ఆర్య సమాజ 150వ వార్షికోత్సవం ఏ ఒక్క సమూహానికో, వర్గానికో చెందిన ఘట్టం కాదు..
ఇది దేశ వైదిక అస్తిత్వంతో బలంగా ముడిపడి ఉన్న వేడుక
నిస్సంకోచంగా భారతీయతా సారాన్ని చాటి.. ప్రాచుర్యం కల్పించిన ఆర్య సమాజం
స్వామి దయానందుడు గొప్ప దార్శనికుడు, మహనీయుడు

న్యూఢిల్లీలోని రోహిణిలో ఈ రోజు జరిగిన అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళనం 2025ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ మాట్లాడుతూ.. ఇంతకుముందు విన్న మంత్రాల శక్తిని అందరూ ఇంకా అనుభూతి చెందుతున్నారన్నారు. తానెప్పుడు ఈ సమావేశాలకు వచ్చినా.. దివ్యమైన, అసాధారణ అనుభవం కలుగుతుందని వ్యాఖ్యానించారు. స్వామి దయానందుడి ఆశీస్సుల వల్లే ఈ భావన ఎల్లవేళలా సాధ్యమవుతోందన్నారు. స్వామి దయానందుడి ఆదర్శాలు పూజనీయమైనవన్నారు. అక్కడున్న చింతనాపరులందరితో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ అనుబంధం వల్లే వారిలో ఒకరిగా ఉండే అవకాశం తనకు ఎన్నోసార్లు దక్కుతోందన్నారు. వారిని కలిసి, మాట్లాడినప్పుడల్లా.. ఏదో తెలియని శక్తి ఆవహిస్తుందని, తనలో ప్రేరణ లభిస్తోందని వ్యాఖ్యానించారు.

గతేడాది గుజరాత్‌లోని మహర్షి దయానంద సరస్వతి జన్మస్థలంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీడియో సందేశం ద్వారా పాల్గొన్నట్లు శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. అంతకుముందు, ఢిల్లీలో మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి వేడుకలను కూడా ఆయన ప్రారంభించారు. వేద మంత్రాల శక్తిని కొనియాడారు. పవిత్ర హవన క్రతువులు నిన్ననే జరిగాయా అన్నంత పరిశుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

 

అంతకుముందు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వారంతా మహర్షి దయానంద సరస్వతి ద్విశత జయంత్యుత్సవాలను రెండేళ్ల పాటు ‘విచార యజ్ఞ’గా కొనసాగించాలని సంకల్పించిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. నిరంతరాయమైన ఈ మేధో నివేదన పూర్తి కాలం కొనసాగడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమయంలో చేపట్టిన కార్యక్రమాల పట్ల ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందుతోందని శ్రీ మోదీ చెప్పారు. ఆర్య సమాజ 150వ వార్షికోత్సవాల సందర్భంగా నేడు మరోసారి మనఃపూర్వక నివాళి అర్పించే అవకాశం తనకు లభించిందన్నారు. స్వామి దయానంద సరస్వతి పాదాల వద్ద ప్రణమిల్లి నివాళి అర్పించారు. ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్మారక నాణేన్ని, పోస్టల్ స్టాంపును విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నానన్నారు.

