపై భారాన్ని తగ్గించినట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 10 కోట్ల మంది చిన్న రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని అందించిందని, గ్రామీణ భారతాన్ని బలోపేతం చేసిందని అన్నారు.
 

గత 11 ఏళ్లలో 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికాన్ని విజయవంతంగా అధిగమించి కొత్తగా మధ్యతరగతిలోకి మారినట్లు పేర్కొన్నారు. పేదలు, కొత్తగా తయారౌతోన్న మధ్యతరగతిని బలోపేతం చేయడానికి, కీలక సంస్కరణల ద్వారా ఆర్థిక సామాజిక భద్రత అందేలా చూసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ప్రధానంగా చెప్పారు. ఒకే ర్యాంక్- ఒకే పింఛను, రూ. 12 లక్షల వరకు వేతనాలపై పన్ను మినహాయింపు, గృహ కొనుగోలుదారులకు ఆర్థిక సహాయం, అందుబాటు ధరలో విమాన ప్రయాణానికి సహాయం వంటి కార్యక్రమాలను ప్రధానమంత్రి ఉదహరించారు. ప్రభుత్వం ప్రజలతో భుజం భుజం కలిపి నిలబడుతోందని, అందరిని పురోగతి వైపు నడిపిస్తోందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వం నిజాయితీపరులు, పన్ను చెల్లించే మధ్యతరగతి కోసం పని చేయడం ఇదే మొదటిసారి అని అన్నారు.

తమ ప్రభుత్వం నిరంతరం యువతకు కొత్తగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందన్న ఆయన.. పర్యాటకం ఆర్థిక వృద్ధికి, అనుసంధానానికి ముఖ్యమైన చోదక శక్తి అని పేర్కొన్నారు. పర్యాటకం ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా ప్రజలలో ఐక్యతను కూడా పెంపొందిస్తుందని ప్రధానంగా చెప్పారు. ఈ పురోగతిని దెబ్బతీయడానికి పాకిస్తాన్ పదే పదే చేస్తున్న ప్రయత్నాలను ఖండించారు. ఇది మానవత్వం, సమాజంలో సామరస్యం, ఆర్థిక శ్రేయస్సుకు వ్యతిరేకంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ.. భారత్‌లో హింసను ప్రేరేపించడానికి, కష్టపడి పనిచేసే కాశ్మీరీల ఆదాయాలను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ కాశ్మీరీయులపై, మానవత్వంపై దాడి చేసిందని ప్రధానంగా చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా రికార్డు స్థాయిలో సందర్శకుల సంఖ్యను చూసిన జమ్మూ కాశ్మీర్‌లో అభివృద్ధి చెందుతోన్న పర్యాటకాన్ని దెబ్బతీసేందుకు పర్యాటకులపై ఉద్దేశపూర్వక దాడి చేశారని అన్నారు. పాకిస్తాన్ దురుద్దేశంతో చేసిన దాడి.. గుర్రపు స్వారీ చేసేవారు, పోర్టర్లు, గైడ్‌లు, గెస్ట్ హౌస్ యజమానులు, దుకాణదారులతో సహా స్థానిక కార్మికులను ప్రత్యక్షంగా ప్రభావితం చేసి, వారి జీవనోపాధిని నాశనం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిలబడిన పోరాడి పర్యాటకులను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన యువ ఆదిల్ ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలను రక్షించడానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉగ్రవాదం ఈ ప్రాంత పురోగతిని ఎప్పటికీ ఆపలేదని పునరుద్ఘాటించారు.

అన్నింటిని తట్టుకోగలిగే జమ్మూ కాశ్మీర్ ప్రజలను ప్రశంసిస్తూ.. పాకిస్తాన్ కుట్రకు వ్యతిరేకంగా వాళ్లు ప్రదర్శించిన  దృఢ వైఖరి శక్తివంతమైన సందేశాన్ని పంపుతోందని అన్నారు. జమ్మూ కాశ్మీర్ యువత ఇప్పుడు ఉగ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కోవాలని దృఢంగా నిశ్చయించుకున్నారని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం విధ్యంసక ప్రభావాన్ని ఖండించిన ఆయన.. అది పాఠశాలలను తగలబెట్టిన, ఆసుపత్రులను ధ్వంసం చేసిన, లోయలో తరాతరాలను ఛిన్నాభిన్నం చేసిన తీరును గుర్తు చేశారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శక ఎన్నికలను కూడా ఉగ్రవాదం ఒక ప్రధాన సవాలుగా మార్చిందని.. ఇది ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కును కోల్పోయేలా చేసిందని వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు ప్రదర్శించిన ధైర్యం, దృఢ సంకల్పాన్ని ఒక ములుపుగా వర్ణించిన ఆయన.. శాంతి, పురోగతి, ఉజ్వల భవిష్యత్తు పట్ల ఇది వారి నిబద్ధతను తెలియజేస్తోందని అన్నారు.

