ఉగ్రవాద కార్యకలాపాలు ఇక పరోక్ష యుద్ధం కాదు, అవి ప్రణాళికాబద్ధమైన వ్యూహాలు.. వాటికి అదే రీతిలో బదులిస్తాం
· ‘వసుధైవ కుటుంబం’ మన విశ్వాసం, ఎవ్వరితోనూ శతృత్వాన్ని కోరుకోం
· పురోగమిస్తాం.. ప్రపంచ శ్రేయస్సుకూ పాటుపడతాం
· 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్, ఇందులో రాజీ లేదు.. ప్రపంమంతా ‘వికసిత భారత్’ను ప్రశంసించేలా వందేళ్ల స్వాతంత్ర్య వేడుకలు
· పట్టణ ప్రాంతాలు మనకు వృద్ధి కేంద్రాలు
· దాదాపు రెండు లక్షల అంకుర సంస్థలు: వాటిలో చాలావరకు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే, అందునా ఎక్కువగా మహిళల నేతృత్వంలోనే...
· పెనుమార్పులను తేగల సమర్థత మనది.. ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు 140 కోట్ల ప్రజానీకం బాధ్యత

భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై!

ఈ త్రివర్ణ పతాకాలను ఎందుకు దించారు?

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

ఈ వేదికనలంకరించిన గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ మనోహర్ లాల్, శ్రీ సి.ఆర్.పాటిల్, రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రులు సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రం నలుమూలల నుంచి హాజరైన నా ప్రియ సోదరీసోదరులారా!

నేను రెండు రోజులుగా గుజరాత్‌లో ఉన్నాను... నిన్న వడోదర, దాహోద్, భుజ్, అహ్మదాబాద్‌ పర్యటించగా, ఈ తెల్లవారుజామున గాంధీనగర్‌కు వచ్చాను. నేనెక్కడికి వెళ్లినా దేశభక్తికి ప్రతీకగా గర్జిస్తున్న సిందూర సాగరం ఉవ్వెత్తున ఎగసినట్టు అనిపించింది. ఆ సాగర గర్జన, రెపరెపలాడే త్రివర్ణ పతాకం, జనం హృదయాల్లో మాతృభూమిపై పెల్లుబికిన ప్రేమ ఓ అద్భుత దృశ్యం ఇది కేవలం గుజరాత్‌కు పరిమితం కాదు... దేశంలోని నలుమూలలా, ప్రతి భారతీయుడి మనసులో ఉప్పొంగే ఉద్వేగమిది. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఓ ముల్లు గుచ్చుకుంటే శరీరమంతా ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి, ఆ ముల్లును పీకి పారేయాలని మనం సంకల్పించాం.

 

మిత్రులారా!

భరతమాతను 1947లో రెండు ముక్కలు చేసినపుడు, తెగవలసింది మన సంకెళ్లు... కానీ, మన చేతులనే తెగనరికినట్టు దేశం మూడు ముక్కలైంది. ఇక ఆ రాత్రి కశ్మీర్ గడ్డపై తొలి ఉగ్ర దాడి... ముజాహిదీన్ల పేరిట ఉగ్రవాదుల సాయంతో భరతమాత నేలను పాకిస్థాన్‌ కొంత మేర ఆక్రమించుకుంది. ఆనాడే ఈ ముజాహిదీన్లను అంతం చేసి ఉంటే... ఆక్రమిత కశ్మీర్‌ తిరిగి స్వాధీనమయ్యే దాకా సైన్యం ముందుకు వెళ్లాలన్న సర్దార్ పటేల్ నిర్ణయం అమలై ఉంటే ఎంత బాగుండేది!, కానీ, సర్దార్ సాహిబ్ మాటను ఆనాడు పట్టించుకోలేదు... పర్యవసానంగా రక్తం రుచి మరిగిన ఈ ముజాహిదీన్లు, ఆ ఉగ్రదాడుల చక్రం 75 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. దాని తాజా వికృత రూపమే పహల్గామ్‌లో అమాయక పర్యాటకుల మారణహోమం.  మనమంతా 75 ఏళ్లుగా బాధపడుతూనే ఉన్నాం... పాకిస్థాన్‌తో సంఘర్షణ తలెత్తినప్పుడల్లా  భారత సైనిక శక్తి దాన్ని చిత్తుచేసింది. దీంతో భారత్‌ను ఓడించడం కలలోనైనా సాధ్యం కాదని అర్థం చేసుకున్న పాక్‌ ప్రచ్ఛన్న యుద్ధానికి ఒడిగట్టింది. ఉగ్రమూకలకు సైనిక శిక్షణ ఇచ్చి, దశాబ్దాలుగా మనమీదకు ఉసిగొల్పుతూనే ఉంది. అమాయకులను, నిరాయుధులను నిర్దాక్ష్యిణ్యంగా బలిగొంటోంది. తీర్థయాత్రికులు... బస్సు ప్రయాణికులు... హోటళ్లలో కూర్చున్నవారు... పర్యటనకు వచ్చినవారు... ఇలా విచక్షణరహితంగా అవకాశం దొరికిన చోటల్లా, ముష్కరులు అమాయక జనం ప్రాణం తీస్తూనే ఉన్నారు. మరి.. మనమేం చేస్తూ వచ్చాం? ఈ ఊచకోతను... వికృత దాడులును సహిస్తూనే ఉన్నాం. ఇప్పుడు చెప్పండి... ఈ మానవ హననాన్ని మనమింకా సహించాలా... బుల్లెట్లకు బాంబులతో బదులివ్వాలా? రాళ్లు విసిరేవాడికి ఇటుకలతో జవాబు చెప్పాలా.. వద్దా? ఈ ముల్లును కూకటివేళ్లతో పెకలించాలా... వద్దా?

మిత్రులారా!

