* శాంతి, సంస్కృతుల సంగమమే అరుణాచల్ ప్రదేశ్, ఇది భారత్‌కు గర్వకారణం: పీఎం
* దేశానికి అష్టలక్ష్మి... ఈశాన్య భారతం: పీఎం
* దేశాభివృద్ధికి ఈశాన్య భారతం చోదక శక్తిగా మారుతోంది: పీఎం
* ప్రజల జీవితాలను సులభతరం చేస్తున్న వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం: పీఎం
* 5 శాతం,18 శాతానికి సవరించిన జీఎస్టీ.. ఎన్నో వస్తువులపై తగ్గిన పన్నులు: పీఎం

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో రూ.5,100 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. భగవాన్ డోన్యీ పోలోకు ప్రణామాలు అర్పించి, అందరిపై ఆయన ఆశీస్సులు ప్రసరించాలని ప్రార్థించారు.

హెలిప్యాడ్ నుంచి వేదిక వరకు సాగిన ప్రయాణంలో దారి పొడవునా అనేకమంది ప్రజలను తాను కలుసుకున్నానని, జాతీయ పతాకాలను పట్టుకున్న చిన్నారులు, యువతను చూశానని, అరుణాచల్ ప్రదేశ్ ఆతిథ్యంతో తన మనసు ఆనందంతో నిండిపోయిందని ప్రధానమంత్రి అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ సూర్యుడు ఉదయించే ప్రదేశం మాత్రమే కాదని.. గొప్ప దేశభక్తి కలిగిన నేల అని అభివర్ణించారు. జాతీయ జెండాలో మొదటి రంగు కాషాయం మాదిరిగానే.. అరుణాచల్ స్ఫూర్తి కూడా కాషాయంతోనే మొదలవుతుందని చెప్పారు. అరుణాచల్‌లో ఉన్న ప్రతి వ్యక్తినీ ధైర్యానికీ, నిరాండబరతకూ ప్రతీకగా శ్రీ మోదీ వర్ణించారు. అరుణాచల్ ప్రదేశ్‌కు తాను వచ్చిన ప్రతిసారి ఎనలేని ఆనందం కలుగుతుందని, ఇక్కడి ప్రజలతో గడిపిన ప్రతి క్షణం తనకు ఓ మధుర జ్ఞాపకమని చెబుతూ.. ఈ రాష్ట్రం పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు. తన పట్ల చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలను తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. ‘‘తవాంగ్ బౌద్ధ విహారం నుంచి నమ్సాయ్‌లోని గోల్డెన్ పగోడా వరకు శాంతి, సంస్కృతుల సంగమానికి అరుణాచల్ ప్రదేశ్ ప్రతీకగా నిలస్తుంది’’ అంటూ ఈ పవిత్ర భూమికి నమస్కరించారు. ఇది భారతమాతకు గర్వకారణమన్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో ఈనాటి తన పర్యటన మూడు వేర్వేరు కారణాల వల్ల ప్రత్యేకతను సంతరించుకుందని ప్రధానమంత్రి అన్నారు. అందులో మొదటిది.. పవిత్ర నవరాత్రిలో మొదటి రోజున ప్రకృతి సౌందర్యం అలరారుతున్న పర్వతాలను చూసే అవకాశం లభించిందని తెలిపారు. ఈ రోజు హిమవంతుని పుత్రిక శైలపుత్రీ మాతను భక్తులు పూజిస్తారన్నారు. రెండోది, దేశవ్యాప్తంగా తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల అమలు, జీఎస్టీ పొదుపు ఉత్సవాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పండగ సమయంలో పౌరులు డబుల్ బొనాంజా పొందారని శ్రీమోదీ తెలిపారు. మూడోది, అరుణాచల్ ప్రదేశ్‌లో విద్యుత్, రవాణా అనుసంధానం, పర్యాటకం, ఆరోగ్యం సహా వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాన్ని ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న తమ ప్రభుత్వం వల్ల అందే రెట్టింపు ప్రయోజనాలను ఇది ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ కొత్త ప్రాజెక్టులకు గాను అరుణాచల్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భారత పౌరుల జీవితాల్లో ఆనందాన్నీ, సంక్షేమాన్నీ, విజయాన్నీ జీఎస్టీ పొదుపు ఉత్సవం తీసుకువస్తుందని ఆయన వెల్లడించారు.

