భారతదేశ అభివృద్ధి ప్రస్థానం, వాలీబాల్ క్రీడకు మధ్య అనేక పోలికలు: ప్రధాని
ఏ విజయాన్ని కూడా ఒంటరిగా సాధించలేమన్న విషయాన్ని నేర్పుతున్న వాలీబాల్: ప్రధాని
సమన్వయం, నమ్మకం, జట్టు సంసిద్ధతపై ఆధారపడి ఉన్న విజయం: ప్రధాని
ప్రతి ఒక్కరికీ తమదైన పాత్ర, బాధ్యత ఉంటుంది: ప్రధాని

 

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరుగుతున్న 72వ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్‌ను ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన క్రీడాకారులందరికీ స్వాగతం పలికి అభినందించడం పట్ల వారణాసి పార్లమెంటు సభ్యునిగా సంతోషంగా ఉందని తెలిపారు. నేటి నుంచి నగరంలో జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభమవుతోందని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులు ఎంతో కష్టపడి ఈ జాతీయ స్థాయి పోటీలకు వచ్చారని.. రాబోయే రోజుల్లో వారణాసి గడ్డపై వారి కృషికి పరీక్ష ఎదురుకానుందని ఆయన ఉద్ఘాటించారు. దేశంలోని 28 రాష్ట్రాల నుంచి జట్లు ఇక్కడకు చేరుకున్నాయని.. ఇది 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తోందని అభివర్ణించారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న వారందరికీ ప్రధాన మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

వారణాసి స్థానిక సామెతను గుర్తు చేసిన ప్రధానమంత్రి.. ఇప్పుడు క్రీడాకారులు వారణాసికి చేరుకున్నారని, త్వరలోనే ఈ నగరం గురించి వారు పూర్తిస్థాయిలో తెలుసుకుంటారని పేర్కొన్నారు. వారణాసి క్రీడా ప్రేమికుల నగరమని.. ఇక్కడ కుస్తీ, మల్లయుద్ధ ప్రాంగణాలు, బాక్సింగ్, పడవ పందాలు, కబడ్డీ వంటి క్రీడలకు విశేష ఆదరణ ఉందని ప్రధానంగా చెప్పారు. ఎందరో జాతీయ స్థాయి క్రీడాకారులను వారణాసి అందించిందన్న ఆయన.. రాష్ట్ర, జాతీయ స్థాయిలలో రాణించిన ప్రతిభావంతులైన క్రీడాకారులను బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, యూపీ కళాశాల, కాశీ విద్యాపీఠం వంటి సంస్థలు తయారు చేశాయని ఆయన కొనియాడారు. వేల సంవత్సరాలుగా జ్ఞానం, కళల అన్వేషణలో ఇక్కడికి వచ్చే వారందరికీ వారణాసి సాదరంగా స్వాగతం పలుకుతూనే ఉందని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ సమయంలో వారణాసిలో ఉత్సాహం ఉరకలెత్తుతుందన్న ఆయన.. క్రీడాకారులను ప్రోత్సహించే ప్రేక్షకులు వారికి తోడుగా ఉంటారని, వారణాసికి మాత్రమే సొంతమైన విశిష్ట అతిథి మర్యాదలు క్రీడాకారుల అనుభవంలోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 

