ఉగ్రవాద కార్యకలాపాలు ఇక పరోక్ష యుద్ధం కాదు, అవి ప్రణాళికాబద్ధమైన వ్యూహాలు.. వాటికి అదే రీతిలో బదులిస్తాం
· ‘వసుధైవ కుటుంబం’ మన విశ్వాసం, ఎవ్వరితోనూ శతృత్వాన్ని కోరుకోం
· పురోగమిస్తాం.. ప్రపంచ శ్రేయస్సుకూ పాటుపడతాం
· 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్, ఇందులో రాజీ లేదు.. ప్రపంమంతా ‘వికసిత భారత్’ను ప్రశంసించేలా వందేళ్ల స్వాతంత్ర్య వేడుకలు
· పట్టణ ప్రాంతాలు మనకు వృద్ధి కేంద్రాలు
· దాదాపు రెండు లక్షల అంకుర సంస్థలు: వాటిలో చాలావరకు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే, అందునా ఎక్కువగా మహిళల నేతృత్వంలోనే...
· పెనుమార్పులను తేగల సమర్థత మనది.. ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు 140 కోట్ల ప్రజానీకం బాధ్యత

గుజరాత్ పట్టణాభివృద్ధిని చాటే 20 ఏళ్ల వేడుకనుద్దేశించి గాంధీనగర్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. పట్టణాభివృద్ధి సంవత్సరం- 2005కు ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా పట్టణాభివృద్ధి సంవత్సరం-2025ను ఆయన ప్రారంభించారు. సమావేశాన్నుద్దేశించి ప్రసంగిస్తూ.. వడోదర, దాహోద్, భుజ్, అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో పర్యటన సందర్భంగా ఆపరేషన్ సిందూర్ విజయ గర్జనలు, రెపరెపలాడుతున్న మువ్వెన్నెల పతాకాలతో వెల్లివిరుస్తున్న దేశభక్తిని రెండు రోజులుగా ఆస్వాదిస్తున్నానన్నారు. ఈ కనువిందైన దృశ్యం ఒక్క గుజరాత్‌కే పరిమితం కాలేదనీ.. భారత్ నలుమూలలా, ప్రతి భారతీయుడి హృదయమూ ఇదే రకమైన భావనతో ఉప్పొంగుతోందని ఆయన పేర్కొన్నారు. “ఉగ్రవాదమనే కంటకాన్ని నిర్మూలించాలని సంకల్పించిన భారత్ దృఢ నిశ్చయంతో దానిని నెరవేర్చింది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

దేశాన్ని మూడు భాగాలుగా విభజించిన వెంటనే 1947లోనే భారత్‌పై జరిగిన తొలి ఉగ్ర దాడి జరిగిందని శ్రీ మోదీ గుర్తుచేశారు. ఓ భాగంలో పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిందని విమర్శించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)ను తిరిగి స్వాధీనం చేసుకునే వరకు భారత సైన్యం ఆగవద్దన్న సర్దార్ పటేల్ లక్ష్యాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అయితే ఆ సమయంలో పటేల్ సలహాను పాటించలేదన్నారు. ఈ ఉగ్రవాద వారసత్వమే 75 ఏళ్లుగా కొనసాగుతోందని, పహల్గాం దాడి దాని వికృత రూపమేనని శ్రీ మోదీ పేర్కొన్నారు. దౌత్యపరమైన చర్యలతోపాటు యుద్ధంలో భారత సైనిక శక్తినీ ఎప్పటికప్పుడు పాకిస్థాన్ చవిచూస్తోందన్నారు. మూడు సార్లూ భారత సాయుధ దళాలు పాకిస్థాన్‌ను నిశ్చయాత్మకంగా ఓడించాయని, ప్రత్యక్ష సైనిక పోరాటంలో ఆ దేశం విజయం సాధించలేదని దీంతో స్పష్టమైందని అన్నారు. బలహీనతను అంగీకరించిన పాక్ పరోక్ష యుద్ధానికి పాల్పడిందని శ్రీ మోదీ అన్నారు. సైనిక తరహా శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్‌లో చొరబడి.. తీర్థయాత్రలకు వచ్చినవారినీ, నిరాయుధులైన అమాయక పౌరులనూ లక్ష్యంగా చేసుకున్నారని ఆయన వివరించారు.