 

సూర్యకిరణాలు మొదట అరుణాచల్ ప్రదేశ్‌పై ప్రసరిస్తాయని, అలాంటి ప్రదేశానికి అభివృద్ధి కిరణాలు చేరుకోవడానికి అనేక దశాబ్దాల సమయం పట్టడం దురదృష్టకరమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. 2014కు ముందు అరుణాచల్ ప్రదేశ్‌ను సందర్శించానని, ఇక్కడి ప్రజలతో మమేకం అయ్యాననీ గుర్తు చేసుకున్నారు. ఈ రాష్ట్రంపై ప్రకృతి మాత ఆశీస్సులు ఉన్నాయని, ఇక్కడ నేల సారవంతమైనదని, ఇక్కడి ప్రజలకు కష్టపడే తత్వం, అపారమైన సామర్థ్యం ఉందని తెలియజేశారు. ఇన్ని బలాలు ఉన్నప్పటికీ గతంలో ఢిల్లీని పాలించినవారు అరుణాచల్‌ను పదే పదే నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. తక్కువ జనాభా, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండటం వల్ల అరుణాచల్‌పై దృష్టి సారించాల్సిన అవసరం లేదన్న కొన్ని రాజకీయ పార్టీల ధోరణిని విమర్శించారు. ఈ విధానం వల్ల అరుణాచల్‌తో పాటుగా మొత్తం ఈశాన్య భారతానికీ తీరని చేటు చేసిందని, ఫలితంగా.. అభివృద్ధి ప్రయాణంలో ఈశాన్య ప్రాంతం వెనకబడి పోయిందని అభిప్రాయపడ్డారు.

2014లో దేశానికి సేవ చేసే అవకాశం లభించిన తర్వాత, గత పరిపాలనా విధానాల నుంచి దేశానికి విముక్తి కల్పిచాలనే సంకల్పం తీసుకున్నట్లు శ్రీ మోదీ తెలిపారు. ‘దేశమే ప్రధానం’ అన్న విధానమే తనను ముందుకు నడిపిస్తుంది తప్ప ఒక రాష్ట్రంలోని ఓట్లు, సీట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. ‘నాగరిక్ దేవోభవ’ అనే తన ప్రభుత్వ మూల మంత్రాన్ని మరోసారి గుర్తు చేశారు. ఒకప్పుడు ఎవరూ పట్టించుకోని వారికి ఇప్పుడు మోదీ గౌరవమిస్తున్నారని ప్రధానమంత్రి చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యానికి గురయిన ఈశాన్య ప్రాంతం 2014 తర్వాత అభివృద్ధి ప్రాధాన్యాలకు కేంద్రంగా మారిందని తెలియజేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయించే నిధులు ఎన్నో రెట్లు పెరిగాయని, చివరి వ్యక్తి వరకు అనుసంధానం, పంపిణీ తమ ప్రభుత్వ పరిపాలనకు హాల్‌మార్క్‌గా మారాయని తెలిపారు. ఇప్పుడు పరిపాలన ఢిల్లీకే పరిమితం కాదని, అధికారులు, మంత్రులు తరచూ ఈశాన్య ప్రాంతాలను సందర్శించి, ఇక్కడ బస చేస్తున్నారని వివరించారు.