ఈ దేశం ‘వసుధైవ కుటుంబకం’ అనే గొప్ప సంస్కృతి, సంప్రదాయంతో ముందుకు సాగుతూ వస్తోంది. ఇవీ మన విలువలు... ఇదీ మన స్వభావం... శతాబ్దాలుగా ఇవి మన రక్తంలో జీర్ణించుకుపోయాయి. యావత్‌ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావిస్తాం కాబట్టే ఇరుగుపొరుగు కూడా ఆనందంగా జీవించాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలి... అందులో మనమూ ఉండాలన్నది వేల ఏళ్లుగా మన సంస్కృతి. కానీ, ఈ బలాన్ని మన బలహీనతగా భావించి పదేపదే సవాలు చేస్తే... ఈ దేశం కూడా పౌరుష, ప్ర్రతాపాలు పొంగిపొర్లే వీరుల పురిటిగడ్డ. ఇప్పటిదాకా ఈ సవాళ్లను మనం ప్రచ్ఛన్న యుద్ధంగా పరిగణిస్తూ వచ్చాం. కానీ, మే 6వ తేదీ తర్వాతి దృశ్యాల నేపథ్యంలో మనమిక ఆ తప్పు చేయలేం. అందుకే, 9 ఉగ్రవాద స్థావరాలను గుర్తించాక 22 నిమిషాల్లో వ్యవధిలో వాటిని ధ్వంసం చేశాం... మిత్రులారా! కేవలం 22 నిమిషాల్లోనే! అందునా ఇప్పుడు ప్రతిదీ కెమెరా కళ్లతో ప్రత్యక్షంగా చూసే దృశ్యం. మన దగ్గరున్న ఆధారాలేమిటని ప్రశ్నించే అవకాశం ఎవరికీ లేకుండా అన్ని ఏర్పాట్లూ చేశాం. కాబట్టి, ఇవాళ మనం ఎవరికీ రుజువులు చూపాల్సిన అవసరం లేదు. మరోవైపు మనం ఇకపై ప్రచ్ఛన్న యుద్ధం అనే పదం వాడలేమని గట్టిగా చెబుతున్నాను. ఎందుకంటే- మే 6వ తేదీ తర్వాత మనం మట్టుబెట్టిన ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ ప్రభుత్వ మర్యాదతో అంత్యక్రియలు చేశారు. ఆ దేశం జెండాలను శవపేటికలపై కప్పారు...వారి సైన్యం సెల్యూట్ చేసింది. ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఎంతమాత్రం ప్రచ్ఛన్న యుద్ధం కాదనడానికి ఇంతకన్నా రుజువేం కావాలి? ఇది శత్రువు లోతుగా ఆలోచించి పన్నిన యుద్ధ వ్యూహం. మరి మీరు యుద్ధానికి దిగితే యుద్ధమే సమాధానం అవుతుంది. మేమంతా మా కర్తవ్య నిర్వహణలో నిమగ్నమై ప్రగతి పథంలో పయనిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ శుభం కలగాలన్నది మా ఆకాంక్ష. కానీ, కష్ట సమయాల్లో మేం ఆపన్న హస్తం అందిస్తుంటే... ప్రతిగా రక్తపుటేరులు ప్రవహిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మన దేశం ఎలా నాశనమైందో నవ తరానికి చెప్పాలని నేను భావిస్తున్నాను. పాక్‌తో 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందం వివరాల్లోకి వెళ్లే మీరు దిగ్భ్రాంతికి గురవుతారు. విచిత్రం ఏమిటంటే- జమ్ముకశ్మీర్‌లో ఇతర నదులపై నిర్మించిన ఆనకట్టలను శుభ్రం చేయరాదని ఆ ఒప్పందం సందర్భంగా నిర్ణయించారు. అంటే, పూడిక తీయడం ఉండదు... అందుకోసం దిగువనగల గేట్లు తెరవడమంటూ ఉండదు. ఆ మేరకు 60 ఏళ్లుగా గేట్లు తెరచింది లేదు... దీంతో నీటి నిల్వ 100 శాతం నుంచి క్రమంగా 2-3 శాతానికి తగ్గిపోయింది. మన దేశస్థులకు మన నీటిపై హక్కు లేదా? వారికి న్యాయమైన నీటి వాటా దక్కాలా... వద్దా? అయితే, నేనింకా పూర్తిస్థాయి చర్యలకు సిద్ధం కాలేదు... ప్రస్తుతానికి ఆ ఒప్పందాన్ని స్తంభింజేశాం. దీంతో వారక్కడ భయాందోళనలకు గురయ్యారు. మనమిక్కడ ఆనకట్టను కొద్దిగా తెరచి శుభ్రం చేయడం ప్రారంభించాం. అక్కడి చెత్త, బురదను తొలగిస్తున్నాం. ఈ మాత్రానికే అక్కడ వరద ప్రవహిస్తోంది.

 

మిత్రులారా!

మనం ఎవరితోనూ శత్రుత్వం కోరుకోం... సంతోషంగా, ప్రశాంతంగా జీవించడమే మన అభిమతం. అలాగే ప్రపంచ సంక్షేమానికీ దోహదపడే రీతిలో పురోగమించాలని మనం భావిస్తాం. ఆ మేరకు కోట్లాది భారతీయుల సంక్షేమం దిశగా మేం ఏకాభిప్రాయంతో కృషి  చేస్తున్నాం. నిన్న మే 26... నాకు 2014లో ఇదే తేదీన తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లభించింది. ఆ నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది. ఇక మేం ప్రపంచ మహమ్మారి కరోనాతో పోరాడాం... ఇరుగుపొరుగు నుంచి సమస్యలెన్నో ఎదురవగా ప్రకృతి వైపరీత్యాలను కూడా ఎదుర్కొన్నాం. ఇన్ని అవరోధాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ అతి తక్కువ సమయంలో మన ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి నేడు 4వ స్థానికి దూసుకెళ్లింది. ఎందుకంటే- ఇదే మన లక్ష్యం.. మనకు కావాల్సింది అభివృద్ధి... అప్రతిహత పురోగమనం మాత్రమే!

అంతేకాదు మిత్రులారా!

గుజరాత్‌కు నేనెంతో రుణపడి ఉన్నాను... ఈ నేల నన్ను పెంచిపెద్దచేసింది. ఇక్కడ నేను సముపార్జించిన విజ్ఞానం, పొందిన దీక్ష, మీ అందరి నడుమ గడిపిన కాలంలో నాకు దక్కిన అపార అనుభవం అమూల్యం. మీతో అనుబంధం నేర్పిన జీవన మంత్రాలు, మీరు నాలో పెంచిన స్వప్నాలు- అన్నిటినీ దేశ ప్రజానీకానికి ప్రయోజనకరంగా మార్చడానికి నేనెంతో కృషి చేస్తున్నాను. ఈ నేపథ్యంలో పట్టణాభివృద్ధి సంవత్సరం-2025 పేరిట గుజరాత్ ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఈ కార్యక్రమానికి రెండు దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో ఇన్నేళ్లుగా సాగించిన పట్టణాభివృద్ధి పయనంపై ఉత్సవ నిర్వహణ అమితానందం ఇచ్చింది. గడచిన 20 ఏళ్ల గుజరాత్ ప్రభుత్వ అనుభవ సారం, సాధించిన ప్రగతి ఆధారంగా నవతరం పట్టణాభివృద్ధికి ఒక భవిష్యత్ ప్రణాళిక రూపొందింది. దాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజల ముందుంచడంపై గుజరాత్‌ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రితోపాటు ఆయన బృందాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

మిత్రులారా!

మన దేశం నేడు జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఈ వాస్తవం తెలిస్తే సంతోషించని వారంటూ ఉండరు. మనం 6 నుంచి 5వ స్థానానికి చేరినప్పుడు దేశంలో ఉత్సాహం మరో తీరుగా... ముఖ్యంగా యువతరంలో విభిన్న భావోద్వేగం కనిపించింది. మనను 250 ఏళ్లు పాలించిన బ్రిటన్‌ను అధిగమించడమే అందుకు ప్రధాన కారణం. అయితే, మనం ఎప్పుడెప్పుడు 3వ స్థానానికి చేరుతామా అన్న ఉత్కంఠతో ఉన్నందున ప్రస్తుతం 4వ స్థానానికి చేరామనే వాస్తవంపై ఆనందం అంతగా కనిపించడం లేదు. ఆ మేరకు ఇకపై ఎదురుచూడటానికి దేశం సిద్ధంగా లేదు... వేచి చూద్దామని ఎవరైనా అంటే-వెనుక నుంచి తక్షణం “మోదీ ఉండగా ఏదైనా సాధ్యమే”ననే నినాదం దూసుకొస్తుంది!

 

కాబట్టి... మిత్రులారా!

