నాగర్నార్ వద్ద ‘ఎన్ఎండిసి’ స్టీల్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్ జాతికి అంకితం;
జగదల్పూర్ రైల్వే స్టేషన్ ఉన్నతీకరణకు శంకుస్థాపన;
రాష్ట్రంలో వివిధ రైలు-రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన.. జాతికి అంకితం;
తారోకి-రాయ్పూర్ ‘డెమూ’ రైలుకు పచ్చ జెండా;
“దేశంలోని ప్రతి రాష్ట్రం.. ప్రతి జిల్లా.. ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే వికసిత భారతం కల సాకారం”;
“వికసిత భారతం కోసం భౌతిక.. సామాజిక.. డిజిటల్ మౌలిక సదుపాయాలు భవిష్యత్తు అవసరాల మేరకు రూపొందాలి”;
“అతిపెద్ద ఉక్కు ఉత్పాదక రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ ప్రయోజనాలు పొందుతోంది”;
“బస్తర్లో తయారయ్యే ఉక్కు మన సైన్యాన్ని బలోపేతం చేస్తుంది.. రక్షణ ఎగుమతుల్లో భారతదేశ ప్రాధాన్యం కూడా బలంగా ఉంటుంది”;
“అమృత భారత్ స్టేషన్ యోజన’ కింద రాష్ట్రంలో 30కిపైగా స్టేషన్ల ఉన్నతీకరణ చేపట్టబడింది”;
“ఛత్తీస్గఢ్ జన జీవన సౌలభ్యం కోసం ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తోంది”;
“ఛత్తీస్గఢ్ ప్రగతి పయనానికి కేంద్ర ప్రభుత్వం తన మద్దతు కొనసాగిస్తుంది.. దేశ భవిష్యత్తును ఉజ్వలం చేయడంలో రాష్ట్రం తన వంతు పాత్ర పోషిస్తుంది”

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌, జగదల్‌పూర్‌లలో దాదాపు రూ.27,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప‌థ‌కాలను జాతికి అంకితం చేయడంతోపాటు మరికొన్నిటికి శంకుస్థాప‌న చేశారు. వీటిలో బస్తర్‌ జిల్లాలోని నాగర్నార్ వద్ద రూ.23,800 కోట్ల విలువైన ‘ఎన్ఎండిసి’ స్టీల్ లిమిటెడ్ స్టీల్ ప్లాంటుసహా పలు రైలు-రహదారి ప్రాజెక్టులున్నాయి. వీటితోపాటు తారోకీ-రాయ్‌పూర్‌ ‘డెమూ’ రైలును ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ- దేశంలోని ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి గ్రామం

 

అభివృద్ధి చెందితేనే వికసిత భారతం కల సాకారం కాగలదని స్పష్టం చేశారు. ఈ దిశగా సంకల్పించిన కార్యక్రమాలను పూర్తిచేయడంలో భాగంగా దాదాపు రూ.27,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఇవాళ శ్రీకారం చుట్టామని, ఇందుకుగాను రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలుపుతున్నానని ప్రధాని పేర్కొన్నారు.

   వికసిత భారతం కోసం భౌతిక, సామాజిక, డిజిటల్ మౌలిక సదుపాయాలన్నీ భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా రూపుదిద్దుకోవాలని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ఏడాది దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.10 లక్షల కోట్లు కేటాయించామని, మునుపటితో పోలిస్తే ఇది ఆరు రెట్లు అధికమని ఆయన వెల్లడించారు. రైలు, రోడ్డు, విమాన, విద్యుత్ ప్రాజెక్టులతోపాటు రవాణా, పేదలకు ఇళ్లు, విద్యా, ఆరోగ్య సంరక్షణ సంబంధిత రంగాల్లోనూ ఉక్కుకుగల ప్రాముఖ్యాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. ఉక్కు ఉత్పత్తిలో దేశాన్ని స్వయం సమృద్ధం చేయడానికి గడచిన తొమ్మిదేళ్లలో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు. తద్వారా “అతిపెద్ద ఉక్కు ఉత్పాదక రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్‌ ఎనలేని ప్రయోజనం పొందుతోంది” అన్నారు. ఈ మేరకు అత్యంత ఆధునిక ఉక్కు కర్మాగారాల్లో ఒకదాన్ని ఇవాళ నాగర్నార్‌లో ప్రారంభించిన సందర్భంగా ప్రధాని వివరించారు.

