ఒడిశాను వేగంగా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్న కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు
పేదలు, దళితులు, వెనకబడిన తరగతులు, గిరిజనులకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడమే మా ప్రాధాన్యం
ఒడిశాకు ఇటీవల రెండు సెమీ కండక్టర్ యూనిట్లను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం
బీఎస్ఎన్ఎల్ పూర్తి స్వదేశీ 4జీ సాంకేతికత స్వయం-సమృద్ధి దిశగా కీలక అడుగు

ఒడిశాలోని ఝార్సుగూడలో రూ.60,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత నవరాత్రి పండగ రోజుల్లో మాతా సమలేయ్, మాతా రామచండీలు కొలువైన పవిత్ర భూమిని సందర్శించి.. ఇక్కడి ప్రజలను కలిసే అదృష్టం తనకు లభించిందని శ్రీ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తల్లులు, ఆడపడుచులు పాల్గొనడం ఆనందంగా ఉందన్న ప్రధానమంత్రి.. వారి ఆశీర్వాదాలే నిజమైన బలమన్నారు. ప్రజలకు వందనాలు తెలిపిన ఆయన.. అందరికీ శుభాకాంక్షలూ తెలిపారు.

ఒకటిన్నర సంవత్సరాల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒడిశా ప్రజలు అభివృద్ధి చెందిన ఒడిశా దిశగా నిబద్ధతతో ముందుకు సాగాలని సంకల్పించిన సంగతిని గుర్తు చేశారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ రోజు ఒడిశా వేగంగా అభివృద్ధి చెందుతోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఒడిశా, దేశ అభివృద్ధి కోసం వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ సేవలను ప్రారంభించడం ద్వారా శ్రీ మోదీ ఆ సంస్థ కొత్త అవతార్‌ను ఆవిష్కరించారు. వివిధ రాష్ట్రాల్లో ఐఐటీల విస్తరణ కూడా ఈ రోజే ప్రారంభమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఒడిశాలో విద్య, నైపుణ్యాభివృద్ధి, కనెక్టివిటీకి సంబంధించిన అనేక ప్రాజెక్టులకూ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను నిర్వహించినట్లు వెల్లడించారు. బెర్హంపూర్ నుంచి సూరత్ వరకు ఆధునిక అమృత్ భారత్ రైలును ప్రారంభించిన శ్రీ మోదీ.. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. గుజరాత్‌లోని సూరత్ నుంచి వీడియో అనుసంధానం ద్వారా కేంద్ర రైల్వేలు, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారని శ్రీ మోదీ తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటి కోసం ఆయన ఒడిశా ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

 

"మా ప్రభుత్వం పేదలకు సేవ చేయడానికి, వారికి సాధికారత కల్పించడానికి కట్టుబడి ఉంది. దళితులు, వెనకబడిన తరగతులు, గిరిజన వర్గాలు సహా అణగారిన వర్గాలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం మా ప్రాధాన్యంగా ఉంది" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. నేటి కార్యక్రమం ఈ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. అంత్యోదయ గృహ యోజన కింద లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసే అవకాశం తనకు లభించిందని శ్రీ మోదీ పంచుకున్నారు. ఒక పేద కుటుంబానికి పక్కా ఇల్లు లభించినప్పుడు, అది వారి ప్రస్తుత తరాలను మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాలనూ ప్రభావితం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా పేద కుటుంబాలకు తమ ప్రభుత్వం ఇప్పటికే నాలుగు కోట్లకు పైగా పక్కా ఇళ్లను అందించిందన్నారు. వేలాది ఇళ్లు వేగంగా నిర్మిస్తున్నామన్న ప్రధానమంత్రి ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మోహన్ మాఝీ, ఆయన బృందం చేసిన కృషిని ప్రశంసించారు. నేడు దాదాపు యాభై వేల కుటుంబాలు కొత్త ఇళ్లు పొందాయని ప్రధానమంత్రి ప్రకటించారు. ప్రధానమంత్రి జన్ మన్ యోజన కింద ఒడిశాలోని గిరిజన కుటుంబాలకు నలభై వేలకు పైగా ఇళ్లు మంజూరయ్యాయని తెలిపిన ప్రధానమంత్రి.. ఇది అత్యంత అణగారిన వర్గాల ప్రధాన ఆకాంక్షను నెరవేరుస్తుందన్నారు. లబ్ధిదారులందరి కుటుంబాలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఒడిశా ప్రజల సామర్థ్యాలు, ప్రతిభపై తనకు గల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ.. ప్రకృతి- ఒడిశాను సమృద్ధిగా దీవించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఒడిశా దశాబ్దాల పేదరికాన్ని భరించిందనీ.. రాబోయే దశాబ్దం ఒడిశా ప్రజలకు శ్రేయస్సును తీసుకువస్తుందని ఆయన ఆకాంక్షించారు. దీనిని సాధించడం కోసం ప్రభుత్వం రాష్ట్రానికి ప్రధాన ప్రాజెక్టులను తీసుకువస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒడిశాకు రెండు సెమీ కండక్టర్ యూనిట్లను ఆమోదించిందనీ, ఒడిశా యువత బలం, సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ ఒక సెమీ కండక్టర్ పార్కు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఫోన్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, కంప్యూటర్లు, కార్లు, అనేక ఇతర పరికరాల్లో ఉపయోగించే చిప్ ఒడిశాలోనే తయారవుతుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