‘‘ఆర్య సమాజ 150వ వార్షికోత్సవం ఏ ఒక్క సమూహానికో, వర్గానికో సంబంధించిన ఘట్టం కాదు.. దేశ వైదిక అస్తిత్వంతో బలంగా అనుసంధానమైన వేడుక ఇది’’ అని ప్రధానమంత్రి అన్నారు. గంగా వాహినిలా స్వీయ శుద్ధి శక్తి గల భారతీయ తాత్విక సంప్రదాయంతో ఇది అనుసంధానమై ఉందని వ్యాఖ్యానించారు. ఆర్య సమాజం ఎప్పటికప్పుడు ముందుకు తెచ్చిన గొప్ప సామాజిక సంస్కరణా పరంపరే ఈ కార్యక్రమానికి మూలాధారమని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ ఉద్యమం ఎందరో స్వాతంత్ర్య సమరయోధులకు సైద్ధాంతిక బలాన్నిచ్చిందన్నారు. లాలా లజపతి రాయ్, అమరుడు రాంప్రసాద్ బిస్మిల్ వంటి అనేక మంది ఉద్యమకారులు ఆర్య సమాజం నుంచి ప్రేరణ పొంది.. స్వాతంత్ర్య పోరాటానికి పూర్తిగా అంకితమయ్యారన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో ఆర్య సమాజ పాత్రకు రాజకీయ కారణాల వల్లే తగిన గుర్తింపు రాలేదని ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు.

 

మొదటి నుంచీ ఆర్య సమాజం అంకితభావం కలిగిన దేశభక్తుల సంస్థగా ఉందని శ్రీ మోదీ గుర్తుచేశారు. ‘‘ఆర్య సమాజం భారతీయతా సారాన్ని నిస్సంకోచంగా ప్రవచించి, ప్రచారం చేసింది’’ అన్నారు. భారత వ్యతిరేక భావజాలాలు, విదేశీ సిద్ధాంతాలను రుద్దే ప్రయత్నాలు, విభజన మనస్తత్వాలు, సాంస్కృతిక నిర్మాణాన్ని కలుషితం చేసే ప్రయత్నాలు... వీటన్నింటినీ ముందుండి నిలబడి ఆర్య సమాజం సవాలు చేసిందన్నారు. ఆర్య సమాజ 150వ వార్షికోత్సవం సందర్భంగా.. సమాజం, దేశం రెండూ ఇంత గొప్పగా, అర్థవంతంగా... దయానంద సరస్వతి ఆదర్శాలను స్మరించుకోవడంపై ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

మతపరమైన జాగరణ ద్వారా చరిత్ర గమనానికి కొత్త దిశానిర్దేశం చేసిన స్వామి శ్రద్ధానంద వంటి ఆర్య సమాజ పరిశోధకులను స్మరించుకుంటూ.. ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి అలాంటి మహనీయుల శక్తి, ఆశిస్సులు సంపూర్ణంగా ఉన్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆ వేదికపై నుంచి అసంఖ్యాకులైన మహనీయులకు ప్రణమిల్లి.. వారిని స్మరించుకున్నారు.