జమ్మూ కాశ్మీర్ చాలా సంవత్సరాలుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొందని, దీనివల్ల చాలా మంది తమ కలలను వదులుకొని హింసను తమ విధిగా అంగీకరించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. అయితే తమ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితిని మార్చిందని, జమ్మూ కాశ్మీర్ యువత మళ్లీ కలలు కనేలా, ఆ కలలను నెరవేర్చుకునేలా చేసిందని ప్రధానంగా పేర్కొన్నారు. కాశ్మీర్ యువత ఇప్పుడు సందడిగా ఉండే మార్కెట్లు, ఉత్సాహభరితమైన షాపింగ్ మాల్స్ , సినిమా హాళ్లను చూసి ఆనందిస్తున్నారని వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్‌ను సినిమా షూటింగ్‌లకు ప్రధాన గమ్యస్థానంగా పునరుద్ధరించాలని, క్రీడలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుకుంటున్నట్లు వివరించారు. వేలాది మంది భక్తులు వచ్చిన మాతా ఖీర్ భవానీ మేళాను ఉదహరించారు. ఇది జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి కొంగొత్త ఆశావాద కోణాన్ని తెలియజేస్తోందని అన్నారు. కొన్ని రోజుల్లో జరగనున్న అమర్‌నాథ్ యాత్ర విషయంలో ఉన్న ఉత్సాహాన్ని, ఈద్ పండుగ స్ఫూర్తిని కూడా ప్రధానంగాప్ ప్రస్తావించిన ఆయన.. ఇది ఈ ప్రాంతంలోని సామర్థ్యాన్ని, పురోగతిని తెలియజేస్తోందన్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో జమ్మూ కాశ్మీర్‌లో అభివృద్ధి వేగం మందగించదని గట్టిగా చెప్పిన మోదీ.. ఈ ప్రాంత వృద్ధికి ఏదీ ఆటంకం కలిగించదని ప్రజలకు హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ యువత కలలకు అడ్డునిలిచేది ఏదైనా మొదట తనను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రకటించారు.
 

సరిగ్గా ఒక నెల క్రితం, ఆపరేషన్ సిందూర్‌ అమలు ద్వారా పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదుల స్థావరాలపై నిర్ణయాత్మకంగా చేసిన దాడులను గుర్తుచేసిన ప్రధానమంత్రి, "ఆపరేషన్ సిందూర్ పేరు విన్నప్పుడల్లా, పాకిస్తాన్‌కు తమ ఘోర పరాభవమే గుర్తుకు వస్తుంది" అని అన్నారు. భారత్ చేపట్టిన సాహసోపేతమైన చర్యలను పాకిస్తాన్ సైనిక, ఉగ్రవాద మూకలు ఎన్నడూ ఊహించలేదని, నిమిషాల వ్యవధిలోనే.. వారు దశాబ్దాలుగా నిర్మించిన ఉగ్రవాద మౌలిక సదుపాయాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ, పూంచ్, ఇతర జిల్లాల్లోని అమాయక పౌరులు లక్ష్యంగా దాడులకు ప్రయత్నించడం పాకిస్తాన్ పూర్తిగా నిరాశలో మునిగిందనడానికి నిదర్శనమని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పాకిస్తాన్ చేసిన ఈ క్రూరమైన దాడులను ఆయన ఖండించారు. ఆ దేశం మన సామాన్యుల ఇళ్లను నాశనం చేయడం, పాఠశాలలు, ఆసుపత్రులపై బాంబులు వేయడం, దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలపైనా బాంబు దాడులకు పాల్పడడం ప్రపంచమంతా చూసిందన్నారు. క్లిష్టమైన పరిస్థితులను సాహసంతో ఎదుర్కొని నిలబడిన జమ్మూ కశ్మీర్ ప్రజల ధైర్యాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. పాకిస్తాన్ దురాక్రమణను ఎదుర్కోవడంలో వారి ధైర్యాన్ని ప్రతి భారతీయుడు చూశారని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు పూర్తి నిబద్ధతతో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ, అచంచల మద్దతు.. సంఘీభావాన్ని అందిస్తున్నారని ఆయన పునరుద్ఘాటించారు.