చిప్స్ నుంచి షిప్స్ వరకు ప్రతి రంగంలోనూ స్వయం-సమృద్ధి సాధించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. పరాదీప్ నుంచి ఝార్సుగూడ వరకు విస్తారమైన పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నౌకా నిర్మాణం వ్యూహాత్మక ప్రాముఖ్యాన్ని వివరిస్తూ.. ఆర్థిక బలాన్ని కోరుకునే ఏ దేశమైనా ఈ రంగంలో పెట్టుబడి పెట్టాలి.. ఇది వాణిజ్యం, సాంకేతికత, జాతీయ భద్రతకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ప్రపంచ సంక్షోభాల సమయంలో కూడా స్వదేశీ నౌకలను కలిగి ఉండటం ద్వారా నిరంతరాయంగా దిగుమతి-ఎగుమతి కార్యకలాపాలు కొనసాగించవచ్చని శ్రీ మోదీ వివరించారు. తమ ప్రభుత్వం దేశంలో నౌకానిర్మాణానికి రూ. 70,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించినట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయనీ.. ఉక్కు, యంత్రాలు, ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాలకు ముఖ్యంగా చిన్న, కుటీర పరిశ్రమలకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ఇది లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందనీ.. ఒడిశా పరిశ్రమలు, యువతకు గణనీయమైన ప్రయోజనాలను తెస్తుందని ప్రధానమంత్రి తెలిపారు.

 

"భారత్ స్వయం-సమృద్ధి దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది" అని శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. 2జీ, 3జీ, 4జీ వంటి టెలికాం సేవలు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైనప్పుడు భారత్ వెనకబడిందన్నారు. ఈ సేవల కోసం విదేశీ సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి ఉండిపోయిందని తెలిపారు. అటువంటి పరిస్థితి దేశానికి తగినది కాదనీ, ఇదే అవసరమైన టెలికాం సాంకేతికతలను దేశీయంగా అభివృద్ధి చేయాలనే జాతీయ సంకల్పానికి దారితీసిందని ఆయన స్పష్టం చేశారు. దేశంలో బీఎస్ఎన్ఎల్ పూర్తి స్వదేశీ 4జీ సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధి చేయడం గర్వకారణమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ విజయం సాధించడంలో బీఎస్ఎన్ఎల్ అంకితభావం, పట్టుదల, నైపుణ్యాన్ని ఆయన ప్రశంసించారు. 4జీ సేవలను ప్రారంభించడానికి పూర్తి స్వదేశీ సాంకేతికతను ఉఫయోగించిన ప్రపంచంలోని అయిదు దేశాల సరసన భారత్ నిలిచిందని తెలిపారు.