 

భారత సాంస్కృతిక విలువలు అత్యున్నతమైనవన్నారు. ప్రపంచమంతటినీ కుటుంబంగా భావించే వసుధైక కుటుంబమే మన తాత్వికత అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. శతాబ్దాలుగా ఇదే సంప్రదాయాన్ని నిలబెట్టుకుంటున్న భారత్ పొరుగు దేశాలతో శాంతియుత, సామరస్యపూర్వక సంబంధాలనే కాంక్షిస్తుందని పేర్కొన్నారు. భారత్ ఎప్పుడూ శాంతిని, స్థిరత్వాన్నే కోరుకుంటుందనీ.. కానీ పదే పదే ఎదురవుతున్న సవాళ్లతో, వాటిని సమర్థంగా తిప్పికొట్టడం అనివార్యంగా మారిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. గతంలో పిలిచే పరోక్ష యుద్ధాల తీరు ప్రస్తుతం, ముఖ్యంగా మే 6 సంఘటనల అనంతరం మారిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి పరిణామాలను గమనిస్తే ఆ చర్యలను పరోక్ష యుద్ధమని చెప్పడం పొరపాటే అన్నారు. ఇకపై ఇది కేవలం పరోక్ష యుద్ధం మాత్రమే కాదనీ.. ఉద్దేశపూర్వకంగా పాకిస్థాన్ చేపట్టిన సైనిక వ్యూహంగా ఇటీవలి సంఘటనలతో తేటతెల్లమైందని స్పష్టం చేశారు. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను గుర్తించి, పూర్తి పారదర్శకతతో, దేశీయంగా ఎలాంటి సందేహానికీ తావులేకుండా కెమెరా చిత్రీకరణతో 22 నిమిషాల్లోనే భారత్ వాటిని తుడిచిపెట్టిందని ఆయన తెలిపారు. మే 6 నాటి చర్యల అనంతరం పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల అంత్యక్రియలు పూర్తి గౌరవలాంఛనాలతో జరిగాయని, వారి శవపేటికలను జాతీయ జెండాలతో కప్పారని, ఆ దేశ సైన్యమూ సెల్యూట్ చేసిందని ఆయన ఎత్తిచూపారు. ఇవి కేవలం ఉగ్రవాద కార్యకలాపాలే కాదని, నిర్మాణాత్మక యుద్ధ విధానంలో భాగమని చెప్పడానికి ఆ చర్యలు స్పష్టమైన సంకేతాలుగా ఉన్నాయన్నారు. అలాంటి చర్యలకు పాల్పడితే నిశ్చయాత్మకంగా స్పందిస్తామని స్పష్టం చేశారు.

సంక్షోభ సమయాల్లో ఆపన్నహస్తాన్ని అందిస్తూ.. అందరి పురోగతిని, సంక్షేమాన్నే భారత్ ఎల్లప్పుడూ కాంక్షించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అయినా భారత్ చాలావరకు హింసాత్మక ప్రతీకార చర్యలను ఎదుర్కొన్నదని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా దేశం ఎలా నిర్లక్ష్యానికి గురయిందో యువతతరం గుర్తించాలని కోరారు. నిలిపివేసిన సింధూ నదీ జలాల ఒప్పందం గురించి మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్‌లో జల వనరులకు సంబంధించిన అంశాలను ప్రధానమంత్రి ఎత్తిచూపారు. నదులపై ఆనకట్టలు నిర్మించినప్పటికీ, సరైన నిర్వహణ లేకుండా, పూడిక తీయకుండా అరవై ఏళ్లుగా వాటిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. నీటి నియంత్రణ కోసం ఉద్దేశించిన గేట్లు తెరవకుండానే ఉంచారని, దీనివల్ల పూర్తి వినియోగ స్థాయి నుంచి కేవలం రెండూ మూడు శాతానికే నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయబద్ధమైన నీటి వాటా భారతీయులకు దక్కాలని స్పష్టం చేశారు. మరియు ఇంకా ముఖ్యమైన చర్యలు తీసుకోవలసి ఉన్నప్పటికీ, ప్రారంభ చర్యలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఈ దిశగా చర్యలు ఇప్పుడే మొదలయ్యాయని, ఇంకా విశేషమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