గత పాలకుల హయాంలో రెండు మూడు నెలలకోసారి మాత్రమే కేంద్ర మంత్రులు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించేవారని, తమ ప్రభుత్వంలో మాత్రం కేంద్ర మంత్రులు 800 కంటే ఎక్కువ సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించారని శ్రీ మోదీ వెల్లడించారు. ఇవి పేరుకి మాత్రమే పరిమితమైన పర్యటనలు కాదని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మంత్రులు రాత్రి బస చేసి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తాను ఇప్పటి వరకు 70 కంటే ఎక్కువ సార్లు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించానని ప్రధానమంత్రి అన్నారు. గత వారమే మిజోరాం, మణిపూర్, అస్సాంలో పర్యటించానని, గువాహటిలో రాత్రి బస చేశానని వివరించారు. ఈశాన్య ప్రాంతం పట్ల తనకున్న అభిమానం గురించి తెలియజేస్తూ.. భావోద్వేగాల అంతరాన్ని తగ్గించి ఢిల్లీని ప్రజల దగ్గరకు తన ప్రభుత్వం చేర్చిందని తెలియజేశారు.

 

ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాలు అష్టలక్ష్ములుగా గౌరవాన్ని అందుకుంటున్నాయని, కాబట్టి ఈ రాష్ట్రాలు అభివృద్ధిలో వెనకబడిపోకూడదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయిస్తోందని తెలియజేశారు. దీనికి ఉదాహరణగా, కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో కొంత భాగాన్ని ఈ రాష్ట్రాలకు అందిస్తున్నట్లు వెల్లడించారు. గత పాలకుల హయాంలో.. అరుణాచల్ ప్రదేశ్‌కు పదేళ్ల కాలంలో కేంద్ర పన్నుల నుంచి కేవలం రూ. 6,000 కోట్లు మాత్రమే అందాయని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో అదే కాల వ్యవధిలో సుమారు 16 రెట్లు ఎక్కువగా రూ. 1 లక్ష కోట్లు ఈ రాష్ట్రానికి లభించాయని శ్రీ మోదీ వెల్లడించారు. ఈ మొత్తం పన్నుల వాటాగా మాత్రమే దక్కిందని, రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలకు, ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులకు చేస్తున్న వ్యయం దీనికి అదనమని వివరించారు. అందుకే అరుణాచల్ వేగంగా, విస్తృతంగా అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి చెప్పారు.

మన ఆలోచనలు ఉన్నతంగా, మన ప్రయత్నాల్లో నిజాయతీ ఉన్నప్పుడు ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయంటూ.. సుపరిపాలనపై దృష్టి కేంద్రీకరించి దేశాభివృద్ధికి చోదకశక్తిగా ఈశాన్య ప్రాంతం ఎదుగుతోందని శ్రీ మోదీ తెలిపారు. ప్రజాసంక్షేమం కంటే తమ ప్రభుత్వానికి ముఖ్యమైనది ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. జీవితాలను సులభతరం చేసేందుకు జీవన సౌలభ్యంపై, ప్రయాణ సమస్యలను తగ్గించేందుకు రవాణా సౌలభ్యంపై, ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు చికిత్సా సౌలభ్యంపై, విద్యకు తోడ్పాటు అందించేందుకు సులభతర విద్యా విధానంపై, వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు సులభతర వ్యాపార విధానాలపై తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ఈ లక్ష్యాలను చేరుకొనేందుకు తమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చురుగ్గా పని చేస్తున్నాయని తెలియజేశారు. ఒకప్పుడు రోడ్లు ఊసే లేని ప్రాంతాలు ఇప్పుడు నాణ్యమైన జాతీయ రహదారులను చూస్తున్నాయి. ఒకప్పుడు అసాధ్యమని భావించిన సేలా టన్నెల్ ఇప్పుడు అరుణాచల్ ప్రగతికి చిహ్నంగా నిలుస్తోందని పీఎం అన్నారు.

అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో హెలిపోర్టుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా వివరించారు. ఉడాన్ పథకం కింద ఈ ప్రాంతాలను అనుసంధానిస్తూ.. హోలోంగి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ నిర్మాణాన్ని చేపట్టినట్టు శ్రీ మోదీ చెప్పారు. ఇక్కడి నుంచి ఇప్పుడు నేరుగా ఢిల్లీకి  విమానాలు నడుస్తున్నాయి. ప్రయాణికులు, విద్యార్థులు, పర్యాటకులకు ప్రయోజనం కలగడమే కాకుండా.. స్థానిక రైతులు, చిన్న పరిశ్రమలకు కూడా ఈ అభివృద్ధి అండగా నిలుస్తుంది. పండ్లు, కూరగాయలు, ఇతర ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ప్రధాన మార్కెట్లకు రవాణా చేయడం ఇప్పుడు చాలా సులభతరమైందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

 

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యంతో భారత్ సమష్టిగా కృషి చేస్తోందని ప్రధానమంత్రి అన్నారు. దేశ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతీ రాష్ట్రం పురోగమించినప్పుడే ఈ లక్ష్యం నెరవేరుతుంది. ఈ లక్ష్యాల సాధనలో ఈశాన్య ప్రాంతం గణనీయమైన పాత్ర పోషిస్తోందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ రంగాన్ని ప్రధాన ఉదాహరణగా పేర్కొంటూ.. 2030 నాటికి సౌర, పవన, జల విద్యుత్ సహా సంప్రదాయేతర వనరుల నుంచి 500 గిగావాట్ల విద్యుదుత్పత్తిని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుందన్నారు. ఈ మిషన్‌కు అరుణాచల్ ప్రదేశ్ క్రియాశీలంగా దోహదం చేస్తోందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తిదారుగా అరుణాచల్ స్థానాన్ని సుస్థిరం చేసే, వేలాది యువతకు ఉపాధి కల్పించే, అభివృద్ధి కార్యకలాపాల కోసం తక్కువ వ్యయంతో విద్యుత్తును అందించే రెండు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

క్లిష్టమైన అభివృద్ధి పనులను చాలా కాలంగా దాటవేస్తూ వచ్చిన ప్రతిపక్షం ధోరణిని ప్రధానమంత్రి విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్‌తోపాటు మొత్తం ఈశాన్య ప్రాంతాన్ని ఇది ప్రతికూలంగా ప్రభావితం చేసిందన్నారు. పర్వత ప్రాంతాలు, అటవీ ప్రాంతాల వంటి సవాళ్లతో కూడిన భూభాగాలను ప్రతిపక్షం చాలావరకూ వెనుకబడిన ప్రాంతాలుగా ప్రకటించి, నిర్లక్ష్యానికి గురిచేసిందన్నారు. ఈశాన్య ప్రాంతంలోని గిరిజన ప్రాంతాలు, జిల్లాలు ఎక్కువగా నష్టపోయాయని, సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామాలను ‘శివారు గ్రామాలు’ అంటూ లెక్కచేయలేదని శ్రీ మోదీ చెప్పారు. అలా గత ప్రభుత్వాలు బాధ్యతల నుంచి తప్పించుకున్నాయని, వైఫల్యాలను దాచిపెట్టాయని అన్నారు. గిరిజన, సరిహద్దు ప్రాంతాల్లో నిరంతర వలసలకు ఈ నిర్లక్ష్యం కారణమైందన్నారు.