బీఎస్ఎన్ఎల్ నేడు 25వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం యాదృచ్చికమని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ చారిత్రక సందర్భంలో బీఎస్ఎన్ఎల్, దాని భాగస్వాముల అంకితభావంతో కూడిన కృషి ద్వారా భారత్ ప్రపంచ టెలికాం తయారీ కేంద్రంగా మారే దిశగా ముందుకు సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ నెట్‌వర్క్‌ను ఝార్సుగూడ నుంచి ప్రారంభించడం ఒడిశాకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఇందులో దాదాపు లక్ష 4జీ టవర్లు ఉన్నాయనీ.. ఈ టవర్లు దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీతో కొత్త శకానికి నాంది పలికేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 4జీ టెక్నాలజీ విస్తరణ దేశవ్యాప్తంగా రెండు కోట్ల మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది అని శ్రీ మోదీ వివరించారు. గతంలో హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం లేని సుమారు ముప్పై వేల గ్రామాలు ఇప్పుడు ఈ కార్యక్రమంతో అనుసంధానమవుతున్నాయని తెలిపారు.

ఈ చారిత్రాత్మక దినోత్సవాన్ని వీక్షించడానికి వేలాది గ్రామాలు వాస్తవంగా అనుసంధానమై ఉన్నాయనీ, వారంతా హై-స్పీడ్ ఇంటర్నెట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వింటున్నారని, చూస్తున్నారనీ ప్రధానమంత్రి పేర్కొన్నారు. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా అస్సాం నుంచి ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

 

బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ సేవలు గిరిజన ప్రాంతాలు, మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలకు అత్యంత ప్రయోజనం చేకూరుస్తాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ ప్రాంతాల ప్రజలు ఇప్పుడు నాణ్యమైన డిజిటల్ సేవలను పొందగలరని ధ్రువీకరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావచ్చు.. సుదూర ప్రాంతాల్లోని రైతులు పంటల ధరలను తెలుసుకోవచ్చు.. రోగులు టెలిమెడిసిన్ ద్వారా వైద్యులను సంప్రదించడం సులభతరం అవుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమం మన సాయుధ దళాల సిబ్బందికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని, మెరుగైన కనెక్టివిటీ ద్వారా వారు సురక్షితంగా కమ్యూనికేట్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.

భారత్ ఇప్పటికే అత్యంత వేగవంతమైన 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ రోజు ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్ టవర్లు 5జీ సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో బీఎస్ఎన్ఎల్ సంస్థకు, దేశ పౌరులందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

స్వయం-సమృద్ధ భారత్ నిర్మాణానికి నైపుణ్యం గల యువత, బలమైన పరిశోధనా వ్యవస్థ అవసరమని స్పష్టం చేసిన శ్రీ మోదీ.. ఇది తమ ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యంగా ఉందన్నారు. ఒడిశా సహా దేశవ్యాప్తంగా విద్య, నైపుణ్యాభివృద్ధిలో అపూర్వమైన పెట్టుబడులు వస్తున్నాయని ఆయన ప్రస్తావించారు. ఇంజనీరింగ్ కళాశాలలు, పాలిటెక్నిక్‌ కళాశాలలను ఆధునీకరిస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ ప్రయత్నానికి మద్దతుగా ఎమ్ఈఆర్ఐటీఈ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించామన్నారు. ఈ పథకం కింద సాంకేతిక విద్యా సంస్థల్లో వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. ఇది యువత నాణ్యమైన సాంకేతిక విద్య కోసం పెద్ద నగరాలకు వలస వెళ్లవలసిన నిర్బంధాన్ని తొలగిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. బదులుగా వారికి సొంత పట్టణాల్లోనే ఆధునిక ప్రయోగశాలలు, ప్రపంచ నైపుణ్య శిక్షణ, అంకురసంస్థల అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

 

దేశంలోని ప్రతి రంగానికి, ప్రతి సమాజానికి, ప్రతి పౌరుడికీ సౌకర్యాలు చేరేలా అపూర్వమైన కృషి జరుగుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీనిని సాధించడానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గతాన్ని గుర్తుచేసుకుంటూ.. అప్పటి పరిస్థితి గురించి ప్రజలకు బాగా తెలుసునని, ప్రతిపక్షం ప్రజలను దోపిడీ చేసే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోలేదనీ ఆయన విమర్శించారు.