మన తక్షణ లక్ష్యం 2047నాటికి దేశం వికసిత భారత్‌గా రూపొందడమే... అందులో రాజీపడేది లేనేలేదు... స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలను మనం ఆషామాషీగా కాకుండా వికసిత భారత్‌ జెండా అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడుతుండగా ఆ ఉత్సవాలు చేసుకుంటాం. 1920, 1925, 1930, 1940, 1942 సంవత్సరాల్లో భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు, నేతాజీ సుభాష్ బాబు, వీర్ సావర్కర్, శ్యామ్‌జీ కృష్ణ వర్మ, మహాత్మా గాంధీ లేదా సర్దార్ పటేల్ సృష్టించిన భావోద్వేగాల స్ఫూర్తి లేనిదే, స్వాతంత్ర్య సిద్ధికోసం ప్రజల మనసులో రగిలే వాంఛ లేకపోతే, దేశ విముక్తి కోసమే జీవన్మరణాలనే నిబద్ధత లేనిదే, స్వాతంత్ర్యం కోసం సహనంతో కృషి చేసే సంకల్పం లేకపోతే.... బహుశా మనకు 1947లో స్వాతంత్ర్యం వచ్చేది కాదేమో! ఆ ఆనాడు 25-30 కోట్ల జనాభా అన్నిరకాల త్యాగాలకు సంసిద్ధులైన కారణంగానే ఈనాడు అనుభవిస్తున్న స్వేచ్ఛ మనకు లభించింది. బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొట్టాలన్న ఆ 25-30 కోట్ల మంది ప్రజలు సంకల్పబద్ధులై 20, 25 ఏళ్లలోగా దాన్ని సాధించారు. కాబట్టి, రాబోయే 25 ఏళ్లలో 140 కోట్ల మంది ప్రజానీకం దేశాన్ని వికసిత భారత్‌గా రూపుదిద్దడం అసాధ్యం కానేకాదు! మిత్రులారా... 2035లో గుజరాత్ 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో రాబోయే 10 ఏళ్లకుగాను మనం ఒక ప్రణాళికను రూపొందించుకోవాలని నా అభిప్రాయం. ఈ విధంగా గుజరాత్ 75 ఏళ్లు పూర్తి చేసుకునే నాటికి అన్ని రంగాల్లో అది సమున్నత స్థానంలో ఉంటుంది. అంటే- ఈ పురోగమనం పరిశ్రమలలో ఉంటుంది... వ్యవసాయ రంగంలో ఉంటుంది... విద్యలో ఉంటుంది.. క్రీడలలో ఉంటుంది. ఈ దిశగా ఇప్పుడే మనమొక సంకల్పం పూనాలి. ఇక గుజరాత్ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏడాదికల్లా ఒలింపిక్స్ వస్తాయి. ఆ విశ్వ క్రీడా మహోత్సవం భారత్‌లో జరగాలన్నది దేశం ఆకాంక్ష.

కాబట్టి... మిత్రులారా!

గుజరాత్ 75 ఏళ్లు పూర్తిచేసుకునే నాటికి మనకంటూ ఒక స్వప్నం ఉండాలి. ఈ రాష్ట్ర ఆవిర్భావం నాటి వార్తాపత్రికలను ఒకసారి బయటకు తీయండి... అప్పటి చర్చలను ఓసారి పరిశీలించండి. మహారాష్ట్ర నుంచి విడిపోయాక గుజరాత్ ఏం చేస్తుందనే అంశంపై ఎలాంటి చర్చలు సాగాయి? గుజరాత్‌లో ఏముంది... సముద్రం, ఉప్పు నేల, అంతా ఎడారి... మరోవైపు పాకిస్థాన్‌... ఇలాంటి భౌగోళిక పరిస్థితుల నడుమ ఏమి సాధిస్తుంది? గుజరాత్‌లో ఖనిజాల్లే... ఎలా అభివృద్ధి చెందుతుంది? అక్కడి వారంతా వ్యాపారులు... వారు మహారాష్ట్రలో వస్తువులు కొని, అక్కడ అమ్ముకుంటారు. మధ్యమధ్యలో మధ్యవర్తిత్వంతో జీవనోపాధి పొందుతారు. అంతకన్నా ఏం చేయగలరనే చర్చలు నడిచాయి. అయితే, ఒకనాడు ఉప్పుగల్లు తప్ప మరేమీ లేని ఇదే గుజరాత్‌... ఇప్పుడు వజ్రాలకు ప్రపంచ ప్రసిద్ధమైంది. ఉప్పు నుంచి వజ్రాలు! ఇదీ మన ప్రగతి ప్రయాణం... దీనివెనుక ఎంతో సాలోచనతో కూడిన కృషి ఉంది. ప్రణాళికబద్ధ చర్యలున్నాయి. మన దేశంలో సాధారణంగా ప్రభుత్వ నమూనా గురించి చర్చ వచ్చినపుడు అందులో ఒంటిస్తంభపు మేడల్లా మారిన వ్యవస్థలే అతిపెద్ద సమస్య అని చెబుతుంటారు. ఒక శాఖ మరొక శాఖతో సంప్రదించదు... ఒక టేబుల్ మీది వాళ్లు మరో టేబుల్ వద్దగల వాళ్లతో మాట్లాడరనే చర్చ సర్వసాధారణంగా వినిపించేది. కొన్ని అంశాలరీత్యా  ఇది నిజమే కావచ్చు.. కానీ, దీనికేదైనా పరిష్కారం ఉందా?

ఈ రోజు మీకు వెనుకటి ఉదంతం ఒకటి చెబుతాను. ఇప్పుడు నిర్వహిస్తున్న పట్టణాభివృద్ధి సంవత్సరం ఒక్కటే కాదు... ఆనాడు మేం ఏటా ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమానికి అంకితమయ్యే వాళ్లం. అప్పట్లో 2005ను పట్టణాభివృద్ధి సంవత్సరంగా ప్రకటించిన తరహాలో ఓ ఏడాదిని బాలికా విద్యకు, మరో ఏడాది మొత్తాన్నీ పర్యాటక రంగానికి అంకితం చేశాం. అంటే- ఇతరత్రా అభివృద్ధి పనులను ఆపివేశామని అర్థం కాదు... కానీ, ఆ సంవత్సరం ప్రభుత్వంలోని అన్ని విభాగాలనూ వాకబు చేశాం... పట్టణాభివృద్ధిలో అటవీశాఖ ఏం చేయగలదో, ఆరోగ్య శాఖ ఏ మేరకు దోహదం చేస్తుందో తెలుసుకున్నాం. అలాగే జల సంరక్షణ మంత్రిత్వ శాఖ సహకారం ఎలా ఉంటుందో అడిగాం... పర్యాటక శాఖ చేయూత ఎలా ఉంటుందో విచారించాం. దీన్నిబట్టి ఒక విధంగా పట్టణాభివృద్ధి సంవత్సరం ఒక ప్రభుత్వ విధానంలా ప్రతి శాఖలోనూ అమలైంది. ఈ నేపథ్యంలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి... మేం పర్యాటక సంవత్సరం ప్రకటించే నాటికి గుజరాత్‌లో పర్యాటకాభివృద్ధి ఏ ఒక్కరి ఊహల్లో కూడా లేదు. అయితే, ఆ దిశగా ప్రత్యేక కృషి, ప్రకటనల ద్వారా విస్తృత ప్రచారం సాగింది. ఇవాళ మీరు గుజరాత్‌లో కొన్ని రోజులు గడిపి చూడండి... ప్రతి ఒక్కటీ ఈ కృషి ఫలితమేనని గుర్తిస్తారు. రణ్ ఉత్సవం ఆ కృషి ఫలితమే... ఐక్యతా విగ్రహం కూడా ఆనాటి అవిరళ కృషికి ప్రతిరూపమేనని స్పష్టమవుతుంది.