ప్రాంతీయాభివృద్ధి పట్ల గతంలో అనుసరించిన విధానాన్ని తమ ప్రభుత్వం సమూలంగా మార్చేసిందని శ్రీ మోదీ చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో ‘వెనుకబడినవి’గా ముద్రపడిన జిల్లాలను తాము ‘ఆకాంక్షాత్మక జిల్లాలు’గా పునర్నిర్వచించి, వాటి అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చామన్నారు. ఒకప్పుడు ‘కడపటి గ్రామాలు’గా తోసిపుచ్చిన సరిహద్దు గ్రామాలను ఇప్పుడు దేశానికి ‘తొలి గ్రామాలు’గా గుర్తిస్తున్నట్టు తెలిపారు. ఈ మార్పు సానుకూల ఫలితాలనిస్తోందన్న ప్రధానమంత్రి.. సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి వేగం పెరిగిందని వివరించారు. ‘వైబ్రెంట్ విలేజెస్’ కార్యక్రమ విజయం జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరిచిందన్నారు. ఒక్క అరుణాచల్ ప్రదేశ్‌లోనే 450కి పైగా సరిహద్దు గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందాయి. రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్ వంటి అవసరమైన మౌలిక సదుపాయాలు ఇప్పుడు ఆ ప్రాంతాలకు అందుతున్నాయి. ఒకప్పుడు సరిహద్దు ప్రాంతాల నుంచి నగరాలకు వలస వెళ్లడం సర్వసాధారణంగా ఉండేదనీ.. ఇప్పుడు మాత్రం ఈ గ్రామాలే సరికొత్త పర్యాటక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యాటకానికి అపారమైన అవకాశాలున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కొత్త ప్రాంతాలకు అనుసంధానం విస్తరిస్తున్న కొద్దీ.. క్రమంగా పర్యాటకం పెరుగుతోందన్నారు. గడచిన దశాబ్ద కాలంలో అరుణాచల్ ప్రదేశ్‌ను సందర్శించే పర్యాటకుల సంఖ్య రెట్టింపవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అరుణాచల్ పర్యాటక బలం ఇక్కడి ప్రకృతికి, సంస్కృతికే పరిమితం కాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా సమావేశాలు, కన్సర్ట్ పర్యాటకానికి ఆదరణ పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో తవాంగ్‌లో ఏర్పాటు చేయబోతున్న ఆధునిక సమావేశ కేంద్రం రాష్ట్ర పర్యాటక రంగం దశాదిశలను మార్చనుందని శ్రీ మోదీ ప్రకటించారు. భారత ప్రభుత్వం ప్రారంభించిన ‘వైబ్రంట్ విలేజెస్’ కార్యక్రమం సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాలకు కీలకంగా నిలుస్తోందని, అరుణాచల్ అభివృద్ధికి ఇది విశేషంగా దోహదపడుతుందని అన్నారు.

 

ఢిల్లీ, ఈటానగర్ రెండుచోట్లా తమ ప్రభుత్వాలు పనిచేయడం వల్లే అరుణాచల్ ప్రదేశ్‌లో నేడు ఈ వేగవంతమైన అభివృద్ధి సాధ్యపడిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి శక్తి అభివృద్ధిలో ప్రతిబింబిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ పనుల ప్రారంభం, వైద్య కళాశాలల ఏర్పాటును ఆయన ఉదాహరించారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద అనేక మంది పౌరులు ఉచిత వైద్య చికిత్స పొందారని శ్రీ మోదీ చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో తమ ప్రభుత్వాల వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని ఆయన స్పష్టం చేశారు.

కేంద్రం, రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాల కృషి వల్లే వ్యవసాయం, ఉద్యానవన రంగంలో అరుణాచల్ ప్రదేశ్ గణనీయమైన పురోగతి సాధిస్తోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. కివీ, నారింజ, ఏలకులు, పైనాపిల్స్ వంటి స్థానిక ఉత్పత్తులు రాష్ట్రానికి కొత్త గుర్తింపును తెస్తున్నాయన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఈ ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనకారిగా ఉన్నట్టు స్పష్టంగా రుజువైందన్నారు.

తల్లులూ, అక్కాచెల్లెళ్లూ, బిడ్డలను సాధికారులను చేయడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా మూడు కోట్ల మంది ‘లాఖ్‌పతి దీదీల’ను తయారు చేయాలన్న తన లక్ష్యాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి పెమా ఖండూ, ఆయన బృందం ఈ మిషన్‌ను క్రియాశీలంగా ముందుకు తీసుకెళ్తోందంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక వర్కింగ్ విమెన్ హాస్టళ్ల ప్రారంభం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. యువతులకు ఇది ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. జీఎస్టీ పొదుపు ఉత్సవం పట్ల మరోసారి అభినందనలు తెలియజేస్తూ.. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలు వారిపై అమితమైన ప్రభావం చూపుతాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. నెలవారీ ఖర్చుల్లో కుటుంబాలకు ఇప్పుడు భారీ ఉపశమనం కలుగుతుందని తెలిపారు. వంటగది సామగ్రి, పిల్లలకు కావాల్సిన విద్యా సామగ్రి, పాదరక్షలు, దుస్తుల వంటి నిత్యావసర వస్తువుల ధరలు మరింత తగ్గాయని ప్రధానమంత్రి చెప్పారు.