2014లో ప్రజలు మా ప్రభుత్వానికి సేవ చేసే అవకాశం ఇచ్చినప్పుడే దేశాన్ని ప్రతిపక్షాల దోపిడీ వ్యవస్థ నుంచి విజయవంతంగా విముక్తి చేసినట్లు ప్రధాని తెలిపారు. తమ హయాంలో పొదుపులు, ఆదాయాలు రెట్టింపు అయ్యే యుగం ప్రారంభమైందని అన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఉద్యోగులు, వ్యాపారవేత్తలు రూ. 2 లక్షల వరకు ఆదాయంపై కూడా పన్ను చెల్లించాల్సి ఉండేందన్న ఆయన.. నేడు దీనికి విరుద్ధంగా సంవత్సరానికి రూ. 12 లక్షల వరకు ఒక్క రూపాయి కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు.

 

2025 సెప్టెంబర్ 22 నుంచి ఒడిశాతో సహా దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చాయని గుర్తు చేసిన ప్రధాని.. ఈ సంస్కరణలను అందరికీ పొదుపు బహుమతిగా అభివర్ణించారు. ఇవి ముఖ్యంగా తల్లులు, సోదరీమణులకు వంటగది ఖర్చులు మరింత తగ్గిస్తాయని అన్నారు. చాలా నిత్యావసరాలపై ధరలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. ఈ సందర్భంగా ఒక ఉదాహరణను ఆయన వివరించారు. ఒడిశాలోని ఒక కుటుంబం 2014 కంటే ముందు అంటే అప్పటి ప్రభుత్వాల పాలనలో కిరాణా సామాగ్రి, ఇతర నిత్యావసర వస్తువుల కోసం సంవత్సరానికి రూ. 1 లక్ష ఖర్చు చేసినట్లయితే.. దానిపై రూ. 20వేల నుంచి రూ. 25వేల వరకు పన్ను చెల్లించేదని తెలిపారు. 2017లో ప్రభుత్వం జీఎస్టీని ప్రవేశపెట్టిన తర్వాత ఈ పన్ను తగ్గింది. ప్రస్తుత సంస్కరణలతో పన్ను భారం గణనీయంగా తగ్గింది. అదే మొత్తం వార్షిక ఖర్చుపై ఒక కుటుంబం రూ. 5,000 నుంచి రూ. 6,000 మాత్రమే పన్ను చెల్లిస్తోంది. ప్రతిపక్ష ప్రభుత్వ కాలంతో పోల్చితే ఇప్పుడు ఇంట్లో ఖర్చులపై ఒక కుటుంబం సంవత్సరానికి రూ. 15వేల నుంచి రూ. 20వేల వరకు ఆదా చేస్తోందని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు.

 

‘రైతన్నల రాష్ట్రం ఒడిశా’ అన్న ఆయన.. జీఎస్టీ పొదుపు పండుగ వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. ప్రతిపక్షాల హయంలో రైతులు ట్రాక్టర్ కొనుగోలు చేసేటప్పుడు రూ. 70,000 పన్ను చెల్లించాల్సి ఉండేదని గుర్తు చేశారు. జీఎస్టీ ప్రవేశపెట్టడంతో పన్ను తగ్గింది.. కొత్త జీఎస్టీ కింద రైతులు ఇప్పుడు అదే ట్రాక్టర్‌పై సుమారు రూ. 40,000 ఆదా చేసుకుంటున్నారు. ఇప్పుడు వరి నాట్లు వేయడానికి ఉపయోగించే యంత్రాలపై రూ. 15,000, పవర్ టిల్లర్లపై రూ. 10,000, నూర్పిడి యంత్రాలపై రూ. 25,000 వరకు ఆదా అవుతోందని తెలిపారు. తమ ప్రభుత్వం అనేక వ్యవసాయ ఉపకరణాలు, పరికరాలపై పన్నులను గణనీయంగా తగ్గించిందని అన్నారు.