వాలీబాల్ అనేది కేవలం ఒక సాధారణ క్రీడ మాత్రమే కాదన్న ప్రధాని.. ఇది సమతుల్యత, సహకారంతో కూడిన క్రీడ అని చెప్పారు. బంతి ఎప్పుడూ కింద పడకుండా పైనే ఉండేలా చేసే ప్రయత్నం క్రీడాకారుల పట్టుదలను తెలియజేస్తోందని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులను 'జట్టే ప్రథమం' అనే మంత్రం, బృంద స్ఫూర్తితో వాలీబాల్ అనుసంధానిస్తుందని ఆయన ఉద్ఘాటించారు. ప్రతి క్రీడాకారుడికి వేర్వేరు నైపుణ్యాలు ఉన్నప్పటికీ అందరూ తమ జట్టు విజయం కోసమే ఆడతారని ఆయన వివరించారు. భారత అభివృద్ధి ప్రస్థానం, వాలీబాల్ క్రీడకు మధ్య ఉన్న పోలికలను ప్రధాని ప్రస్తావించారు. ఏ విజయాన్ని కూడా ఒంటరిగా సాధించలేమన్న ఆయన.. పరస్పర సమన్వయం, నమ్మకం, జట్టు సంసిద్ధతపై విజయం ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని ఈ క్రీడ నేర్పుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరికీ తమదైన పాత్ర, బాధ్యత ఉంటుందని.. ప్రతి వ్యక్తి తన విధిని చిత్తశుద్ధితో నెరవేర్చినప్పుడే విజయం లభిస్తుందని అన్నారు. మన దేశం కూడా ఇదే రీతిలో పురోగమిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. స్వచ్ఛత నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు, 'తల్లి పేరు మీద ఒక చెట్టు' నుంచి వికసిత భారత్ కార్యక్రమం వరకు ప్రతి ఒక్కరూ, ప్రతి విభాగం, ప్రతి ప్రాంతం సామూహిక స్పృహతో 'దేశమే ప్రథమం' అనే స్ఫూర్తితో పని చేస్తున్నారని ఆయన వివరించారు.

భారత వృద్ధి, దేశ ఆర్థిక వ్యవస్థను నేడు ప్రపంచం కొనియాడుతోందన్న ప్రధాని.. ఈ పురోగతి కేవలం ఆర్థిక రంగానికి మాత్రమే పరిమితం కాలేదని క్రీడా మైదానంలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసంలో కూడా ఇది ప్రతిబింబిస్తోందని అన్నారు. 2014 నుంచి చూసుకుంటే ఇటీవలి సంవత్సరాల్లో వివిధ క్రీడల్లో భారత్ ప్రదర్శన నిరంతరంగా మెరుగైనట్లు ఆయన పేర్కొన్నారు. జెన్-జీ అథ్లెట్లు క్రీడా మైదానంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయటం చూస్తుంటే ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందన్నారు.

ప్రభుత్వం, సమాజం రెండూ క్రీడల పట్ల ఉదాసీనంగా ఉన్న కాలం గతంలో ఉండేదన్న ప్రధానమంత్రి.. దీనివల్ల భవిష్యత్తు గురించి క్రీడాకారులు అనిశ్చితికి లోనయ్యేవారని, చాలా తక్కువ మంది యువత క్రీడలను జీవితంగా ఎంచుకునేవారని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. గత దశాబ్ద కాలంలో క్రీడల పట్ల ప్రభుత్వం, సమాజానికి ఉన్న ఆలోచనా దృక్పథంలో మార్పు వచ్చిందని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. క్రీడల బడ్జెట్‌ను ప్రభుత్వం గణనీయంగా పెంచిందని, నేడు భారత క్రీడా వ్యవస్థ ‘క్రీడాకారుల కేంద్రీకృతం’గా మారిందని పేర్కొన్నారు. ప్రతి స్థాయిలో క్రీడాకారుల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతిభను గుర్తించడం, శాస్త్రీయ శిక్షణ, పోషకాహారం, పారదర్శక ఎంపికపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఆయన వివరించారు.

 

“నేడు దేశం సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌పై పయనిస్తోంది. ప్రతి రంగం, ప్రతి అభివృద్ధి లక్ష్యం దీనితో అనుసంధానమై ఉంది. క్రీడలు కూడా అందులో ఒకటి” అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. క్రీడా పాలన బిల్లు, ఖేలో భారత్ విధానం- 2025 వంటి ప్రభుత్వం చేపట్టిన ప్రధాన క్రీడారంగ సంస్కరణలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఇవి సరైన ప్రతిభావంతులకు అవకాశాలను కల్పిస్తాయని, క్రీడా సంస్థల్లో పారదర్శకతను పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ నిబంధనలు యువత క్రీడలు, విద్య రెండింటిలోనూ ఒకేసారి ముందుకు సాగడానికి ఉపయోగపడతాయని చెప్పారు. 