ఎలాంటి శత్రుత్వాన్నీ భారత్ వాంఛించదనీ.. శాంతి, శ్రేయస్సులనే దేశం కోరుకుంటోందని స్పష్టం చేసిన శ్రీ మోదీ.. పురోగతికీ, అంతర్జాతీయ శ్రేయస్సుకూ దేశం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. భారత్ తన ప్రజల సంక్షేమానికి దృఢ సంకల్పంతో కట్టుబడి ఉందన్నారు. మే 26వ తేదీని ప్రస్తావిస్తూ, 2014లో తాను ప్రధానమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉంది. కోవిడ్-19పై పోరాటం, పొరుగు దేశాలతో ఇబ్బందులు, ప్రకృతి వైపరీత్యాల వంటి సవాళ్లను దేశం ఎదుర్కొన్నదన్నారు. ఎన్ని అడ్డంకులున్నా భారత్ శరవేగంగా ఆర్థిక వృద్ధిని సాధించి 11 నుంచి నాలుగో స్థానానికి ఎదిగిందని వివరించారు. దేశ అభివృద్ధి లక్ష్యాన్ని, పురోగతిపట్ల అచంచలమైన నిబద్ధతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. తన మూలాలు గుజరాత్‌లోనే ఉన్నాయని గుర్తుచేసుకుంటూ.. ఇక్కడ పెరిగిన తాను ఎన్నో పాఠాలు, విలువలూ నేర్చుకున్నానన్నారు. తమ ఆకాంక్షలను నెరవేర్చగలనన్న నమ్మకాన్ని ప్రజలు తనపై ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వారి అభ్యున్నతి కోసం శ్రద్ధాసక్తులతో పనిచేస్తూనే ఉంటానని ప్రతినబూనారు.

 

పట్టణాభివృద్ధిపట్ల గుజరాత్ ప్రభుత్వ అంకితభావంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఈ కార్యక్రమాన్ని 2005లో ప్రారంభించిందని, ఇప్పుడు ఈ పురోగతికి రెండు దశాబ్దాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. విజయోత్సవాలకే పరిమితం కాకుండా, గత 20 ఏళ్ల అనుభవాలతో తర్వాతి తరం కోసం భవిష్యత్ కేంద్రీకృతంగా తగిన పట్టణాభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వం రూపొందించిందని ఆయన వివరించారు. ఇప్పుడు గుజరాత్ ప్రజల ముందుంచిన ఈ ప్రణాళిక సుస్థిర పురోగతి దిశగా నిర్మాణాత్మక లక్ష్యాలను సూచిస్తుందన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పట్టణాభివృద్ధి వ్యూహాన్ని రూపొందించడంలో అంకితభావంతో కృషిచేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, వారి బృందాన్ని ఆయన అభినందించారు.

భారత గణనీయమైన ఆర్థిక వృద్ధిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. అంతర్జాతీయ పోటీదారులను అధిగమించడం గర్వకారణమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆరు నుంచి అయిదో స్థానానికి చేరుకున్న వేళ దేశ ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఉత్సాహం వెల్లివిరిసిందని గుర్తుచేసుకున్నారు. బ్రిటన్ వలస పాలనలో ఉన్న భారత్ ఆ దేశాన్ని అధిగమించడం చరిత్రాత్మకమైన విజయమని శ్రీ మోదీ చెప్పారు. ప్రస్తుతం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌పై.. త్వరలో మూడో స్థానానికి చేరుకోవాల్సిన బాధ్యత మరింత పెరుగుతోందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందని, వందేళ్ల స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకుని సంపన్నమైన, శక్తిమంతమైన దేశంగా అంతర్జాతీయ గుర్తింపును పొందుతుందని ఆయన పునరుద్ఘాటించారు. స్వాతంత్ర్యోద్యమాన్ని ప్రస్తావిస్తూ.. భగత్ సింగ్, రాజ్‌గురు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వీర సావర్కర్, శ్యామ్‌జీ కృష్ణవర్మ, మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ వంటి నాయకుల త్యాగాలను శ్రీ మోదీ వివరించారు. నాటి 25-30 కోట్ల ప్రజలు దృఢనిశ్చయులై పోరాడి ఉండకపోతే.. 1947లో స్వాతంత్ర్యం సాధ్యం కాకపోయి ఉండేదేమో అన్నారు. గత తరాలు 20-35 ఏళ్లలో వలస పాలకులను తరిమికొట్టగలిగాయని, నేడు 140 కోట్ల ప్రజానీకం వచ్చే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన భారత్ స్వప్నాన్ని సాకారం చేసుకోగలరని ఆయన స్పష్టం చేశారు. 2035ను దృష్టిలో ఉంచుకుని గుజరాత్ 75వ వార్షికోత్సవానికి ప్రణాళికలు రూపొందించడం అత్యావశ్యకమని శ్రీ మోదీ పేర్కొన్నారు. పరిశ్రమలు, వ్యవసాయం, విద్య, క్రీడల వంటి రంగాలలో రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఇప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాలని ఆయన ప్రముఖంగా సూచించారు. దేశ వృద్ధి పథానికి అనుగుణంగా గుజరాత్ పురోగతి ఉండేలా సమష్టి సంకల్పంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2036 లో ఒలింపిక్స్ నిర్వహించాలన్న భారత ఆకాంక్షలను కూడా ఆయన ప్రస్తావించారు. అంతర్జాతీయ నేతృత్వం దిశగా భారత సంసిద్ధతను ఇది స్పష్టం చేస్తోంది.