 

నేడు సోమనాథ్ అబివృద్ధి చెందుతోంది. గిర్ అబివృద్ధి చెందుతోంది. అంబాజీ అభివృద్ధి చెందుతోంది. సాహస క్రీడలూ వస్తున్నాయి. అంటే, ఒకదాని తర్వాత ఒకటిగా అభివృద్ధి చెందుతున్నాయి. అదేవిధంగా, పట్టణాభివృద్ధి సంవత్సర వేడుకలను జరుపుకున్న సమయంలో.. ఇంకా నాకు గుర్తుంది. నేను అప్పటికి రాజకీయాలకు కొత్త. కొంతకాలం తర్వాత మేం మొదటిసారి అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను గెలుచుకున్నాం. అప్పటి వరకు మేం రాజ్‌కోట్ మునిసిపాలిటీలో మాత్రమే అధికారం కలిగి ఉన్నాం. కానీ అది అప్పట్లో కార్పొరేషన్ కాదు. అప్పటికే మన ప్రహ్లాద్‌భాయ్ పటేల్ పార్టీలో చాలా సీనియర్ నాయకులు. ఆయన చాలా వినూత్నంగా ఆలోచించేవారు. కొత్త విషయాల గురించి ఆలోచించడం ఆయన స్వభావం. నేను రాజకీయాల్లోకి అప్పుడే ప్రవేశించాను. ఆ సమయంలో ప్రహ్లాద్‌భాయ్ ఒక రోజు నన్ను కలవడానికి వచ్చారు. ఆ సమయంలో చిమన్‌భాయ్ పటేల్ ప్రభుత్వం ఉంది. “మనం చిమన్‌భాయ్‌ని కలిసి అహ్మదాబాద్‌లోని ఈ ఎర్ర బస్సును అహ్మదాబాద్ వెలుపలకు కూడా వెళ్ళడానికి అనుమతించాల్సిన అవసరాన్ని ఆయనకు అర్థమయ్యేలా చెబుదాం” అని ఆయన నాతో అన్నారు. దాంతో, ప్రహ్లాద్ భాయ్, నేను కలిసి చిమన్‌భాయ్‌ని కలవడానికి వెళ్ళాం. మేం చాలాసేపు చర్చించాం. ఎర్ర బస్సును అహ్మదాబాద్ దాటి గోరా, గుమ్మా, లాంబా, నరోరా వైపు, ఇంకా దహేగామ్ వైపు, ఇంకా కలోల్ వైపు నడిపేందుకు అనుమతిస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుందని మేం చెప్పాం. రవాణాను విస్తరించాలని మేం చెప్పాం. కానీ ప్రభుత్వ కార్యదర్శుల స్వభావం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. వారంతా ఇక్కడ కూడా ఉన్నారు.. అయితే ఆ కాలంలోని వారు పదవీ విరమణ చేశారు. ఒకసారి ఒక కాంగ్రెస్ నాయకుడిని దేశ సమస్యల పరిష్కారం గురించి రెండు వాక్యాల్లో చెప్పమని అడిగితే, ఒక కాంగ్రెస్ నాయకుడు ఇచ్చిన సమాధానం నాకు ఎంతో నచ్చింది. ఇది దాదాపు 40 ఏళ్ల క్రితం జరిగిన సంగతి. దీనికోసం దేశంలో రెండు విషయాలు జరగాలని ఆయన అన్నారు. “ఒకటి.. రాజకీయ నాయకులు నో చెప్పడం నేర్చుకోవాలి. మరొకటి అధికారులు అవును అని చెప్పడం నేర్చుకోవాలి! అప్పుడు అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి” అని ఆయన చెప్పిన మాట నాకు బాగా నచ్చింది. రాజకీయ నాయకులు ఎవరికీ నో చెప్పరు. అలాగే అధికారులు ఎవరికీ సరే అని చెప్పరు. మేం ఆ సమయంలో చిమన్‌భాయ్ వద్దకు వెళ్ళాం. ఆయన అందరినీ అడిగారు, మేం మళ్ళీ వెళ్ళాం, మూడోసారీ వెళ్ళాం, ప్రతిసారీ వారి సమాధానం ఒక్కటే.. లేదు-లేదు, ఎస్‌టీ నష్టపోతుంది. ఎస్‌టీ సంపాదన ఆగిపోతుంది, ఎస్‌టీ మూతపడుతుంది. ఎస్‌టీ నష్టాల్లో నడుస్తోంది. లాల్ బస్సును అక్కడికి పంపలేం అని వారు సమాధానం ఇచ్చారు. ఇది ఇలాగే చాలా కాలం పాటు కొనసాగింది. మేం మూడు-నాలుగు నెలలపాటు దీని గురించి ప్రయత్నించాం. ఏదేమైనా, మేం బాగా ఒత్తిడి చేశాం. ఫలితంగా ఎర్ర బస్సును లాంబా, గోరా, గుమ్మాకు విస్తరించారు. ఈ విస్తరణ ఫలితంగా సరన్, దహేగామ్, కాలోల్, మహ్మదాబాద్ వైపు అహ్మదాబాద్ నగరం బాగా వేగంగా విస్తరించింది. అహ్మదాబాద్ అభివృద్ధి, విస్తరణ మరింత వేగవంతమైంది. దీంతో మేం ఊపిరిపీల్చుకున్నాం. ఇది చాలా చిన్న విషయం. అప్పటికి నేను కూడా రాజకీయాలకు కొత్త. నాకు ఈ విషయాల గురించి అప్పుడు పెద్దగా తెలియదు. కానీ అప్పుడు మనం తక్షణ ప్రయోజనాలను అధిగమించి, ధైర్యంగా, దీర్ఘకాలిక ఆలోచనతో రాష్ట్రం, దాని ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తే అద్భుత ప్రయోజనాలు ఉంటాయని అర్థమైంది. పట్టణాభివృద్ధి సంవత్సర వేడుకలు జరుపుకొన్నప్పుడు, మొదటగా వచ్చిన పని ఆక్రమణలను తొలగించడం అని నాకు గుర్తుంది. ఇప్పుడు, ఆక్రమణలను తొలగించే విషయానికి వస్తే, మొదటి అడ్డంకిని ఒక రాజకీయ నాయకుడే సృష్టిస్తాడు. అతను ఏ పార్టీకి చెందినవాడైనా, ఈ సాకుతో మీరు నా ఓటర్లను విడదీయాలని చూస్తున్నారని వాదిస్తూ ఆయన అక్కడ అడ్డుగా నిలబడతాడు. అయితే అధికారులు కూడా చాలా తెలివైనవారు. ఇవన్నీ కూల్చివేయాలని చెప్పినప్పుడు, వారు మొదట వెళ్లి హనుమంతుడి ఆలయాన్ని కూల్చేస్తారు. దీంతో ఏ రాజకీయ నాయకుడైనా భయపడేంత పెద్ద రభస జరుగుతుంది. హనుమంతుడి ఆలయాన్నే కూల్చివేసినప్పుడు, అన్నీ కూల్చేయాల్సిందే అని వారు భావిస్తారు... అయితే ఆ సమయంలో మేం చాలా ధైర్యం ప్రదర్శించాం. ఆ సమయంలో.... (పేరు స్పష్టంగా వినబడలేదు) పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు ధైర్యంగా చేసిన పని ఫలితంగా నేడు అహ్మదాబాద్ రహదారులు విశాలంగా మారాయి.. 2 నుంచి 4 అడుగుల స్థలం కోల్పోయిన వారు బాధపడినా, మొత్తం నగరం సంతోషిస్తుంది. ఆ సమయంలో ఒక ఆసక్తికరమైన పరిస్థితి ఏర్పడింది. నేను 2005 సంవత్సరాన్ని పట్టణాభివృద్ధి సంవత్సరంగా ప్రకటించాను. దానికోసం దాదాపు 80-90 అంశాలను రూపొందించారు. అవి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ సమయంలో నేను పార్టీ నేతలతో సమావేశమై ఇలా పట్టణాభివృద్ధి సంవత్సరం జరుపుకొంటున్నాం కాబట్టి అందరూ శుభ్రత వంటి పనుల్లో పాల్గొనాలని వారితో చర్చించాను. కానీ ఎప్పుడైతే కూల్చివేతలు ప్రారంభమయ్యాయో, మా పార్టీ నేతలు నన్ను కలిసేందుకు వచ్చారు. నేను మీకు పెద్ద రహస్యం చెబుతున్నాను. వారు వచ్చి సార్, 2005లో పట్టణ సంస్థల ఎన్నికలు జరగనున్నాయి... ఇప్పుడు కూల్చివేతలు చేస్తే మా పరిస్థితి మరింత దిగజారిపోతుందని అన్నారు. ఈ కూల్చివేతలు అన్నిచోట్లా జరుగుతున్నాయని నేను చెప్పాను. నిజానికి ఎన్నికల గురించి అప్పటికి నేను ఆలోచించలేదని చెప్పాను. ఇప్పటికే నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం గుర్తు చేశాను. నాకూ ఒక స్వభావం ఉంది. ఒక అడుగు వేసిన తర్వాత వెనక్కి తగ్గకూడదని మనం చిన్నప్పటి నుంచీ నేర్చుకొంటున్నాం. కాబట్టి నేను చెప్పాను.. సోదరా మీ ఆందోళన సరైనదే. కానీ ఇప్పుడు మనం వెనక్కి తగ్గలేం. ఇప్పుడు పట్టణాభివృద్ధి సంవత్సర కార్యక్రమం జరుగుతుంది. మనం ఓడిపోతాం, ఎన్నికలు ఏమిటి?  ఏం జరిగినా, మనం ఎవరికీ హాని చేయకూడదనుకున్నాం. కానీ గుజరాత్‌లోని నగరాల రూపురేఖలను మార్చడం చాలా ముఖ్యమని చెప్పాను.