టాప్స్ వంటి కార్యక్రమాలు భారత్‌లోని క్రీడా వ్యవస్థను సమూలంగా మారుస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఇవి మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించటం, నిధులను సమకూర్చే యంత్రాంగాలు, యువ అథ్లెట్లకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును అందించడంపై దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో ఫిఫా అండర్-17 ప్రపంచ కప్, హాకీ ప్రపంచ కప్, ప్రధాన చెస్ టోర్నమెంట్‌లతో సహా పలు నగరాల్లో జరిగిన 20 కంటే ఎక్కువ ప్రధాన అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలకు భారత్ ఆతిథ్యం ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. “2030 కామన్వెల్త్ క్రీడలు భారత్‌లో జరగనున్నాయి. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు దేశం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కువ మంది క్రీడాకారులకు పోటీ పడటానికి మరిన్ని అవకాశాలను కల్పించడమే దీని లక్ష్యం” అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.

పాఠశాల స్థాయిలో కూడా యువ అథ్లెట్లకు ఒలింపిక్ క్రీడల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 'ఖేలో ఇండియా' కార్యక్రమం ద్వారా వందలాది మంది యువతకు జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం లభించిందని ఆయన అన్నారు. కేవలం కొన్ని రోజుల క్రితమే 'సంసద్ ఖేల్ మహోత్సవ్' ముగిసిందన్న ఆయన.. ఇందులో దాదాపు కోటి మంది యువత ప్రతిభను చాటుకున్నారని పేర్కొన్నారు. సంసద్ ఖేల్ మహోత్సవ్ సందర్భంగా వారణాసికి చెందిన సుమారు మూడు లక్షల మంది యువత మైదానంలో శక్తి సామర్థ్యాలను ప్రదర్శించటం పట్ల నియోజకవర్గ పార్లమెంటు సభ్యునిగా తాను గర్విస్తున్నట్లు తెలిపారు.

 

వారణాసి క్రీడా మౌలిక సదుపాయాల్లో వచ్చిన మార్పు స్థానిక క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నగరంలో అత్యాధునిక క్రీడా సౌకర్యాల అభివృద్ధి, వివిధ క్రీడల కోసం ప్రత్యేక స్టేడియంల నిర్మాణం జరుగుతోందని ఆయన చెప్పారు. కొత్తగా ఏర్పాటవుతున్న క్రీడా సముదాయాలు వారణాసి చుట్టుపక్కల ఉన్న జిల్లాల క్రీడాకారులకు కూడా శిక్షణ పొందే అవకాశాలను కల్పిస్తున్నాయని ఆయన ఉద్ఘాటించారు. ఈ క్రీడా కార్యక్రమం జరుగుతున్న సిగ్రా స్టేడియంలో ఇప్పుడు అనేక ఆధునిక వసతులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