సరిహద్దుల్లో కాల్పుల కారణంగా తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వ సహాయం కోసం అవసరమైన పత్రాలు ఇప్పటికే అందాయని ప్రధానమంత్రి ప్రకటించారు. షెల్లింగ్ వల్ల ప్రభావితమైన 2 వేలకు పైగా కుటుంబాల కష్టాన్ని ప్రస్తావించిన శ్రీ నరేంద్ర మోదీ, వారి బాధ యావత్ దేశపు బాధ అని పేర్కొన్నారు. గతంలో ఇళ్ల మరమ్మతుల కోసం ఆర్థిక సహాయం అందించామని, ప్రభావితమైన వారికి ఉపశమనం కల్పించామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ సహాయాన్ని పెంచాలని నిర్ణయించిందని, బాధిత కుటుంబాలకు మరింత సహాయం అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. సరిహద్దుల్లో కాల్పుల కారణంగా ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలకు అదనపు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తీవ్ర నష్టం వాటిల్లిన కుటుంబాలకు రూ. 2 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 1 లక్ష అదనపు సహాయం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలిచేందుకు, నిరంతర ఉపశమనాన్ని అందించడానికి.. వారి ఇళ్లు, జీవితాల పునర్నిర్మాణం కోసం వారికి సహాయం చేయడం పట్ల తమ ప్రభుత్వ నిబద్ధతను శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.

"సరిహద్దు ప్రాంతాల్లో నివసించే వారిని దేశానికి ఫ్రంట్‌లైన్ రక్షకులుగా ప్రభుత్వం గౌరవిస్తుంది" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గత దశాబ్ద కాలంలో, సరిహద్దు జిల్లాల్లో అభివృద్ధి, భద్రతను బలోపేతం చేయడానికి అపూర్వమైన ప్రయత్నాలు జరిగాయని ఆయన తెలిపారు. కీలకమైన కార్యక్రమాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రజల ప్రాణాల రక్షణ కోసం దాదాపు 10 వేల కొత్త బంకర్లు నిర్మించామని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో భద్రతా కార్యకలాపాలను మరింత మెరుగుపరిచేందుకు జమ్మూ కశ్మీర్ డివిజన్ కోసం రెండు కొత్త సరిహద్దు బెటాలియన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. అదనంగా, రెండు ప్రత్యేక మహిళా బెటాలియన్లు కూడా విజయవంతంగా ఏర్పాటు చేసినట్లు తెలిపిన ప్రధానమంత్రి, ఈ బెటాలియన్లు రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తూ, సాయుధ దళాల్లో మహిళలకు సాధికారత కల్పిస్తున్నాయని ఆయన వివరించారు.

భారత్ అంతర్జాతీయ సరిహద్దులను కలిగి ఉన్న ప్రాంతాల్లో, ముఖ్యంగా సవాలుతో కూడిన భూభాగాల్లో జరుగుతున్న ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. కనెక్టివిటీని, భద్రతను మెరుగుపరచడానికి వందల కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. కథువా-జమ్మూ హైవేను ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేగా అప్‌గ్రేడ్ చేయడం, అఖ్నూర్-పూంచ్ హైవేను విస్తరించే పనులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ కింద సరిహద్దు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడం ద్వారా.. ఆయా గ్రామాల నివాసితులకు మెరుగైన జీవన పరిస్థితులు, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. గతంలో అన్ని వాతావరణాల్లో కనెక్టివిటీ లేని జమ్మూ కశ్మీర్‌లోని 400 గ్రామాలు ఇప్పుడు కొత్తగా నిర్మించిన 1,800 కిలోమీటర్ల రహదారులతో అనుసంధానం అవుతున్నాయని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో ఆర్థిక వృద్ధి, ప్రాంతీయ అభివృద్ధిని బలోపేతం చేస్తూ, ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం రూ.4,200 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