 

మిత్రులారా,

మేం మా పని కొనసాగించాం. చాలా నిరసనలు జరిగాయి. చాలా ఆందోళనలు జరిగాయి. అలాగే అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక్కడ కొందరు మీడియా వ్యక్తులు కూడా ఇప్పుడు మోదీ లక్ష్యంగా మారారని భావించి ఆనందించారు. కాబట్టి వారు కూడా పూర్తి శక్తితో వారి పని నిర్వర్తించారు. అయినా ఆ ఎన్నికల్లో ఏమి జరిగింది... చూడండి, నేను రాజకీయ నాయకులందరికీ ఒకటే చెబుతున్నాను, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు నా మాట వినండి. మీరు ప్రజల సంక్షేమం కోసం సత్యనిష్ఠతో, నిజాయితీగా నిర్ణయాలు తీసుకుంటే, ఆ సమయంలో అది చెడుగా అనిపించినా, ప్రజలు మీవెంట నిలబడతారు. దీనికి నిదర్శనం ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో, బీజేపీ ఏకంగా 90 శాతం విజయం సాధించింది. 90 శాతం స్థానాలు సాధించడం అంటే.. ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. ఒక విషయం గుర్తుంది.. సబర్మతి నది ఒడ్డున నిర్మించిన ఈ అటల్ వంతెన ప్రారంభోత్సవానికి నన్ను ఎందుకు పిలిచారో తెలియదు గానీ, చాలా కార్యక్రమాలు ఉన్నా, నేను కూడా వంతెనను చూద్దాం అని వెళ్లాను. నేను ఆ అటల్ వంతెనపై నడుస్తుంటే అప్పటికే వంతెనపై ఎక్కడ చూసినా పాన్ ఉమ్మిన గుర్తులే ఉన్నాయి. నిజానికి ప్రారంభోత్సవం అప్పుడు జరగాలి, కానీ పాన్ పిచికారీ కార్యక్రమం అప్పటికే మొదలైంది. దాంతో నా మనసులో, ఈ వంతెనపై ప్రవేశం కోసం టికెట్ పెట్టాలనే ఆలోచన వచ్చి అక్కడ నేతలతో చెప్పాను. వారన్నారు.. సార్ త్వరలోనే ఎన్నికలు ఉన్నాయి. టికెట్ పెడితే ఇబ్బంది అవుతుందన్నారు. నేను మాత్రం టికెట్ పెట్టాల్సిందేనని చెప్పాను. లేకపోతే ఈ అటల్ వంతెన పనికిరానిదిగా మారుతుందని చెప్పాను. ఆ తరువాత నేను ఢిల్లీకి వెళ్ళాను. మరుసటి రోజు ఫోన్ చేసి, టికెట్ విషయం అడిగాను. ఒక్క రోజు కూడా టికెట్ లేకుండా ఈ వంతెనపై ప్రయాణించకూడదని చెప్పాను.