2014కు ముందు సమయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని ప్రజలను కోరారు. ఆ సమయంలో ఎదుర్కొన్న అనేక సవాళ్లను ప్రస్తావించారు. ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉండేదని, పెద్దపెద్ద కుంభకోణాలు విపరీతంగా జరిగాయని, మరోవైపు నాటి ప్రభుత్వం ప్రజలపై పన్ను భారాన్ని పెంచుతూనే ఉండేదని ప్రధానమంత్రి గుర్తుచేశారు. రూ. 2 లక్షల వార్షికాదాయం కూడా ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చేదని, 2014కు ముందు అనేక ముఖ్యమైన వస్తువులపై 30 శాతానికి పైగా పన్ను విధించేవారని చెప్పారు.

 

ప్రజల ఆదాయం, పొదుపు రెండింటినీ పెంపొందించడానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన శ్రీ మోదీ.. చాలా ఏళ్లుగా ముఖ్య సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, తమ ప్రభుత్వం ఆదాయపు పన్ను రేట్లను ఎప్పటికప్పుడు తగ్గించిందని తెలిపారు. ఈ సంవత్సరం రూ. 12 లక్షల వరకు వార్షికాదాయంపై పన్నును పూర్తిగా తొలగించామన్నారు. ఇప్పుడు కేవలం రెండు శ్లాబులతో (5 శాతం, 18 శాతం) జీఎస్టీని సరళీకరించినట్టు ఆయన ప్రకటించారు. అనేక వస్తువులపై పన్నును పూర్తిగా తొలగించామని, మరిన్ని వస్తువులపై పన్నులు గణనీయంగా తగ్గాయని శ్రీ మోదీ తెలిపారు. ఇల్లు కట్టుకోవడం, స్కూటర్ లేదా బైక్ కొనుక్కోవడం, బయట భోజనం చేయడం, ప్రయాణం అన్నింటికీ వ్యయం మరింతగా తగ్గిందని ఆయన వివరించారు. జీఎస్టీ పొదుపు పండుగ ప్రజలకు ఓ చిరస్మరణీయ మైలురాయిగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు.

అరుణాచల్ ప్రదేశ్ దేశభక్తి స్ఫూర్తిని శ్రీ మోదీ ప్రశంసించారు. ఇక్కడి ప్రజలు ‘నమస్కారం’ కన్నా ముందు ‘జై హింద్’ చెబుతారని, స్వప్రయోజనాల కన్నా దేశాన్నే ఉన్నతంగా భావిస్తారని శ్రీ మోదీ చెప్పారు. అభివృద్ధి చెందిన భారత్‌గా నిలిచేందుకు దేశం సమష్టిగా కృషి చేస్తున్న ఈ తరుణంలో.. స్వావలంబనపై దేశంలో విశేష అంచనాలున్నాయన్నారు. స్వావలంబన సాధించినప్పుడే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందన్న ఆయన.. అందుకోసం ‘స్వదేశీ’ని మంత్రప్రదంగా భావించాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో తయారైన ఉత్పత్తులను మాత్రమే కొనడం, అమ్మడం అతి ముఖ్యమైన అంశమని చెబుతూ.. వాటిని స్వదేశీగా సగర్వంగా ప్రకటించుకోవాలని కోరారు. స్వదేశీ మంత్రాన్ని అవలంబించడం వల్ల దేశం, అరుణాచల్ ప్రదేశ్, మొత్తం ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి వేగవంతమవుతుందని పునరుద్ఘాటించారు. కొత్తగా అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