భారత మాన్యుఫాక్చరింగ్ విప్లవంలో క్రియాశీలంగా పాలుపంచుకోవాలని జమ్మూ కశ్మీర్ యువతకు ప్రధానమంత్రి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఆత్మనిర్భర్ భారత్ బలాన్ని ఆపరేషన్ సిందూర్ ప్రదర్శించిందని, భారత రక్షణ ఉత్పత్తుల తయారీకి నేడు ప్రపంచమంతటా గుర్తింపు లభిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. 'మేక్ ఇన్ ఇండియా' పట్ల సాయుధ దళాలకు గల నమ్మకం వల్లే ఈ విజయం సాధ్యపడిందని, ప్రతి భారతీయుడు ఇప్పుడు వారి నిబద్ధతను అనుకరించాలని పేర్కొన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్‌లో ప్రకటించిన మిషన్ మాన్యుఫ్యాక్చరింగ్ చొరవ గురించి ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది భారత తయారీ రంగాన్ని వేగవంతం చేస్తుందన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని యువ ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు ఈ మిషన్‌లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ భద్రత, ఆర్థిక వృద్ధిని పెంచడానికి వారి ఆధునిక ఆలోచనలు, ఆవిష్కరణలు, విధానాలు, నైపుణ్యాలు దేశానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. గత దశాబ్దంలో భారత్ ప్రముఖ రక్షణరంగ పరికరాల ఎగుమతిదారుగా అవతరించిందని, తదుపరి లక్ష్యం దేశాన్ని ప్రపంచంలోని అగ్రశ్రేణి రక్షణరంగ పరికరాల ఎగుమతిదారుల్లో ఒకటిగా నిలపడమేనని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఈ లక్ష్యం వైపు భారత్ ఎంత వేగంగా ముందుకు సాగుతుందో, అంత ఎక్కువగా ఉపాధి అవకాశాలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని.. తద్వారా లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు.

భారత్‌లో తయారయ్యే ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రతి భారతీయుడు కట్టుబడి ఉండాలని పిలుపునిస్తూ.. ఈ వస్తువులు తోటి పౌరుల కృషి, అంకితభావానికి నిజమైన నిదర్శనాలని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్‌లో తయారైన ఉత్పత్తులను ఎంచుకోవడమే దేశానికి చేసే నిజమైన సేవ అవుతుందని, ఆర్థిక వ్యవస్థను అది బలోపేతం చేస్తుందని, అలాగే కార్మికులను శక్తిమంతం చేస్తుందని ఆయన వివరించారు. దేశం సరిహద్దుల్లోని సాయుధ దళాలను గౌరవించినట్లే, మార్కెట్‌లో 'మేడ్ ఇన్ ఇండియా' గర్వాన్ని కూడా నిలబెట్టాలని సూచించారు. రక్షణ, వాణిజ్య రంగాలు రెండింటిలోనూ భారత్ బలాన్ని చాటాలని ప్రధానమంత్రి కోరారు.
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తూనే ఉండటం వల్లనే జమ్మూ కశ్మీర్ ఉజ్వలమైన, సుసంపన్నమైన భవిష్యత్తు దిశగా ముందుకు సాగుతున్నదని ప్రధానమంత్రి తెలిపారు. సహకారం, పురోగతిల స్ఫూర్తిని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. శాంతి, శ్రేయస్సు ఈ ప్రయాణానికి పునాదిగా ఉండేలా చూసుకోవాలన్నారు. మాతా వైష్ణో దేవి ఆశీర్వాదంతో నడిచే వృద్ధి మార్గాన్ని బలోపేతం చేయాలనే తన అచంచలమైన సంకల్పాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన భారత్.. అభివృద్ధి చెందిన జమ్మూ కశ్మీర్ దార్శనికతను సాధించడానికి పూర్తి నిబద్ధత, దృఢ సంకల్పం, ఐక్యతతో కృషి చేస్తున్నట్లు ఆయన పునరుద్ఘాటించారు. ఈ పురోగతి స్ఫూర్తితో అద్భుతమైన ప్రాజెక్టులను ప్రారంభించుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ శ్రీ నరేంద్ర మోదీ తమ ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రులు శ్రీ అశ్విని వైష్ణవ్, శ్రీ వి. సోమన్న, డాక్టర్ జితేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు.

 

నేపథ్యం

చీనాబ్, అంజీ రైల్వే వంతెనలు

నదిపై 359 మీటర్ల ఎత్తులోని నిర్మాణ అద్భుతమైన చీనాబ్ రైల్వే వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన. ఇది భూకంపం, తుఫానులను తట్టుకునేలా 1,315 మీటర్ల పొడవైన స్టీల్ ఆర్చ్‌తో నిర్మించిన వంతెన. జమ్మూ - శ్రీనగర్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడంలో ఈ వంతెన ప్రభావం కీలకం. వంతెనపై ప్రయాణించే వందే భారత్ రైలు ద్వారా కాత్రా - శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం సుమారు 3 గంటలకు తగ్గనుంది, అంటే ప్రస్తుత ప్రయాణ సమయం దీని వల్ల 2-3 గంటలు తగ్గుతుంది.