 

ఒడిశాలో గిరిజన జనాభా ఎక్కువగా ఉంటుందని, వారంతా జీవనోపాధి కోసం అటవీ ఉత్పత్తులపై ఆధారపడి ఉన్నారన్న ఆయన.. ప్రభుత్వం ఇప్పటికే కెండు ఆకులు సేకరించేవారి కోసం పనిచేస్తోందని, ఇప్పుడు వీటిపై జీఎస్టీ గణనీయంగా తగ్గటంతో ఈ పనిచేసే వాళ్లకు మెరుగైన ధరలు అందుతుందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం నిరంతరం ప్రజలకు పన్ను ఉపశమనం కల్పిస్తూ పొదుపును పెంచుతోందన్న ఆయన.. ప్రతిపక్షాలు మాత్రం దోపిడీ పద్ధతులను కొనసాగిస్తున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాల నేతృత్వంలోని ప్రభుత్వాలు ఇప్పటికీ ప్రజలను దోచుకునే పనిలో ఉన్నాయని ఆరోపించారు. గృహ నిర్మాణం, పాత ఇంటి మరమ్మత్తులను మరింత అందుబాటు ధరల్లోకి తీసుకొచ్చేందుకు కొత్త జీఎస్టీ రేట్లలో భాగంగా సిమెంట్‌పై పన్నును కూడా తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు. సెప్టెంబర్ 22 నుంచి హిమాచల్ ప్రదేశ్‌లో కూడా సిమెంట్ ధరలు తగ్గినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సిమెంట్‌పై అదనపు పన్ను విధించి ప్రజలు ప్రయోజనం పొందకుండా చేసిందని అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎక్కడ ప్రభుత్వంలో ఉన్నా అక్కడ దోపిడీ జరుగుతుందని హెచ్చరించిన ప్రధాని.. ప్రజలంతా ఆ పార్టీ పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు.

 

జీఎస్టీ పొదుపు పండగ తల్లులు, అక్కాచెల్లెళ్లకు ఎక్కువ ఆనందాన్ని కలిగించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహిళలు, కుమార్తెలకు సేవ చేయడం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని తెలిపిన ఆయన.. వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. కుటుంబాల కోసం మాతృమూర్తులు గొప్ప త్యాగాలు చేస్తారన్న ఆయన.. పిల్లలను రక్షించటం కోసం ప్రతి కష్టాన్ని భరిస్తారని, వైద్య ఖర్చుల భారం కుటుంబంపై పడకుండా ఉండేందుకు వాళ్లు సొంత అనారోగ్యాలను దాచిపెడతారని పేర్కొన్నారు. దీని కోసమే ఆయుష్మాన్ భారత్ యోజన ప్రారభించినట్లు తెలిపారు. ఇది రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సను అందించడం ద్వారా మహిళలకు గణనీయంగా ప్రయోజనం చేకూర్చుతోందని ప్రధాని చెప్పారు.

 

ఆరోగ్యవంతమైన తల్లి బలమైన కుటుంబాన్ని తయారు చేస్తుందన్న మోదీ.. 2025 సెప్టెంబర్ 17 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభించిన “స్వస్త్ నారి, సశక్త్ పరివార్” కార్యక్రమం గురించి చెప్పారు. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న ఎనిమిది లక్షలకు పైగా ఆరోగ్య శిబిరాల్లో మూడు కోట్లకు పైగా మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారని తెలియజేశారు. ఈ శిబిరాలు మధుమేహం, రొమ్ము క్యాన్సర్, క్షయ, సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నిర్ధారణను సులభతరం చేస్తున్నాయి. ఒడిశాలోని మాతృమూర్తులు, అక్కాచెల్లెళ్లు, కుమార్తెలు అందరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.