 

   ఈ ప్లాంటులో ఉత్పత్తయ్యే ఉక్కు దేశవ్యాప్తంగా మోటారు వాహన, ఇంజినీరింగ్, రక్షణ తయారీ తదితర రంగాలకు కొత్త శక్తినిస్తుందని ఆయన చెప్పారు. “బస్తర్లో తయారయ్యే ఉక్కు మన సైన్యాన్ని బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా రక్షణ ఎగుమతులకూ ఉత్తేజమిస్తుంది”  అని శ్రీ మోదీ అన్నారు. ఈ స్టీల్ ప్లాంటువల్ల బస్తర్, దాని పరిసర ప్రాంతాల్లోని సుమారు 50,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. మొత్తంమీద  “బస్తర్‌ వంటి ఆకాంక్షాత్మక జిల్లాల ప్రగతికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ఈ కొత్త ఉక్కు కర్మాగారం మరింత ఊపునిస్తుంది” అని ప్రధాని వ్యాఖ్యానించారు.

   అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వ నిశితంగా దృష్టి సారించిందని, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర పరిధిలో ఆర్థిక కారిడార్‌, ఆధునిక రహదారులు ఇందుకు నిదర్శనమని ప్రధానమంత్రి చెప్పారు. రైల్వే బడ్జెట్‌కు సంబంధించి 2014తో పోలిస్తే ఛత్తీస్‌గఢ్‌కు కేటాయింపులు నేడు 20 రెట్లు పెరిగాయని ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా స్వాతంత్ర్యానంతరం దశాబ్దాల తర్వాత తారోకీ ప్రాంతానికి కొత్త రైలుమార్గం కానుకగా లభించిందని చెప్పారు. ఈ మేరకు కొత్త ‘డెమూ’ రైలు తారోకీని దేశ రైలుమార్గాలతో అనుసంధానించిందని పేర్కొన్నారు. దీనివల్ల తారోకీ నుంచి రాష్ట్ర రాజధానికి రాయ్‌పూర్‌కు ప్రయాణం సులువు కాగలదని తెలిపారు. అలాగే జగదల్‌పూర్‌-దంతవాడ మార్గంలో రైలుమార్గం డబ్లింగ్‌ ద్వారా ప్రయాణ సౌలభ్యం కలగడంతోపాటు రవాణా వ్యయం కూడా తగ్గుతుందని వివరించారు.

 

   రాష్ట్రంలో రైలుమార్గాల విద్యుదీకరణ పనులు 100 శాతం పూర్తికావడంపై ప్రధాని హర్షం  ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లో నేడు వందే భారత్ రైలు కూడా నడుస్తోందని గుర్తుచేశారు. “అమృత భారత్ స్టేషన్ యోజన’ కింద రాష్ట్రంలో 30కిపైగా స్టేషన్ల ఉన్నతీకరణ చేపట్టబడింది. వీటిలో

ఇప్పటికే ఏడింటి పునర్నవీకరణకు శంకుస్థాపన చేశారు. అలాగే బిలాస్‌పూర్, రాయ్‌పూర్, దుర్గ్‌ సహా ఇవాళ జగదల్‌పూర్ స్టేషన్ కూడా ఈ జాబితాలో చేర్చబడింది” అని ప్రధాని తెలిపారు. “ఈ స్టేషన్లో ప్రయాణిక సౌకర్యాలు కూడా ఉన్నతీకరించబడతాయి. దీంతో రాబోయే రోజుల్లో జగదల్పూర్ స్టేషన్ నగర ప్రధాన కూడలిగా మారుతుంది. గత తొమ్మిదేళ్లలో రాష్ట్రంలోని 120కిపైగా స్టేషన్లలో ఉచిత వై-ఫై సదుపాయం కూడా కల్పించబడింది” అని ఆయన గుర్తుచేశారు.

