భారత సహకార రంగ విస్తరణ కోసం ప్రపంచ సహకార సంస్థలతో భాగస్వామ్యం అవసరాన్ని స్పష్టం చేసిన ప్రధానమంత్రి
ఎగుమతి మార్కెట్లపై ప్రత్యేక దృష్టితో సహకార సంస్థల ద్వారా సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించాలి: ప్రధానమంత్రి
సహకార రంగంలో వ్యవసాయం, సంబంధిత కార్యకలాపాలను విస్తరించడానికి అగ్రిస్టాక్ ను ఉపయోగించాలని ప్రధాన మంత్రి సూచన
ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడానికి యుపిఐని రూపే కెసిసి కార్డులతో అనుసంధానించడంలోని ప్రాముఖ్యతను వివరించిన ప్రధానమంత్రి
పాఠశాలలు, విద్యాసంస్థల్లో సహకార కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిన ప్రధాని
సమావేశంలో చర్చించిన జాతీయ సహకార విధానం 2025 ముసాయిదాతో ‘సహకార్ సే సమృద్ధి' దార్శనికత సాకారం
మహిళలు, యువతకు ప్రాధాన్యతనిస్తూ గ్రామీణ ఆర్థికాభివృద్ధిని వేగవంతంపై దృష్టిసారించనున్న జాతీయ సహకార విధానం

సహకార రంగం పురోగతిని సమీక్షించడానికి ఈ రోజు 7 ఎల్ కేఎంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షత వహించారు. ఈ రంగంలో సాంకేతిక పురోగతి ద్వారా మార్పు తీసుకువచ్చే "సహకార్ సే సమృద్ధి"ని ప్రోత్సహించడం, సహకార సంఘాలలో యువత,  మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రణాళికలు, సహకార మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు.

భారత సహకారరంగాన్ని విస్తరించడానికి ప్రపంచ సహకార సంస్థలతో భాగస్వామ్యాల అవసరాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎగుమతి మార్కెట్లపై దృష్టి సారించాలని, వ్యవసాయ పద్ధతులను మెరుగుపరిచేందుకు సహకార సంఘాల ద్వారా భూసార పరీక్ష నమూనాను అభివృద్ధి చేయాలని సూచించారు. ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడానికి యుపిఐని రూపే కెసిసి కార్డులతో అనుసంధానం చేయవలసిన అవసరాన్ని కూడా ప్రధాన మంత్రి వివరించారు. సహకార సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ తప్పనిసరి అని అన్నారు. 

పారదర్శకత కోసం సహకార సంస్థల ఆస్తుల వివరాలను నమోదు చేయడం ఎంత అవసరమో కూడా ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పారు. సహకార వ్యవసాయాన్ని సుస్థిర వ్యవసాయ నమూనాగా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అలాగే, రైతులకు మెరుగైన సేవలను అందించేలా వ్యవసాయం, సంబంధిత కార్యకలాపాలను విస్తరించడానికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (అగ్రిస్టాక్)ను ఉపయోగించాలని ఆయన సిఫార్సు చేశారు. విద్యకు సంబంధించి పాఠశాలలు, కళాశాలలు, ఐఐఎంలలో సహకార కోర్సులను ప్రవేశపెట్టాలని, అలాగే భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేలా విజయవంతమైన సహకార సంస్థలను ప్రోత్సహించాలని ప్రధాన మంత్రి ప్రతిపాదించారు. యువ గ్రాడ్యుయేట్లకు సహకారం అందించేలా ప్రోత్సహించాలని, సహకార సంస్థలకు పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇవ్వాలని, తద్వారా పోటీని, వృద్ధిని ఏకకాలంలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