రాష్ట్రంగా ఏర్పడిననప్పటి నుంచి గుజరాత్ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రధానమంత్రి వివరించారు. మొదట్లో రాష్ట్ర భౌగోళిక, ఆర్థిక పరిమితులను ఎత్తిచూపుతూ గుజరాత్ అభివృద్ధి సమర్థతపై చాలామంది సందేహాలు లేవనెత్తారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఉప్పు ఉత్పత్తికి పేరు పొందిన గుజరాత్ రాష్ట్రం నేడు వజ్రాల పరిశ్రమలో అంతతర్జాతీయంగా అగ్రగామిగా ఉందన్నారు. నిర్మాణాత్మక ప్రణాళిక, వ్యూహాత్మక కార్యక్రమాలే ఈ విజయానికి కారణమన్నారు. పాలనపరమైన సవాళ్లను కూడా ప్రధానమంత్రి చర్చించారు. ప్రభుత్వ విభాగాలు విడివిడిగా ఉండడం చాలావరకు పురోగతికి ఆటంకం కలిగిస్తుందన్నారు. ప్రభుత్వ విభాగాల సమష్టి కృషితో కూడిన విధానం అత్యావశ్యకమని, అందులో అన్ని మంత్రిత్వ శాఖల నడుమ సమర్థమైన సహకారానికి అవకాశముంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 2005లో పట్టణాభివృద్ధి, మరో ఏడాది బాలికల విద్య, మరో దశలో పర్యాటకం వంటి కేంద్రీకృత కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఆయా సంవత్సరాలను కేటాయించిన గుజరాత్ నమూనాను ఆయన ఉదాహరించారు. ‘కుచ్ దిన్ తో గుజారో గుజరాత్ మే’ కార్యక్రమాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. పర్యాటక రంగానికి ఊతమివ్వడంలో ఇది దోహదపడింది. దీని ద్వారా సోమనాథ్, ద్వారక, అంబాజీ వంటి క్షేత్రాలు విశేషంగా అభివృద్ధి చెందాయి. పట్టణాభివృద్ధిలో, ముఖ్యంగా అహ్మదాబాద్ విషయంలో తన అనుభవాలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. అక్కడ రవాణా విస్తరణకు మొదట్లో ప్రతిఘటన ఎదురైందన్నారు. అహ్మదాబాద్‌లో ఎర్ర బస్సులను నగరం బయటా తిరిగేలా చేయడానికి ప్రయత్నించగా మొదట్లో అధికారుల నుంచీ, రాజకీయపరంగానూ అడ్డంకులు ఎదురయ్యాయని.. కానీ పట్టుదలతో ముందుకెళ్లడంతో మౌలిక సదుపాయాలు విశేషంగా అభివృద్ధి చెందాయని వివరించారు. అదేవిధంగా నగరవ్యాప్త అభివృద్ధి కోసం ఆక్రమణలను తొలగించడంలో ఎదురైన సవాళ్లను వివరించారు. మొదట్లో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందనీ, అయితే ప్రయోజనాలను చూసిన తర్వాత వారే విస్తృతంగా మద్దతిచ్చారని తెలిపారు.