 

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ కె.టి. పర్నాయక్ (విశ్రాంత), అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ, కేంద్ర మంత్రి శ్రీ కిరణ్ రిజిజు, పలువురు విశిష్ట అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

ఈ ప్రాంతంలోని విస్తృతమైన జలవిద్యుత్ సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటూ, సుస్థిర పద్ధతుల్లో విద్యుదుత్పత్తిని ప్రోత్సహించేలా.. ఈటానగర్‌లో రూ.3,700 కోట్లకు పైగా విలువైన రెండు ప్రధాన జలవిద్యుత్ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. హియో జల విద్యుత్ ప్రాజెక్టు (240 మెగావాట్లు), టాటో-ఐ జల విద్యుత్ ప్రాజెక్టు (186 మెగావాట్లు)లను అరుణాచల్ ప్రదేశ్‌లోని సియోమ్ సబ్ బేసిన్‌లో అభివృద్ధి చేస్తారు.

తవాంగ్‌లో అత్యాధునిక సమావేశ కేంద్ర నిర్మాణానికి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. సరిహద్దు జిల్లా తవాంగ్‌లో 9,820 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కేంద్రం.. జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, సాంస్కృతిక ఉత్సవాలు, ప్రదర్శనల నిర్వహణ కోసం అత్యుత్తమ కేంద్రంగా ఉపయోగపడుతుంది. 1,500 మందికి పైగా ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ కేంద్రం.. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండడంతోపాటు ఈ ప్రాంత పర్యాటక, సాంస్కృతిక సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.

 

రవాణా, ఆరోగ్యం, అగ్నిమాపక భద్రత, వర్కింగ్ విమెన్ హాస్టళ్లు... ఇలా వివిధ రంగాలకు చెందిన రూ.1,290 కోట్లకు పైగా విలువైన పలు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇవి ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తాయని, జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయని, అనుసంధానాన్ని పెంచుతాయని భావిస్తున్నారు.

 

వాణిజ్య సౌలభ్యం, ఔత్సాహిక పరిశ్రమల కోసం అత్యంత అనుకూల వ్యవస్థను నెలకొల్పాలన్న తన లక్ష్యానికి అనుగుణంగా.. స్థానిక పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులు, పారిశ్రామిక ప్రతినిధులతో కూడా ప్రధానమంత్రి సంభాషించారు. ఇటీవలి జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణ ప్రభావంపై వారితో చర్చించారు. 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Sanand 2.0's swift semicon wave accelerates India's chip ambitions

Media Coverage

Sanand 2.0's swift semicon wave accelerates India's chip ambitions
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates successful candidates of Civil Services Examination, 2025
March 06, 2026

The Prime Minister, Shri Narendra Modi has congratulated all those who have successfully cleared the Civil Services Examination, 2025. He said that their dedication, perseverance and hard work have enabled them to achieve this significant milestone.

The Prime Minister noted that clearing the Civil Services Examination marks the beginning of an important journey of public service. He wished the successful candidates the very best as they embark on the path of serving the nation and fulfilling the aspirations of the people.

The Prime Minister also conveyed his message to those who may not have secured the desired outcome in the examination. He acknowledged that such moments can be difficult, but emphasised that this is only one step in a larger journey.

Highlighting that many opportunities lie ahead, both in future examinations and in the many avenues through in which individuals can contribute to the nation, the Prime Minister extended his best wishes to them for the road ahead.

The Prime Minister wrote on X;

“Congratulations to all those who have successfully cleared the Civil Services Examination, 2025. Their dedication, perseverance and hard work have led to this significant milestone.

Wishing them the very best as they embark on a journey of serving the nation and fulfilling the aspirations of the people.”

“To those who may not have secured the desired outcome in the Civil Services Examination, I understand that such moments can be difficult. However, this is only one step in a larger journey. Many opportunities lie ahead, both in future examinations and in the many avenues through which you can contribute to our nation. My best wishes for the road ahead.”