భారత్ అనేక విధాల ప్రత్యేకమైనదనీ.. ఈ భూమి, నాగరికత, వైదిక సంప్రదాయం యుగయుగాలుగా శాశ్వతంగా నిలిచాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కొత్త సవాళ్లు తలెత్తినప్పుడల్లా, కాలం కొత్త ప్రశ్నలను లేవనెత్తినప్పుడల్లా.. వాటికి తగిన పరిష్కారాలతో ఓ మహనీయుడు అవతరిస్తాడని స్పష్టం చేశారు. సమాజానికి మార్గనిర్దేశం చేయడానికి ఎవరో ఒక ఋషి, దార్శనికుడు లేదా పండితుడు ఎల్లప్పుడూ ముందుకొస్తారని ఆయన పేర్కొన్నారు. స్వామి దయానంద సరస్వతి ఆ గొప్ప సంప్రదాయానికి చెందిన మహర్షి అని ప్రధానమంత్రి అన్నారు. శతాబ్దాల బానిసత్వం దేశాన్ని, సమాజాన్ని ఛిన్నాభిన్నం చేసిన వలస పాలన కాలంలో స్వామి దయానందుడు జన్మించారని శ్రీ మోదీ గుర్తు చేశారు. ఆలోచన, విచారం స్థానంలో మూఢనమ్మకాలు, సామాజిక దురాచారాలు వచ్చి చేరాయనీ, వలస పాలనను సమర్థించుకోవడం కోసం బ్రిటిష్ వారు భారతీయ సంప్రదాయాలు, నమ్మకాలను కించపరిచారని అన్నారు. ఆ పరిస్థితుల్లో నూతన, మౌలిక భావనలను వ్యక్తీకరించే ధైర్యాన్ని సమాజం కోల్పోయిందన్నారు. ‘‘ఈ క్లిష్ట సమయంలోనే ఓ యువ సన్యాసి అవతరించాడు. ఎక్కడో హిమాలయ సానువుల్లో, కఠినతర భూభాగాల్లో తీవ్రమైన ఆధ్యాత్మిక సాధన చేస్తూ.. కఠోర తపస్సుతో తనను తాను పరీక్షించుకున్నాడు. అక్కడినుంచి తిరిగొచ్చి న్యూనతా భావంలో చిక్కుకున్న భారతీయ సమాజాన్ని కదిలించాడు. మొత్తం బ్రిటీష్ యంత్రాంగమంతా భారతీయ అస్తిత్వాన్ని మరుగున పరచాలని చూస్తున్న వేళ, సామాజిక ఆదర్శాలు క్షీణిస్తున్న తరుణంలో, ఆధునికతే నైతికతగా చిత్రీకరిస్తున్న సమయంలో... ‘వేదాలకు తిరిగి వెళ్లండి’ అంటూ నిశ్చయుడై పిలుపునిచ్చాడీ మహర్షి’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. వలస పాలన కాలంలో అణచివేసిన జాతీయ చైతన్యాన్ని తిరిగి జాగృతం చేసిన అసాధారణ వ్యక్తిగా స్వామి దయానందుడిని ప్రధానమంత్రి అభివర్ణించారు.

 

భారత్ పురోగమించాలంటే వలస పాలన శృంఖలాలను తెంచుకోవడం మాత్రమే సరిపోదనీ, భారతీయ సమాజాన్ని బంధించిన సంకెళ్లను కూడా తెంచుకోవాల్సిన అవసరం ఉందని స్వామి దయానందుడు అవగతం చేసుకున్న తీరును శ్రీ మోదీ వివరించారు. దయానందుడు కుల వివక్షను, అంటరానితనాన్ని స్పష్టంగా తిరస్కరించారని శ్రీ మోదీ చెప్పారు. నిరక్షరాస్యతకు వ్యతిరేకంగా ప్రచారాన్ని లేవనెత్తి.. వేదాలు, గ్రంథాల వ్యాఖ్యానాలను వక్రీకరించే వారికి ఎదురు నిలిచారన్నారు. విదేశీ కథనాలను ఎదుర్కొని నిలిచి, శాస్త్రార్థ సాంప్రదాయక అభ్యాసం ద్వారా సత్యం వైపు నిలబడ్డారని తెలిపారు. వ్యక్తిగత, సామాజిక అభివృద్ధి రెండింటిలోనూ మహిళల కీలక పాత్రను గుర్తించి.. మహిళలను ఇంటికే పరిమితం చేసే సంకుచిత మనస్తత్వాన్ని సవాలు చేసిన దార్శనిక ఋషిగా స్వామి దయానందుడిని ప్రధానమంత్రి అభివర్ణించారు. ఆయన ప్రేరణతో ఆర్య సమాజ పాఠశాలలు బాలికలకు విద్యను అందించడం ప్రారంభించాయి. జలంధర్‌లో మొదలైన బాలికల పాఠశాల అనతికాలంలోనే పూర్తి స్థాయి మహిళా కళాశాలగా అభివృద్ధి చెందింది. ఆర్య సమాజ సంస్థల్లో విద్యాభ్యాసం చేసిన లక్షలాది మంది భారత కుమార్తెలు నేడు దేశ పునాదిని బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్త వేదికపైనే ఉన్నారనీ.. రెండు రోజుల కిందటే భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము స్క్వాడ్రన్ లీడర్ శివంగి సింగ్‌తో కలిసి రాఫెల్ యుద్ధ విమానంలో ప్రయాణించారని శ్రీ మోదీ గుర్తు చేశారు. నేడు భారత కుమార్తెలు యుద్ధ విమానాలు నడుపుతున్నారని, ‘డ్రోన్ దీదీలు’గా ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో మహిళా సైన్సు గ్రాడ్యుయేట్లు భారత్‌లోనే ఉన్నారని గర్వంగా పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు నాయకత్వ పాత్రలు పోషించడం పెరుగుతోందన్నారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక పరిశోధన సంస్థల్లోని మహిళా శాస్త్రవేత్తలు మంగళయాన్, చంద్రయాన్, గగన్‌యాన్ వంటి అంతరిక్ష కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని శ్రీ మోదీ చెప్పారు. దేశం సరైన మార్గంలో పురోగమిస్తోందనేందుకు, స్వామి దయానందుడి కలలు నెరవేరుతున్నాయనేందుకు ఈ విప్లవాత్మక మార్పులు నిదర్వనమని ఆయన స్పష్టం చేశారు.