మిత్రులారా,

ఏమైనా, ప్రతి ఒక్కరూ నేనంటే గౌరవాన్ని కనబరుస్తున్నారు. చివరకు మన వాళ్లు బ్రిడ్జికి టికెట్ పెట్టేశారు. ఈ రోజు, నేను టికెటును దక్కించుకున్నాను, ఎన్నికలోనూ గెలిచాను. మిత్రులారా, మరి అటల్ బ్రిడ్జి తన సేవలను ఆరంభించింది. నేను కాంకరియా పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాను. దానికి ఒక టికెటును పెట్టాను. కాంగ్రెస్ పెద్ద నిరసనపూర్వక ఆందోళనే చేసింది. వాళ్లు కోర్టుకు కూడా వెళ్లారు. అయితే ఆ చిన్న ప్రయత్నమే పూర్తి కాంకరియాను కాపాడింది. మరి ఇవాళ సమాజంలో ప్రతి వర్గమూ అక్కడకు ఎంతో హాయిగా వెళ్తోంది. కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులు చాలా చిన్న విషయాలకే భయపడిపోతారు. సమాజం సంఘవ్యతిరేకమేమీ కాదు. సమాజానికి అర్థం అయ్యేటట్టుగా చెప్పాల్సివుంటుంది. అది సహకరిస్తుంది. మరి మంచి ఫలితాలు కూడా వస్తాయి. చూడండి, పట్టణాభివృద్ధిలో ప్రతి ఒక్క విషయమూ ఇంత సూక్ష్మంగా రూపొందింది. మరి దీని పరిణామమే ఇది. మీకు నేను ఒక మాట చెబుతాను. నా మీద ఒత్తిడి పెరగనారంభించింది. ఈసరికే అది మొదలైపోయింది. అది ఏమిటంటే- మోదీ బాగున్నారు.. 4వ అంకెకైతే చేరుకున్నారు, మనం మూడో స్థానానికి ఎప్పటికి చేరుకుంటామో చెప్పండి ? అనేదే. దీనికి మీ దగ్గర ఓ మూలికా ఔషధం ఉంది. ప్రస్తుతం మనకు గ్రోత్ సెంటర్లు ఉన్నాయి అంటే అవి మన పట్టణ ప్రాంతాలేగా. పట్టణ సంస్థల్ని ఆర్థిక వృద్ధి కేంద్రాలుగా మలిచే ప్రణాళికను మనం సిద్ధం చేయాలి. జనాభా కారణంగా నగరాలు తమంతట తామయితే వృద్ధి చెందుతూ పోవనుకోండి.  అవి ఆర్థిక కార్యకలాపాలకు జోరునందించే కేంద్రాల్లా మారాలి. ఇక మనం రెండో అంచె, మూడో అంచె నగరాలపై శ్రద్ధ తీసుకోవాల్సిందే. అవి ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా రూపొందాల్సి ఉంది. నేనయితే పూర్తి దేశంలోని పురపాలక సంఘాలు, మహానగర పాలిక సంస్థల ప్రజలకు ఇదే చెప్పాలనుకుంటున్నాను. పట్టణ సంస్థతో జతపడ్డ వారందరినీ నేను అడగాలనుకుంటున్నా.. ఒక సంవత్సరం లోపల ఆ నగర ఆర్థిక వ్యవస్థను ఎక్కడికి చేర్చాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు? అక్కడి ఆర్థిక వ్యవస్థ స్థాయిని ఎలా పెంచుతారు? అక్కడ తయారవుతున్న వస్తువుల నాణ్యతను ఎలా మెరుగుపరుస్తారు?. అక్కడ ఎలాంటి కొత్త కొత్త ఆర్థిక కార్యకలాపాలకు దారులను తెరుస్తారు?.. అని. చాలావరకు నేను గమనించింది ఇదీ.. పురపాలక సంఘాలు కొత్తగా రూపొందుతూ ఉన్నప్పుడు, వారు ఏం చేస్తారంటే ఒక పెద్ద షాపింగ్ సెంటరును నిర్మిస్తారు. అది రాజకీయ నాయకులకు చాలా చక్కగా సరిపోతుంది.  వాళ్లు 30-40 షాపుల దాకా నిర్మిస్తారు. అయితే పది సంవత్సరాల వరకు వాటిని తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఇలా అయితే కుదరదు. అధ్యయనం చేసిన తరువాత, మరీముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో, నేనేం చెబుతానంటే- రెండో అంచె, మూడో అంచె నగరాలు రైతు పండించే వాటికి విలువను జోడించాలీ అని. ఇది నగరపాలికల్లో మొదలవ్వాలని కూడా చెబుతా. చుట్టుపక్కల పొలాల నుంచి వచ్చే వస్తువులకు కొంత విలువను జతపరచడమంటూ జరగాలి. దీనివల్ల గ్రామానికి మేలు జరుగుతుంది. పట్టణానికి కూడా మేలు కలుగుతుంది.
ఇదే మాదిరిగా, మీరు గమనించే ఉంటారు.. ఈ రోజుల్లో అంకుర సంస్థలను (స్టార్టప్స్). ఈ స్టార్టప్స్‌లోనూ మీ దృష్టికి వచ్చేవుంటుంది..తొలి నాళ్లలో అంకుర సంస్థలను పెద్ద నగరాల్లోని బడా పారిశ్రామిక సంస్థల (బిగ్ ఇండస్ట్రియల్ హౌసెస్) పరిసరాల్లోనే నిర్వహించే వారన్న సంగతి. ప్రస్తుతం దేశంలో సుమారు రెండు లక్షల స్టార్టప్స్ ఉన్నాయి. వాటిలో చాలా వరకు రెండో అంచె, మూడో అంచె నగరాల్లోనే ఉన్నాయి. మరో విషయం. ఈ అంకుర సంస్థల్లో అనేక సంస్థలకు నాయకత్వం వహిస్తోంది మన కుమార్తెలే. అంకుర సంస్థల పగ్గాలు మన పుత్రికల చేతుల్లో ఉన్నాయి. ఇది ఒక పెద్ద క్రాంతి చోటు చేసుకొనేందుకు అవకాశాలను అందిస్తుంది. ఈ కారణంగానే పట్టణ అభివృద్ధికి సంబంధించిన 20 సంవత్సరాల ఉత్సవాన్ని మనం జరుపుకొంటూ ఉన్న తరుణంలో, ఒక సఫల ప్రయోగాన్ని గుర్తుచేసుకొంటూ రాబోయే కాలంలో అనుసరించాల్సిన మార్గాన్ని నిర్ణయించుకొనే క్రమంలో, రెండో అంచె- మూడో అంచె నగరాలకు మనం ప్రాధాన్యాన్ని ఇవ్వాలని నేను చెప్పదలచుకున్నాను. రెండో అంచె, మూడో అంచె నగరాలు విద్యలో సైతం ఇప్పటికే ఎంతో ముందుకు సాగిపోయాయి. పదో తరగతి, పన్నెండో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడినప్పుడు, పేరున్న పాఠశాలలకు చెందిన విద్యార్థులే అగ్రగామి పది స్థానాల్లో నిలిచిన కాలమంటూ ఒకటి ఉండింది. ఈ రోజుల్లో, నగరాల్లో పెద్ద పాఠశాలల జాడే లేదు. రెండో అంచె, మూడో అంచె నగరాల్లోని బళ్లలో చదువుకున్న విద్యార్థులే మొదటి పది స్థానాల్నీ చేజిక్కించుకుంటున్నారు. గుజరాత్‌లో కూడా ఇదే జరుగుతూ ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. మన చిన్న నగరాల సత్తా, శక్తీ పెరుగుతూ ఉన్నాయని దీనికి అర్థం. క్రీడల్లో చూడండి, మొదట క్రికెట్‌ను చూస్తే.. ఈ ఆటను భారత్‌లో సందుల్లోనూ, వీధుల్లోనూ ఆడుతూ ఉంటారు. అయితే క్రికెట్‌ను మునుపు పెద్ద నగరాల్లో, అదీ సంపన్న కుటుంబాలకు పరిమితం చేశారు. మరి ఇవాళో, ఆటగాళ్లలో సగానికి పైగా బాలలు రెండో అంచె నగరాలు, మూడో అంచె నగరాల నుంచి వచ్చిన వారే. అంతర్జాతీయ క్రీడల్లో సైతం వాళ్లు రాణిస్తున్నారు. అంటే మన నగరాల్లో చాలా సత్తా ఉందన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. మరి మనోహర్ జీ కూడా చెప్పినట్లు.. ఇక్కడ వీడియోలోనూ ప్రదర్శించారు కదా.. ఇది మనకు ఒక చాలా పెద్దదైన అవకాశం. భారతదేశంలో మనం నగరాల ఆర్థిక వ్యవస్థపై దృష్టిని కేంద్రీకరించామా అంటే అప్పుడు నాలుగో స్థానంలో నుంచి ఇక మూడో స్థానంలోని ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోగలుగుతాం.

 