 

గుజరాత్‌లో పట్టణ పునరుద్ధరణ చర్యలకు ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థుల నుంచి, మీడియా నుంచి ఎదురైన విస్తృత ప్రతిఘటనను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. అయితే, సమగ్రతతో, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా నాయకులు నిర్ణయాలు తీసుకుంటే.. దీర్ఘకాలిక ఫలితాలే వాటిని ధ్రువీకరిస్తాయని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగులుతాయన్న భయం మొదట్లో ఉన్నప్పటికీ, పట్టణాల్లో సమూల మార్పుల దిశగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో ఎన్నికల్లో విజయాలతోపాటు విస్తృతమైన ప్రశంసలు కూడా లభించాయని శ్రీమోదీ చెప్పారు. నిరంతర పురోగతిపట్ల భారత నిబద్ధతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. నాలుగో స్థానం నుంచి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్‌పై అంచనాలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ ఆశయాలను దృఢ సంకల్పంతో కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

జనాభా పెరిగి విస్తరించడం కన్నా.. ఆర్థిక వృద్ధికి నిలయాలుగా పట్టణ కేంద్రాలు ఎదగాలని చెబుతూ.. “ఆర్థిక కార్యకలాపాలకు నగరాలు క్రియాశీలమైన కేంద్రాలుగా ఉండాలి, మార్పు దిశగా పురపాల సంస్థలు ప్రభావవంతమైన ప్రణాళికలు రూపొందించుకోవాల” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా మున్సిపల్, మెట్రోపాలిటన్ అధికారులు తమ నగరాల కోసం ఆర్థిక వృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన కోరారు. స్థానిక ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిని అంచనా వేసి, ఏడాది లోపు దానిని మెరుగుపరచడానికి వ్యూహాలను రూపొందించాలని, ఇందుకోసం తయారీ వస్తువుల నాణ్యతను మెరుగుపరచడంతోపాటు ఆర్థిక కార్యకలాపాలకు కొత్త మార్గాలను గుర్తించడంపై దృష్టి సారించాలని శ్రీ మోదీ సూచించారు. కేవలం వాణిజ్య సముదాయాలను నిర్మించడం కన్నా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు పట్టణ సంస్థలు చేయూతనివ్వాలని, స్థానిక మార్కెట్లలో వాటి విలువను మరింత పెంచేలా కార్యక్రమాల అమలు కోసం సమగ్ర అధ్యయనాలు నిర్వహించాలని పేర్కొన్నారు. సాంప్రదాయకంగా పెద్ద పరిశ్రమలు మెట్రోపాలిటన్ ప్రాంతాల చుట్టూ పెరుగుతున్నప్పటికీ, దాదాపు రెండు లక్షల అంకుర సంస్థలు చాలావరకు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే ఉండడం విశేషమైన మార్పును సూచిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. వీటిలో చాలావరకు మహిళల నేతృత్వంలోనే ఉన్నాయని గర్వంగా ప్రకటించారు. ఆర్థిక, వ్యవస్థాపక విప్లవంలో ఇదొక విశేషమైన పరిణామమని పేర్కొన్నారు. విద్య, క్రీడల్లో కూడా ఇదే పురోగతిని గమనించవచ్చని శ్రీ మోదీ చెప్పారు. పట్టణ ఆర్థిక వ్యవస్థలో మార్పులపై దృష్టి సారించడం వల్ల నాలుగో స్థానం నుంచి మూడో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత ప్రయాణం వేగవంతమవుతుందన్నారు. ఈ విజయాన్ని సాధించడంలో స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడం కీలకమని పునరుద్ఘాటించారు.  

పటిష్టమైన పాలనా నమూనా అవసరాన్ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. కొన్ని శక్తులు పాతుకుపోయిన మనస్తత్వాలతో చారిత్రాత్మకంగా భారతదేశ సామర్థ్యాన్ని బలహీనపరచడానికి ప్రయత్నించాయని, సైద్ధాంతిక వ్యతిరేకత తరచూ అభివృద్ధి విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటనకు దారితీసిందని, ప్రతి కార్యక్రమాన్ని విమర్శించడం ఒక అలవాటుగా మారిపోయిందని ఆయన అన్నారు. పట్టణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించిన ఆయన, పరిపాలనలోని అడ్డంకులను అధిగమించడానికి ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమాన్ని (ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్)  ఎలా ప్రారంభించారో వివరించారు. సుమారు 100 జిల్లాలను అభివృద్ధి సంబంధిత 40 ప్రమాణాలను ఆధారంగా తీసుకుని గుర్తించామని ప్రధాని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యూహంతో ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు. ఈ కార్యక్రమం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా ఆదర్శంగా మారిందని, సమర్థవంతమైన పాలనపై విలువైన సూచనలు అందిస్తున్నదని ఆయన అన్నారు.