 

అంజీ వంతెన భారత మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైల్వే వంతెన, ఇది సవాలుతో కూడిన భూభాగంలో దేశానికి సేవలందించనుంది.

కనెక్టివిటీ ప్రాజెక్టులు.. ఇతర అభివృద్ధి కార్యక్రమాలు

ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (యూఎస్‌బీఆర్ఎల్) ప్రాజెక్టును ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. దాదాపు రూ.43,780 కోట్లతో, 272 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన యూఎస్‌బీఆర్ఎల్ ప్రాజెక్టులో 36 సొరంగాలు (119 కిలోమీటర్ల మేర విస్తరించినవి), 943 వంతెనలు ఉన్నాయి. ప్రాంతీయ రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, సామాజిక-ఆర్థిక సమగ్రతను కొనసాగించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు.. అన్ని వాతావరణాలకు అనుకూలంగా, సజావుగా ఉండే రైలు కనెక్టివిటీని కశ్మీర్ లోయ-దేశంలోని మిగిలిన ప్రాంతాల ఏర్పరుస్తుంది.

శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా - శ్రీనగర్ మార్గంలో రాకపోకలు సాగించే రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు.. నివాసితులు, పర్యాటకులు, యాత్రికులు మొదలైన వారికి వేగవంతమైన, సౌకర్యవంతమైన, విశ్వసనీయమైన ప్రయాణ ఎంపికగా ఉండనున్నాయి.

ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో చివరి మైలు వరకు అనుసంధానానికి ఊతమిస్తూ, వివిధ రహదారుల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి, పనులను ప్రారంభించారు. జాతీయ రహదారి-701లోని రఫియాబాద్ నుంచి కుప్వారా వరకు రహదారి విస్తరణ ప్రాజెక్టు పనులకు, రూ.1,952 కోట్లకు పైగా విలువైన ఎన్‌హెచ్-444లోని షోపియన్ బైపాస్ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. శ్రీనగర్‌లోని జాతీయ రహదారి-1లోని సంగ్రామ జంక్షన్ వద్ద, జాతీయ రహదారి-44లోని బెమినా జంక్షన్ వద్ద రెండు ఫ్లైఓవర్ ప్రాజెక్టులను ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడంతో పాటు ప్రయాణికుల రాకపోకలను మరింత మెరుగుపరచనున్నాయి.
 

కత్రాలో రూ.350 కోట్లకు పైగా విలువైన నిధులతో నిర్మించనున్న శ్రీ మాతా వైష్ణో దేవి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచే ఈ వైద్యకళాశాల.. రియాసి జిల్లాలోని మొదటి వైద్య కళాశాల అవుతుంది.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India-New Zealand elevate ties to strategic partnership; Scripts 2030 roadmap, $20bn investment & Indo-Pacific security

Media Coverage

India-New Zealand elevate ties to strategic partnership; Scripts 2030 roadmap, $20bn investment & Indo-Pacific security
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the passing of Father Amir of State of Qatar HH Sheikh Hamad bin Khalifa Al Thani
July 12, 2026

The Prime Minister, Shri Narendra Modi, has expressed deep grief over the passing of the Father Amir of the State of Qatar, HH Sheikh Hamad bin Khalifa Al Thani.

The Prime Minister described him as a visionary leader who led Qatar to great levels of development and prosperity. Shri Modi also remembered him as a true friend whom he had the honour of meeting during his visit to Qatar in February 2024.

The Prime Minister conveyed his sincere condolences to the Amir of Qatar, HH Sheikh Tamim bin Hamad Al Thani, the entire royal family and the people of Qatar.

The Prime Minister wrote on X;

“We deeply mourn the passing of Father Amir of State of Qatar, HH Sheikh Hamad bin Khalifa Al Thani. A visionary leader who led Qatar to great levels of development and prosperity, we remember him also as a true friend whom I had the honour of meeting during my last visit to Qatar in February 2024. I convey my sincere condolences to the Amir of Qatar, HH Sheikh Tamim bin Hamad Al Thani and the entire royal family and people of Qatar. May the departed soul rest in eternal peace.

@TamimBinHamad”