మిత్రులారా,

ఇదొక పరిపాలన విధానం- దురదృష్టవశాత్తూ భారత్‌లో.. దేశ సామర్థ్యాన్ని బలహీనపరిచే వ్యవస్థ క్షేత్రస్థాయిలో బలంగా వేళ్లూనుకుని పోయింది. సైద్ధాంతిక వ్యతిరేకత కారణంగా వ్యవస్థల అభివృద్ధిని తిరస్కరించడం వారి నైజంగా మారింది. ఓ వ్యక్తి పట్ల అయిష్టం కారణంగా అతడు చేసే ప్రతి పనీ చెడ్డదే అనడం పరిపాటయ్యింది. దాంతో దేశం మంచి అవకాశాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు మరో పాలన నమూనాను పరిశీలిద్దాం- ఇప్పుడు మేం పట్టణాభివృద్ధికి పెద్ద పీట వేశాం. అదే విధంగా మమ్మల్ని ఢిల్లీకి పంపినప్పుడు.. మొత్తం రాష్ట్ర సగటు తగ్గడానికి కారణమవుతున్న అత్యంత వెనుకబడి ఉన్న ఒకటి రెండు జిల్లాలు, ఒకటి రెండు తాలూకాలను ప్రతి రాష్ట్రంలో మేం ఆకాంక్షాత్మక జిల్లా, ఆకాంక్షాత్మక బ్లాకుగా పరిగణించాం. వీటన్నింటినీ వదిలి ముందుకు దూసుకుపోలేం. ఇవి సంకెళ్ల వంటివి. ముందు మనమీ సంకెళ్లను విచ్ఛిన్నం చేయాలని నేను చెప్పాను. దేశంలో దాదాపు 100 ఆకాంక్షాత్మక జిల్లాలను గుర్తించాం. ఇక్కడ ఏం అవసరమో చూడడం కోసం 40 ప్రమాణాలను ఉపయోగించాం. 500 బ్లాకులను గుర్తించి అన్ని మంత్రిత్వ శాఖలతోపాటు ప్రభుత్వ విభాగాలన్నీ సమష్టిగా కృషిచేస్తూ ఆ ప్రాంతాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించాయి. పూర్తి పదవీకాలం పనిచేసేలా యువ అధికారులను అక్కడ నియమించాం. నేడు ప్రపంచానికి అదొక నమూనాగా మారింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఈ అభివృద్ధి నమూనా దిశగా పయనించాలని భావిస్తున్నాయి. ఈ చర్యల గురించి, భారత విజయవంతమైన కృషినీ మన విద్యాసంస్థలు అధ్యయనం చేయాలి. ఇది ప్రపంచానికి ఓ ఆదర్శప్రాయమైన ఉదాహరణగానూ నిలుస్తుంది. రాబోయే రోజుల్లో మనం పర్యాటకంపై ప్రధానంగా దృష్టి సారించాలి. గుజరాత్ అద్భుతాలు చేసింది. ఒకప్పుడు ఎవరూ వెళ్లని కచ్ ఎడారికి వెళ్లడానికి నేడు బుకింగులు దొరకడం లేదు. పరిస్థితులు మారొచ్చు. ప్రపంచంలో ఎత్తైన అద్భుతమైన విగ్రహమది. వాద్‌నగర్‌లో నిర్మించిన మ్యూజియం గురించి నాకు చెప్పారు. బ్రిటన్ నుంచి వచ్చిన ఓ పెద్ద మనిషిని నిన్న నేను కలిశాను. ఆయన వాద్‌నగర్ మ్యూజియాన్ని చూడబోతున్నారట. అలాంటి ప్రపంచస్థాయి ప్రమాణాలతో, అంతర్జాతీయయ స్థాయిలో నిర్మించిన తొలి మ్యూజియం ఇది. భారత్‌లో కాశీ వంటి అజరామరమైన ప్రాంతాలు చాలా కొన్నే ఉన్నాయి. అక్కడ ప్రతీ క్షణం జీవముంటుంది. వాటిలో వాద్‌నగర్ ఒకటి. 2800 సంవత్సరాల నాటి ఆధారాలు ఇక్కడ దొరికాయి. అంతర్జాతీయ పర్యాటక పటంలో దీన్ని నిలపడం ప్రస్తుతం మన లక్ష్యం. లోథాల్‌లో మేం మ్యూజియం నిర్మిస్తున్నాం. 5 వేల ఏళ్ల కిందటే సముద్రయానంలో మనం ప్రపంచ ప్రసిద్ధిని సాధించాం. క్రమంగా మనం దాన్ని విస్మరించాం. ఇందుకు లోథాల్ ఓ సజీవ ఉదాహరణ. ప్రపంచంలో అతిపెద్ద సముద్ర మ్యూజియాన్ని లోథాల్‌లో నిర్మిస్తున్నాం. ఈ విషయాలు ఎంత ప్రయోజనం చేకూరుస్తాయో మీరు ఊహించుకోవచ్చు. అందుకే నేను చెప్తాను... మిత్రులారా.. 2005లో మొదటిసారి గిఫ్ట్ సిటీ ఆలోచన వచ్చింది. ఠాగూర్ హాల్‌లో దాన్ని ప్రారంభించినట్టు నాకు గుర్తు. గొప్ప డిజైన్లను, నగర నమూనాలను మనం రూపొందించాల్సి వచ్చింది. ఇది సాధ్యమవుతుందా, అంత పెద్ద భవనాలు నిర్మించగలరా అంటూ ఇక్కడి ప్రజలే ప్రశ్నించేవారు. దాని పటాన్ని, చిత్రాలను కేంద్రంలోని కొందరు నాయకులకు చూపెట్టినప్పుడు వారు కూడా నన్నడిగారు- భారత్ లాంటి దేశంలో మీరేం చేస్తున్నారూ అని వాళ్లు అడగడం నాకింకా స్పష్టంగా గుర్తుంది. తమ దగ్గరా ఓ గిఫ్ట్ సిటీ ఉండాలని దేశంలోని ప్రతి రాష్ట్రమూ ఇప్పుడు భావిస్తోందని నేను విన్నాను.

మిత్రులారా,

మనం స్వప్నించి, దాన్ని సాకారం చేసుకోబూనితే ఎంత గొప్ప సత్ఫలితాలొస్తాయో మనం స్పష్టంగా చూస్తున్నాం. అదే సమయంలో నదీ తీరం గురించీ ఆలోచించాం. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం నిర్మించాలనుకుని, ఆ కలను నెరవేర్చుకున్న సమయమూ అదే. ఆ సమయంలోనే ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహాన్ని నెలకొల్పాలని భావించి, దానిని సాకారం చేసుకున్నాం.

సోదర సోదరీమణులారా,

అపారమైన శక్తిసామర్థ్యాలు భారత్ సొంతమని మనం విశ్వసించాలి.  

 

స్నేహితులారా, 

ఎందుకు- అంటే నేను చెప్పలేను. కానీ నిరాశ అనే భావన ఎప్పుడూ నా మనసులోకి రాదు. నేను ఒక అత్యంత ఆశావాదిని.  నేను ఆ సామర్ధ్యాన్ని చూడగలను. నేను గోడల ఎత్తును దాటి చూడగలగను. నాకు నా దేశం శక్తి కనిపిస్తుంది. నాకు నా దేశప్రజల శక్తి కనిపిస్తుంది. ఈ శక్తితో మనం గొప్ప మార్పును తీసుకురాగలమని నమ్మకం ఉంది. అందుకే ఈ రోజు నేను గుజరాత్ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు నాకు ఇక్కడికి రావడానికి  ఈ అవకాశాన్ని ఇచ్చారు. కొన్ని పాత విషయాలను మళ్లీ గుర్తు చేసుకునే అవకాశాన్ని నేను పొందాను. నమ్మండి మిత్రులారా -  గుజరాత్‌పై ఒక గొప్ప బాధ్యత ఉంది. మనం ఇచ్చే మనుషులం, దేశానికి ఎప్పుడూ ఇవ్వాలి. మనం గుజరాత్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలి, అంతటి ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్లాలి. దేశ ప్రజలకు గుజరాత్ ఉపయోగపడాలి.

మిత్రులారా, మనం ఈ గొప్ప సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలి. గుజరాత్ కొత్త శక్తితో, ఎన్నో కొత్త ఆలోచనలతో, ఎన్నో కొత్త చొరవలతో ముందుకు సాగుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు తెలుసు నా ప్రసంగం సుదీర్ఘంగా ఉందని అనిపించవచ్చు. ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. కానీ రేపు రెండు-మూడు విషయాలు మీడియాలో వస్తాయనిపిస్తుంది. నేను మీకు దాని గురించి కూడా చెబుతాను. మోదీ అధికారులను దూషించారు, మోదీ అధికారులపై కోపంగా మాట్లాడారు. ఇలా ఇలా రేపు వార్తల్లో వస్తుంది. అది సరే, అలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి, అంత మాత్రమే అర్థం చేసుకోవాలి. కానీ నేను చెప్పిన మిగతా విషయాలు మాత్రం గుర్తుంచుకోండి. ఈ సిందూరియా మూడ్‌ను కూడా! ఈ సిందూరియా స్పూర్తి, మిత్రులారా, మే 6 న - మే ఆరో తేదీ రాత్రి ప్రారంభమయింది. ఆ రాత్రి “ఆపరేషన్ సిందూర్”ను సైనిక దళం ప్రారంభించింది. కానీ ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ మనుషుల శక్తితో ముందుకు సాగాలి. నేను సైనిక శక్తి గురించి, మానవ శక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు నా ఉద్దేశం ఆపరేషన్ సిందూర్‌లో మానవ శక్తి అంటే ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి. బాధ్యతలు చేపట్టాలని అర్థం.