స్వామి దయానందుడి ఓ విశిష్ట ఆలోచన తనకు తరచూ గుర్తొస్తుందని, ఎప్పుడూ దానిని ఇతరులకూ చెప్తుంటానని ప్రధానమంత్రి చెప్పారు. ‘‘తక్కువగా తీసుకుని, ఎక్కువ ఇచ్చేవారే నిజంగా పరిణితులు’’ అని స్వామిజీ అన్నారు. ఈ కొన్ని పదాల్లోనే ఎంతో లోతైన జ్ఞానం ఉందని, వాటిని వ్యాఖ్యానించాలంటే బహుశా పుస్తకాలెన్నో రాయొచ్చని ఆయన అన్నారు. ఒక ఆలోచన యథార్థమైన బలం దాని అర్థంలో మాత్రమే ఉండదనీ.. అది ఎంతకాలం కొనసాగుతుంది, ఎన్ని జీవితాలను మారుస్తుందన్న దానిపైనే దాని శక్తి ఆధారపడి ఉంటుందని శ్రీ మోదీ అన్నారు. ఈ ప్రాతిపదికలపై మహర్షి దయానందుడి ఆలోచనలను పరిగణిస్తే, అంకితభావంతో కృషి చేసే ఆర్య సమాజ అనుచరులను గమనిస్తే... ఆయన భావనలు కాలక్రమేణా మరింత జ్వాజ్వల్యమానంగా మారినట్టు స్పష్టమవుతోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. 

 

స్వామి దయానంద సరస్వతి పరోపకారిణి సభను స్థాపించడం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. స్వామీజీ నాటిన విత్తనం గురుకుల్-కంగ్రి, గురుకుల్-కురుక్షేత్ర, ‘డీఏవీ’ తదితర విద్యా కేంద్రాలతో శాఖోపశాఖలతో విశాల వృక్షంగా ఎదిగిందని, ఇవన్నీ నేడు తమతమ రంగాల్లో శ్రద్ధగా కృషి చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దేశం సంక్షోభంలో పడినప్పుడల్లా ఆర్య సమాజ సభ్యులు నిస్వార్థంగా తోటి పౌరుల సేవకు తమనుతాము అంకితం చేసుకున్నారని వివరించారు. దేశ విభజన విషాద సమయంలో సర్వస్వం కోల్పోయి భారత్‌కు వచ్చిన శరణార్థులకు చేయూత, పునరావాసం, విద్యాసౌలభ్య కల్పనలో ఆర్య సమాజం పోషించిన కీలక పాత్రను శ్రీ మోదీ ప్రస్తావించారు. ఇది చరిత్రలో పాతుకుపోయిన సత్యమని, అంతేకాకుండా నేటికీ ప్రకృతి వైపరీత్యాల సమయాన బాధితుల సేవలో ఆర్య సమాజం ముందంజలో ఉందన్నారు.