వారణాసి నగరం పెద్ద ఎత్తున అంతర్జాతీయ, జాతీయ కార్యక్రమాల కోసం సిద్ధమవటం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ వాలీబాల్ పోటీల ద్వారా దేశ క్రీడా పటంలో వారణాసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకోవడం నగరానికి అత్యంత కీలకమని ఆయన ప్రముఖంగా చెప్పారు. ఈ ఛాంపియన్‌షిప్‌కు ముందు కూడా వారణాసి అనేక ముఖ్యమైన కార్యక్రమాలకు ఆతిథ్యం ఇచ్చిందని, ఇవి స్థానిక ప్రజలకు అవకాశాలను కల్పించడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని అన్నారు. జీ-20 సమావేశాలు, కాశీ తమిళ సంగమం - కాశీ తెలుగు సంగమం వంటి సాంస్కృతిక ఉత్సవాలు, ప్రవాసీ భారతీయ సమ్మేళనం, షాంఘై సహకార సంస్థ సాంస్కృతిక రాజధానిగా వారణాసి గుర్తింపు పొందటం వంటివి ఇందులో ఉన్నాయని తెలిపారు. వారణాసి సాధించిన విజయాల కిరీటంలో మరో మణిహారంలా ఈ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ ఇప్పుడు చేరిందని ఆయన అభివర్ణించారు. ఇటువంటి కార్యక్రమాలు వారణాసిని భవిష్యత్తులో మరిన్ని పెద్ద వేదికలకు ప్రధాన కేంద్రంగా మారుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం వారణాసిలో ఉన్న ఆహ్లాదకరమైన శీతల వాతావరణాన్ని, ఇక్కడి రుచికరమైన కాలానుగుణ ఆహార పదార్థాలను క్రీడాకారులు ఆస్వాదించాలని ప్రధానమంత్రి కోరారు. ముఖ్యంగా వారణాసి ప్రత్యేకత అయిన 'మలాయ్' రుచి చూడాలని ఆయన సూచించారు. కాశీ విశ్వనాథుని దర్శనం, గంగానదిలో పడవ ప్రయాణం, నగర వారసత్వాన్ని అనుభూతి చెందే జ్ఞాపకాలను కూడా తమతో పాటు తీసుకెళ్లాలని ఆయన క్రీడాకారులను కోరారు. టోర్నమెంట్‌లో క్రీడాకారులు అద్భుతంగా రాణించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపిన ఆయన ప్రసంగాన్ని ముగించారు. వారణాసి గడ్డపై నమోదయ్యే ప్రతి స్పైక్, బ్లాక్, పాయింట్ భారత క్రీడా ఆశయాలను మరింత ఎత్తుకు తీసుకెళ్తాయని ఆశిస్తున్నట్లు తెలిపిన ఆయన అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఉత్తర‌ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

జనవరి 4 నుంచి 11 వరకు జరుగుతున్న ఈ 72వ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్‌లో దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు పాల్గొననున్నారు. వివిధ రాష్ట్రాలు, సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 58 జట్ల నుంచి 1,000 మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడుతున్నారు. భారతీయ వాలీబాల్‌లో ఉన్నత ప్రమాణాలతో కూడిన పోటీ, క్రీడా స్ఫూర్తి, ప్రతిభను ఈ టోర్నమెంట్ ప్రదర్శిస్తుందని భావిస్తున్నారు. 

72వ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్‌కు వారణాసి ఆతిథ్యం ఇవ్వటం నగరంలో క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, క్రీడాకారుల అభివృద్ధిని ప్రోత్సహించే అంశానికి పెరుగుతున్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ఇది ప్రధాన జాతీయ కార్యక్రమాలకు కేంద్రంగా నగరానికి ఉన్న గుర్తింపును మరింత పెంపొందించడమే కాకుండా ముఖ్యమైన సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలకు ఆతిథ్యం ఇవ్వడంలో వారణాసికి ఉన్న పాత్ర పెరగటాన్ని ప్రతిబింబిస్తోంది.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Railways to operate over 300 special trains for Jagannath Rath Yatra, 100 for Onam: Ashwini Vaishnaw

Media Coverage

Railways to operate over 300 special trains for Jagannath Rath Yatra, 100 for Onam: Ashwini Vaishnaw
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the strength of courage and resilience
July 08, 2026

The Prime Minister, Shri Narendra Modi said that courage is the greatest strength of a nation. He noted that it inspires the country to remain united even in the face of difficult challenges and to move steadily towards progress, prosperity and self-reliance.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“चलन्ति गिरयः कामं युगान्तपवनाहताः।

कृच्छ्रेऽपि न चलत्येव धीराणां निश्चलं मनः।। ”

The Subhashitam conveys that even mountains, lashed by tempestuous winds, are shaken and set in motion at the time of dissolution; yet amid the gravest trials, the mind of the steadfast remains unwavering and undisturbed.

The Prime Minister wrote on X;

“धैर्य किसी राष्ट्र की सबसे बड़ी शक्ति है। इससे कठिन चुनौतियों के बीच भी देश को एकजुट रहने के साथ ही प्रगति, समृद्धि और आत्मनिर्भरता की दिशा में निरंतर आगे बढ़ने की प्रेरणा मिलती है।

चलन्ति गिरयः कामं युगान्तपवनाहताः।

कृच्छ्रेऽपि न चलत्येव धीराणां निश्चलं मनः।।”