 

సౌకర్యం, సుసంపన్నతకు మార్గాన్ని సుగమం చేస్తూ పన్ను ఉపశమనం, ఆధునిక అనుసంధానత ద్వారా దేశంతో పాటు ప్రజల బలాన్ని పెంచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఈ పనుల ద్వారా ఒడిశా గణనీయమైన ప్రయోజనాలను పొందుతోందని, ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, దాదాపు అరవై రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఝార్సుగూడలోని వీర్ సురేంద్ర సాయి విమానాశ్రయం ఇప్పుడు దేశంలోని అనేక ప్రధాన నగరాలతో అనుసంధానమైనదని తెలిపారు. ఖనిజాలు, గనుల తవ్వకం ద్వారా కూడా ఒడిశా భారీ ఆదాయం పొందుతోంది. సుభద్ర యోజన ఒడిశా మహిళలకు నిరంతరం మద్దతునిస్తోందని అన్నారు. ఒడిశా పురోగతి మార్గం బలంగా ఉందన్న ఆయన.. అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్న హామీ ఇచ్చారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగాన్ని ముగించారు.

 

ఈ కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ శ్రీ డాక్టర్ హరిబాబు కంభంపాటి, ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ కేంద్ర మంత్రి శ్రీ జువల్ ఓరం తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

 

నేపథ్యం-

ఝార్సుగూడలో రూ. 60,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. టెలికమ్యూనికేషన్స్, రైల్వేలు, ఉన్నత విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ గృహ నిర్మాణం తదితరాలకు చెందిన ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి.

 

టెలికాం రంగాన్ని తీసుకుంటే.. దాదాపు రూ. 37,000 కోట్ల వ్యయంతో స్వదేశీ సాంకేతికతతో ఏర్పాటు చేసిన 97,500లకు పైగా మొబైల్ 4జీ టవర్లను ఆయన ప్రారంభించారు. ఇందులో 92,600లకు పైగా టవర్లు బీఎస్ఎన్‌ఎల్‌కు చెందినవే. డిజిటల్ భారత్ నిధి కింద 18,900లకు పైగా 4జీ టవర్లకు నిధులు అందాయి. ఇవి మారుమూల, సరిహద్దు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో నెట్‌వర్క్ లేని దాదాపు 26,700 గ్రామాలను అనుసంధానించటంతో పాటు 20 లక్షలకు పైగా కొత్త వినియోగదారులకు సేవలు అందిస్తాయి. సౌర విద్యుత్‌తో పనిచేయనున్న ఈ టవర్లు భారతదేశంలోనే అతిపెద్ద హరిత టెలికాం కేంద్రాల సమూహంగా, సుస్థిర మౌలిక సదుపాయాలలో విషయంలో ముందడుగా నిలుస్తున్నాయి.

 

అనుసంధానతతో పాటు ప్రాంతీయ వృద్ధిని పెంచే పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. సంబల్‌పూర్-సర్లా వద్ద రైల్వే పైవంతెనకు శంకుస్థాపన చేసిన ఆయన.. కోరాపుట్-బైగూడ విభాగంలో రెండో మార్గంతో పాటు మనబార్-కోరాపుట్-గోరాపూర్ మార్గాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు ఒడిశాతో పాటు దాని పక్క రాష్ట్రాల్లో సరకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను మెరుగపరచటంతో పాటు స్థానిక పరిశ్రమలు, వాణిజ్యాన్ని బలోపేతం చేస్తాయి. బెర్హంపూర్, ఉధ్నా (సూరత్) మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది వివిధ రాష్ట్రాల మధ్య అందుబాటు ధరల్లో సౌకర్యవంతమైన అనుసంధానతను అందిస్తుంది. దీనితో పాటు పర్యాటకానికి మద్దతునిస్తూ ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. ఇది ఆర్థికంగా కీలకమైన జిల్లాలను అనుసంధానిస్తుంది.

 

తిరుపతి, పాలక్కాడ్, భిలాయ్, జమ్మూ, ధార్వాడ్, జోధ్‌పూర్, పాట్నా, ఇండోర్.. ఈ ఎనిమిది ఐఐటీల విస్తరణకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. నాలుగు సంవత్సరాల్లో పూర్తికానున్న ఈ విస్తరణతో కొత్తగా 10,000 మంది విద్యార్థులు ఐఐటీల్లో చదువుకునే వెసులుబాటు ఉంది. దీనితో పాటు ఎనిమిది అత్యాధునిక పరిశోధనా పార్కులను కూడా ఏర్పాటుచేయనున్నారు. వీటివల్ల భారత ఆవిష్కరణ వ్యవస్థను బలోపేతమవటంతో పాటు పరిశోధన- అభివృద్ధికి బలమైన ప్రోత్సాహం లభిస్తుంది.