ఆర్య సమాజం విస్తృత సేవలలో భారత గురుకుల సంప్రదాయ పరిరక్షణ అత్యంత కీలకమైనదని స్పష్టం చేశారు. ఒకనాటి శక్తిమంతమైన గురుకులాల వల్లనే జ్ఞానం-విజ్ఞాన శాస్త్రాల్లో భారత్‌ శిఖరాగ్రాన నిలిచిందని శ్రీ మోదీ గుర్తు చేశారు. వలస పాలన కాలంలో ఈ వ్యవస్థపై ఉద్దేశపూర్వక దాడుల ఫలితంగా అపార జ్ఞానం నాశనమైందని పేర్కొన్నారు. పర్యవసానంగా విలువలు క్షీణించి, నవతరం బలహీనపడిందని తెలిపారు. గురుకుల సంప్రదాయం ఇలా కుప్పకూలుతున్న వేళ దాని పరిరక్షణకు ఆర్య సమాజం నడుం బిగించిందన్నారు. సంప్రదాయ పరిరక్షణతోపాటు ఆధునిక విద్యను ఏకీకృతం చేయడం ద్వారా కాలక్రమంలో దాన్ని మరింత మెరుగుపరిచిందని చెప్పారు. ఇప్పుడు జాతీయ విద్యా విధానం దేశంలో విలువలతో కూడిన విద్యను వ్యక్తిత్వ వికాసంతో తిరిగి అనుసంధానిస్తోందని తెలిపారు. భారత పవిత్ర జ్ఞాన సంప్రదాయాన్ని కాపాడిన ఆర్య సమాజానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.

“కృణ్వంతో విశ్వం ఆర్యం” అనే వేద శ్లోకాన్ని ఉటంకిస్తూ- “యావత్‌ ప్రపంచాన్ని ఉన్నతీకరించి, సమున్నత దృక్పథం దిశగా నడిపిద్దాం” అని శ్రీ మోదీ పిలుపునిచ్చారు. ఇదే శ్లోకాన్ని స్వామి దయానంద స్థాపించిన ఆర్య సమాజం తన మార్గదర్శక నినాదంగా స్వీకరించిందని ఆయన గుర్తుచేశారు. ఈ శ్లోకమే నేడు భారత ప్రగతి ప్రయాణానికి పునాది మంత్రంగా పనిచేస్తున్నదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత్‌ పురోగమనం ప్రపంచ సంక్షేమానికి దోహదం చేయడమేగాక దేశ శ్రేయస్సు మొత్తం మానవాళికి సేవలందిస్తుందని చెప్పారు. సుస్థిర ప్రగతికి సంబంధించి భారత్‌ నేడు ప్రపంచ ప్రధాన గళంగా రూపొందిందని ఆయన పేర్కొన్నారు. వేద విజ్ఞానం వైపు తిరిగి మళ్లాలన్న స్వామీజీ పిలుపును ఉటంకిస్తూ- తదనుగుణంగా అంతర్జాతీయ వేదికపై వేదకాలపు ఆదర్శాలు, జీవనశైలికి భారత్‌ ప్రాచుర్యం కల్పిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు ‘మిషన్ లైఫ్’ ప్రారంభానికి ప్రపంచం స్పందించిన తీరును ఆయన ఉదాహరించారు. అలాగే “ఒకే సూర్యుడు-ఒకే ప్రపంచం-ఒకే గ్రిడ్” దృక్కోణం ద్వారా భారత్‌ ఇవాళ కాలుష్య రహిత ఇంధనోత్పాదనను ప్రపంచ ఉద్యమంగా మలుస్తున్నదని చెప్పారు. ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా మనదైన యోగాభ్యాసం 190 దేశాలకు చేరువైందని, జీవన విధానాన్ని, పర్యావరణ చైతన్యాన్ని యోగా విస్తృతంగా ప్రోత్సహిస్తున్నదని ఆయన గుర్తుచేశారు.