ఈ భేటీలో జాతీయ సహకార విధానం, గత మూడున్నరేళ్లలో సహకార మంత్రిత్వ శాఖ సాధించిన కీలక విజయాల గురించి ప్రధానికి వివరించారు. 'సహకర్ సే సమృద్ధి' దార్శనికతకు అనుగుణంగా మంత్రిత్వ శాఖ విస్తృత సంప్రదింపుల ప్రక్రియ ద్వారా జాతీయ సహకార విధానం -  2025 ముసాయిదాను రూపొందించింది. సహకార రంగంలో క్రమబద్ధమైన, సమగ్ర మైన అభివృద్ధిని సులభతరం చేయడం, గ్రామీణ ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడంపై దృష్టి పెట్టడం, అదే సమయంలో మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇవ్వడం- జాతీయ సహకార విధానం 2025 లక్ష్యం. ఇది సహకార ఆధారిత ఆర్థిక నమూనాను ప్రోత్సహించడం, చట్టపరంగా బలమైన, సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాక, ఈ విధానం క్షేత్రస్థాయిలో సహకార సంఘాల ప్రభావాన్ని,  దేశ సమగ్ర అభివృద్ధిలో సహకార రంగం పాత్రను గణనీయంగా పెంచడానికి ప్రయత్నిస్తుంది.

ప్రారంభం నుండి, సహకార ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి, బలోపేతం చేయడానికి మంత్రిత్వ శాఖ ఏడు కీలక రంగాలలో 60 పైగా కార్యక్రమాలను అమలు చేసింది. ఇందులో జాతీయ సహకార డేటాబేస్, కంప్యూటరీకరణ ప్రాజెక్టుల ద్వారా సహకార సంస్థల డిజిటలైజేషన్, ప్రాధమిక వ్యవసాయ రుణ సంఘాల (పిఎసి) బలోపేతం ముఖ్యమైనవి. ఇంకా, సహకార చక్కెర కర్మాగారాల సామర్థ్యం, సుస్థిరతను మెరుగుపరిచేందుకు మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా కృషి చేసింది.

పీఏసీఎస్ స్థాయిలో 10కి పైగా మంత్రిత్వ శాఖల నుంచి 15కు పైగా పథకాలను సమన్వయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాలకు వివిధ పథకాలను అమలు చేసింది. ఫలితంగా సహకార వ్యాపారాల్లో వైవిధ్యం, అదనపు ఆదాయ కల్పన, సహకార సంఘాలకు పెరిగిన అవకాశాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల లభ్యత మెరుగుపడింది. ఈ సహకార సంఘాల ఏర్పాటుకు వార్షిక లక్ష్యాలను కూడా నిర్దేశించారు. సహకార విద్య, శిక్షణ, పరిశోధనలను ప్రోత్సహించడానికి, నైపుణ్యం కలిగిన నిపుణులను అందించడానికి, ఐఆర్ఎంఎ ఆనంద్ ను "త్రిభువన్ కోఆపరేటివ్ యూనివర్శిటీ" గా మార్చడానికి,  దానిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా చేయడానికి ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

సహకార సంఘాల ఎదుగుదల, వివిధ రంగాల్లో వాటి కీలక పాత్ర గురించి ఈ సందర్భంగా ప్రధానికి వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక సమ్మిళితంలో సహకార రంగం పాత్రను ప్రముఖంగా పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ జనాభాలో ఐదో వంతు మంది సహకార రంగంతో సంబంధం కలిగి ఉన్నారని, ఇందులో 30కి పైగా రంగాలకు చెందిన 8.2 లక్షలకు పైగా సహకార సంస్థలు ఉన్నాయని, 30 కోట్ల మందికి పైగా సభ్యత్వం కలిగి ఉన్నారని సమావేశంలో ప్రస్తావించారు. ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాల్లో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశిష్ కుమార్ భూటానీ,  ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.కె.మిశ్రా, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ-2 శ్రీ శక్తికాంత దాస్,  ప్రధానమంత్రి సలహాదారు శ్రీ అమిత్ ఖారే, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi pitches India as stable investment destination amid global turbulence

Media Coverage

PM Modi pitches India as stable investment destination amid global turbulence
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 జనవరి 2026
January 12, 2026

India's Reforms Express Accelerates: Economy Booms, Diplomacy Soars, Heritage Shines Under PM Modi