 

ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడంలో టూరిజం ప్రాముఖ్యతను ప్రధానమంత్రి స్పష్టం చేశారు., గుజరాత్ లో వచ్చిన మార్పును ఉదాహరణగా పేర్కొన్నారు. ఒకప్పుడు ఎడారి భూభాగం కారణంగా విస్మరించిన కచ్ ఇప్పుడు పర్యాటక కేంద్రంగా ఎలా మారిందో వివరించారు. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఏర్పాటు వంటి భారీ స్థాయి కార్యక్రమాలు కొత్త అవగాహనలను పెంపొందించాయని, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలకు ఊతమిచ్చాయని ఆయన చెప్పారు. వడ్నగర్ వంటి ప్రాచీన ప్రాంతాలకు ఉన్న చారిత్రాత్మక ప్రాధాన్యతను కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్కడి మ్యూజియాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వారసత్వ కేంద్రంగా ఆయన పేర్కొన్నారు. భారత దేశ సముద్ర వారసత్వాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర చారిత్రక మ్యూజియాల్లో ఒకటైన లోథల్ గురించి ఆయన మాట్లాడారు. గిఫ్ట్ సిటీ ఆలోచనను మొదట ప్రతిపాదించినప్పుడు ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయని,  అయితే, అది ఇప్పుడు ఆర్థిక కేంద్రాలకు ఒక ప్రమాణంగా మారిందని ప్రధాని చెప్పారు. వినూత్న ఆలోచనలను ధైర్యంతో, విశ్వాసంతో అమలు చేసినప్పుడే అర్థవంతమైన ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు. సబర్మతి రివర్‌ఫ్రంట్, ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం నిర్మాణం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి అనేక విజయవంతమైన భారీ ప్రాజెక్టులను ప్రధాని ప్రస్తావించారు. మార్పు తీసుకురాగల ప్రాజెక్టులను అమలు చేయడంలో భారత్ సామర్థ్యాన్ని ఇవి చాటుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశ భవిష్యత్తుపై తన అపార నమ్మకాన్ని ఆయన మరోసారి వ్యక్తం చేస్తూ, దేశం గణనీయమైన అభివృద్ధిని సాధించగలదన్న విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు.

గతంలో జరిగిన కార్యక్రమాలను పునఃసమీక్షించుకునే అవకాశం కల్పించిన గుజరాత్ ప్రభుత్వానికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశ అభివృద్ధిలో గుజరాత్ కీలక పాత్రను ప్రముఖంగా తెలిపారు. దేశం కోసం ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడం కొనసాగించాలని ఆయన రాష్ట్రాన్ని కోరారు భారతదేశ ఉజ్వల భవిష్యత్తుపై తన నమ్మకాన్ని పునరుద్ఘాటించారు.