‘మిషన్ లైఫ్’ వంటి అంతర్జాతీయ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు. అయితే, అవన్నీ ఆర్య సమాజ సభ్యుల క్రమశిక్షణాయుత జీవితాల్లో ఎప్పటినుంచో అంతర్భాగంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. సరళ జీవనం, సేవా విలువలు, సంప్రదాయ భారత వస్త్రధారణకు ప్రాధాన్యం, పర్యావరణంపై శ్రద్ధ, భారతీయ సంస్కృతికి ప్రోత్సాహంపై వారి నిబద్ధతను ఆయన ప్రశంసించారు. “సర్వే భవన్తు సుఖినః” అనే ఆదర్శంతో ప్రపంచ సంక్షేమానికి భారత్‌ కృషి చేస్తున్నపుడు, ప్రపంచ సౌభ్రాత్రంతో తన పాత్రను బలోపేతం చేసుకుంటున్నప్పుడు ఆర్య సమాజంలోని ప్రతి సభ్యుడు సహజంగానే ఈ లక్ష్యంతో సమన్వయం చేసుకుంటారని ఆయన ప్రకటించారు. ఈ దిశగా వారు పోషిస్తున్న పాత్రను హృదయపూర్వకంగా కొనియాడుతూ అభినందించారు.

 

స్వామి దయానంద సరస్వతి ఆదర్శాలు ఆర్య సమాజం ద్వారా గత 150 ఏళ్లుగా సమాజానికి మార్గనిర్దేశం చేస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. నవ్య దృక్పథాన్ని కొనసాగించడం, ప్రగతికి అవరోధం కల్పించే కఠిన సంప్రదాయాలను తోసిపుచ్చడం అనే గురుతర కర్తవ్య భావనను స్వామీజీ మనందరిలో నింపారని తెలిపారు. ఆర్య సమాజ నుంచి తనకు లభించిన ప్రేమ, మద్దతును ప్రస్తావిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మాత్రమేగాక కొన్ని అభ్యర్థనలు చేయడానికి తాను వచ్చినట్లు పేర్కొన్నారు.

దేశ పురోగమనానికి ఆర్య సమాజం ఇప్పటికే తనవంతు తోడ్పాటునిచ్చిందని శ్రీ మోదీ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో దేశ ప్రస్తుత ప్రాథమ్యాలలో కొన్నింటిని పునరుద్ఘాటిస్తున్నానని చెప్పారు. ఆర్య సమాజంతో తన చారిత్రక అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ స్వదేశీ ఉద్యమాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ మేరకు స్వదేశీని ప్రోత్సహించే బాధ్యతను దేశం మరోసారి స్వీకరించి,  స్థానికం కోసం నినాదం వినిపిస్తున్నదని పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో ఆర్య సమాజం పాత్ర మరింత కీలకం కాగలదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

భారత ప్రాచీన రాతప్రతుల సంరక్షణ, డిజిటలీకరణ లక్ష్యంగా ఇటీవల ‘జ్ఞాన భారతం మిషన్‌’ను ప్రారంభించామని ఈ సందర్భంగా ప్రధానమంత్రి గుర్తుచేశారు. యువతరం దీని ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుని, అనుసంధానమైతేనే ఈ విస్తృత జ్ఞాన భాండాగార సంరక్షణ సాధ్యమని స్పష్టం చేశారు. గత 150 ఏళ్లుగా ఆర్య సమాజం పవిత్ర ప్రాచీన గ్రంథాల అన్వేషణ, సంరక్షణలో నిమగ్నమై ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో జ్ఞాన భారతం మిషన్‌లోనూ చురుగ్గా పాలుపంచుకోవాలని శ్రీ మోదీ ఆర్య సమాజ సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ గ్రంథాల వాస్తవికత పరిరక్షణలో ఆర్య సమాజంలోని తరతరాల సభ్యుల కృషిని ఆయన ప్రశంసించారు. జ్ఞాన భారతం మిషన్ ఇప్పుడు ఈ కృషిని జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని, దీన్ని తమ సొంత కార్యక్రమంగా పరిగణించాలని ఆర్య సమాజాన్ని కోరారు. ఈ మేరకు తమ గురుకులాలు, సంస్థల ద్వారా రాతప్రతుల అధ్యయనం, పరిశోధనలో యువత పాలుపంచుకునేలా చూడాలని సూచించారు.