2047లో, భారత్ స్వాతంత్ర్యం పొందిన 100 ఏళ్లు పూర్తి అయ్యే సందర్భంగా, దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు, ఆర్థిక వ్యవస్థను నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి తీసుకెళ్లేందుకు, మనం ఎలాంటి విదేశీ ఉత్పత్తులను ఉపయోగించకూడదని మనం నిర్ణయం తీసుకుందాం. ఎంత లాభం వచ్చినా సరే, విదేశీ ఉత్పత్తులను వారు అమ్మకూడదని ప్రతి గ్రామంలో వ్యాపారుల చేత ప్రతిజ్ఞ చేయించాలి. కానీ దురదృష్టమేమంటే - మన గణేశ్ జీ కూడా విదేశీ రూపంలో వస్తున్నారు. చిన్న చిన్న కన్నులతో గణేశ్ జీ వస్తున్నారు. గణేశ్ జీ కళ్ళు కూడా పూర్తిగా తెరుచుకుని ఉండడం లేదు. హోళీ, హోళీ రంగులూ విదేశీవే. నిజానికి, ఒక పౌరుడిగా ఆపరేషన్ సిందూర్ కోసం ఒక పని చేయాలి. మీ ఇళ్లకు వెళ్లి, ఉదయం నుంచి మరుసటి ఉదయం వరకు 24 గంటల సమయంలో మీ ఇళ్లలో ఎంతమంది విదేశీ ఉత్పత్తులు వాడుతున్నారో ఒక జాబితా తయారు చేయండి. మీకే తెలియదు, మీరు విదేశీ హెయిర్‌పిన్లు వాడుతున్నారు, దువ్వెనలు కూడా కూడా విదేశీవే.. పళ్లు శుభ్రం చేసేందుకు వాడే పిన్లు కూడా విదేశీవే. మనకు అసలే తెలియదు మిత్రులారా! మనం దేశాన్ని కాపాడాలంటే, దేశాన్ని నిర్మించాలంటే, దేశాన్ని అభివృద్ధి చేయాలంటే, ఆపరేషన్ సిందూర్ అన్నది కేవలం సైనికుల బాధ్యత మాత్రమే కాదు. ఆపరేషన్ సిందూర్ అనేది 140 కోట్ల ప్రజల బాధ్యత. దేశం బలంగా ఉండాలి, దేశం సమర్థవంతంగా ఉండాలి, దేశ ప్రజలు కూడా సమర్ధులుగా ఉండాలి. దీనికోసం మనం వోకల్ ఫర్ లోకల్, ఒక జిల్లా - ఒక ఉత్పత్తి వంటి కార్యక్రమాలను ప్రారంభించాం. ఇక్కడ ఉన్నదాన్ని పారేయమని నేను అడగడం లేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఏమీ కొనకూడదు. మీరు బయటి నుంచి కొనుగోలు చేయాల్సిన 1-2% వస్తువులు ఉండవచ్చు. అవి ఇక్కడ అందుబాటులో ఉండకపోవచ్చు. అయినా ఈ రోజు భారతదేశంలో లేనివంటూ ఏమీ లేవు. మీరు చూసే ఉంటారు... 25 - 30 ఏళ్లకు ముందు ఎవరైనా విదేశాల నుంచి వస్తుంటే వాళ్లకి జాబితా పంపించేవాళ్లు... ఇది తీసుకురా, అది తీసుకురా అని. కానీ ఈరోజు ఎవరైనా విదేశాల నుంచి వస్తూ - ఏమైనా తీసుకురావాలా’ అని అడిగితే, మనవాళ్లు అంటున్నారు - వద్దు, వద్దు అన్నీ ఇక్కడే ఉన్నాయి... ఏమీ తీసుకురావద్దు అని. అన్నీ మన దగ్గరే ఉన్నాయి. మన బ్రాండ్‌పై మనకు గర్వం ఉండాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’పై మనకు గర్వం ఉండాలి. ఆపరేషన్ సిందూర్‌ను మనం సైనిక శక్తితో కాదు, ప్రజల శక్తితో గెలవాలి. మిత్రులారా ప్రజల శక్తి అనేది మన మాతృదేశం నేలపై పండే ప్రతి పంట నుంచి వస్తుంది. ఈ మట్టి సువాసన ఉన్న వస్తువులను, ఈ దేశ పౌరుల చెమట సువాసన ఉన్న వస్తువులను నేనూ వాడతాను. ఆపరేషన్ సిందూర్‌ను ప్రతి ఒక్కరి వరకు, ప్రతి ఇంటివరకు తీసుకెళ్లగలిగితేనే ఇది సాధ్యం అవుతుంది. చూడండి మిత్రులారా... మనం 2047కి ముందే భారత్‌ను ఒక అభివృద్ధి దేశంగా మారుద్దాం. అది మీ కళ్ళతో మీరు స్వయంగా చూస్తారు. ఆ నమ్మకంతో మీరు నాతో పాటు పూర్తి శక్తితో చెప్పండి.

భారత్ మాతా కి జై! భారత్ మాతా కి జై!

భారత్ మాతా కి జై! త్రివర్ణ పతాకం ఎగురుతూ ఉండాలి!

భారత్ మాతా కి జై! భారత్ మాతా కి జై! భారత్ మాతా కి జై!

వందే మాతరం! వందే మాతరం! వందే మాతరం!

వందే మాతరం! వందే మాతరం! వందే మాతరం!

వందే మాతరం! వందే మాతరం! వందే మాతరం!

ధన్యవాదాలు! 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
The Nari Shakti Decade: How 12 years of policy reforms under Modi govt transformed lives of women in Bharat

Media Coverage

The Nari Shakti Decade: How 12 years of policy reforms under Modi govt transformed lives of women in Bharat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Major Abhilasha Barak on being conferred the UN Military Gender Advocate of the Year Award
June 07, 2026

Prime Minister Shri Narendra Modi today congratulated Major Abhilasha Barak on being conferred the UN Military Gender Advocate of the Year Award. The Prime Minister noted that Major Barak is serving as an Engagement Team Commander and Gender Focal Point within the United Nations Interim Force in Lebanon (UNIFIL).

Shri Modi observed that this honour is a recognition of her exemplary service and also of India’s longstanding contribution to United Nations peacekeeping efforts.

The Prime Minister stated that her achievement is also an inspiration to countless young Indians, especially the daughters of the nation, who aspire to serve the country and humanity.

The Prime Minister posted on X:

"Congratulations to Major Abhilasha Barak on being conferred the UN Military Gender Advocate of the Year Award. Major Barak is serving as an Engagement Team Commander and Gender Focal Point within the United Nations Interim Force in Lebanon (UNIFIL). This honour is a recognition of her exemplary service and also of India’s longstanding contribution to United Nations peacekeeping efforts. Her achievement is also an inspiration to countless young Indians, especially our daughters, who aspire to serve the nation and humanity."