మే 6న ప్రారంభమైన ఆపరేషన్ సిందూర్ ప్రాముఖ్యతను వివరిస్తూ, ఇది మొదట ఊహించిన పరిధిని మించిపోతుందని, దేశ అభివృద్ధికి జీవితాంత సంకల్పాన్ని ప్రతిబింబించే కార్యక్రమంగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. 2047లో 100 సంవత్సరాల స్వాతంత్ర వేడుకల నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న దృఢ సంకల్పాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ప్రస్తుతం నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్న భారత్, మూడో స్థానానికి ఎదగాలన్న లక్ష్యాన్ని ప్రధానమంత్రి వెల్లడించారు. దీని కోసం విదేశీ ఉత్పత్తులపై ఆధారపడడాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రతి పౌరుడు తన దైనందిన వినియోగాన్ని పరిశీలించి, విదేశీ వస్తువులను గుర్తించి, వాటికి బదులు స్థానికంగా తయారైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని పిలుపునిచ్చారు. మతపరమైన పండుగల కోసం పూజలలో ఉపయోగించే విగ్రహాల వంటి సంప్రదాయ  వస్తువులను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు. దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. "ఆపరేషన్ సిందూర్  కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, ప్రతి భారతీయ పౌరుడు పంచుకునే బాధ్యతకూడా" అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు, ఆర్థిక స్వావలంబన ఆవశ్యకతను స్పష్టం చేస్తూ, స్థానిక తయారీకి ఊతమిచ్చేలా ప్రతి జిల్లాకు ప్రత్యేక ఉత్పత్తిని ప్రోత్సహించే ఒక జిల్లా – ఒక ఉత్పత్తి (వన్ డిస్ట్రిక్ట్- వన్ ప్రొడక్ట్) విధానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని వివరించారు. గతంలో విదేశీ వస్తువులపై ఆసక్తి ఎక్కువగా ఉండేదని ఆయన గుర్తు చేస్తూ, నేటి భారతదేశం ప్రపంచ స్థాయి ఉత్పత్తులను స్వదేశంలోనే తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. దేశీయ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు.
 

దేశ గౌరవాన్ని పెంపొందించే విధంగా, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల పట్ల గర్వించాలని, దేశం సాధించిన విజయాలను ఉత్సవంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి ప్రజలను కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి,  ప్రపంచ స్థాయిలో దాని గుర్తింపు కోసం ప్రతి భారతీయుడు తన వంతు పాత్ర పోషించాలని పునరుద్ఘాటించారు. పట్టణాభివృద్ధిలో గుజరాత్ ప్రభుత్వ నాయకత్వాన్ని. దేశ మౌలిక సదుపాయాల వృద్ధికి మార్గదర్శక శక్తిగా గుజరాత్ నిర్వహించిన పాత్రను ప్రధాని అభినందించారు

గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయి పటేల్, కేంద్ర మంత్రులు శ్రీ మనోహర్ లాల్,  శ్రీ సి.ఆర్. పాటిల్,  ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 

నేపథ్యం

గుజరాత్‌లో “పట్టణాభివృద్ధి సంవత్సరం- 2025 ” అనే ప్రధాన కార్యక్రమాన్ని శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా గుజరాత్‌లో పట్టణ మౌలిక వసతులు, మెరుగైన పాలన,  పట్టణ వాసుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా గుజరాత్ ముఖచిత్రాన్ని మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, ప్రధానమంత్రి గాంధీనగర్ లో “పట్టణాభివృద్ధి సంవత్సరం 2025” ను,  గుజరాత్‌ కొత్త పట్టణాభివృద్ధి ప్రణాళిక ను, రాష్ట్ర  క్లీన్ ఎయిర్  కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణ అభివృద్ధి, ఆరోగ్యం, ఆరోగ్య తాగునీటి సరఫరాకు సంబంధించిన అనేక ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. అంతేకాక, ప్రధాని అవాస్ యోజన (పిఎంఎవై) కింద నిర్మించిన 22,000కి పైగా గృహ యూనిట్లను అంకితం చేశారు. గుజరాత్‌లోని పట్టణ స్థానిక సంస్థలకు “స్వర్ణిమ జయంతి ముఖ్యమంత్రి శహేరి వికాస్ యోజన”  కింద రూ.3,300 కోట్ల నిధులను కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు.

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Labour reforms: Govt fully operationalises four new codes by publishing rules

Media Coverage

Labour reforms: Govt fully operationalises four new codes by publishing rules
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister meets Andhra Pradesh Chief Minister Shri N. Chandrababu Naidu and his family in Hyderabad
May 10, 2026

The Prime Minister, Shri Narendra Modi met the Chief Minister of Andhra Pradesh, Shri N. Chandrababu Naidu, and his family at his residence in Hyderabad today.

The Prime Minister said that it is always a delight to meet Shri Chandrababu Naidu and his family and exchange views on a wide range of subjects and diverse topics.

The Prime Minister wrote on X;

“In Hyderabad, went to Andhra Pradesh Chief Minister Shri Chandrababu Naidu Garu’s residence and met him along with his family. It’s always a delight to meet them and exchange views on so many diverse topics.

@ncbn”