   ఛత్తీస్‌గఢ్‌లో ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టులు రాష్ట్ర ప్రగతిని మరింత వేగిరపరుస్తాయని పేర్కొంటూ- “ఛత్తీస్గఢ్ ప్రజా జీవన సౌలభ్యం కోసం ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తోంది” అని శ్రీ మోదీ చెప్పారు. తదనుగుణంగా కొత్త పరిశ్రమలు ఏర్పాటుసహా ఉపాధి అవకాశాలు అందివస్తాయని తెలిపారు. చివరగా- ఛత్తీస్‌గఢ్‌ ప్రగతి పయనానికి కేంద్ర ప్రభుత్వం తన మద్దతు కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. తద్వారా దేశ భవిష్యత్తును ఉజ్వలం చేయడంలో రాష్ట్రం తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రగతిపై శ్రద్ధతో రాష్ట్రానికి ప్రతినిధిగా ఈ కార్యక్రమానికి హాజరైన గవర్నర్‌ శ్రీ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ తన ప్రసంగం ముగించారు. గవర్నర్‌తోపాటు స్థానిక పార్లమెంటు సభ్యుడు శ్రీ మోహన్ మాండవి,  తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

నేపథ్యం

   స్వయం సమృద్ధ భారతం దార్శనికతకు ఉత్తేజమిచ్చే దిశగా బస్తర్ జిల్లాలోని నాగర్నార్ వద్ద ‘ఎన్‌ఎండిసి’ స్టీల్ లిమిటెడ్ సంస్థ ఉక్కు ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. మొత్తం రూ.23,800 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన ఈ కొత్త ప్లాంటులో అత్యంత నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి అవుతుంది. దీనికి అనుబంధంగా ఏర్పడేవే కాకుండా ఇతరత్రా సహాయక పరిశ్రమలలో వేలాది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ కర్మాగారంతో ప్రపంచ ఉక్కు పటంలో బస్తర్‌ ప్రముఖ స్థానం పొందుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక ప్రగతికి ఊపు లభిస్తుంది.

 

   దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాల మెరుగుపై ప్రధాని దూరదృష్టికి అనుగుణంగా ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లో అనేక రైలు ప్రాజెక్టుల శంకుస్థాపనతోపాటు కొన్నిటిని ఆయన జాతికి అంకితం చేశారు. ఈ మేరకు అంతాగఢ్‌-తారోకీ కొత్త రైలు మార్గంతోపాటు జగదల్‌పూర్‌- దంతేవాడ రైలుమార్గం డబ్లింగ్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. అలాగే బోరిదండ్-సూరజ్‌పూర్ రైలుమార్గం డబ్లింగ్ ప్రాజెక్టుకు, అమృత భారత స్టేషన్ యోజన కింద జగదల్‌పూర్ స్టేషన్ పునర్నవీకరణకు ప్రధాని శంకుస్థాపన చేశారు. తారోకీ-రాయ్‌పూర్ ‘డెమూ’ రైలును పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైల్వే ప్రాజెక్టులతో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల అనుసంధానం ఎంతగానో మెరుగవుతుంది. రైల్వే మౌలిక సదుపాయాల మెరుగుదల, కొత్త రైలు ఫలితంగా స్థానిక ప్రజలకు ఎనలేని ప్రయోజనంతోపాటు ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటుంది.

   ఈ కార్యక్రమాల్లో భాగంగా జాతీయ రహదారి నం.43 పరిధిలో ‘కుంకూరి-ఛత్తీస్‌గఢ్-జార్ఖండ్ సరిహద్దు విభాగం దాకా రహదారి ఉన్నతీకరణ ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ కొత్త రహదారితో అనుసంధానం మెరుగుపడటంసహా ఇక్కడి ప్రజానీకానికి అన్నవిధాలా ప్రయోజనం లభిస్తుంది.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool

Media Coverage

How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 డిసెంబర్ 2025
December 20, 2025

Empowering Roots, Elevating Horizons: PM Modi's Leadership in Diplomacy, Economy, and Ecology