మహర్షి దయానంద్ 200వ జయంతి సందర్భంగా యజ్ఞాలలో వాడే ధాన్యాల గురించి తాను మాట్లాడటాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. యజ్ఞాలలో చిరుధాన్యాల (శ్రీ అన్న) సంప్రదాయక పవిత్ర ప్రాధాన్యాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు భారత ప్రాచీన ‘శ్రీ అన్న’ సంప్రదాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సహజంగా పండటమన్నది ఈ ధాన్యాల ముఖ్య లక్షణాలలో ఒకటని ఆయన అన్నారు. ప్రకృతి వ్యవసాయం ఒకప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం కాగా, ప్రపంచం నేడు మరోసారి దాని ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నదని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంలోని ఆర్థిక-ఆధ్యాత్మిక కోణాలపై అవగాహన పెంచాలని ఆర్య సమాజానికి ఆయన సూచించారు.

 

జల సంరక్షణ అంశాన్ని ప్రస్తావిస్తూ- ప్రతి గ్రామానికీ సురక్షిత తాగునీటి సరఫరా కోసం జల్ జీవన్ మిషన్ ద్వారా దేశం కృషి చేస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేక కార్యక్రమాల్లో ఒకటని అభివర్ణించారు. అయితే, భవిష్యత్తరం అవసరాల దృష్టితో జల సంరక్షణ ద్వారానే నీటి సరఫరా వ్యవస్థలు ప్రభావశీలం కాగలవని ఆయన స్పష్టం చేశారు. ఈ లక్ష్యంతోనే ప్రభుత్వం బిందు సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నదని, తదనుగుణంగా దేశమంతటా 60,000కు పైగా అమృత సరోవరాల తవ్వకం చేపట్టిందని వివరించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కృషికి ఆర్య సమాజం చురుగ్గా మద్దతివ్వాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

ఒకనాడు ప్రతి గ్రామంలో చెరువులు, సరస్సులు, బావులు, మెట్ల బావులు సంప్రదాయకంగా ఉండేవని ప్రధానమంత్రి గుర్తుచేశారు. కాలక్రమేణా ఇవన్నీ నిర్లక్ష్యానికి గురై, ఎండిపోయాయని శ్రీ మోదీ అన్నారు. ఈ సహజ వనరుల రక్షణపై నిరంతర ప్రజావగాహన అవసరమని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా చేపట్టిన “ఏక్ పేడ్ మా కే నామ్” కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. ఇది స్వల్పకాలిక కార్యక్రమం కాదని, అటవీకరణ దిశగా నిర్విరామ ఉద్యమమని కూడా ప్రధానమంత్రి పేర్కొన్నారు. వీలైనంత ఎక్కువ సంఖ్యలో ప్రజానీకాన్ని దీనితో అనుసంధానించాలని ఆయన ఆర్య సమాజ సభ్యులకు సూచించారు.