 

దేశవ్యాప్తంగా ఉన్న 275 రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ విద్యా సంస్థల విలువ, నాణ్యత, పరిశోధన, ఆవిష్కరణలను మెరుగుపరిచేందుకు రూపొందించిన ఎంఈఆర్ఐటీఈ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు.

 

ఒడిశా నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టు రెండో దశను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. దీని కింద వ్యవసాయ సాంకేతికత, పునరుత్పాదక ఇంధనం, రిటైల్, ఆతిథ్య వంటి వర్థమాన రంగాల్లో ప్రపంచ నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దీనితో పాటు అయిదు ఐటీఐలను ఉత్కర్ష్ ఐటీఐలుగా, 25 ఐటీఐలను ఎక్సలెన్స్ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రెసిషన్ ఇంజనీరింగ్ భవనం అధునాతన సాంకేతిక శిక్షణను అందిస్తుంది.

 

రాష్ట్రంలో డిజిటల్ విద్యను పెంపొందించేందుకు 130 ఉన్నత విద్యా సంస్థలలో వై-ఫై సౌకర్యాలను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఈ సదుపాయాల ద్వారా 2.5 లక్షలకు పైగా విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందనున్నారు.

 

ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఒడిశాలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలకు కూడా ఊతం లభించింది. బెర్హంపూర్‌లోని ఎంకేసీజీ వైద్య కళాశాల, సంభాల్‌పూర్‌లోని విమ్స్‌ఏఆర్‌లను ప్రపంచ స్థాయి సూపర్-స్పెషాలిటీ ఆసుపత్రులుగా అధునికీకరించే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ఆధునికీకరణ ద్వారా బెడ్‌ల సంఖ్య, ట్రామా కేర్ యూనిట్లు, దంత కళాశాలలు, ప్రసూతి-శిశు సంరక్షణ సేవలు మెరుగుపడనున్నాయి. వైద్య విద్యా మౌలిక సదుపాయాలు పెరగటంతో ఒడిశా ప్రజలకు సమగ్ర ఆరోగ్య సేవలు అందుతాయి.

 

అంత్యోదయ గృహ యోజన కింద 50,000 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంపిణీ చేశారు. ఈ పథకం వికలాంగులు, వితంతువులు, ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు, ప్రకృతి వైపరీత్యాల బాధితులు తదితర దుర్బల గ్రామీణ కుటుంబాలకు పక్కా గృహాలు, ఆర్థిక సహాయం అందిస్తుంది. సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాలకు గౌరవంతో కూడిన సామాజిక సంక్షేమం అందించాలన్న ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఇది ఉంది.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's electronics exports cross $47 billion in 2025 on iPhone push

Media Coverage

India's electronics exports cross $47 billion in 2025 on iPhone push
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM receives H.H. Sheikh Mohamed bin Zayed Al Nahyan, President of the UAE
January 19, 2026

Prime Minister Shri Narendra Modi received His Highness Sheikh Mohamed bin Zayed Al Nahyan, President of the UAE at the airport today in New Delhi.

In a post on X, Shri Modi wrote:

“Went to the airport to welcome my brother, His Highness Sheikh Mohamed bin Zayed Al Nahyan, President of the UAE. His visit illustrates the importance he attaches to a strong India-UAE friendship. Looking forward to our discussions.

@MohamedBinZayed”

“‏توجهتُ إلى المطار لاستقبال أخي، صاحب السمو الشيخ محمد بن زايد آل نهيان، رئيس دولة الإمارات العربية المتحدة. تُجسّد زيارته الأهمية التي يوليها لعلاقات الصداقة المتينة بين الهند والإمارات. أتطلع إلى مباحثاتنا.

‏⁦‪@MohamedBinZayed