“సంఘచ్ఛధ్వం సంవాదధ్వం సం వో మనాంసి జనతం” అనే వేద శ్లోకాన్ని ప్రధానమంత్రి ఉటంకించారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఆలోచనలను పరస్పరం పంచుకోవడం, కలసి చర్చించుకోవడం, సమష్టిగా ముందుకు సాగడం ఎలాగో ఇది నేర్పుతుందని తెలిపారు. ఈ వేద ప్రార్థనను కార్యాచరణకు జాతీయ పిలుపుగానూ పరిగణించాలని ఆయన పేర్కొన్నారు. దేశ సంకల్పాలను ప్రతి ఒక్కరూ తమవిగా స్వీకరించాలని, జన భాగస్వామ్య స్ఫూర్తితో సమష్టి కృషిని కొనసాగించాలని శ్రీ మోదీ కోరారు. ఆర్య సమాజం ఈ స్ఫూర్తిని గత 150 సంవత్సరాల నుంచి స్థిరంగా అనుసరిస్తున్నదని, అది నిరంతరం బలోపేతం కావాలని ఆకాంక్షించారు. మహర్షి దయానంద సరస్వతి ఆలోచనలు మానవ సంక్షేమానికి సదా పథనిర్దేశం చేస్తూనే ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు. ఆర్య సమాజం 150 సంవత్సరాల వేడుక సందర్భంగా అందరికీ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతితోపాటు ఆర్య సమాజం 150 ఏళ్లుగా చేస్తునన సమాజ సేవను స్మరిస్తూ నిర్వహించిన జ్ఞానజ్యోతి ఉత్సవంలో ‘ఇంటర్నేషనల్‌ ఆర్య సమ్మిట్-2025 ఓ కీలక కార్యక్రమం.

మహర్షి దయానంద సంస్కరణవాద ఆదర్శాల సార్వత్రిక ఔచిత్యంతోపాటు ప్రపంచవ్యాప్తంగా సంస్థ విస్తరణను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది. భారత్‌ సహా వివిధ దేశాల్లోని ఆర్య సమాజ శాఖల ప్రతినిధులందరూ ఒకచోట చేరే వేదికగా ఇది రూపొందింది. ఈ సందర్భంగా విద్య, సామాజిక సంస్కరణలు, ఆధ్యాత్మిక అభ్యున్నతిలో ఆర్య సమాజం ప్రగతిశీల పరిణామాన్ని ప్రదర్శించే “150 స్వర్ణ సంవత్సరాల సేవ” పేరిట ప్రదర్శనను కూడా నిర్వహించారు.

మహర్షి దయానంద సరస్వతి సంస్కరణవాద, విద్యా వారసత్వాలను గౌరవించడంతోపాటు విద్య, సామాజిక సంస్కరణలు, దేశ ప్రగతిలో ఆర్య సమాజం 150 ఏళ్ల పాత్రను స్మరిస్తూ, వికసిత భారత్-2047కు తగినట్లు వేద సూత్రాలు, స్వదేశీ విలువలపై అవగాహన దిశగా ప్రపంచానికి స్ఫూర్తినివ్వడం ఈ సదస్సు లక్ష్యం.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
WEF Davos: Industry leaders, policymakers highlight India's transformation, future potential

Media Coverage

WEF Davos: Industry leaders, policymakers highlight India's transformation, future potential
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the importance of grasping the essence of knowledge
January 20, 2026

The Prime Minister, Shri Narendra Modi today shared a profound Sanskrit Subhashitam that underscores the timeless wisdom of focusing on the essence amid vast knowledge and limited time.

The sanskrit verse-
अनन्तशास्त्रं बहुलाश्च विद्याः अल्पश्च कालो बहुविघ्नता च।
यत्सारभूतं तदुपासनीयं हंसो यथा क्षीरमिवाम्बुमध्यात्॥

conveys that while there are innumerable scriptures and diverse branches of knowledge for attaining wisdom, human life is constrained by limited time and numerous obstacles. Therefore, one should emulate the swan, which is believed to separate milk from water, by discerning and grasping only the essence- the ultimate truth.

Shri Modi posted on X;

“अनन्तशास्त्रं बहुलाश्च विद्याः अल्पश्च कालो बहुविघ्नता च।

यत्सारभूतं तदुपासनीयं हंसो यथा क्षीरमिवाम्बुमध्यात्॥”